దాతా పీర్-6

0
3

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[చిన్నప్పుడే తల్లి చనిపోతే, తండ్రీ, విధవరాలైన పిన్నీ పెంచి పెద్ద చేస్తారు సాబిర్‍ని. సాబిర్ తండ్రి అలీ బక్ష్ పెళ్లిళ్లప్పుడు షెహ్నాయి వాయించేవాడు. నూర్ బఖ్ష్ గారి శిష్యుడు. ఒకసారి రేడియోలో షెహ్నాయి వాయించే అవకాశం రావడంతో గురువుగారి కీర్తిప్రతిష్ఠలు పెరిగిపోతాయి. అలీ బఖ్ష్ గురువుగారి వెంటే ఉంటూ ఆయన ఎంత డబ్బిస్తే, దానితోనే తృప్తిగా చెందేవాడు. ఆయన చనిపోయాకనే అలీ బఖ్ష్‌కు సమస్యలు వస్తాయి. నూర్ బక్ష్ గారి కూతురు మదీహా బానో అలీ బఖ్ష్‌ను ఇష్టపడుతుంది. తండ్రి చనిపోయాక, కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా, ఎవరికీ చెప్పకుండా అలీ బఖ్ష్‌ను పెళ్ళి చేసుకుంటుంది. ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొడతారు. నూర్ బఖ్ష్ గారి మరణం తరువాత అలీ బఖ్ష్‌కు షెహ్నాయి వాయించే అవకాశాలు రావు. భార్యభర్తలిద్దరూ బీడీలు చుట్టే పనిలో చేరతారు. సాబిర్‍ని ప్రసవించి మదీహా చనిపోతుంది. ఆ సమయంలో సాబిర్ పిన్ని, వితంతువు, బిల్కీస్ బానో – వాళ్ళను ఆదుకుంటుంది. బిల్కీస్ బానో, సాబిర్ వాళ్ళమ్మకు సొంత అక్క కాదు, దూరపు బంధువు. ఆమె తన ఇంటిని అద్దెకిచ్చేసి, ఉన్న కాస్త సామాన్లతో అలీ బఖ్ష్‌ ఇంటికి వచ్చేసి బిడ్డను సాకుతుంది. ఎనిమిదేళ్ళు కలిసున్నాకా, అలీ బఖ్ష్‌ చనిపోతాడు. తిరిగి తన పాత గదికి వెళ్దామని చూస్తే, అద్దెకున్నతను దాన్ని ఆక్రమించేసి ఉంటాడు. ఎవరూ ఆమె గోడు పట్టించుకోరు. చివరికి ఆమె అక్కడికి దగ్గరలోనే ఓ వీధిలో గది అద్దెకు తీసుకుని శకూర్ మియ్యా బేకరీలో పనిచేస్తూ, సాబిర్‍ని పెంచింది. రసీదన్‍ – బిల్కీస్ బానోకు పూచికత్తుగా ఉంది. పనికి వెళ్ళేటప్పుడు బిల్కీస్ సాబిర్‍ని రసీదన్ దగ్గరే వదిలి వెళ్ళేది. అలా సాబిర్‍కీ, ఫజ్లూకీ స్నేహం ఏర్పడుతుంది. కొన్నేళ్ళ తర్వాత సాబిర్, సత్తార్ మియ్యా శిష్యరికం చేస్తూ, బిల్కీస్‌కు దూరమవుతాడు. ఆమెతో గొడవ పెట్టుకుంటాడు. ఓ రోజు ఉన్నట్టుంది బిల్కీస్ మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. కొన్ని రోజులు పోయాకా, సాబిర్‍కు ఆమె విలువ తెలిసొస్తుంది. క్రమంగా వ్యసనాలకు బానిసవుతాడు. తండ్రిని, పిన్నిని గుర్తుచేసుకుని తన పతనానికి బాధపడతాడు. మావయ్యల దగ్గరకు వెళ్ళి కనీసం తన కన్నతల్లి ఫొటో అయినా తెచ్చుకోవాలనుకుంటాడు. సత్తార్ మియ్యాతో సంబంధాలు తెంచుకుని, అమీనాను పెళ్ళి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు సాబిర్. పీర్ ముహానీ నుంచీ వెళ్ళిపోవాలని చాలాసార్లు అనుకున్నా, ఫజ్లూ స్నేహం, అమీనా ప్రేమా, వాళ్ళమ్మ రసీదన్ అమ్మతనం కూడా అతన్ని ఆపేవి. – ఇక చదవండి.]

అధ్యాయం-6

[dropcap]సా[/dropcap]బిర్ ఉన్నట్టుండి నిద్ర నుండి లేచాడు. నిద్రలో తన గొంతు తానే విని, షాకు తగిలినట్టై లేచాడు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూన్న శబ్దం మరి!

రాత్రి ఇంకా గడవనేలేదు. ఫజ్లూ గదిలో అతనితో కలిసి నిద్రపోయాడు. మందు మత్తు కాస్త ఎక్కువయింది. అందుకే తన గదికి వెళ్ళలేక పొయ్యాడు. ఇదివాళ కొత్తగా జరిగిందేమీ కాదు. అప్పుడప్పుడూ అయ్యేదే!! తన పక్కలో ఫజ్లూ నిద్రలో ఒళ్ళు మరచిపోయి, గుర్రుపెడుతూ!! చలికాలపు రాత్రిలోనూ సాబిర్ ఒళ్ళు చెమటతో తడిసి పోయింది.

చిత్రమైన కలగన్నాడు సాబిర్. నిద్రలో పెద్ద పెట్టున ఏడుపు. కొంత సేపు ఏమీ అర్థం కాక, అలా కూర్చునే ఉన్నాడు. మర మిషన్‌లా ఊపిరి గబగబా కొట్టుకుంటూ ఉంది. దాన్ని నియంత్రించే ప్రయత్నంలో సాబిర్. కానీ చేత కావటం లేదు. గొంతు ఎండిపోతూ ఉంది. కిటికీ దగ్గర పెట్టిన కూజా మూతి నోటి దగ్గర పెట్టుకున్నాడు. అందులో నీళ్ళు కొంచెమే ఉన్నాయి. దప్పిక తీరలేదు కానీ, ఆ కాస్త నీళ్ళు తాగేసరికి ప్రాణం కుదుట పడింది.

నిద్రలో ఎవరో తననుంచీ ఏదో లాక్కుంటున్నారు. గోరింటాకు వేసుకున్న తల వెంట్రుకలు, గడ్డం మనిషి ఎవరు? సత్తార్ మియ్యా నేనా? లేదా భూలోటన్ గోపా? వెంట్రుకలైతే సత్తార్ మియ్యా లాంటివే, కానీ నలుపు కాదు, ఎర్ర రంగువి. మీసాలు భూలోటన్ కున్నటువంటివే, కానీ తెల్లగా లేవు. పెద్ద మామయ్యవా ఏంటి? కానీ తానిప్పటివరకూ పెద్ద మామయ్యను దగ్గరినుంచీ చూసిందే లేదు. మరి ఇంకెవరు తన చేతుల్లోనుంచీ అలా..? అసలు తన చేతుల్లో ఏముంది? గుర్తుచేసుకో ప్రయత్నించాడు సాబిర్. చేతుల్లో ఉన్న వస్తువు, మసక మసగ్గా గుర్తుకు వచ్చింది. ఆ.. అదే మఖ్మల్ సంచీ.. అందులోనే నాన్న తన షెహ్నాయి ఉంచుకునేవాడు. ఆ మనిషి తన చేతుల్లోనుంచీ ఆ షెహ్నాయిని లాక్కునేందుకు చూస్తున్నాడు. గుండెల దగ్గరగా దాన్ని అదిమి పట్టుకుని, తాను దాన్ని లాక్కోకుండా అడ్డుకుంటున్నాడు. ఏడుస్తున్నాడు. సాబిర్ స్పృహ కోల్పోయాడు.

