[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పి.వి. సత్యనారాయణ రాజు రాసిన ‘మనసెరిగినవాడు శ్రీరాముడు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
[dropcap]శ్రీ[/dropcap]రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అందుకే ఇప్పటికీ ఆరాధిస్తున్నాం. ఆయన గురించి నేను విన్నవీ, చదివినవీ కొన్ని విషయాలు ఈ వ్యాసంలో సమర్పిస్తున్నాను. ఇందులో కొన్ని మీకు తెలిసే ఉంటాయి. ఇవన్నీ పెద్దలు చెప్పినవే. చర్వితచర్వణమే.
రామలక్ష్మణుల అనుబంధం చూస్తే ముచ్చటేస్తుంది. లక్ష్మణుడు ఆవేశపడితే రాముడు శాంతింపజేస్తాడు. అలాగని రాముడు ఎప్పుడూ శాంతంగా ఉన్నాడా? రాముడు ఆగ్రహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక సందర్భంలో లక్ష్మణుడు రాముడిని సముదాయిస్తాడు. భరతుడు సైన్యంతో సహా అడవిని రావటం దూరం నుంచి చూసిన లక్ష్మణుడు రాముడితో “భరతుడు నీ మీద దాడి చేయటానికి వస్తున్నాడు. నిన్ను అంతమొందిస్తే రాజ్యం ఎప్పటికీ తనదవుతుందని అతని ఆశ” అంటాడు. రాముడు అతన్ని శాంతింపజేస్తాడు. “అతని ఉద్దేశం తెలుసుకోకుండా ఆవేశపడటం మంచిది కాదు. ఒకవేళ అతను దాడి చేస్తే అప్పుడే ఎదుర్కొందాం” అంటాడు. మనం కూడా ఏదో ఊహించుకుని ఎవరి మీదో పగ పెంచుకుంటాం. అలాంటి పగలు మంచివి కాదు. మరి రాముడు ఆగ్రహించిన సందర్భం ఏమిటి? సీత అపహరణకి గురయ్యాక ఆమె జాడ తెలుసుకోలేక ప్రపంచాన్నే నాశనం చేస్తానంటాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు “అది వివేకం కాదు. మనం సీతని వెతుకుదాం” అంటాడు. లక్ష్మణుడు అనుమానంతో ఆవేశపడితే రాముడు దుఃఖంతో ఆవేశపడ్డాడు. అనుమానాన్ని, శోకాన్ని విడనాడాలి.
భరతుడు అడవికి వస్తున్నాడనే విషయం తెలిసిన రాముడు వనదేవతని భరతుడి దారిలో రాళ్ళూ, ముళ్ళూ లేకుండా చేయమని ప్రార్థిస్తాడు. వనదేవత “తమ్ముడంటే ఎంత ప్రేమయ్యా! అతనికి కష్టం కలగకూడదని కోరుతున్నావు” అంటే “అది కాదు. భరతుడి దారిలో రాళ్ళూ, ముళ్ళూ ఉంటే ‘అన్నయ్య, వదిన ఇలాంటి దారిలో నడవాల్సి వచ్చింది’ అని బాధపడతాడు. అతనలా బాధపడటం నాకు ఇష్టం లేదు” అంటాడు. ఇతరుల మనసు కష్టపడకూడదని రాముడి తాపత్రయం.
వాలివధ గురించి చాలామంది ప్రశ్నిస్తారు. అది న్యాయమేనా అని. వాలి చేసినది అన్యాయం. సుగ్రీవుడు బతికి ఉండగానే అతని భార్య రుమని చేపడతాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి. భరతుడి సామ్రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టటానికి వాలిని చంపానంటాడు రాముడు. వాలి చేసిన అధర్మాన్ని ప్రశ్నించకుండా అతడిని శిక్షించిన రాముడిని ప్రశ్నించటం సబబేనా? పైగా మనుషులకి జంతువులని చాటు నుంచి చంపే హక్కు ఉంది. అయినా కర్మఫలం అనుభవించక తప్పదు. రాముడు వాలిని చాటు నుంచి చంపాడు కాబట్టే కృష్ణావతారంలో బోయవాడు చాటు నుంచి పొరపాటున లేడి కన్ను అనుకుని కృష్ణుడి కాలి బొటనవేలుకి తగిలేటట్టు బాణం వేశాడు. ఫలితంగా కృష్ణుడు దేహత్యాగం చేశాడు. కర్మ ప్రణాళికలో తేడా ఉండదు.
