అంబేద్కర్ – ఒక అవలోకనం

0
3

[Disclaimer: The views and opinions expressed by the author are of his own and Sanchika does not subscribe to nor support them. Sanchika can in no way be held responsible for author’s opinions and views. – Sanchika Team]

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి. ఈ సందర్భంగా మనం అంబేడ్కర్ గురించి ఆలోచన, అవలోకనం చేద్దాం …

అంబేడ్కర్‌పై సరైన అవగాహన ఇంకా రాలేదు అన్నది క్షేత్ర వాస్తవంగా ప్రస్ఫుటంగా మనదేశంలో కనిపిస్తోంది! ఇప్పటికైనా ఆయనపై సరైన అవగాహన రావాలి, కావాలి. అంబేడ్కర్‌ మన దేశంలోని చాలమంది రాజకీయ నాయకులకన్నా బాగా చదువుకున్నవారు; మేలైనవారు. ఆ‌ బాగా చదువుకోవడంవల్ల‌ ఆయనలో దేశానికి పనికివచ్చే ఆలోచన, దార్శనికత ఉండేవి. కానీ ఆయన దార్శనికత ఫలించకపోవడం దేశానికి జరిగిన తీవ్రమైన నష్టం. అంబేడ్కర్ చాలమంది ప్రముఖ నాయకులకన్నా మెరుగైన వ్యక్తి. ఈ దేశం కోసం కొన్ని విలువైన పరిశీలనలు, సూచనలు చేసినవారు.

పాకిస్తాన్ విభజన విషయంలో అంబేడ్కర్ తన దార్శనికతతో చేసిన సూచనలు ఆచరణలోకి వచ్చి ఉన్నట్టయితే కొన్ని లక్షల హిందూ కుటుంబాలు నాశనం అవకుండా ఉండేవి. అతి భయంకరమైన భారతీయ జన వినాశనం జరిగి ఉండేది కాదు. దేశం గాయపడి ఉండేది కాదు. కమ్యూనిజమ్, క్రిస్ట్అనిటి, ఇస్లామ్ విషయమై అంబేడ్కర్ పరిశీలన, దార్శనికత అమోఘమైనవి. కమ్యూనిజమ్, క్రైస్తవం, ఇస్లామ్ ఈ దేశానికి హానికరమైనవని ఎంతో సాహసంగా, సరిగ్గా ఎప్పుడో చెప్పారు అంబేడ్కర్.‌ విదేశీ మతోన్మాదం వల్లా, విధ్వంసకర ఇజాల వల్లా మన దేశానికి జరిగిన హాని అంతా, ఇంతా కాదు. ఈ దేశంలో జరిగిన హిందూ నరమేధం, విదేశీ మతోన్మాద ధనంతో ఈ దేశానికి జరుగుతున్న హాని, విధ్వంసం వీటిని ఒక చదువు ఉన్న వ్యక్తిగా ఈ గడ్డ బిడ్డగా, దేశప్రయోజనాల్ని కోరుకునే భారతీయుడిగా అంబేడ్కర్ ముందుగానే ఊహించి అవి జరగకుండా ఉండే మార్గాల్నీ తెలియజెప్పారు. కానీ అంబేడ్కర్ పరిశీలనలు, సూచనలకు వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగిపోయాయి. జరుగుతూనే ఉన్నాయి. వాటివల్ల ఈ దేశం బాధపడుతూనే ఉంది. నష్టపోతూనే ఉంది.

