[box type=’note’ fontsize=’16’] “మరే! ఎంత పేస్ట్ వేసి తోమితే ఈ సముద్రం ఇంత నురుగొచ్చింది. నాకంతా భలే ఆశ్చర్యంగుంది” అంటున్నారు వాసవి పైడి “నేను నా బుడిగి” కథ ఐదవ భాగంలో. [/box]
[dropcap]ఈ[/dropcap]మధ్య అప్పుడప్పుడూ సార్ వాళ్ళు ఆదివారం రోజు ఏదో ఒకచోటకి తీసుకెళతావున్నారు. అలా ఈసారి సముద్రం దగ్గరకి పిలుచుకొని పోయారు. మొదటిసారి సముద్రం చూడడం. అమ్మో ఎంతపెద్దగుంది? భూమిపైన పుట్టి ఆకాశాన్ని ఎట్టా అందుకుందో, దూరంగా మనకలా కనబడుతుంది అంతే అన్నాడు సార్. “నిజం కళ్ళ కెదురుగా కనిపిస్తాంటే, ఈ నిశ్శబ్దం సారేంటి ఇలా అంటున్నాడు?” గణేశ్ నా చెవిలో గుసగుసలాడాడు. మరే! ఈ సముద్రం ఎంత పేస్ట్ వేసి తోమితే ఇంత నురుగొచ్చింది. నాకంతా భలే ఆశ్చర్యంగుంది అన్నా.
ఓ … అంటా సముద్రం చేసే శబ్దాలు, ఎత్తుగా కదులుతా వస్తూ ఆఖరున ఇసుకను తాకేసి వెళ్ళే అలలు, తడి ఇసుకలో కూరుకుపోయి లోతుగా ముద్రలు పడుతున్న అడుగులు… అన్నిటికన్నా ముఖ్యంగా గవ్వలు ఒడ్డున నడుస్తున్నంతసేపూ ఇసుకలో ఎన్ని గవ్వలు దొరికాయో! ఎన్ని ఆకారాలో. మణి, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు శ్రీధర్ సార్‌తో సముద్రం లోపలికి వెళ్ళారు. చిన్నవాళ్ళం మాత్రం ఒడ్డున నడుచుకుంటా బోలెడు గవ్వలు ఏరుకున్నాం. ఒకేలా వుండేవి దొరికితే అవి వేరే వాళ్ళకిచ్చి నా దగ్గర లేనివి తీసుకున్నా. కొంచెం దూరంపొయ్యాక గణేశ్ నీళ్ళలోకి పోదామన్నాడు. చిన్నసార్ మా ముందు నడుచుకుంటా వెళుతున్నారు. వద్దురా అన్నా వినకుండా గణేశ్ నీళ్ళలోకి నడిచాడు. పెద్ద అలలతో పాటూ శంఖం వస్తుందంట. “అది చెవిలో పెట్టుకుంటే సముద్రం పాట వినబడుతుంది” అని చెప్పాఢు. నాకూ కావాలనిపించి నేనూ వాడితో అలలవైపు నడిచా. ఒకదాని తరవాత ఒకటి అలలు వస్తుంటే భయంగా వుంది. దానికన్నా శంఖంపై ఆశ కూడా ఎక్కువగా వుంది. ఇంకొంచెం లోపలికెళ్ళాం. అప్పుడే ఒకపెద్ద అల అలా వచ్చేస్తుంటే గణేశ్ కిందపడి పోతున్నాడు. నాకు అలకన్నా కింద పడబోతున్నవాడిని చూసి భయంతో జుట్టు గట్టిగా పట్టుకొని పెద్దగా అరుస్తా బలమంతా చేతుల్లోకి తెచ్చుకొని వెనక్కి లాగేసా. వాడు బరువే కాని ఎలా లాగేసానో నాకే తెలీలేదు. ఈలోపల అందరూ పరిగెత్తుకొని వచ్చేసారు. చిన్నసారు పరిగెత్తుకొనొచ్చి గణేశ్‌ను పట్టుకొని ఇసుకలోకి లాగారు. వాడు ఈలోపలే కొన్ని నీళ్ళు తాగేసాడు. అవి ఉప్పగా వున్నాయని అన్నీ ఊసేసాడు… కాసేపు అందరికీ భయమేసినా ఏంకాలేదు కాబట్టి మా భయం పోయింది. కాని గణేశ్ భయపడుతున్నాడు. వాడింకా పుట్టువెంట్రుకలు ఇవ్వలేదు అందుకే వాడి జుట్టు పొడుగ్గా వుండి నా చేతులకు గట్టిగా చిక్కుకుంది. అందరూ నన్ను మెచ్చుకున్నారు. తిరిగొచ్చేప్పుడు బస్‌లో గణేశ్ నాకు ధ్యాంక్స్ చెప్పి నీకు చాలా ధైర్యం కవితా అన్నాడు. “అదేం కాదురా నువ్వు నీళ్ళళ్ళోకి వెళ్ళిపోతే నేను ఇంటికెలా వెళ్ళాలి? నా రూపాయి నీ జేబులోనేగా దాచాను” అన్నా. “ఒకవేళ నీరూపాయి నా జేబులో లేకుండా వుంటే ఏం చేసేదానివి?” అనడిగాడు కొంచెం భయపడతా. ఏమోరా నాకేం తెలీదు రాత్రి వినాయకుడిని అడిగి చెప్తాలే అన్నా.
