పూచే పూల లోన-47

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జ్యోతిని కార్వాల్లో హాల్లో ఏర్పాటు చేసిన బసలోకి మారుస్తారు. చాలా ఖర్చుపెట్టారని సుందర్ అంటే, అవసరం తనదని కార్వాల్లో అంటాడు. జ్యోతి, చిత్ర లోపల ఉంటే, కార్వాల్లో, సుందర్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి గవడే వచ్చి – తనకి ముందు చెప్తే, అన్నీ ఏర్పాట్లు తానే చేసేవాడినని అంటాడు. జ్యోతి ఎలా ఉందిని అడుగుతాడు. ఈ సమస్యలు ఒక్కరోజులో తీరిపోయేవి కావని, ఇంకో నెల పట్టవచ్చని అంటాడు సుందర్. మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. జ్యోతిని ఇక్కడ ఉంచడం ఆయనకిష్టం లేదని, కేసులో ఇకపై మజా వస్తుందని అంటాడు కార్వాల్లో. కాసేపు కోర్టు కేసు గురించి మాట్లాడుకుంటారు. జో ని కలిసేందుకు జైలుకి వెళ్తాడు సుందర్. గంటకి పైగా కూర్చోబెట్టి, అప్పుడు లోపలికి పంపుతాడు సూపరింటెండెంట్. మొబైల్ తీసేసుకుంటారు. సుందర్ ఐడి కార్డు తీసుకుని వివరాలు రిజిస్టర్‍లో రాసుకుంటారు. జో ఉన్న గదికి తీసుకువెళ్తుంటే, అక్కడంతా చీకటిగా ఉంటుంది. అది ఒకప్పుడు కోట అనీ, తరువాత పోర్చుగీసు వారు జైలుగా మార్చారని కానిస్టేబుల్ చెప్తాడు. కొన్ని గదులు దాటాకా, బాగా చీకటిగా ఉన్న ఒక గది ముందు ఆపి, ఒక కొవ్వొత్తి వెలిగించి, ఆ కొవ్వొత్తి వెలుగుతున్నంత వరకే మాట్లాడాలని చెప్తాడు కానిస్టేబుల్. జో ని పలకరించి, వివరాలు అడుగుతాడు సుందర్. తానేమైనా సాయం చేయగలనా అని సుందర్ అడిగితే, చక్రం తిప్పమని చెప్తాడు జో. – ఇక చదవండి.]

[dropcap]ప[/dropcap]రిస్థితి గంభీరమవుతోంది. సమీర్ విషయంలో నన్ను కూడా ఇంటరాగేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కావటం లేదు. పోలీసు వాళ్లకి అందరి మీదా కన్నున్నట్లు సృష్టంగా ఉంది.

జాయ్‍సీ తాలూకా అన్నాడు జో. నేరుగా సాయాజీ గారి తాలుకాకి వెళితే? కార్వాల్లో జ్యోతికి ఆశ్రయం ఇచ్చాడు. కృష్ణప్రసాద్ గారిని మూన్ ఫ్లవర్ గురించి సంప్రదించాలి. ఆయన ఏం కథలు వినిపిస్తాడో తెలియదు. భూమి మీదకి వచ్చిన ప్రతి దానికీ వినిపించే ధర్మం ఒకటి ఉంది. ప్రతి అణువుకి ఒక అద్భుతమైన సరళి, ఒక డిసైన్, ఒక వ్యవస్థ, ప్రక్రియ ఉన్నాయి. ప్రతి పువ్వుకీ, మొక్కకీ దాని గురించి దానికి తెలిసినంత మనిషికి మనిషి గురించి తక్కువ తెలుసనిపించింది.

బెల్ మ్రోగింది. రోజులు బాలేవు. ఏ పోలీసో లేక ఎవరి తాలుకో. ఏ వేట కోసమో ఎవరో బయలుదేరి ఉంటారు. కొద్ది సేపు ఆగాను.

“యస్?”, గట్టిగా అన్నాను. బెల్ మరల మ్రోగింది.  సమాధానం. చెప్పకుండా ఇలా మరల మ్రోగించారంటే తెలిసిన వారు కారు. మెల్లగా లేచి తలుపు తీసాను. చేతిలో చిత్రమైన సంచీ పట్టుకొని చిత్ర నిలబడి ఉంది.

“ఏంటి అలా చూస్తున్నారు?”

నిజమే. జుట్టంతా విరబూసుకునుంది. తనే తిరిగి అడిగింది.

“యస్ అంటే? మూసుకున్న తలుపు తెరుచుకుంటుందా?”

