[box type=’note’ fontsize=’16’] బంధువుల ఇళ్ళలో డబ్బు దొంగిలిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని తెలివిగా పట్టుకుని, ఆమెని మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తి కథ “నేను మా ఆవిడ ఓ అమ్మాయి“. రచయిత్రి వావిలికొలను రాజ్యలక్ష్మి. [/box]
[dropcap]“ఏ[/dropcap]మండోయ్…!”
గదిలోవున్న భార్య నుంచి అరుపులాంటి కేక వినబడేసరికి ఉలిక్కిపడ్డాను.
“మన కొంప మునిగిందండోయ్…!” మరోసారి అరచినట్లుగా అంటూ, గొల్లుమని ఏడుస్తున్న మా ఆవిడకు ఏమైందోనని అయోమయ చూపులతో వడివడిగా గదిలో కెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను.
నైరుతి మూలలో వున్న బీరువాలో నుంచి సామాన్లు, బట్టలు, చీరలు అన్నీ గుట్టలు గుట్టలుగా కిందికి లాగేసుకొని వాటిలో ఏదో పిచ్చిదానిలా వెతుకుతూంది అమృత.
“ఏమైందే అమ్మూ? ఈ గజిబిజి గందరగోళపు సీనేమిటి?”
“మొన్నీమధ్య చేయించుకున్న ఐదు తులాల నా బంగారు చంద్రహారం కన్పించడం లేదండీ?” ఏడుస్తూనే చెప్పింది.
“హేమిటీ?! కనబడ్డం లేదా? ఎక్కడ పెట్టావ్?”
“ఇదే బీరువాలో పెట్టాను వారం రోజుల క్రితం. ఈ రోజు పేరంటానికెళ్ళాలని వేసుకుందామని చూస్తే బాక్స్‌లో లేదండీ…” మరోమారు గొల్లుమంది అమృత.
“అవునా…. ముందు నీవీ బట్టల గుట్టల్లో నుంచి లేచి ఇలా రా…..” అంటూ ఏడుస్తున్న అమృతకు చేయి అందించి లేపి నెమ్మదిగా హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాను. ఓ గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి నేనూ అమె పక్కనే కూర్చున్నాను.
“ఇక ఇప్పుడు చెప్పు? వారం రోజుల క్రితం ఆ చంద్రహారాన్ని బాక్స్‌లో పెట్టి బీరువాలో దాచితే… అది కనిపించకుండా పోవడాన్కి దానికేం రెక్కలొచ్చాయా? బీరువాకి లాక్ వేశావా లేదా?”
“వేశానండీ. ఆ కీస్ ఎప్పుడూ నా హ్యండ్ బాగ్‌లోనే వుంటాయి” అంటూ కళ్ళు ముక్కు ఓ మారు పైట చెంగుతో గట్టిగా తుడుచుకుంది అమృత.
“మరింకెవ్వరికీ బీరువా తెరిచే అవకాశమే లేదు కదా! ఇంట్లో వుండేది నీవు నేనే! అందులో నుంచి ఎట్లా మాయమయిందంటావ్? కనీసం పోలీస్ రిపోర్ట్ ఇద్దామన్నా దొంగలైతే పడలేదు. ఈ వారం రోజుల్లో మనింటికి వచ్చిన వారే… ఎవరో ఒకరు ఖచ్చింతగా ఈ పని చేసి వుంటారు అమ్మూ!” సాలోచనగా చూపుడు వేలుతో పెదాలపై కొట్టుకుంటున్న నేను లేచి ఓ కాగితం పెన్ను తెచ్చి అమృతకిస్తూ “ఇంద…. ఇది తీసుకో. నీవు గొలుసు బీరువాలో పెట్టిన నాటి నుంచి నిన్నటి వరకూ మనింటికి ఎవరెవరు వచ్చారో వరుసగా రాసుకుంటూ రావోయ్!” అన్నాను.
“ఎందుకండీ, ఇప్పుడీ రాతకోతలు?”
“నేను చెప్తాగా… నీవు ముందు రాయవోయ్!”