గది తలుపులు తెరుచుకుని నిస్సత్తువగా సాబిర్ బైటికొచ్చాడు. గది తలుపు మూయటం కూడా మర్చిపోయాడు. కబ్రిస్తాన్ నుంచీ నాలుగో వీధిలోకి వెళ్ళటానికి మధ్య దూరం కనీసం యాభై అడుగులు కూడా లేదు. సాబిర్ వీధిలోకి వెళ్ళాడు. మూడో అంతస్తులో తానుండే గది ఉన్న ఇంటిముందు నిల్చున్నాడు. వీధిలో వాళ్ళెంత కాదన్నా, ఆ ఇంటి ముసలావిడ తనను ఖాళీ చేయించలేదు పాపం. బిల్కీస్ బానో యీ గదిలోనే సాబిర్‌తో పాటూ ఉంటుండేది. భూలోటన్ వంకర చూపులు చూస్తున్నా, రసీదన్ తమకు అండగా నిలబడటం వల్లే యీ గది అద్దెకు దొరికింది అప్పుడు!! ఇప్పుడు పీర్ ముహానీలో ముస్లిం జనాభా తగ్గిపోయింది. సాబిర్ యీ గదిలోనే ఉండటం అసాధ్యమే! బిల్కీస్ బానో, రసీదన్‌తో తనకున్న స్నేహం వల్లే ముసలావిడ ఎవరి మాటా వినకుండా ఉంది.

లోపల్నించీ ముసలావిడ గొంతు. ‘ఎవరది?’

‘నానమ్మా, నేను సాబిర్‌ని.’

సాబిర్ గొంతు విని గొణుక్కుంటూ వచ్చి, కొంగుకు ముడేసుకుని ఉన్న తాళాలతో గేటు తెరిచింది, తిట్లు తిడుతూ!! అవేవీ పట్టించుకోవటంలేదతను. తనకిదంతా మామూలే!! గేట్ తెరుచుకోగానే సంధించిన బాణంలా సాబిర్ తొందరగా మెట్లెక్కుతూ పైకి చేరుకున్నాడు.

గొణుక్కుంటూ ముసలావిడ మళ్ళీ గేటుకు తాళం వేసి, కుంటుకుంటూ మెట్లెక్కి, సాబిర్ గది దగ్గరికి వచ్చింది ఆయాసపడుతూ!! సాబిర్ గదింకా తెరిచే ఉంది. ఆమె అక్కడికి వచ్చిన సంగతే గమనించలేదు సాబిర్. బిల్కీస్ బానో ట్రంకు పెట్టె తెరిచి, అందులో ఉన్న వస్తువులన్నీ బైటికి వేసేస్తున్నాడు, చిందర వందరగా!! ముసలావిడ ఏమీ మాట్లాడలేక చూస్తూ ఉందిదంతా!! పెట్టంతా వెదికుతున్నాడు సాబిర్. ఆఖరికి దొరికింది ముఖ్మల్ సంచీ. అందులోనే నాన్న షెహ్నాయి ఉంది. దాన్ని బైటికి తీసి, గుండెలకు అదుముకుని, వెక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలెట్టాడు సాబిర్. పిచ్చివాడిలాగా షెహ్నాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు. గుండెలకు హత్తుకుంటున్నాడు. ముసలావిడ కాసేపు ఊరుకుంది. తరువాత సాబిర్ దగ్గరికి వచ్చి, మోకాళ్ళ బలమ్మీద కూర్చుంది. సాబిర్ ఆమె ఒళ్ళో ముఖముంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆమెకసలేమీ అర్థం కాలేదు. కానీ తన జీవితానుభవాల వల్ల కాస్త అర్థమైంది, సాబిర్‌కు ఏదో మనసులో పెద్ద బాధే ఉంది లేదా పెద్ద దెబ్బేదో తగిలింది. ఆమేమీ మాట్లాడకుండా, అతని వీపు మీద మృదువుగా రాస్తూ, తల వెంట్రుకలను ఆప్యాయంగా సవరిస్తూ ఉండిపోయింది.

***

తళుకులీనే ఉదయం. తెల్లని మల్లెపూవు లాంటి ఉదయం. పొగ మంచూ లేదు. దవడలు వణికించే చలీ లేదు. చిరు గాలి మాత్రమే, లేలేత ఎండల దుప్పటి కప్పుకుని, మెల్ల మెల్లగా!!

సాబిర్ గదిలో ఎండ పిట్టలు హుషారుగా ఎగురుతున్నాయి. గది తలుపుల సందుల్లోంచీ, ఉన్న ఒకే ఒక్క కిటికీలోంచీ, లోపలికి వచ్చి గొడవ గొడవ చేసేస్తూ ఉన్నాయి, మఖ్మల్ సంచీ మీదికొకసారి, షెహ్నాయి మీదొకసారి వాలిపోతూ!! గది నేల మీద తలానించి ఒళ్ళెరక్కుండా పడుకుని ఉన్న సాబిర్ ముఖమ్మీద కూచుని తమ రెక్కలతో అతనికి సేద తీరుస్తూ ఉన్న యీ వెలుగు పిట్టలతో అతని గదంతా పుష్పోద్యానంగా కనిపిస్తూ ఉంది. సాబిర్ మాత్రం, గాఢ నిద్రలో ఉన్నాడు.

ఇల్లుగలావిడ వెళ్ళిపోయిందెప్పుడో!! వెక్కి వెక్కి ఏడుస్తూ అలసి సొలసి తన ఒళ్ళోనే నిద్రపోయిన సాబిర్ తలను నెమ్మదిగా నేలమీద పెట్టి, ముసలావిడ బైటికి వెళ్ళిపోయింది. లేత ఎండ కాస్తా, చురుకు చురుకుగా మారేసరికి సాబిర్ అటు పక్కకు ఒత్తిగిల్లాడు. పక్కనున షెహ్నాయి తలకు తగిలింది. సాబిర్‌కు మెలుకువొచ్చింది. కళ్ళు నులుముకుంటూ నలువైపులా చూశాడతను. దగ్గర పడున్న మఖ్మల్ సంచీ, షెహ్నాయీనీ చెల్లా చెదురుగా పడున్న బిల్కీస్ సామానునూ చూస్తూ కూచున్నాడు కాసేపు! రాత్రి కల తరువాత, తానిక్కడికి వచ్చిన తరువాత జరిగిన సంగతులన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇల్లు అనే పేరుతో యీ అద్దె గది మాత్రముంది తనకు! కానీ యీ గదికి తనకీ ఏమీ అనుబంధం లేదు. ముప్ఫై ఏళ్ళ వయసొచ్చింది, కానీ ఇప్పటికే జీవితమంతా అయిపోయినట్టే అనిపిస్తుంది సాబిర్‌కు!! అంతా గందరగోళం!! ఒక కలను కూడా సరిగ్గా తీర్చుకోలేకపోయాడు తను. ప్చ్!

