మరుగునపడ్డ మాణిక్యాలు – 86: మిసెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్

2
3

[సంచిక పాఠకుల కోసం ‘మిసెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]‘మీ[/dropcap]రు మనస్ఫూర్తిగా ఏమైనా కోరుకుంటే మీ కోరిక తీర్చటానికి విశ్వమంతా ఏకమవుతుంది’. ఇది ఒక హిందీ సినిమాలోని మాట. ఇక్కడ చెప్పని మాట ఏమిటంటే మనసు మంచిదై ఉండాలి. మనసు మంచిదైతే మీ కోరికలు తీరతాయి. ఆ కోరిక కూడా ధర్మబద్ధమై ఉండాలి. ఈ విషయాన్ని మనసుకి హత్తుకునేలా చెప్పిన చిత్రం ‘మిసెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్’ (2022). 1958లో వచ్చిన ‘మిసెస్ ఆరిస్ గోస్ టు ప్యారిస్’ అనే నవల ఆధారంగా ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. ఫ్రెంచ్ భాషలో H అక్షరంతో మొదలయ్యే పదాలలో ఆ అక్షరం పలకరు. హ్యారిస్ ని ఆరిస్ అని పలుకుతారు. అందుకే నవల పేరులో హ్యారిస్ బదులు ఆరిస్ అని ఉంటుంది. నవల రాసినది పాల్ గాలికో. 2022 వచ్చిన చిత్రానికి దర్శకుడు ఆంథొనీ ఫాబియన్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

1957వ సంవత్సరం. లండన్ నగరం. ఏడా హ్యారిస్ ఒక పనిమనిషి. ఇళ్ళు శుభ్రం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. కుట్టుపని కూడా బాగా చేస్తుంది. చాలా నిజాయితీగా ఉంటుంది. మెతకగా కూడా ఉంటుంది. కొందరు ఆమె మెతకదనాన్ని అలుసుగా తీసుకుంటారు. ఆమె భర్త రెండవ ప్రపంచ యుద్ధంలో కనపడకుండా పోయాడు. అయినా ఆమె ఆశ వదులుకోదు. ఒకరోజు ప్రభుత్వం నుంచి ఒక పార్సిల్ వస్తుంది. తెరవటానికి ఏడా జంకుతూ ఉంటుంది. చివరికి తన స్నేహితురాలి ప్రోద్బలంతో తెరుస్తుంది. అందులో ఆమె భర్త పెళ్ళి ఉంగరం ఉంటుంది. ఆమె భర్త 1944లో పోలండ్‌లో విమానం కూలి మరణించాడని, అక్కడ ఉంగరం ఇప్పుడు దొరికిందని సారాంశం. ఏడా బాధ పడుతుంది కానీ “నా పిచ్చి గానీ బతికి ఉంటే ఏదో విధంగా నాకు తెలియజేసేవాడు” అంటుంది. ధైర్యం వదులుకోదు. ఒకరోజు ఆమెకి తాను పని చేసే ఒక ఇంట్లో ఒక అందమైన డ్రస్సు కనపడుతుంది. దాని విలువ ఐదు వందల పౌండ్లు. అంటే అప్పట్లో దాదాపు ఏడు వేల రూపాయలు. అంత డబ్బు పెట్టి డ్రస్సు కొనగలిగే వాళ్ళు మహాసంపన్నులై ఉండాలి. అయితే ఆ ఇంటి యజమానురాలు సంపన్నురాలు కాదు. భర్తకి చెప్పకుండా కొన్నది. “ఈ డ్రస్సు వేసుకుంటే అన్నీ మర్చిపోతాను” అంటుంది. అప్పటి నుంచి ఏడాకి అలాంటి డ్రస్సు కొనుక్కోవాలని కోరిక. ఆ డ్రస్సు ప్యారిస్‌లో క్రిస్టియన్ డియోర్ అనే డిజైనర్ దుకాణంలో కొన్నది. వారికి ఏ శాఖలూ లేవు. ఏడా డబ్బు దాచుకుని ప్యారిస్ వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. బట్టలకి అంత ప్రాముఖ్యం ఇవ్వవచ్చా అని అనిపించవచ్చు. మనలో చాలా మందికి ఏదో ఒక వెర్రి కోరిక ఉంటుంది. అది ధర్మబద్ధమైతే తప్పు లేదు. అదో వ్యసనంలా మారకూడదు. అంతే.