“అది కాదు. ఎవరో చెబుతారని.”

లోపలికి వచ్చింది. ఆ సంచీ టీపాయ్ మీద పెట్టింది. కూర్చుని అందులోంచి స్వీట్స్ తీసింది.

“ఏంటిది?”

“దీనిని ‘కుందా’ అంటారు.”

“పేరు సరే. పుట్టినరోజా?”

“కాదు. జుట్టు విరబూసుకుంటే పుట్టినరోజా?”

“మరి? జ్యోతి ఏమైనా పూనిందా?”

“నో. తప్పు. ఆ పిల్లని అలా అనటానికి లేదు. నా డాక్యుమెంటరీకి మరింత ఆదరణ పెరిగింది.”

“ఎలా?”

“జ్యోతి ఇచ్చిన లీడ్ నుంచి కుశావతీ రివర్ బెడ్ దాటి బాగా అడివిలో సంగ్రహించిన ఒక భూగర్భ చిత్రం మీద పరిశోధన జరుగుతోంది.”

“ఓ అందుకా ఈ స్వీట్?”

“తీస్కోండి. షుగరా?”

“లేదు.” తీసుకుని ఆమె ఇచ్చిన చిత్రాన్ని విప్పాను.

“ఏంటి ఇందులో విశేషం?”

“కదంబ రాజుల కాలంలో ఒక అణ్వాయుధపు వివరాలు ఆర్కాలజీ వారికి దొరికాయి ట..”

“ఓకే.”

“అది పంచశబ్ద ఉపాసనకు చెందినదన్న సంగతి ఇక్కడ గవడే వివరిస్తున్నారు.”

“గవడే గారికి నీ పని తెలుసా?”

“పూర్తిగా తెలుసు.”

“ఈ మనిషి ఎందుకు మితభాషిలా, ఏమీ తెలియని వాడిలా ఎందుకుంటాడు? ఎందుకు త్వరగా బయటపడడు?”

“భూగర్భం వాళ్ళు కదా? గంభీరంగా ఉంటారు. పైగా ఈ రంగం కొద్దిగా అలా ప్రవర్తించే వారినే ఆదరిస్తుంది. తొందరపడి ఏదో మాట్లాడితే అది తప్పవ్వచ్చు. అందుకే అందరూ మాట్లాడాలని చూస్తారు.”

“కరెక్ట్. నువ్వు తెలివిగలదానివి.”

“చాలా.”

నవ్వాను.

“కాదా?”

“నిజాలు చెబుతాను. ఇంతకీ జ్యోతి ఎలా ఉంది?”

“జ్యోతి మామూలు నడవడి లోకి వస్తోంది. కానీ నాదో అనుమానం.”

“ఏంటి?”

“ఈ అమ్మాయిలో వేరే ఎవరో దాగి ఉండి అప్పుడప్పుడు ఇవతలకి వస్తున్నారా అనిపిస్తుంది.”

“ఎందుకలా అనిపించింది?”

“మొన్న నా ప్రాణాలు పోయినంత పనయింది. రాత్రి ఏ పదకొండో అయింది. కిటికీ బయట రోడ్డు మీద ఎవరూ లేరు. నేను షూట్ చేయవలసిన వర్కింగ్ స్క్రిప్ట్ వ్రాసుకుంటున్నాను. ఏదో అలికిడి వినిపించి అటు తిరిగాను. జ్యోతి ప్రక్కన నిలబడి ఉంది. నోటిమీద వేలు పెట్టి ‘ష్’ అంది. అలవాటుగా ‘పడుకో’ అన్నా. నీ బొంద నీకేం తెలుసు అన్నట్లు చిరునవ్వు నవ్వింది. వేసి ఉన్న తలుపు అంచు వైపు వేలు చూపించింది. జాగ్రత్తగా చూసాను. ఎవరో నిలబడి ఉన్నట్లు అర్థమై గుండె మీద చేయి పెట్టుకున్నాను.”

“మరి ఏం చేసావు?”

“ధైర్యం తెచ్చుకుని జ్యోతిని బెడ్ మీద కూర్చోపెట్టాను. చప్పుడు చెయ్యకుండా నేను అదే బెడ్ మీద కూర్చుని కొద్దిసేపు గమనించాను. అక్కడి నుండీ ఏదీ స్పష్టంగా తెలియటం లేదు. లైట్లు తీసేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. మెల్లగా లేచి లైట్ తీసాను. ఏ అలికిడీ లేదు.”

“తలుపు క్రింద ఏమీ కనిపించ లేదా?”

“లేదు. కానీ ఎవరో ఏదైనా వినిపిస్తుందేమోనని ప్రయత్నం చేసినట్లు అనిపించింది.”

