చిరుజల్లు-116

0
3

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

రక్ష రేక

[dropcap]రో[/dropcap]జా రోజూలాగానే మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తోంది. కానీ మనసులో ఏదో బాధ.

గేటు లోకి అడుగు పెట్టినప్పటి నుంచీ ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అంటున్న స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఎదురొస్తున్నారు. వాళ్ల పలకరింపులో తెలియని వేదన ధ్వనిస్తోంది. వాళ్ల చూపుల్లో ఏదో పోగొట్టుకుంటున్న ఫీలింగ్.

రోజా ఆఫీసు రూంలోకి అడుగు పెట్టింది. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసింది. ఒకసారి ఆ రిజిస్టర్ వంక సాలోచనగా చూసింది. ఇది రిజస్టర్‌లో తను చేసే చివరి సంతకం అన్న విషయం గుర్తుకు రాగానే హృదయం బరువెక్కింది.

స్టాఫ్ రూంలోకి అడుగు పెట్టింది. చెదరని చిరునవ్వుతో అందర్నీ పలకరించింది. అప్పటిదాకా ఏదో చర్చించుకుంటున్న వాళ్లు సంభాషణ ఆపేశారు.

“మీరు మాకో పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టారు” అన్నది కాత్యాయినీ టీచర్.

“నేనా, ప్రాబ్లమ్ తెచ్చిపెట్టానా? ఏమిటిది?” అని ఆశ్చర్యంగా అడిగింది రోజా.

ఈ స్కూలులో రోజాకు ముప్ఫయి ఏళ్ల అనుబంధం ఉంది. కేవలం అనుబంధం అంటే సరిపోదు. తన జీవితాన్ని స్కూలుకు అంకితం చేసిందనే చెప్పాలి.

స్కూలుకు అదనంగా పోస్టులు శాంక్షన్ చేయించటం దగ్గర నుంచీ ఆఫీసులో రిజిస్టర్లు మెయిన్‍టెయిన్ చేయటం దాకా, పిల్లల చేత ప్రార్థనలు చేయించటం దగ్గర నుంచీ, స్కూలు తరఫున పిల్లల్ని పోటీలకు పంపటం దాకా ఆ స్కూలులో ఏ ఈవెంట్ జరిగినా ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. కొన్ని గంటల్లో ఈ స్కూలుతో గల అనుబంధం తరిపోతుంది. రొటీన్ జీవితపు చివరి మెట్టు మీద నిలబడ్డ తను వీళ్ళకు ప్రాబమ్ ఎలా అవుతుంది?

“మిమ్మల్ని వదులుకోవటం స్కూల్లో ఎవరికీ ఇష్టం లేదు. కష్టంగా ఉన్నా తప్పనిసరి గనుక.. మేం మీకు సెండాఫ్ ఇవ్వాల్సి వస్తోంది. హెడ్ మిస్ట్రెస్ తన సొంత ఖర్చుతో సాయంత్రం ఏదైనా హోటల్లో పార్టీ ఇవ్వాలనుకుంటుంది. మీ క్లాస్ స్టూడెంట్స్ ఏదైనా పిక్నిక్ ఏర్పాటు చేయమని అంటున్నారు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఈ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చెయ్యాలి” అన్నది ఝాన్సీ టీచర్.

“మీ మనస్సుల్లో ఆ మాత్రం అభిమానం సంపాదించుకోగలిగాను. అది చాలు” అన్నదామె.

క్లాస్‍కు టైం అయిందని వెళ్లింది.

రోజా సీరియస్‍గా పాఠం చెబుతోందిగానీ, ఎవరూ వినే మూడ్‍లో లేరు.

“మీరు లేని ఈ స్కూల్లో మేం రేపటి నుంచి ఏం నేర్చుకోవాలి? టి.సీ.లు తీసుకుని వెళ్లిపోదామనుకుంటున్నాం టీచర్” అన్నది ఓ స్టూడెంట్.

