[box type=’note’ fontsize=’16’] బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు”. ఇది ఐదవ భాగం. [/box]
14
[dropcap]ఎ[/dropcap]త్తయిన అరుగులు ఉన్న ఒక అందమయిన ఇంట్లోకి ప్రవేశించారు సిద్ధార్థుడు, జ్ఞానముని వారు. ఇచ్చిన ఫలములూ పానీయములు స్వీకరించి వారు సిద్ధం చేసిన పడకలపై నిదురకు సిద్దమయినారు. కానీ సిద్ధార్థునికి కంటిమీద కునుకు రాలేదు. వేల వేల ఆలోచనలతో అతని మనసు భారమయ్యింది. మాటి మాటికీ.. ప్రసవవేదన పడుతున్న ఆ తల్లి అరుపులు, ఆ ఇంటి యజమాని రోదన గుర్తుకువచ్చి మనసు వికలమయి పోయింది. ఏ అర్ధరాత్రి వేళనో కాస్సేపు కన్ను అంటుకున్నది సిద్దార్థునకు. ఉదయం కాస్త ఆలస్యంగా లేచి ఏదో అలికిడి అవుతుంటే కన్నులు తెరిచాడు. ఒకసారిగా రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. మళ్ళీ బయట ఏవో శబ్దాలు అవుతుండడంతో కిటికీ దగ్గరకు వెళ్లి చూసాడు.
ఎదురుగా ఒక కోవెల ఉంది. ఆ కోవెల మెట్లపయినా కొందరు మనుష్యులు చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డారు. వారు వస్తూ పోతున్న వారిని చేయి చాచి అడుక్కోవడం.. కొందరు కసురుకోవడం మరి కొందరు వారికి కొన్ని నాణెలు వేస్తుండడం చూసాడు. వారి వంకే ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ఇంటి యజమాని వచ్చి…
“నాయనా కాలకృత్యములు తీర్చుకుని స్నానపానాదులు ముగించుకోండి. కాస్త ఫలహారం చేద్దురుగాని” అని పిలిచాడు.
స్నానానంతరం సిద్ధార్థుడు గురువుగారితో ఇక్కడకు అతి సమీపమున ఒక కోవెల ఉన్నట్లున్నది. కోవెలకు వెళదామని అడిగాడు. సరే అనిఆ ఇంటి యజమానితో కల్సి కోవెలకు బయలు దేరారు.
అందరూ కలసి కోవెలకు వెళ్లి జగన్మాతకు మొక్కి బయటకు వచ్చారు. గురువుగారి మెల్లగా మెట్లు దిగుతుండగా… వంటి మీద సరియన దుస్తులు కూడా లేకుండా మురికోడుతున్న ముఖాలతో వున్నా వారిని చూసి మనసు కలచి వేసింది. వారిని సమీపించి పలుకరించాడు..
“ఏమి చేయుచున్నారు మీరిచట..?” ఆశ్చర్యంగా అడిగాడు. సిద్ధార్ధుని వంక ఒక వెర్రి వాడిని చూసినట్లు చూసారు వాళ్లు. జవాబు చెప్పకుండా ఇతర భక్తులను అడుక్కోవడం మొదలు పెట్టారు. కానీ వాళ్లలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి…
“ఏమి చేస్తాము బాబు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేనోల్లం. నలుగురు తిరిగే చోటున చేరి సొమ్ములు అడుక్కుంటుంటాం. మీరంతా ఉన్నోళ్లు దయగలిగినోళ్ళు… మీరు వేసే సొమ్ములు మాకు ఆధారం. ఏ అమ్మన్న కాసింత పెడితే తింటాము. లేకుంటే పస్తులుంటాము.”
“అదేమిటి అసలు ఎందుకిలా ఒకరిని అడుక్కోవాలి? ఏదయినా కొలువు చేసుకోవచ్చుకదా!”
“చేసుకోవచ్చు. కానీ అందరూ మీలాగా జాలి పడేవాళ్ళేగాని… మాకు కొలువులిచ్చే వారు ఎవరుంటారు? భిక్షుక కుటుంబంలో పుట్టినవారం. చదువు సంధ్య లేనివాళ్ళము. పనీ పాటా తీరు తెలియని వారం. మేము చేయగల కొలువులేమి ఉంటాయి.”
“మీకు ఇల్లు లేదు అంటున్నారు. మరి ఎక్కడ ఉంటారు?”
“దేశమేలే మారాజుకు మాలాంటి పేదల గురించి పట్టదేమోగాని లోకమేలే రారాజు ఆ దేవుడిచ్చిన నేల ఈ భూపెపంచకం. బాటలు పక్కన, చెట్టునీడల్లో… పాడుబడిపోయిన భవనాలలో ఎక్కడయినా ఉంటాము. ఎక్కడికయినా వెళతాము. యాచన చేస్తాము. వచ్చిన కొద్దీపాటి సొమ్ముతో కడుపు నింపుకుంటాము. సొమ్ములందనినాడు పస్తుంటాం” అతను తన శరీరం మీద ఉన్న పుండ్లపయి వాలుతున్న ఈగలను తోలుకుంటూ అన్నాడు.