అప్పట్లో ఫుట్‌బాల్ పోటీల మీద చిన్న పందేలు ఉండేవి. ఏడా ఆ పందేల్లో పాల్గొంటుంది. నూట యాభై పౌండ్లు వస్తాయి. తన భర్త తనని చల్లగా చూస్తున్నాడని సంబరపడుతుందామె. కొంచెం కొంచెం పొదుపు చేస్తూ డబ్బు కూడబెడుతుంది. పని కూడా ఎక్కువ చేస్తుంది. నెమ్మదిగా మరి కొంత డబ్బు పోగవుతుంది. ఒకరోజు ఆమెకి రోడ్డు మీద వజ్రపు చూడామణి దొరుకుతుంది. ఆమె దాన్ని తీసుకెళ్ళి పోలీసులకి అప్పగిస్తుంది. తనది కానిది ఏదీ ఆమె తీసుకోదు. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఆమెని కుక్కల పరుగు పందేలకి తీసుకువెళుతుంది. అక్కడ పని చేసే అతని పేరు ఆర్చీ. అతను వీరికి పరిచయస్థుడే. అతను వల్లే వీరికి టికెట్లు లభించాయి. అక్కడ ‘ఓట్ కొట్యూర్’ అనే కుక్క పందెంలో ఉంటుంది. ఓట్ కొట్యూర్ (Haute couture) అంటే మంచి ఫ్యాషన్‌లో ఉన్న ఖరీదైన దుస్తులు అని అర్థం. ఏడా అది చూసి అదొక సంకేతంగా భావించి ఆ కుక్క మీద వంద పౌండ్లు పందెం కాస్తుంది. ఆర్చీ “ఆ కుక్క కొరగానిది. డబ్బు పెట్టొద్దు” అంటాడు. అయినా ఏడా వినదు. చివరికి ఆ కుక్క పందెంలో ఓడిపోతుంది. ఏడా నిరాశ పడుతుంది. కానీ మర్నాడే ఆమె దశ తిరుగుతుంది. ఆమెకి రావలసిన యుద్ధ వితంతువుల పెన్షన్ ఇన్నాళ్ళూ రాకపోవటంతో ఆ డబ్బు ఇవ్వటానికి ప్రభుత్వ ఉద్యోగి వస్తాడు. ఆమె పోలీసులకి అప్పగించిన వజ్రపు చూడామణి యజమానురాలు ఆమెకి కొంత డబ్బు బహుమతి ఇస్తుంది. ఆర్చీ ఏడా పందెంలో పెట్టిన వంద పౌండ్లలో పది పౌండ్లు తీసి వేరే కుక్క మీద పందెం పెట్టటంతో కాస్త డబ్బు వస్తుంది. ఏడా ఈ డబ్బు తీసుకోనంటుంది. కానీ ఆర్చీ ఇది నీ డబ్బే అని ఇస్తాడు. అంతా కలిపి ప్రయాణానికి, డ్రస్సుకి సరిపోయే డబ్బు పోగవుతుంది. విమానంలో ప్యారిస్ వెళ్ళి డ్రస్సు కొనుక్కుని ఒక్కరోజులో తిరిగి రావాలని ఏడా ప్రయాణమవుతుంది.