“పోయిన శుక్రవారం పేరంటం నుంచి వచ్చాక గొలుసు తీసి బాక్స్‌లో పెట్టి బీరువా లాక్ చేసి కీస్ మామూలుగానే నా హేండ్ బాగ్‌లో వేసుకున్నాను.”
“ఇక శనివారం మనింటికి ఎవరొచ్చారో చెప్పు?”
“నాతో పాటు పని చేసే మా స్కూల్ టీచర్స్ నందిని, హరిప్రియ వచ్చారు. అరగంట పాటు కబుర్లు చెప్పుకుంటూ హాల్లోనే కూర్చున్నాం. టీ తాగి వెళ్ళిపోయారు వాళ్ళు.”
“ఓకె.. ఇది వాళ్ళ పని కాదు. శనివారం కూడా టిక్ పెట్టు. ఇక ఆదివారం ఎవరొచ్చారు మనింటికి?” డిటెక్ట్‌వ్ లాగా ఆరా తీయసాగాను.
“సన్‌డే మా చిన్న మేనత్త కూతురు జానకి, వాళ్ళ అమ్మాయ్ రమణి వచ్చారండీ!”
“మరిక సోమవారం?”
“ఎవరూ రాలేదండీ..”
“మరి మంగళవారమో?” అమృత వైపు ఓరగా చూశాను.
“అయ్యో, మీకామాత్రం గుర్తు లేదా? మీ బాల్య మిత్రుడు గోపాలం వచ్చాడు.”
“అవునవును, వాడు నేను చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ హాల్లోనే చాలాసేపున్నాం.”
“ఇక పోతే బుధవారం మనమింట్లోనే లేము కదండీ. సినిమా కెళ్ళి వస్తూ దారిలో హోటల్లో భోజనం చేసి తిన్నగా ఇంటికి ఏ పదకొండుకో వచ్చాం రాత్రి.”
“అవునవును నిజమే. ఇక గురువారం. నిన్నటి సంగతి చెప్పు? ఎవరొచ్చారింటికి?”
నా ప్రశ్నకు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టిన అమృత “ఆ గుర్తొచ్చింది. మన పక్క వీధిలో వుండే పద్మిని వాళ్ళ బాబు తొలి పుట్టిన రోజుకి పిలవడానికి వచ్చి నాకు బొట్టు పెట్టి ఈ రోజు సాయంత్రం ఆరింటికి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళింది. మనింట్లో ఓ ఐదు నిమిషాలు కూడా వుండలేదామే…” అంటూ చెప్పు కొచ్చింది.
“నీవిప్పుడు వాళ్ళింటికి వెళ్ళడానికే తయారవుతూ గొలుసు వేసుకోవడానికి బీరువా తెరిచి వెతుకుతున్నావ్. యామ్ ఐ కరెక్ట్?”
నీళ్ళు నిండిన కళ్ళతో భర్త వంక విచారంగా చూస్తూ అందామె “అవునండీ. మీతో పోట్లాడి డబ్బులు సమకూర్చుకొని… ఎంతో పోదుపు చేసి చేయించుకున్న చంద్రహారమండీ. అది మన ఇద్దరి కష్టార్జితం.”
“నీ బంగారు చంద్రహారం ఎక్కడికీ పోదు. దొరుకుతుంది. కాస్తా నేను చెప్పినట్లు చేయి.”
“దొరుకుతుందా? ఎలాండీ…” ఆశగా అడిగింది అమృత.
“నేను చెప్తాగా. ఇక పోతే మన పని మనిషి రంగిని అనుమానించాల్సిన అవసరం లేదు కదా అమ్మూ?”
“అయ్యో, దాన్ని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్లే. ఎందుకంటే రంగి పూచిక పుల్ల కూడా అడగందే పట్టుకెళ్ళదు. ఇరవై ఏళ్ళ నుంచి మనింట్లో నమ్మకంగా పని చేస్తుంది.”
“సరే పని మనిషి సంగతి వదిలేద్దాం. సన్‌డే రోజు మనింటికి వచ్చిన మీ చుట్టాల్ని తప్పించి… మరింకెవ్వర్నీ అనుమానించడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా మన కళ్ళ ముందే… అదీ హాల్లోనే వుండి వెళ్ళిపోయారు.”