రాత్రి పడ్డ వర్షానికి ఆ చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ ఇంకా బురద బురదగా ఉన్నాయి. అక్కడే చలికి వణుకుతున్న కొందరు ముసలి వారిని, ఆకలితో ముడుచుకు పడుకున్న మరి కొందరు బిక్షకులను చూసాడు. వారిలో ఒక ముసలమ్మ కాస్త విసురుగా..
“ఏందయ్యా ఏదో ఇప్పుడే బొడ్డూడిన పసివాడిలా మాట్లాడుతున్నావే..! అసలు బిచ్చగాళ్లంటే ఎవరో.. బిచ్చమెత్తుకోవడం అంటే ఏమిటో తెలియని అమాయకుడిలా మాట్లాడుతుండావు. ఇప్పుడే కండ్లు తెరిసిండావా ఏమి..? చాలు చాలు నీ దగ్గర ఉంటే కాసిన్ని సొమ్ములు దానంచేసి పో.. లేకుంటే ముందుకు సాగిపో. సొమ్ములు వేసే వారికి అడ్డుగా నిలుచుని మాతో నీకు మాకు మాటలెందుకు?” అన్నది.
సిద్ధార్థుడు ఈ మాటలను పట్టించుకోనేలేదు. ఏదో దీర్ఘాలోచనతో విచారవదనుడయి ఒక పక్కన నిలిచి చూస్తున్న సిద్దార్ధుణ్ణి చూసి మరో ముసలమ్మ…
“పోనీ మా అందరిని మీ ఊరు తీసుకు పోతావేంటి సామి…? మీ ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా బువ్వ పెట్టించు. వంటినిండా గుడ్డలు కట్టబెట్టి, వెచ్చని దుప్పట్లు కప్పి పడుకోబెట్టు. ఇట్లా వట్టిగా నిలబడి చూస్తే ఏమొస్తది చెప్పు..” నవ్విందొక ముసలమ్మ. ఆమె మాటలకు అక్కడ ఉన్న వారంతా నవ్వారు.
గుణాధీశుడు వడివడిగా వచ్చి వారందరికీ కొద్దిగా సొమ్ములు ఇచ్చి సిద్దార్ధుణ్ణి చేయి పట్టి ముందుకు నడిపించుకు తీసుకుకెళ్ళాడు.
ఆ ఇంటి యజమాని మహేశుడు నాయన రాచ బంధువుయిన మీకు మా వలన మీకు ఏమయినా అసౌకర్యం కలిసాగితే మన్నించండి. ఫలహారం తిని విశ్రమించండి” అన్నాడు.
“అటువంటిదేమీ లేదు మహానుభావా..! వేళ గాని వేళ వచ్చి మేమే మీకు అసౌకర్యం కలిగించాము. మీ సేవలు అపురూపం. మీకు బహుదా ధన్యవాదాలు.” అన్నాడు సిద్దార్థుడు. “మీ రాక వలన మాకు కడు సంతోషం కలిగినది చిన్న వయసులోనే మీరు మంచి జిజ్ఞాస పరులని ఇంట చిన్న వయసులోనే మంచి వ్యాపారమేదో చేయనెంచి ఇక్కడకు వచ్చినారని విన్నాం. చాల సంతోషం. మా వాల్ల మీకు మరేమయిన సహాయం కావాలనన్న తప్పక చేస్తాము.” అన్నాడు మహేశుడు.
“మేము ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం. ముందు ముందు మీ సహాయం మాకు చాలా ఉన్నది. తప్పక మళ్ళీ మిమ్ములను కలుస్తాం. మిమ్ములను కూడా మా వద్దకు ఆహ్వానిస్తాము. వీలు చూసుకుని తప్పక వచ్చి మాకు సహకరించండి.”
“అయ్యో అదెంత భాగ్యం. మీరు అడగాలే గాని మీకు ఏ సహాయమయినా తక్షణం అందించడానికి మా పరివారమంతా సిద్ధంగా ఉంటాము. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాము”.
మహేశుని వద్ద సెలవు తీసుకుని సిద్ధార్థుడు, జ్ఞానముని, గుణాధీశుడు ఇతర భటులు బయలు దేరారు.
15
భారమయిన గుండెతో వెనుతిరిగిన సిద్ధార్ధుని అశ్వం వేగం తగ్గింది. దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్లు అతని ముఖ కవళికలు తెలుపుతున్నాయి. అతని మనసు ఎంత వికలమైందో చిన్నబోయిన అతని మోమే చెబుతున్నది. దానికి తగ్గట్లు దారంతా రాత్రి కూలిపోయిన గుడిసెలను తిరిగి సరి చేసుకుంటున్న వాళ్ళు .. ఆ మార్గమంతా పడిపోయిన చెట్లను పక్కకు తొలగిస్తున్న వారు కనపడ్డారు. కాస్త ఎండ కనపడగానే హాయిగా అరుస్తున్న జంతుజాలం కనపడింది. చేన్లో గుమిగూడి కళ్ళంలో లోని పంట స్థితేమిటో చూసుకుంటూ దీనావస్థలో ఉన్న రైతులు కనపడ్డారు. కొంత దూరం ప్రయాణము కావించాక సిద్ధార్థుడు ఒక పెద్ద మర్రి వృక్షం కింద అశ్వాన్ని నిలిపాడు. వెళ్లి ఆ చెట్టుకింద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
అతన్ని చూసి, మిగితావారు కూడా తమ అశ్వాలను ఆపి సిద్ధార్ధుని వద్దకు చేరారు. కానీ చాలా గంభీరంగా అక్కడ కూర్చున్న కుమార రాజావారితో మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోయారు.
