వారసుడు

1
3

[యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘వారసుడు’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]“ప్ర[/dropcap]స్తుతం ప్రపంచంలో ఒక రోగాన్ని తగ్గించే మందు ఏదీ తయారు కావడం లేదు. రోగి లోని రోగాన్ని మెయిన్‌టెయిన్ చేసే మందులే తయారవుతున్నాయి! ఎలా ఒక వాహనం మెయింటైన్ చేయడానికి ఇంధనం అవసరం అవుతుందో అలా ఒక మనిషి తన దేహాన్ని మెయింటైన్ చేయడానికి పనికొచ్చే మందులు మాత్రమే తయారవుతున్నాయి. ఉదాహరణకు రక్త పోటు, చక్కెర వ్యాధి మందులు, రక్తం గడ్డ కట్టకుండా వుంచే ఆస్ప్రిన్ మాత్రలు ఒక్కసారి ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సి ఉంటుంది!

మనిషికి వచ్చే రోగాల్లో 99 శాతం సైకో సోమాటిక్ వ్యాధులే! మిగిలిన ఒక్క శాతము ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, వైరస్సులు వలన సంభవిస్తాయి! ప్రతీ రోగమూ ముందు మనసులో ప్రారంభమై తర్వాత శరీరం మీద ప్రకటిత మౌతుంది.” స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతీ వారి ప్రవచనం యూ ట్యూబ్‌లో కొనసాగుతుంది!

ప్రవచనం వింటున్న డా. దీపక్ దొర యం. యస్; గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సర్జన్, ఉలిక్కి పడ్డాడు. తనకు తెలుసు ‘హైపర్ ఆక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ఎ డిసీస్’ అని. శరీరమే ఒక వ్యాధి! దానికి నివారణా మార్గం అన్వేషించాలి గానీ ఉపశమన మార్గం ఎందుకు? శరీరాన్ని ఎప్పుడూ బాధా – భయం అనే కీటకాలు తినేస్తుంటాయి!

వూపిరి విడిచి పెట్టి మళ్ళీ పీల్చలేకుంటే అదే మరణం! డాక్టరు మందులు మాత్రమే ఇవ్వగలడు. ఆ మందుల సాయంతో ఆరోగ్యాన్ని రోగి తన లోపల తానే వెతుక్కోవాలి! ఈ రోగాల వల్ల దుఃఖం కలుగుతుంది. నిజాన్ని, నిజం కాని దానిని కలగా పులగం చేయుటే ఆ దుఃఖానికి హేతువు! పేనుకు పెత్తనం ఇచ్చినట్టు మనసుకు పట్టాభిషేకం చేస్తే మిగిలేది దుఃఖమే! బీదవాడి సంసారం ధనవంతుడి సంసారం ఒక్కటే! ఎలాగంటే ఆ ఇద్దరికీ వచ్చిన కడుపు నొప్పి ఒక్కటే కదా?

తాను ఎంత గొప్ప పెద్ద డాక్టర్‌ని అయినా ఆనందపు అంచులనైనా చూడగలుగుతాడా?

అందరి సంసారుల్లాగే తానూ నమ్ముతాడు: ధనం మనిషికి రక్షణ కల్పిస్తుందనీ, ఆనందం క్లబ్బుల్లోనూ – బారుల్లోనూ దొరుకుతుందని, ఈ దృశ్య జగత్తు సత్యమని, తన ముందు ఉన్నవారు అయితే తనకు మిత్రులూ కాకుంటే శత్రువులు అనీ, తాను సశరీరంగా శాశ్వతుడు అనే ఇల్యూషన్స్‌లో జీవిస్తున్నాడు.

జ్ఞాననేత్రం తెరుచుకున్న జీవుడే దేవుడని – ఆ నేత్రం మూసుకుపోతే ఆ దేవుడు కూడా జీవుడేననీ తాను విని వున్నాడు! ఇన్ని తెలిసినా కూడా తాను సంసారి గానే వుండిపోయాడు. ఎందుకంటే ఆ సంసారం తనకూ తన కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తుందని. అందుకే ఇన్ని భవనాలు, కార్లు, బాంక్ బాలెన్సులు మెయింటైన్ చేస్తూ తన వారసుడికి మంచి ఖరీదైన కార్పొరేటు చదువులు కొనగలుగుతున్నాడు.

