[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనసు స్పర్శ ఆహా ఆహా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సూ[/dropcap]ర్యోదయం మొదలు ఇంటి పనితో తల్లి వెనకాల సుప్రజ మహా సందడి చేస్తూ ఉంటుంది. అది మంచి ఆడపిల్ల లక్షణము. అందరు “ఏ ఇంటి కోడలవుతుందో?” అంటే “ఆఁ, మా అక్క సుభద్ర కోడలు” అంటాడు తండ్రి భూమయ్య.
తల్లి రమణమ్మ మాత్రం “ఎక్కడ రాస్తే అక్కడ ఉంటుంది” అంటుంది. ఇలా ఏ రోజు మాట పొసగదు వాళ్ళిద్దరికీ. ఒక్క పిల్ల మంచి చదువు ఉన్నవాడిని చేద్దామంటుంది రమణమ్మ.
భర్త ఆమె మాట వినడు. రమణమ్మలో ఆలోచనలు..
‘విధి వికాసం, విలాసం విజ్ఞత చూద్దాము. ఇది ఒక మహత్తర సందేశం.
బాల్యంలో అమ్మ స్పర్శలో ఒక ధైర్యం, ఒక నమ్మకము, ఒక ప్రేమ ఒక అభిమానము ఉంటాయి. ఇంకా ఎన్నో భావాలు ఆ చిన్ని మనసుకి భరోసా ఊరట కల్గిస్తాయి.
ప్రతి ఆనందం ప్రతి బాధ ఇంట్లో వాళ్ల తోనో స్నేహితుల తోనో చెప్పు కోవాలనే ఆశా, ఆ తరువాత హృదయ భారం దింపుకొని తేలిక పడితే అదొక ఆనందం, అదొక సంతృప్తి.
అదే మనసు స్పర్శ! ఆ ఆనందం ప్రతి మనిషికి అవసరము.
కుటుంబంలో పెద్ద – ఇంటివారికి అతి చక్కగా నచ్చ చెప్పి జీవిత విలువ తెలిపి మంచి సంబంధం అనుకుంటే పెళ్ళి చేయాలి. ఈ విషయంలో పిల్లలకి బాగా తెలియ చెప్పాలి. ఎంతో ఆదరణ కావాలి. పెళ్లి విషయంలో తల్లి తండ్రి కూర్చుని పిల్లని సముదాయించి ఈ పెళ్లి చెయ్యాలి.
కానీ ఒక కొట్లో కొనే కూరకి రెండు సార్లు బేరం అడి వస్తువును అచి తూచి కొని తెస్తారు. కానీ ఆడపిల్ల పెళ్లి విషయంలో మగ పెళ్లివారు పిల్ల నచ్చింది అనగానే కంగరు పడుతు జాతకాలు చూసుకుని కాళ్ళ దగ్గర బేరం అంటూ పెళ్లి చేసేస్తారు.
పెట్టుడు ముహూర్తాలు, పెళ్లి బేరాలు ఎక్కువ తక్కువ అని చూడకుండా వెంటనే చేస్తారు దీన్ని ఏమి అనాలి? కూరకి చీరకి ఆలోచించిన తల్లి తండ్రి కల్యాణ ఘడియ వచ్చింది అంటూనే పరుగులు పెడతారు. పెళ్లి అతి ముఖ్యమే కానీ ఆ తరువాత బాధ్యతగా చూసే వ్యక్తా అవునా కాదా అని ఆలోచించాలిగా’ అనుకుంది.
***
ఒక ఛానెల్ వారు ఉగాది కోసం పల్లెకు వస్తామని ప్రెసిడెంట్ గారికి కబురు పంపారు. ఆయన ఆ ఊరి మాజీ జమీందారు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. ఆయన సంతోషించాడు. “వెంటనే అవసరమైన పనులు చూడండి, మర్యాదలు చేయండి, మా గెస్ట్ హౌస్‌లో పెట్టండి. వాళ్ల సలహా మేరకు వీధులు అలంకరించండి” అన్నాడు.