ఈ వయసులో ఏదో దాహం గొన్న ప్రేతాత్మలా యీ కల తన వెంట పడిందేమిటి? అప్పుడప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. ఏడుపు వల్ల ఒరిగేదేమీ లేదని తెలిసొచ్చిన తరువాత కూడా, బిల్కీస్ పిన్నీ, నాన్నల రూపాలు నీడల్లా వెంట తిరుగుతూనే ఉన్నాయి. అమ్మను చూడకపోయినా, ఆమె రూపాన్ని తనకుతానే మనసులో రూపొందించుకున్నాడతను, యధాతథంగా, స్పష్టంగా కాకపోయినా, ఒక లాంటి రూపాన్ని!! అమ్మ రూపం చిత్రంగా ఉంది. ఉదాసీనమైన ముఖం. కళ్ళలో అశాంతి. తన చిన్నప్పటి స్నేహితుడు నోమాన్ కూడా గుర్తుకు వస్తున్నాడీమధ్య!! సందు మొదట్లో, ఇనుప గేట్ ఉండే పెద్దిల్లు వాళ్ళది. నోమాన్ వాళ్ళమ్మ అప్పుడప్పుడూ, పుల్లని రొట్టెలు (ఈస్ట్ రొట్టెలు) తెచ్చిచ్చేది. నోమాన్ కన్నా ఆ రొట్టెలే ఎక్కువ గుర్తుకు వస్తుంటాయి సాబిర్‌కు!! నోమాన్ను కలుసుకోవచ్చు. సుల్తాన్‌గంజ్ లోనే ఉంటాడిప్పుడు కూడా!! అప్పుడు తాముంటూ ఉండిన ఇల్లు వాళ్ళదే! కానీ ఇన్ని సంవత్సరాలూ తాను ఎందుకు మర్చిపోయాడు? మళ్ళీ వెళ్ళాలి, అతన్ని కలవటానికి! అతనికి గుర్తు రాకపోతే తనే అప్పటి సంగతులు గుర్తు చేస్తాడు, గంగ ఒడ్డున ఇసుకలో పిట్టో ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళమని!! అల్లర్లు జరిగేటప్పుడు భయం భయంగా ఇంట్లో దాక్కుని ఉండేవాళ్ళమనీ, కర్ఫ్యూ తొలగించినప్పుడు బైటికి పరుగు!! ఎన్నెన్ని జ్ఞాపకాలు?? ముగిసేవే కావసలు!! వాళ్ళమ్మ ఇంకా ఉంటే, తనకు పుల్లటి రొట్టెలు పెడుతుందేమో!! నోమాన్ కలిస్తే తన మామయ్యల గురించి అడగాలి తప్పక! అతనితో పాటూ అమ్మ పుట్టింటికి వెళ్ళాలి.

సాబిర్ లేచాడు. చాయ్ కోసం నాలుక పీకింది. రాధే కొట్టుకు వెళ్ళాలనిపించటమే లేదు. కానీ, మనసును చంపుకుని, తన దినచర్య ప్రకారం నడుచుకోవాలనుకున్నాడు. రాత్రి మందు మత్తు, ఒంట్లోనుండీ వచ్చే కంపూ – తెగ చికాకు పెట్టేస్తూ ఉన్నాయి.

స్నానమదీ కానిచ్చి, ముసలావిడ కళ్ళల్లో పడకుండా తప్పించుకుని బైట పడ్డాడు సాబిర్. ఖమీరీ రొట్టెల రుచి అతని నోరూరిస్తూందిప్పుడు!! నోమాన్ వాళ్ళ ఇంట్లోని రొట్టెలు! షకూర్ మియ్యా బేకరీ నుండీ బిల్కీస్ పిన్ని తెచ్చి తినిపిస్తూ ఉండిన ఖమీరీ మిఠాయిలు!! సందు మొదట్లోకి వెళ్ళేసరికి దూరంగా అమీనా ఉందక్కడ, అటువైపుకి తిరిగి, ఆమె వీపు సాబిర్ వైపుంది. నారింజ రంగు సల్వార్, ఆకుపచ్చ కుర్తీ వేసుకునుంది. నల్లని పొడుగైన వెంట్రుకలు నడుముదాకా!! అమీనాను గట్టిగా పిలిచి, సైగచేసి ఇటు రమ్మన్నాడు సాబిర్.

అమీనా వచ్చింది. ముందైతే కళ్ళు విప్పార్చుకుని తననే చూస్తూ ఉన్నాడు. దగ్గరికొచ్చాక, ‘పద నాతో!’ అన్నాడు.

‘ఎక్కడికి?’ అడిగింది అమీనా.

‘అడక్కుండా రాలేవా?’

సాబిర్ ఇలా అనగానే ఏమీ మాట్లాడలేకపోయింది అమీనా. తరువాతంది. ‘నరకానికైనా వస్తాను నీతో! అర్థమైందా?? కానీ ఇప్పుడు ఇంటిపనంతా అలాగే ఉంది. చున్నీ ఇటుపుల్ల అటు పెట్టదు. అన్ని పనులూ నేనే చేసుకోవాలికదా!!’

‘నాలుగు రోజులు వదిలెయ్ అమీనా! అన్నీ అవంతటవే అవుతాయి. పద ఇప్పుడే, నాతో!!’ సాబిర్‌కు ఓపిక తగ్గిపోతూంది.

‘అన్నీ చూశాను. ఏమీ మారదు. చివరికి అన్ని పనులూ అమ్మ నెత్తిమీదే పడతాయి. ఆమెకే మాత్రం శక్తి లేదు, ఇంటిపనంతా చేసుకోవటానికి! అందుకే నాకిష్టముండదు.’ బాధ్యత గల ఇల్లాలిలాగా అమీనా మాట్లాడుతూ ఉంది. కానీ సాబిర్ ఖమీరీ రొట్టెల రుచి, సువాసనల మత్తులోనే ఉన్నాడింకా!!

‘సరే, ఇప్పుడు రా నాతో! తొందరగా వచ్చేద్దాం.’

‘పిచ్చి పట్టిందా నీకు?’ అమీనా ఆశ్చర్యపోయింది.

‘ఔను..’ అమీనా చెయ్యి పట్టుకున్నాడు సాబిర్.

ఇద్దరూ వీధి కుడివైపుకు తిరిగారు. రోడ్డు దాటి, ఎదురు సందులోకి వెళ్ళారు. ఈ సందు బరీ రోడ్డుతో కలుస్తుంది. బారీ సాహబ్ పేరుమీదున్న మసీదు గోరీల గడ్డకు దక్షిణం వైపుంది. బారీ రోడ్డుకటువైపు చాలా సందులున్నాయి. అన్నీ సబ్జీ బాగ్‌లో కలుస్తాయి.

***

సబ్జీ బాగ్ ఇప్పుడు పేరుకు మాత్రమే! అప్పుడెప్పుడో కూరగాయలమ్మేవాళ్ళేమో! ఇప్పుడైతే పళ్ళూ, మేవా, వేరే సామానులకు ప్రసిద్ధి. కూరగాయల దుకాణాలు నాలుగైదున్నాయంతే!! క్రోషా పనులు చేసేవాళ్ళు, బట్టల మీద అద్దాలు అవీ కుట్టేవాళ్ళూ, దర్జీల దుకాణాలే ఎక్కువ. పెళ్ళిళ్ళ సీజన్‌లో ఒకటే రద్దీ. ఇద్దరు టైపింగ్ చేసే గుమాస్తాలు కూడా కూర్చుని ఉన్నారక్కడ!! కానీ ఎవరూ రావటమే లేదు. లావుపాటి కళ్ళద్దాలు తొడుకున్నవాళ్ళిద్దరూ, ఎవరైనా వస్తారా పనిచేయించుకునేందుకు అని ఎదురుచూస్తున్నారు, ఆశగా!! ఈ కంప్యూటర్ టైపింగ్ వచ్చిన తర్వాత వీళ్ళ వ్యాపారం నడుం విరిగిపోయింది. వీళ్ళ దుకాణల మీద ఎందరికళ్ళో పడ్డాయి. వీళ్ళెప్పుడు చచ్చిపోతారా అని కాచుకుని కూర్చున్నారంతా!! వీళ్ళు చనిపోవటం తరువాయి, వీళ్ళ పిల్లలు యీ దుకాణాలమ్మేసి, వేరే చోట వేరే వ్యాపారాలు పెట్టుకుంటారు, ఖచ్చితంగా!! సబ్జీ బాగ్ నుంచీ లంగర్ టోలీకి వెళ్ళే దారిలోనే చిక్‌పట్టీ ఉంది. దారిలో ఎన్నో బేకరీలు, వాటిలోనే, రకరకాల బిస్కెట్లూ, ఖమీరీ రోటీలూ తయారు చేస్తారు. బేకరీల్లోనుండీ వచ్చే తియ్యని వాసన, మేక మాంసం వాసనతో కలిసి, వచ్చీపోయేవాళ్ళ ముక్కులకు తగులుతూ ఉంటుంది.