అదంతా మా వెనకసీటులో కూర్చోని విన్న సుధాకర్ సార్ “అరే పిల్లలూ ఎందుకైనా మంచిది మీరంతా మన కవిత దగ్గర అప్పు చేయండిరా, మీకే ప్రమాదమూ జరగదు” అని ఉదయం మరచిపోయిన నా ప్రార్థనాగీతం ఇప్పుడు పాడడం మొదలుపెట్టేసారు. ఇంక ఇలాకాదు, ముందు నేనీ ప్రార్థనాగీతాల బారినుండి తప్పించుకునేదాని గురించి ఆలోచించుకోవాలి.
తీరికగా ఆలోచించుకోడానికి మనకు తీరికెక్కడుంది? తొందరగా నిద్రలేచి ఆలస్యంగా పడుకున్నా ఆగిపోతున్నాయి కొన్ని పనులు. వాటిలో ముఖ్యమైంది నాన్నతో మాట్లాడ్డం. ఈ ట్యూషన్ నుంచి తప్పించే దారి ఆయనకే కదా తెలుసు. అదేదో మాట్లాడుదామంటే రాత్రి బాగా పొద్దుపోయి. నేను నిద్రపోయాక వస్తాడు. ఉదయం నేను ట్యూషన్ నుండి వచ్చాక బాధగా మొహం పెట్టుకొని అమ్మతో “అయ్యో! మన కవిత నాతో ఇదివరకులా గలగలా మాట్లాడకుందే! ఇది మన కవితేనా అని ఆశ్చర్యంగా అడగడం” – అందుకు అమ్మ చెట్టు నుండి చప్పుడే లేకుండా జలజలా పూలు రాలినట్లు ముసిముసి నవ్వులు రాల్చడం.
నన్ను మాట్లాడ్డానికి చాన్స్ ఇవ్వని మనుషుల మధ్యన చిక్కించేసి ఆ చిక్కులోంచి రాడానికి నేను అవస్ధలు పడుతుంటే, యిప్పుడు చూడు చక్కెరలొ అద్దిన అరటిపండులా తియ్యని మాటలు చెబుతున్నావా నాన్నా! కానివ్వు వినాయకుడికి చెప్పి నీ పని పట్టమంటాను. మూతి నల్లగా మారిన నన్ను చూసి ఇంకా నవ్వుకునేలోగా నా చేతిలో వున్న జామకాయ కొంచెం కొంచెం కొరుక్కుంటా బామ్మ దగ్గరకెళ్తా కుంపటి దగ్గర ఓ పక్కసెగ తగుల్తా, ఇంకోపక్క కమ్మటి వాసన్లు పీల్చుకుంటా. ముఖ్యంగా పూజయిపోయాక బామ్మ ఇచ్చే ప్రసాదంకోసం కూడా. మాఇంట్లో దేవుడికి రోజూ చక్కెరే ప్రసాదం. పూజ అయిపోయేలోపే దాని చుట్టూ చీమలూ చేరిపోతాయి. మనింట్లో దేవుడి ప్రసాదం మనం తినేదుందా లేదా! అని కొంచెం గట్టిగా అమ్మనడిగితే అవన్నీ రాత్రే వినాయకుడికి పెట్టి తింటున్నావు కదా! అని జవాబు. ఏం అడిగినా తిప్పితిప్పి అది నా దగ్గరే వదిలేయడమే కాని, బామ్మ రోజూ పండుతో పాటూ పాయసమో, పొంగలో, ఏదోఒకటి తియ్యగా చేసిపెడుతుందికదా! అలా చేయచ్చుకదా! అవి మాత్రం తెలియదు. అయినా బామ్మకి పూజ గదినిండా చాలా దేవుళ్ళు. మా అరుగుపై అంతమంది దేవుళ్ళు లేరులే. అందుకే ఈమధ్య సార్ వాళ్ళు చూడకుండా బామ్మఇంట్లో దేవుళ్ళందరికీ దణ్ణంపెట్టుకుంటున్నా, నా ప్రార్థనాగీతం సంగతి చూసుకోమని.
