ఊరక చెడిపోకే మనసా

2
3

[శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల సుధామణి గారు రచించిన ‘ఊరక చెడిపోకే మనసా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మే[/dropcap]ము నలుగురం కారులో సామాన్లన్నీ సర్దుకొని కూర్చున్నాం. ముందు సీట్లో మా అబ్బాయి రఘు, కోడలు హేమ, వెనక వైపు నేను, నా ముద్దుల మనవరాలు మైథిలి కూర్చున్నాము.

అమెరికాకెళ్లి నా కూతురు దగ్గర ఆరునెలలుండి వొచ్చాను. వొచ్చి వారం రోజులైనా కాలేదు.. కడప దగ్గర వున్న ఒంటిమిట్టకు.. అదే మా కులదైవం రాములవారు కొలువైన ఊరికి బయల్దేరదీశాడు మా అబ్బాయి రఘువీర్. నిజానికి నాకూ మా దేవుడిని చూడాలనే కోరికగా వుంది. అందునా రేపు శ్రీరామనవమి కూడాను.

మా ఇంట్లో అందరూ రామభక్తులే! మా పూర్వీకులందరూ రామ, ఆంజనేయ భక్తులే! మా కులదైవం ఒంటిమిట్ట రాముడే! మా సొంతవూరు కూడా అదే! ఇప్పుడు మాకు అక్కడ రాముడు తప్ప ఆస్తులేమీ లేవు. రాముడు తప్ప ఆత్మబంధువులూ లేరు. దూరపు చుట్టాలు కొందరున్నారు అంతే! ఆ రాముణ్ని చూడకుండా వుండలేక.. ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడే ఒంటిమిట్టకు బయల్దేరుతాడు మా రఘు.

“అమ్మా.. మైథిలీ.. హేమా.. అందరూ చెప్పండి..

‘నమోస్తు రామాయ సలక్ష్మణాయచ

దేవ్యైచ తస్మై జనకాత్మజాయై

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో

నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥”

అందరం ఏకకంఠంతో చెప్పి కారులో కొలువై వున్న రాముల వారి విగ్రహానికి దండాలు పెట్టుకున్నాము క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని!

“సీతా లక్ష్మణ భరత శతృఘ్న ఆంజనేయ సుగ్రీవ జాంబవంత విభీషణ సహిత శ్రీ రామచంద్ర మూర్తికీ..” అని ఆగాడు రఘు.

“జై..” అన్నాము అందరమూ ముక్తకంఠంతో.

కానీ మా మైథిలి మాత్రం నోరు మెదపలేదు. నేను దాన్ని చేతి మీద మెల్లగా మోచేత్తో తాకి, “ఏమయింది?” అన్నట్టు కళ్లతోనే ప్రశ్నించాను.

“నాకు రాముడంటే వికెట్ పడిపోయింది నాన్నమ్మా.. ఇప్పుడేమీ అడగొద్దు. నిదానంగా చెప్తాలే..” నెమ్మదిగా అన్నది మైథిలి వాళ్ల నాన్న వైపు కొద్దిగా భయంగా చూస్తూ.

కారు బయలుదేరింది.

దారిపొడుగునా మా కారులోని మ్యూజిక్ ప్లేయర్‌లో నుంచి రామభక్తి ప్రవాహాలు ప్రవాహాలుగా సాగింది.

హైదరాబాదులో ఉదయం పదకొండుకు బయలుదేరితే చీకటిపడ్డాక కడప చేరుకున్నాము.

ఆ రాత్రికి కడపలో ఆగి, రఘు ముందే బుక్ చేసి వుంచిన గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నాము.

నాకు ఇంకా జెట్ లాగ్ పూర్తిగా తగ్గలేదు. దాంతో మెలకువ వొచ్చేసింది.. ఒకటిన్నరకే.

ఏ.సి.తో చాలా ఎక్కువ చల్లబడి పోయింది గది. లేచి ఏ.సి. ఆఫ్ చేసి గది తలుపు తెరచి బయటికి వొచ్చాను.

ఆశ్చర్యంగా ఎండాకాలంలో.. అందునా కడపలో.. సన్నని వాన పడుతోంది..! ఏదో తుఫాను ప్రభావం అనుకుంటా. గాలి చల్లగా, హాయిగా వుంది. చంద్రుడు కిరోసిన్ బుడ్డి దీపంలా గుడ్డిగా వెలుగుతున్నాడు.. మేఘాల చాటు నుంచి.

గాలికి తానా తందానా పాడుతున్నట్టు తలలూపుతున్నాయి చెట్లు.

వర్షదేవతకు కృతజ్ఞతలు చెప్పుతూ.. చేతులు ఊపుతున్నాయి పూలమొక్కలు. వాటిని చూస్తూ పిట్టగోడనానుకొని నిలుచుకున్నాను.

సడన్గా ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు. ఉలిక్కిపడ్డాను.

“నేనేలే.. నాన్నమ్మా.. మైథిలినీ..” అన్న మాటలు వినిపించాయి.