“మీరు ఎదిగే పిల్లలు, ఇంతలేసి కళ్లతో ప్రపంచాన్ని వింతగా చూస్తున్న మీకు ముందు ముందు ఎంతో మంది గొప్పవాళ్లు కనిపిస్తారు. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకుంటారు. వాళ్లను మించిపోతారు. ఈ పెరుగుదల, ఎదుగుదల మనం పుట్టిన రోజు నుంచి, జీవితపు డైరీని మూసేసే చివరి రోజుదాకా సాగుతూనే ఉంటుంది. కొన్నాళ్లు తరువాత నేనే మీ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది..” అని చెప్పింది.

“ఈ మాత్రం విపులంగా చెప్పి, ధైర్యం నూరిపోసేవాళ్లు ఎవరున్నారు టీచర్?” అన్నారు స్టూడెంట్స్.

స్టూడెంట్స్ నైరాశ్యం మొహాన కప్పుకుని రోజా టీచరుకు వీడ్కోలు ఇచ్చారు. పేరుపేరునా పిల్చి ఆమె దగ్గరకు తీసుకున్నప్పుడు కొందరు ఏడ్చేశారు. ఆమె వాళ్ల కన్నీరు తుడిచింది.

తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఆమెకు నును లేత చేతులతో పుప్పుగుచ్ఛాలు అందించారు. చాక్లెట్లు, బిక్కెట్లు ఇచ్చిన పిల్లలూ ఉన్నారు. వాళ్లందరినీ దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకున్నప్పుడు, హృదయం బరువెక్కి పోయింది.

కొన్ని అనుబంధాలను ఉంచుకోనూ లేము, తెంచుకోనూ లేము. అలాంటప్పుడు శాశ్వతంగా విడిపోవటం బాధ కలిగిస్తుంది.

రాత్రికి టీచర్లు అందరూ ఆమెకు హోటల్లో డిన్నరు ఇచ్చారు. అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.

“రోజా నాకు బాగా తెల్సు. ఆమె టీచరు ఉద్యోగాన్ని ఇదొక డ్యూటీ అనుకొని చేయలేదు. ఒక తల్లి కుటుంబం కనీసం ఎంత ఆరాట పడుతుందో, ఎంత సేవ చేస్తుందో, రోజా ఈ స్కూలు కోసం, స్టూడెంట్స్ కోసం అంత సేవ చేసింది. అంత తపన పడింది. కనుకనే ఇవాళ పిల్లలందరూ తల్లికి దూరమవుతున్న వాళ్లలాగా తల్లడిల్లుతున్నారు. ఆమెను కౌగలించుకుని బావురుమన్నారు. పిల్లలకీ మనకూ గొంతులో దిగులూ, గుండెలో పగులూ అందుకునే” అంటూ హెడ్ మిస్ట్రెస్ తన మనసులోని మాట చెప్పింది.

వీళ్లంతా భోజనాలు చేసి బయల్దేరుతుంటే, ఆ హోటల్లో ఒక మూల కూర్చున్న అమ్మాయి చొరవగా వచ్చి రోజాను అడిగింది – “టీచర్, నేను మీకు గుర్తున్నానా?”

రోజాకు నిజంగానే అమ్మాయి ఎవరో గుర్తు లేదు.

“కొన్నేళ్ళ కిందట నేను మీ దగ్గర చదువుకున్నాను. మీ ఓల్డ్ స్టూడెంట్‌ను. నా పేరు హిమబిందు.”

“అలాగా, సంతోషం” అన్నది రోజా.

“మీరు రిటైర్ అవుతున్నారని, ఇక్కడ పార్టీ ఇస్తున్నారని తెల్సి మిమ్మల్ని చూడాలని వచ్చాను” అన్నది హిమబిందు.

హిమబిందు ఆమెను ఇంటి దగ్గర దింపటానికి తన కారులో తీసుకు వెళ్లింది. మధ్యలో తన ఇంటికి తీసుకు వెళ్లి తండ్రిని పరిచయం చేసింది.

సోఫాలో కూర్చుని ఫోన్‍లో మాట్లాడుతున్న కామేశ్వరరావును చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. మరబొమ్మలాగా చేతులు ముడిచి “నమస్కారం” అన్నది.

