తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -2

0
3

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ పాఠకులకు అందిస్తున్నాము.]

కలలు కనే కళ్ళున్నాయి:

[dropcap]కా[/dropcap]లేజీలో లెక్చరర్ మాట్లాడే తీరు బ్లాక్‌బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసే ఆ స్టయిల్ చూసి అనుకునేవాడ్ని, ఎప్పటికైనా లెక్చరర్ అవ్వాలని. పరీక్షలొస్తున్నాయంటే చాలు మా ఇల్లు ఓ చిన్న ట్యూటోరియల్ కాలేజీగా మారిపోయేది. వరండాలోని ఓ గోడకు నల్లపెయింట్ వేయించాము. నా క్లాస్‌మేట్స్ ఇద్దరో ముగ్గురితోనో కలిసి ప్రతి రోజూ సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే చదువుకునేవాళ్ళం. వారితో కలిసి చదువుకోవడం భలే సరదాగా ఉండేది. బ్లాక్‌బోర్డ్, చాక్‌పీసుల డబ్బా అమిరాయి. వినడానికి నా క్లాస్‌మేట్సే ఉన్నారు. ఇకనేం, నాలోని లెక్చరర్ మేల్కొన్నాడు. నేను పాఠం చెప్పడం వాళ్ళు శ్రద్ధగా వినడం. నేను బోర్డ్ మీద రాయడం.. వారు రాసుకోవడం, ఇదంతా బయట వాళ్లు చూస్తుంటే ఓ ట్యూటోరియల్గా (చూ.4) అనిపించేది. ఊర్లో చదువుకుంటున్న కుర్రాళ్లకు ఇదేదో కొత్తగా అనిపించి ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవారు. కలిసి చదువుకుంటే చక్కటి ఫలితమే అందుతుందని మా బీఎస్సీ మార్కులే తేల్చాయి.

పీజీ చేసి ఇక లెక్చరర్ అవడమే ఆలస్యమనుకున్నాను. అమాయకత్వం..

బెనారస్ యూనివర్శిటీ, బొంబే యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ.. ఇలా కొన్ని యూనివర్శిటీలకు అప్లై చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ వాళ్లు బయో సైన్స్ ఇస్తామన్నారు. బొంబాయి యూనివర్శిటీ (ఇప్పుడు ముంబాయి యూనివర్శిటీ) వాళ్లేమో బోటనీలో మైకాలజీ – ప్లాంట్ పాథాలజీ సీటు ఇస్తామన్నారు. ఏది మంచిదో చెప్పమని మా లెక్చరర్స్‌ని అడిగితే “అబ్బో, మైకాలజీ – ప్లాంట్ పాథాలజీ గొప్ప” అన్నారు. అన్నయ్యకీ, నాన్నకి చెబితే ఒకే అన్నారు. అంతే, నాన్నగారితో కలిసి బొంబాయి ప్రయాణం.

ఆగని కన్నీళ్లు:

బొంబాయి యూనివర్శిటీ వాళ్ల పరిధిలోనే ఉన్న గవర్నమెంట్ హాస్టల్‌లో రూమ్ దొరికింది. ఇది చర్చ్ గేట్‌కి సమీపంలోని సి- రోడ్డులో ఉంది. ప్రక్కనే బి-రోడ్డులో వాంఖేడ్ స్టేడియం (5) ఉంది.

చదివిందేమో యూనిర్శిటీ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (కాలేజీ)లో. ఈ కాలేజీకి ఘనమైన చరిత్రే ఉంది. అంతే స్థాయిలో మద్రాసీలంటే చిన్న చూపూ ఉంది. తెలుగు వారిని కూడా మద్రాసీల గాడిన కట్టేసి మాట్లాడేవారు.

