[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మతత్వం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]ర్మలమైన ఆత్మ యొక్క నిజ తత్వాన్ని ఎరుకపరచుకుంటే జీవితంలో మానవాళికి కోరికలు అనేవి అసలు కలగవు. ఆత్మతత్వం అనేది జీవుడు ఒక శరీరంలో ప్రవేశించాక అరిషడ్వర్గాల ప్రభావంతో మరగున పడిపోవడం ప్రారంభమై, పవిత్రమైన ఆత్మ తనను శరీరంతో సరిపోల్చుకుంటుంది, ఈ మలభూయిష్టమైన శరీరమే తాననుకుంటుంది. తాను ఈ భువిపైకి వచ్చిన ఉద్దేశం, లక్ష్యం మరిచిపోయి, కోరిక మూటతో స్వార్థంగా మారుతుంది, అహంకారం మొదలవుతుంది. దుర్గంధ పూరితమైన ఈ అహంకారాన్ని కడిగివేసుకొని ఆత్మను నిర్మలం చేసుకుంటే ఆత్మసాక్షాత్కారం ప్రాప్తమవుతుంది. అప్పుడు సాధకులు శాశ్వతమైన బ్రహ్మానందభూతిని అనుభవిస్తూ మనస్సుకూ, బుద్ధికి అతీతమైన చైత్రన్య స్థాయికి చేరుకుంటారు. ఈ చైతన్యమే భగవంతుడు. ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ప్రాణాధారమైన చైతన్యమే భగవంతుడు అన్న అనుభవాన్ని ప్రాప్తం చేసుకుంటే అప్పుడు సాధకులకు తానే ఆత్మతత్వమని, అహం బ్రహాస్మి అనే వేదోక్తిని అనుభవం లోకి వస్తుంది. అప్పుడు ఆ సృష్టి అంతటా నిండి వున్న దివ్యత్వం గోచరమవుతుంది. సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ జీవ సమానత్వం అంటే తెలుస్తుంది. మనలో నిండి వున్న ఆ దివ్య చైత్యన్యాన్ని కప్పి వుంచే ముసుగే మనస్సు. ఆ కఠోర సాధనతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆ ముసుగును తొలగించుకుంటే మన నిజతత్వం వెల్లడవుతుంది. అందుకే శాస్త్రం అహంకార రాహిత్యాన్ని మొదట అలవరచుకోమని హితవు చెబుతోంది. అహంకార రాహిత్యం ద్వారానే ఆత్మతత్వం గ్రహింపుకు వస్తుంది. దేవీ! నిజంగా మేము ఉదాసీనులము. మేము స్త్రీ – సంతాన- ధనములకు, వశులము కాము. మేము నిష్క్రియులం. దేహ, గృహాది సంబంధ రహితులం. దీపశిఖ వలె సాక్షిమాత్రులము. మేము మా ఆత్మ యొక్క సాక్షాత్కరము చేతనే పూర్ణ కాములమై- కృతకృత్యులమై యున్నాము” అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో తన ఆత్మతత్వమును అపూర్వంగా వెల్లడించాడు. ఆత్మతత్వం తెలిసిన వాళ్లు ఎవరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతే కాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్లను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత ‘నేను’, ‘నాది’ అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశం మనకు అనేక ఉపనిషత్తుల ద్వారా లభిస్తోంది కదా. ఈ త్యాగ మార్గాన్ని అనుసరిస్తే కోరికలనే మలినాలు హృదయం నుండి తొలగింపబడి ఆత్మతత్వం అనుభవవైదేక్యమవుతుంది. ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే). ఇలా అంతా బ్రహ్మమయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నం చెయ్యాలని ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. ఆత్మతత్వం గ్రహింపుకు రావాలంటే పైన సూచించబడిన విధంగా సాధన చేయాలి.