జూదం తప్పు అనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. ఏవో సంకేతాలు కనిపించాయని, అది అదృష్టమని భావించి జూదం ఆడటం మూర్ఖత్వం. స్వశక్తి పై ఆధారపడాలి గానీ అయాచితంగా డబ్బు రావాలనుకోవటం సిగ్గుచేటు. అయినా ఏడాకి కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. అదృష్టం ఎప్పుడూ కష్టపడేవారికే సహకరిస్తుంది. మానవప్రయత్నం ఉంటే దైవబలం తోడవుతుంది. ప్రయత్నమే చేయకపోతే దైవం కూడా నిరసిస్తుంది. ప్రయత్నమంటే ఒక మాట గుర్తొస్తుంది. సంస్కృతంలో ఉద్యోగం అంటే ప్రయత్నమని అర్థం. ‘ఉద్యోగం పురుషలక్షణం’ అంటే ‘ప్రయత్నం చేయటం మనిషి కర్తవ్యం’ అని అర్థం. అంతే కానీ మగవారు నౌకరీ చేయాలని కాదు. సూక్తులలో పురుషుడు అని ఎక్కడ వచ్చినా మనిషి అని అన్వయించుకోవాలి. మహాభారతంలో ‘ఉద్యోగపర్వం’ ఉంది. అందులో యుద్ధం ఆపటానికి చాలామంది ప్రయత్నాలు (రాయబారాలు) చేస్తారు. ఆ ప్రయత్నానికి సంకేతంగానే ఆ పర్వానికి ‘ఉద్యోగపర్వం’ అని పేరు. కుక్కల పరుగుపందెంలో డబ్బు పోయినపుడు ఏడా “మా ఆయనే ఉంటే నన్ను చూసి తల దించుకునేవాడు” అంటుంది. మంచి జరిగితే ‘మా ఆయన చల్లగా చూస్తున్నాడు’ అని, చెడు జరిగితే ‘నా తప్పు’ అని అనుకోవటం ఏడా మంచితనానికే కాక ఆ భార్యాభర్తల ప్రేమకి చిహ్నం. ఆర్చీకి ఏడా అంటే ఇష్టం. అయితే ఆమె తన భర్త కోసం ఇన్నాళ్ళూ వేచి చూసింది. వేరెవరినీ తలపుల్లోకి రానివ్వలేదు. ఇప్పుడు త్వరలో జరగబోయే డ్యాన్స్ పార్టీలో ఆమెతో డ్యాన్స్ చేయాలని ఆర్చీ కోరిక. ఆమె సరే అంటుంది. అయితే ఏడా మనసులో వేరే ఉద్దేశం లేదు. పరపురుషులతో డ్యాన్స్ చేయటం పాశ్చాత్య సంస్కృతిలో మామూలే. ఆమె డ్రస్సు కోసం అంత డబ్బు పెట్టటం ఆర్చీకి తప్పుగా అనిపించదు. ప్రతి మనిషికీ ఏదో ఒక కల ఉంటుంది అంటాడు. ఏడా స్నేహితురాలు మాత్రం “నీకు పిచ్చి పట్టింది” అంటుంది.

ఏడా ప్యారిస్‌కి వెళ్ళేసరికి అక్కడ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉంటారు. వీధుల్లో చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఆమె ఒక వ్యక్తి సాయంతో క్రిస్టియన్ డియోర్ దుకాణానికి వెళుతుంది. ఇది మామూలు దుకాణం కాదు. అక్కడ యువతులు డియోర్ రూపొందించిన దుస్తులు వేసుకుని అక్కడికి వచ్చిన సంపన్నులకి చూపిస్తారు. ఫ్యాషన్ షో లాగన్నమాట. వచ్చినవారు నచ్చిన దుస్తులని కొనుక్కుంటారు. ఏడాకి నటాషా అనే ఒక మోడల్ పరిచయమవుతుంది. దుకాణం నిర్వాహకురాలి పేరు క్లాడీన్. ఏడా వాలకం చూసి ఆమె ఏడాని బయటకి పొమ్మంటుంది. ఏడా “నేను ఇళ్ళు శుభ్రం చేసి కూడబెట్టిన డబ్బుతో డ్రస్సు కొనాలని వచ్చాను” అని డబ్బు చూపిస్తుంది. ఆంద్రే అనే యువకుడు అక్కడ అకౌంట్స్ విభాగంలో పని చేస్తాడు. అతను ఆ డబ్బు చూసి విస్తుపోతాడు. ఖాతాదారులెవరూ ఒకేసారి అంత డబ్బు ఇవ్వటం అతను ఎరుగడు. క్లాడీన్ మాత్రం డబ్బు చూసినా కరగదు. ఆమెకి ప్రతిష్ఠ ముఖ్యం. తమ దుకాణంలోని దుస్తులు ఏడా లాంటి అలగా జనం కోసం కాదని ఆమె భావన. ఏడాని గమనిస్తూ ఉన్న మార్కీ అనే ఖాతాదారు ఆమెని తనతో పాటు ఫ్యాషన్ షో లోకి తీసుకువెళతానంటాడు. అతని భార్య మరణించింది. అయినా అతను ఫ్యాషన్ షోలకి వస్తూ ఉంటాడు. ఖాతాదారులకి తమతో పాటు మరొకరిని తీసుకువెళ్ళే సౌలభ్యం ఉంటుంది. ఎవరూ కాదనటానికి వీలు లేదు.

