[శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు రాసిన ‘పెళ్లి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“నా[/dropcap]న్నా ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది” అంటూ చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు.
“ఈ అమ్మాయి బీఎస్సీ బీఇడీ చదువుకుంది రా. మరి నువ్వేమో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వి. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుంది? పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోంది.”
“లేదు నాన్నా, టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళకి. బోల్డన్ని సెలవులు ఉంటాయి. పైగా టైమింగ్‌లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే పెళ్లిచూపులకి వెళదాం” అంటూ తండ్రి రఘురామయ్యని తొందరపెట్టాడు రఘు. రఘురామయ్యగారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు.
కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు కూతురు. ఇద్దరినీ బిఎస్సి బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కార్లో అయినవిల్లి గ్రామం బయలుదేరారు.
ఫలనా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు. ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ యూట్యూబ్‍లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు చల్లటి గాలి ఆస్వాదిస్తూ అబ్బా స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ. రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లి వారి ఇల్లు వచ్చేసింది.
పెళ్లి వారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి “కాళ్లు కడుక్కుని లోపలికి రండి” అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్ళు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళం తోటి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్లు కడుగుకున్న తర్వాత లోపలికి తీసుకువెళ్లి మర్యాదగా కుర్చీల్లో కూర్చోబెట్టి మంచినీళ్ల గ్లాస్ అందించారు. ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలంనాటి చెక్క కుర్చీలు. మంచినీళ్లు తాగిన తర్వాత “ఇల్లు చూద్దాం రండి” అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు. పెద్ద పెంకుటిల్లు. చుట్టూ అందమైన కొబ్బరి తోట, మామిడి మొక్కలు, అరటి మొక్కలు అక్కడ లేని మొక్క అంటూ లేదు. వెనకాల పశువులశాల. తనకు సొంత వ్యవసాయం ఉందని, ఇల్లు తన తండ్రిగారు కట్టారని కృష్ణారావు గారు మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. చల్లటి గాలి. అందమైన ప్రకృతి. మాయా మర్మం లేనటువంటి మాటలు చాలా ఆనందపడ్డాడు పెళ్లి కొడుకు.
ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి “అందరూ ఫలహారం తీసుకుందాం రండి” అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్లింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగ చాపలు పరిచి ఉన్నాయి. ఎదురుగుండా అరిటాకులో కొద్దిగా కారప్పూస, మినప సున్ని, పాలకోవా, పూతరేకు, కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘుకి. “ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి. బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు, పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టారు కదా” అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి కొసరి వడ్డించింది.
తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ల మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేసాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లిచూపులు అంటే బజార్ నుంచి నాలుగు సీట్లు నాలుగు హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా. ఇదివరకు పెళ్లిచూపులకు వెళ్లిన చోట ఇలాగే కక్కుర్తి పడే ఒకటి రెండు స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదలలేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరిబొండంనీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. “ఇవి కూడా మా దొడ్లోవే. వేసవికాలం కదా కాఫీ టీలు ఎందుకని?” అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు.
ఇంతలో రఘురామయ్య గారు “టైం అవుతుంది అమ్మాయిని తీసుకురండి” అంటూ అడగగానే కృష్ణారావు గారు భార్య పెళ్లికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది పెళ్లికూతురు. ఆధునికమైన మేకప్ లు ఏమీ లేవు. గోదావరి నీళ్ళల్లాగా ఆ మొహంలో స్వచ్ఛత కనబడింది పెళ్ళికొడుకుకి. ఆమె అలంకరణలో ఎక్కడ ఆధునికత కనబడలేదు. కట్టుబొట్టు అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి. “అమ్మాయితోటి మీరేమైనా మాట్లాడతారా?” అని అడిగారు పెళ్లికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపేడు రఘు. ఇద్దరినీ వెంటబెట్టుకుని పెళ్లికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది.
ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి “మీ పేరు ఏమిటి?” అని పలకరించాడు. “సీతాదేవి” అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడ కరుకుదనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల కదా ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినా అడగకపోయినా తన పేరు చేస్తున్న ఉద్యోగం పూర్తి వివరాలు అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. “మీరేం చేస్తున్నారు?” అని అడిగాడు చివర్లో. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది ఏమిటి అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడతాయా వినపడవా అనిపించింది రఘుకి.
పది నిమిషాలు పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు.