లంగర్ టోలీకి వెళ్ళే దారి మొదలయ్యే దగ్గరే, మూడు రోడ్ల కూడలి. అక్కడే యకూఫ్ మియ్యా చాయ్ దుకాణముంది. అక్కడ గులాబీ రంగులో ఉండే కాశ్మీర్ చాయ్ దొరుకుతుంది. సబ్జీ బాగ్ వాళ్ళంతా దీన్ని శీర్ చాయ్ అంటుంటారు. అంతే కాదు యీయన్ను యకూఫ్ మియ్యా అని పిలిచేదానికి బదులు, బేవకూఫ్ మియ్యా అని పిలుస్తూ ఉంటారు. ఇంక వయసులో ఉన్నవాళ్ళు బేవకూఫ్ చాచా అని ఆట పట్టిస్తూ ఉంటారు. ఈయనేమో వాళ్ళ తరతరాల చరిత్ర చదువుతూ, వాళ్ళ చేత మాటల్లో పెట్టి చాయ్ తాగిస్తూ ఉంటాడు. పళ్ళ దుకాణాల మధ్య నుంచి ఒక ఇరుకు సందు. కాస్త ముందుకు వెళ్తే, విశాలమౌతుంది. ఇక్కడే సాహిత్య పుస్తకాలమ్మే మూడు షాపులుండేవి. వీటీలో ఒకటి పెద్దాయన మిర్జా తౌఫీక్‌ది. పీర్ ముహానీలో మూడో వీధిలో మొట్ట మొదటినుంచీ ఉంటూ ఉండేవాళ్ళు. బాబ్రీ మసీదు అల్లర్ల తరువాత అక్కడి ఇల్లమ్మి, సబ్జీ బాగ్‌లో ఉంటున్నారు. ఈ పుస్తకాల షాపుల ముందు కాస్త ఖాళీ స్థలముండేది. అటువైపు, రహమానియా హోటల్, కవులూ, పత్రికా విలేఖరుల అడ్డా. సబ్జీ బాగ్ సందుగొందుల్లోని జీవితాల తీరే వేరు. సరిగా నడవలేకపోతే ఒకరి మోకాళ్ళు ఇంకొకరికి తగిలి కిందపడేంత ఇరుకు ఇళ్ళూ, సందులూ! అక్కడున్న నిర్మాణాలవన్నీ అంటు గోడలు. చిన్న చిన్న అటకలు. కొన్ని ఇళ్ళైతే మరీ దగ్గర దగ్గరగా!! ఒక ఇంట్లో సాలన్ తయారౌతూ ఉందంటే, అక్కడున్న వేరే ఇళ్ళలోని వాళ్ళందరికీ ఆ వాసనతో తెలిసిపోతుంది. గుసగుసలూ, కళ్ళ సైగలూ – ఏవీ పనిచేయవు. ఈ సందుల్లోని ఇళ్ళల్లో, ప్రేమలూ, వ్యభిచారాలూ – ఏమీ జరగకపోయినా కథలు కథలుగా ప్రచారమైపోతూ ఉంటాయి.

తెల్లవారగానే సబ్జీబాగ్‌లో సందడి మొదలైపోతుంది. రాత్రి పొద్దు పోయేదాకా సందడే సందడి. ఇక్కడ తిక్క కాస్త ఎక్కువున్న వాళ్ళే అధికం, కాబట్టి ఇష్టమున్నా లేకున్నా ప్రతిరోజూ ఏదో ఒక గొడవ ఉండనే ఉంటుంది. మహాత్మా గాంధీ పట్ల అంతులేని గౌరవంతో స్వతంత్ర సమరంలో పాల్గొన్న అబ్దుల్ బారీ సమాధి దగ్గరే రాత్రి చున్నీకి బబ్లూ తన మొబైల్‌లో నీలి చిత్రాలు చూపిస్తూ ఉంటాడు. ఇక ఆయన ఒక్కగానొక్క కొడుకు, నిజంగానే పిచ్చివాడు. ఈ సబ్జీ బాగ్ లోనే తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా ఏమైనా ఇస్తే తింటాడు. బట్టలు వేస్తే బుద్ధిగా వేయించుకుంటాడు. తన తండ్రి పేరు విన్నాడంటే మాత్రం, పైజామా నాడాలు విప్పేసి, నడి బజారులో, అందరి ముందూ, ఒంటేలు పోసుకుంటాడు కూడా!! అలా సబ్జీబాగ్‌లో కామెడీ, ట్రాజెడీ – రెండూ ఒకేసారి ప్రదర్శింపబడుతుంటాయి.

సాబిర్, అమీనా సబ్జీ బాగ్ చేరుకునే వేళకు ఎండ మిడిసిపడుతూ ఉంది. ఐనా సరే, జీవితం, పూర్తి స్థాయిలో పరిగెడుతూ ఉంది.

ముందు యకూఫ్ మియ్యా దుకాణం దగ్గర ఆగారిద్దరూ! బట్ట తల మీద తెల్లని క్రోషియాతో అల్లిన టోపీ. చేతుల్లేని తెల్ల కుర్తా. గళ్ళ లుంగీ. వీటన్నిటితో, యకూఫ్ మియ్యా నేరేడు రంగు ముఖంలో మెరిసిపోతున్నాడు. సుర్మా పెట్టుకున్నచురుకైన అతని కళ్ళలో ఎప్పటిలాగే ఏవేవో సంకేతాలు!! యకూఫ్ మియ్యా వయసులో ఉన్న మగపిల్లలను ముందు తన కళ్ళతోనే పరీక్షిస్తాడు. ఆ తర్వాతే, చాయ్ కప్పు చేతికిస్తాడు. వాళ్ళిచ్చే డబ్బు గురించి అంతగా పట్టించుకోడు. తననేమని వాళ్ళు పిలుస్తారో అదీ ముఖ్యమతనికి! చాయ్ కప్పు ఇచ్చే ముందు సాబిర్‌ను పట్టి పట్టి చూశాడతను. తరువాత అమీనా మీద పడ్డాయతని కళ్ళు.

‘నీ పెళ్ళామా?’అడిగాడు సాబిర్‌ను.

‘లేదు, నానమ్మ.’ చిరాకుగా నోట్లో ముందే మందుగుండు పెట్టుకుని వున్నట్టే అన్నాడు సాబిర్. అక్కడున్న వాళ్ళంతా భళ్ళున నవ్వారు.

యకూఫ్ మియ్యా కసురుతూ అన్నాడు, ‘చాయ్ కప్పక్కడ పెట్టి, వెళ్ళిపో ఇప్పుడే!! నీది నోరా లేక తేలు కొండా??’

‘ఈ అమ్మాయి నాకేమౌతుందో నీకెందుకు మామా? అందరూ ఒకేలా ఉండరు తెలుసా? పిచ్చి ప్రశ్నలేస్తే, ఎవడికైనా తిక్క రేగుతుంది కదా?’