నా భుజం మీద తలపెట్టి గోముగా తన ముక్కుతో నా భుజాన్ని రుద్దుతూ..

“ఆరునెలల నించి నువ్వు లేక నేను చాలా ఒంటరిదాన్నయ్యాను నాన్నమ్మా.. నీతో చాలా మాట్లాడాలని వుంది” అన్నది మైథిలి. తను రెండ్రోజుల కిందటే హాస్టల్ నుంచి వొచ్చింది.

“దా.. కూచో అమ్మడూ.. నాకూ మెలకువ వొచ్చేసింది.. మాట్లాడు..” అన్నాను బెంచీ మీద నా పక్కన తనను కూర్చోబెట్టుకుంటూ.

“ఈ మధ్య నాకు రాములవారి మీద చాలా సందేహాలు వొస్తున్నాయి నాన్నమ్మా.. మా కాలేజీలో కొందరు రాముడి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధేస్తోంది. కానీ.. వాళ్ల మాటల్లో కొంత నిజం కూడా వుంది కదా.. అనిపిస్తోంది నాన్నమ్మా.. అందుకే కారులో రాములవారి శ్లోకం కూడా చెప్పలేకపోయాను..” సంజాయిషీ చెప్పుకుంటున్నట్టుగా అన్నది మైథిలి.

“చిన్నప్పటి నించీ రామాయణం కథ చెప్తూనే వున్నాను కదే.. రామ భక్తురాలివైన నీకే రాములవారి మీదే అపనమ్మకం కలిగిందా? రాముల వారి వికెట్ పడిపోయిందా? మనింటి పిల్లలు పుట్టగానే రామసేవకులవుతారు. అలాంటి మనింట్లోనే రాముడిపై సందేహాలా? సరే.. వాళ్లేమన్నారో చెప్పు. నాకు తెలిస్తే నీ సందేహాలు తీరుస్తాను” అన్నాను నేను డిబేట్ లోకి దిగుతూ.

మైథిలి గత సంవత్సరమే ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది. కొత్త స్నేహాలు.. కొత్త భావాలు.. హాస్టల్ వాసమూ.. ఇబ్బందులు తప్పవు గదా ఎవరికైనా..

“నాన్నమ్మా! మా కాలేజీలో స్నిగ్ధ అనే అమ్మాయి వుంది. దానివన్నీ వ్యతిరేక భావాలే! మన దేవుళ్లందరినీ తిడుతుంది. మన మతాన్ని విమర్శిస్తూ వుంటుంది. దానికి తోడు మరొక అబ్బాయి ఆశీష్ అని.. వాడూ అంతే.. ఎప్పుడూ మన దేశాన్నీ, మతాన్నీ తిట్టడం.. అమెరికాను, యూరప్‌నూ, క్రిస్టియన్ మతాన్నీ, అక్కడి సంస్కృతినీ పొగడటం!

“నేను ఒకసారి మాటల సందర్భంలో మా ఇంట్లో అందరం రామభక్తులమనీ, రాముడంటే మాకు పంచప్రాణాలనీ చెప్పాను నాన్నమ్మా. అప్పటినించీ వాళ్లిద్దరూ నన్ను మరీ తేలికచేసి, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్స్‌ను కూడా అవమానిస్తున్నారు. మేము బావిలో కప్పలమట! మనది తప్పులతడకల మతమట. మన రామాయణం, భారతం కట్టుకథలట! బొట్టుపెట్టుకోవడం వేస్టట. గుడికి వెళ్లడం పరమ చిరాకు పని అట!” దిగులుగా చెబుతోంది మైథిలి.. నా భుజం చుట్టూ చేయివేసి నన్ను ఆనుకుని కూచుంటూ..

“రాముడు స్వార్థపరుడట. తమ్ముడైన లక్ష్మణునితో సర్వచాకిరీ చేయించుకున్నాడట. లక్ష్మణునికి సొంత తెలివే లేదట. అన్న అయినంత మాత్రాన అట్లా బుర్ర లేనట్టు ఆయనతో వనవాసానికి వెళ్లడం చవటతనమట. సుఖపడటం చేతగాదట. ఇట్లా అవాకులూ చెవాకులూ మాట్లాడుతున్నారు నాన్నమ్మా..” దిగులుగా చెబుతోంది మైథిలి.

నేను తల వూపుతూ శ్రద్ధగా వింటున్నాను.

“రాముడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడం ఆడవాళ్ల పైన గౌరవం లేకపోవడం అట.. ఇంకా ఎన్నో ఎన్నో మాటలు అంటున్నారు నాన్నమ్మా..” దిగులుగా చూస్తూ నా గుండెల పైన తల పెట్టుకుంది మైథిలి. నేను తనను అనునయిస్తూ..

“మన మతాన్ని, దేవుళ్లనూ ఎవరో ఏదో అన్నంత మాత్రాన నువ్వు డీలా పడిపోనక్కర్లేదు అమ్మలూ!

