అలనాటి అపురూపాలు – 216

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

‘ఝాన్సీ కీ రాణీ’ (1953) సినిమా నిర్మాణం విశేషాలు:

సోహ్రాబ్ మోడీ క్లాసిక్ – వారియర్ క్వీన్ ‘రాణీ ఆఫ్ ఝాన్సీ’ చిత్ర నిర్మాణం వెనుక కథ ఇది.

ఈ సినిమాలో రాణీ లక్ష్మీబాయిగా మెహతాబ్ నటించారు. 1953 నాటి ఈ చలనచిత్రం అప్పటివరకు నిర్మితమైన సినిమాల్లోకెల్లా అత్యంత భారీగా వ్యయమైన సినిమాలలో ఒకటి. గుర్రంపై దూసుకువెళ్తున్నన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చిత్రపటాన్ని లేదా ఆమె విగ్రహాన్ని తదేకంగా చూస్తే, పైకి ఉండి ఉన్నతంగా కనిపించే కత్తిపై, నడుముకి ఉన్న పట్టీలో ఉన్న పిల్లవాడిపై మన చూపులు నిలిచిపోతాయి. ఆమె వెనుక, ఫ్రేమ్‌కు జీవం పోసినట్లు అనిపిస్తుంది. భావోద్వేగంతో శరీరం వణుకుతుంది. 1858లో తన 29వ ఏట బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపించి యుద్ధభూమిలో మరణించిన యోధురాలైన ఈ రాణి గాథ అలాంటిదే. కాబట్టి స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగా ఇలాంటి వీరులుపై సినిమాలు రూపొందడంలో ఆశ్చర్యం లేదు. అసాధారణమేమీ కాదు.

సోహ్రాబ్ మోడీ గారి ‘ఝాన్సీ కీ రాణీ’ టెక్నికలర్‌లో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం. ఇది పాక్షికంగా అంతర్జాతీయ సిబ్బందితో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హిందీ, ఇంగ్లీషు భాషలలో రూపొందింది. మెహతాబ్‌ను రాణిగా, ఆ కాలం నాటి సుప్రసిద్ధ నటులను ఇతర పాత్రలకు ఎంచుకుని, వసంత్ దేశాయ్ సంగీత దర్శకత్వంలో మొదలైన ‘ఝాన్సీ కీ రాణీ’ చాలా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ – అయితే దాని దర్శకుడికి ఇదేమీ అసాధారణమైనది కాదు. సోహ్రాబ్ మోడీ సాంఘిక, చారిత్రక చిత్రాల ప్రసిద్ధ దర్శకుడు. పుకార్ (1939), సికందర్ (1941), పృథ్వీ వల్లభ్ (1943), ఏక్ దిన్ కా సుల్తాన్ (1945), శీష్ మహల్ (1950) వంటి సినిమాలు వంటివి ఆయన ఖాతాలో ఉన్నాయి. 1942 నుంచే ఆయన ‘ఝాన్సీ కీ రాణీ’ సినిమా గురించి కలలు కనేవారు. ఈ చిత్రం నిర్మాణ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది, పైగా యుద్ధ సన్నివేశాలను కలిగి ఉంది, వీటి కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయబడింది. అయితే జనవరి 24, 1953న విడుదలైన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అని తేలింది.

ఆ రోజుల్లోనే దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చయిందట. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసినప్పటికీ, అది పెట్టిన డబ్బుని రాబట్టలేదు, ఈ చిత్రం వైఫల్యం సోహ్రాబ్ మోడీని, వారి సంస్థ మినర్వా మూవీటోన్ బ్యానర్‌ను అప్పుల్లోకి నెట్టేసింది.

“అధిక నిర్మాణ వ్యయానికి టెక్నికలర్‌ లోని త్రీ-స్ట్రిప్ టెక్నాలజీ ఒక కారణం. దీనర్థం ఒకే కెమెరా ద్వారా మూడు వేర్వేరు స్ట్రిప్‌లను ఉపయోగించి, తర్వాత ఒకే చిత్రాన్ని రూపొందించడానికి వాటిని కలిపి ప్రాసెస్ చేయడం. ‘గాన్ విత్ ది విండ్’, ‘ఎ మేటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్’ వంటి సినిమాలు ఈ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి” అని చెప్పారు సోహ్రాబ్ మోడి కుమారుడు మెహెల్లి మోడీ. ఆ సమయంలో మన దేశంలోని లేబ్‍లు టెక్నికలర్‌ను ప్రాసెస్ చేయలేకపోయినందున, 1952లో సోహ్రాబ్ మోడీ చాలా వారాల పాటు లండన్‌లో ఉండి ఆ చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది, ఇది 1956లో ఆంగ్లంలో ‘ది టైగర్ అండ్ ది ఫ్లేమ్‌’గా కూడా విడుదలైంది.

