మనిషి ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో చెప్పే నవల ‘పితృత్వమ్’

0
3

[శ్రీ డి.ఎన్. సుబ్రమణ్యం రచించిన ‘పితృత్వమ్’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీమతి పి. పద్మజారాణి.]

[dropcap]‘పి[/dropcap]తృత్వమ్’ – ఈ పదం మన కండ్లల్లో పడగానే ఒక్కసారిగా కండ్లు పెద్దవి చేసి చూస్తాం. అంతేకాదు.. మనం చూసిన ఆ పదం మాతృత్వమా? లేక.. పితృత్వమా?  అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మాతృత్వం గురించి ఈ లోకంలో సర్వకాల సర్వావస్థలలో ప్రస్తావన జరుగుతుంది. కానీ పితృత్వానికి ఆ ప్రాధాన్యత సహజంగానే మన సమాజంలో లేదు.

మరి.. అలాంటిది ‘మాతృత్వమ్’ స్థానంలో ‘పితృత్వ’ పదాన్ని పొరపాటున చూసామా..? లేదా అచ్చు తప్పు పడిందా.. అని ఒక్క క్షణం మనల్ని మనమే నమ్మలేని పరిస్థితి చోటు చేసుకుంటుంది.

ఫరవాలేదు కండ్లు నులుముకొని చూసినా కానీ, అది ‘పితృత్వమ్’ గానే కనిపిస్తోంది కాబట్టి.. చూసేది నిజమే అన్న ధృవీకరణకు వస్తాము.

ఆ తర్వాత పితృత్వం పైన ఓ నవలనా! అనే ఆసక్తితో పుస్తకాన్ని తెరుస్తాం. తెరిచే ముందు కూడా ఏవో ఏవో ఆలోచనలు మనలో వస్తాయి. ఒక్కసారి పుస్తకం తెరిచామో లేదో, చివరి పేజీ దాకా ఆగకుండా చదివేస్తాం. సుబ్రహ్మణ్యం గారి రచన శైలి అలాంటిది మరి! ఏ అంశాన్ని అయినా అరటిపండు వలిచి చేతిలో పెట్టిన చందంగా పొందికగా రాస్తారు. కథ చదివిన కొద్ది నిమిషాలలోనే ఆ కథలోకి వెళ్లిపోతాం. మన కండ్ల ముందే ఆ కథ జరుగుతున్నది అన్న భావన మనల్ని చుట్టుముడుతుంది.

‘పితృత్వమ్’.. ఈ సీరియల్‌కి సుబ్రహ్మణ్యం గారు పెట్టుకున్న పేరు చదవగానే ఒక తండ్రి ఆరాటం, వాత్సల్యం తన బిడ్డ పట్ల మమకారం మనకు ప్రస్ఫుటంగా అర్థం అవుతుంది.

సరే.. ఇక కథ విషయానికి వస్తే, కథానాయకుడు విశ్వనాథ్, కాలు విరిగి బోన్ ఇన్ఫెక్షన్‌కు గురయిన తన కాలికి క్యాన్సర్ సోకి తనకు ఏమైనా అవుతుందేమో అనే భయంతో, ఏదైనా అయ్యేలోపే తన కుటుంబానికి అన్నీ సమకూర్చాలని తాపత్రయపడుతుంటాడు. అందుకు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా భార్య కోసం, కొడుకు కోసం ఎంతో కష్టపడుతుంటాడు.

విరిగిన తన కాలితో ఇబ్బంది పడుతూనే, భార్యకి అన్నివిధాలా సహాయం చేస్తూనే ఎంతో గౌరవప్రదమైన తన ఉద్యోగంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడు.

అతని ప్రతి పనిలోనూ, కుటుంబం పట్ల తన బాధ్యత, ప్రేమ, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది‌.

విశ్వనాథ్ కి చాలా ఆలస్యంగా ఒక వారసుడు పుడతాడు.. ఆ బిడ్డ పేరు కాశీనాథ్. విశ్వనాథ్ దంపతులకు ఆ బిడ్డే సర్వస్వం.

అయితే ఓ రోడ్డు ప్రమాదంలో అయిన బోన్ ఇన్ఫెక్షన్ కారణంగా విశ్వనాథ్ కొన్ని రోజులు ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తుంది. అలా మంచంలో ఉండి కూడా తన భార్యకు తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు.

