సమాజానికి అవసరమైన ధర్మాలని అందించే వేద గ్రంథం రామాయణం

1
4

[శ్రీరామనవమి సందర్భంగా స్వర్గీయ శ్రీమతి పుట్టపర్తి కరుణాదేవి గారు 2010లో ప్రచురించిన ‘శ్రీరామకథ’ అనే పుస్తకం పీఠికను ప్రత్యేక రచనగా అందిస్తున్నాము.]

[dropcap]భా[/dropcap]రతీయులకు రామాయణ భారత భాగవతాలు ప్రధానమైన ప్రామాణిక గ్రంధాలు. రామాయణ కావ్యం మంచి చెడ్డలను వివరిస్తూ ధర్మవర్తనుడైన మనిషి ఎలా వుండాలో, నలుగురికీ ఆదర్శంగా ఎలా మసలుకోవాలో తెలియజేస్తుంది. అందుకే ఆ కావ్యం అందరికీ అనుసరణీయమైంది. పండితుడు మొదలుకొని పామరునిదాకా, రామాయణ గాథలు అందరినీ అలరిస్తూ స్ఫూర్తిని కలుగజేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. జానపదుల జీవన విధానంలో రామాయణం ఒక భాగమైపోయింది. మన పూర్వీకులు రామాయణంలోని ప్రతి అక్షరమూ గాయత్రీమంత్రబద్ధమై, మహాపాతక నాశనమైనదని చెప్పినారు.

‘చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం

ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్’

రామాయణంలో బాలకాండనించీ యుద్ధకాండ వరకూ గల ఆరు కాండలలో రాముని బాల్యం, యాగసంరక్షణ, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం, సీతాన్వేషణ, సుగ్రీవునితో మైత్రి, సుందరకాండ, రావణ సంహారం, పట్టాభిషేకం, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. వాల్మీకి మదిలో మెదలిన సకల సద్గుణ సంపన్నుడు, సమస్త మానవాళికీ ఆదర్శప్రాయుడైన వాడెవరన్న ప్రశ్నకు శ్రీరామచంద్రుని జీవితం సమాధానంగా నిలిచింది.

రాముడు అయోనిజుడు కాదు. స్వయంభువు కాదు. అతడు కూడా మానవునివలె పుట్టి పెరిగినాడు. మానవ మనస్తత్వం ఆయనలోనూ వుంది. ఆలోచనా పద్ధతీ వుంది. మరపు కూడా వుంది. తాను దుష్ట సంహారం కొరకు పుట్టినాననే విషయమాయన అంగీకరించడు. ఋషులూ, మునులూ జ్ఞాపకం చేసినా, ‘ఉత్తరకాండలో అగస్త్యుడు మాటిమాటికీ హెచ్చరించినా’ గుర్తించడు. తాను ‘దశరథరాముడ’ననే అంటాడు. రావణుడు తనకు అపకారం చేసినా అతని పరాక్రమాన్ని మెచ్చుకుంటాడు. అతనిలోని ‘శివదీక్ష’ను చూచి అబ్బురపడతాడు. శరణాగతుడై వచ్చిన విభీషణుని కాపాడడం తన నియమమంటాడు. ‘బోయవాని ఆకలిని తీర్చడానికి తనను తాను మంటలకాహుతి చేసుకున్న పావురంవంటి చిన్న ప్రాణికున్న త్యాగబుద్ధి, దాతృత్వం మనకుండవద్దా’ అని అంటాడు ఒక తలవున్న విభీషణుడేకాదు. పదితలలున్న రావణుడే వచ్చి శరణు కోరినా క్షమిస్తానంటాడు. తప్పు ఎవరు చేసినా దండనార్హుడేనంటూ చనిపోతున్న వాలికి రాజ ధర్మాన్ని వివరిస్తాడు. గుహుని నీవు నాకు ఆత్మసముడైన సఖుడివంటాడు. అలాగే సుగ్రీవుని లాంటి మిత్రుడూ దొరకడంటాడు. భరతుని వంటి తమ్ముడూ వుండడంటాడు. ఇంకా హనుమ తన ప్రాణమంటాడు. విభీషణునిలోని సాత్విక ప్రవృత్తి, హనుమలోని పట్టుదల, స్వామిభక్తి, సుగ్రీవుని తోడ్పాటు, రావణునిలో అంతర్లీనంగా వున్న జీవుని వేదన యివన్నీ ఆలోచన కలిగించేవే. ఈ సందేహాలనంతా తీరుస్తాడు అగస్త్య మహర్షి ‘ఉత్తరకాండ’లో,