ఒక పనిమనిషి లండన్ నుంచి డ్రస్సు కొనటానికి వచ్చిందనే వార్త అందరికీ తెలిసిపోతుంది. నటాషాతో సహా అక్కడ పని చేసే వారందరూ ఆమెని ఆరాధనగా చూస్తారు. ఫ్రాన్స్‌లో శ్రామికులకి ఎంతో విలువ. ఆ విలువ కోసమే పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ షో లో ఏడా పక్కన ఒక సంపన్నురాలు కూర్చుంటుంది. ఆమెకి దర్పం ఎక్కువ. ఆమె భర్త మున్సిపాలిటీ చైర్మన్. అతని కారణంగానే సమ్మె జరుగుతూ ఉంటుంది. ఆమె ఏడాని పురుగులా చూస్తుంది. షో మొదలవుతుంది. నటాషాతో పాటు మోడల్స్ దుస్తులు వేసుకుని ప్రదర్శిస్తూ ఉంటే ఏడా మైమరచిపోతుంది. “ఎంత బావున్నాయో” అనుకుంటుంది. ఆమెకి ఒక ఆకుపచ్చ డ్రస్సు, అంతకన్నా ఎక్కువగా ఒక ఎర్ర డ్రస్సు నచ్చుతాయి. షో అయ్యాక మున్సిపాలిటీ చైర్మన్ భార్య తనకి ఎర్ర డ్రస్సు కావాలని పట్టుపడుతుంది. ఆమె ముఖ్య ఉద్దేశం ఏడాకి ఆ డ్రస్సు దక్కకూడదనే. దుకాణం వారు ఆమెకే ప్రాధాన్యం ఇస్తారు. విధి లేక ఏడా ఆకుపచ్చ డ్రస్సు కొంటానని అంటుంది. దాని ఖరీదు నాలుగొందల ముప్ఫై పౌండ్లు చెల్లించటానికి ఏడా సిద్ధంగా ఉంటుంది. అయితే ఆమె కొలతలకి డ్రస్సులో మార్పులు చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఏడా రోజూ వచ్చి దగ్గరుండి కొలతలిచ్చి మార్పులు చేయించుకోవాలి. ఏడాకి ప్యారిస్‌లో వసతి లేదు. అకౌంట్స్ విభాగంలో పని చేసే ఆంద్రే తన ఇంట్లో ఉండమంటాడు. ఇందులో అతని స్వార్థం కూడా ఉంది. దుకాణం పరిస్థితి బాగాలేదు. అతని వద్ద దుకాణం పరిస్థితి మెరుగుపరచటానికి ఒక ప్రణాళిక ఉంది. డియోర్‌ని కలిస్తే ఆ ప్రణాళిక చెప్పవచ్చు. కానీ క్లాడీన్ అడ్డుపడుతూంటుంది. ప్రస్తుతం ఏడా ఇచ్చిన డబ్బు దుకాణానికి ఉపయోగపడుతుందని ఆంద్రే ఆలోచన. క్లాడీన్ మాత్రం ఏడాని వదిలించుకోవాలని చూస్తుంది. చివరికి ఏడా ప్యారిస్లో ఉండాలనే నిశ్చయించుకుంటుంది.

ఏడా మంచితనంతో ఉంటుంది కానీ ఆత్మగౌరవం వదులుకోదు. దుకాణంలోకి తన తర్వాత వచ్చిన వారిని క్లాడీన్ ముందుగా ఫ్యాషన్ షోలోకి పంపించటం పట్ల అభ్యంతరం చెబుతుంది. వరుస పద్ధతిని పాటించాలి కదా అంటుంది. మన దేశంలో వరుస పద్ధతి పాటించటం చాలా తక్కువ. వరుసలో వెళితే పని అవదేమో అని భయం. జీవన్మరణ సమస్య అయితే తప్ప వరుస పధ్ధతిని ఎప్పుడూ పాటించాలి. అదే సాటి మనిషికి మనం ఇచ్చే గౌరవం. మనలాగే అందరూ పని అవటం కోసమే ప్రయత్నిస్తున్నారు కదా. వారి పని అవకపోయినా మన పని అయిపోవాలంటే ఎంత స్వార్థం? వారూ మన లాంటి మనుషులే కదా? చిత్రంలో ఇంకో విషయమేమిటంటే ఏడా తాను పనిమనిషినని అందరి ముందూ చెప్పుకోవటానికి సిగ్గుపడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇదే. మంచి