హాస్టల్‌లో చేర్చి నాన్నగారు వెనక్కి వెళ్లిపోయారు. ఆ రాత్రి పడుకున్నప్పుడు తెలిసింది ఇంటి విలువ ఎంతో. పైన ప్యాన్ తిరుగుతోంది. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తెలుగు తప్ప వేరే భాష రాదు. ఇంగ్లీష్‌లో మనకొచ్చినవి అత్తెసరు మార్కులే. పైగా నందిగామ వంటి చోట్ల ఇంగ్లీష్ మాట్లాడే మొనగాళ్లు ఒకళ్ళిద్దరే. ఎమ్మెస్సీ పూర్తి చేసి లెక్చరర్ అవ్వాలన్న కల నెరవేరుతుందా? ఆత్రేయ పాటలోని వాక్యాలు గుర్తుకు వచ్చాయి.

కలలు కనే కళ్లున్నాయి,

అవి కలతపడితే నీళ్లున్నాయి.

ఆగని కన్నీళ్లను కర్చీఫ్‌తో తుడుచుకునే ప్రయత్నంలో ఉండగానే తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఇద్దరు – చొరవగా లోపలకు వచ్చేసి నా బెడ్ మీద కూర్చుని తెలుగువాళ్లమనీ, సీనియర్స్ మనీ చెప్పారు. అంటే ర్యాగింగ్ మొదలైందనే అనుకున్నాను. కానీ ఈ అన్నలు అలా కాదు. కొద్దిగా ఏడిపించినా అంతలో బాగా నవ్వించేవారు. నన్ను బొంబాయికి తగ్గట్టుగా నవ యువకునిగా మార్చేశారు. ఆ రోజులకు తగ్గట్టుగా బెల్ బాటమ్ ప్యాంట్. హిప్పీ క్రాఫ్ వచ్చేశాయి. నాకు అన్నివిధాలా క్లాస్‌మేట్ కరీముద్దీన్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. మా స్నేహం నాలుగు పదులు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

డబ్బు విలువ తెలిసింది:

నెలకు ఇంటి నుంచి 300 రూపాయలు వచ్చేవి. అప్పట్లో మనీ ఆర్డర్ రావడానికి వారం పది రోజులు పట్టేది ‘టెలిగ్రామ్ మనీ ఆర్డర్’ అని మరో సౌకర్యం ఉండేది. కానీ పంపడానికి ఖర్చు ఎక్కువ. మనీ ఆర్డర్ వంటివి ఒకప్పుడు ఉండేవని చెబితే మా మనవళ్ళు నమ్మక పోవచ్చు. ఆ కాలంలో పోస్టాఫీసు అందించిన సేవల్లో కొన్ని నేడు కనుమరుగయ్యాయి. టెలిగ్రాం మనీయార్డర్ కంటే వేగంగా డబ్బులు ట్రాన్ఫర్ అయ్యే అవకాశం ఇప్పుడుంది.

ఇక్కడే ఓ చిన్న విషయం గుర్తుచేసుకుంటున్నాను. మా నాన్నగారితో కలిసి బొంబాయి రాగానే రైల్వే స్టేషన్‌కి దగ్గర్లోని ఓ లాడ్జిలో దిగాము. వెంట తెచ్చుకున్న డబ్బులు ఫీజులకు సరిపోయాయి. లాడ్జికి కట్టడానికి డబ్బులు లేవు. నేను కంగారు పడుతుంటే నాన్నగారు “మరేం ఫర్వాలేదులేరా, టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపమని ఇంటికి టెలిగ్రామ్ ఇద్దాం” అన్నారు. సరే, ఇంటి నుంచి టెలిగ్రామ్ మనీ అర్డర్ కోసం టెన్షన్‌తో ఎదురు చూపులు. రెండో రోజు పోస్టాఫీస్‌కి వెళ్ళి అడిగితే వచ్చిందని పోస్ట్‌మాన్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం. లాడ్జి బిల్లు, ఇతర బిల్లులు చెల్లించేశాక, ఆ రాత్రికే నాన్నగారు రైలెక్కేశారు.