రావణుడు, ఆమెకు కాపలా వున్న రాక్షసస్త్రీలూ రాముడిని గురించి ఎంతో అవమానకరంగా మాట్లాడారు సీతమ్మతో. ‘రావణుడు ముల్లోకాలనూ జయించినవాడు, సమర్థుడు, ఆయనను చేపట్టు’ అని సీతమ్మ చెవినిల్లు కట్టుకుని పోరారు.

సీత తన భర్తను అవమానించినందుకు బాధపడింది గానీ, ఆమె మనసు కించిత్తు కూడా కదలలేదు. ధైర్యం వీడలేదు. ఆమె మనసులో రాముడి వికెట్ పడిపోలేదు. మరింతగా ధైర్యం పుంజుకొని, రాముణ్నే తలచుకుంటూ, తన భావాన్ని దృఢం చేసుకుంటూ రోజులు గడిపింది.

“మరి వాళ్లెవరో రాముణ్ని యేదో అంటే నువ్వు ఇలా డీలాపడి పోవడమేమిటి? వేరే పిల్లలంటే ఏదో వాళ్లకు తెలియక అలా చేశారనుకోవొచ్చు. పుట్టిందగ్గర్నుంచి రామాయణం వింటున్నావు. నువ్వు ఇట్లా జావకారిపోవడం నాకు నచ్చలేదే అమ్మడూ!

నీ దైవాన్నీ, నీ మతాన్నీ ఎవరైనా ధిక్కరిస్తే.. నువ్వు ఆ ఆరోపణలకు సమాధానం వెతుక్కొని సరైన జవాబివ్వాలి. నీ మతాన్ని గురించి మరింత బాగా అవగాహన చేసుకొని, వారికి సమాధానం చెప్పేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. ఈ రోజు వాళ్లు అట్లా మాట్లాడటం మంచిదే అయింది. కనీసం ఇప్పుడైనా నీ మతం గురించి, నీ సంస్కృతి గురించీ, రాముడిలోని మంచి చెడ్డల గురించీ ఆలోచించడం ప్రారంభించావు” అన్నాను నేను మబ్బులతో దోబూచులాడుతున్న చంద్రుణ్ని చూస్తూ.

ఆసక్తిగా వింటూ వుంది మైథిలి.

“రామాయణం జరిగి ఎన్నేళ్లయింది చెప్పు? రకరకాల లెక్కలు చెబుతారు. ఎలా అయినా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. అప్పటి దేశకాలమాన పరిస్థితులను బట్టీ, ఆ యుగధర్మాన్ని బట్టీ అప్పటి మనుషుల ప్రవర్తనలు వుంటాయి. ఇన్ని వేల యేళ్లలో భావాల్లోనూ, ప్రవర్తనా నియమావళిలోనూ ఎన్నో మార్పులు వొచ్చే అవకాశం వుంది కదా?

కాబట్టి 21వ శతాబ్దపు కళ్లజోడుతో త్రేతాయుగం నాటి రాముణ్ని చూసి, రాముడు ఈ కాలం కమ్యూనిస్టు భావజాలం లోనో, అమెరికా పద్ధతులలోనో ఇమడటం లేదని విమర్శించడం పిచ్చితనం కాదా?”

చిన్నగా తలూపుతూ వింటూ వుంది పాప.

“తర్వాత రాముడు, ఆయన వంశీకులంతా, ఇంకా చెప్పాలంటే మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో వర్ణించిన మహనీయులందరూ అక్షరాలా వేదధర్మాన్ని అనుసరించి జీవితం సాగించే నియమం కలిగినవాళ్లు.

అంటే వేదం చెప్పిన నియమాలను కలలో కూడా ఉల్లంఘించరు. అసత్యం చెప్పకూడదని వేదం చెప్పింది కాబట్టి ప్రాణం పోయినా అబద్ధమాడరు. ఆ వేదాన్ని నేర్పి, వేదార్థాన్ని వివరించి, వేదాన్ని ఎలా నిజజీవితంలో ఆచరించాలో చెప్పే ఆచార్యులు, గురువులను తల్లిదండ్రుల కంటే, దేవతల కంటే పై స్థానమిచ్చి గౌరవిస్తారు. అలాగే తల్లిదండ్రుల పట్లా, పెద్దల పట్లా ఎంతో గౌరవంతో వుంటారు.

అదే లక్ష్మణుడు చేసింది కూడా. అన్నను అనుసరించడమే, అన్నను తండ్రిలా సేవించడమే తమ్ముడి పరమధర్మమని చెప్పిన వేదవాక్యాన్ని ఆయన అనుసరించాడు. పైగా రాముడు రాజు కావలసిన వాడు. ఇప్పుడు కాకపోయినా, వనవాసం నుంచి తిరిగి వొచ్చాక అయినా ఆయన రాజు అవుతాడు. రాజును సేవించడం ఆశ్రితుల, రాజ బంధువుల ధర్మం. తను ధర్మమని నమ్మినదాని కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టగల నిబద్ధత లక్ష్మణుని సొంతం. అందుకే భార్యను, తల్లిని, తండ్రిని, రాజభోగాలను అలవోకగా వొదిలేసి, తను దైవంగా భావించే రాముడి వెంట అడవికి నడిచాడు. అన్నను తండ్రిగా, వదినెను తల్లిగా భావించి సేవచేశాడు. అది వేదధర్మాన్ని ఆచరించే మహనీయుల లక్షణం.