సాధారణంగా కథలూ నవలలూ ఆడవారు చదువుతారు. కానీ ఈ నవల మాత్రం ముఖ్యంగా చదవాల్సింది మగవారే. ఏదో ఉదయం పోయి సాయంత్రానికి ఇంటికి చేరి కాళ్ళూపుకుంటూ టీవీకి అతుక్కుపోయే మగవారికి, ఇంట్లో ఆడవారు ఎంత కష్టపడుతున్నదీ అర్థం కాదు. అలాంటి వారు ఈ నవల చదివితే కొంతయినా మార్పు రావచ్చు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాత్ర గీతా మాథుర్ గారిది. ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ భాష కాదు, ఎక్కడ నుండో ఉద్యోగ రీత్యా వచ్చి ఇక్కడ స్థిరపడి పోతారు. గీతమాథుర్ విశ్వనాథ్ కుటుంబానికి మంచి సన్నిహితులు, ఆప్తులు. విశ్వనాథ్ కి తన అవసరం ఉందని గ్రహించిన గీతగారు రిటైర్మెంట్ తర్వాత, విశ్వనాథ్ కుటుంబానికి అండగా ఉండాలనుకొంటారు.

రిటైర్మెంట్ తరువాత తన దగ్గరకు (అమెరికా) వచ్చి ఉండమని తన కూతురు ఎంతో ప్రాధేయపడినా కూడా తన కూతురు దగ్గరకు వెళ్ళకుండా ఇక్కడే ఉండి పోవాలనుకుంటారు.

అలాగే ఉంటారు కూడా, కాశీని తన సంరక్షణలో పర్యవేక్షిస్తూ, విశ్వనాథ్ కుటుంబానికి అండగా, దన్నుగా నిలబడి, ఒక సలహాకైనా సంప్రదింపుకైనా ఆ దంపతులకి పెద్ద దిక్కు అవుతారు. ఇలా ఉండటం ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఆడ-మగ మధ్య స్నేహానికి, అనుబంధానికి పెద్దపీట వేసి చిత్రీకరణ చేసిన తీరు అద్భుతం. గీతామాధుర్ గారి రిటైర్మెంట్ రోజున ఆవిడకు పాదపూజ చేసి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు విశ్వనాథ్ దంపతులు..

అలా సాగిపోతున్న సమయంలో రాంగ్ కాల్ ద్వారా శృతకీర్తి పరిచయం అవుతుంది విశ్వనాథ్‌కి. శాడిస్ట్ భర్తను వదిలి, తన చిన్నారి కొడుకుతో తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. చాలా అందమైన, తెలివైన, బాగా చదువుకున్న, చలాకీ పిల్ల శృతకీర్తి. విశ్వనాథ్ కాలికి అయిన గాయానికి సంభందించిన మూలికలు తన ఊరి రామ్ కాకా దగ్గర నుండి తెచ్చి ఇస్తుంది ప్రతివారం. అలా పరిచయం పెరిగి స్నేహం కాస్తా విశ్వనాథ్ మీద ఇష్టంగా మారుతుంది.

అది గ్రహించిన విశ్వనాథ్, కీర్తికి తను చేస్తున్న తప్పేమిటో తెలియచెప్పి, డాక్టర్ అయిన తన స్నేహితుడుని ఇచ్చి పెళ్ళిచేసి శృతకీర్తి జీవితాన్ని ఒక దారిలో పెడతాడు.

ఇందులో నాకు నచ్చిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే విశ్వనాథ్ తన లైబ్రరీకి వచ్చిన పుస్తకాలు చెద పట్టకుండా చేసిన ప్రయోగం అత్యద్భుతం. అదేమిటి అనేది నేను ఇక్కడ రాయను, ఎందుకంటే చదివితేనే బాగుంటుంది, కాబట్టి తప్పకుండా అందరూ ‘పితృత్వమ్’ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

తన కాలికి అయిన గాయం క్యాన్సర్ గా పరిణమించే ప్రమాదం ఉందనే అపోహతో, తను ఉన్నప్పుడే తన కుటుంబానికి అన్నీ సమకూర్చాలనీ, వారి భవిష్యత్తుకు ఏ లోటు లేకుండా చేయాలని అహర్నిశం తపిస్తాడు విశ్వనాథ్. అందుకు తగిన ప్రయత్నాలు కూడా చేసి తన తదనంతరం తన భార్య, బిడ్డకు ఏ లోటు లేకుండా ఏర్పాటు చేస్తాడు.

మీరు నాకు అప్పచెప్పిన పని నేను చేస్తాను, అందుకుగాను మీరు నాకు డబ్బులు ఏమీ ఇవ్వొద్దూ, ప్రతిఫలంగా నా తదనంతరం నా భార్యకి, బిడ్డకి మోరల్ సపోర్ట్‌గా ఉంటారా.. అని తెలిసిన వారందరినీ అడుగుతుంటే.. హృదయం ద్రవించిపోతుంది చదువుతున్న వారికి. చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకు.

అయితే తన డాక్టర్ ఫ్రెండ్ చొరవతో అన్ని టెస్ట్ లు చేయించుకొని, క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేవని తెలుసుకొని ఊరటచెందుతాడు విశ్వనాథ్. పరిస్థితులు తారమారయితే బంధువులు ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా చక్కగా రాసారు, ఆయా వ్యక్తులుకి ఇది చదివినప్పుడు కష్టం కలిగితే కలిగి ఉండొచ్చు గాక.

