పందెం

1
5

[box type=’note’ fontsize=’16’] తమ యజమాని గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నించిన ఆ పెంపుడు జంతువులలో ఏది గెలిచిందో శాఖమూరి శ్రీనివాస్ చెబుతున్నారు “పందెం” అనే ఈ బాలల కథలో. [/box]

[dropcap]తో[/dropcap]టపల్లెలో ఉండే రామకోటి ధనవంతుడు. చేతినిండా డబ్బుండడంతో అప్పులు ఇచ్చేవాడు. అయితే వడ్డీ మాత్రం అధికంగా వసూలు చేసేవాడు. దాంతో ఎంత అవసరమొచ్చినా రామకోటి దగ్గర అప్పు తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు.

ఒకసారి వీరయ్య అనే పందుల కాపరి అత్యవసరమై రామకోటి దగ్గర వెయ్యిరూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి తీర్చేందుకు ఆర్నెల్ల గడువు కోరాడు. రామకోటి దానికి ఒప్పుకున్నాడు. అప్పు తీసుకున్నాక, ఆర్నెల్ల గడువు కూడా  తీరిపోయింది. అయినా వీరయ్య అప్పు చెల్లించలేదు. ఒకటి రెండుసార్లు రామకోటికి ఎదురుపడ్డ వీరయ్య, ‘డబ్బు సర్దుబాటు కాలేదని, మరో రెండునెలల సమయం ఇమ్మ’ని అడిగాడు. అయితే రామకోటి అందుకు ఒప్పుకోక, ‘ఇంకో పదిరోజుల్లో అప్పు వడ్డీతో సహా తిరిగివ్వకపోతే ఏంచేస్తానో నీకు చెప్పను’ అని బెదిరించాడు.

అంతేగాక, “అయినా నీకు అప్పివ్వడం నాది బుద్ధి తక్కువ. స్థిరాస్తులు ఉండి ఉంటే పంచాయితీ పెట్టి వాటిని స్వాధీనం చేసుకునేవాడిని. నీ దగ్గర నాలుగు పందులు తప్ప ఏమున్నాయి? బురదలో పొర్లాడే ఆ పందుల్ని ముట్టుకుంటే మురికి అంటుకోవడమే తప్ప, అవి దేనికి పనికి వస్తాయి?” కోపంగా అన్నాడు రామకోటి.

“రామకోటిగారూ… నన్ను తిట్టండి భరిస్తాను. కానీ, నా పందుల్ని ఏమీ అనొద్దు. మీరు పెంచుకునే గుర్రాలు మీకెంత ముద్దో నాకు నా పందులు అంతే! రెండు నెలల్లో మీ అప్పు ఒక్కరూపాయి కూడా తగ్గకుండా చెల్లిస్తాను” వీరయ్య ఆవేశంగా మాట్లాడాడు.

“అబ్బో రోషం పొడుచుకు వచ్చిందే! అయినా నా గుర్రాలు, నీ పందులు ఒకటేనా? పోనీ, ఒకటే అనుకుందాం. నా గుర్రాలతో  నీ పందులు పోటీపడి పరిగెత్తగలవా?” ఎగతాళిగా మాట్లాడాడు రామకోటి.

ఆ మాటలు వీరయ్యకు చివుక్కుమనిపించాయి. ఏమీ ఆలోచించకుండా “నా పందులు నీ గుర్రాలతో పోటీ పడడమేగాదు, ఓడిస్తాయి కూడా.” అన్నాడు.

“అలాగా!.. అయితే ఓ పని చేద్దాం. నా గుర్రాల్లో ఒకదానికి, నీ పందుల్లో ఒకదానికి పోటీపెడదాం. ఈ ఊరినుంచి వెళ్ళి బుడంపాడు గ్రామంలోని జెండాను తీసుకొస్తే గెలిచినట్లు. నా గుర్రం గెలిస్తే  నీ పందుల్ని అమ్మి ఆ సొమ్ము నేను తీసుకుంటాను. ఒకవేళ నీ పంది గెలిస్తే అప్పు మాఫీ చేస్తాను. సిద్ధమేనా?” రామకోటి వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు.