ఊర్నుండి అమ్మమ్మ బుడిగితో వస్తుందని రాత్రి అమ్మ చెప్పినప్పటినుండి అనితకు, నాకు నేల మీద కాలు నిలవడం లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఇంట్లోనుంచి గేటు వరకు బొంగరంలా తిరగడమే. ఆదివారం కదా మనకు అడ్డమొచ్చే బడి, ట్యూషను సెలవులో వున్నాయి. ఇక ఎవరూ ఏమీ చేయలేరు. “ఇదిగో మీ పుస్తకాలు, బొమ్మలూ జాగర్తగా పెట్టుకోండి. మళ్ళా బుడిగి అది చేసింది-బుడిగి ఇది చేసింది అంటూ మాటికి వంటింట్లో కొచ్చారంటే కాళ్ళు విరుగుతాయి” అపుడే అమ్మ వార్నింగ్ ఇవ్వడం మొదలయ్యింది. “ఎందుకమ్మా అలా అబద్దాలు చెప్తున్నావు, చెల్లి ఎక్కడైనా బొమ్మలు పాడు చేస్తుందా!” అన్నా అనితను చూస్తా. “ఊ… ఊ…” అంది అనిత. “సరే మీ చెల్లి మీ ఇష్టం” అంది అమ్మ.
నాన్న షరా మామూలే, ఈ ఆదివారం తీరికెక్కువలాగుంది. నెమ్మదిగా రెండు రకాల పేపర్లు చదువుకుంటున్నాడు. పక్కింటి బామ్మకు, సార్లకూ ఎపుడో చెప్పేసాం వాళ్ళు మేం కనిపిస్తే “చెల్లి ఎక్కడ?” అని అడుగుతున్నారు. పాలవాళ్ళ సైకిల్ బెల్లులు, కూరగాయలమ్మ కేకలూ, ఐస్ బండి పిలుపులూ, అన్నీ వచ్చి వెళుతున్నాయి. బామ్మ పాలు పోయించుకొని అవి కుంపటిపై కాచడమూ, ఆపై చల్లారడమూ అయ్యింది… మునక్కాయలూ, వంకాయలూ కలిపి పప్పు లోవేసి సాంబారు చేయడమూ అయిపోయింది. ఈలోగా బామ్మ పెట్టిన ప్రసాదం బుడిగికి దాచడం- కాసేపాగి తినేయడమూ అయ్యింది. అమ్మనడిగితే తిన్నగా సమాధానం రాదని వరండాలో నాన్న దగ్గరకెళ్ళాం. నాన్నకు పేపరు తప్ప మరో ధ్యాసలేదు.
వంటింట్లోంచి అమ్మవచ్చేసిన కాసేపటికి అమ్మమ్మ వాళ్ళొచ్చిన రిక్షా ఇంటిముందు ఆగింది. మాకన్నా ముందు అమ్మ అడుగులు స్పీడుగా వేసుకుంటూ వెళ్ళింది. ప్చ్… బుడిగి నిద్రపోతావుంది. అమ్మ బుడిగిని తీసుకొని పడుకోపెట్టి వచ్చింది. ఇక చేసేదేం లేక ఉషారుని ఉట్టెక్కించి ఉస్సూరుమని అమ్మమ్మ మాకోసం తెచ్చిన నిప్పట్లు తింటా చేరాం అనిత, నేనూ. ఏ పని చేస్తున్నా నిముషానికోమారు బుడిగి లేచిందో లేదో చూడడమే. అమ్మమ్మకు కబుర్లన్నీ అమ్మ తోనే. ఆఖరికి బొమ్మల పుస్తకం తెరిచి రంగు పెన్సిల్లతో రంగులు నింపుతుంటే అప్పుడు లేచింది బుడిగి. అడుగులేసుకుంటా వచ్చి మమ్మల్ని కొత్తగా చూస్తూ అమ్మమ్మ దగ్గరకెళ్ళింది. రింగురింగుల జుట్టు ఒత్తుగా భుజాలవరకు, నేరేడుపండ్లలా కనిపిస్తున్న కళ్ళతో