“ఏమిటీ? మీ అనుమానమంతా మా బంధువుల మీదనా? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా?” దూకుడుగా అంటూ కోపావేశాలతో గుడ్లురిమి చూడసాగింది నా వైపు.
“అయ్యో! నీవిలా నన్ను కోప్పడుకు అమ్మూ! కొంచెం శాంతించు… నీ చుట్టాలు, నా చుట్టాలు అని కాదిక్కడ సమస్య. మన గొలుసు ఎవరు తీశారని అతి తెలివి ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. నీవు ముందు కోపం తగ్గించుకో. నేనిప్పుడు నిన్ను అడిగే ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులు చెప్పు, చాలంతే. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చిన ఆ రోజు నేనింట్లో లేను కదా! అందుకని నాకు కొన్ని వివరాలు చెప్పు. మీ చిన్న మేనత్త కూతురు జానకి… ఆమె బిడ్డ రమణి మనింటికి ఎన్నింటికి వచ్చారు? మళ్ళీ ఎన్నింటికి వెళ్ళిపోయారు? మన బెడ్ రూమ్‌లోకెళ్ళారా? మనింట్లో వాళ్ళు ఎన్ని గంటలున్నారు? మన గదిలోకెళ్ళింది రమణి ఒక్కతేనా? లేక తల్లీ బిడ్డలిద్దరూ వెళ్ళారా?” నేను వేసే యక్షప్రశ్నలకు అమృత వెంటనే సమాధానం చెప్పడానికి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించసాగింది.
“తల్లీ బిడ్డలిద్దరూ కల్సి ఏదో షాపింగ్ మాల్‌కి వెళ్ళి వస్తూ… అనుకోకుండా దగ్గరే కదా అని మనింటికి మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చారు. భోజనం టైమ్ కదా! లంచ్ చేసి వెళ్ళమన్నాను. కాసేపు నేను జానకి ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చున్నాం…” అంటూ నాతో చెప్పసాగింది అమృత.
“మరి ఆ టైమ్‌లో రమణి ఏం చేసిది? ఎక్కడుంది?” ఆరా తీశాను.
“రమణి కాసేపు టి.వి చూసి ‘రాత్రి సరిగ్గా నిద్ర లేదమ్మా, కళ్ళు మండుతున్నాయి. కాస్తా పండుకుంటాను. మీ కబుర్లు అయిపోయాక భోజన సమయానికి నన్ను లేపండి’ అంటూ మన బెడ్‌రూమ్‌లోకెళ్ళింది. ‘మా కబుర్లు నీకు వినిపిస్తాయేమో కాస్తా తలుపేసుకో’ అంటూ నేనే రమణికి ఓ సలహా ఇచ్చానండీ.”
“అఘోరించలేకపోయావ్… ఊఁ తర్వాత ఏం జరిగింది? మన గదిలో ఆ అమ్మాయ్ ఎంత సేపుంది? నిజంగానే నిద్రపోయిందా? లేక నీ హాండ్‌బాగ్‌లో బీరువా తాళాలు తీసి, బీరువాని సర్దడానికి పుష్కలంగా టైమ్ లభించింది గదా! ఇది అక్షరాల రమణి చేసిన పనే అయివుంటుంది. దొంగతనం చేసే వాళ్ళకు ఎక్కువ టైమ్ అక్కరలేదు. పావు గంటలో శుభ్రంగా పని ముగించుకోగలరు డియర్ అమ్ము!” గొలుసు దొంగని పట్టేసినట్లుగా చిద్విలాసంగా నవ్వాను.
అమృత విభ్రాంతిగా నా వైపు చూడసాగింది.
“ఇది… ఇది నిజమంటారా? రమణి చాలా సేపు మన గదిలోనే వుందండీ. మేం భోజనాలు వడ్డిస్తున్నామని పిలిస్తే… అప్పుడు గది తలుపులు తెర్చుకొని వచ్చి భోజనం చేసింది. ఆ తర్వాత వాళ్ళు మరి కాసేపుండి వాళ్ళింటికెళ్ళిపోయారు”.