రాముడు వనవాసం నుంచి తిరిగివచ్చాక కైకేయి తన తప్పుకి దుఃఖిస్తుంటే రాముడు “మీ వల్ల మా నాన్నగారు సత్యనిష్ఠాపరులుగా నిలిచారు. మీరు వరాలు కోరకపోయి ఉండి ఉంటే ఆయన సత్యవాక్పాలన అందరికీ తెలిసేది కాదు. కాబట్టి మీరు ఆయనకి ఉపకారమే చేశారు. బాధపడకండి” అన్నాడట. అదీ రాముడంటే. క్షమ అతని నుంచి నేర్చుకోవాలి. మరి రాముడి కష్టం సంగతి ఏమిటి? అది విధివిలాసం అని భావించాడు. తననెంతో ప్రేమించిన కైకేయి తనని వనవాసానికి పంపించిందంటే అది విధివశాత్తూ జరిగినదే అని భావించాడు. ‘మనకొచ్చే కష్టాలు ఇతరుల వల్ల కలుగుతున్నాయనుకోవటం పొరపాటు. మనం చేసుకున్న కర్మ వల్లే కష్టాలు వస్తాయి’ అని రామాయణం చెబుతుంది. మరి విష్ణువు దుష్కర్మ ఏం చేశాడు? శివపార్వతులను వేరు చేశాడని పార్వతి శాపం ఇచ్చిందని ఒక కథనం. దేవతలైనా కర్మఫలాలు అనుభవించాల్సిందే. అయినా రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యలో ఉండిపోతే రావణవధ ఎలా? కాబట్టి ఏం జరిగినా దానికో ప్రణాళిక ఉంటుంది. మన వశంలో లేని పరిణామాలని తట్టుకోవాలి గానీ క్రుంగిపోకూడదు.
రావణవధ జరిగాక రాముడు, సీత, ఇతర పరివారం పుష్పకవిమానంలో అయోధ్యకి బయలుదేరుతారు. సీత పుష్పకవిమానాన్ని చూసి “అద్భుతం! ఇలాంటి వాహనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు” అంటుంది. విభీషణుడు విస్తుపోతాడు. “అమ్మా! అదేమిటి? రావణుడు మిమ్మల్ని అపహరించి తెచ్చినది పుష్పకవిమానంలోనే కదా!” అంటాడు. అంతులేని దుఃఖంలో ఉంటే పుష్పకవిమానం సౌందర్యం కూడా మనసుకి ఎక్కదు. దుఃఖంలో ఉన్నప్పుడు శుభవార్త తెలిసినా దాని ప్రభవం ఉండదు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు దుర్వార్త తెలిస్తే సంతోషం కరిగిపోతుంది. అందుకే సుఖదుఃఖాలని సమానంగా చూడాలి. సుఖం వచ్చినపుడు అమితంగా పొంగిపోకూడదు. దుఃఖం వచ్చినపుడు అనవసరంగా క్రుంగిపోకూడదు. ఇక్కడ ఇంకో విషయం. రావణుడు సీతని అపహరించేటపుడు ఆమె మూర్ఛపోయిందని, ఆమె పడిపోయిన భూమిని రావణుడు పెకలించి తీసుకుపోయాడని కథనాలు ఉన్నాయి. సీతను ముట్టుకుంటే అతను భస్మమైపోతాడని, అందుకే ముట్టుకోలేదని ఆ కథనాల సారాంశం. ఇవి తప్పుడు కథనాలు. రావణుడు సీతని జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళి పుష్పకవిమానంలో పడేసి తీసుకుపోయాడు. సీతారాములు మానవమాత్రులుగానే మెలిగారు. వారికి దివ్యశక్తులు లేవు. మానవజీవితం ఎలా ఉండాలో చూపించిన ఆదర్శమూర్తులు సీతారాములు. వారు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఎంత? కష్టాలను మనోబలంతో, దైవప్రార్థనతో ఎదుర్కోవాలి.