మహాప్రవాహం!-23

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మళిగె యజమాని నారయ్యతో మాట్లాడుంటారు చలమేశు, మాధవ. కాలం మారిపోయిందనీ, ఇప్పుదు ఎవరి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శించి డబ్బు సంపాదించుకోవచ్చని అంటాడాయన. కులం కాక, గుణాన్ని గుర్తించే కాలం వచ్చిందని అంటాడు. తన అల్లుడి గురించి, తన మిత్రుడు నీలకంఠశర్మ గురించి చెప్తాడు. మళిగెకి చిన్న చిన్న రిపేర్లు చేయించాలనీ, అవి చేయించి రంగులు వేయించి ఇస్తానని చెప్తాడు నారయ్య. నేస్తులిద్దరూ ఇంటికి వస్తారు. ఈశ్వరమ్మ కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రాగనే, కాళ్ళూ చేతులు కడుక్కుని రమ్మని చెప్పి అన్నాలు పెడుతుంది. మర్నాడు ఉదయమే లేచి హోటల్లో పనులకు వెళ్తారు. చలమేశు మిగతా పనులు చేస్తూంటే మాధవ మిరపకాయలు అల్లం, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి ఇస్తాడు. కుశుడు సుందరయ్య వచ్చి పని మొదలుపెడతారు. ముందుగా టీ పెట్టి, తరువత ఉగ్గానీ బజ్జీలు సిద్ధం చేస్తాడు సుందరయ్య. ఈలోపు జనాలు టీ తాగడానికి వస్తుంటారు. కుశుడు పూరీల పిండిని కలిపి, మెత్తగా పిసుకుతాడు. మాధవని కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బులు తీసుకోమని చెప్తాడు చలమేశు. సుందరయ్య సాయంతో పూరీలు వేస్తాడు చలమేశు. పూరీ కూర సంగతి సుందరయ్యని చూడమని, తాను దోశలు పోస్తాడు చలమేశు. పది గంటలకు వరకూ జోరుగా ఉన్న బేరాలు, పదకొండు అయ్యాకా, బాగా తగ్గుతాయి. కుశుడితో టీ పంపించి పోలీసు స్టేషన్‍లో ఇచ్చి రమ్మంటాడు చలమేశు. ఎస్.ఐ. టిఫిన్ కావాలంటే, సుందరయ్య దోశలు వేసి పంపుతాడు. మాధవ, చలమేశు టిఫిన్ తిని టీ తాగి, కార్పెంటర్ హబీబ్ వద్దకు వెళ్తారు. మాధవ పెట్టబోయే షాపుకు షెల్పులు చేయాలని, షాపు కొలతలు చెప్తారు. అతను ఎలాంటి చెక్క వాడోలో చెప్తాడు. అతనికి అడ్వాన్స్ ఇచ్చి వస్తారు మిత్రులు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]ర్సటిదినం ఓటల్ను సుందరయ్య కప్పజెప్పి కర్నూలుకు బోయినారు నేస్తులిద్దురు. బస్టాండు కాడనే ఉన్న ఒక చెప్పుల శాపులోకి బోయి “అన్నా మేము వెల్దుర్తిలో చెప్పుల శాపు బెడతాన్నాము. ఓల్‌సేల్ డీలర్లు యాడ ఉంటారు?” అని అడిగితే, “‘విక్టరీ’ టాకీసు దాటినంక ‘ఎలైట్’ హోటలొస్తది. దాని పక్క సందులో ‘రీగల్ ఫుట్‌వేర్, హోల్‍సేల్ డీలర్స్’ అని పెద్ద గోడౌనుంటాది. ఆడ మీకన్నీ దొరుకుతాయి” అని చెప్పినారు.

దాన్ని ఎతుక్కుంట బోయిసారు. సులబంగానే కనుక్కొన్నారు. శానా పెద్ద సాపు. ఒక లారీ లోంచి పెద్ద పెద్ద అట్టపెట్టెలు అన్‍లోడింగ్ జేస్తాన్నారు. లోన శానా పెద్ద ఆలుండాది. ఒక పక్క ‘ఆఫీసు’ అని బోర్డును జూసి దాంట్లోకి బోయినారు. ఆపీసు శానా సోకుగ ఉండాది. ఒక టేబులు మింద అద్దం పరిసి పెట్టినారు. పెద్దపెద్ద చెప్పుల కంపినీల పోస్టర్లు గోడలకు కరిపించి ఉన్నాయి.