సరే వాళ్ల మేనేజర్ సైట్ చూడటానికి వచ్చి లొకేషన్ సెట్ చేసుకుని వెడతాడు అన్నారు. ఊరంతా సిటీ కేబుల్‌లో చెప్పించారు. ఊరి పెద్ద వీధిలో ప్రోగ్రామ్ పెడతాము అన్నారు ఛానెల్ వాళ్ళు. సరేనంటూ ఇళ్ళకి అవసరం అనుకున్న వారికి వారే రంగుకు వేయించారు.
వీధిలో బోగన్ విల్లా, క్రోటన్ మొక్కల ప్లాస్టిక్‌వి వేసి రోడ్డుకు అటు ఇటు పెట్టారు. చాలా బాగుంది. ప్రతి ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, చెఱకు గడలు ఆకులతో ఉన్నవి, అరటి మొక్కలు గెలలతో పెట్టి అలంకరించారు. మాజీ జమీందారు గారి ఇంటిని దీపాల రంగుల దండలతో అలంకరించారు. నాలుగు రోజుల్లో అన్ని పూర్తి చేసి ఐదో రోజు షూటింగ్ చేశారు.
ప్రతి ఇంటిముందు రంగుల ముగ్గులు పట్టి హీరోయిన్ చేత ఉగాది పచ్చడి చేయించి ఆ ఊరి పిల్లలకి తినిపించారు. అందులో మన రమణమ్మ కూతురు సుప్రజ కూడా ఉన్నది.
అందమైన పిల్ల. చలాకి పిల్ల. మాటకారి పిల్ల. తెలివైన పిల్ల. ఇన్ని లక్షణాలు ఉన్న పిల్లని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారు అని ఎలా అనుకోవాలి?!
వంటల్లో వడ్డనలో దిట్ట. బహు విధాల తెలివైనది. డిగ్రీ చదివింది. కొంచెం కుట్లు అల్లికలు వచ్చు. పాటలు బాగా పాడుతుంది, చక్కగా అభినయం చేస్తుంది. ఛానల్ వారు అంటేనే మాటలు బురిడీ, గారడీ చెయ్యగలరు. అన్నీ – కళ్ళ ముందు యంత్ర మాయాజలంతో వారు బాగా చూపించగల సత్తా ఉన్న వాళ్ళు కూడా.
సుప్రజలో చలాకీతనం చూసి వివరాలు కనుక్కున్నారు.
ప్రెసిడెంట్ గారు “ఇప్పుడే కాదు మీ షూటింగ్ పూర్తి అవనివ్వాలి, లేదంటే ఊళ్ళో ఘనమైన గందరగోళం అవుతుంది, షూటింగ్ ఆగిపోతుంది” అని చెప్పాడు. డైరెక్టర్ సరే అనీ ఊరుకున్నాడు.
***
చైత్రంలో ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామ నవమి కళ్యాణం కూడా ఉన్నది. మంచి ముహూర్తం అన్నారు. చైత్రం కాకపోతే ఇప్పటిలో బాగా తక్కువ ఉన్నాయి; గృహ ప్రవేశం, పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి అన్నారు.
ఎలాగైనా సుప్రజాని కొంచెం చదువు, ఉద్యోగం ఉన్న సంబంధం చెయ్యాలని ఆశపడింది రమణమ్మ. కానీ ఆడపడుచు, భర్త సాగనివ్వరు. అయినా ఎదురొడ్డి సంబంధాలు చూస్తోంది.
“ఈ పల్లెల్లో చదువుకున్న ఆడపిల్ల విలువ ఎందుకు తెలుసుకోరు? ఎంతసేపు దగ్గర చుట్టరికం అంటూ ఉంటారు. సిటీలో చిన్న గదుల ఇల్లు. ఇంటి సుఖాలు తక్కువ. రెండు మూడు గదులు అగ్గిపెట్టెలా ఉంటాయి.” అది భర్తతో.