కామేశ్వరరావు రెండు ముక్కల్లో తన విశేషాలు చెప్పాడు. “నేను కమీషనర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఒక్కతే అమ్మాయి. కంప్యూటర్ ఇంజనీర్. రెండేళ్ల కిందట పెళ్లి చేశాను. అల్లుడు చికాగోలో ఉన్నాడు. కొద్దిరోజుల్లో ఇదీ వెళ్లిపోతుంది. నన్ను వాళ్ల దగ్గరకు రమ్మంటున్నారు. గానీ, నేను వెళ్ళదల్చుకోలేదు” అన్నాడు కామేశ్వరరావు. మరికొద్దిసేపు ముచ్చటించుకున్నాక, రోజూ ఇంటికి వెళ్తానని బయల్దేరింది. ఈసారి కామేశ్వరరావు ఆమెను కారులో ఇంటి దగ్గర దించటానికి బయల్దేరాడు.

కారులో ఆయన పక్కన కూర్చుని వెళ్తున్నప్పుడు, ఆమె మనసులో జ్ఞాపకాల సుడిగుండాలు..

ఒకప్పుడు ఇదే కామేశ్వర రావు తనను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఎన్నో ప్రేమలేఖలు రాశాడు.

‘నువ్వు నా పక్కన నిలబడితే గొడ్డు అమావాస్య నాడూ పండు వెన్నెలే. నీతో కలిసి నడిస్తే ఎడారి జీవితంలోనూ అడుగడుగునా నీటి సరస్సులే. నువ్వు కిలకిలా నవ్వితే చాలు, నా మనసు ఉయ్యాల లూగుతుంది. బ్రతుకు గులాబీ తోటలో పూసిన అరవిరిసిన రోజావి..’ అంటూ ప్రేమలేఖలు అందించేవాడు.

అవన్నీ గుర్తొచ్చిన రోజుకు కళ్లల్లో జలధి తరంగాలు.

పైట చెంగుతో మొహం తుడుచుకుంటున్నట్లు నటిస్తూ, కన్నీళ్లు తుడుచుకుంది.

ఆమె దారి చూపించగా ఇంటి ముందు కారు ఆపాడు.

ఆమె కారు దిగింది.

“విష్ యు హ్యాపీ రిటైర్డ్ లైఫ్” అన్నాడు.

“దయతో ఈ పేదరాలి ఇంటి గుమ్మం వరకూ వచ్చారు. కమీషనర్ గారు నా ఇంట్లో అడుగు పెడితే, నా ఇల్లు పావనం అవుతుంది” అన్నది రోజా.

కామేశ్వరరావు కారు దిగాడు. ఆమెతో పాటు లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఆమె కాఫీ తెస్తానంటే వద్దన్నాడు.

“నీ భర్తనూ, పిల్లల్ని పరిచయం చేస్తావనుకున్నాను.”

“ఉంటే కదా, పరిచయం చేయటానికి.”

“అదేమిటి? పెళ్లి అయిందని అప్పట్లో విన్నాను.”

“అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఒంటరిదాన్ని.”

“ఇంతమంది పిల్లలకు దారిచూపిన దానివి. వాళ్ల జీవితాలలోని వెలుగు నింపినదానివి. నీ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుందనుకున్నాను.”

“దీపం చుట్టూ వెలుతురు ఉంటుంది గానీ, దానికింద నీడే ఉంటుంది.”

“నీ కోసం అప్పట్లో ఎంత మంది పోటీపడ్డారో నాకు తెల్సు. నీ జీవితం ఉజ్జ్వలంగా వెలిగిపోతుందని అందరం అనుకున్నాం. కానీ ఇలా ఒంటరిగా మిగిలిపోతావనుకోలేదు.. ఏం జరిగింది?” అని అడిగాడు.

“ఎన్నో అనుకుంటాం. అనుకున్న వన్నీ జరగవు. మనం ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో దేవుడు ముందుగానే రాసిపెట్టి ఉంటాడు. మనం ఆయన ఆడించినట్లు ఆడే బొమ్మలం.”

“నువ్విలా మాట్లాడటం వింతగా ఉంది.”

“మీలాంటి వాళ్లకు జీవితం వడ్డించిన విస్తరి. గొంతు విప్పితే విషాదం తప్ప మరేమీ పలుకని నాలాంటి వాళ్ల పరిస్థితి వేరు.”

“నీ భర్త ఎక్కడున్నాడు?”