టేబులు ఎనకాల ఒక బట్టనెత్తాయన గూసోని ఉండాడు. టేబిలు మింద ఫోనులో మాట్లాడుతుండాడు. వీండ్లను జూసి కూసోమని సైగ జేసినాడు. ఆ యప్ప నెత్తి నున్నగా ఉంది గాని, మీసాలు మాత్రం శానా ఒత్తుగా పెంచినాడు. ‘అనువైన చోటే గదా అలుముకోవాల!’

ఆ యప్ప ఎనకాల గోడకు పేరు రాసిన పలక దగిలిచ్చి ఉండాది. ‘బాలమురుగన్, మేనేజింగ్ డైరెక్టర్’ అని రాసి ఉండాది దాని మింద.

“ఏం దప్పా, ఏం పని మీద పూడ్సినారు?” అనదిగినాడా యప్ప. మాదవ చెప్పినాడు. “సార్, మేం వెల్దుర్తిలో చెప్పుల శాపు బెడతాన్నాము. మాకు సరుకు గావాలని మీకాడి కొస్తిమి”

“మంచిది. మా రీగల్ చెప్పులు, బూట్లు, ఆంధ్రా అంతా పంపిణీ చేస్తుము. మావి గాక, బాటా, పాపులర్, ఇట్టాంటి బ్రాండ్లకు గూడ మేము ఆధరైజుడు డీలర్లము. మీరు ఎంత పెట్టుబడి పెట్టడానికి ఉన్నారు?” అన్నాడా యప్ప. తెలుగును తమిళం మాదిరి మాట్లాడుతున్నాడు.

“ఒక ఏడెనిమిది వేలతో మొదులు బెడ్దామని..”

“అది శానా తక్కువ. కనీసము ఇరవై వేలయినా ఉండాల. మీది శానా చిన్న ఊరు కాబట్టి బాటా కంపినీవి బరించలేరు. మా ‘రీగల్’ వే ‘సి’ క్లాసు సెంటర్లకు పనికొచ్చేవి ఉంటాయి.” అని, “మీ ఊర్ల కాన్వెంటు లుండాయా?” అడిగాడు.

“ఆ. ఉంది సార్. ఒకే ఒకటి.”

“వాండ్లతో డీలింగ్ పెట్టుకోని వాండ్ల పిల్లలకు బూట్లు, సాక్సు మీరే సప్లయి జేస్తామని చెప్పండి. దానికి ఇంకా టైముంది. స్కూల్లు తెరిచిన తర్వాత తీస్కుంటారు. మీరు ఎండాకాలం లీవుల్లో ఇవి పెట్టవచ్చును.

మీ ఊల్లో బూట్లు తొడిగేవారు శానా తక్కువగా ఉంటారు. కాబట్టి షాపులో శాంపిల్‌కు నాలుగైదు రకాలు సరిపోతాయి. హవాయి చెప్పలు మీకు ఎక్కువగా సేలవుతాయి. ఇంకా లేడీసువి పెట్టండి. పనిలో పని లెదరు బెల్టులు, పాలీసు డబ్బాలు, బ్రష్షులు గూడ. మీకు లోనిచ్చేందుకు బ్యాంకుండాదా?”

“ఉంది సారు. స్టేటు బ్యాంకు.”

“దాంట్లో ఒక పదివేలు లోను తీసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర?”

“ఏడు వేల వరకు”

“సరే నేను పదివేల సరకు యిస్తాను. యాపారమనేది నమ్మకం మీదనే

నడుసును. ఆ మూడు వేలు నెలకు ఐదు నూర్ల ప్రకారము కట్టుకోండి. లోను వచ్చిన తర్వాత వస్తే సరుకు పెంచుకోవచ్చును. ఉండండి” అని టేబిలు మింద ఒక బెల్లు ఒత్తినాడాయప్ప.

ఒకాయన లోపలికి వచ్చినాడు. ఆయనతో ఏదో తమిళంతో చెప్పినాడు పెద్దాయన .

“మీరు నాతో వస్తురు!” అన్నాడా యప్ప. ఆయన పేరు సుందరేశన్ అంట. వాండ్లను దీస్కపోయి శానా రకాలు సూపించినాడు. “గ్రోసు (12డజన్లు) జతలు తీసుకుంటే దర శానా తగ్గుతోంది. కాని మీ మాదిరి చిన్న శాపులకు అవుసరము లేదు. రకానికి రెండు డజన్లు ఏస్తాము. చెప్పుల దర అట్ట పెట్టె మిందనే ప్రింటు చేసి ఉంటాది. చిన్న ఊరు కాబట్టి కస్టమర్లు బ్యారం చేస్తారు. పెట్టి మింద దర మనకు గిట్టుబాటైన దానికంటే ఎక్కువే ఉంటాది.