సౌండ్‌ని రీరికార్డ్ చేసి, పన్నెండు ఛానెల్‌లలో మిక్స్ చేశారు.

ఏ బ్రిటీష్ వారితో పోరాడి లక్ష్మీబాయి ప్రాణాలర్పించిందో, ఆ బ్రిటీషు వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సంవత్సరంలో, అంటే 1947లో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రామాణికతను నిర్ధారించడానికి, కళా దర్శకులు రుసీ బ్యాంకర్, పండిట్ దూబే లను – ఝాన్సీ, గ్వాలియర్, సాగర్, కల్పి, చందేరి, మీరట్‌, ఇంకా ఇతర ప్రాంతాల పర్యటనకు పంపారు. “వేలాది ఫోటోలు తీశారు, వేలాది అంశాలను గమనించి నోట్సు తయారు చేసుకున్నారు” అని ఈ సినిమా ఇన్‍ఫర్మేషన్ బుక్‌లెట్ చెబుతుంది. అదనంగా, ప్రసిద్ధ చరిత్రకారుల అరవై ఏడు రచనలను అధ్యయనం చేశారు.

చివరకు 1951 జనవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సైన్యపు మొదటి భారత కమాండర్-ఇన్-చీఫ్ కె.ఎం. కరియప్ప మహూరత్ (ప్రారంభ) వేడుకను నిర్వహించారు.

సోహ్రాబ్ మోడీ మొదట ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్‍లో, దాదాపు 5,000 అడుగుల ఫిల్మ్ వరకూ చిత్రీకరించారు. కానీ ‘బహుళ రంగుల వస్త్రాలు, పరాక్రమశాలైన ఆ రాణి జీవించిన యుగ వైభవం, ఆమె సమారోహన్ని చూసి’, టెక్నికలర్‍కి మారాలని ఆయన నిర్ణయించుకున్నారని ఇన్‍ఫర్మేషన్ బుక్‌లెట్‍లో ప్రస్తావించారు.

సెప్టెంబరు 1951లో, సినిమాని రంగులలో చిత్రీకరించే పరికరాలు ఇంగ్లండ్ నుండి ముంబైకి చేరుకోవడం మొదలయింది. ఇందులో 275-కిలోవాట్ జనరేటర్, తాజా ఆర్క్ లైట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్, సౌండ్ పరికరాలు, ఇంకా ‘వెయ్యినొక్కటి ఉపకరణాలు’ ఉన్నాయి. ‘గాన్ విత్ ది విండ్’ (1939), ‘ది ఫ్లేమ్ ఆఫ్ ది యారో’ (1950) చిత్రాలను తీసిన హాలీవుడ్ కలర్ కన్సల్టెంట్ జార్జ్ జెంకిన్స్, ఆస్కార్-విజేత అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఎర్నెస్ట్ హాలర్‌లను మోడీ నియమించుకున్నారు.

మోడీ ఖర్చుకి వెనుకాడలేదు. ప్రధాన రాజభవనం, దాని విస్తారమైన లైబ్రరీలతో సహా 22 ప్రధాన సెట్లు ఉన్నాయి. మెహతాబ్ కనీసం 60 కాస్ట్యూమ్స్ మార్చారు. ఝాన్సీ రాజ్యం ముంబై శివార్లలో ఐదున్నర ఎకరాలలో నిర్మించిన సెట్. “సెట్‌లో ఝాన్సీ యొక్క భారీ కోట గ్రానైట్ రాతిపై నిలబడి ఉంది, ప్రతి బురుజు అసలైన కొలతకు అనుగుణంగా రూపొందింది, ప్రతి బురుజు సరిగ్గా ఉంది,” అని బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బికనెర్ కామెల్ కార్ప్స్ నుంచి ఒంటెలు తీసుకున్నారు, గుర్రాలు, వేలాది అదనపు వస్తువులను – లక్ష్మీబాయికీ బ్రిటీష్ అధికారి హ్యూ రోజ్ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలలో మోహరించారు. లక్ష్మీబాయి స్వయంగా యుద్ధానికి దిగడంతోపాటు ఝాన్సీ మహిళలను కూడా పోరాడేలా ప్రోత్సహించడంలో పేరుగాంచింది కాబట్టి, సామూహిక ప్రభావాన్ని సాధ్యమైనంత వాస్తవికంగా చేయడానికి గంగా రిసాల ఆర్మీ యూనిట్ నుంచి, బనస్థలి పాఠశాలలో శిక్షణ పొందిన గర్ల్ క్యాడెట్‌లను తారాగణంగా తీసుకున్నారు” అని బుక్‌లెట్ తెలిపింది.