వీరయ్య ఆలోచించే స్థితిలో లేడు. దాంతో పందేనికి ఒప్పుకున్నాడు.

ఇంటికొచ్చి తీరిగ్గా ఆలోచించిన వీరయ్యకు, తానెంత మూర్ఖంగా పందేనికి ఒప్పుకున్నాడో అర్థమైంది. ‘పంది గుర్రంతో పోటీపడి గెలిచేదేనా? ఓడిపోయి ఈ పందుల్ని కూడా పోగొట్టుకుంటే నా పరిస్థితి ఎలా?’ అని లోలోపల బాధడుతూ, దిగాలుగా ఇంటిముందు ఓ రాయిపై కూర్చున్నాడు.

ఇంతలో అక్కడకు వీరయ్య పెంపుడుపందులు వచ్చాయి. అతని ముఖాన్ని చూసి విచారానికి కారణమడిగాయి. వీరయ్య జరిగిందంతా చెప్పాడు. వాటిలో పెద్దగా ఉన్న ఓ పంది,” బాధపడొద్దు. మా శాయశక్తులా కృషి చేసి గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అయినా విచారించి లాభమేముంటుంది. మనమెలా గెలవాలో ఆలోచిద్దాం.” అంది. మిగిలిన పందులు కూడా దాని మాటలకు వంతపలికాయి. అయినా వీరయ్యను నిరాశ వీడలేదు.

కాసేపటి తర్వాత వీరయ్య వాటికి కుడితిని, వృధా ఆహారాన్ని ఎదురుగా పెట్టాడు. అవి ఆబగా తింటున్నప్పుడే, కుక్క వాటి దగ్గరకొచ్చింది. కాకి వచ్చి సమీపంలోని చెట్టుకొమ్మపై వాలింది. కుక్క, కాకి రోజూ అదే సమయంలో అక్కడికి వస్తూ పందులకు మంచి నేస్తాలుగా మారాయి. పందులు కుడితి తాగుతూనే యజమాని తమపై కాసిన పందేన్ని నేస్తాలకు చెప్పాయి. కుక్క, కాకి అది విని కాసేపు ఆలోచించి, మరికొంచెం సేపు చర్చించి, “మీరేం దిగులు పడొద్దు, మీరే గెలుస్తారు. మాదీ పూచీ” అని ఒకేసారి చెప్పాయి. ఆ మాటలు సంతోషం కలిగించినా గెలుపు ఎలా కుదురుతుందో పందులకు అర్థం కాలేదు.

పందెం రోజు రానే వచ్చింది. రామకోటి గుర్రాల్లోని ఒక నల్లమచ్చల గుర్రం, వీరయ్య పందుల్లో పెద్దది పందేనికి సిద్ధమయ్యాయి. గ్రామస్తులకు ఈ పందెం ఎంతో వింతగా తోచింది.

మూడు… రెండు.. ఒకటి.. వెళ్ళండి… అని చెప్పగానే రెండూ పరుగు ప్రారంభించాయి. మచ్చలగుర్రం వాయువేగంతో పరిగెత్తసాగింది. పంది మాత్రం భారంగా శరీరాన్ని లాక్కుంటూ వెళ్ళసాగింది.

గుమికూడిన వాళ్లంతా వేగంగా వెళ్ళమని పందిని అదిలించసాగారు. పంది నడక అందరికీ వినోదం కలిగిస్తోంది. కాసేపటికే గుర్రం చాలా దూరం పరిగెత్తింది. అది ఒక్కక్షణం ఆగి వెనక్కి తిరిగి చూసింది. కనుచూపు మేరలో పంది కనిపించలేదు. విశ్రాంతి తీసుకుందామని గుర్రం ఒక చెట్టు క్రింద నిల్చుంది.