ఈ చెప్పులు చూడండి. దీని మింద 39 రూపాయలు అని ఉన్నాది కదా! వీరు కండ్లు మూసుకొని 35 కు ఇవ్వవచ్చును. ఇది మీకు ఇరవై మూడు రూపాయలు పడతాది. మీకు ఒక లిస్టు ఇస్తును. దానిలో రకము, ఎమ్.ఆర్.పి, మీకు గిట్టిన దర, మీరు ఎంతకు అమ్మవచ్చును అన్నీ ఇవరంగా ఉంటాయి. మరి ప్యాకింగు చేయించవచ్చా?”

‘సరే’ అన్నారు. బిల్లు వివరంగా తయారు చేసి యిచ్చినాడు సుందరేశన్. మొత్తం పదివేల ఎనిమిది వందలు అయింది. దాంట్లో క్యాష్ పెయిడ్ – ఏడువేలు, బ్యాలెన్సు డ్యూ మూడు వేల ఎనిమిదివందలు అని ఉంది.

“ఆ చోట ఇంకో రూములో క్యాషియర్ ఉంటాడు. పోయి దుడ్డు కట్టి రాండి.”

క్యాషియర్ దగ్గర వీండ్ల మాదిరి రిటైలు శాపులోల్లు ముగ్గురున్నారు. క్యాషియర్ డబ్బు తీసుకొని చేతికందేట్టుగా ఉన్న ఇనప బీరువా తలుపు తీసి, రబ్బరు బ్యాండు వేసి లోపలబెట్టి, రశీదు రాసి, దాని మింద ధబీమని స్టాంపు ఏసి ఇస్తున్నాడు; బిల్లు తోసా.

రశీదు పట్టుకోని సుందరేశన్ దగ్గరికి పోయినారు.

“బిల్లులో ఉన్న ప్రకారము మీ సరుకు ప్యాకింగ్ ఐనాది. మొత్తం ఎనిమిది అట్టపెట్టెలు. వీండ్లను ఎట్లా తీసుకుబోతారు? ట్రాన్సుపోర్టు పార్సిలు సర్వీసులు బుక్ చేస్తారా?”

“ఏమో తెలియదు సార్.”

వెనకవచ్చిన యింకో శాషాయన అన్నాడు. “యా ఊరికి?”

“వెల్దుర్తికి అన్నా” అన్నాడు మాదవ.

“పార్శలు సర్వీసోండ్లు శానా ఎక్కువ దీస్కుంటారు. ఒక పని చేయండి ట్రాలీ రిచ్చాలు రెండు మాట్టాడుకుని బల్లారి చౌరస్తా కాడికి బోయి దింపుకోని ఉండండి. ఆతడు బాడీ వరకీ ఉండే లారీలు అయివే మింద బోతాంటాయి. వాండ్లే నిలబెట్టి మిమ్మల్ని అడగతారు. వెల్దుర్తి బైపాసులో దింపుతారు. పెట్టెకు ఐదు రూపాయలిస్తే సరిపోతాది. మీరు గుడ్క

దాని మిందే ఎక్కిపోతే సరి.”

“శానా బాగుందన్నా, అట్నీ జేస్తాము “ అన్నాడు ఎచలమేశ్వర్

గోడౌను బయటే ట్రాలీ రిక్షాలున్నాయి. బళ్లారి చౌరస్తాకు ఒంటికి పన్నెండు రూపాయలడిగి పదికి వస్తామన్నారు. మామూలు రిక్షాలో వీండ్లిద్దరు ఎక్కినారు, నాలుగు రూపాయలకు మాట్లాడుకోని.

చాంద్ టాకీసు, కంట్రోలు రూము, కోల్సు కాలేజీ, పెద్ద పార్కు, నవరంగ్ అలంకార్ టాకీసులు దాటి, దర్గా మీదుగా బళ్ళారి చౌరస్తాకు బోయినారు. పెట్టెలు దింపిచ్చికోని ఒక పక్కన నిలబడినారు. పది నిమిసాల తర్వాత ఐరన్ రాడ్ల లోడుతో ఒక లారీ వచ్చింది అవి శానా బరువు కాబట్టి బాడీకి సగమే వచ్చినాయి. ఎనక పక్క బాడీ దాటి నాలుగడుగులు బైటకున్నాయి .