మరి రాముడి వైపు నుంచి చూస్తే.. ఆయన కూడా లక్ష్మణుడిని సొంత కొడుకులా చూసుకున్నాడు కదా! అతణ్ని వనవాసానికి రావొద్దని బతిమలాడాడు. అయోధ్యలో వుండి తండ్రిని, తల్లులను సేవించుకోమన్నాడు. మరీ మొండికేయడంతో తప్పనిసరి అయిపోయి తనతో రావడానికి అనుమతించాడు. అనుక్షణం తమ్ముడి యోగక్షేమాలను చూసుకున్నాడు.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛ పోయి పడివుంటే.. భోరున విలపించాడు. ‘ప్రపంచంలో భార్య, బంధువులు, మిత్రులు ఏ రాజ్యానికి పోయినా దొరుకుతారు. కానీ, తమ్ముడు పోతే మళ్లీ తమ్ముడు దొరకడు. లక్ష్మణుడు లేకపోతే నాకు రాజ్యం వద్దు. జీవితం కూడా వొద్దు. సీత కూడా నా తమ్ముడి తరువాతేన’ని చెప్పాడు కదా? అంటే అన్న.. తమ్ముణ్ని కొడుకు లాగా చూడాలని చెప్పిన వేదధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాడన్నమాట! అంతటి ప్రేమను లక్ష్మణుని పట్ల రాముడు చూపించాడు గనుకనే తమ్ముడి వద్దనుంచి అవ్యాజమైన ప్రేమను పొందగలిగాడు.”

మైథిలి శ్రద్ధగానే వింటోంది. అందుకే సంభాషణను పొడిగించాను.

“ధర్మమే రాముడి ఊపిరి. ధర్మం కోసమే గదా రాముడు తండ్రి కైకమ్మకిచ్చిన వరాలను, అవి ఎంతో కఠినమైనవైనా, వాటిని తను పాటించడం తన తండ్రికే ఇష్టం లేకపోయినా, తన తండ్రిని అసత్య దోషం నుంచి కాపాడటం తన కర్తవ్యమని భావించి అడవుల కెళ్లాడు. అసత్యం పలకడం, అధర్మం ఆచరించడం కంటే ఎంతటి కష్టాన్నయినా భరించడమే వారికి సంతోషం! హరిశ్చంద్రుని కథ కూడా దాన్నే నిరూపిస్తుంది కదా? అధర్మం ఆచరిస్తే నరకవాసం చెయ్యాల్సి వస్తుందని వారికి భయం!

మరి అలాంటి శుద్ధసత్వ గుణ పూర్ణుడైన రాముడిని అధర్మపరులూ, స్వార్థపరులూ, అహంకారులూ అయిన సామాన్యజనం విమర్శించడం ఆకాశం పైన రాయి వేయడమే కదా!” అన్నాను మైథిలి మొహంలోకి చూస్తూ.

“మరీ ఇప్పుడు ఈ కాలంలో మనం అందరం ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాం కదా నాన్నమ్మా.. మరి మనమంతా నరకానికే పోతామా?” దిగులుగా అన్నది మైథిలి నా చేతివేళ్లు విరుస్తూ.

“అదంతా పెద్ద సబ్జెక్ట్ మైథిలీ.. యుగాలు, యుగధర్మాలు రకరకాలుగా వుంటాయి. ఇది కలియుగం. ఇప్పుడు ధర్మం ఒంటికాలు మీద నడుస్తుంది. ఈ యుగానికి కలిపురుషుడు లీడర్. అసత్యానికీ, అధర్మానికీ, అకృత్యాలకూ, జూదం, వ్యభిచారం, తాగుడు, మోసం, జగడం, నాస్తికత్వం మొదలైన సర్వ దుర్గుణాలకూ వాడే నాంది ఈ యుగంలో. యథా రాజా.. తథా ప్రజా అన్నట్టు నాయకుడిని బట్టే వాడి వెంట నడిచేవాళ్లు కూడా ప్రవర్తిస్తారు.

అయితే ఈ కలిదోషాన్ని పోగొట్టగలిగేది ఒక్క దైవభక్తి.. గురుభక్తి మాత్రమే! దైవ నామ సంకీర్తనం వల్ల సర్వ కలిదోషాలూ దూరమవుతాయని మన శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి మనం మరీ అంత బెంగపెట్టుకోనవసరం లేదు అమ్మలూ..” అన్నాను నేను తన ముంగురులు సవరిస్తూ.

“నాన్నమ్మా.. నీ మాటలు వింటుంటే నాకు ఎంతో ధైర్యం వొచ్చినట్టుగా వుంది తెలుసా? రాములవారి గురించి నా సందేహాలన్నీ హూష్ కాకీ.. అన్నట్టు వెళ్లిపోతున్నాయి నాన్నమ్మా!” నా చేతిని పట్టుకొని ఊపుతూ అన్నది మైథిలి.