పని, చెడ్డ పని ఉంటాయి తప్ప ఎక్కువ పని, తక్కువ పని ఉండవు. ఏడా తన మీద తాను ఛలోక్తులు వేసుకుంటుంది. ఆమె కొలతలు తీసుకునేటపుడు దర్జీ “మీ శరీరాకృతి మోడల్‌లా ఉంది” అంటే “మోడల్ రైలు పట్టాలలా ఉందంటే ఎవరైనా నమ్ముతారు” అంటుంది. రైలు బొమ్మలతో పాటు వచ్చే పట్టాలలో వంపులు ఉంటాయి కదా. తన వంపులు అలా ఉన్నాయని ఆమె హస్యమాడుతుంది. కుట్టుపని చేసేవాళ్లందరూ ఆమె హాస్యచతురతకి ఆనందిస్తారు. ఆమె మంచి మనసు వల్ల ఆమెకి ప్యారిస్ నగరం సావకాశంగా చూసే అవకాశం వచ్చింది. నటాషా తన కారులో ఏడాని ఆంద్రే ఇంటికి తీసుకువెళుతుంది. ప్యారిస్ నగరంలోని కట్టడాలు చూస్తూ ఏడా ఆంద్రే ఇంటికి వెళుతుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఏడా ఇల్లు శుభ్రం చేస్తుంటే నటాషా సాయం చేస్తుంది. ఏడా వద్దంటే “పర్వాలేదు. ఫ్యాషన్ షో చేసిన తర్వాత మనసులో ఏదో వెలితిగా ఉంటుంది” అంటుంది నటాషా. ఈ ఒక్క మాటలో నటాషా పాత్ర స్వభావాన్ని చెప్పేశాడు రచయిత. బాహ్యసౌందర్యం ప్రదర్శించటం ఆమెకి ఇష్టం లేదు. ఆమెకి తత్వశాస్త్రం అంటే ఆసక్తి. ఆంద్రేకి కూడా అదే ఆసక్తి. వారిద్దరూ ఏడా తాను కోరుకున్నది పొందటానికి చేసే ప్రయత్నం చూసి అబ్బురపడతారు. చివరికి త్యాగం వల్లే మనిషికి ఇహలోక భోగాలు కూడా అమరుతాయనే సందేశం ఉంటుంది.

ఏడాగా లెస్లీ మ్యాన్విల్, క్లాడీన్‌గా ఇసబెల్ ఊపేర్ నటించారు. ఇద్దరూ గతంలో ఆస్కార్ నామినేషన్లు అందుకున్న నటీమణులే. లెస్లీ ఇంతకు ముందు ఆమె ‘ఫ్యాంటమ్ త్రెడ్’ చిత్రంలో క్లాడీన్ లాంటి పాత్రే వేసింది. ఒక డిజైనర్ దుకాణంలో కర్కశమైన నిర్వాహకురాలి పాత్ర. ఈ చిత్రంలో కస్టమర్ పాత్ర వేసి మెప్పించింది. ఎలాంటి పాత్రనైనా పోషించగలదని ఈ చిత్రంతో నిరూపించింది. ఈ చిత్రంలోని దుస్తుల రూపకల్పనకి జెన్నీ బీవన్ ని ఆస్కార్ నామినేషన్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఫ్యాషన్ షో కి ఏడాని తనతో పాటు తీసుకెళ్ళిన మార్కీ మళ్ళీ ఆమెకి తారసపడతాడు. అతను కూడా ఆమె సరళత్వాన్ని చూసి ముచ్చటపడతాడు. ఆమెని తనతో పాటు ఒక నృత్య ప్రదర్శనకి తీసుకువెళతాడు. అక్కడ ఏడా అతనితో డ్యాన్స్ చేస్తుంది. మద్యం తాగుతుంది. మద్యం ప్రభావంతో మర్నాడు ఆలస్యంగా నిద్ర లేస్తుంది. ఆలస్యంగా దుకాణానికి వెళుతుంది. దాంతో అక్కడ దర్జీ అసహనంతో ఆమెకి దుస్తులు కుట్టనని అంటాడు. క్లాడీన్ అతన్ని సమర్థిస్తుంది. ఏడా నిరాశపడుతుంది. లండన్ వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంటుంది. దుకాణంలో పని చేసే అమ్మాయి ఆమెని చూసి జాలి పడుతుంది. వేళ్ళేముందు ఆమెని