అక్కడున్న వాళ్ళంతా తమాషా చూస్తున్నారు. యకూఫ్ మియ్యా బిక్క చచ్చి చూస్తున్నాడు ఇద్దరి వైపూ! అమీనా సాబిర్ ఇద్దరూ, గబ గబా చాయ్ తాగి, కప్పులక్కడ పెట్టేశారు. డబ్బులిచ్చేసి, లంగర్ టోలీ రోడ్డులో ముందుకు అడుగులేశారు. వాళ్ళటు వెళ్ళగానే ఎవరో అన్నారు గుంపులోంచీ, ‘నిజంగానే ఇలాంటి మతిలేని పనులే చేస్తుంటావ్ మామా? వాళ్ళు ఒకరికొకరేమౌతారు, భార్యా భర్తానేనా ఇలాంటివి నీకెందుకు చెప్పు? కాలం మారిపోయింది. కాస్త ఆలోచించి మాట్లాడు.’

యకూఫ్ మియ్యా నోటికి మూత పడింది.

అమీనాను తీసుకుని, సాబిర్ శకూర్ మియ్యా బేకరీ దగ్గరికి చేరుకున్నాడు. అతనికి బిల్కీస్ పిన్ని గుర్తుకొచ్చింది. ఖమిరీ రోటీలు గుర్తుకు వచ్చాయి. కేకులూ తయారుచేసే ప్రాంతం వెనుక, షాపు ముందూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల కిందట శకూర్ మియ్యా చనిపోయాడు. ఆయన కొడుకు గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఉన్నాడు. ఇప్పుడిప్పుడే భట్టీ నుండీ తయారై బైటికివచ్చిన రోటీల సువాసన చుట్టూతా వ్యాపించింది. రోటీలు కొనుక్కుంటూ ఉంటే, సాబిర్‌కు అనిపించింది, ఇప్పుడు పిన్ని షాపులోనుంచీ బైటికి వస్తుందని! మాటిమాటికీ అతని కళ్ళు తలుపు దగ్గరే అతుక్కుని ఉండి పోతున్నాయి. దానికి అటువైపు, రోటీలు తయారుచేసే చోటుంది. ఎవరినీ లెక్క చేయకుండా గభాలున లోపలికి వెళ్ళిపోయి, అక్కడ దాక్కుని కూర్చుని ఉన్న పిన్ని కాళ్ళను చుట్టేసుకుని మోకాళ్ళ మీద కూర్చుని వేడుకోవాలనీ, ఇంటికి తీసుకుని వెళ్ళాలనీ అనిపించింది సాబిర్‌కు! తనకు స్పృహ తప్పుతుందేమో, ఇక్కడే యీ దుకాణంలోనే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది కూడా!! వెంటనే డబ్బు చెల్లించి బైటికొచ్చేశాడు సాబిర్.

అమీనా షాపు బైట నిల్చుని ఉంది. శకూర్ మియ్యా బేకరీ ముందే నాజ్ హోటలుంది. మేక మాంసంతో సాలన్ తయారు చేయడంలో దానికి సాటి లేరెవరూ! పొద్దున్నుంచీ రాత్రివరకూ పొయ్యి ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది. ఇద్దరూ నాజ్ హోటల్లోకి దూరారు. శోర్బా మటన్, ఒక ప్లేట్ ఖమీరీ రోటీలను శోరబాలో ముంచుకుని తిన్నారు, లొట్టలు వేసుకుంటూ! చుట్టు పక్కలవాళ్ళు తమ తిఫిన్ బాక్సుల్లో రోటీలు తెచ్చుకుంటారు. నాజ్ హోటల్లో మటన్ కొనుక్కుని, నంజుకుని తింటారు. వెళ్ళిపోతూ సాబిర్ రెండు ప్లేట్ల మటన్, రెండు రోటీలు కట్టించి ఇచ్చాడు అమీనాకు, ‘ఇంటికెళ్ళి అన్నం వండు. చున్నీ ఏమీ వండి ఉండదు. నువ్వే చేయాలి మళ్ళీ!’ అంటూ!!

అమీనా ఇంటికెళ్ళి చూస్తే, చున్నీ లేదింట్లో!! ఫజ్లూ తన గదిలో పడుకునే ఉన్నాడింకా! రసీదన్ పొయ్యిలో బొగ్గులు వేస్తూంది.

అమ్మ చేతుల్లోంచీ బొగ్గుల బుట్ట తీసుకుంది అమీనా. గుర్రుగుర్రుగా అమీనాను చూసింది రసీదన్. ‘నీక్కూడా చిన్నదాని మాదిరి రెక్కలు మొలుచుకొస్తున్నాయి. పోపో!! షికార్లు చేసుకో!! మా తలరాతల్లో ఎలా ఉంటే అలా జరుగుతుంది.’ అనేసింది.

అమ్మకేమీ జవాబు చెప్పకుండా అమీనా పనిలో పడింది. ‘ఎక్కడికెళ్ళావో చెబుతావా? లేకపోతే నాలుక్కి పక్షవాతమొచ్చిందా?’ అనేసింది రసీదన్.

‘సాబిర్‌తో పాటు సబ్జీ బాగ్ వెళ్ళాను. ఖమీరీ రోటీ తినాలనిపించిందట తనకు. ఇదిగో, ఇంటికి కూడా కొనిచ్చాడు. అన్నం ఎంతలో అవుతుంది? చిటికెలో చేసేస్తా!! నువ్వు ప్రశాంతంగా కూచో అమ్మా!!’ ఇప్పుడింక రసీదన్ ఊరికే ఉండిపోతుందని తెలుసు అమీనాకు. అలాగే అయ్యింది కూడా!!

***

రాధే టీ స్టాల్ తెరిచేసరికి బాగా పొద్దెక్కింది. ఎప్పుడూ ఇలా అవదు. బాగా పొద్దు పోయాక రాధేకు మెలుకువ వచ్చిందీరోజు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు! తల నొప్పి తీవ్రంగా!! ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వచ్చి, షాపు తీశాడు రాధే. పౌచ్ తాగటమతనికి కొత్తేమీ కాదు. కానీ రాత్రి చున్నీ వల్ల జరిగిన అవమానం, దాని వల్ల కోపం, దేశీ సారా, ఆ పైన గంజాయి దమ్ము – వీటన్నిటివల్లా ఒళ్ళంతా కుళ్ళబొడిచినట్టే ఉంది. ఎప్పుడూ గాల్లో ఎగిరే పక్షిలా హుషారుగా ఉండే రాధే మనసు రెక్కలు తెగిన పక్షిలా ఉందీరోజు!!

ఫజ్లూకు ఒక రొటీన్ అంటూ ఏమీ ఉండదు. పొద్దున పొద్దున ఎవరైనా చనిపోయారన్న కబురు రాకపోతే ఆలస్యంగా నిద్ర లేస్తాడు. నిద్ర లేస్తే పగలు, లేకపోతే రాత్రీ!! ఇప్పుడతని ఒంటిమీద మత్తు ప్రభావం కూడా ఉండటం లేదు. ఫజ్లూ బాగా పొద్దెక్కిన తరువాతే నిద్ర లేచాడు. అప్పటికి సాబిర్, అమీనా ఇద్దరూ సబ్జీ బాగ్ నుండీ వెనక్కొచ్చేశారు కూడా!! భోజనంలో అన్నంతోపాటూ ఒక ముక్క ఖమీరీ రోటీ, మటన్ చూసి అతడే మాత్రమూ ఆశ్చర్యపడలేదు. ఎవరినీ అడగనూ లేదు. అమీనానే చెప్పింది, సాబిర్ తీసుకొచ్చాడని!