చుట్టూ చూస్తూంది. బుడిగి అని పిలవగానే నవ్వింది. అమ్మమ్మ దగ్గరకి వెళ్ళి నిలబడ్డాం అమ్మమ్మ, “అక్క కదా పిలూ! అక్కా అని” అంది. “మాటలొచ్చా ఆశ్చర్యంగా అడిగాం”, “అబ్బో! అన్నీ చెప్పేస్తుంది” అంది అమ్మమ్మ. “ఏది అక్కా అని పిలువు” అన్నా. అసలే అంతంత కళ్ళు ఇంకా పెద్దవిగా చేసి చూసిందిగాని ఏమీ అనలా. “ఆడుకుందాంరా” అనిత పిలిచింది. అమ్మమ్మ ఒళ్ళోంచి దిగలా. “సరే అయితే మీరు వెళ్ళి ఆడుకోండి. బుడిగి కాసేపాగి వస్తుందిలే” అంది అమ్మమ్మ. మాకు వెళ్ళాలనిపించలేదు, అక్కడే నిలబడ్డాం. ఈలోగా నాన్న వచ్చారు బుడిగిని దగ్గరకు రమ్మని పిలిచారు. అమ్మమ్మ “నాన్న కదా వెళ్ళు” అంది. ఊహు… బుడిగి కదలనేలేదు. నాకు, అనితకు నవ్వొచ్చి నవ్వేసాం. నవ్వుతున్న మమ్మల్నిచూసి బుడిగి కూడా నవ్వింది. నాన్నకు వెనకాల నిలబడి ‘దా దా’ అని చేతులు చాపి కదుపుతూ పిలిచాం. నెమ్మదిగా అమ్మమ్మ ఒళ్ళోంచి లేచి మా దగ్గరకు అడుగులేసుకుంటా వస్తుంటే నాన్న రెండు చేతుల్తో బుడిగిని పట్టేసుకుని మా బుజ్జి బుడిగి ఎక్కడున్నావమ్మా ఇన్ని రోజులూ అంటూ ముద్దుపెట్టుకున్నారు. బుడిగికి నచ్చినట్లులేదు
ఏం మాట్లాడకుండా ఇష్టంలేదన్నట్లు నాన్నచేతుల్లోంచి వచ్చేసి మళ్ళీ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది. “సరే అయితే రండర్రా మనం వెళ్దాం బుడిగి రానంటూంది” అని నాన్న అంటే, “నేను పిలిస్తే వస్తుంది కద బుడిగీ” అంది అనిత. అది కాసేపు మమ్మల్నందరినీ చూసి ఏమనుకుందో మళ్ళీ అమ్మమ్మ చీరకుచ్చిళ్ళలో తలపెట్టేసుకుని రెండు చేతుల్తో అమ్మమ్మను పట్టేసుకుంది.
మళ్ళీ నేనూ, అనిత బొమ్మల పుస్తకంలో రంగులేసుకోను వెళ్ళిపోయాం. చిన్నపాప చేతిలో కుక్కపిల్లతో పూలతోట మధ్యలో నిలబడివున్న బొమ్మ అది. అందులో ఎన్ని రకాల పూలున్నాయో! అనిత పూలకు రంగులేస్తుంటే నేను పాప గౌనుకు వేస్తున్నా. అనిత బొమ్మకు రంగులు చక్కగా వేస్తుంది. కాసేపయ్యాక తలెత్తి చూస్తే బుడిగి మా పక్కనే కూర్చోని మేం చేసేపని ఆసక్తిగా చూస్తుంది. అసలెప్పుడొచ్చిందో మేం చూడనేలేదు. బాగుందా అని అనిత అడిగితే నవ్వి బొమ్మను చేతివేళ్ళతో తాకి మావైపు చూసింది. దా బొమ్మలు చూద్దాం అని నేనంటే దగ్గరకొచ్చి మాఇద్దరి మధ్యన కూర్చోని, నేను ఒక్కోబొమ్మను వేళ్ళతో చూపుతా దాని గురించి చెబుతుంటే వింటూ వున్నది.