“ఆహా” అన్నాడాయన.
“ఎపుడు అంతే! మీ అక్కది పెద్ద ఇల్లు. చాకిరీ ఏమి చెయ్యగలదు? వారానికి ఒకసారి అయినా పార్కుకు సినిమాకి వెళ్ళాలి.”
“సరే లే నువ్వు ఎప్పుడు విన్నావ్?” అంటు ఊరుకున్నాడు భూమయ్య.
***
ప్రెసిడెంట్ గారు ఛానెల్‌లో ఈవెంట్ వచ్చాక చూసి కబురు పంపారు. సుప్రజని బాగా చూపించాడు. ముగ్గులు రంగులు పెడుతున్నట్లు, అందంగా మొక్కలు సర్దుతున్నటు, ఇలా రక రకాల ఫోజులో ఎక్కువ భాగం చూపించాడు. అందరు ‘మహా బాగు మన ఊరి హీరోయిన్’ అనుకున్నారు.
ఊరు విషయం ప్రెసిడెంట్‌కు, మాజీ జమీందారుకి తెలిసింది.
“వాళ్ళు సుప్రజని ఎంతో ఇష్టపడి అడుగుతున్నారు, మీరు ఏమంటారు?” అని కబురు పంపారు.
“ఆలోచిస్తాను” అన్నాడు భూమయ్య.
ఈలోపు ఆ ఊరు పిల్లలకి ఆటల్లో వంటల్లో అవకాశాలు ఇచ్చి కార్యక్రమాలు చేశారు ఛానెల్ వాళ్ళు. దాంతో ఆ ఊరు చాలా ఫేమస్ అయ్యింది.
సుప్రజ అప్పుడప్పుడు కవితలు రాస్తోంది. సాహిత్యం ఇష్టం. కానీ సలహాలు సూచనలు ఇచ్చేవారు ఎవరు ఆ ఊళ్ళో లేరు.
***
‘సూర్యోదయం మొదలు
కొత్త అందాలు ఆనందాలు
పొందాలని ఎదురు చూపులు
మనసుకి మార్పులు
మెరుపులు జీవిత సత్యాలు
ఆనందం ఆత్మీయత
అపురూపంగా స్నేహంలో పెంచాలి పంచాలి
మనసుకి మార్పులు చేర్పులు
చేస్తూ విజయ మార్గం వైపు
పయనించే దిశలో ఆత్మీయత
అభిమానం అనురాగం ఆదరణ అవసరమే
ప్రతి వ్యక్తి జీవితంలో మంచి కోరుతూ ప్రజాహితం కోరుతూ
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ
అందరు మంచి కోరుతూ
సాహితీ విలువలు పెంచుతూ
మన పెద్దల కీర్తి పురాణ ఇతిహాస సంపద కలిగి
జ్ఞాన మార్గంలో
శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనల
అర్థం బాగా అవగాహన చేసుకుంటూ
సదా జీవితంలో అభినందన పొందుతూ
వాల్మీకి రామాయణ అంశాలు నేర్చుకుని
మంచి మానవత్వం పెంచుదాం అందరికీ ఆనందం
పెంచుదాం ఓ యువతీ.. నీ కృషి అభినందనీయము’
అని తను రాసుకున్న కవితను మరోసారి చదువుకుంది సుప్రజ.
~
‘స్వయం ప్రతిభతో కృషి చేసే
వ్యక్తులు ఎప్పుడు ముందుబాట లోనే
స్వయం శక్తే కీలకం’
అనే మినీ కవితను ఆశువుగా రాసింది.