ఈ సినిమా కథానాయిక మెహతాబ్ 1946లో సోహ్రబ్ మోదీని పెళ్లాడారు, ఆమె తన పరిధి మేరకు నటించారు. “గుర్రపు స్వారీ, షూటింగ్, కత్తియుద్ధం సాధన, ఈత వ్యాయామాలతో, మెహతాబ్ రెండేళ్లపాటు క్యాంప్ జీవితాన్ని గడిపారు. ఆమె తనను తాను పూర్తిగా తీర్చిదిద్దుకున్నాకే, టెక్నికలర్ కెమెరాలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు” అని బుక్‌లెట్ పేర్కొంది. సోహ్రబ్ మోదీ యొక్క దోషరహిత ఉర్దూ ఉచ్చారణ (ఈ పార్సీ చిత్రనిర్మాత ప్రస్తుత ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో పెరిగారు), రాచరిక వైఖరి, మంద్ర స్వరానికి ఉచ్చ స్వరానికీ మధ్యనుండే స్వరం – ఆయన సమర్థవంతుడిగా మార్చాయి. ఆయన తన సొంత ప్రొడక్షన్‌లో కూడా నటించారు. ‘ఝాన్సీ కీ రాణీ’లో, సోహ్రాబ్ మోడీ రాజగురువుగా నటించారు, ఆయన ఝాన్సీ పాలకుడు గంగాధర్ రావు (ముబారక్) వివాహం చేసుకునే యువతిగా మణికర్ణికను ఎంపిక చేస్తారు.

మణికర్ణిక నిర్భయంగా ఏనుగు తొండం పైకి ఎక్కే ధైర్యం గల అమ్మాయి. “నా వీధిలో నాకు 10 ఏనుగులు ఉన్నాయి,” అని ఓ పిల్లవాడితో చెప్పింది, ఆమె తల ఎత్తుగా ఉంది, ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి. రాజగురువుని కలిసేటప్పటికే ఆమె స్థానికంగా ఎంతో ప్రసిద్ధి కెక్కారు, ‘సంపదలో లక్ష్మి, జ్ఞానంలో సరస్వతి, శక్తి లో దుర్గ’ అని అభివర్ణించారామెను.

దశాబ్దాల తర్వాత శేఖర్ కపూర్ తీసిన చారిత్రాత్మక బయోపిక్ ‘ఎలిజబెత్‌’లో జాఫ్రీ రష్ వలె, రాజగురువు, నైపుణ్యంగా యువ లక్ష్మీబాయిని ప్రభావితం చేసి ఆమె విధిని స్వీకరించమని ఉద్బోధించారు. రాణికి విశ్వాస సంక్షోభం ఏర్పడినప్పుడు, రాజగురువు ఆమెకు గట్టిగా గుర్తుచేస్తాడు, “నీ జీవితం విలువైనది. నువ్వు చనిపోవాలనుకుంటే, ఎలా మరణించాలో నేను నీకు నేర్పుతాను.”

1950ల నాటి కథా రచయితల సామర్థ్యానికి ఉదాహరణ లక్ష్మీబాయికిచ్చిన మరో సలహా: “ప్రవాహంలోకి దూకు, అయితే ముందు ఈత నేర్చుకో. పులిలా మరణించు.”

వితంతువు అయిన రాణి, “నేను నా ఝాన్సీని వదులుకోను” అని ప్రకటిస్తుంది. తన రాజ్యంపై బ్రిటిష్ వారు దాడి చేయడంతో ఆమె యుద్ధరంగం లోకి దూసుకుపోతుంది. ప్రాణాలు వదిలేటప్పుడు ఆమె పెదవుల నుంచి ‘ఆజాదీ’ అనే పదం వెలువడుతుంది. తన త్యాగాన్ని ఎన్నటికీ మరచిపోలేని దేశపు చైత్యన్యంలో లీనమవుతుంది.