పూర్వం డాక్టర్లు నాడి చూసి వైద్యం చేసేవారట! ఇప్పుడు నాడి చూడనవసరం లేదు. కనీసం స్టెతస్కోప్ కూడా ఉపయోగించాల్సిన అవసరం కలగడం లేదు. స్టెతస్కోప్ కేవలం డాక్టర్ని అని తెలియడానికి మెడలో వేసుకున్న ఒక అలంకారం మాత్రమే! పేషెంట్‌కు అనేక టెస్టులు రాసేస్తే, రిపోర్టు లని బట్టి రోగం ఏమిటో తెలుస్తుంది. పైగా లాబ్ నుండి యాభై శాతం కమీషను వస్తుంది. తను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో తన కన్సల్టేషన్ ఫీజు పది రూపాయలు. ఇప్పుడు ఐదు వందలు! ఈ టౌన్లో వున్న కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తననే సర్జన్‌గా ఉపయోగించుకొంటాయి. తెల్లవారు ఝామున రెండు గంటలకు మొదలు పెట్టిన ఆపరేషన్లు ఉదయం పది గంటల వరకూ వుంటాయి. ఆ తర్వాత అవుట్ పేషంట్స్! రోజుకు సంపాదన లక్షల్లోనే! దాంతో ఆనందం కొనుక్కుంటున్నాననే భ్రమ పడుతుంటాడు డాక్టర్ దీపక్ దొర!

చక్రి అని ముద్దుగా పిల్చుకునే చక్రవర్తి దొర తన ఏకైక పుత్ర రత్నం. తమ సర్వసంపదలకు వారసుడు. తన వృత్తికి కూడా వారసుడు కావాలనేది తన ఆకాంక్ష! ఇంటర్ పరీక్షలు రాసి ఆ రోజే గుంటూరు నుండి వచ్చాడు.

వాడిని మెడిసిన్ చదివించి తన ప్రాక్టీసు నంతా అప్పజెప్పాలి. అప్పటి వరకు తన పరుగు ఆపదలచు కోలేదు!

“చక్రీ! ఆదిత్యా కోచింగ్ సెంటర్ వారు ఫోన్ చేశారు. యంసెట్ కోచింగ్‌కు నిన్ను వాళ్ళ దగ్గర జాయిన్ చెయ్యమని. నీలాంటి మెరిట్ స్టూడెంట్స్ వారికి కావాలి. వారి దగ్గర చెరతావా? లేదా గుంటూరు వికాస్‌లో చేరతావా?” అడిగారు డా. దీపక్ దొర కొడుకుని.

“డాడ్! నేను యం సెట్ కోచింగ్ తీసుకోదలచలేదు. అసలు మెడిసిన్ చెయ్యాలనే ఆలోచన లేదు నాకు. ఇండియన్ ఫిలాసఫీలో డిగ్రీ చేస్తాను. డిగ్రీ తర్వాత ఋషీకేశ్‌లో స్వామీ దయానంద ఆశ్రమం లోగానీ, ముంబైలో స్వామీ చిన్మయానంద స్థాపించిన సాందీపని విద్యాలయంలో గానీ భారతీయ తత్త్వ శాస్త్రం చదవాలనుకుంటున్నాను.” అంటూ బాంబ్ పేల్చాడు.

“వ్వాట్? నీ కేమన్నా పిచ్చి పట్టిందా?” అరిచాడు డా. దీపక్.

“అవును. నన్ను నేను తెలుసుకోవాలి అనే పిచ్చి.” చెప్పాడు చక్రి.

“నేను నీకు అప్పజెప్పబోయే ఇంత సంపదను కాదని, కాషాయం కట్టాలనుకుంటున్నావా? ఇక్కడ నలుగురిలోనూ మా పరువు ఏమౌతుందో ఆలోచించావా?” డా. దీపక్ దొర గొంతు తడారి పోయింది.