***
కుటుంబ సభ్యులు అవసరం ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అందరినీ గౌరవించాలి. ఒక ఉద్యోగం అయినా, ఒక సంబంధం అయినా అందరి అభిప్రాయాలు పుచ్చుకుని చెయ్యాలి. ఎవరి మాట కాదన్నా, ‘అప్పుడు చెప్పను వినలేదు, ఇంకేమీ అనుభవించు’ అంటారు. ఇదండీ ఉమ్మడి వ్యవస్థ. ప్రతి విషయం చర్చించి డబ్బు ఖర్చు పెట్టాలి. ఇదండీ ఆనాటి పరిస్థితి.
నేడు పెళ్లి చేసుకుని పిల్లని తెచ్చి చూపించే పరిస్థితి వచ్చింది కదా.
కవితలు బాగుంటాయి నిజమే. ఊహా ఎప్పుడు ఆనందమే.
సూర్యోదయం మొదలు మనిషికి ఎంతో కృషి అవసరం. అందమైన జీవితానికి పునాది బాల్యం నుంచే పడాలి. ఉన్నత, ఉత్తమ భావాల ప్రగతి కావాలి. మానవ జీవిత ప్రతిభకు వికాసం కోసం, మంచి మార్గం కోసమే సాధన కావాలి. శోధన, కృషి కొనసాగాలి. జీవిత విలువలు తెలిపిన మన పురాణ, ఇతిహాస గాథలు, వాల్మీకి రామాయణం, ఇతర కవుల జ్ఞాన శోధనలు, శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు – జీవిత సత్యాలు. వాటిని పాటించగలగాలి.
***
రమణమ్మకి కూతురు పెళ్లి చేయాలని ఆశ. ఆడపడుచు కొడుకు విశ్వనాధం అయితే మంచిదే. వాడు పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ వాడికి బయటి సంబంధం మంచిది అంటుంది.
చివరింటి వారు రామారావు అనే పిల్లాడిని చూపించారు. బొద్దుగా ముద్దుగా ఉంటాడు. కానీ చదువు తక్కువ, ఆశ ఎక్కువ. ఇంటర్ చదివి ఏదో పెద్ద కొట్లో ఉద్యోగం, గుమస్తా అంటారు. డబ్బు బాగా ఇస్తారు. పై డబ్బు వస్తుంది అని చెప్పారు. మధ్యలో వాళ్ళ షావుకారు అపార్ట్‍మెంట్ కట్టించడంలో కొంత డబ్బు మిగులుతుంది, పై రాబడి ఆసలు కన్న ఎక్కువే వస్తుందన్నారు. ఆలోచిస్తామన్నారు సుప్రజ అమ్మానాన్న.
కానీ రమణమ్మ ఆడబడుచు గయ్యాళి. పిల్ల ఆవిడ దగ్గరే ఉండాలి అని భయం కూడా ఉంది రమణమ్మకి.
“మనకి తెలియని వాళ్ళని నమ్ముతాము, తెలుసున్న వారు అయితే అమ్మో గయ్యాళి అనుకుంటాము. విధి రాత ఎలా ఉన్నది అన్నది మనకు ఏమి తెలియదు. రాతను బట్టి వీరి మనస్తత్వం మారుతుంది. పిల్లలని కంటాము కానీ వాళ్ళ రాతల్ని కాదు” అంటు వాపోతోంది.
“అంతేకదా తెలిసిన వాళ్ళు కనుక అలా అన్నావు” అంటాడు భూమయ్య.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “మా అక్క అంతేననా నీ ఉద్దేశం? అంతేనా?” అంటాడు
ఇదో సినిమా డైలాగ్ అందరికీ అలవాటు అయ్యింది.
ఈలోపు ఆ ఛానెల్ వాళ్ళ ఉద్యోగికీ, మన ఊరు పిల్లకి పెళ్ళట అన్న వార్తలు ఊర్లో పాకాయి. ఈ విషయం సుప్రజ మేనత్తకి ఆనోటా ఈ నోటా తెలిసింది. అసలే అవిడ మహా గయ్యాళి. టీవీ సీరియల్స్‌లో వచ్చే అత్తలకి ఏ మాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదేమో.