బాక్సాఫీస్ వద్ద నష్టాలు వచ్చినా, సినిమా పరాజయం దాని సాంకేతిక లక్షణాలతో కప్పివేయబడింది. అమృత్ గంగర్ – ‘సోహ్రబ్ మోడీ’ అనే చిన్న జీవిత చరిత్రలో ఇలా రాశారు – “విజువల్-సౌండ్ కాటాపుల్టింగ్ కట్‌లను ఉపయోగించి తీసిన అనేక ఆసక్తికరమైన మాంటేజ్ సీక్వెన్స్‌‍లు ఈ సినిమాలో ఉన్నాయి”. “అద్భుతమైన యుద్ధ సన్నివేశాలలో, మోడీ తన సన్నివేశాలపై అద్భుతమైన అదుపును ప్రదర్శించారు. ఆయన ఝాన్సీ రాణి పాత్రను వెలితీశారు, ఆమె ధైర్యం, ఇంకా మానవీయ గుణాన్ని బహిర్గతం చేస్తూ… సులభంగా కన్నీళ్లు కార్పించే మెలోడ్రామాను ఆశ్రయించకుండా, మోడీ తన సినిమాటోగ్రాఫిక్ థియేట్రికాలిటీ, టోనాలిటీ, ఇంకా ధ్వనుల వినియోగం ద్వారా ఒక నిర్దిష్ట శోకరసాన్ని, అమితోత్సాహాన్ని సాధించారు” అని గంగార్ రాశారు.

యష్ చౌదరి దర్శకత్వం వహించిన ఫిల్మ్స్ డివిజన్ వారి ఒక డాక్యుమెంటరీలో, సోహ్రాబ్ మోడీ చారిత్రక శైలి పట్ల తనకున్న ఆకర్షణను ఇలా వివరించారు: “నేను పాఠశాలలో ఉన్నప్పుడు, నేను చరిత్ర పాఠాలు ఇష్టం ఉండేవి కావు. కానీ నేను సినిమా తీస్తున్నప్పుడు చరిత్ర పుస్తకాలను చదవడం ప్రారంభించినప్పుడు, చాలా గొప్ప చరిత్రలు ఉన్నాయని తెలిసింది. ప్రేక్షకులకు మన చరిత్ర గురించి కొంత చెప్పాలి, మన గతకాలపు వ్యక్తుల వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తును రూపొందించాలి.”

సోహ్రాబ్ మోడీకి ప్రధానంగా లక్ష్మీబాయి దృఢత్వం బాగా నచ్చింది: “ఇరవయ్యేళ్ల వయసులో ఒంటరి మహిళ.. బ్రిటిష్ వారి ముందు నిలబడి, నేను నా ఝాన్సీని వదులుకోను అని అంటుంది. వాహ్, ఏం పాత్ర!” అన్నారాయన.

‘ఝాన్సీ కీ రాణీ’ పరాజయం తర్వాత మోడీ తన స్టూడియోను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మరుసటి సంవత్సరం తీసిన మరొక చారిత్రాత్మక చిత్రం ‘మీర్జా గాలిబ్‌’తో తిరిగి పుంజుకున్నారాయన. 1969 వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. 28, జనవరి 1984న ముంబైలో మరణించారు.

ఏ చిత్రం వల్ల సోహ్రాబ్ మోడీ తన ఆర్థిక స్థాయిని కోల్పోయారో, ఆ చిత్రం ఇప్పుడు దాని అసలు రూపంలో లేదు.

“ఈ చిత్రం యొక్క అన్‌ట్రంకేటెడ్ టెక్నికలర్ వెర్షన్‌లో ప్రస్తుతం ఎటువంటి ప్రింట్ లేదు” అని మెహెల్లి మోడీ చెప్పారు. “ఒరిజినల్ కలర్ నెగటివ్ ఎక్కడో పోయింది.” అన్నారు.

బ్లాక్ అండ్ వైట్ హిందీ వెర్షన్, ఇంకా ‘ది టైగర్ అండ్ ది ఫ్లేమ్’ బూట్‌లెగ్ కాపీలు ఇంటర్నెట్‌లో సోహ్రబ్ మోదీ దార్శనికతకు పాక్షిక చిహ్నాలుగా మిగిలాయి. “ఇంగ్లీషు చిత్రం నిడివి హిందీ సినిమా కంటే ఒక గంట తక్కువ” అని మెహెల్లి మోడీ అన్నారు.

మళ్ళీ చూస్తే, సినిమా ఇప్పుడు కూడా బాగానే అనిపిస్తుంది – ఎడిటింగ్, సంగీతం, ప్రతిదీ కళాత్మకంగా వాస్తవం. మీరు 10,000 మంది సైనికుల వరుసను చూసినప్పుడు, నిజానికి అక్కడ 10,000 మంది ఎక్‌‍స్ట్రా ఆర్టిస్టులు ఉన్నారు. ఇలాంటి సినిమా మళ్లీ మీరు చూడలేరు.

ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్‍ని ఈ లింక్‌లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=4gCzwzM9bMY

హిందీ వెర్షన్:

https://youtu.be/g5_6YGr87sc?si=i2_4SN9aRc6sl64u

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here