అంబేడ్కర్ తన జీవితకాలంలో తగిన ప్రజామోదం, ప్రజాదరణ పొందారా? లేదు. ఎందుకు పొందలేదు? అయన ఎన్నికల్లో ఓడిపోవడం దేన్ని సూచిస్తోంది? రాజకీయంగా ఆయన ఎవరితోనూ ఇమడలేదు. అంబేడ్కర్ ఒంటరి పోరాటమే చేశారు. జీవిత కాలంలో ఆయనకు తగిన అంగీకారం రాలేదు. ఆయన తన జీవిత కాలంలో మన దేశంలో పెద్ద ఎత్తున నిరాదరణకు గురయ్యారు. జీవించి ఉన్నప్పుడు నిరాదరణకు గురైన, బలైన అంబేడ్కర్ పేరుతో గత కొన్నిదశాబ్దులుగా మనదేశంలో రచ్చ జరుగుతోంది. ఈ రచ్చవల్ల దేశానికి, ఈ దేశంలోని సగటు మనిషికి ఏ ప్రయోజనమూ కలగడంలేదు. ఏ కొందరో పెద్ద ఎత్తున లబ్ది పొందుతూ ఉండబట్టే అంబేడ్కర్ పేరుతో ఈ రచ్చ జరుగుతోందేమో? లేకపోతే కొందరి అజ్ఞానం, ఉన్మాదం కారణాలేమో? సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పేరుతో రచ్చ జరుగుతూ ఉండడం సమాజానికి, సగటు పౌరుడికి క్షేమకరం కాదు. అంబేడ్కర్‌పై సమగ్రమైన అవలోకన చేసి సరైన అవగాహనకు వస్తే మన సమాజానికి పెనుకీడు తప్పిపోతుంది.

ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో అంబేడ్కర్ ఓడిపోతే శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి కొందరు అంబేడ్కర్ చదువును, విలువను, అవసరాన్ని గుర్తించి ఆయనకు తోడుగా నిలిచారు. మహాదేవ్ అంబేడ్కర్ ఆదిగా కృష్ణారావ్ సాలూస్కర్, దత్తోపంత్ ఠేంగడీ, కోల్హాపూర్ రాజు శాహూజీ మహారాజ్, బరోడా రాజు సాయాజీరావ్ గయక్వాడ్, సావర్కర్ వంటి హిందూత్వవాదులు, జాతీయతా వాదుల సహాయ సహకారాలు, తోడ్పాటు అంబేడ్కర్‌కు వెన్ను దన్నుగా నిలిచాయి అని చరిత్ర ద్వారా ఇవాళ మనం తెలుసుకోగలం. హిందూ భావజాలం, జాతీయతా భావజాలం‌ సాయంతోనే అంబేడ్కర్ నిలబడగలిగారు అనీ, ఇతరులు ఆయన్ను పట్టించుకోలేదు అనీ మనకు స్పష్టంగా తెలియవస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన అంబేడ్కర్ రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. హిందూ భావజాలానికి చెందిన వ్యక్తులు అంబేడ్కర్ అవసరాన్ని గుర్తించి పనిచెయ్యడంవల్లే ఆయన రాజ్యసభలోకి వెళ్లగలిగారు. దీన్నిబట్టి హిందూ భావజాలాన్ని అంబేడ్కర్ ఆసరాగా, ఆలంబనగా తీసుకున్నారని అర్థం చేసుకోవవచ్చు కదా?

అంబేడ్కర్ భార్య ఒక బ్రాహ్మణ వనిత. ఆయన పేరులోని అంబేడ్కర్‌ అన్నది బ్రాహ్మణ్యాన్ని సూచించేదే! అంబేడ్కర్ అభివృద్ధిలో దత్తోపంత్ ఠేంగడీ ప్రధానమైన వ్యక్తి. ‘బ్రాహ్మణుల వల్ల లబ్ది పొందిన అంబేడ్కర్’ అన్నది చారిత్రిక వాస్తవం కాదా? అస్పృశ్య అని అనబడుతున్న కులంలో పుట్టిన భీంరావ్ అన్న వ్యక్తి ఒక బ్రాహ్మణవ్యక్తి పేరుతో అంబేడ్కర్‌గా రూపొందాడు.‌ రాంజీ మాలోజీ సక్పాల్ కొడుకు భీంరావ్ సక్పాల్, భీంరావ్ అంబేడ్కర్ అయి, చలామణిలోకి వచ్చి, ఒక దశలో తన జన్మ మతాన్ని వీడి బౌద్ధాన్ని తీసుకున్నాక కూడా ఆ అంబేడ్కర్ అనే బ్రాహ్మణ్యం పేరును వదులుకోకపోవడం దేన్ని తెలియజేస్తోంది? అంబేడ్కర్ ‘మతం (లోకి)మారడం’ మతతత్వం కాని లౌకికత్వం అవుతుందా? ఒక మతాన్ని తీసుకున్న ‘అంబేడ్కర్ లౌకికవాది కాదు’ అన్నది సత్యమే కదా?