వాల్మీకి మహర్షి “కోనస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్” విశిష్ట గుణాలు గల వ్యక్తి యీ యుగంలో ఎవరైనా వున్నారా? అంటూ నారదమహర్షిని అడిగితే దశరథరాముని గూర్చి చెప్తాడు నారదుడు. జన్మ ఆరంభమైన దగ్గరినించీ జన్మపరిసమాప్తి అయ్యే వరకూ రాముడెలా జీవించాడో నారదుడు వాల్మీకి మహర్షికి వివరిస్తాడు.

‘రామో విగ్రహవాన్ ధర్మ సాధుః సత్య పరాక్రమః

రాజా సర్వస్యలోకస్య దేవానా మివ వాసవః

ధర్మ స్వరూపమే రాముడంటూ నూరు శ్లోకాలలో ‘రామకథ’ను విన్పిస్తాడు నారదుడు. దానిని వాల్మీకి ఇరవైనాలుగు వేల శ్లోకాలతో, ఆరుకాండలతో ఐదు వందల సర్గలతో రామాయణ కావ్యంగా రచించి, కుశలవులకు నేర్పించి, వారితో ప్రచారం చేయిస్తాడు. ‘రామకథ’ను.

మనిషి మనిషిగా మంచిగా బతకడం, అలవాటు చేసుకోవాలంటాడు రాముడు. సౌశీల్యం, హృదయ సౌందర్యం, ప్రేమ, ప్రజ్ఞ, స్నేహశీలత, వుండాలంటాడు. రామునిలో అడుగడుగునా కృతజ్ఞతాభావం వుంది. అతడు హనుమనుగానీ, సుగ్రీవునిగానీ, విభీషణుని, గుహుని, వానర ప్రముఖులను, ఎవ్వరినీ తక్కువగా అంచనావేయడు. మీ అందరి సహకారం లేకపోతే నేను రావణాసురుణ్ణి చంపగలిగేవాణ్ణి కాదంటాడు. రావణుని చంపగలిగే శక్తి తనకున్నా ఆ కీర్తిని సుగ్రీవునికి కట్టబెట్టాలన్న భావం రామునిది. దానివలన కోతులకంతా ఘనత వచ్చింది. తండ్రి రాజ్యం తీసుకొమ్మని చెప్పినా తాను వనవాసాన్నే ఎంచుకుంటాడు. నీవు రాజ్యానికీ నరులకూ రాజువు, నేను వనానికి వానరులకూ రాజును. మనం తండ్రి మాటను పాటించాలంటాడు భరతునితో.

యుద్ధభూమిలో అచేతనుడై పడివున్న లక్ష్మణుని చూచి దుఃఖంతో ‘సీతవంటి భార్య దొరుకుతుందేమో కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడంటాడు. అదే రామునిలోని వాత్సల్యం, ప్రేమ, కారుణ్యం. ఈ ప్రీతినీ, యీ విశ్వాసాన్నీ ‘తన పర’ అన్న భేదం లేకుండా అందరిపట్లా చూపించి ఆత్మీయుడైనాడు. విధేయుడైన కొడుకులా, భాద్యతగల తండ్రిలా, ప్రజలకు మంచి పాలకునిలా, జీవించాడు. అందువల్లనే రామాయణాన్ని అలంకారికులు ధ్వనికావ్యమన్నారు. అన్నిధర్మాలనూ ఆచరించి చూపిన రామునిలోని దైవత్వాన్ని తెలుసుకున్నవారు సుమిత్ర, తార, మండోదరి, మారీచుడు, కబంధుడు కుంభకర్ణుడు, శబరి, మొదలైనవారు.