ఉత్సాహపరచటానికి దుస్తులు ఎలా తయారు చేస్తారో చూపిస్తుంది. ఏడా దుస్తుల తయారీ చూసి ఆనందిస్తుంది. అక్కడి వారి పనితనం ఆమెని కట్టిపడేస్తుంది. ఆమెకి కుట్టుపని వచ్చని తెలిసి దర్జీ ఆమెకి కుట్టుపని ఇస్తాడు. ఆమె నైపుణ్యం చూసి అతను ఆమె డ్రస్సు కుట్టటానికి మళ్ళీ ఒప్పుకుంటాడు. క్లాడీన్‌కి ఇది కంటగింపుగా ఉంటుంది. “ఈ డ్రస్సు కొనుక్కుని నువ్వేం చేస్తావు? అల్మారాలో దాచి ఉంచుతావా? ఈ డ్రస్సుకి తగిన జీవితం నువ్వు ఇవ్వగలవా?” అని అడుగుతుంది. మనిషి జీవితం కంటే ఆ డ్రస్సు జీవితమే ఆమెకి ముఖ్యం. ఎంత వింత! ఏడా స్థిరంగా “ఇది నా స్వప్నం. నేను డబ్బు ఇస్తున్నానుగా” అంటుంది. క్లాడీన్ ఆమెని “You are a nobody” అంటుంది. అంటే ఆమె జీవితానికి విలువ లేదని. ఇంతలో మార్కీ ఏడాని తేనీటి విందుకి ఆహ్వానించాడనే సందేశం వస్తుంది. క్లాడీన్ ఆశ్చర్యపోయి “He receives nobody” అంటుంది. ఎవరినీ ఆహ్వానించని అతను ఏడాని ఆహ్వానించటం ఆమెకి వింతగా ఉంటుంది. ఏడా “Well. I am a nobody” అంటుంది. Nobody అనే పదాన్ని వివిధ అర్థాల్లో వాడటంతో ఈ శ్లేష సాధ్యమయింది.

సమాంతరంగా జరిగే కథలో నటాషా దుకాణం ప్రచారం కోసం ఇతర పురుషులతో కార్యక్రమాలకు వెళుతూ ఉంటుంది. ఆంద్రే ఆమెకి తత్వశాస్త్రం ఇష్టమని తెలిసి ఆమెని ప్రేమిస్తాడు. ఏడా అతన్ని నటాషాతో తన మనసులో మాట చెప్పమంటుంది. ఆంద్రే లోకం పోకడ తెలిసిన వాడు. అతను “అది జరిగే పని కాదు. నన్ను ఒత్తిడి చేయకండి. ఇదంతా చూస్తుంటే మీరు ప్రేమ కోసం తపిస్తున్నారనిపిస్తోంది” అంటాడు. ఏడా ఆలోచనలో పడుతుంది. మార్కీ తనంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి అతనికి తోడుగా ఉండాలని అనుకుంటుంది. మర్నాడు మార్కీ ఇంట్లో తేనీటి విందుకు వెళుతుంది. అతను “చిన్నప్పుడు నన్ను బోర్డింగ్ స్కూల్లో వేశారు. అక్కడ ఇతర విద్యార్థులు నన్ను ఏడిపించేవారు. అప్పుడు ఒక పనిమనిషి నన్ను సముదాయించేది. మిమ్మల్ని చూస్తే ఆమె గుర్తువచ్చింది. మీరు కూడా ఏమీ ఆశించకుండా ఇతరులకి ఆనందాన్ని పంచుతారు” అంటాడు. ఏడా హతాశురాలవుతుంది. అతను తనని ప్రేమించలేదని, తన సాంగత్యంలో సాంత్వన మాత్రమే వెతుక్కున్నాడని ఆమెకి అర్థమవుతుంది. వేరే రచయిత, దర్శకుడైతే నేల విడిచి సాము చేసి వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చూపేవారేమో. నిజజీవితంలో అలా జరగటం అరుదు. ఏడా ఎప్పుడెప్పుడు ఊహాలోకంలోకి వెళుతుందో అప్పుడప్పుడు ఆమె మళ్ళీ నేల మీదకి వచ్చే సంఘటన జరుగుతుంది. జీవితం అంతే కదా? గాలిమేడలు కడితే అవి కూలిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు.