సిద్ధార్ధునికి తానూ కోటనుండి బయలు దేరిన దగ్గరనుండి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూసిన సంఘటనలన్నీ మనసులో మెదులుతుండగా… అతని మనసు చాలా సంఘర్షణకు గురికావడం మొదలుపెట్టింది.
ప్రియ శిష్యుణ్ణే గమనిస్తున్న జ్ఞానముని ఇప్పుడు అతని మానసిక స్థాయి ఎలా ఉందో అంచనా వేయడానికి ప్రయత్నించసాగాడు. పైగా ఆ విశాల మఱ్ఱివృక్షము అక్కడ కూర్చున్న సిద్ధార్థుడు.. అతని మౌనముద్ర.. ఇవ్వన్నీ జ్ఞానమునిని అత్యంత కలవరపాటుకు గురిచేసాయి.
“చరిత్ర తిరగబడుతున్నాదా.? సిద్దార్థుల వారు ఏమి మాట్లాడబోతున్నారు.? ఏమి చేయబోతున్నారు.? ఇప్పుడు అతను తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే రాజుగారు, రాణిగారు ఏమయిపోతారు.?” గుండెల్లో తీవ్రమయిన అలజడి మొదలయ్యింది అతనికి.
గుణాధీశుడు, గోపాలుడు మిగితా వారు కూడా దూరాన నిలిచి ఆందోళనగా సిద్ధార్ధుని వంక చూడసాగారు. చివరకు జ్ఞానముని కాస్త చొరవ చేసి..
“నాయన..! ఇప్పుడు ఏ దిశగా మన ప్రయాణం..?” అని అడిగాడు.
సిద్ధార్థుడు సాలోచనగా గురువుగారి వంక చూసాడు. వరుస ప్రయాణాలు.. అలుపెరుగక తిరగడం, అకాల భోజనం, సరయిన విశ్రాంతి లేకపోవడం వలన జ్ఞానముని మోములో బడలిక తెలుస్తున్నది. సిద్దార్థునకు మొదటిసారిగా గురువుగారిలో వృద్దాప్య చిహ్నాలు కనపడ్డాయి. వారు కొంత నలతగా కూడా కనపడ్డారు.
సిద్ధార్థుడు లేచి గురువుగారి ముందు నిలిచి ప్రణామమం చేసి ..
“గురువుగారు..! మన్నించండి. నా తపనలో మీ వయసును, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసాను. నా వలన మీకు కలిగిన ఇబ్బందికి నన్ను మన్నించండి. శిష్యుడు కోరగానే మీరు నా రక్షణకో, సహాయానికో నాతోపాటు తిరిగారు. ఎన్నో అనుభవాలకు నాకు సాక్షీభూతులయినారు. అందుకు మీకెంతో కృతజ్ఞడను. ఇక చేయవల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికయినా అవి మొదలు పెట్టకుండా ఇలా ఎంత తిరిగినా వ్యర్ధం. అందువలన మనం రాచనగరుకే బయలు దేరుదాము. మీకు కూడా కొంత కాలం తక్షణ విశ్రాంతి అవసరం.” అన్నాడు.
గురువుగారి గుండెలో భారమంతా ఒక్కసారిగా దిగిపోయినట్లయ్యింది.
“నాయనా..! నీవు రాకుమారునివయితే నేను రాచగురువును. నేను దృఢంగా నిలబడకపోతే ఇక నీకు నేనేమి నేర్పగలుగుతాను చెప్పు. ఈ పర్యటన కూడా మీ విద్యలో ఒక భాగంగానే భావించాను.”
“అందులో సందేహం లేదు గురువర్యా! ఇక బయలుదేరుదాము పదండి.” అందరూ సంతోషంగా వెనుతిరిగారు.
బయలుదేరారే గాని జ్ఞానమునికి, గుణాధీశునికి ఈ పర్యటనలో తాము ఎదుర్కొన్న అనుభవాలకు రాకుమారుని ప్రతిస్పందన ఎలా ఉంటుందో? అతను ఏమిచేయనున్నడో.? అని మనసులో కంగారుగానే ఉన్నది.
16
రాచమందిరంలో ఆనందసందోహం నెలకొన్నది ఏడు రోజుల పర్యటన ముగించుకుని రాకుమారులు వారు తిరిగి వస్తున్నారన్న వార్త వారికి చేరింది.
కుమారుడు తిరిగి వస్తున్నాడు అనగానే రాణీ మాలినీదేవి మనసు తేలికపడింది.
“ఎంత అలసి వస్తున్నాడో.? ఏమి తిన్నాడో..? ఎక్కడ పరున్నాడో..? ఎలా ఉన్నాడో..?” అని ఆమె కన్నమనసు పరితపించి పోతున్నది. పరిచారికలను వంటశాలకు పంపి కుమారుని కోసం పంచభక్ష్య పరమాన్నాలను, నవకాయ కూరలను సిద్ధం చేయించమని చెప్పింది.