డ్రైవరు సైడుకాపినాడు. క్లీనరు డోరులోంచి తలపెట్టి చూసి, “యాడికి బోవాలన్నా, ఏమిటవి?” అని అడిగినాడు.

ఇద్దరూ డోరు కాడికి బోయి, “చెప్పులు తమ్మి! మొత్తం ఎనిమిదుండాయి. వెల్దుర్తిలో దించాల. మేము గుడ్క వస్తాము.” అన్నారు.

క్లీనరు డ్రైవరు మాట్లాడుకున్నారు.

“మిమ్మల్ని ఊరికే దీస్కపోతాముగాని, అరవై రూపాయలవుతాది” అన్నాడు క్లీనరు.

‘వద్దులేప్పా, ఎల్లిపోండి” అన్నాడు చలమేశు.

“పోనీ ఎంతస్తారో చెప్పండి.”

“నలబై కంటె ఎక్కువియ్యము.”

మళ్లీ డ్రైవరు క్లీనరు మాట్లాడుకున్నారు.

“యాభై యిస్తారా. ఆకిరి మాట.”

చలమేశు మాదవ పక్క జూసి తలెగరేసినాడు. మాదవ తలూపినాడు.

“సరే పోదాం పాండి.”

క్లీనరు బండి దిగి పెట్టెలు లారీలో పెట్టడములో సాయం జేసినాడు. ఆ యప్ప పైకెక్కి క్యాబిను నానుకొని పెట్టెలన్నీ సర్దినాడు. రెండువైపుల కొక్కాలకు తాడు బిగించి కట్టినాడు పెట్టలు కదలకుండా. వీండ్లు గుడ్క ఎక్కి రాడ్ల మీద కూసున్నారు. లారీ కదిలింది . గంటలోనే వెల్దుర్తి బైపాసులో దింపేసి, డబ్బులు తీసుకుని వెళ్లిపోయినాడు. రైలు స్టేషన్‌ను ఆనుకొనే బైపాసు పోతాది.

“నీవు పెట్టెల కాడనే ఉండు. నేను బోయి యాదన్న బండి మాట్లాడుకోని వస్తా. షాపు రిపేరు రేపటికయిపోతాదని, నారయ్య మామ చెప్పినాడు. ఎల్లుండి రంగు లేస్తాము. బోర్డు రాయించాలి. తర్వాత నాల్రోజులు కార్పెంటరు పని ఉంటాది. వారం రోజుల తర్వాత మంచి రోజు చూపించుకోని మొదులు బెడ్దాము, ఈ లోపల గ్రామపంచాయితీ నుంచి పర్మిశను దెచ్చుకోని, బ్యాంకు లోనుకు బెట్టుకుంటే సరిపోతాంది” అని చెప్పి చలమేశు ఊర్లోకి బోయినాడు. రైలుపట్టాలు దాటంగనే కొంచెం దూరం లోనే పోలీసు టేసను. బస్టాండు గుడ్క దగ్గరే. ఆడ రామళ్లకోట నుండి ఒక ఎద్దుల బండి వచ్చినాది. దాంట్లో కరుబూజ కాయలుంతాయి. అవిట్ని దింపుతాండారు. చలమేశు పోయి బండి దోలుకొచ్చినాయనను “చిన్నాయనా, బైపాసు కాడ మావి ఎనిమిది పెద్ద అట్టపెట్టె లుండాయి. ఏసుకొచ్చి మా ఇంటి కాడ దింపుతావా?” అనడిగినాడు.

ఆ యప్ప ఎగాదిగా జూసి, “ఒరేయి పిల్లోడా! నీవు పినాకమయ్య కొడుకువు గదా, నీ పాసు గూల ఎంతటోని వైనావురా!” అని ఆశ్చర్యపోయినాడు. “పోదాం పా ఈ కాయలు దింపినాక” అన్నాడు.

రామళ్ళకోట కాడ వంకల్ల ఎండాకాలము రాకముందే ఖరుబూజ, కలింగర (పుచ్చ) తోటలు ఏస్తారు. ఎత్తండమోళ్ళు అవి కొనుక్కోని సంతల్లో అమ్ముకుంటారు. కర్నూలు, నంద్యాల ఆదోని మార్కెట్లకు దీస్కపోయి అమ్ముకుంటారు. అంద్రి నదిలో నీళ్లు తగ్గి ఇసకపర్రలు బయట పడంగానే ఈ రెండు పంటలు పండిస్తారు.

ఎత్తండం యాపారస్తుడు బందాయనకు డబ్బులిచ్చేసినాడు.