బౌద్ధంలో నవయానం లేదా నవీనయానం తనది అని అంబేడ్కర్ ప్రకటించారు. బౌద్ధం ప్రకారం ఈ‌ నవయానం ఇంకో వందేళ్ల తరువాత కానీ రాదు. అంటే భవిష్యత్తులో రానున్న ఆ‌ నవయానాన్ని గతంలోనే అంబేడ్కర్ తీసుకున్నారు! ఇదెలా సాధ్యం? అంటే అంబేడ్కర్ ఇంకేదో బౌద్ధాన్ని తీసుకున్నారా?

అంబేడ్కర్ అనగానే స్ఫురణకు వచ్చేది మన దేశ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగానికి ఆధారం బెనగాల్ నరసింహారావు, ఆ తరువాత 200కు పైగా పలువురి కృషి ఫలితం మన ఇవాళ్టి రాజ్యాంగం. పలువురి మేధ, ఆలోచన, కృషి వీటిని అంబేడ్కర్‌కు మాత్రమే ఆపాదించడ అన్యాయం కాదా? దారుణం కాదా? ఈ దారుణం ఏ కుట్రలో భాగం? రాజ్యాంగ నిర్మాణంలో పునాది, కీలకం అయిన బెనగాల నరసింహారావును లేకుండా చేసి రాజ్యాంగ కర్తృత్వాన్ని పూర్తిగా అంబేడ్కర్‌కు అంటగట్టడం గత కొన్ని దశాబ్దులుగా దేశంలో బలపడుతూ వస్తున్న కులోన్మాద కుట్రలో భాగమా? రాజ్యాంగ నిర్మాణంలో బెనగాల నరసింహారావును లేకుండా చేస్తూండడం కుల వివక్ష కాదా?

మన దేశ రాజ్యాంగానికి ఆధార రచన లేదా మూల రాజ్యాంగాన్ని రాసింది బెనగాల్ నరసింహారావు. ఆయన 1946లో మొదలు పెట్టి, (జర్మనీ ఇంకా కొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల్లోని అంశాల్ని తీసుకుని )1948లో మన దేశ మౌలిక లేదా ఆధార రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. అటు తరువాత అది అంబేడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న 8 మంది సభ్యుల కమిటికి వెళ్లింది. ఆ బెనగాల్ నరసింహారావుకు రాజ్యాంగ రచన విషయంలో ఎందుకు దక్కవలసిన గుర్తింపు, స్థానం దక్కడం లేదు? ఈ అన్యాయం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? రాజ్యాంగం విషయంలో బెనగాల్ నరసింహారావును మరుగుపరచడం ఏ కుట్రలో భాగం? రాజ్యాంగం రచన పరంగా 20కు పైగా కమిటీలు, ఆ కమిటీల అధ్యక్షుల భాగస్వామ్యం, వాళ్ల సేవలు ఎందుకు దాచెయ్యబడ్డాయి? దాచెయ్యబడుతున్నాయి?

రాజ్యాంగం రచన పరంగా 20కు పైగా కమిటీలు, ఆ కమిటీల అధ్యక్షుల భాగస్వామ్యం లేకుండానే లేదా మరెవ్వరూ లేకుండానే రాజ్యాంగం మొత్తం అంబేడ్కరే రాశారని అనడం పక్కదారి పట్టించటం  అవదా?