నిన్న రాత్రి, మత్తులో చిత్తైన రాధే, ఫజ్లూ, సాబిర్‌ను కలిసేందుకొచ్చాడనీ, వాళ్ళు ముగ్గురూ చాలా రాత్రి వరకూ మాట్లాడుకుంటూ ఉన్నారనీ చున్నీకి ఎలాగో తెలిసిపోయింది. రాధేతో తన గొడవ తరువాత యీ ముగ్గురి మధ్యా జరిగిన మంతనాలతో చున్నీ మనసులో ఎన్నెన్నో సందేహాలొచ్చాయి. ఏవేవో ఆలోచనలు!! వీళ్ళ మంతనాల వెనుక రహస్యమేమిటో రాబట్టాలని ఒకటే ఆత్రుత! అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుండే అమీనా స్వభావం కాదు చున్నీది!! ఇక్కడికి బబ్లూ రాకపోకలు ఇంట్లో వాళ్ళకు మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా కంటకింపుగా ఉందని తెలుసామెకు!! ఉచ్చులాగా మెడకు చుట్టుకున్నాడతను అందరికీ!! పొద్దున్నించీ ఎలాగైనా యీ సంగతంతా తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతోంది చున్నీ!! ఎవరేమన్నా అనుకోనీ, బబ్లూ ఆమె ప్రియుడు. తన ప్రేమ కోసం, రాధే ఐనా సరే, సత్తార్ మియ్యా ఐనా సరే, ఎదుర్కునేందుకు తాను తయారుగా ఉంది. ఒకవేళ రాధే తనకూ, బబ్లూకు మధ్యలో ఏదైనా పుల్ల పెట్టేందుకు ప్రయత్నిస్తే, ఏమాత్రం సహించదు తను!! రాధే తనవల్ల బాధపడ్డాడూ అని ఎవరైనా అననీ, అందరి ముందూ, అతని పరువు తీసిగాని వదలదు తానింక! ఐనా, పైన అల్లా మియ్యానే శత్రువై కూర్చున్నాడిప్పుడు తనకు. అందుకే ఇంతలా అనుభవించవలసి వస్తూంది తనకు! ఆ రోజు అల్లా మియ్యానే కాస్త దయ తలచి ఉంటే, బబ్లూ అసలు పట్టుబడి ఉండేవాడే కాదు. ఈ వల్లకాడు, యీ పీర్ ముహానీ వల నుంచీ ఎక్కడికో దూరంగా ఎగిరి వెళ్ళిపోయుండేది తను!!

చలికాలంలో మధ్యాహ్నపుటెండ ఎక్కువసేపుండదు.

మధ్యాహ్నం ముగిసింది. సూర్యుని కాంతి తగ్గిపోయింది. రాధే తన కొట్టు పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. చున్నీ రాధే భార్య బబితా దగ్గర కూర్చుని, తన గోడు వెళ్ళబోసుకుంటూ ఉంది. ‘వదినా, నేను నా తప్పు ఒప్పుకుంటూనే ఉన్నా. రాధే అన్నతో ఇలా మాట్లాడి నేను తప్పే చేశాను, కానీ, మా అన్నా చెల్లెళ్ళ బంధం తెగిపోయిందని అర్థం కాదు. నాకూ నిన్నంతా మూడ్ బాగా లేదస్సలు. మా అక్కెప్పుడూ నా వెంట పడే ఉంటుంది. దానికి నేనొక్కదాన్నే శత్రువును. ముంగిది. మాట్లాడనే మాట్లాడదు కానీ అక్కసంతా లోపల్లోపలే దాచుకుంటుందది! అమ్మను రెచ్చగొడుతూ ఉంటుంది నామీదికి!! తనకూ ఇంత కథా ఉంది. కానీ ఎప్పుడూ వేరేవాళ్ళ వెంట పడే ఉంటుంది. నాకొక్క బబ్లూ మాత్రమే . తనకైతే ఇప్పుడు సాబిర్, లేకుంటే సత్తార్!! ఇద్దరినీ ఒకేసారి ఎలా మైంటైన్ చేస్తుందో మరి!! నాకైతే యీ ఆటలన్నీ రావు. నేను బబ్లూను ప్రేమిస్తున్నా వదినా!! బబ్లూ మగాడు. సింహం లాంటివాడు. సాబిర్ లాగా పిరికివాడు కాదు.. సత్తార్ లాగ చెడ్డవాడూ కాదు. నుదుటి రాత బాగలేక, యీ దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. వదినా!! నువ్వు కాస్త రాధే అన్నతో చెప్పు, నా సంగతి వదిలెయ్యమని! సహాయం చెయ్యకుంటే ఫరవాలేదు కానీ, అడ్డు పుల్ల మాత్రం వేయవద్దు. నాకు తెలుసు, అందరూ కలిసి బబ్లూను ఇరికించాలని చూస్తున్నారని.’

బబితా వదిన చెవుల్లో విషం నింపి, వెళ్ళిపోతూ చున్నీ అంది మళ్ళీ, ‘చిన్నతనంలోనే నీకోసం ఎన్నెన్నో చేశానొదినా!! గుర్తు పెట్టుకో!’

గడచిన పదిహేనేళ్ళలో బబితా చాలానే చూసింది. అనుభవించింది. ముందు పెళ్ళిలో ఒక సంవత్సరం, రెండో పెళ్ళి వల్ల నాలుగేళ్ళు, ఇప్పుడు పదేళ్ళుగా రాధేతో ఉంటూ, బబిత జీవితంలో చాలానే చూసింది. అందుకే చున్నీ సంగతి వినగానే అర్థమైపోయింది.

పీర్ ముహానీలో బబితా మాటకు తిరుగే లేదు.

బబితా మొదట, గంగ, గండకీ నదుల మధ్య ఉన్న ప్రాంతంలో ఉన్న ఒక పల్లెటూరి ఇంటి కోడలిగా వెళ్ళింది. మంచి మోతుబరి కుటుంబమే కానీ భర్త, ఏ పనీ చేసేవాడే కాదు. బలమూ, బుద్ధీ – రెండూ లేనివాడు. ఏడుస్తూ, మొత్తుకుంటూ ఒక ఏడాది గడిపిందక్కడ! ఎప్పుడైనా మరిదీ, లేకుంటే మామగారు, చంపుకు తినేవాళ్ళు. గంగా, గండకీ నదుల్లో ఉప్పెన వచ్చినప్పుడు, అందులో దూకి చనిపోదామనుకుంది కానీ బతుకు తీపి ఆ పని చేయనివ్వలేదు. ఒక రాత్రి ఇంట్లోనుంచీ తప్పించుకుని వచ్చేసింది బైటికి. కానీ తమ ఊరికి చెందిన ఒక బెస్త కుర్రాడు ఆమెను కాపాడి, తన పడవలో దానాపూర్ కు చేర్చాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడే రాధే గోప్ వాళ్ళ మామయ్య కలిశాడు. ఆయన దానాపూర్ స్టేషన్‌లో కూలీ పని చేసేవాడు. ఆశ్రయమాయనే ఇచ్చాడు. ఇంటినిండా కొడుకులూ, కోడళ్ళూ!! అచ్చం తండ్రిలాగే చూసుకున్నాడు బబితాను!! గంగా, గండకీ నదుల ఉప్పెన తగ్గుతునే, బబితా అత్తింటివాళ్ళు, ముందు అమెను పడవలో దాటించిన కుర్రాణ్ణి చంపేశారు. తరువాత పోలీసుల అండదండలతో రాధే వాళ్ళ మామయ్య ఇంటిపై పడ్డారు. కానీ బబితా, తన మీద తన మరిది, మామగార్ల అరాచకమంతా బైట పెట్టింది. దూర దూరమున్న బంధువులంతా ఒకటయ్యారు. ఇంక అత్తింటి వాళ్ళంతా పరారైపోయారు.