సిద్ధార్థుడు రాజ్య పర్యటన ముగించుకుని క్షేమముగా తిరిగి వస్తున్నందుకు తండ్రి మనసు ఉప్పొంగింది. కానీ, “కుమారులవారు వచ్చి ఎటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చుతారో? వారు సంతోషంగా ఉన్నారో? చిరాకుగా ఉన్నారో? ఆందోళనగా ఉన్నారో? ఆగ్రహంగా ఉన్నారో?” ఊహించలేక పోతున్నాడు శశాంకవర్మ మహారాజు. రాచభటులను పిలిపించి కుమారుల మందిరాన్ని అందంగా అలకరింపమని చెప్పాడు.
తన అనుంగు సోదరుడు రాకకు వాసంతికకు ఎక్కడ లేని హుషారు వచ్చింది. తమ్ముడు ఎవరికీ ఏమి చెప్పినా చెప్పుకున్నా తన మనసులోని భావాలన్నీ వాసంతికకు చెప్పుకోవడం అలవాటు. అలాగే వాసంతిక కూడా తమ్ముడు చెప్పే విషయాలన్నీ ఒక స్నేహితురాలి వలె ఓపికగా విని తగిన సలహాలు చెబుతుంటుంది. అలాగే తానూ ఎప్పటికప్పుడు తన మనసు పంచుకుంటుంటుంది. కానీ ఇప్పుడు తన తమ్ముడు మనసు ఎలా ఉందో ఆమె ఊహించలేక పోతున్నది.
ఇక మంత్రులంతా “పిన్నవయస్కుడిని ఒక అనుభవశూన్యుణ్ణి పర్యటనకు పంపారు. తమనెవ్వరినీ వెంటపంపలేదు. ఇప్పుడు ఏమి కానున్నదో! అసలే రాకుమారుడు అమితమయిన జాలి, దయ కలవాడు. అన్నిటికీ విపరీతంగా చలించిపోయి మనస్తత్వం ఉన్నవాడు. అసలు రాచనగరుకు చేరుతాడో, తధాగతుని వోలె దారిలోనే నిలిచిపోతాడా..? ఇక ముందు తానే రాజ్యమేలుతానంటాడో.. లేక పూర్తిగా సన్యసిస్తానంటాడో” అని పలురకాలుగా తలపోయసాగారు.
* * *
నిశి కమ్ముకున్న వేళ నీలాకాశంలో చంద్రుడరుదెంచినట్లు రాకుమారుడు రాచమందిరానికి చేరుకున్నాడు. తొలుత మహారాణి అంతఃపురానికి వేగంగా చేరుకున్నాడు. కుమారుని అంతరంగమెరిగిన మహారాజు శశాంకవర్మ, కుమార్తె వాసంతికతో కలసి అక్కడే ఉన్నారు.
ప్రణామం చేయుటకు వస్తున్న కుమారునికి ఎదురేగి ఆమె ఆత్మీయాలింగనం చేసుకున్నది రాణీ మాలినీదేవి. తల్లిని చూడగానే చాల భావోద్వేగానికి గురయినాడు రాకుమారుడు.
అనంతరం తండ్రిని చేరుకొని వారికి పాదాభివందనం చేసాడు సిద్ధార్థుడు. “ఏంత వడలిపోయావో నాయనా..!” అన్నది తల్లి.
“ఏమి కుమారా! మీ పర్యటన విజయవంతమయినదా. మీ కోరిక తీరినదా?” అని అడిగాడు శశాంక వర్మ.
రాకుమారుడు ఒకింత మౌనం వహించాడు. అతడి గంభీరమయిన మోము చూసి చాల కలత పడింది మాలీనిదేవి. ఇక మనసులోనే తీవ్రమయిన ఆందోళన పడ్డాడు మహారాజు. కొన్ని క్షణాల మౌనానంతరం..
“తండ్రీ..! నేను కోరగానే నన్నుఇట్టి పర్యటనకు పంపినందుకు మీకు బహుధా ధన్యవాదాలు. నా పర్యటన చాల బాగా జరిగినది. ఆ విషయములన్నటినీ నేను మీకు రేపు వివరిస్తాను. నాకోసం ఎదురు చూస్తూ మీరు చాల ఆందోళన చెందినట్లున్నారు. నేనేమీ యుద్ధరంగానికి వెళ్లలేదే.? మీరు సుభిక్షంగా పాలిస్తున్న రాజ్యానికే వెళ్ళాను. అనతి కాలములోనే తిరిగి వచ్చాను. పైగా నేనేమి వంటరిగా కూడా వెళ్ళలేదు. అనుభవజ్ఞులయిన గురువుగారితో కలసి వెళ్ళాను తరువాత మీరు పంపిన పరివారం కొందరు జతకలిశారు. మాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు” వివరించాడు.
“మాతా..! మేము ఎక్కడకు వెళ్లినా ప్రజలు మమ్ములను చాలా ఆదరించారు. వారికి తోచిన రీతిలో అతిథ్యమిచ్చారు. నేను సంతోషంగానే ఉన్నాను. మీరు ఇక నిశ్చింతగా ఉండండి” అన్నాడు. కుమారుని మాటలతో మాలీనిదేవి మనసు చాలా తేలికపడింది.