“అర్థమైంది. నాకంతా అర్థమైంది. నీ గొలుసు దొంగ అక్షరాలా రమణే అమ్మూ! తనకి తప్ప ఎవ్వరికీ ఆ గొలుసు తీసే అవకాశమే లేదంటే లేదు. ఈ విషయంలో నన్ను నమ్ము అమ్మూ!”
“ఏమోనండీ! నాకెందుకో భయంగా వుంది. వాళ్ళని దొంగలంటే ఊర్కుంటారా? మీరే చెప్పిండి. అసలే ఆ అమ్మాయ్ ఇంజినీరింగ్ చదువుతుంది. జానకీ సత్యమూర్తి అన్నయ్యకు ఒకనొక పిల్ల. మనమిలా గొలుసు గురించి అడిగితే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే..? అమ్మో! వద్దు లెండి. ఆ పాపం మన కెందుకు? అందరూ ముందుగా మనల్ని తిట్టిపోస్తారు.”
“మనమిలా ఊర్కుంటే ఆ పిల్ల బంధువుల ఇండ్లల్లో జరిగే పెళ్ళిండ్లకు, పేరంటాలకు, పండగలకు, పబ్బాలకు వెళ్ళతూ… ఎప్పుడూ ఏదో ఒకటి తస్కరిస్తూనే వుంటుంది. బాగా అలవాటు అయిన ప్రాణం కదా! కాబట్టి దీనికి ఓ ప్లాన్ వేస్తాను. నీవు మాత్రం నేను చెప్పినట్టు అలా నడుచుకుంటే చాలంతే. ఇందులో నీవు భయపడాల్సిన అవసరమే లేదు అమ్మూ!”
“మొన్నా మధ్య మా అమ్మ వాళ్ళింట్లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి పిలువగానే ఈ తల్లీ బిడ్డలిద్దరూ వెళ్ళారట. ఆ రోజు చాలా మంది బ్యాగుల్లో నుంచి డబ్బులు పోయాయటండీ ఎవరు ఆ పని చేశారో.. ఎలా పోయాయో తెలియలేదట. మనల్ని పూజకు ఎందుకు రాలేదంటూ… అడగటానికి ఫోన్ చేసిన సందర్భంలో ఈ సంగతి చెప్పిందమ్మ. ఆ డబ్బులు కూడా రమణే తీసి వుంటుందా? తన పనే అయివుంటుంది. చదువుకుంటున్న పిల్ల… ఇదేం మాయరోగం? ఇవేం పాడు దొంగ బుద్ధులు? ఛీ ఛీ..” కొంచెం కొంచెం విషయం అర్థమైన అమృత చీకొట్టింది.
“మనకు ఎలాంటి భయాలూ అక్కరలేదు అమ్మూ! వాళ్ళని ఏదో ఒక వంకతో మళ్ళీ ఎల్లుండి సన్‌డే రోజు మనింటికి లంచ్‌కి పిలుపు. మిగతా కథంతా నేను నడిపిస్తాను…” హుషారుగా అంటూ మా ఆవిడకి ధైర్యం చెప్పాను. దగ్గరుండి అమృతతో వాళ్ళకు ఫోన్ చేయించి సండే తప్పకుండా వాళ్ళిద్దర్నీ భోజనానికి రమ్మని మరీ మరీ చెప్పి ఒప్పించి సరే వస్తాంలెండి అని చెప్పేవరకు వదలలేదు నేను.
***
ఆ రోజు ఏం చేయాలో అంతా వివరంగా ముందుగానే మా ఆవిడతో చెప్పాను. జానకి రమణి రాకముందే ఓమారు నేను బయటికెళ్ళి వచ్చాను. అమృత వంట చేస్తోంది. తన వంట పని పూర్తి అవుతుంటే తల్లీ బిడ్డలప్పుడు దిగారు స్కూటీపై. భుజానికో బ్యాగ్ తగిలించుకొని ముందుకు పడ్తున్న జుత్తుని స్టైల్‌గా వెనక్కి తోసుకుంటూ లోపలికొస్తూ “హాయ్! అంకుల్. ఎలా వున్నారు? పోయిన వారం వచ్చినప్పుడు మీరింట్లో లేరు” నాతో అంటూ సోఫాలో కూర్చుంది రమణి.