“ఎవరై ఉంటారు?”

“నాకు ఆ విషయం ప్రధానమైనది కాదు.”

“మరి?”

“పడుకున్న జ్యోతికి ఎలా కనిపించింది?”

ఇది సరైన పాయింట్. ఈ అమ్మాయికి రెండు తలలున్నట్లు అనిపిస్తుంది. ఒకటి లోపల, ఒకటి బయట ఎక్కడైనా సంచరించేది.

“మరి జ్యోతి పడుకుందా? ఇలాంటప్పుడు పడుకోదే?’

“లేదు. ఏదో అక్కడ పడి ఉన్న నవల ఓ రెండు పేజీలు చదివి పడుకుంది.”

“నీకు నిద్ర పట్టి ఉండదు.”

“మీకు కాల్ చేద్దామనుకున్నాను. మానుకుని కొద్ది సేపు మొబైల్‍లో అవీ ఇవీ చూసి ఆలోచించాను.”

“ఏం చూస్తావు మొబైల్‌లో?”

“మీకు పూర్తిగా అవవసరం.”

“ఊఁ. తరువాత నిద్ర పట్టిందా?”

“లేదు. జ్యోతి నిద్రపోయిందని నిర్ధారించుకుని మెల్లగా లేచి తలుపు దాకా వెళ్ళాను.”

“గుడ్. ధైర్యం ఎక్కువ పాళ్ళు. చెప్పు.. ఆసక్తి పెరుగుతోంది.”

“అక్కడ ఉన్న డోర్ మాట్ మీద నిలబడి చెవి తలుపుకి ఆన్చాను.”

“ఎందుకలాగా?”

“అవతల ప్రక్క నిజంగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ సందునే గమనిస్తారు కదా?”

“ఇంటెలిజెంట్ వుమన్.”

“నో. టూ ఇంటెలిజెంట్ గర్ల్.”

“పిల్లా, తరువాత ఏమైంది?”

“ఎవరూ లేరనిపించింది.”

“ఎక్కువగా చూసే పిల్లో కుక్కో ఉన్నదా?”

“నో. తలుపు గడీ తెరిచాను.”

“శభాష్.”

“మెల్లగా ఒక రెక్క తోసాను. ఎవరూ లేరు. ఎడమ వైపు, కుడి వైపు చూసాను. అలా మెల్లగా హాల్లోకి వచ్చాను. అక్కడ ఆ పాత సోపాలో కొద్ది సేపు కూర్చున్నాను.”

“ఈ సోఫాల మీద ప్రేమ పాడుగానూ. ఇక్కడ కొచ్చినా సోఫాలోనే కూర్చుంటావు.”

“మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.”

“అన్నీ తెలియనివే.”

“ఇదొకటి మళ్ళీనూ.”

“అవును. ఒక తాత్త్వికవేత్త మంచి మాట అనేసాడు.”

“ఏమన్నాడేంటి?”

“జీవించే కళ ఏమీ తెలుసుకోక పోవటం.”

“ఎందుకలాగా? ఈసారి నేనడుగుతున్నాను.”

“తెలుసుకోవటం అనే ప్రక్రియ స్వరూపం వైపు లాగుతుంది. నాకు తెలుసుకోవటంతో పని లేదు అనుకున్నప్పుడు మనసు బుద్ధిలో లీనమవుతుంది. ఆ తత్వం అనంతం వైపు అల్లుకొని పోతుంది. అప్పుడు విషయం తనంతటతే అవగతం అవుతుంది.”

ఫోన్ మ్రోగింది. కిరణ్ నంబరు.

“హలో.”

“సార్, ఎలా ఉన్నారు?”

“బాగున్నాను.”

“నేను వస్తున్నాను. లోకేషన్ పెడతారా?”

“ఎప్పుడు?”

“వాస్కో నుంచి కాబ్‌లో వస్తున్నాను.”

“సరే.”

చిత్ర స్వీట్ పాకెట్ టేబుల్ మీద పెట్టింది.

“సోఫాలో ఎందుకు కూర్చున్నానో తెలుసా?”

“అవును. ఎందుకు?”

“అక్కడ ఎవరైనా కూర్చుని లేస్తే తెలిసిపోతుంది.”

“ఎలాగ?”

“నిన్ననే తెలుసుకున్నాను. అక్కడ కూర్చుని లోపలికి వచ్చాక జ్యోతి వెంటనే లేచి కూర్చుంది.”

“ఓ.”

“మాధవ్‍ను కలిసావు కదూ? అని అడిగింది.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here