“సోదరీ..! ఎలా ఉన్నావు..? రేపు ఉదయం మనం చాలా మాట్లాడుకొవాల్సి ఉన్నది. త్వరగా లేచి సిద్ధంగా ఉండాలి మరి.” అని చెప్పాడు.
సిద్ధార్ధుని స్నాననంతరం అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. ఎవరి మందిరానికి వారు చేరుకొని విశ్రమించారు.
17
ఉదయానే స్నానాదులు ముగించుకుని సోదరుని రాకకై ఎదురు చూడసాగింది వాసంతిక. కొంత సేపటికి సోదరుని ఆగమన విషయము తెలుసుకుని సంతోషముగా ఎదురు వెళ్ళింది.
“చెప్పు సోదరా.! రాత్రి నీవు తిరిగి రాగానే మనసు విప్పి మాట్లాడలేదు. పెద్దవాళ్ళను సంతోషపెట్టే మాటలు మాత్రమే మాట్లాడవు. నీ వద్దనుండి అన్నివిషయములు వినవలెనని నా మనసు వేగిరపడుతున్నది.”
“అవును సోదరి..! ఇంత బాగా నా మనసును నీవుగాక మరెవరు గ్రహిస్తారు చెప్పు. నాకయితే ఈ పర్యటనకు నిన్నుకూడా తీసుకెళితే బాగుండేది అనిపించింది. కాకపొతే నీవు చాల ఇబ్బందిపడాల్సి వచ్చేది. సోదరీ ..! మనము ఉంటున్న ప్రపంచము ఒకటి. నేను చూసి వచ్చిన ప్రపంచము మరొకటి.”
“తప్పకుండా చాలా వ్యత్యాసం ఉంటుంది సోదరా..! మనది రాచకుటుంబం. మనం పొందుతున్న సౌకర్యాలు వేరు. అనుభవిస్తున్న సుఖాలు వేరు. వారు సామాన్య ప్రజలు. నిత్య జీవితంలో వారు ఎన్నో ఇక్కట్లు పడుతుంటారు. అందునా నీవు మరీ పల్లెలను కూడా పర్యటించి వచ్చావు. ప్రత్యక్షంగా వారి సమస్యలను చూసి వచ్చి ఉంటావు కాబట్టి చాల సంఘర్షణ ఉంటుందనేది ముందే ఊహించాను. అయినను ప్రపంచాన్ని నీ కళ్ళతో చూసి వచ్చిన నీ అనుభవాలు వినడానికి సిదంగా ఉన్నాను ఇక వివరించు మరి..”
వాసంతిక ఆలోచనా శక్తిని గాంచి ఆశ్చర్యచకితుడయినాడు సిద్ధార్థుడు.
“సోదరి నీవు ఇంతా బాగా గమనించాక ఇక చెప్పేదేముంది? మనం సమస్యల గురించి చర్చిస్తూ కాలం వృథా చేయడం కంటే ఏమి చేయాలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. నేను నీతో ఏమి చెప్పదలుచుకున్నానంటే.. నా పర్యటన కేవలము కాలక్షేపం కోసం చేసినది కాదు. ఆ విషయాలన్నీ కేవలము మనమిద్దరమే కూర్చుని మాట్లాడుకోవడం కాదు. నా అనుభవాలన్నీ మన మాతాపితలతో పాటు, పరిపాలనలో భాగస్వాములయిన మంత్రివర్గం వారు, ఇతరులు కొందరు వినాలని, నాలో రేగిన ఎన్నో అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వారు సహకరించాలని కోరుకుంటున్నాను.”
“సరే.. దాని గురించి మన తండ్రిగారికి నివేదిద్దాము. ఈ లోగా ప్రజల ఇక్కట్లు పర్యటనాంశాలు కాకుండా మిగితా విషయాల గురించి చెప్పుము సిద్దార్థా..!”
“సోదరీ ఆ ప్రకృతి రమణీయతను గురించి ఏమి చెప్పమందువు? నీవు చూసి ఉంటే మరింతగా ఆనందించే దానివి. దారి పొడుగునా పిల్ల కాలువలు, పంటచేలు. కోవెలలు, అంగళ్ళు కనువిందు చేసినవి. ఇక పక్షిగణములు, రకరకాల జంతువులూ, పూలతోటలూ.. దైవం సృష్టించిన ప్రకృతికి ప్రణమిల్లానూ. ఇక మానవ ప్రకృతికి, పరిపాలనలోని కొన్ని లొసుగులు మనసు చాల చిన్న బుచ్చుకున్నాను.” రాకుమారుడు అట్లా చెబుతుండగా.. ఇద్దర్నీరాణి మందిరానికి తక్షణమే రమ్మని పిలుపు వచ్చింది. దాదాపు భటులు వెంటరాగా ఇద్దరూ మాట్లాడుకుంటూ రాణి మందిరానికి బయలుదేరారు.
18
“కుమారా..! నీవు వచ్చావని విని నిన్ను చూచుటకు నీ మాతామహులు విచ్చేసారు.” అని చెప్పారు మహారాజా వారు.
తాతగారిని చూడగానే చాల సంతోషం అనిపించి పాదాభివందనం చేసాడు సిద్దార్థుడు. అతనే గాక అక్కడ ఉన్న మరి కొందరు రాచబంధువులు రాకుమారుణ్ణి కుశలం అడిగారు. పరిచారికలు విశాలమయిన భోజనాల బల్లమీద అందరికీ ఫలహారాలు వడ్డించగా కబుర్లు చెబుతూ ఆరగించసాగారు.