“పా నాయినా పోదాము” అని బండాయన నొగల మీదికి ఎగిరి కూచున్నాడు. “ఎక్కు మల్ల” అన్నాడు చలమేశుతో.

“పెట్టెల్లో ఏమి వున్నాది? శానా బరువుంటాయా?” అని అడిగినాడు.

“శెప్పుల పెట్టెలు సిన్నాయనా, ఏమంత బరువుండవు.”

“నీవు ఓటలు గదా పెట్టింది. మరి ఇవి యడినుంచొచ్చె?”

“మా నేస్తుడు నా ఓటలు పక్కన చెప్పుల శాపు బెడతాన్నాడు. కర్నూలు నుంచి లారీలో ఏసకచ్చినాము.”

“బరువు ల్యాకపోతే సరే. పట్టాలు దాటించొచ్చు. ల్యాకపోతే సుట్టు తిరిగి మదారుపురం గేటు కాడి నుంచి మల్లుకోని రావాల.”

రైలు టేసను పక్కనుంచి పట్టాల మింద బండి దాటించి బైపాసుకు తీసుకుపోయినాడు. ముగ్గురూ కలిసి పెట్టెలన్నీ బండి మింద ఎక్కించినారు.

వచ్చేటపుడు పోయేటపుడు రైలు గానీ గూడ్సు గానీ వస్తుందేమో చూడమన్నాడు. ఆ యప్ప ఎవరో ఎంత ఆలోశించినా మతికి రావడం లేదు. ‘నాయిన దోస్తుడేమో? అందుకే నన్ను గుర్తు బట్టినాడు’ అనుకున్నాడు.

బండి చలమేశు ఇంటి కాడ నిలబడినాది. పెట్టెలన్నీ ఇంట్లోకి మోసినారు. ఈశ్వరమ్మ బైటకు వచ్చి బండాయనను జూసి, “ఏమి ఉరుకుందప్పా, బాగుండావా?” అని పలకరిచ్చినాది.

“ఈశ్వరమ్మ తల్లీ, బాగుండానమ్మా” అని చేతులెత్తి ఆమెకు మొక్కినాడు.

“లోనకి రాప్పా. కొంచెం మంచినీల్లన్నా తాగుదువు” అనింది ఆ యమ్మ. ఉరుకుందప్ప లోనకి బోయి నేల మిందే గొంతుకూచున్నాడు. ఈశ్వరమ్మ చెంబుతో నీల్లు దెచ్చిస్తే, ఇంటి బయటకు బోయి మొగం మెడా, కాల్లు, సేతులు కడుక్కోని తలగుడ్డతో తుడుసుకున్నాడు. ఇంకో చెంబు నీల్లడిగి, చెంబెత్తుకోని గటగటా తాగినాడు.

“నీ కొడుకు ఏం చేస్తున్నాడు?” అనడిగిందా యమ్మ.

“వాడు నంద్యాల బొమ్మల సత్రము కాడ టీలు బోకులంగడి (స్టీలు సామాన్లు) బెట్టుకున్నాడు. మూల సాగరం ఈందిలో యిల్లు బాడిక్క దీసుకున్నాడు. వాని కొడుకు గుడ్క ఆడనే స్కూల్లో జేరినాడు.”

“మరి నీవొక్కనివీ..”

“ఏం చేస్తాము తల్లీ! కొడుకు మనోడు గాని, కోడలు మనది కాదు గదా, ఆ యమ్మకి నా పోడంటేనే గిట్టకపాయె. మా వాండ్లు (భార్య) సచ్చిపోయేంత వరుకు బాగనే ఉండె. ఆడికి రమ్మంటారుగాని, ఆ మాటలు కడుపు లోనించి రావు, పెదిమెల మించి వస్తాయి. సేద్దెం జెయ్యలేక మానేస్తి. ఇదో ఈ బండి, ఈ నోరు లేని జీవాలు మిగిలినాయి. బస్టాండు కాడ సూపెట్టుకోని, యావయినా సరుకులు తీసుకుపోనీకె ఎవరయినా పిలుస్తే పోతా. ఇవిటి మ్యాతకు, నా తిండికి లోటు లేదు తల్లీ! పైన శగిలి ఉన్నంత కాడికి జేస్తా. మూలబడినంక వానికీ తప్పదు, వాని పెండ్లానికి తప్పదు.”

చలమేశు వచ్చి, “ఎంతిమ్మంటావు సిన్నాయనా” అనడిగితే నవ్వినాడు ఉరుకుందప్ప.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here