మామయ్య ఇంటికి రాధే వచ్చిపోతూ ఉండేవాడు. బబిత అక్కడికి వచ్చిన తరువాత, అతగాని రాకపోకలు ఎక్కువయ్యాయి. బబితకు కూడ అతనంటే ఇష్టమేర్పడింది కానీ, నోరు తెరవలేదు. కారణం, రాధే పెళ్ళైన వాడు కావటం. రాధే వాళ్ళ మామయ్య, బబితకు రెండో పెళ్ళి చేశాడు. బబిత డ్రైవర్‌కి పెళ్ళామైంది. కానీ, మనసంతా రాధే మీదే!! ఒక రోజామె కబ్రిస్తాన్‌కు వచ్చింది. ఆమె డ్రైవర్ మొగుడు, ట్రక్ తీసుకుని వారం రోజులు బైటే ఉంటాడు. ఇక బబిత రాధేను కలిసేందుకు దానాపూర్ నుండి పీర్ ముహానీకి వచ్చేది.

బబిత ప్రేమ ఇలా సాగుతూ ఉన్నప్పుడు, వాడ వాడంతా ఆమె పేరే, ఆమె గురించి మాటలే!! అప్పుడు చిన్న వయసులో ఉన్న చున్నీ, అందరికీ ఎదురు నిలబడింది. బబితకు నీడలాగా ఎప్పుడూ కలిసే ఉండేది. రాధే పెళ్ళామయ్యేందుకు బబితా ఎన్నో కష్టాలెదుర్కోవలసి వచ్చింది. వూళ్ళో వాళ్ళందరినీ ఎదుర్కుని, తన ప్రియుణ్ణి పొందటమంటే మాటలు కాదు. ఒక వైపు డ్రైవర్ మొగుడి ఆంక్షలు, మరొక వైపు, రాధేకు గంగి గోవు లాంటి మొదటి భార్య ఉన్నదన్న నీతి. చాలా కష్టాలు పడి అన్నిటినీ ఎదుర్కొని, రాధే ఇంట్లోకి అడుగు పెట్టింది బబిత. ఆ తరువాత, ఎన్నెన్నో ఇబ్బందుల తరువాతే, రాధే పెళ్ళామూ, చున్నీకి వదినా అయింది బబిత. ఈ ప్రేమ కథలో బబిత, రాధే లకు అండగా నిలిచింది చున్నీ. రాధే దగ్గరికి వెళ్ళీ వెళ్ళగానే, కొడుకుని కని, గొడ్రాలైన మొదటి భార్య ఒళ్ళో వేసేసింది బబిత. ఇక ఆమె ఆనంద బాష్పాలతో ఆ పిల్లాడి ఆలనా పాలనలో మునిగి పోయింది. ఇప్పుడు బబిత ఆమెకు సవితి కాదు. చెల్లి. ఆ తరువాత, బబిత, వరుసగా మరో నలుగురు మగ పిల్లల్ని కని, రాధే వంశాన్ని ఉద్ధరించింది. ఆమె మాటకిప్పుడు తిరుగు లేదు.

ఇప్పుడిక బబిత వదినకు కర్తవ్య బోధ చేసి వెళ్ళిపోయింది చున్నీ.

సబ్జీ బాగ్ నుంచీ వచ్చిన తరువాత, సాబిర్ మాయమైపోయాడు. రాధే, సత్తార్ మియ్యా – ఇద్దరూ అతని కోసం వెదుకుతూనే ఉన్నారు. కానీ జాడేదీ తెలియనేలేదు. రాధేతో సత్తార్ మియ్యా చాలా సేపే మాట్లాడాడు. అతని పథకాన్ని ఒప్పుకున్నాడు కూడా!! చున్నీ గురించి ఇది వరకటినుంచే అతని మనసులో అగ్నిపర్వతమొకటి నిప్పులు కురిపిస్తూనే ఉంది. అది తెరచుకోవడమొక్కటే తరువాయి. ఫజ్లూకు బబ్లూ అంటే ఇష్టమే లేదు. కానీ యీ విషయంలో వాళ్ళతో కలవటమైతే ఇష్టం లేదిప్పుడు. కాలు బలహీనంగా ఉన్నా, శరీరంలో శక్తికి తక్కువ లేదు. ఆత్మ విశ్వాసానికీ తక్కువ లేదు. వాళ్ళ పథకంతో, మానసికంగా ఏకీభవిస్తున్నాడు కానీ, తానైతే దూరంగా ఉండదలచుకున్నాడు. రాధే గౌరవానికే ఇది సవాల్ గా నిలిచింది. బబ్లూ రాకపోకలాపి, చున్నీకి పాఠం చెప్పగలడు తాను!!

***

రాధే చాయ్ దుకాణం, ఆలస్యంగా తెరుచుకుంది, త్వరగా మూతపడిందీ రోజు!! పీ.హెచ్.ఈ.డీ. కాంట్రాక్టర్ రాం సకల్ వర్మ ఇంట్లో రాధే గోప్, మోహన్ విశ్వ కర్మ, భోజ్ మిఠాయీ భండార్ భోజ్ లాల్ సాహ్, రాం భజన్ తివారీ, ఛోటన్ సింహ్ కూర్చుని ఉన్నారు. భూలోటన్ టోప్, వాళ్ళబ్బాయి కోసం కాచుకునున్నారందరూ!! రాం సకల్ బాబూ, పీర్ ముహానీ పూజా సమితి అద్యక్షుడిప్పుడు. భూలోటన్ కొడుకు కార్యదర్శి. దసరాల్లో యీ సమితి దుర్గా ప్రతిమను ఏర్పాటు చేస్తుంది. నవరాత్రిలో, లక్ష్మీ ప్రతిమ స్థాపించి, ఛట్ పట్ సమయంలో వీధులను శుభ్రపరచి, విద్యుద్దీపాలతో అలంకరిస్తుంది. సరస్వతీ పూజ బాధ్యతంతా వాడలోని యువకులదే. పూజా సమితి సహకరిస్తుంది, వెనక నిలబడి! తన టీ స్టాల్‌లో కూర్చుని భూ లోటన్ కొడుకు మున్నా సింహ్ మధ్యవర్తిగా రాధే సమస్యనంతా బాగా వివరించి చెప్పాడు. వాడలోని మోతుబరులైన వాళ్ళందరినీ ఇప్పుడిక్కడికి పిలిపించాడు.

భూలోటన్, మున్నా అక్కడికి చేరుకోగానే, సమావేశం మొదలైంది. అందరికన్నా ముందు రాధే, విషయమంతా చెప్పాడు. అక్కడున్నవాళ్ళందరికీ యీ సంగతి తెలుసు. లోపల్లోపల బాధగా కూడా ఉంది అందరికీ. బబ్లూని వాడలోకి రానివ్వకుండా అడ్డుకోవటం గురించి అందరి అంగీకారం ఉంది. ఈ బాధ్యత రాధే, మున్నాలది. రాం సకల్ బాబూ అభిప్రాయం ప్రకారం, యీ విషయంలో సత్తార్ మియ్యా, సాబిర్ కూడా ఉండాలి. అలా ఉంటే విషయం దారి మళ్ళకుండా ఉంటుంది.