మర్నాడు ఏడా దుకాణానికి వెళ్ళేసరికి కొందరు కుట్టుపని చేసే వారు ఉద్యోగం నుంచి తొలగించబడతారు. ఏడా వారిని తీసుకుని క్లాడీన్ దగ్గరకి వెళ్ళి “ఇలా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? వారి కుటుంబాలు ఏమవుతాయి?” అని అడుగుతుంది. క్లాడీన్ “అది నీకు అనవసరం” అంటుంది. ఏడా అక్కడి పనివారినందరినీ సమ్మె చేయండని చెప్పి వారిని తీసుకుని డియోర్ దగ్గరకి వెళుతుంది. ఆంద్రేని పిలిచి “దుకాణం పరిస్థితి మెరుగవటానికి నీ ప్రణాళిక ఏమిటో చెప్పు” అంటుంది. ఆంద్రే తన ప్రణాళిక చెబుతాడు. “అందరూ ఇక్కడికి వచ్చే కన్నా మనమే అన్ని చోట్లకీ వెళ్ళాలి. సాధారణ మహిళ కొనుక్కునేలా మన ఉత్పత్తులు ఉండాలి” అంటాడు. క్లాడీన్ “అప్పుడు మనకి ప్రత్యేకత లేకుండా పోతుంది” అంటుంది. డియోర్ ఆమె మాట పట్టించుకోడు. ఆంద్రే మాట నెగ్గుతుంది. అమ్మకాలు విస్తరించనున్నారు కాబట్టి ఉన్నవారి ఉద్యోగాలే నిలవటమే కాక కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. అందరూ ఆనందిస్తారు. క్లాడీన్ తప్ప. ఏడా ఆంద్రేని తీసుకుని క్లాడీన్ ఇంటికి వెళుతుంది. ఏడా భర్త యుద్ధంలో గాయపడి మంచంలో ఉంటాడు. అయినా ఏడా తనకి పరాభవం జరిగిందని ఉద్యోగం వదిలేయటానికి సిద్ధపడుతుంది. ఏడా “ఆడది లేకపోతే ఈ మగవాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు మీ అవసరం ఇంకా ఎక్కువుంది” అంటుంది. క్లాడీన్ మెత్తబడుతుంది. ఉద్యోగానికి తిరిగి వెళ్ళటానికి సిద్ధపడుతుంది. ఇదంతా చూస్తే ఇదేదో శ్రామికుల విలువ తెలిపే కథలా అనిపిస్తుంది. కానీ కథలో మానవీయ కోణం తర్వాత బయటపడుతుంది. ఏడా ప్రోద్బలంతో ఆంద్రే నటాషాతో మాట్లాడతాడు. నటాషాని మోడల్ పని వదిలేసి తత్వశాస్త్రం చదవమంటాడు. నటాషాకి అదే కావాలి. ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఏడా తన డ్రస్సు తీసుకుని లండన్ వచ్చేస్తుంది.

ఈ మొత్తం ఉదంతంలో సంపన్నులని అకట్టుకోవటం కన్నా సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంటే లాభాలు ఎక్కువ అనే సూత్రం కూడా ఉంది. ఇలా అయితేనే వ్యాపారాలు నిలబడతాయి. ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో కూడా ఇదే సూత్రం చెబుతుంది నాయిక. సూపర్ మార్కెట్ అమ్మకాలు పెంచటానికి అందరూ తర్జనభర్జన పడుతుంటే “మీ సూపర్ మార్కెట్‌కి సామాన్యులు రారు. మీ హంగు చూసి భయపడతారు. అందువల్ల మీరే మా పేటలకి రండి. మా ఇళ్ళ గుమ్మాల్లో వారం వారం డేరాలు వేసి అమ్మండి. ఇదేం కొత్త ఐడియా కాదు. పూర్వం మన పల్లెల్లో వారం వారం సంత ఉండేది కదా. అలాగన్నమాట” అంటుంది. వ్యాపారం ఎంత పెద్దదయినా సూత్రాలు మాత్రం అవే.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఏడా ఇంటికి ఒకనాటి సాయంత్రం ఒక నటి వస్తుంది. ఆమె ఇంట్లో ఏడా పని చేస్తుంది. ఆ నటి తాను వెంటనే ఒక నిర్మాతని కలవటానికి వెళ్ళాలని, తన డ్రస్సు మీద వైన్ మరక పడిందని అంటుంది. ఆ డ్రస్సు చూపిస్తుంది. ఏడా మరక తొలగిస్తుందని ఆమె ఆశ. కానీ ఆ మరక వెంటనే తొలగదని ఏడాకి తెలుసు. ఆ నటి దగ్గర మరో డ్రస్సు ఉంది కానీ అది డ్రై క్లీనింగ్‌కి ఇచ్చింది. ఆ నటి ఏడుస్తుంటే ఏడా తాను ప్యారిస్ నుంచి తెచ్చుకున్న డ్రస్సు ఇస్తుంది. ఆ నటి సంతోషంగా ఆ డ్రస్సు వేసుకుని వెళుతుంది. ఏడా ఒక్కసారి కూడా ఆ డ్రస్సు వేసుకోలేదు. ఆ నటి వెళ్లిన పార్టీలో హీటర్ అంటుకుని ఆ డ్రస్సు కొంత భాగం కాలిపోతుంది. ఏడా ఆ నటి ఇంటిని శుభ్రం చేయటానికి వెళ్ళినపుడు ఆ డ్రస్సుతో పాటు ఒక ఉత్తరం ఉంటుంది. డ్రస్సు కాలిపోయినందుకు ఆ నటికి అపరాధభావం ఏమీ ఉండదు. పైగా ఆమెకి ప్రచారం లభిస్తుంది. ఏడా కుంగిపోతుంది. ఆ డ్రస్సు తీసుకెళ్ళి నదిలో పారేస్తుంది.