ఇంతలో దాని దగ్గరకు కుక్క వచ్చి, “గెలుపు నీదేనని అందరికీ తెలుసు. అయినా నీ స్థాయికి నువ్వో మేలుజాతి గుర్రంతోనో, వేగంగా పరిగెత్తే మరో జంతువుతోనో పోటీపెట్టుకోవాలిగానీ, పందితో పోటీనా! ఈ గెలుపు నిన్ను అందరిముందు చులకన చేస్తుంది. ఎక్కడైనా పందెం సమవుజ్జీలతో ఉండాలేగాని,  అర్భకులతోకాదు. ఈ పోటీ నీకే కాదు… గుర్రంజాతి మొత్తానికీ చెడ్డపేరు తెస్తుంది. అయినా ఇది నా మాట కాదు. అందరూ అనుకుంటున్నదే చెప్పాను” అన్నది.

ఆ మాటలను ఆలకించిన గుర్రం, “అందరూ అలా అనుకుంటున్నారా?! యజమాని చెప్పినట్లు చేయడమే నా పని అనుకున్నానే తప్ప, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. అయినా పందెం మధ్యలో ఎలా మానుకోగలను.”

గుర్రం, కుక్కల సంభాషణను అప్పటికే చెట్టుకొమ్మపై చేరి ఉన్న కాకి వింటున్నది. కాకి జోక్యం చేసుకుంటూ, “కండరాలు పట్టేసినట్లు, కాళ్ళు చచ్చుపడిపోయినట్లు నటించు. తప్పు చేస్తున్నానేమోనని బాధపడొద్దు. ఇప్పుడు యజమాని కొరకు గెలిచావంటే కొన్ని యుగాలపాటు ప్రజలు మీ పందేన్ని వింతగా చెప్పుకుంటారు. అందరిముందు ఎంత నామోషీగా ఉంటుందో ఆలోచించి, మెల్లగా పోటీనుంచి తప్పుకో.” అని చెప్పింది.

పోటీనుంచి తప్పుకోవడమే తనకు గౌరవంగా ఉంటుందని గుర్రం భావించింది. వెంటనే కండరాలు పట్టేసినట్లు అక్కడే కూలబడిపోయింది. కాసేపటి తర్వాత పంది దానిముందునుంచే వెళ్ళి, బుడంపాడులో జెండా తీసుకుని తోటపల్లివైపు వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత గుర్రం పునరాలోచించింది. ’గెలుపు కంటే ఓటమే మరింత అవమానం కదా! నేనెందుకు ఇలా చేశాను.’ అని తెగ బాధపడిపోయింది.

ఇంతలో రామకోటి దానిని వెతుక్కుంటూ వచ్చాడు.

గుర్రం జరిగిన విషయాలేవీ అతనికి చెప్పకుండా, “కండరాలు పట్టేయడం వలన కదలలేకపోయాను. ఇప్పుడు నేను పోటీకి సిద్ధమే, పోటి మళ్లీ పెట్టించండి” అంది.

అయితే మళ్లీ పందేనికి తోటపల్లి గ్రామస్తులు ఒప్పుకోలేదు. దాంతో పంది గెలిచినట్లు, అప్పును మాఫీ చేస్తున్నట్లు రామకోటి  ప్రకటించాడు.

వీరయ్య ఎంతో సంతోషించాడు. అయితే పంది ఎలా గెలిచిందో ఎంత బుర్రగోక్కున్నా అర్థం కాలేదు. రామకోటి అప్పు మాఫీ చేసినట్లు ప్రకటించినా రెండునెలల తర్వాత వీరయ్య అప్పంతా తీర్చేశాడు.

రామకోటి అప్పులివ్వడం మానుకోలేదు. కానీ, ఆచితూచి ఇవ్వసాగాడు. అంతేకాదు… తన దగ్గరున్న గుర్రాలన్నిటినీ అమ్మేశాడు. అయితే వీరయ్య దగ్గర మాత్రం పందుల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here