“అప్పుడే అయిపోలేదు మైథిలీ! ఇక రాముడు సీతమ్మను అనుమానించడం విషయాని కొద్దాం. రాముడు రావణున్ని వధించి, విభీషణుడికి పట్టాభిషేకం చేయిస్తాడు. విభీషణుడిని పిలిచి, సీతమ్మకు తన విజయవార్త తెలిపి, అభ్యంగన స్నానం చేయించి, అలంకరించి తన వద్దకు తీసుకొని రమ్మంటాడు.

తీరా ఆమె తన వైపు వస్తూ వుంటే ఆమెను పలకరించడు. ఆమె మోహంలోకి నేరుగా చూడను కూడా చూడడు.

‘కళ్లజబ్బు వొచ్చినవాడు దీపాన్ని ఎట్లా చూడలేడో అట్లాగే నేను నిన్ను చూడలేకపోతున్నాను. నిన్ను రక్షించడం నా ధర్మం కాబట్టి నేను నిన్ను రక్షించాను. పరాయి వ్యక్తి ఇంట్లో సంవత్సరం పాటు వున్నావు కాబట్టి నీ చరిత్ర సందేహాస్పదం అయింది. ఇప్పుడు నేను నిన్ను నా భార్యగా స్వీకరించలేను. నీకు ఎవరి దగ్గర రక్షణ దొరుకుతుందంటే వారి వద్దకు వెళ్లవచ్చు’ అని చాలా నిర్దయగా మాట్లాడుతాడు.

ఆ మాటలు ఎవరికైనా కోపమే తెప్పిస్తాయి. అందరూ రాముడిని అపార్థమే చేసుకున్నారు. నిందించారు. యుగయుగాలుగా స్వామి అందరి నిష్ఠూరాలనూ ఎదుర్కుంటూనే వున్నాడు.

కానీ, అక్కడ ఆయన మాటలను సరైన రీతిలో అర్థం చేసుకున్నది సీతమ్మ మాత్రమే!

ఎందుకంటే ఆయన మనసు, ఆవిడ మనసూ ఒక్కటే గనుక! నిజానికి ఆయన మనసులో తన పట్ల ఎలాంటి దుర్భావమూ లేదనీ, లోకనిందకు భయపడవలసి రావడం అన్న దుఃఖం తన కళ్లను కళ్లకలకలా ఆవరించి వున్నదని, అందుకే ఆమెను తేరిపార చూడలేకపోతున్నాననీ, దైవవశాన సీత రావణగృహంలో వున్నందువల్ల, ఆమెకు ముందు ముందు రాబోయే నిందలను నిలుపుచేసి, ఆమె పాతివ్రత్యాన్ని పదిమంది ముందూ నిరూపించాలని మాత్రమే ఆయన అలా పరుషంగా మాట్లాడాడని అర్థం చేసుకుంది సీత.

అందుకే లక్ష్మణున్ని చితి సిద్ధం చెయ్యమని ఆదేశించి, అగ్నిప్రవేశం చేసి, అగ్నిపునీతయై బయటికి వొచ్చింది. దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. రాముడి ధర్మాన్నీ, శౌర్యాన్నీ, సీతమ్మ పవిత్రతనూ, సహనాన్నీ వేనోళ్ల పొగిడారు.

అప్పుడు రాముడు సీతను భార్యగా స్వీకరించి బొటబొటా కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లు ఆ పవిత్రమూర్తిని అనుమానించినట్టు నటించిన పాపాన్ని కడుక్కోవడాని కన్న మాట! కాబట్టి సీతమ్మకు లేని బాధ మనకెందుకు? అంతే కదా?” అన్నాను మైథిలిని చూస్తూ. తన కళ్లు ఆనందంతో మెరుస్తున్నాయి.

“ఇంకా రాముడి గురించి చెప్పు నాన్నమ్మా.. ఎంతైనా వినాలనుంది” అన్నది తను.

“రాములవారిని గురించి చెప్పుకోవాలంటే జీవితాలు చాలవు అమ్మలూ! యుగయుగాల నించీ చెబుతున్నా రామాయణం ఎప్పుడూ విసుగు రాదు. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అందుకే రోజూ కాసేపయినా రామాయణాన్ని చదవాలని చెబుతారు పెద్దలు. ఎందుకంటే ఒక్కొక్క వయసులో, ఒక్కో సందర్భంలో రామాయణం ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది.

రాముడి ప్రత్యేకత ఏంటంటే శత్రువుల పట్ల కూడా న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించడం! రావణునికి అంత్యక్రియలు చేయనని విభీషణుడు భీష్మించుకుంటాడు. అప్పుడు అతనిని ఓదార్చి, రావణునికి అంత్యక్రియలు చేయిస్తాడు. నువ్వు చెయ్యకపోతే నేనే అంత్యక్రియలు చేస్తానంటాడు. ‘మరణాంతాని వైరాని’ అని సర్దిచెబుతాడు.