సిద్దార్ధుని దృష్టి అతని మాతామహుని మీదపడి ఆలోచనలో పడిపోయాడు. ఈ తాతగారు కూడా చాలా వృద్ధులే. కానీ ఏనాడూ ఆమ్మో ఇతని అవస్థ చూడలేం సుమా..! అన్నంత బాధ కలుగలేదు, భయం వేయలేదు. తాతగారు వృద్ధుడయినప్పటికీ చాలా హుందాగా ఉన్నాడు. అక్కడ తానూ చూసిన వృద్ధుడు చాలా దీనంగా ఉన్నాడు. ఇక్కడా ఈతను నిండుగా ఖరీదయినా వస్త్రాలను ధరించి ఉన్నాడు. తగినన్ని నగలను వేసుకుని ఉన్నాడు. చక్కని ఆహారాన్ని భుజిస్తున్నాడు. తన వారందరి మధ్య నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. అతను ఫలహారం చేయుటకు ఇద్దరు పరిచారికలు దగ్గర ఉండి వడ్డిస్తున్నారు. తరువాత అతన్ని సురక్షితంగా కూర్చోబెట్టేవరకూ అడడుగునా అతనికి సహాయం చేస్తూనే ఉన్నారు. అక్కడ అతనికి సహాయం చేసేవారుగాని సంభాషించే వారుగాని లేరు.
“కుమారా ఏమి ఆలోచిస్తున్నారు.?” అడిగారు మహారాజా వారు
“తండ్రిగారు నేను మీతోనూ మంత్రి బృందంతోనూ మాట్లాడాలి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయగలరా?” అని అడిగాడు.
కుమారుని గొంతులోని తీవ్రతను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ “సరే..” అన్నాడు మహారాజు. తక్షణమే సమేవేశానికి రావాల్సిందిగా అంతరంగికులకు, ప్రధాన మంత్రికి ఇద్దరు ముగ్గురు సహ మంత్రులకు, ప్రధాన ఆచార్యులకు, పండితులకు వర్తమానాలు వెళ్లాయి.
* * *
మహారాజు శశాంకవర్మ, సిద్ధార్థుడు అతని సోదరి వాసంతికల ఎదుట విచ్చేసిన వారందరూ అర్ధ వర్తులాకారంలో కూర్చుని ఉన్నారు..
“పెద్దలందరికీ నమస్సులు. నన్ను పర్యటనకు పంపుట గురించి మీ అభిప్రాయం కోరినప్పుడు మీరంతా నన్ను ఇంకా చిన్నపిల్లవాడిలా భావింపక నా కోరికను మన్నించి పర్యటనకు పంపమని సలహా చెప్పినట్లు తెలిసింది. అందుకు మీకు బహుధా కృతఙ్ఞతలు. మీ అందరి ఆశీర్వచనం వలన నేను ఒక్కసారి బయట ప్రపంచాన్ని కొద్ది మేరకయినా చూడగలిగాను. ఇక ముందు కూడా మీరంతా ఇలాంటి సహకారమే నాకు అందిస్తారని ఆశిస్తున్నాను” అందరికీ వినయంగా నమస్కరించాడు.
సిద్ధార్ధుని మాటలు ముగియగానే అందరూ అంగీకారంగా లేచి చప్పట్లు కొట్టి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సిద్ధార్థుడు గంభీరంగా “మీ నుంచి నాకు కొంత సమాచారం కావలెను. దయచేసి చెప్పండి.” అన్నాడు
అక్కడ ఉన్నవారంతా చూవులు రిక్కించి సిద్డర్థుడు “ఏమి అడుగుతాడా..?” అని వినసాగారు.
“పెద్దలారా..! మన రాజ్య సరిసహద్దులు ఏమిటి..?” అని అడిగాడు
ఒకరి తరువాత ఒకరు ఉత్తరాన ఉన్న రాజ్యాలు, దక్షిణాన ఉన్నరాజ్యాలు, అష్టదిక్కుల వివరాలు గురించి చెప్పారు.
“మన రాజ్యంలో ఉన్న సైనికుల సంఖ్య ఎంత..?” సిద్ధార్థుడు కొనసాగించాడు.
“పదివేల పై చిలుకు..” అని చెప్పారు
“మన సైన్యంలో ఉన్న బలగాల గురించి వివరించగలరా..?” అని అడిగాడు. ఇవ్వన్నీ సైనిక వివరాలే కాని, అడిగింది సాక్షాత్తు రాకుమారులు పైగా మహారాజు ఎదుటే అడుగుతున్నారు. ఈ సమావేశం కట్టు దిట్టమయిన ఏర్పాట్ల మధ్య అంతఃపురంలో జరుగుతున్నందున ఇక సందేహమెందుకని అందరూ ఏకబిగిని వివరాలు చెప్పేసారు.
“మూడు వందల గజదళము, అయిదు వందల ఒంటెలు, అయిదువేల అశ్వదళము.. ” ఇలా చెప్పసాగారు. కొద్ది సేపు సిద్ధార్థుడు మౌనం వహించాడు.
