నా రుబాయీలు-2

0
3

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
కుసుమం ఒక యాభై కేజీలైతే చెలియ!
తుహినం కాంతిరేఖలు చిమ్ముతుంటే చెలియ!
తుమ్మెద కన్నుగప్పి తేనె దోచిన పెదాలు!
వేడినా, అకారణంగా అలిగితే చెలియ!!

పండే కాదుగ ప్రథ కూడా చిలుకకు దొరికింది!
గొడుగు కాసిందనా గువ్వ గోరింకకు దొరికింది!
ఎందుకు ఎడబాటును నాకై లిఖించాడా బ్రహ్మ
వేడినా, పోరాడినా వగపే కడకు దొరికింది!!

అగరు పొగలకి చెక్కిలిపై ఎరుపు చేరింది!
మల్లెపూలతో మీసాలకి పొగరు చేరింది!
అట శుభ ఘడియల కాలమింక రాలేదంటూ
మూడుకాళ్ల ముసలి నానమ్మ అరుపు చేరింది!!

నా పైనుండి అహో ! ట్రైన్ పోయింది బాగుంది!
నాకై పొద మాటున చిరుత దాగింది బాగుంది!
కుంచె మన్ననలతో నడిరోడు ముస్తాబవగా
దారికి పోటి పై వంతెన సాగింది బాగుంది!!

పుట్టుకతోనే ముళ్ళబాటను గెలిచింది గులాబి!
పవనుడి దాడిలో సౌరభాన్ని ఒడిసింది గులాబీ!
వేలపూల తోటలో గొప్పే దీని సంకల్పం!
చెలి కురుల సింహాసనం పై నిలిచింది గులాబి!!

నేను బతకడం కోసం రోజుకో మూత!
మరి డాక్టర్ కూడ బతకాలి మరో మూత!
కడుపుది అవసరమైతే నాలుకది కోరిక.
రోజోసారి డాక్టర్స్ స్పెషలో మూత!

నీడను ఇస్తున్నది చెట్టు!
నిలువున కాలుతుంది చెట్టు!
నీ చితికి ప్రాణం పోయగ
తను బూడిదవుతుంది చెట్టు!!

ఊయలూపింది రైలు
జోల పాడింది రైలు
నిద్దుర నిశిని దోచితే
మహిని తిప్పింది రైలు!

ఓనమాలను నీకు నేర్పిస్తుంది బడి
ప్రపంచాన్ని తను పరిచయం చేస్తుంది బడి
దురాచారాలిక నింగికెగిసిన నాడు
మరో ప్రపంచం మొలకెత్తిస్తుంది బడి!

మొక్కలన్నీ ముద్దిస్తే పుట్టింది చెరుకు!
మనిషికి తీపిని పరిచయం చేసింది చెరుకు!
జీవితంలో చేదును తిరస్కరించలేను
జిహ్వా లాలసకు తపనలు తీర్చింది చెరుకు!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here