తరువాత సీత అగ్నిప్రవేశం తర్వాత స్వర్గం నుంచి ఇంద్రుడి రథంలో ఇంద్రుడితో పాటు అక్కడికి వొచ్చిన దశరథుడు సీతారాములను ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకోమంటాడు.

అప్పుడు కూడా సొంతానికేమీ కోరుకోడు. ‘నాన్నగారూ! నన్ను కైకేయి మాత వనవాసానికి వెళ్లమన్నదన్న కోపంతో ‘నాకు ఆమె భార్య కాదు. భరతుడు నాకు కొడుకు కాదు’ అన్న నిష్ఠుర శాప వాక్యాలను మీరు విడిచిపెట్టారు. నిజానికి రావణవధ అనే దైవ నిర్ణీత కార్యం జరగడానికి నేను సీతా లక్ష్మణులతో వనవాసానికి వెళ్లడం, అక్కడ సీతాపహరణం జరగడం అత్యవసరం. కైకేయి, మంధర దేవతల ప్రేరణతో మాత్రమే నాకు వ్యతిరేకంగా మాట్లాడి, దేవకార్యానికి సహకరించారే కానీ, నిజానికి వారికి అలాంటి చెడు సంకల్పం ఏదీ లేదు. మీరు వారిద్దరినీ, ఏ తప్పూ చేయని నా తమ్ముడు భరతుడినీ క్షమించాలి” అని కోరాడు. దశరథుడు తన శాప వాక్యాలను వెనక్కి తీసుకున్నాడు. అలా తనకు హాని చేసినవాళ్లను కూడా అలవోకగా క్షమించేస్తాడు రామయ్య.

ఇంద్రుడు ఆ సంతోషసమయంలో ఏదైనా వరం కోరుకొమ్మని రాముడిని అడుగుతాడు. అప్పుడు ఆయన తన కోసం ఏమీ అడగడు. ‘యుద్ధంలో చనిపోయిన వానరవీరులంతా తిరిగి జీవించాలని, వారికి ఎప్పుడూ దేశ కాల పరిస్థితులతో సంబంధం లేకుండా ఫలాలు, కందమూలాలూ, తేనె సమృద్ధిగా దొరకాలనీ, వాళ్లు సుఖంగా వుండాలనీ కోరుతాడు. ఇంద్రుడు వారందరినీ బతికిస్తాడు. రాముడి కోరికను మన్నిస్తాడు.

లంక నుంచి పుష్పకంలో తిరిగి అయోధ్యకు వెళ్లేటప్పుడు ఆంజనేయుడిని పిలిచి ‘నువ్వు వేగంగా వెళ్లి భరతుడికి నా ఆగమనవార్త చెప్పు. అతని భావాలను జాగ్రత్తగా గమనించు. అతనికి రాజ్యం చెయ్యాలన్న కోరిక యేమాత్రం కనిపించినా నాకు వొచ్చి చెప్పు. నేను భరతునికి రాజ్యం అప్పజెప్పి వనవాసానికి వెళ్లిపోతాను.’ అని చెబుతాడు రాముడు. ఎందుకంటే కొన్నేళ్లపాటు రాజ్యాన్ని పాలిస్తే ఎవరికైనా దాన్ని వొదులుకోవాలంటే కష్టం కదా! భరతుడికేమైనా అలాంటి భావం ఉందేమోనని తెలుసుకోవాలను కుంటాడు రాముడు. అంత జాగ్రత్తగా పరిశీలిస్తాడు రాముడు ఎదుటివారి మనసులను.

రాముడంటే అమిత మేధావంతుడు. పరమజ్ఞాని. త్యాగమూర్తి. పునీతుడు. ప్రేమ, కృతజ్ఞత, దయ, లాలన, కరుణ, నిస్వార్థం నిండి నిబిడీకృతమైనవాడు. పరహితం మాత్రమే కోరేవాడు. కోట్ల తల్లుల ప్రేమ కలిగినవాడు. ఇట్లా ఎన్నని రాముడి గుణాలు చెప్పమంటావు తల్లీ.. చెప్పిచెప్పి నోరెండి పోవాల్సిందే.. రాసి రాసి పెన్నులు అరిగిపోవాల్సిందే..” అన్నాను మబ్బులు తొలగిన ఆకాశాన్ని చూస్తూ.

“అబ్బ.. రాముడంటే ఏమిటో ఇప్పుడు అర్థమయింది నాకు. అన్నట్టు సీతమ్మను అడవులకు పంపడం వెనక కారణం చెప్పడం మరిచిపోయావు నాన్నమ్మా..” అంది మైథిలి.. నా జుట్టుతో జడ అల్లుతూ.