“వెంటనే ముహూర్తాలు పెట్టండి. నా పిల్లాడికి కాకుండా ఎవరికి చేస్తారో చూస్తాను” అన్నది సుభద్ర తమ్ముడితో.
“ఇలాంటి సిటీ వాళ్ళవన్నీ కబుర్లే కానీ చేతల్లో ఏమి ఉండదు. కంచంలో కంచం మంచంలో మంచం” అంటూ టివి, సినిమా డైలాగ్స్ చెప్పింది.
“అసలు విషయం ఏమిటంటే మీరు ముందు నా మేనకోడల్ని అడగండి. అది కాదు అంటే వేరే వెళ్ళండి” అన్నది సుభద్ర.
“అబ్బే మా ఇష్టమే పిల్ల ఇష్టం” అన్నారు రమణమ్మ, భూమయ్య.
“నీ పిల్లాడు నీ మాట తప్ప ఎవరి మాట వినడు. ఇప్పటికీ నా భర్త నీ మాట వింటాడు. నా పిల్ల సుఖం నేను చూడాలి. మేనరికం చెయ్యకూడదు” అంటూ గట్టిగా చెప్పింది రమణమ్మ.
కూతురు పెళ్లి బాధ్యతని ప్రెసిడెంట్ వెంకటరావు గారికీ, మాజీ జమీందారు సుబ్రహ్మణ్య శ్రీనివాస రావు గారికి అప్పజెప్పింది. వాళ్ళిద్దరు మధ్యవర్తులుగా ఉండి పెళ్లి చెయ్యడానికి ఆ పిల్లాడు తరపు వారు ఒప్పుకున్నారు.
అంతా ఇష్టపడి పెళ్లి ఘనంగా చెయ్యడానికి నిశ్చయింఛారు. పెళ్లికి మాజీ జమీందారు పూనుకోవడంతో అందరు హర్షించారు.
మేనత్త పెంకితనం తెలిసిన సుప్రజ స్నేహితులు కూడా ఆనందం వ్యక్తపరిచారు.
శ్రీరామనవమికి సీతరామ కళ్యాణం ఘనంగా చేసి పానకం వడపప్పు పిండి వంటలు భోజనాలు పెట్టారు.
అదే నెలలో మన సుప్రజ పెళ్లి కూడా ఛానెల్ అబ్బాయి శ్రీనివాస సుబ్రహ్మణ్య సత్య సుభాష్ శాస్త్రితో ఘనంగా చేశారు. సాయంత్రం రిసెప్షన్‌లో పాటల కార్యక్రమం బాగా చేశారు. అందులో మన సుప్రజతో శ్రీ అన్నమయ్య కీర్తనలు పాడించారు.
సంగీతం వచ్చిన కోడలు రావడం అదృష్టం అన్నారు వాళ్లు.
సుముహూర్తం వేళ సీతా కల్యాణ వైభోగమే రామా కళ్యాణ సౌభాగ్యము శ్రీ త్యాగరాజు శ్రీరామ కల్యాణ కీర్తన వాయించారు. తలంబ్రాల వేళ పిడి కిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వాయించారు.
ఆనందం అంతా మన వెంకట రమణమ్మ కళ్ళలోనే ఉన్నది. సిటీ జీవితం, ఉద్యోగస్థుడైన అల్లుడు అంటూ మురిసిపోయింది
సుభద్ర పెద్ద కోడల్ని సరిగా చూడలేదు. ఆమె పట్నంలో మకాం పెట్టింది. అందుకే రమణమ్మ కూతురుని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ భర్త అక్క దగ్గరే అంటూంటాడు.
అందుకే సుప్రజ తల్లి మాట విని సిటీ వెళ్లి పోయింది. ఇక్కడ నుంచి రమణమ్మ ఒక్కగానొక్క కూతురికీ అన్ని పంపుతూ ఉంటుంది
***
ఆడపిల్లకి ఇంటిపని వంటపనితో పాటు, పూజ పాటలు కొన్ని మంగళ హారతులు రావాలి.