“డాక్టర్ చేసే వైద్యంలో నాలెడ్జ్ వుంటుంది. పాండిత్యం వుంటుంది. ఆ పాండిత్యం – తెలివితేటలు పుస్తకాల్లో దొరికేది. కానీ మనస్సులో స్పాంటేనియస్‌గా వికసించే పాండిత్యం కావాలి నాకు.” చెప్పాడు చక్రి దొర.

“అంటే.. మేము బట్టీయంతోనే వైద్యం చేస్తున్నామా?” డా. దీపక్.

“అవును డాడ్! జీవించడంతోనే జీవితమంతా సరిపోతుంది మీకు. అసలు జీవితమంటే ఏమిటో తెలుసా మీకు? ఆ ప్రయత్నమే లేదు మీలో.” చక్రి ఆరోపణ.

“హు! జీవితం.. జీవించడం.. ఎలా వేరు వేరు అవుతాయి?” డా. దీపక్ దొర.

“యస్! లివింగ్ ఈస్ నాట్ లైఫ్! జీవించడంలో ఎవరి లైఫ్ స్టైల్ వారిదే! కానీ.. జీవితం. అదే ప్రాణ శక్తి ఏ ఒక్కరి సొంతం కాదు. లైఫ్ ఈస్ ఆల్! జంతువుల్లో, పక్షుల్లో, వృక్షాలలో, మనుషుల్లో కూడా కామన్ ఎలిమెంట్! ఆ జీవితాన్ని జీవించేటట్టు చేస్తున్న శక్తి ఏమిటి? అది తెలుసుకోవడమే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం! ఈక్వల్ ఈస్ డిఫరెంట్ ఫ్రం ఐడెంటికల్! ది ఫార్మ్ లెస్ ఈస్ ఇన్ ది ఫార్మ్! అదే దేహంలోని ప్రాణ శక్తి. ఈ ప్రాణ శక్తికి నామరూపాలతో గానీ, దేశం తో గానీ, కాలంతో గానీ పని లేదు. అదే నా స్వరూపం! దాన్ని నా లోనే వికసింపజేసుకోడానికే నా సాధన!” చెప్పాడు చక్రవర్తి స్పష్టంగా!

మళ్లీ తనే “డాడీ! ‘సత్యం’ మాటల రూపంగా వుండేది కాదు. దాన్ని అనుభవంతో తెలుసుకోవాలి. పాండిత్యం వేరు. తెలివితేటలు వేరు. పాండిత్యం ప్రోగుచేసుకునేది. తెలివితేటలు మన లోపల మనమే వికసింప జేసుకోనేవి. ఒక దీపాన్ని చూడటానికి మరో దీపంతో పని లేదు! ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రంతో పని లేదు! ఏది ఆత్మ కాదో తెలుసు కోవడానికి మాత్రమే శాస్త్రం యొక్క అవసరం పరిమితం!” ముగించాడు చక్రి తన వివరణను.

“యూ ఆర్ మాడ్! దేర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ యువర్ డిసీజ్!!” అంటూ బయటకు వెళ్లి తన ఆడి కార్ స్టార్ట్ చేసుకొని క్లబ్బుకు బయలు దేరారు డా. దీపక్ దొర ఆనందాన్ని వెదుక్కుంటూ!

‘యస్ యూ ఆర్ రైట్ డాడీ! సెల్ఫ్ ఎంక్వయిరీ ఈస్ ది ఓన్లీ మెడిసిన్ ఫర్ మై డిసీజ్!’ అనుకొంటూ బయటకు వెళ్లి తన బైక్ స్టార్ట్ చేసుకొని శ్రీ రామకృష్ణ సేవా సమితిలో నడుస్తున్న పూజ్య స్వామీ తత్త్వవిదానంద వారి ఆత్మ బోధ క్లాసుకు వెళ్లిపోయాడు చక్రవర్తి దొర!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here