“రండి… రండి… వదినా! పోయిన వారం మీరింటికి వచ్చినప్పుడు మీ అన్నయ్యగారు లేనందుకు… ‘మళ్ళీ ఈ ఆదివారం కూడా లంచ్‌కి పిలువ్. అందరం సరదాగా కలిసి గడుపుదాం’. ఆదీకాక సత్యమూర్తి అన్నయ్య కూడా వూళ్ళో లేడు కదా! ఒకళ్ళే ఉంటారు. రమ్మని ఒహటే పోరు మీ అన్నయ్య” అమృత నవ్వుతూ చెప్పుకొచ్చింది.
“అదే మరి మధుసూదన్ అన్నయ్యకు మొదటి నుంచైనా బంధువర్గమంటే బహుప్రీతి. రమణికేమో రేపేదో ఎగ్జామ్ వదినా! చదువుకోవాలని రానని గొడవ. సరే వాళ్ళంతా ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పి నేనే రమణ్ని ఒప్పించి బలవంతంగా తీసుకొచ్చాను అన్నయ్యగారూ…!” జానకన్న మాటలకు నేను చిన్నగా తల పంకిస్తూ “మంచి పని చేశావమ్మా. మేం ముగ్గురం కాస్తా పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటాం. నీ హేండ్‌బ్యాగ్‌లో బుక్కెదో తెచ్చుకున్నట్లున్నావు కదా రమణీ! టైమ్ వేస్ట్ చేయకుండా గదిలో కెళ్ళి చదువుకో అమ్మాయ్” అంటూ ఓ సలహా ఇచ్చాను.
“థాంక్స్ అంకుల్” అంటూ నవ్వుతూ రమణి బ్యాగ్‌తో పాటు గదిలో కెళ్ళిందే తడువుగా ‘నీకేం డిస్టబ్ కాకుండా తలుపేసుకొని చదువుకో తల్లీ! భోజనం టైమ్‌కి పిలుస్తాంలే’ అంటూ జానకి కేకేసి చెప్పింది.
“సరే సరే..” అంటూ రమణి లోనికెళ్ళి తలుపేసుకొంది.
నాకు కావల్సింది కూడా అదే. నిశ్చితంగా హమ్మయ్య అని ఓ నిట్టూర్పు విడిచి జానకి గమనించకుండా అమృత వంక ఓర కంట చూశాను.
“ఇక ఏం సంగతులు చెప్పు జానకీ! మీ ఆయన సత్యమూర్తి ఈమారు బొంబాయి టూర్ వెళ్ళి చాలా రోజులే అయినట్లుగా లేదూ?…”
“రోజు లేమిటిన్నయ్యగారు! ఇంచుమించు ఓ నెల అయిపోతేను…”
“ప్రైవేట్ జాబ్‌లన్నీ ఇలాగే వుంటాయమ్మా. పై అధికారులు ఎక్కడకెళ్ళమంటే అక్కడికెళ్ళాలి. ఎంతటి దూరప్రాంతాలకైనా వెళ్ళి తీరాల్సిందే కదా?”
“అవునన్నయ్యగారూ! మీరన్నది కరెక్టే! నెలలో చాలా రోజులు నేను రమణి ఒంటరిగా ఉండిపోవల్సి వస్తుంది…” అంటూ తన బాధని వ్యక్తపర్చింది జానకి.
వాళ్ళు ముగ్గురి కబుర్లుతో ఓ గంట ఇట్టే గడిచిపోయింది. వాళ్ళతో మాటలు కల్పుతూనే అమృత వంట పూర్తి చేసి, అప్పడాలు కూడా వేయించి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెడుతుంటే…. జానకి లేచి పళ్ళాలు, నీళ్ళు గ్లాసులు నలుగురికి పెట్టింది.
“చదువుకునేది అయిపోయిందేమో రమణ్ని ఓ మారు కేకేయి వదినా!”
“రమణీ, వచ్చేసేయ్! ఆంటీ భోజనాలు పెట్టేస్తున్నారు.” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరి నుంచే ఓ కేకేసింది కూతురికి జానకి.