హారతికి కొన్ని మంగళ హారతులు, క్షీరాబ్ధి కన్యకకు, మరలి మరలి జయ మంగళము అనే శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి అలిమేలు మంగ పద్మావతి కీర్తనలు శ్రీ మహాలక్ష్మీ మంగళ హారతి, నందకే యాకే హృదయ శ్రీ కృష్ణ మంగళ హారతి, హారతి మీరెలా ఇవ్వరే అంబ హారతి, ఘల్లు ఘల్లున పాద అనే మంగళ హారతి పాటలు పిల్లకి నేర్పించింది రమణమ్మ.
కొన్ని విధానాలు ఆడపిల్లకి మగ పిల్లలకి నేర్పాలి. ఇది జీవితానికి ముఖ్యము. ఎన్ని చదువుకున్నా జీవిత చదువే ముఖ్యము.
ఈ పద్ధతిలో పిల్లల్ని పెంచాలి. పెళ్ళాన్ని చూడటంలో ఆమెను ప్రేమతో జీవిత భరోసా ఇచ్చి మనసు స్పర్శతో మెలగాలి. జీవిత గమ్యంలో, కొన్ని కుటుంబాల్లో అయిన వాళ్ళు పిల్లని చేసుకుంటామని వేరే సంబంధం రానివ్వరు; వచ్చిన ఏదో చెప్పి పంపిస్తారు. మా ఇంటికే కోడలు అంటారు.
అలా వెంకట రమణమ్మ అక్క కూతురు పెళ్లి విషయంలో జరిగింది. అందుకే ఆమె ఏమి వినకుండా తన ఆడపడుచు కొడుకు విషయంలో జాగ్రత పడింది.
కొంచెం చదువు సంధ్య, సంస్కారము, నేర్పు, ఉన్న పిల్లాడికి చెయ్యాలని ఆశ పడింది ఆ తల్లి ప్రాణం. మనసులో స్పర్శకు మార్గం చూపింది.
ఆమె మనసులో నిరంతరం సమరం చేసి విజయం సాధించింది.
“ఏమిటో ముక్కు మొఖం ఏమి కూడా తెలియని వాడికి పిల్లని చేస్తోంది, ఏమి పాట్లు పెడతారో?” అంటూ సుభద్ర పదిమంది దగ్గర వదిన గారిని తరచూ విమర్శించింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. సుభద్ర స్వభావం అంతే, నోరు బయట పడింది అని అనుకునేవారు.
పూజ కొద్ది పురుషుడు, ధనం కొద్ది సంబంధం, దానం కొద్దీ బిడ్డలు, అవకాశం కొద్ది చదువు, అదృష్టం కొద్దీ ఉద్యోగము అన్నారు
అవును కదా. మనుష్యులకు ఎటువంటి ఆలోచన లేక పెద్దలు చెప్పిన మాటలు విని ఎదిగే వారు కొందరు.
కొందరు వ్యక్తుల్ని మాటలతో వారి చుట్టూ తిప్పుకునే వారు మరికొందరు. ఇది అంతా మనసు స్పర్శ అంటే వారి ఇష్ట అయిష్టం పై ఆధారపడి ఉంటుంది.
అదే విధంగా జీవితంపై ప్రభావం చూపుతుంది. మనిషికి ముఖ్య అవసరం వారి ఆనంద స్వభావం. అందుకే మరి, మంచి బంధువులు, స్నేహితులు, హితులు సన్నిహితులు ఉండాలి.
పుట్టుట గిట్టుట నిజము నట్ట నడిమ పని నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పినట్లు జీవిత సత్యాలు కదా.
ఎన్ని పురాణాలు, గ్రంథాలు చదివిన ఎవరి స్తోమత వారిదే కదా. మంచి జీవితం అందరికీ కావాలి. అదే మరి ఆనందము.
శాంతి శుభము