రఘురామయ్య గారు కూడా వారి మర్యాద ఆ ఇంటి వాతావరణం మాటతీరు పెళ్లికూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి కూతురు తోటి చర్చించి “మాకు మీ సంబంధం నచ్చింది అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి” అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగ పెళ్లి వారిని. రఘురామయ్యగారు తాము సాయంకాలం బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని అంతవరకు రావులపాలెం లోని హోటల్లోనే ఉంటామని చెప్పారు.
కృష్ణారావు గారి దంపతులకు పెళ్ళికొడుకు ఉద్యోగం కుటుంబం బాగా నచ్చాయి గాని మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగపెళ్లివారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే ఎలాగా మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా. మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటినుంచి కృష్ణారావు గారి ఆశ. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు. ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించారు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఇప్పటికి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నారు.
సరే ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య కూతురు అంగీకారం తీసుకుని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3:00 అయింది.
కృష్ణారావు గారి దంపతులను సాదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలు అన్నీ చేశారు. “చూడండి మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి గౌరవం అన్ని బాగా మాకు నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్ళికొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్లే కాబట్టి మన పద్ధతులు ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం. అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలు ఉన్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు ఆర్భాటాలు ఏవి ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి పదిమందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగపెళ్లివారు ఏ విధంగా చేయమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్లి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం” అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు.
“మాకు ఏమీ తొందర లేదు మీరు నిదానంగా ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కబురు చేయండి” అంటూ అరటిపళ్ల బుట్ట వాళ్లకి ఇచ్చి “మా దొడ్లో పండినవే. మేము మందులు మాకులు వాడము. మాది అంతా గో ఆధారిత వ్యవసాయం” అంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్లిపోయారు కృష్ణారావు గారు.
మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘురామయ్య గారు. పెళ్ళికొడుకుని గుచ్చి గుచ్చి మరీ మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భాటంగా జరగాలని పెద్దపెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని ప్రీ వెడ్డింగ్ షూటింగు పోస్ట్ వెడ్డింగ్ షూటింగు డాన్సులు బ్యాండ్ మేళాలు ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందేమో అని చాదస్తంగా ప్రశ్నించారు. రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్యగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. “చూడు నాన్నా ఈ హంగులు ఆర్భాటాలు ఊరేగింపులు డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లికూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు ఆ అమ్మాయి తోటే నా పెళ్ళి” అంటూ కచ్చితంగా చెప్పేసాడు రఘు.
తమకి కట్నకానుకలు ఏమీ వద్దని పెళ్లి ఆడపిల్ల వారి ఇష్టప్రకారమే చేయమని తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని డైరెక్ట్‌గా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు.
మొత్తానికి అనుకున్న శుభ ముహూర్తం రానే వచ్చేసింది. మగపెళ్లి వారు అయినవిల్లి లోని విడిది ఇంట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్ల వారు డోలు సన్నాయి బాజా భజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలకి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి దానికి మావిడాకులు తోరణాలు ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మావిడాకులు తోరణాలు ఇల్లు కొత్తగా వెల్లవేసినట్టుంది గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా 10 గదులున్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్ల గాలి. ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగ పెళ్లి వారు. బయట అరుగు మీద ఒక 20 వరకు మడత మంచాలు గోడకు చేర వేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి పెళ్లి లాగే ఉంది అనుకున్నారు. కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపెళ్లి వారు బొట్టు పెట్టి పేరుపేరునా ఆహ్వానించారు కృష్ణరావు గారి ఇంటికి మగ పెళ్లి వారిని.
కృష్ణారావు గారి ఇంటికి వెళ్లేటప్పటికి ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకుల పందిరి వేసి పచ్చటి మావిడాకులు తోరణాలు కట్టి నేలంతా శుభ్రంగా అలికేసి అందంగా ముగ్గులు పెట్టి నేల బల్లలు వేసి అరిటాకులో ఇడ్లీ కారప్పొడి పెసరట్టు రెండు రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మలు చేతిలో తాటాకు బట్టలతో అటు ఇటు తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య. కాఫీలు గాని టీలు గాని ఎక్కడ లేవు. పాలు తప్పితే చెరుకు రసం ఈ రెండింటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్యగారి బంధువులు మెచ్చుకున్నారు. “పెళ్లి వేదిక చూద్దురుగాని రండి” అంటూ మగపెళ్లి వారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే తూర్పుముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు.. చుట్టూ అరటి గె లతో ఉన్న అరటి మొక్కలు ఆ నాలుగు రాటలకి కొబ్బరి ఆకులు లోపల మామిడి తోరణాలు నాలుగు పక్కల మల్లెపూల దండలు అబ్బా ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక. మధ్యలో ట్యూబ్ లైట్లుతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడ అధునాతన అలంకరణలు లేవు. కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు.