“ఆఁ, వస్తున్నాను” అంటూ డోర్ తెర్చుకొని వచ్చి హేండ్‌బ్యాగ్ సోఫాలో పడేసి నవ్వుతూ “ఓ చాప్టర్ అయిపోగొట్టాను మమ్మీ! రాత్రికింకో చాప్టర్ చదివితే అయిపోతుంది…” అంటూ వచ్చి చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంది రమణి.
“ఏం, ఎగ్జామ్ రమణీ, సెమిస్టారా?” అడిగాను నేను.
“లేదంకుల్! మాములు టెస్టే!”
నలుగురూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు.
“మీ అన్నయ్య బొంబాయి నుంచి తిరిగొచ్చాక మీరూ కూడా ఓ మారు మా ఇంటికి భోజనానికి రావాలొదినా!”
జానకి ఆహ్వానానికి “ఎందుకురాం?.. తప్పకుండా వస్తాం.. ” అంటూ నేను జవాబు చెప్పాను.
అమృత వంటగిన్నెలు సర్దేయగానే “మేమింకా వెళతాం అన్నయ్యగారూ” అంటూ లేచారు తల్లీ కూతుర్లు.
“అయ్యో, అప్పుడేనా? ఇంకాసేపు అయ్యాక టీ తాగి వెళ్ళుదురుగానీ, కూర్చోండలా వదినా!” వారిస్తూ అంది అమృత.
“ఊహు, వెళతాం ఆంటీ…” రమణి కూడా తొందర చేయసాగింది. అప్పటికే వెళ్ళి సోఫాలో కూర్చున్న నేను రమణి హ్యేండ్‌బ్యాగ్‌ని చేతిలోకి తీసుకొని దాన్ని పరీక్షిస్తున్నట్లుగా నటిస్తూ జిప్ తెరవబోయాను.
“అంకులంకుల్! ఆగండి…” కంగారుగా వారిస్తూ ముందుకొచ్చిన రమణి ఆ బ్యాగ్‌ను అందుకోవడాన్కి ప్రయత్నించింది.
నేను మాత్రం వదలలేదు. “ఆగాగు అమ్మాయ్! ఇందులో ఏమేమి వున్నాయో చూడనివ్వు నన్ను” అంటూ గబగబా తెర్చాను.
“ఏం లేవంకుల్! కాలేజీ బుక్కే వుంది.” తత్తరపాటుతో అంటూ రమణి భయం భయంగా చూడసాగింది నా వైపు.
“ఎందుకమ్మాయ్! అంత భయం? నీ వస్తువుల్ని నేనేం తీసుకోనులే” అంటూనే ఆ బుక్ తీసి పక్కన పెట్టి లోపలి జిప్ కూడా లాగాను. లోపల ఏదో లావుగానే వుంది. కర్చీఫ్‌లో చుట్టిన రెండు నోట్ల కట్టలున్నాయి. కొత్త ఇరవై రూపాయల నోట్ల కట్టలు. వాటిని చేతిలోకి తీసుకొని అనుమానస్పదంగా చూస్తూ “రమణీ, ఏమిటివి?” తనకి చూపిస్తూ అడిగాను.
భయాందోనలతో రమణి బిక్క చచ్చిపోయింది. నోటమాట రాక శిలా ప్రతిమే అయింది.
జానకి, అమృత చేష్టలుడిగి నిల్చుని ఆ దృశ్యం చూడసాగారు.
“రమణీ, నేను ఉదయం మా పక్కింటి బ్యాంకు మేనేజర్‌గారింటి కెళ్ళి రెండు వేలు విలువైన నోట్ల కట్టలు ఈ రెండూ తెచ్చి మీ ఆంటీ బీరువాలో పెట్టాను; నిన్నీరోజు రెడ్‌హ్యండ్‌గా పట్టుకోవాలని నేను పన్నిన వలలో నీపు చక్కగా చిక్కావు. పోయిన సన్‌డే బీరువాలో మీ ఆంటీ ఐదు తులాల చంద్రహారం గొలుసు కూడా నీవే కదా తీసింది? చెప్పు… నిజం చెప్పు? ఏం చేశావ్ ఆ గోలుసు? నీవు చేసే ఈ పనులు మీ అమ్మ జానకికి తెలుసా? లేక… ఆవిడ ప్రోద్బలంతోనే నీవీ పాడు దొంగతనాలు చేస్తున్నావా?” నేనన్న ఆ మాటలకు తట్టుకోలేక పోతున్నట్లుగా భళ్ళున ఏడవసాగింది రమణి.