“ఏంటమ్మా ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది అని ఇంట్లోకి తొంగిచూసిన బామ్మ ఆశ్చర్యంగా “ఇదేంటర్రా చిన్నది కూడా ఇంత చక్కగా అక్కలతో ఆడుకుంటుంది” అని, “దా దా” అని పిలిచారు. అంతే! బుడిగి లేచి బామ్మ దగ్గరకు వెళ్ళింది. బామ్మ చేయిపట్టుకొని వాళ్ళింట్లోకి కూడా వెళ్ళింది. మా దగ్గరికి రావడానికి ఊహూ అన్నచెల్లి బామ్మ వద్దకు మాత్రం ఏమాత్రం మారాం చేయక వెళ్ళిపోయింది. అమ్మమ్మతో వున్నది కదా! అమ్మమ్మ ఫ్రండ్ అనుకుందేమో! అన్నా అనితతో. అదింకా ఆశ్చర్యంలోనే వుంది నాకేం జవాబు చెబుతుంది?
బుడిగి ఏంచేస్తుందో చూసొద్దామా అన్నా అనితతో. తనకు అలాగేవుందేమో ఊ వెళ్దాం అంది కాని, ఇప్పుడక్కడ సార్ వాళ్ళుంటారు. మమ్మల్ని చూసారంటే ఏంటీ ఖాళీగా కనిపిస్తున్నారు. “అమరకోశం ఎంతవరకు వచ్చో ఓసారి చెప్పు?” అంటారు. అదయ్యాక ఎక్కాలు, ఆ తర్వాత ఇంకోటి ఇలా వాళ్ళు అడుగుతూనే వుంటారు. నేను చెబుతూనే వుండాలి. అందుకే ముందు వాకిలి వైపు వెళ్ళాలంటే అదే భయం. “ఇప్పుడు మధ్యాహ్నం కదా! వంటింటివైపు వాకిలి మూసివుంటుంది ఎలా? ఏమయితే అయిందిలే వెళ్దాం” అన్నా. ఆ మాట కోసమే చూస్తున్న అనిత నాకన్నా ముందు పరిగెత్తింది తూనీగలా. ఎంత గబగబ వెళ్ళినా గుమ్మం దగ్గర ఆగి నాకోసం చూస్తుంది. ఇద్దరం దగ్గరగా వేసివున్న తలుపులోంచి నెమ్మదిగా తలపెట్టి చూసాం. ఒక్కసెకను మాకేం అర్ధంకాలేదు. అక్కడ బుడిగి పెద్దసార్ వీపుమీద పడుకొని ఊయలూగుతుంటే చిన్నసార్ దానికి అరటిపండు తినిపిస్తున్నాడు. పక్కనే వున్నబామ్మ దేవుడిపాట పాడుతూ ఒత్తులు చేసుకుంటూంది.
మమ్మల్నిచూసి “రండి రండి అక్కల్లారా!” అని పిలిచాడు చిన్నసారు. నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికెళ్ళి బామ్మపక్కన నిలబడ్డాం. “చెల్లి పేరేంటి?” అనడిగారు పెద్దసారు. ‘బుడిగి’ అని చెప్పింది అనిత, మరలా అదే “కాదు సరిత” అని చెప్పింది. “బుడిగి అనే పిలుద్దాం అదే బాగుందికదా” అన్నారు పెద్దసారు. “అవును ఆ పేరు పెట్టింది అక్క” అంది అనిత భుజాలెగరేస్తా.
“అవునా!! భలేవుంది కవితా, వెరీనైస్” అన్నారు పెద్దసారు. “అమ్మో కవితకు పేర్లు పెట్టడం బాగా వచ్చే” అన్నారు చిన్నసారు.
నాకయితే రెండు విషయాల్లో సంతోషంగా వున్నదో! మొదటిసారి పెద్దసార్ నన్ను వెరీగుడ్ అన్నారు. మొదటిసారి నేను చేసిన పెద్దపని బుడిగికి పేరుపెట్టడం. అది అందరితో పాటూ సార్ వాళ్ళు కూడా మెచ్చుకుంటుంటే బామ్మచేసిన బెల్లపొంగలి మొత్తం నేనే తినేసినంత ఆనందంగా వుంది. అక్కడ బుడిగి మమ్మల్ని మొదటిసారి అక్క అని పిలిచింది. అనితకూ, నాకూ నవ్వులూ, దాంతోపాటూ గంతులూనూ. ఆరోజు మాకు తెలీకుండానే అప్పటివరకు సార్ వాళ్ళంటే మాకిద్దరికీ వున్న భయం కొంచెం పోయినట్లే. చప్పుడే వుండని సార్ వాళ్ళింట్లో చప్పుడు లేకుండా వెళ్ళి ఎంత సందడి చేసేశామో ఆరోజు. అదంతా మా బుడిగి వల్లే.
(ఇంకా ఉంది)