రాజ్యాంగం ఏ ధార్మిక నియమావళి గ్రంథమో, చరిత్ర గ్రంథమో కాదు కదా? అలాంటప్పుడు రాజ్యాంగం ప్రతిలో రాముడు, అర్జునుడు, బుద్ధుడు, మహావీరుడు, అక్బర్, టిప్పు సుల్తాన్, అశోకుడు, కృష్ణుడు చిత్రాల్ని పొందుపరచడం దేన్ని సూచిస్తుంది? లౌకిక మేధావి అయిన అంబేడ్కర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, మహావీరుడు, బుద్ధుడు వంటి మత చిహ్నాల్ని లౌకిక రాజ్యాంగంలో చోటివ్వడంలోని ఆంతర్యం ఏమిటి? (బుద్ధుడు మత చిహ్నం అవని పక్షంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న బౌద్ధ మతం ఉండడం అబద్ధం అవుతుంది)

టిప్పు సుల్తాన్, అశోకుడు, అక్బర్ వంటి చారిత్రిక చిహ్నాలు రాజ్యాంగంలో ఎందుకు ఉండాలి?

మానవ హక్కుల ధీమంతుడు అంబేడ్కర్‌ అశోకుడు మానవ హక్కుల్ని దారుణంగా కాలరాచేసిన యుద్ధోన్మాది అన్న చారిత్రిక సత్యాన్ని విస్మరించటంలో  ఆంతర్యం ఏమిటి? అశోకుడు బుద్ధావలంబకుడు అయ్యాకే భయంకరమైన కళింగ యుద్ధం జరిగింది అన్నది సరైన చరిత్ర. అశోకుడు తాను రాజయ్యేందుకు తన సోదర, బంధువుల్ని నిర్మూలించాడు. మన దేశంలో తొలి మతోన్మాద నరమేధం జరిపించింది అశోకుడే! కళింగ యుద్ధం తరువాతి కాలంలో తన రాజ్యంలోని ఆజీవిక మతస్థుల్ని, నిర్గ్రంధుల్ని ఊచకోత కోయించాడు అశోకుడు. అంతర్జాతీయ చరిత్ర పరిశోధకులు ఈ సత్యాల్ని విశ్వవ్యాప్తంగా తెలియ జేశారు. ఆ అశోకుడికి రాజ్యాంగ ప్రతిలో స్థానం ఇవ్వడంలో అంబేడ్కర్ ఉద్దేశ్యం ఏమిటి?

అక్బర్, టిప్పు సుల్తాన్ వంటి వాళ్లు మన దేశాన్ని పీడించిన లేదా పాలించిన విదేశీ మత రాజులు. స్వతంత్ర దేశ రాజ్యాంగంలో వీళ్లకు చోటు ఎందుకు? వీళ్లకు రాజ్యాంగంలో చోటివ్వడం ద్వారా దేశ ప్రజలకు అంబేడ్కర్ ఇస్తున్న సందేశం ఏమిటి?

మహావీరుడి ధ్యానం, బుద్ధుడి బోధి, అర్జునుడి తపస్సు, కృష్ణుడి భగవద్గీతా బోధ వంటివి లౌకికత్వానికి, రాజ్య పాలనకు సంబంధించినవా? ఈ చిత్రాల్ని లౌకిక మేధావి అంబేడ్కర్ రాజ్యాంగం ప్రతిలో ఎందుకు పెట్టారు? ఈ చిత్రాలు రాజ్యాంగంలో ఉండడానికి అంబేడ్కర్ కారణం కాదా? ఆయన బాధ్యత లేదా? ఇతరులు అందుకు కారణమై ఉంటారా? వీటి ఆధారంగానూ రాజ్యాంగ నిర్మాణంలో ఇతరులు పలువురి కృషి ఉంది అని మనం రూఢీ చేసుకోవచ్చా? లౌకిక మేధావి అంబేడ్కర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు వీళ్లను చారిత్రిక వ్యక్తులుగా గుర్తించారా? బుద్ధుడు, మహావీరుడు చారిత్రిక వ్యక్తులూ, మత వ్యక్తులూ అయినట్టుగా రాముడు, కృష్ణుడు, అర్జునుడు వీళ్లను కూడా అంబేడ్కర్ పరిగణించారా?