“నా… నాకు తెలీదంకుల్! నా బ్యాగ్‌లోకి ఆ నోట్లు కట్టలెలా వచ్చాయో?”
“అవునా! వాటంతట అవే బీరువాలో నుంచి నడుచుకుంటూ నీ బ్యాగ్‌లోకి వచ్చాయా రమణీ…!” వెటకారంగా అంటున్న నేను వాళ్ళమ్మ వైపు తిరిగి “జానకీ, ఏమిటీ దొంగతనాలు? చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఈ పిల్లకీ పాడు దొంగతనాలు బుద్ధిలేమిటి? నీకు తెలిస్తే తల్లిగా నీ బాధ్యతగా తనని ఆదిలోనే అదుపు చేయలేక పోయావా?” గంభీరంగా ప్రశ్నించాను తీక్షణమైన చూపులతో.
“నా… నాకేం తెలీదు అన్నయ్యగారూ…” అంటూ ఏదో బొంకబోయిందామె. తన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు ఆమెకు.
“చూడు రమణీ! మీ ఆంటీ బంగారు గొలుసు కూడా బీరువాలో నుంచి నీవే కొట్టేశావ్. మీ ఆంటీ ఆ బీరువా తాళాలనెప్పుడూ తన హేండ్ బ్యాగ్‌లోనే వేసుకుంటుంది. చదువుకుంటానని గదిలోకెళ్ళి తలుపు లేసుకొని నీవు చేసే నిర్వాహకం ఇదా? ఛీ! ఈ రోజు నీ భాగోతం బయటపడింది. నీవు మంచి మాటగా ఆ గొలుసు తెచ్చిస్తే సరి. లేదా నేను వెంటనే పోలీస్ రిపోర్ట్ యిస్తాను. మీ ఇంటికి పోలీసులొస్తారు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఈ సంగతంతా తెల్సిపోతుంది. పరువు మర్యాదలతో బతుకుతున్న మీ నాన్న సత్యమూర్తి… ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందో తెలుసా రమణీ? నీకేమన్న డబ్బు అవసరముంటే అమ్మనో, నాన్ననో అడిగి తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు తల్లీ! నేనే కాదు… ఇలాంటి పనుల్ని ఎవ్వరూ సమర్థించరు, హర్షించరు…” అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న నన్ను దాటుకొని మరో మాట కూడా మాట్లాడకుండా టివి స్టాండ్‌లో వున్న బండి కీస్ అందుకొని, పిలుస్తున్నా వినిపించుకోకుండా కోపావేశాలతో గబగబా బయటికెళ్ళిపోయారు తల్లీ కూతురు.
నేను మా ఆవిడ గబగబా బయటికొచ్చి పిలుస్తుండగానే స్కూటీ సర్రున బాణంలా ముందుకు దూసుకపోయింది.
“ఏమండీ, ఇప్పుడేం చేద్దాంమండీ? నాకేమిటో భయంతో కంగారుతో కాళ్ళుచేతులు ఆడ్డంలేదండీ. తండ్రి కూడా ఊళ్ళో లేడు. ఆ పిల్ల ఏదైన అఘాయిత్యం చేసుకుంటే ఇంకేమన్నా వుందా? బంధువర్గమంతా…. తెల్సిన వాళ్ళు అందరూ మనల్నే తిట్టిపోస్తారండీ. వెధవ గొలుసు పోతే పోయింది…” అంటున్న అమృతని తీక్షణంగా చూస్తూ “ముందు నీవు లోపలికిపద అమ్మూ!” కాస్తా కోపంగానే అన్నాను.
ఇద్దరం లోపలికొచ్చి కూర్చుని కాసేపు మౌనంగానే వుండిపోయాం.