అందరూ తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇంతలో రాం సకల్ బాబూ ఇంట్లో సమావేశం జరిగే గదిలో తలుపు ఒక్క దెబ్బకు తెరుచుకుంది. చున్నీ వదిన బబిత వచ్చింది లోపలికి. ఆమె ప్రవేశంతో వాతావరణం మారిపోయింది. ఎవరితో ఏమీ మాట్లాడకుండా, నేరుగా తన భర్తనే ప్రశ్నించింది బబిత. ‘సమాజ సేవ చేయాలన్న గొప్ప కోరికుంటే, ముందు మందు పేకెట్లూ, గంజాయి చిలుమూ, ఇవన్నీ వదిలిపెట్టి ఆ తరువాత మాట్లాడు. సమాజ సేవ చేసేవాళ్ళు రాత్రి పూట ఎక్కడో కూర్చుని దొంగల్లాగా గ్రూపు కట్టి మీటింగులు పెట్టుకోరు. ఇదిగో, నేనిప్పుడే చెబుతున్నా, చెవులు తెరుచుకుని విను. చున్నీ గురించి ఏదన్నా గొడవ చేయదలచుకున్నారో, నేను అందరి పనీ పడతానంతే!! నేను అందరి రహస్యాలూ విప్పేసి తీరుతాను. ‘

సభ మంచి వేడిలో ఉంది. శ్రీమతి బబితా గోప్ ప్రతిభ, సత్తా గురించి అందరికీ తెలుసు. బబిత, రాం సకల్ బాబూ తో పాటూ వాడలోని అందరి మోతుబరులనూ లెక్కే చేయకుండా మున్నా సింహ్ యాదవ్ కేసి చూస్తూ మాట్లాడింది, ‘మున్నా బాబూ!! మీటింగ్ ముగించి కాస్త ఇంటి కేసి రండి. నేను మీ అన్నగారిని తీసుకెళ్తున్నా.’

అందరి కళ్ళూ రాధే గోప్ మీదే నిలిచిపోయాయి.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాధే గోప్ లేచి నిలబడ్డాడు. ముందు, బబితా, వెనక రాధే!! రాధే బైటికి వెళ్ళిపోయిన తరువాత, అక్కడున్న అందరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎవరూ మాట్లాడే పరిస్థితిలో లేరు. యువకుడైన మున్నా, తటాలున లేచి, తండ్రి భూలోటన్ గోప్ తో సహా అందరినీ ఆశ్చర్య పరుస్తూ బైటికి వెళ్ళిపోయాడు.

***

చలికాలం రాత్రి. మంచు ఇంకా చిక్కబడలేదు. కబ్రిస్తాన్‌లో పడుతున్న వెన్నెల పల్చటి దుప్పటిలోంచీ జారి, తెల్ల పూల లాగ గోరీల మీద వర్షిస్తూంది. గాలి, యీ వెన్నెల పూలను చెదరగొట్టేస్తూ ఉంది. గోరీలమీద ఊగుతున్న గడ్డి లోనుండీ యీ వెన్నెల పూలు యీ గోరీమీద నుండీ ఆ గోరీ మీదకు, అక్కణ్ణుంచీ పక్కనున్న మరో గోరీమీదకు దూకుతున్నాయి. చలి, మంచు, వెన్నెల పూల ఆటలూ – ఇవన్నిటితో కబ్రిస్తాన్ ఒక విశాలమైన రంగస్థలంగా మారిపోయింది.

దాదాపు పదిరోజుల తరువాత బబ్లూ, తన చున్నీని కలిసేందుకు వచ్చాడిక్కడికి! రాధే సంఘటన తరువాత, చున్నీనే అతన్ని వెంటనే రావద్దని ముందు జాగ్రత్తగా కబురు పెట్టింది. చున్నీ భయపడలేదు. పీర్ ముహానీలోని వాళ్ళ డొంక తిరుగుడు చేష్టలన్నీ ఆమెకు తెలుసు. బబ్లూను ఆమె సమాధాన పరచింది, వేడి చల్లారేదాకా కొన్ని రోజులు ఆగటం మంచిదనీ, తరువాత రావొచ్చనీనూ!

అబ్దుల్ బరీ సాహెబ్ మసీదు ఛత్రీ కింద, సమాధి మీదున్న చలువ రాయి చప్టాకు వీపానించి బబ్లూ కూచుని ఉన్నాడు. అతని ఒడిలో తలపెట్టి పడుకుని ఉన్న చున్నీ, నేల మీద తన కాళ్ళ పట్టీలను మెల్లిగా కదుపుతూ ఉంది. బబ్లూ మొబైల్ స్క్రీన్ మీద తన పిడికిలంత నడుము ఆడిస్తూ, నేరేడు పళ్ళలాంటి పెదవుల నర్తకి, ఏదో వర్షాకాలంలో నది మధ్యలో సుడిలాగా తిరుగుతూ ఉంది, గుండ్రంగా!! పాడుతున్నావిడ పై శృతిలో స్వరం, గోరీల గడ్డలోని గాలి తోడుగా వినిపిస్తూంది.

నెమ్మది నెమ్మదిగా నడు,

నా పాదాల్లో బొబ్బలెక్కాయి..

తెల్లని శరీరం, నల్లగా మారింది,

నీతో ప్రేమ మొదలయ్యాక

బతుకంటే ప్రేమ పుట్టింది,

తెల్లనిదాన్ని నల్లగయ్యాను!!

కబ్రిస్తాన్‌లో తుఫాను వచ్చినట్టుంది.

గోరీల నుంచీ లేచి వచ్చి, చనిపోయినవాళ్ళూ కూడా నాట్యమాడుతున్నారు. వెన్నెల పూలూ నర్తిస్తున్నాయి. గోరీల మీద పెరిగిన గడ్డీ కూడా నర్తిస్తున్నాయి. సుడులుగా వీస్తున్న గాలీ, మున్నీ దేవి గొంతూ, మంచు దుప్పటిలోనుంచీ వర్తులాకారంగా పైకి లేచి, దిగంతాల వరకూ వ్యాపిస్తూ ఉంది.

తన పక్క మీద పడుకుని ఉన్న రసీదన్ కూడ మొబైల్ నుంచీ వస్తున్న యీ పాటను వింటూ ఉంది. చిరాకుగా, అటూ ఇటూ పొర్లుతూ ఉంది. వరండాలో పక్కమీద పడుకుని ఉన్న అమీనాకు కూడా యీ పాట వినిపిస్తూనే ఉంది కానీ నిర్వికారంగా కళ్ళూ మూసుకుని పడుకునే ఉంది. గోరీల గడ్డ గేటు దగ్గర గదిలో కూర్చుని ఉన్న ఫజ్లూ, సాబిర్, సత్తార్ మియ్యాలకు కూడా అర్థమయింది, బబ్లూ కబ్రిస్తాన్ లో చున్నీతో పాటూ ఉన్నాడని ! బబ్లూ అహంకారానికి సమాధానమేమిటో ముగ్గురికీ అర్థం కావటం లేదు.

బబ్లూ చాఉమిన్ చికెన్ చిల్లీ ప్యాక్ చేసి పట్టుకొచ్చాడు. ఇంకా స్ప్రైట్ బాటిల్ లో విస్కీ కూడా!! అబ్దుల్ బారీ సాహెబ్ మసీదు కప్పు కింద కూర్చుని తిన్నారిద్దరూ! బబ్లూ లక్ష సార్లు వేడుకున్నా చున్నీ, విస్కీ ఒక్క చుక్క కూడా తాగలేదు. తెచ్చింది తిని, సిగరెట్ వెలిగించి, గుండె నిండుగా పొగ పీల్చాడు బబ్లూ.

చాలా రోజుల తరువాత కలిశారిద్దరూ! సంగీతం, మద్యం, భోజనం, సిగరెట్ తరువాత చున్నీని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు బబ్లూ. లాల్జీ టోలా వైపునుంచీ గోరీల గడ్డ ప్రహరీ గోడ దాటుకుని ఎలా లోపలికి వచ్చాడో, అలాగే వెళ్ళిపోయాడు, రైల్వే హంటర్ రోడ్డుమీదుగా లోహానీపూర్ వైపుకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా!!

బబ్లూ వెళ్ళిపోగానే జాగ్రత్తగా అడుగులు వేస్తూ, చున్నీ ఇంట్లోకి వచ్చి, తన పక్కమీద పడుకుంది. లోపల అమ్మింకా మేల్కునే ఉందనీ, పక్కనే ఉన్న మరో పక్కమీద అమీనా ఊపిరి బిగబట్టి, నిద్ర నటిస్తూ ఉందని తెలుసు చున్నీకి!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here