“ఇక గర్భవతిగా వున్న సీతమ్మను అడవులకు పంపడం గురించి యుగయుగాలుగా రాముడిని మాటలు అననివారు లేరు మైథిలీ! నిజానికి వేదవిహితంగా రాజధర్మం నిర్వహించడం అంతటి కష్టమైన పని లేనేలేదు. అది కత్తిమీద సాము. రాజు కావడం భోగాలనుభవించడం కోసం కాదు. దేశరక్షణ, ప్రజాపాలన కోసం మాత్రమే! ఏ క్షణమైనా సింహాసనాన్ని త్యాగం చెయ్యడానికి, అయినవాళ్లను సైతం వొదిలి వెయ్యడానికి సిద్ధపడటమే! తన ఇష్టాయిష్టాలకు అక్కడ స్థానమే లేదు. ప్రజాభీష్టాన్ని నెరవేర్చడమే తన కర్తవ్యం.

రాముడు రాజధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటించేవాడు. రాజు గానీ, ఆయన కుటుంబంగానీ నిష్కల్మషంగా, అకళంకితులుగా వుండాలన్న నియమాన్ని అక్షరాలా పాటించినవాడు. అందుకే ఒక్క పామరుడైన పౌరుడైనా తన భార్య శీలంపై వేలెత్తి చూపగానే ఆమెను పరిత్యజించాల్సిన అగత్యం ఆయనకు ఏర్పడింది. నిజానికి ఆయన ఆమెను అనుమానించ లేదు. ప్రజావాక్యాన్ని పరిపాలించడమే ఆయన కర్తవ్యం. ఇక్కడ సొంత ఇష్టాయిష్టాలకు స్థానం లేదు.

అయితే ఆయన భార్యకోసం రాజ్యాన్ని వొదులుకోవచ్చు గదా.. అంటారు కొందరు. పితృపితామహులు రాజ్యంతో పాటు ఆయనకు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాల్సిన బాధ్యతను కూడా వారసత్వంగా ఇచ్చారు. మధ్యలో భార్య కోసం ప్రజలను, దేశాన్ని పాలించాల్సిన కర్తవ్యాన్ని వొదులుకోవడానికి వీల్లేని పరిస్థితి రాముడిది! అలా చేస్తే వంశప్రతిష్ఠ దెబ్బతింటుంది.

ఈ కథ ఉత్తర రామాయణంలో వుంటుంది. నిజానికి దానిని వాల్మీకి రాయలేదని చాలామంది అంటుంటారు. రామపట్టాభిషేకంతో రామాయణాన్ని వాల్మీకి ముగించాడట! ఉత్తరరామాయణం ఎవరో కొందరు కవుల కల్పితమని అనేకుల అభిప్రాయం! రామాయణం మన దేశవాసుల ఐకమత్యాన్ని కాపాడే వెన్నెముక వంటిది. అందుకే రామాయణంపై, రాముడిపై సందేహాలు రేకెత్తించడానికే విదేశీ ఆక్రాంతలైన వారు మన కవులను వశపరచుకొని ఉత్తర రామాయణాన్ని రాయించారని కొందరంటారు. నిజానిజాలను కాలమే నిరూపించాలి. ఉత్తరరామాయణం నిజం కాదంటే రాముడి పైన ఈ అభియోగం చెల్లకుండా పోతుంది. అంటే ఆయన పట్టాభిషేకం తర్వాత సీతతో పదివేల సంవత్సరాల పైగా హాయిగా రాజ్యం చేశాడని చెప్పుకోవాల్సి వొస్తుంది. అలా అనుకోవడం ఎంత బాగుంది కదా?” అన్నాను నేను ఆనందంగా.

“నాన్నమ్మా.. నాకు రాముడు అంటే ఏంటో, అర్థమయింది నాన్నమ్మా.. నా ఫ్రెండ్స్ కు ఈ విషయాలన్నీ చెప్తాను. ఆ స్నిగ్ధ పని చెప్తాను. ఆశీష్ గాడికి బుద్ధి చెప్తాను చూడు నాన్నమ్మా..” ఆనందంతో ఊగిపోతూ లేచి నిలుచుకుంది మైథిలి.

“అమ్మలూ! దీనికే ఆనందపడకు. రామతత్త్వం అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. నువ్వు వాళ్లకు సమాధానం చెప్పే కొద్దీ మరిన్ని ప్రశ్నలు వేస్తారు నిన్ను. వాటికి సమాధానాల కోసం నువ్వు, నీ భావాలతో ఏకీభవించే నీ స్నేహితులూ కొన్ని పనులు చెయ్యాలి.