కొన్నాళ్ళకి ఆమెకి డియోర్ దుకాణం నుంచి ఒక ప్యాకేజి వస్తుంది. అందులో పైన ఒక ఉత్తరం ఉంటుంది. “మీ సహృదయత వల్ల ఏం జరిగిందో పేపర్లో చూశాం. ఇక్కడి వార్త ఏమిటంటే మున్సిపల్ చైర్మన్ కార్మికుల డబ్బు దొంగిలించటం వల్ల అతన్ని అరెస్టు చేసి అతని ఆస్తులని జప్తు చేశారు. అతని భార్య ఎర్ర డ్రస్సుకి పూర్తి డబ్బు కట్టే పరిస్థితిలో లేదు. మీ కొలతలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డ్రస్సుకి మీ కోసం మార్పులు చేసి పంపిస్తున్నాం” అని సందేశం. ఏడా ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఆ డ్రస్సు వేసుకుని ఆర్చీ చెప్పిన డ్యాన్స్‌కి వెళుతుంది. అక్కడ ఆర్చీ ఆమెని చూస్తూ ఉండిపోతాడు. “డ్రస్సు అద్భుతంగా ఉంది. కానీ నేను నిన్ను చూస్తున్నాను. నీలో ఉన్న ఆ మెరుపుని చూస్తున్నాను. నీలో అంతఃసౌందర్యం ఉంది” అంటాడు. ఏడాకి అతనికి తన మీద ప్రేమ ఉందని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు.

ఏడా సంకుచితంగా ఆలోచించి తన ఆకుపచ్చ డ్రస్సు ఆ నటికి ఇవ్వకపోయి ఉంటే ఆమెకి ఎర్ర డ్రస్సు వచ్చేది కాదు. త్యాగం వల్లే అమృతత్వం వస్తుందని ఉపనిషత్ వాక్యం. త్యాగం వల్లే ఐహిక వాంఛలు కూడా తీరతాయి. మనిషి మనసు నిష్కకల్మషంగా ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచంలో పరిణామాలు కూడా అనుకూలంగా మారిపోతాయి. ప్యారిస్‌లో అవినీతిపరుడైన మున్సిపల్ చైర్మన్ జైలుకి వెళ్ళటం అలాంటి పరిణామమే. త్యాగం చేస్తే ఉన్నది కోల్పోతామని మనం త్యాగం చేయటానికి సంకోచిస్తాం. శ్రీరామనవమి సందర్భంగా త్యాగం విలువ మరోసారి గుర్తు చేసుకోవాలి. రాముడు రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. నెల తిరగకుండానే భరతుడు, కైకేయి అతన్ని వెతుక్కుంటూ అడవిలో ఉన్న అతని దగ్గరకి వచ్చారు. త్యాగం అంత గొప్పది. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి చెప్పినట్టు ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ అంటే పెడర్థాలు తీయకూడదు. దాని అర్థం ఇంట్లో తగాదా వస్తే రాముడిలా త్యాగం చెయ్యి. సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంటే కృష్ణుడిలా ధర్మం తరఫున నిలబడి ధర్మాన్ని గెలిపించు. ఇంట్లో వాళ్ళతో గొడవ వస్తే సౌమ్యంగా పరిష్కరించుకోవాలి. అవతలివారు మొండిగా ఉంటే త్యాగమే సమాధానం. ఇవాళ కాకపోతే రేపైనా దాని విలువ వారికి తెలుస్తుంది. వారికి తెలియకపోయినా దైవానికి తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here