నెలనెలా వచ్చిన డబ్బులతో హాస్టల్ ఫీజు, కాలేజీ ఫీజు అన్నీ పోగా డబ్బులు మిగుల్చుకుని టెక్స్ట్ పుస్తకాలు కొనుక్కునే వాడ్ని. అంతే కాదు, చర్చ్ గేట్ దగ్గరున్న ఎస్బీఐకి వెళ్ళి ఎకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెలా కొంత డబ్బు జమ చేసేవాడ్ని. అలా పోగేసిన డబ్బుతో సెలవుల్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మా అన్నగారి పిల్లలకు చిన్న చిన్న బొమ్మలు, గౌన్లు వంటివి తీసుకువెళ్ళేవాడిని. సేవింగ్స్ విలువ అప్పుడు తెలిసింది.

1980 నాటికి ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇక లెక్చరర్ అవుతా, ఉత్తమ అధ్యాపకునిగా అవార్డ్ కొట్టేస్తా అనుకుంటూ పట్టా పుచ్చుకుని ఆనందంతో నందిగామ చేరాను. లెక్చరర్‌గా కొంత కాలం పనిచేసినా దేవుడు నాకు వేరే దారి చూపాడు. విధి బలీయం. ఎవ్వరూ తప్పించలేరు. ఏ దారెటు పోతుందో ఎవరికి ఎరుక.

అనుకోని అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆత్మబలంతో జీవన యానం సాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన కుర్రాడు ఇక నడిపిస్తాడు ముందుముందు ఈ కథని.

—–

ఫుట్ నోట్స్ :

(4) లెక్చరర్ కావాలన్న తపన ఎంతగా ఉండేదంటే ఎమ్మెస్సీ అయ్యాక కొంత కాలం ఖాళీగా ఉన్నప్పుడు మా బంధువు ఒకాయనతో మాట్లాడి చిన్న సైజ్ ట్యూటోరయల్ కాలేజీ పెట్టడం దాకా వెళ్ళింది. అయితే కాసుల కొరతతో కాలేజీ అటకెక్కింది.

(5) బొంబాయి వాంఖేడ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడాలని తెగ ఆరాటపడేవాడ్ని. క్రికెట్ అంటే ఇష్టమే. కానీ కాలేజీలో కానీ, స్కూల్‌లో గానీ నన్ను ఆడనిచ్చేవారు కాదు. బక్కగా, గాలికే పడిపోయేలా ఉన్నావంటూ హాస్యం ఆడేవారు. హైస్కూల్‌లో ఎన్.సి.సి.లో ఉన్నప్పుడు ఆ లాగూ, షర్ట్ జారిపోతుండేవి. చిన్నప్పుడు వీధి క్రికెట్ ఆడేవాడ్ని. అక్కడా నన్ను చాలా దూరంలో బౌండ్రీ లైన్ దగ్గరే నిలబెట్టేవారు. బాలు తగలకుండా ఉంటుందిలే అని నేనూ అదే ప్రిఫర్ చేసేవాణ్ణి.

సరే, బొంబాయి చేరాము కదా, అందునా స్టేడియం పక్కనే హాస్టల్ కదా, స్టూడెంట్ కన్సెషన్ ఉండేదాయె. భారత – పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ (1979) జరుగుతుంటే ఐదు రోజుల ఆటలో ఒక రోజు ఆట చూసే అవకాశం అలా దక్కింది. ఒక టికెట్ కొంటే రోజుల వారీగా ఐదుగురం పంచుకునే వాళ్లం. ఐదు రోజుల పాటు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది వారి వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుందనుకోండి. నేను చూసిన ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఇమ్రాన్‌ని చూశాను. ఇండియా కెప్టెన్ కపిల్ అనుకుంటా.

మళ్ళీ ఓ టెస్ట్ మ్యాచ్ ఆట చూడటానికి 40 ఏళ్ళకు పైగానే పట్టింది. నేను యు.కె. వెళ్ళినప్పుడు ఇండియా జట్టు ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్ట్ మ్యాచ్ (2022- ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్) మొదటి రోజు ఆట మా అబ్బాయితో కలిసి చూశాను. అప్పుడు ఈ వాంఖేడ్ ముచ్చట గుర్తుకొచ్చింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here