ఇక రావణుని విషయానికి వస్తే అతనిలో పరాక్రమమెంతో పరాధీనత కూడా అంతే వుంది. అతని పరివారమంతా హితశ్శత్రువులు. కుంభకర్ణుడు, విభీషణుడు రావణుని చర్యలను ఖండిస్తూ రాజు క్షేమం మనసా వాచా కోరినవారు. అతనిలోని గుణ దోషాలను నిర్భయంగా చెప్పగలిగినప్పుడే నిజమైన ‘హితైషి’ అనిపించుకుంటాడని వారి వాదన. కానీ ఇవేవీ గుర్తించని మూర్ఖుడు రావణుడు. అతనిలోని రెండు రూపాలు బుద్ధి, మనస్సు. ఇవి రెండూ భిన్న ధృవాలు, ఇవి ఎప్పటికీ కలవవు. అతని వికృత చేష్టలూ వింత పోకడలూ, విరుద్ధ భావాలూ ఎవరికీ నచ్చవు. సీతమహాగ్ని, ఐదుతలల కాలసర్పమని తెలిసి ఆమెను తీసుకొని వస్తాడు.

మారీచుడు ‘భ్రమర కీటక న్యాయం వలె’ దీపం చుట్టూ తిరిగి తిరిగి రామబాణంలోని వాడిని వేడిని రుచి చూచి ‘రామ’ అన్న అక్షరమే ఎక్కడ చూచినా కన్పించగా,

‘వృక్షీ వృక్షీ హిపశ్యామి చీర కృష్ణాజినాంబరం

గృహీత్వాధనుషం రామః పాశ హస్తమివాంతకం’

– నాకు ప్రకృతిలోని ప్రతి వస్తువులో, ప్రతి వృక్షంలో, ‘ర’ అనే అక్షరం ఎక్కడవిన్నా జింక చర్మం ధరించిన ఆ కోదండరాముడు పాశం చేత పట్టుకొని వస్తున్నట్లు అన్పిస్తుంది. ‘ఓ రావణా! నీలోనాలో వున్న జీవుడంతా రాముడే. ఈ ఐదు మర్రిచెట్ల మధ్య పంచ ప్రాణాలనూ యోగంలో వుంచి, అందులో రాముణ్ణి నిల్పుకొని తపస్సు చేసుకుంటూ -సాధుజీవితం గడుపుతున్న నన్నెందుకు చెనకుతావు? సీత అనే మహాగ్నిని ముట్టుకుంటే నాశనమౌతావు సుమా? నీ క్షేమంకోరి చెప్తున్నాను. సీతను రాముని వద్దకు చేర్చు’ అంటాడు మారీచుడు:

‘అనీయచవనాత్ సీతాం పద్మహీనామివశ్రియమ్

కిమర్ధం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహమ్

యదిమాంప్రతి యుధ్యేరన్ దేవగంధర్వ దానవాః

నైవ సీతాం ప్రదాచ్ఛామి సర్వలోక భయాదపి’

‘దేవ దానవ గంధర్వులు వచ్చి నన్నెదిరించినా లక్ష్మీదేవి లాంటిసీతను రామునికి యివ్వనుగాక యివ్వను.’ ఇదే మొండిపట్టుదల ఆ లంకేశ్వరునిలో వైరభక్తి వరదలా ప్రవహిస్తూ వుంది. రామునికి కోపం తెప్పించవలె. దానికొరకు ఏమైన చేయవలె. అదీగాక రావణునికి తన పరాక్రమంపై అపారమైన నమ్మకం. దాన్ని రామునిముందు ఆవిష్కరించవలె. ఒక విధంగా రావణుడు ధీరోద్ధతుడైన ప్రతినాయకుడు రామాయణ కావ్యంలో.

‘మమ చాపమయీంవీణాంశరకోణైః ప్రవాదితాం

జ్యాశబ్దతుములాం ఘోరా మార్త భీమ మహాస్వనామ్

నారాచతలసన్నాదాంతాం మమాహితవాహినీం

అవగాహ్య మహారంగం నాదయిష్యామ్య హంరణే’

‘నా విల్లే వీణ. నా బాణములా వీణ మెట్లు, మంద్రమధ్యమతారా స్వరాలలో విన్పించే రాగాలు నా బాణాల దెబ్బల వల్ల కల్గిన పిరికివారి ఏడ్పు నాదాలు. శత్రు సైన్యం నా నృత్య రణరంగం. నేనక్కడ నిలబడి నా చాపమనే వీణను మీటితే లోకపాలకులే నన్ను గెలువలేరు. నన్నెదిరించి నిలువలేరు. ముల్లోకాలూ ఏకమై వచ్చినా నేను సీతను రాముని పరంచేయను. ఇది నా ఖచ్చితమైన మాట’

నారాయణుడే రామునిగా వచ్చి రాక్షస సంహారం చేస్తాడంటూ దేవతలన్న మాటలను విన్న కుంభకర్ణుడు నమ్మకంగా చెప్పినా వినడు. ఎవ్వరి మాటా వినక లంకకే చేటుతెచ్చి బంధు నాశనానికీ, రాక్షసజాతి నిర్మూలనకు కారకుడౌతాడు. రావణాసురుడు.