సాయంకాలము ఈ మల్లెపూలు దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు.
పురోహితులనుకుంటాను ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే “అయ్యా మళ్లీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటల మీద కూర్చోవాలని మగ పెళ్ళి వారికి చెప్పండి” అంటూ తొందర పెట్టాడు. “నమస్కారం నా పేరు రఘురామయ్య నేను పెళ్ళికొడుకు తండ్రిని మీది ఏ ఊరు?” అంటూ ప్రశ్నించారు. “అయ్యా మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు” అంటూ చెప్పుకుంటూ వచ్చారు.
“సరేనండి మేము తయారయ్యే వస్తాం” అంటూ మగపెళ్లివారు వెళ్లిపోయారు. కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాల తోటి భజంత్రీలు తోటి పెళ్ళికొడుకుని పల్లకిలోను మగపెళ్లివారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకుని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరి లోనే కెమెరా పెట్టుకుని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్ళికొడుకును వెనకకు తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది.
ఈ మధ్యకాలంలో ఇంత సేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడ చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమ యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది.
ఈలోగా కృష్ణారావు గారు భార్య మగపెళ్లి వారిని “వంటలు రెడీగా ఉన్నాయని భోజనాలు చేయడానికి రండి” అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. ఉదయం లాగే నేల బల్లలు వేసి ఎదురుగుండా అరిటాకులో పప్పు టమాట కొత్త అవకాయి, గుత్తి వంకాయ కూర, పనసపొట్టు కూర, బూరెలు, పులిహార, ముక్కల పులుసు, అప్పడాలు వడియాలతో ఆకు అంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టి ఉన్నాయి. కొమ్ము చెంబుతో నెయ్యి పట్టుకుని మడి కట్టుకున్న వంట బ్రాహ్మలు పెళ్లి వారికి వడ్డనలో మునిగిపోయారు. కృష్ణారావు గారు భార్య ప్రతి వారి దగ్గరికి వచ్చి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్ళివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడ అధునాతనమైన వంటలు గానీ మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే తృప్తిగా భోజనం చేసి మగపెళ్లి వారు ఆనందంగా విడిదిలోకి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు తమలపాకులు వక్కపొడి సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్ళివారికి అందించారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంది.
సాయంకాలం 6:00 కల్లా ఎదురు సన్నాహాలని మధ్యాహ్నం పూట ఫలహారాలు విడిదిలోకే తీసుకొస్తామని రాత్రి 7 గంటలకు అలా పెళ్లి పీటల మీద కూర్చోవాలని ఒకపక్క పెళ్లి అవుతుంటే మరొక పక్క భోజనాలు ఏర్పాట్లు చేసుకుంటామని రఘురామయ్యగారికి చెప్పాడు కృష్ణారావు గారు.
పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగపెళ్లి వారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి ఆడపడుచులను ఇత్తడి బిందువులతో సత్కరించి శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లి వారిని ఒకరినొకరు సత్కరించుకుని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహం కార్యక్రమం ముగించి భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు.
శనివారం నియమం ఉన్నవాళ్లు టిఫిన్లు కాని వాళ్ళు భోజనాలు ఉదయం లాగే అరిటాకులలో నేల బల్లల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కానిచ్చారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర, అరటికాయ వేపుడు కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా, అరటికాయ బజ్జి, గడ్డ పెరుగులు తయారు చేయడంలో ఇందుపల్లి వంటవాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగ లోకి మామిడిపండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనమా మజాకా. వంట వాళ్ళు అటు ఇటు వడ్డన చేస్తూ నాలుగైదు గాజు గ్లాసులు పగలగొట్టేశారు.
ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి ఫలహారాలు భోజనాలకి అరటి ఆకులు, మంచినీళ్లకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్ద పీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. డైనింగ్ టేబుళ్లు షామియానాలు కుర్చీలు అసలు లేవు.
ఎందుకంటే షామియనాలు ఈ మధ్యన చావుకి పెళ్లికి కూడా అవే వాడేస్తున్నారు. అదీ కృష్ణారావు గారు భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగపెళ్లి వారు అనుకున్నారు. ఇక పెళ్లిసందడి మొదలైంది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యథావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా సంతోషంగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసే వాళ్ళు మగపెళ్లి వారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తప్ప ఇంకెవరికి ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే అయినవిల్లి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లి వారిని సాగనంపారు.
రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతు ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని చాలా సంతోషంగా ఉందని ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని ఆదర్శవంతమైన వివాహం అని పదేపదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు టీవీలు వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠం వేసే ఆ జిల్లా అధికారులు కృష్ణారావు గారిని రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు.