వ్యామోహం-23

0
3

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మర్నాడు రాత్రి పిల్లలు నిద్రపోయాకా, మనమీ ఊరు వదిలేద్దామని, సత్తుపళ్లి లేదా అశ్వారావుపేటలో ప్రాక్టీసుపెట్టుకుందామని భర్తతో అంటుంది డాక్టరమ్మ. అధైర్యపడవలసిందేమీ లేదని డాక్టర్సాబ్ అంటే, ఇక్కడికొచ్చిన వీరలక్ష్మి వల్ల గొడవలు తప్పడం లేదనీ, ఏదో అదృష్టం కొద్దీ ప్రాణాపాయం తప్పిందనీ అంటుంది. కాసేపు చర్చ అయ్యాకా, ఈ రెండు ఊర్లు వద్దని, ఖమ్మం అయితే మేలేమోననీ, ఆలోచిద్దామని అంటాడు డాక్టర్సాబ్. నాలుగు రోజులయ్యాకా, డాక్టర్సాబ్ – డాక్టర్ ఎమినిని ఇంటికి అతిథిగా తీసుకువస్తాడు. ఆయన మందులకుంటలో వైద్యుడు. పలకరింపులయ్యాకా, తాను మందులకుంటలో ఆసుపత్రి మూసేశాననీ, కుటుంబమంతా హైదరాబాదుకు వెళ్ళిపోతున్నామని చెప్తాడు డా. ఎమిని. ముందు కాఫీ ఇచ్చి, వంటకి సిద్ధం చేస్తూ, తాము కూడా హైదరబాద్ వచ్చేస్తే అక్కడ అవకాశాలు ఎలా ఉంటాయని అడుగుతుంది డాక్టరమ్మ ఆయనను. పిల్లల భవిష్యత్తుకు ఖచ్చితంగా హైదరాబాద్ లోనే మంచి అవకాశాలుంటాయని, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో మీ వాళ్ళు చాలామందే ఉన్నారనీ, మంచి సెంటర్ చూసి కార్డు రాస్తాను, మీరు వచ్చేయండి అని చెప్తాడు డా. ఎమిని. భోంచేసి వీడ్కోలు తీసుకుంటాడాయన. మరో నాలుగు రోజుల్లో ఆసుపత్రి ఖాళీ చేసేస్తారనగా వీరలక్ష్మి వచ్చి – ఆ రోజు డాక్టర్సాబ్‍ని పొరపాటున కొట్టలేదనీ, బాల్రెడ్డే మనుషులని పెట్టి కొట్టించినట్టు తనకు తన బంధువు మల్లిగాడు చెప్పాడని అంటుంది. ఆమె దుఃఖం తగ్గేవరకూ ఆగి, ఈ విషయం నీకు మల్లిగాడెప్పుడు చెప్పాడని అడుగుతాడు డాక్టర్సబ్. మూడు రోజుల క్రితం అంటుంది వీరలక్ష్మి. అప్పుడు అసలు విషయం ఆమెకి అర్థమయ్యేలా వివరిస్తాడు డాక్టర్సాబ్. బాల్రెడ్డి పటేల్ పంపిస్తేనే మల్లిగాడొచ్చి ఆ విషయం చెప్పి ఉంటాడనీ, బాల్రెడ్డికి వీరలక్ష్మి మీద ప్రేమ తగ్గలేదనీ, ఆయనతోనే ఉంటే వీరలక్ష్మికి క్షేమమని చెప్పి పంపేస్తాడు. తర్వాత డాక్టర్సాబ్ కుటుంబం దిల్‌‍సుఖ్‌నగర్‍కి మారిపోతుంది. ఇక చదవండి.]

[dropcap]శు[/dropcap]క్రవారం ఉదయం పదకొండు గంటలవుతోంది. సామాను పెద్దగా లేకపోయినా ఊరు మారుతున్నప్పుడు సర్దుకోకతప్పదు కదా! రమాలక్ష్మిని నిద్రపుచ్చి, పెద్దవాళ్ళు ముగ్గుర్నీ ముందుగదిలో ఆడుకోమని చెప్పింది డాక్టరమ్మ. లోపల తన పనిలో తాను మునిగిపోయింది. వీధి తలుపు తీసే వుంది.

“చిన్నమ్మను గుర్తుపట్టినవా బాబూ!” అంటూ గొంతు వినిపించింది వీధి గదిలో. “అమ్మా! అమ్మా!” అంటూ కొత్త మనిషిని చూసి భయపడి లోపలికి పరుగెత్తు కొచ్చారు ముగ్గురూను.

ఆతృతతో ముందు గదిలో కొచ్చింది డాక్టరమ్మ. “దండాలమ్మా!” అంటూ ఎదురుగా వీరలక్ష్మి.

ఎందుకొచ్చావన్నట్లుగా చూచింది డాక్టరమ్మ.

“ఒక్కసారి చూసిపోదామని వచ్చిన్నమ్మా!”

“చేసిన నష్టం చాల్లేదా!” డాక్టరమ్మ గొంతులో కోపం స్పష్టంగా వినిపించింది.

“అమ్మా! తప్పు చేసిన. చాన పెద్ద తప్పు చేసిన. మీ కష్టాలన్నింటికి కారణం నేనె. ఒక్కసారి మీకు చెప్పుకోని మొక్కి పోదామని వచ్చిన” వీరలక్ష్మి గొంతులో పశ్చాత్తాపం తొంగి చూసింది.

“ఏమేం కష్టాలనుభవించామో మాకు తెలుసు. నువు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఐనా ఇక్కడ నీకేం పని. నీ పనంతా డాక్టర్సాబుతోటే కద, ఆయన దవాఖానాలోనే వున్నారు. అక్కడికే వెళ్ళు.” కోపమింకా తారాస్థాయిలోనే వుంది డాక్టరమ్మకు.

“నేను డాక్సర్సాబు కొఱకు రాలేదమ్మ. మీ కొఱకె వచ్చిన.”

“డాక్టర్సాబు పంపించారా!”

“ఎంత మాటమ్మ, నేనిక్కడికిచ్చిన సంగతి అయ్యకు తెలువదు.”

“మరెందుకొచ్చినట్టు.”

“అమ్మా! మీరు ప్రసూతికచ్చినప్పుడు జరుగరాంది జరిగింది. నాదే తప్పు. నాదే పాపం. డాక్సరు దొరను తప్పుపట్టె పనేలేదు. డాక్సర్సాబుకు బాకిలపడ్డ. అది తీరే మార్గం లేదు. అందుకొఱకే అవకాశం దొరికినప్పుడు నన్నునేనిచ్చుకున్న. అటెన్క మనసుపడ్డ.”

“డాక్టర్లకు బాకీపడడం ఏం వుంటుంది. డాక్టర్ల పనే జబ్బులు నయం చెయ్యడం. నయం చేసినందుకు మనం డబ్బులు కూడ చెల్లిస్తాం. ప్రభుత్వాసుపత్రిలో రోగులు డబ్బులు చెల్లించరు. రోగికి బదులుగా ప్రభుత్వమే డాక్టర్లకు జీతాలను చెల్లిస్తుంది. ప్రైవేటు డాక్టర్లు కూడ అడపాదడపా పేదల దగ్గర ఫీజు తీసుకోరు. అంతమాత్రాన ఉచిత వైద్యం పొందిన వారంతా డాక్టర్లకు ఋణపడ్డామనుకొంటే ఎలా? ఒక్కో డాక్టరుకు ఎంతెంతమంది పెళ్ళాలుండాలి? ఉంపుడు గత్తెలుండాలి చెప్పు” చెప్పుతో కొట్టినంత పనిచేసింది డాక్టరమ్మ.

నిల్చునే ఓపిక లేక కూలబడిపోయింది వీరలక్ష్మి. “అమ్మా! మేం చిన్నకులపోల్లం. చదువుకోలే. అంత ఆలోచించే శక్తి కూడ నాకు లేదు. అంతకు ముందు పైసలు మస్తుగ ఖర్చయినయి. మందులు గూడ మస్తుగ మింగిన. నయాపైసంత గూడ తక్కువకాలె. రూపాయ తీసుకోకుంట నాకు తక్కువ చేసిండు. నాకీ రోగమంటిచ్చినోనికి తక్కువ చేసిండు. ఆయన పెండ్లాం వనజమ్మ దొర్సానికి నయం జేసిండు. ఆమె నా కంటె ముందె సచ్చిపొయ్యేద్దుండే. ఇవన్ని నా ఎర్కల ఉన్నయి. కాబట్టి డాక్సర్సాబు నాకు దేవుడు, నువు డాక్సరమ్మవు దేవతవు. నన్ను నేను నా దేవునికిచ్చుకుంటున్న అనుకున్న గని ఇంత నష్టమైతదని, మీకిన్ని కష్టాలస్తయని అనుకోలే బాంచెను” అంటూ డాక్టరమ్మకు సాష్టాంగపడిపోయింది.

డాక్టరమ్మకు కోపం తగ్గింది. “లే వీరలక్ష్మీ లే!” అంది. వీరలక్ష్మి డాక్టరమ్మ పాదాలను వదలలేదు. లేవలేదు. తనే భుజాలు పట్టుకొని లేపింది. మొహంలో మొహం పెట్టి చూసింది. వీరలక్ష్మి డాక్టరమ్మ భుజమ్మీద తలనాన్చి ఒక్కసారి భోరుమంది.

డాక్టరమ్మకేం చేయాలో తోచలేదు. వీరలక్ష్మి కన్నీటితో డాక్టరమ్మ జాకెట్టు తడిసిపోయింది. కొద్ది సేపటికి కుదుటపడ్డది. దూరం జరిగింది. “తప్పైందమ్మ!” అని డాక్టరమ్మ పాదాలనంటుకొని మళ్ళీ దూరంగా నిల్చుంది.

“నిజంగా ఇంత బాధపడే దానివైతే – ఇక్కడికి వరంగల్లు కొచ్చి మమ్మల్నెందుకు ఇబ్బంది పెడ్తావు చెప్పు” అడిగింది డాక్టరమ్మ.

“అమ్మా! నాకు వరంగల్ వచ్చే ఆలోచననె లేదు. మూడునెల్లు ఒక్క రోజు సుత నాగా పెట్టకుంట, ఈడ కొట్టచ్చు, ఆడ కొట్టగూడది, ఈ నమూనా కొట్టొచ్చు, ఈ నమూన కొట్టగూడది అన్నది లేకుంట కొట్టిండమ్మ. ఇది మొండి పానమయ్యెపటికె బతికున్న. దానికి నాకేం బాధలేదు. పటేలు కన్ను జింక మీన పడ్డది. మీరెల్లచ్చినకాన్నించి నాకు జింక మీదనె ధ్యాస. జింకకు మొక్కుత. మీకు మొక్కినట్టుంటది. జింకతోని మాట్లాడ రాముతోని ముచ్చట బెట్టినట్టనిపిస్తది. మీ తమ్ముడచ్చి ఫోటువల్దీసింది యాదికస్తది. ఇది గమనించిండు.

నా కండ్లెదురుంగ జింకను కోపిచ్చిండు. చూడలేక కండ్లు మూసుకుంటే చుట్ట నిప్పుతోని కాల్చిండు. కూర నాతోని వండిపిచ్చిండు. తాసీల్దార్లకు దావతిచ్చుకున్నడు. రాత్రి నా ఇంటికి మాంసం దెచ్చిండు. నన్ను తినుమన్నడు. నాతోని కాదన్న. ఎడమ చేత్తోని తొడపాశం పెట్టిండు. నొప్పి కోర్వజాలక మొత్తుకున్న. తెరిచిన నోట్లే మాంసం ముక్కపెట్టిండు. కింది దవుడను మీదికొత్తిండు. మింగెదంక ఇడువలే. వారం రోజులు జరమచ్చింది. కూసుంటె జింక, నిలబడితె జింక, కండ్లు మూస్తె జింక, తెరుస్తె జింక. ఆడ ఉండజాల్నని ఈడికచ్చిన.

తమ్ముని దగ్గర్నె ఉన్న. కని మరదలు ఒప్పలె. వేరె ఠికాన చూపెట్టిండు తమ్ముడు. అగో అక్కడ ఆ ఇంటికాడ డాక్సర్సాబు నాక్కనపడుడుతోని ఇంట్లకు రమ్మన్న. అదొచ్చింది లొల్లి” కథ మొత్తం ఏకరువు పెట్టింది వీరలక్ష్మి.

“ఇప్పుడింతకీ ఏమంటావు?” అడిగింది డాక్టరమ్మ.

“అనేద్దేం లేదమ్మ! మిమ్ములను చూసిపోదామని వచ్చిన. హైదరాబాదు పోతాన్రటకద. నేను కూడ జోడెడ్లపాలెం పోదామని సోచాయిస్తున్న. దేవున్దయ. హనుమకొండల పుట్టిన బుజ్జిని చూడలే కద! ఒకసారి చూసిపోదామని. ఈ పానముండంగ మల్ల మిమ్ముల చూడ తిప్పలుబెట్ట” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే చెప్పింది వీరలక్ష్మి.

ఈలోగా రమాలక్ష్మి నిద్రలేచింది. పాలిచ్చి వీరలక్ష్మి కందించింది డాక్టరమ్మ. ఒళ్ళో పడుకోబెట్టుకొని లాలించి ముద్దాడింది. చేతిలో పది రూపాయల కాగితం పెట్టింది.

“అదేంటి వీరలక్ష్మీ! వద్దు!” అభ్యంతరం చెప్పింది డాక్టరమ్మ.

“ఈ చిన్నమ్మ చిన్న కానుకను వద్దనకమ్మా!”అభ్యర్థించింది వీరలక్ష్మి.

ఐనా ఆ నోటును తిరిగిచ్చేద్దామని ప్రయత్నించింది డాక్టరమ్మ. రమాలక్ష్మి కాగితాన్ని గట్టిగా పట్టుకోవడంతో అది సాధ్యం కాలేదు.

“చూసినవా అమ్మా! బుజ్జమ్మకు ఈ చిన్నమ్మంటే ఇష్టమే!” చిన్న పిల్ల మాదిరి చప్పట్లు కొడ్తూ నవ్వింది వీరలక్ష్మి.

“అన్నం తిని వెళ్ళు” అంది డాక్టరమ్మ.

“ఇప్పుడెందుకమ్మా!”

“ఎదిరిస్తున్నావా!” కళ్ళెర్ర చేసింది డాక్టరమ్మ.

“ఎంతమాట, తింటనమ్మ!” కూర్చొంది వీరలక్ష్మి.

భోం చేసి విస్తరి పారేసి వచ్చి చెప్పింది వీరలక్ష్మి. “కమ్మగ వండుతవమ్మ. ఎన్ని నెలలయిందమ్మ నీ చేతి వంట తిని. జోడెడ్లపాలెంల మస్తు సార్లు పెట్టినవు. “

“అన్నం పెట్టింది కూడ లెక్కపెట్టుకోవాలా వీరలక్ష్మీ!”

“లెక్క కాదమ్మ! నీ ఆప్యాయత యాదికస్తది” చెప్పింది వీరలక్ష్మి.

బయల్దేరబోతున్న వీరలక్ష్మికి బొట్టుపెట్టి చేతిలో చీర, రవికల గుడ్డ రెండరటిపండ్లను పెట్టింది.

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వీరలక్ష్మికి. “ఏందమ్మ ఇది”

“నా బిడ్డకు చిన్నమ్మ నన్నవు కద!”

మారుమాట్లాడకుండా డాక్టరమ్మ పాదాలకు నమస్కరించి బయల్దేరింది వీరలక్ష్మి.

ఆ మరునాడు అంటే శనివారం వకీలు నరసింహారావు దంపతులు డాక్టరు గారి కుటుంబాన్ని భోజనానికి పిలచి ఇంటిల్లిపాదికి బట్టలు పెట్టారు. ఆదివారం తెల్లవారగట్ల హనుమకొండకు వీడ్కోలు పలికారా దంపతులు.

***

కాలచక్రంలో పదిహేనేళ్ళ కాలం గిర్రున తిరిగిపోయింది. డాక్టరు గారు దిల్‍సుఖ్‌నగర్‍లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇంటిముందు విశాలమైన వాకిలి, కారు షెడ్డూను. రాము ఎం.బి.బి.యస్. పూర్తి చేసి యం.డి. కూడా చదివాడు. రేపోమాపో ఫైనల్ రిజల్టు రానున్నాయి.

ఆ రాత్రి పన్నెండున్నర వరకు డాక్టరు గారు ఏదో కేసు గురించి చదువుకుని ఒంటి గంట ప్రాంతంలో పడుకున్నారు. మర్నాడుదయం లేవలేదు. “కాఫీ పెట్టాను లేచి ముఖం కడుక్కుని రండి” అంటూ పడుకున్న డాక్టరు గార్ని పట్టి కుదిపింది డాక్టరమ్మ. ఏదో తేడాగా అనిపించింది. “రామూ!” దిక్కులు పిక్కటిల్లిపోయేలా అరచింది.

పక్కగదిలోంచి రాము పరుగెత్తుకొచ్చాడు. రాము ఏంటి, ఆవిడ కేకతో నిద్దట్లో ఉన్న సోమూ, రాజా, బాలాజి, రమాలక్ష్మి అందరూ ఉలిక్కిపడి లేచి పరుగెత్తుకొచ్చారు. డాక్టరుగారి నాడిని చూసిన రాము నివ్వెరపడి పూడుకుపోయిన గొంతుతో “నాన్న లేరమ్మా!” అన్నాడు. అందరూ గొల్లుమన్నారు.

కావలసిన వారందరకూ సమాచారాలు వెళ్ళాయి. రాగలిగిన వాళ్ళంతా వచ్చారు. తండోపతండాలుగా వస్తున్న డాక్టరు గారి పేషెంట్ల దర్శనార్థం డాక్టరు గారి భౌతికకాయాన్ని ఇంటిముందర వాకిట్లో షామియానా వేసి ఎత్తుబల్ల మీద పడుకోబెట్టారు. డాక్టరమ్మ రోదనకంతం లేదు. ఏ జబ్బూ లేకుండగా అకస్మాత్తుగా నిద్రలోనే పడుకున్న మనిషి పడుకున్నట్టుగా పోవడం అందరి హృదయాలనూ కలచివేసింది.

ఎందరో వస్తున్నారు, చూస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళుతున్నారు.

ఒకాయన ఇంచుమించు డాక్టరు గారి వయసువాడే. ఓ అయిదారేండ్లు పెద్ద కూడ అయివుండవచ్చు. ధోవతి, కమీజు ధరించి వున్నాడు. పైన తలపాగా కూడ ఉంది. వచ్చాడు. డాక్టరు గారి చుట్టూ తిరిగి పాదాలకు నమస్కరించాడు. అక్కడ ఉన్న పూవులను డాక్టరు గారి పాదాల మీద ఉంచి మరల నమస్కరించాడు.

పక్కనే కుర్చీలో కూర్చున్నది డాక్టరమ్మ. బిగ్గరగా రోదించే ఓపిక లేదామెకు. కన్నీళ్ళు కూడ అయిపోయినయి. కళ్ళు పొడిబారినయి. కన్నీళ్ళు ఆవిడ చెంపల మీదుగా చారికలు కట్టినయి.

ఆ వ్యక్తి డాక్టరమ్మకు దగ్గరగా వచ్చి నమస్కరించాడు. చాలామంది అలా నమస్కరించి వెళుతున్నారు. అన్యమనస్కంగానే ప్రతి నమస్కారం చేసింది డాక్టరమ్మ.

“అమ్మా! గుర్తు పట్టిన్రా! మాది జోడెడ్లపాలెం” అన్నాడు ఆ వ్యక్తి.

అప్పుడు పరీక్షగా చూసింది డాక్టరమ్మ. “మీరు మీరు.. బాల్రెడ్డి పటేల్ కదా!” అంది గుర్తుకు తెచ్చుకుంటూ,

“అవునమ్మా! నేనే. పదిహేను పదహారేండ్లయింది మిమ్ములను జూసి. మంచిగనె గుర్తు పట్టిండ్రు. రాము ఏడమ్మ!” అడిగాడు.

దూరంగా పనిలో నిమగ్నమై ఉన్న రామును చూపించింది. “ఇప్పుడాయన కూడ డాక్టర్. యం.డి. చదివిండు” చెప్పింది డాక్టరమ్మ. తలపంకించాడు బాల్రెడ్డి.

“వనజక్క బాగున్నదా అన్నా!” మళ్ళీ తనే అడిగింది.

“అందరు బాగనె చెల్లె! డాక్టర్సాబుతోని పనిబడ్డది. ఇన్నేండ్ల సంది ఆయనను చూడలె, కలువలె, మాట్లాడలె. తప్పని సరిగ పోవాలె, కలువాలె అని నెలదినాల నుండి ప్రయత్నం. పట్వారి సాబు దగ్గర పత్తా తీసుకోని ఇట్లచ్చిన. డాక్టర్సాబును చూడగలిగిన మాట్లాడజాల” దుఃఖంతో గొంతు పూడుకుపోయింది బాల్రెడ్డి పటేలుకు.

“ఇవ్వాళ కేసు గురించి చదువుకోవాలి అంటే రాత్రి పదకొండింటికి కాఫీ కూడ పెట్టిచ్చాను. రాత్రి పన్నెండు వరకు చూస్తూనే ఉన్నాను. ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. ఏ రాత్రి పడుకున్నారో తెలీదు ఉదయం ఏడున్నరకు కాఫీ కోసమని నిద్రలేపాను. లేరు.” దుఃఖం తన్నుకొచ్చింది డాక్టరమ్మకు.

“ఊకుండు చెల్లె. మన చేతిల లేదు కద. ఊకుండు.” అంటూ ఓదార్చాడు బాల్ రెడ్డి.

అంతా సిద్ధమైంది. బ్రాహ్మడు కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. మరో అరగంటకు ఏడుకట్ల సవారిపైన డాక్టరుగారి ప్రయాణం మొదలైంది. అప్పటి వరకు నిశ్చేష్టుడై నిలబడి కార్యక్రమాన్ని చూస్తున్న బాల్రెడ్డి జోడెడ్లపాలానికి బయల్దేరాడు.

***

డాక్టరు గారి కార్యక్రమాలన్నీ అయిపోయినయి. అందరూ గుళ్ళో నిద్రచేసి వచ్చారు.

పదిహేనోరోజు ఉదయం పదికావస్తోంది. డాక్టరు గారి పిల్లలైదుగురూ, డాక్టరమ్మ, ఆయన పెద్ద బావమరిది, చిన్న బావమరిది, వాళ్ళ భార్యలు, పిల్లలు, మంగమ్మ గారు అంతా హాలులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కాలింగ్ బెల్ మోగింది. రమాలక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. ఎవరో అపరిచితుడు. “నమస్కారమమ్మా! అమ్మ వున్నారా!” అడిగాడు.

లోనికెళ్ళి తల్లిని పిలుచుకొచ్చింది రమాలక్ష్మి. డాక్టరమ్మ కూడ ఆ ఆగంతుకుడిని గుర్తుపట్టలేదు. “ఎవరు మీరు?” అడిగింది.

“గుర్తు పట్టలేదామ్మ! నేను ఓదేలు. ఈర్లక్ష్మత్తతోని మీ ఇంటికి వస్తుంటి” జ్ఞాపకం చేసే ప్రయత్నం చేశాడు ఆగంతుకుడు.

రెణ్ణిమిషాల తర్వాత – నిక్కరు పైకి లాక్కుంటూ వీరలక్ష్మితో వస్తూండిన కుర్రాడు డాక్టరమ్మ కళ్ళల్లో మెదిలాడు. ఆవిడ పెదాలపైన చిరునవ్వు మెరిసింది. “ఆఁ ఆఁ ఓదేలూ బాగున్నావా! మీ అత్త బాగున్నదా! లోపలికిరా!” ఆహ్వానించింది. ముందుగదిలో ఉన్న సోఫాలో కూర్చోమని సైగ చేస్తూ.

“అంతబాగే నమ్మ. ఈర్లక్ష్మత్త చనిపోయింది. మూణెల్లయితుంది కావచ్చు.” సోఫాలో కూర్చుంటూ డాక్టరమ్మ ప్రశ్నకు సమాధానం చెప్పాడు ఓదేలు.

“అయ్యో! అవునా! ఎలా!” ఓదేలు ఎదురుగా కూర్చుంటూ అడిగింది డాక్టరమ్మ.

“తెలువదమ్మ. ఆమె వరంగల్లుల్నె వుంటుంది కద! మేము ఊల్లెనాయె. పటేలు చెప్తే తెలుసు.”

ఈలోగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది రమాలక్ష్మి. త్రాగాడు ఓదేలు. “అమ్మా! నన్ను పటేలు తోలిచ్చిండు. మీ పెద్ద కొడుకు రామును జోడెడ్లపాలానికి తోలుక రమ్మన్నడు.” వచ్చిన పని చెప్పాడు ఓదేలు.

“ఎందుకట!”

“ఏమొ తెలువదమ్మ. డాక్టర్సాబును తోలుకస్తననే పటేలు వచ్చిండట. అదే రోజు పొద్దుగాల డాక్టర్సాబు కాలం జేసిండట గద. అప్పుడు మీతోని మాట్లాడెదానికి కాలేదట. ‘డాక్టర్సాబు పెద్ద కొడుకు రాము అని వుంటడు. దగ్గరుండి తోల్కరా!’ అని నన్ను పంపిండు.” చెప్పాడు ఓదేలు.

“ఇప్పటి కిప్పుడంటే ఎలా! రా నువ్వు కూడ హాల్లోకి” అంటూ హాల్లోకి తీసుకెళ్ళారు ఓదేలును రమాలక్ష్మి, డాక్టరమ్మాను. ఓదేలును అందరకూ పరిచయం చేశాక ప్రయాణాన్ని గురించిన చర్చ వచ్చింది.

“అమ్మా! ఇన్నేళ్ళ తర్వాత నాన్నను వద్దనుకొన్న ఊరికి, నాన్న లేనప్పుడు వెళ్ళడం సమంజసమా!” అన్నాడు రాము.

“రామూ! మీరందరూ చిన్న పిల్లలు. నా బాధ చాలా పెద్దది. నాన్నగారి కోసమే వచ్చాడు బాల్రెడ్డి పటేలు. అందులో అసత్యమేమీలేదు. కక్షలూ, కార్పణ్యాలూ చల్లారడానికి పదిహేనేళ్ళ కాలం సరిపోతుందనే నేననుకుంటున్నాను. మీ నాన్న సముద్రం వంటివారు. ఎన్నెన్ని తుఫానులొచ్చినా, ఎంత పెద్ద ఉప్పెనలొచ్చినా సముద్రం అల్లకల్లోలంగా ఉండేది కొంత తడవే. సముద్రమెప్పుడూ క్రమశిక్షణకూ, ప్రశాంతతకూ చిహ్నం. మీ నాన్నగారు కూడా! ఆయన వ్యక్తిత్వ ప్రభావాన్నుండి తప్పుకు పోవడం ఎవరికీ సాధ్యం కాని విషయం. కాబట్టి నువ్వు వెళ్లి రావచ్చును” చెప్పింది డాక్టరమ్మ.

“వాడొక్కడూ ఎందుకు నేను కూడా వెళతాను” అన్నాడు సత్యమూర్తి.

“అవును. వెంట నువు వెళితే నాకూ ధైర్యంగా వుంటుంది” అన్నది డాక్టరమ్మ.

“ఎవరెక్కడికెళ్ళినా మేనమామల ఇళ్ళల్లో నిద్రలు చేశాకే” ప్రకటించింది మంగమ్మగారు.

“ఓదేలూ! రాము వస్తాడని పటేలుకు చెప్పు. కాకపోతే ఇప్పుడు నీ వెంట పంపడం కుదరదు. ఎప్పుడు వచ్చేది కార్డు రాస్తామని చెప్పు” చెప్పింది డాక్టరమ్మ.

“అట్లనేనమ్మ. ఇప్పుడు జోడెడ్లపాలెం తాలూకా కేంద్రమయింది. రైల్వే స్టేషను కూడ వచ్చింది. పొద్దటి ప్యాసింజరు ఇప్పుడు సికింద్రాబాదు నుండే బయలెల్తున్నది. మబ్బుల నాలుగింటికెక్కితే పొద్దుగాల పదింటి వరకు జోడెడ్లపాలెంల వుంటరు. కారటు రాస్తే రాయున్రి లేకుంటె లేదుగని ఆ రోజేదొ ఇప్పుడె అనుకుంటే నయం కద. నేను స్టేషనుకస్త” అన్నాడు ఓదేలు.

పావుగంట చర్చ తర్వాత తేది నిర్ణయమైంది. ఈలోగా ఓదేలు టిఫిన్ టీలు కూడ అయిపోయాయి. అందరి దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఓదేలు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here