రామాయణం, భారతం, భాగవతం నిజంగా జరిగిన చరిత్రలు అని అంబేడ్కర్ విశ్వసించి పరిగణించారా?

క్రైస్తవం, ఇస్లామ్, కమ్యూనిజమ్ వీటిని అంబేడ్కర్ తిరస్కరించడమూ అవి దేశానికి హానికరం అని చెప్పడమూ మనం చదివాం; అందువల్లే రాజ్యాంగంలో వాటికి సంబంధించిన చిత్రాలు లేవా? (అక్బర్, టిప్పు సుల్తాన్ చారిత్రిక రాజుల చిత్రాలు)

నంది, నటరాజు చిత్రాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అవి మత పరమైన చిహ్నాలే. “నేను హిందువుగా మరణించను” అని అన్న లౌకిక మేధావి అంబేడ్కర్ ఈ హిందూ మత చిహ్నాల్ని రాజ్యాంగంలో పొందుపరచడం ఏమిటి?

రాజ్యాంగం అమలులోకి వచ్చిన 3యేళ్ల తరువాత అంబేడ్కర్ తాను రాసిన రాజ్యాంగాన్ని తానే ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించాడు? లేదా అంబేడ్కర్ అలా వ్యతిరేకించనే లేదా? రాజ్యాంగం విషయంలో ఒక దశలో అంబేడ్కర్ “I am quite prepared to burn it; I dont want it” అని ఎందుకు అన్నారు? రాజ్యాంగం సరిగ్గా లేదనో సరికాదనో, సరిగ్గా అమలు కావడం లేదనో, అప్పటి కాంగ్రెస్ పాలకుల వల్ల సరిగ్గా అమలు అవదనో అలా అన్నారా? అసలు అలా అనలేదా? దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రాసిన మహా మేధావి, లౌకిక శిఖరం, దార్శనికుడు, సంస్కర్త అయిన అంబేడ్కర్ మంత్రిగా పని చేసి కూడా ప్రజాభిమానాన్ని చూరగొనలేక ఎన్నికల్లో ఓడిపోవడం ఏమిటి? అంత గొప్ప అంబేడ్కర్‌ను ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలు ఎందుకు ఆమోదించలేదు?

సమతా వాది అయి, కుల నిర్మూలనను కోరుకున్న అంబేడ్కర్ స్వతంత్ర దేశంలో తొలిసారిగా All India Scheduled Castes Federation అన్న ‘కులం’ పార్టీ పెట్టడం ఏమిటి? ఆ కులం పార్టీ గెలవలేకపోవడం కాదు కదా ఆ కులం ప్రజలే 90% అంబేడ్కర్ పెట్టిన కులం పార్టీకి ఓటు వెయ్యక పోవడం దేన్ని సూచిస్తోంది? అప్పుడు all The Scheduled Castes Of India అంబేడ్కర్‌ను తిరస్కరించిన సత్యాన్ని చరిత్ర మనకు చెప్పడం లేదా?

“ఇండియాను హిందూ రాష్ట్రగా ఇవ్వండి” అని 1947లో ఇంగ్లిష్ పాలకుల్ని అంబేడ్కర్ కోరిన చారిత్రిక సత్యాన్ని ఇటీవల సుబ్రమణియన్ స్వామి ఆధారాలతో వెల్లడించారు. హిందూ రాష్ట్ర ఆవశ్యకతను అంబేడ్కర్ గుర్తించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది అంబేడ్కర్ వాంఛను, ఆలోచనను, తీరును గట్టిగా తెలియజేస్తోంది. ఈ అంబేడ్కర్ వాంఛ, ఆలోచన, తీరు మనదేశానికి ఎంతో అవసరం.

బతికి ఉన్నంత వరకూ ప్రజాదరణకు నోచుకోని అంబేడ్కర్  పెద్దగా సఫలమూ  కాలేదు. ఇది దేనికి నిదర్శనం?   అంబేడ్కర్ పేరు మీద గత కొన్ని దశాబ్దులుగా దేశంలో ఎందుకు అలజడి జరుగుతోంది? అంబేడ్కర్ ఆధారంగా, అంబేడ్కర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందా? ఏ సంపాదన కోసం, ఏ లబ్ది కోసం అంబేడ్కరిజమ్, అంబేడ్కరిస్ట్‌ల జండాలతో రచ్చలు జరుగుతున్నాయి?