“పెద్దలారా..! మన రాజ్య జనాభా ఎంత..? వారిలో వృద్ధుల సంఖ్య, పిల్లల సంఖ్య చెప్పగలరా..?” అని అడిగాడు.
ఈ ప్రశ్నలకు కొందరు విస్తుబోయారు. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. గజముల సంఖ్య. అశ్వముల సంఖ్య తెలుసుగాని వృద్ధుల సంఖ్య, పిల్లల సంఖ్య తెలియనందుకు కొంత అసహనానికి గురయిన సిద్ధార్థుడు మళ్ళీ రెట్టించి అడిగాడు.
“చెప్పండీ..! మన రాజ్య జనాభా ఎంత..? ఎవరెవరి ఆర్థిక పరిస్థితి ఏమిటి.? మొత్తము జనాభాలో పిల్లల సంఖ్య ఎంత..? వృద్ధుల సంఖ్య ఎంత? ఆడవారెందరో మగవారెందరో ఇది నాకు కావాలి..?” కాస్త ఆవేశంగా అడిగాడు.
“అన్ని లెక్కలూ ఉన్నాయి కుమారా.! కానీ ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా అడిగితే చెప్పలేము. అయినా ఈ లెక్కలన్నీ ఎందుకో తెలుసుకోవచ్చా.?” కాస్త అసహనంగా అడిగాడు శశాంకవర్మ
“తండ్రిగారు..! నేను నా పర్యటనలో చాలామంది వృద్ధులను చూసాను. వారి దీనస్థితి చూడగానే నా మనసు చాల ఖేదపడింది. తధాగతుని గాథ గుర్తుకు వచ్చింది. నా పర్యటనను ఇక కొనసాగించలేనేమో అన్నంత బాధపడింది. వెంటనే వచ్చి మీ అందరినీ చూడాలని అనిపించింది. కానీ వేగిరపడకూడదని మనసును సమాధాన పరుచుకుని గురువుగారిని సంప్రదించి వృద్ధాప్యం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను..”
“కానీ ఇక్కడే నాకు ఒక సందేహం కలుగుతున్నది. వారు చెప్పిన ప్రకారం వృద్ధాప్యం అనేది వయసు వలన అందరికీ సహజంగా వచ్చే ఒక దశ. ఆ సమయంలో వారి శక్తులను కొన్నిటిని కోల్పోతారు. తప్పనిసరిగా ఇతరుల మీద ఆధారపడవల్సి వచ్చే ఒక స్థితికి చేరుకుంటారు. అందుకే అక్కడ ఆ పల్లెలో వున్నవారికి వృద్ధాప్యం చాలా బాధాకరమయిన పరిస్థితిగా అయ్యింది. కానీ ఇక్కడ వృద్ధులయిన మన రాచబంధువులకు, రాచగురువులకు, మంత్రివర్యులకు వృద్ధాప్యంలో ఏంతో మర్యాద మన్నన సహాయము లభిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది..?” చాలా ఆవేదనగా అడిగాడు.
పండితులకు, మంత్రులకు, శశాంకవర్మకు ఏమి చెప్పాలో తెలియలేదు..
వాసంతిక తమ్ముడి దగ్గరకు వచ్చి అతని చేతినందుకుని..
“సోదరా..! నీది ఎంతో సున్నితమయిన మనసు. అందుకే ఒక్కసారిగా ఇలాంటి సమస్యలు చూసి చాలా బాధపడుతున్నావు. నీ దృష్టికి వచ్చిన సమస్యలను ఒక నేరంగా గానీ, ఆరోపణలుగా గాని మన రాచ భవనానికి వచ్చి ఎవరూ నివేదించలేదు. ఒకవేళ ఎవరయినా ఆరోపణ చేసి ఉంటే మన తండ్రిగారు ఏ వేళనయినా న్యాయం చేయుటకు అందుబాటులో ఉంటారు కదా. అందుకు మనకు ‘న్యాయపు జేగంట’ కూడా ప్రజలు వినియోగించుకుంటున్నారు కదా. వారి దృష్టికి రావాలేగాని ఏ సమస్యయినా మన తండ్రిగారు వెంటనే పరిష్కరిస్తారు.. ఇక నీవు ఇలా ఖేధపడకు “
వాసంతిక మాటలకు శశాంకవర్మ చాలా సంతోషపడ్డాడు. కానీ కొన్ని నేరారోపణ చేయలేని పనులు జరుగుతున్నాయని సిద్ధార్థునికి అర్థమయి ఒకింత మౌనం వహించాడు.
“నిజమే సోదరి..! నేను కూడా తండ్రిగారినిగాని, మన మంత్రివర్గాన్నిగాని వేలెత్తి చూపడానికి ఇక్కడ సమావేశం అవ్వలేదు. సమస్యలు తెలుసుకున్నాక బాధ్యతగా మనం ఏమి చేయగలమా? అన్న సలహాకోసమే మీ అందరిని ఇక్కడకు రమ్మని ఆహ్వానించింది. అందుకుగాను మన రాజ్యంలో ఉన్న మొత్తం వృద్ధుల సంఖ్య.. వారి ఆర్థిక సామాజిక స్థితి తెలుసుకుని వారికి సత్వర సహాయం అందించాలని అనిపిస్తున్నది దానికి మీరంతా సహకరిస్తారని అనుకుంటున్నాను..”