అదేంటంటే.. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ అనేకమంది పౌరాణికులు ఉన్నారు. వారెన్నో విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ప్రవచిస్తున్నారు. కాబట్టి మీరంతా రోజులో ఓ గంట సేపైనా ఈ ప్రవచనాలు యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో వినాలి. రామాయణాది గ్రంథాలు తెలుగులో చదవలేకపోతే ఇంగ్లీషులో దొరికేవైనా చదవాలి. నెమ్మదిగా తెలుగు చదవడం అలవాటు చేసుకోవాలి. స్నిగ్ధ లాంటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీరంతా కలిసి తయారుచేసుకోవాలి. అంతేకాదు. బైబిల్ , ఖురాన్ , బౌద్ధ, జైన లాంటి అనేక మతాల గురించి అధ్యయనం చెయ్యాలి. ఊరికే పైపైన చదవకుండా విమర్శనాత్మకంగా చదవాలి. వాటిలో సందేహాస్పదంగా వున్న విషయాల గురించి తెలుసుకొని, మీరే వాటికి సమాధానాలు తెలుసుకోవాలి. తెలిసిన పెద్దల సహాయం తీసుకోవాలి. ఇలా చేస్తూ పోతే స్నిగ్ధ లాంటి వాళ్ల నోళ్లు మీరంతా కలిసి మూయించవచ్చు. అయితే మీరు ఆమెను హర్ట్ చెయ్యకుండా సామరస్యంగా మాట్లాడాలి. ఆమె కూడా మీలాంటి పిల్లనే కదా. ఏదో కొన్ని వ్యతిరేకశక్తుల ప్రభావంతో అలా మాట్లాడుతోంది. వాదన ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవడం లాగా కాకుండా.. ఒకరు చేసిన అధ్యయనాన్ని మరి కొందరితో పంచుకునేలా వుండాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు హింసాత్మకంగా మారే ప్రమాదముంది. అప్పుడు శ్రమ అంతా వృధా అయిపోతుంది.

నువ్వూ నీ స్నేహితులూ మన ఆచారాలన్నీ కాకపోయినా కొన్నింటినయినా పాటించాలి. ఉదాహరణకు రోజూ బొట్టు పెట్టుకోవడం, నిండైన దుస్తులు ధరించడం, ఎంతో కొంత పూజ, ధ్యానం, యోగా వంటివి చేసుకోవడం, వీలైనప్పుడల్లా గుడికి వెళ్లడం వంటివి ఆచరిస్తూ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి.

వాళ్లు ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ‘బొట్టెందుకు పెట్టుకోవాలి? విబూధి ఎందుకు రాసుకుంటారు? రుద్రాక్షలు ఎందుకు వేసుకోవాలి? గాజులెందుకు వేసుకోవాలి? నగలెందుకు పెట్టుకోవాలి? యోగా ఎందుకు చేయాలి? గురువెందుకు.. ఎవరికి వాళ్లు చదువుకోవొచ్చు గదా? కృష్ణుడికి పదహారువేల మంది భార్య లెందుకు? రాసలీల అసభ్యం కదా? కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చెయ్యమని ప్రేరేపించడం తప్పు కాదా? ఇలా యుద్ధాన్ని ప్రోత్సహించిన భగవద్గీత పవిత్రమైనదెలా అవుతుంది? గ్రామదేవతల పూజలు అవసరమా? జంతుబలిని మీ మతం ఎట్లా అనుమతిస్తుంది?’ ఇంకా ఇప్పుడు గుర్తు రావడం లేదు గానీ, లక్షలాది ప్రశ్నలు వేసేవాళ్లున్నారు ఈ ప్రపంచంలో.

పైపెచ్చు మన ధర్మాన్ని నిర్వీర్యం చెయ్యడానికి కోట్లకొద్దీ రూపాయలు కుమ్మరిస్తున్నాయి విదేశీశక్తులు కొన్ని. ఈ ధర్మాన్ని కాపాడు కోవలసింది మీ యువతీ యువకులే..” ఆగాను నేను.

“ఇంకో రెండు గంటల్లో లేవాల్సి వొస్తుంది. ఇకనైనా పడుకోండి నాన్నమ్మా మనవరాళ్లిద్దరూ.. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు ఈవేళప్పుడు ఈ చర్చలెందుకంట?” హెచ్చరించింది గదిలో నుంచి బయటికొచ్చిన హేమ.

“అంకమ్మ శివాలు కాదమ్మా.. రామయ్య శివాలు!” నవ్వుతూ అన్నది మైథిలి.

“మనింట్లో ఎప్పుడూ వుండేవేగా ఆ రామయ్య శివాలు..! కొత్తేముందీ.. పొద్దున మాట్లాడుకోవొచ్చు. పోయి పడుకోండి” నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది హేమ.

***

తూరుపు తెల్లవారింది. శ్రీరామనవమికి రామయ్య సపరివారంగా సిద్ధమయ్యాడు. ఒంటిమిట్టలో కోదండరాముల వారి దర్శనం, పూజాదికాలు ముగించుకొని బయట చెట్టు కింద వున్న చెప్టాపై కూర్చున్నాం అందరమూ. ప్రసాదం తిన్నాము.

“ఉండేది రాముడొకడు.. ఊరక చెడిపోకే మనసా..” కీర్తన ఎత్తుకున్నాడు రఘు. అందరం అతనితో కలిసి పాడుతున్నాము.

మైథిలి కూడా పాట అందుకుంది. “తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు.. సర్వసముడు.. క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు.. జగము నిండి వుండేది రాముడొకడే.. ఊరక చెడిపోకే మనసా.”

మైథిలి గొంతులో రామభక్తి తెరలు తెరలుగా విచ్చుకుంటున్నది.. పైపైకి వస్తున్న సూర్యకాంతిలా.. చెరువులో విరబూస్తున్న శతపత్రంలా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here