“ఇప్పుడు తెల్సింది కదా! ఖచ్చింతగా నీ చంద్రహారం గొలుసు దొంగిలించింనది రమణే అని…”
“అవునండి. దాని పనే” నమ్మకంగా తల ఊపింది అమృత.
“నేను చాలా మంచిగా ప్లాన్ వేశాననుకున్నాను. చివరికలా జరిగిందేమిటి?”
‘ఇప్పుడేం చేయాలి?’ అని ఆలోచిస్తూ ఆ ఇరవై రూపాయల నోట్ల కట్టలు రెండూ తీసుకొని గదిలోకెళ్ళి బీరువాలో పెట్టి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చున్నాను.
“నాకో అనుమానమండి. జానకి వాలకం చూస్తుంటే… కూతురు చేసే ఈ వెధవ పనులన్నీ తల్లికి తెలిసే జరుగుతాయేమోనని నాకనిపించిందండి” తన సందేహాన్ని వెలిబుచ్చింది అమృత.
“అవును. నీవన్నది కరెక్టే” అని నేనంటూ వుండగానే, వెళ్ళినంత వేగంగా స్కూటీ మళ్ళీ వచ్చి వాకిట్లో ఆగటమేమిటీ, రమణి గబగబా ఇంట్లోకి పరిగెత్తుక రావడమేమిటీ అన్నీ క్షణంలో ఇట్టే జరిగిపోయాయి.
ఆశ్చర్యచకితులమై చూడసాగాం మేము. రమణి స్కర్ట్ జేబులో నుంచి అమృతది చంద్రహారం తీసి నా చేతిలో పెట్టి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ,“నన్ను క్షమించండి అంకుల్! ఈ గొలుసు పోయిన సన్‌డే వచ్చినప్పుడే నిజంగా నేనే తీశాను. బంగారం దొంగిలించడం ఇదే మొదటిసారి అంకుల్. ఎప్పడైనా ఎవరింట్లో అయినా డబ్బులే తీస్తాను. నేనిలా దొంగతనాలు చేయడానకి ఓ విధంగా మా అమ్మే కారణం కావచ్చు. నన్నెప్పుడూ మందలిచంక పోవడమే కాక.. ఇంకా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూ… తగిన సహకారాన్ని కూడా అందిస్తుంది. సారీ అంకుల్! ఇప్పటి వరకూ చాలా దొంగతనాలే చేశాను చుట్టాలిండ్లలో… మొదటిసారిగా మీ ఇంట్లో ఈ రోజిలా పట్టుబడాను. ఆంటీ మీరిద్దరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమిచండి. ఇంకెప్పుడూ ఇలాంటి దొంగ పనులు చేయను. నన్ను నమ్మండి. ఈ విషయాన్ని ఎవరితోను అనకండి. ముఖ్యంగా మా నాన్నతో…” అంటున్న రమణ్ని లేపి సోఫాలో నా పక్కగా కూర్చోబెట్టుకొని,
“ఏడవకు రమణీ.. ముందు కళ్ళు తుడుచుకో. నీ తప్పు తెల్సుకున్నావు. మారిన మనసుతో మళ్ళీ ఇలాంటి దొంగపనులెప్పుడూ ఇక నుంచి చేయనన్నావు. అది చాలమ్మా మాకు. ఎంతో సంతోషం కల్గుతుంది. నీలో మార్పు తేవాలనే నేనీ ప్లాన్ వేసి నిన్ను దొంగగా పట్టుకుని నీకేంతో బాధని కల్గించి వుంటే క్షమించు రమణీ. నీవు మీ నాన్నలా ఓ మంచి ఇంజనీర్‌వి కావాలని కోరుకుంటున్నాం. నేను మీ ఆంటీ చేసింది తప్పని నీకనిపిస్తుందా రమణీ?” అనునయంగా చెప్పసాగాను.
“లేదంకుల్! నన్ను మీరు సరైన మార్గంలో పెట్టడానికి మంచి పనే చేశారు. వస్తానంటీ బై!” కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ నేనందించిన తన బ్యాగ్ అందుకుని వెళ్ళిపోతున్న రమణి వంకే చూస్తూ ఎంతో సేపు అలాగే కూర్చుండిపోయాం నేనూ మా ఆవిడ.