“నేను చూసి అమితంగా చలించిపోయిన మరో ప్రధాన సమస్య దారిద్య్రం. కొన్నిచోట్ల ప్రజలు కనీస నివాసం లేక అవస్థ పడుతున్నారు. తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి దుస్తులు లేని వారిని చూసి చలించి పోయాను.”
“కొందరు భిక్షుక వృత్తిని నమ్ముకుని.. యాచనకు అలవాటు పడి ఇక మేము ఇక ఏ పని చేయలేము అని చెబుతున్న వారిని చూసాను. శారీరకముగా అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్న వారికి కష్టపడడం అలవాటు కావాలి. అందుకుగాను అట్టి వారిని చేరదీసి, వారికి తగిన శిక్షణ ఇప్పించి వృద్దులకు సేవ చేసేలా తీర్చిదిద్దాలి. దీని వలన భిక్షకులకు, ఏ గతి లేనివారికి ఆశ్రయాన్నిచ్చి పని కల్పించిన వారమవుతాము..”
“సైనికులన్న వారు కేవలం యుద్దసమయంలో దేశరక్షణకు ఉపయోగపడడానికి మాత్రేమే కాదు. పేదరికం అవినీతి ఇటువంటి సమస్యలు రాజ్యానికి అంతర్గత శత్రువులు. ఇవి ప్రజల మనసును గాయపరుస్తాయి. రాజంటే వ్యతిరేకతను కలిగిస్తాయి. అందుకే మన సైనిక వివరాలు అడిగింది. మనుకున్న సైనిక సంఖ్య అపారం. వారి సహాయంతో మనకున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన మనం నిర్మూలించవచ్చు అని నాకు నమ్మకం కలుగుతున్నది.”
“మొదట మనం వృద్ధుల సంఖ్య తెలుసుకుని వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసుకుని వారికోసం ఆశ్రమాలు నెలకొల్పాలి. వృద్ధులందరూ ఒకే దగ్గర ఉండడం వలన ఒకరికొకరు సంభాషించుకుంటూ.. వారి మనోభావాలను పంచుకుంటారు. వారికి తగిన వసతి, వైద్య సదుపాయాలూ ఆహార ఏర్పాట్లు అన్నీ కల్పించాలి. వారి అభిరుచులనెరిగి వారికీ కొన్ని వినోద కార్యక్రమాలను ఏర్పాటుచేయాలి..”
“రాకుమారా..! మీరు చెప్పిన ప్రకారం వృద్దులకు భిక్షకులకు ఈ రకమయిన ఆశ్రమాలు ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా..! ఏ రకపు ప్రభుత్వ వ్యయాలకు ఆదాయ మార్గాలుకూడా చూసుకోవాలి కదా” అని సచికేతుడనే మంత్రి అన్నారు.
“అవును ఏదయినా ఒక కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలని చెప్పగానే సరిపోలేదు. దానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలో కూడా చెప్పాలి మరి..” సాకేతముని అన్నాడు
“అవును రాకుమారా ఉత్పత్తికి గాని, దేశ ప్రయోజనానికి గాని ఏ విధంగానూ పనికిరాని వారిపై ఇంత పెట్టుబడులు పెట్టడం అవవసరమా..?” రాఘవుడు అనే మంత్రి అన్నాడు.
“ఎప్పుడో ఏ అయిదారేళ్ళకో ఎవరో దండెత్తి వస్తారేమో! అని ఏళ్ళ కొద్దీ మేపుతున్న గజదళం మాత్రం మనకు అవసరమా? మన దేశంలో ఉన్న వృద్దులు, మన గజాలపాటి చేయరా? వివిధ రంగాలలో ఉన్న ఎందరికో తల్లిదండ్రులు వాళ్ళు. రాజ్యపు ఖర్చులు తగ్గించడానికి గజదళాన్ని పూర్తిగా తగ్గించండి. వాటిని పొరుగు దేశాలలో అమ్మేసేయ్యండి. వాటి తిండి కోసము అయ్యే ఖర్చులో సగం మన పెద్దలకోసం ఖర్చు పెడదాం.”
సిద్దార్ధుని మాటల్లో తీవ్రతకు అందరూ తెల్ల ముఖాలేసుకుని చూడసాగారు.
“ఏనుగులు యుద్ధాలలో ప్రధాన దళం. ఆ విషయం రాకుమారులవారికి తెలియదనుకుంటా” వెటకరించాడో పండితుడు.
“ఒక చిన్న అవాంతర పరిస్థితి వస్తే సలహా చెప్పేది మీ వంటి పెద్దలే. ఏనుగులు సలహాలు చెప్పవు. మీ వంటి పెద్దలను కాపాడుకోవడం మన రాజ్యధర్మం అని నేను భావిస్తున్నాను. తరువాత మీ ఇష్టం. ఈ రోజుకు మీకందరికీ సెలవు. రేపు మళ్ళీ మరో ముఖ్యమయిన విషయం మీద మాట్లాడడానికి కలుసుకుందాం. నా ఆలోచనలు మీకు ఆమోదయోగ్యమయితే వెంటనే అవి కార్యరూపం దాలుస్తాయిని నమ్ముతున్నాను..” అందరికీ నమస్కరించి వెనుతిరిగాడు సిద్ధార్థుడు.
(ఇంకా ఉంది)