“యముడు ఎక్కడున్నాడో ఆయనా అక్కడే ఉంటాడు. యవ్వనపు సౌందర్య సీమల్లో నడుస్తున్నప్పుడు, అదొక కలల ప్రపంచం. వసంతాల వాడల్లో ఎవరో చెయ్యి పట్టుకుని లాక్కుపోతున్నప్పుడు స్వప్నాల వెంట పరుగులు తీయటం తప్ప, ఇంకేమీ తెలియదు – నా కాటుక కళ్ల గురించి కవిత్వం రాస్తూ, మా ఇంటి చుట్టూ నువ్వు పరిభ్రమించే రోజుల్లో, నువ్వింత గొప్పవాడివి అవుతావని అప్పట్లో అనుకోలేదు.

అప్పట్లో ఎంతో ఉన్నతంగా కనిపించిన మనిషి మెడలో పూల మాల వేశాను.

అందమైన అమ్మాయి కలల్లో తిరిగే అమ్మాయిని, పెళ్లి అయిన మర్నాడు నిద్ర లేపుతాడు భర్త. కలలో మహారాజు యోగం అనుభవిస్తున్న సమయంలో కల చెదిరి పోతుంది. ఇంక ఇలలోని ఆసలైన కష్టాలు చుట్టు ముట్టిస్తాయి. పెళ్లికి ముందు దాకా ప్రేమ వెల్లివిరిసే చూపులతో చూసే భర్త, బుగ్గలు సాగదీస్తాడు. మెడలు వంచుతాడు. స్వప్నాల సౌధానికి నిప్పుముట్టిస్తాడు. అధికారం చెలాయిస్తాడు.

ఆయన అదో రకం మనిషి. పొద్దుటే నిద్దర లేచి పనిలో మునిగిపోతే ‘చలిలో ఆరుబయట తిరిగితే జలుబో, జ్వరమో రాదా. ఈ మాత్రం తెలివి లేదా?’ అని తిట్టిపోస్తాడు. ఆలస్యంగా నిద్రలేస్తే ‘బారెడు పొద్దుఎక్కాక నిద్ర లేవటం ఆడదాని లక్షణమేనా?’ అంటూ మొదలుపెడతాడు. టూత్‍పేస్ట్ కనిపించక పోయినా, సబ్బుబిళ్ల అందివ్వకపోయినా దరిద్రపు మనిషి అని బిరుదు ఇచ్చేవాడు. ప్రతిదీ తప్పే. ఇంట్లో జరిగే ప్రతిదీ నా అపరాధమే. రోజంతా సూటిపోటీ మాటలతో, విమర్శలతో, హేళనలతో, తిట్లతో మానసికంగా క్రుంగదీశాడు. భార్యకు భర్త దేవుడిచ్చిన రక్షరేక అని మా బామ్మ అంటుండేది. కానీ ఆ రక్షరేక కట్టుకున్నప్పుటి నుంచీ నాకు అది గుచ్చుకోవటం మొదలైంది. ఆ బాధ భరించలేక రక్షరేక తీశేసాను” అన్నది రోజా.

“కొంతమంది ఎన్నేళ్లు వచ్చినా మానసికంగా ఎదగరు. ఇంకా దొంగాటలూ దోబూచులూ ఆడుకునే చిన్నపిల్లలే. ఓడిపోతామన్న భయంతో తొండి ఆటలూ దొంగ ఆటలూ ఆడుతుంటారు. మధ్యలో ఆట మానేసి అలిగి వెళ్లిపోతుంటారు” అన్నాడు కామేశ్వరరావు.

ఆయన వెళ్తానని లేచాడు. ఆమె సాగనంపటానికి గుమ్మం దాకా వచ్చింది. “మీకు తీరిక ఉన్నప్పుడు ఈ చిన్ననాటి స్నేహితురాలిని ఒకసారి వచ్చి పలకరించి పోతుండండి” అన్నది రోజా.

“రిటైరైనాను. ఇంక తీరికే గదా. రోజూ వస్తాను” అన్నాడు కామేశ్వరరావు.

ఇంటి ముందు లైట్ల వెలుగులో చిరుగాలికి తల ఊపుతున్న రోజా పూల వంక చూశాడు. రోజా అంటే ఇప్పటికే ఆయనకు వల్లమాలిన అభిమానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here