“అంబేడ్కరిజమ్” అని అంటున్నప్పుడు అందులోని అంబేడ్కర్ అన్నది బ్రాహ్మణ్యాన్ని తెలియజేస్తూంటుంది. “అంబేడ్కరిజమ్, అంబేడ్కరిస్ట్‌లం” అని అరుస్తున్న వాళ్లకు ఈ విషయం ఎందుకు తెలియదు? ఇవాళ అంబేడ్కరిజమ్ పేరుతో అరుస్తున్న చాలమంది నిజానికి అంబేడ్కరిస్ట్‌లు కారు అనీ, పబ్బం గడుపుకోవడానికి, పేరు,‌ డబ్బు, ఉనికి సంపాదించుకోవడానికి,‌ సాటి పౌరులపై ద్వేషం వెళ్లగక్కడానికి అలా అరుస్తూ ఉంటారు అనీ, వాళ్లు మామూలుగా ఎదగలేని, ఎదగడానికి కావాల్సిన చదువు, ప్రతిభ, సంస్కారాలు లేని ఉన్మాదులు, విద్వేషవాదులు అనీ ఈ మధ్యకాలంలో పెద్దశాతం ప్రజలు తెలుసుకుంటున్నారు.

గాంధీ‌, నెహ్రూలను వ్యతిరేకించిన వ్యక్తి అంబేడ్కర్. ఇస్లామ్, క్రిస్టిఅనిటి, కమ్యూనిజమ్‌ వీటిని అంబేడ్కర్ తిరస్కరించారు. అంబేడ్కరిస్ట్‌లు క్రిస్టిఅన్లుగానూ, ముస్లీమ్లుగానూ, కమ్యూనిస్ట్‌లుగానూ ఉండడమూ, వాటిని తిరస్కరించకపోవడమూ అంబేడ్కర్‌కు ద్రోహం చెయ్యడం కాదా? అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్న అసాంఘీకశక్తులకు అంబేడ్కర్ ఆలంబన అయిపోయారా? అంబేడ్కర్ పేరుతో గత కొన్నేళ్లుగా మనదేశంలో అలజడి రేగుతోంది. అది దేశానికి హాని‌ చేస్తోంది.

అంబేడ్కర్ పేరుతో భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయని, అవి దేశానికి హానికరమైనవని ప్రజలు, ముఖ్యంగా యువకులు గ్రహిస్తున్నారు. “అంబేడ్కర్, అంబేడ్కరిజమ్” అంటూ రచ్చ చేస్తున్నవాళ్లు దేశానికి, సామాన్య పౌరులకు అపాయకరం కానున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు, కులోన్మాద, కుట్ర పూరిత, సమాజ వ్యతిరేక, అభ్యంతరకరమైన, అవాస్తవ పత్రికా రచనలతో చాలకాలంగా ప్రజల్ని మోసం చేసేందుకు జరుగుతూ వస్తున్న వృద్ధ రచనలు, విష రచనలకు, కాలం చెల్లాల్సిన సమయం ఇది.

కులోన్మాదులకు, కుల రాజకీయాలకు, వేర్పాటువాదానికి, అసాంఘీకశక్తులకు, విద్వేషవాదులకు, ఉన్మాదులకు అతీతంగా మనం అంబేడ్కర్‌ విషయంగా సరైన అవలోకనం, ఆలోచన చెయ్యాలి. ఈ దేశ ప్రజకు అంబేడ్కర్‌పై సరైన అవగాహన రావాలి, కావాలి. అది సమాజానికి, సగటు మనిషికి మేలు చేస్తుంది. అంబేడ్కర్ చుట్టూ ఉన్న ప్రశ్నలకు సరైన జవాబులు అమలులోకి రావాలి. అవి మనదేశానికి మేలు చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here