భరతుడు రామునికి విధేయుడైన తమ్మునిలా మెలిగితే, అన్న కొరకేమైనా చేస్తానంటూ, ధర్మప్రసక్తి వచ్చినప్పుడంతా అన్నతో విభేదిస్తూ సీత దూరమై దుఃఖిస్తున్న అన్నను తండ్రిలా ఓదారుస్తూ, బాంధవుడిలో ధైర్యం చెప్పి బాసటగా నిలుస్తాడు లక్ష్మణుడు.

“సీత జగన్మాత మహాలక్ష్మి ఆమె తలుచుకుంటే రావణుని తృటిలో భస్మం చేయగలదు. అయితే లోకం కోసం, ఋషిగణాల క్షేమంకోసం, రాముని కీర్తికోసం, వంశ ప్రతిష్ఠకోసం, అన్ని కష్టాలనూ భరించి, తమ భృత్యులైన రావణ కుంభకర్ణులను

క్షమిస్తూ, అడవిలో, అశోకవనంలో, వాల్మీకి ఆశ్రమంలో వుండి రఘువంశ వంశాంకురాలనందించి తాను మానసికంగా క్షోభపడిన ఆ ఇల్లాలు, చివరకు తాను యెక్కడినించి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవలెనన్న నిశ్చయంతో భూదేవి ఒడిచేరి, ఆ భూమిలోకే వెళ్ళిపోయింది. ఓర్పు ధైర్యం సహనం భార్యాధర్మం స్త్రీకి ఆభరణాలని మానవాళికి నిరూపించింది.

సీతలేదన్న దుఃఖం రామునితో చూచిన వాల్మీకి మహర్షి తర్వాత జరిగిన రాముని జీవితాన్ని ‘ఉత్తరకాండ’లో వివరించి ‘నీ కథనే రాస్తున్నానయ్యా రామా’ అంటాడు. ‘రామకథ’ను లవకుశులు గానం చేస్తూవుంటే తన కథను తానే వింటాడా దశరథరాముడు.

‘హనుమ వంటి భక్తుడు వుండడు’ అనే మాట ఎంత నిజమో రామునివంటి దైవం దొరకడన్నది కూడా అంతే నిజం. అందుకే ఇప్పటికీ పిలిస్తే పలికే దైవం రామచంద్రుడే. ఆయనను మనకు చూపించే ముఖ్య ప్రాణదేవుడా ఆంజనేయస్వామే. రామబాణం, రామనామం, రాముని మాటా ప్రతిఒక్కరికీ ఆదర్శం కావాలి. స్పష్టంగా, సుందరంగా, రమణీయంగా వాల్మీకి మహర్షి ఆవిష్కరించిన రామాయణ కావ్యం యిప్పటి సమాజానికి అవసరమైన ధర్మాలన్నీ అందించే వేదగ్రంధం.

‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూక్తి ప్రకారం రామాయణ కావ్యంలోని ప్రతి పాత్ర యొక్క ఔచిత్యాన్ని ‘ఎపిగ్రామటిక్’ గా రచించిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని శరణాగతి తత్వానికి సంకేతంగా మలచి మనకు అందించి మహోపకారం చేశారు. ఆ ఆదికవి జాతికి అందించిన ఈ అమృత భాండం హైందవ మతాన్ని, మన భారత దేశాన్ని వేల యేండ్లుగా నడిపిస్తున్నది. ఈ భూమి, విశ్వం ఉన్నంత కాలం అది మానవునికి సత్యధర్మ పథాన్ని చూపుతూనే ఉంటుంది.

యావత్ స్థాస్యంతి గిరయః పరితశ్చ మహీతలే

తావత్ రామయణ కథా లోకేషు ప్రచురిష్యతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here