ఏ మనిషికైనా బాధల్లో ఉన్నప్పుడే అయిన వారి అండ, ఆదరణ అవసరం ఉంటుంది. అంతా బాగున్నప్పుడు ఎవరైనా వస్తారు, ఉంటారు, కష్టాలలో ఉన్నప్పుడే మనిషికి మనిషి అవసరం ఉంటుంది, అది గుర్తించి మసలుకునేవాడే మనిషిగా పరిగణించబడతాడు.

ఏదైనా సహాయం చేస్తేనో, సలహా ఇస్తేనో ఎక్కడ తమను మించిపోతాడేమో అనుకుని, అవి తప్ప మిగతా విషయాలు, సరదా విషయాలు మాట్లాడే బంధు, రాబందువులే ఎక్కువ మన సమాజంలో.

అయితే తన కాలిగాయానికి ప్రతివారం తెప్పించుకుంటున్న మూలికలలో ఒకటి వేరుతో సహా వస్తే, దానిని కుండీలో నాటుతాడు విశ్వనాథ్, అది మంచి మొక్కగా ఎదిగి ఆకులు వేస్తుంది. అది చూసిన విశ్వనాథ్ మనసులో ఓ ఆలోచన పుడుతుంది, ఆ ఆలోచన పర్యవసానమే స్వదేశీయ వైద్య ప్రచారక పరిషత్. అందరికీ మూలికా వైద్యం అందచేయాలనే సదుద్దేశంతో పరిషత్ ఒకటి ఏర్పాటు చేస్తాడు,

ఇందులో తన శ్రమని గుర్తించి ప్రోత్సాహించి, తను ఉన్నత స్థాయిలోకి రావడానికి కారణమైన లింగారెడ్డి గారు, గీతా మాథుర్ గారు శరత్, శృతకీర్తి అందరినీ భాగస్వాములుగా చేసి రామ్ కాకా చేతుల మీదుగా అవసరమైన వారందరికీ తగిన వైద్యం అందజేయాలనుకుంటాడు. అదేమిటి అనేది తెలియాలంటే ‘పితృత్వమ్’ చదివితేనే బాగుంటుంది అని నా అభిప్రాయం.

ఎంతో కాలం ఎదురు చూసిన అనంతరం పొందిన పసిపిల్లాడిని ఎత్తుకుని ముద్దాడాల్సిన ఒక తండ్రి, తను సరిగా ఎత్తుకోలేకపోతే, ఆ బిడ్డడికి ఏమైనా అవుతుందేమోనని దూరంగా ఉండి చూసి మురియడంతోనే తృప్తి పడి, ఆ తర్వాతి పరిణామాల కారణంగా, ఆ పసికందును సాకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పక చదవాలి.

బంధుమిత్రులందరికీ తలలో నాలుకలా మెదిలి, వారివారి అవసరాలలో ఆసరాగా నిలిచిన ఓ దంపతులు.. అవసర సమయాన అందరూ ఉండీ, ఒంటరిగా ఆ పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలియాలి అంటే ఈ నవల చదవాలి.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ‘ఒక మనిషి ఎలా ఉండాలి..ఎలా ఉండకూడదు’ అనేది తెలియాలంటే ఈ నవల తప్పక చదవాల్సిందే.

~

నాకు ఇష్టమైనవి ‘కన్నీళ్ళు!’

నా గురించి ఎందరు తమ కన్నీటిని రాల్చారు అన్నది ‘నన్ను గురించిన అంచనా’ నాకు తెలియజేస్తుంది.

నేను వివిధ సందర్భాలలో రాల్చిన కన్నీరు.. ‘నా హృదయ ఆర్ద్రత’కు కొలమానంగా నిలుస్తుంది.

‘వర్షపాతం’ లాగా ‘బాష్పపాతం’ ప్రతి మనిషీ కొలువ గలిగిననాడు అందరమూ ఆనందంగా ఉండగలుగుతామన్నది నా ఫిలాసఫీ!

~

కవర్ పేజీ వెనక భాగంలో రచయిత రాసిన మాటలివి! ఎంత గొప్ప ఫిలాసఫీ!

అంగాంగవర్ణనలతో, తాత్కాలికంగా మనిషిని కిర్రెక్కించే నవలలు వస్తున్న ఈ రోజుల్లో.. మానవసంబంధాల తీరుతెన్నులను ఎత్తిచూపి, మనిషిని, సమాజాన్ని ఒక సరైన మార్గంలో పయనించేందుకు ఆలోచన రేకెత్తించే ‘పితృత్వమ్’ నవల.. ఆవిష్కృతం కావడం ఓ అద్భుతమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా రచయిత డి.ఎన్. సుబ్రమణ్యం.. నా స్నేహితుడు అని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది.

***

పితృత్వమ్ (నవల)
రచన: డి.ఎన్. సుబ్రమణ్యం
పేజీలు: 274
వెల: ₹ 300
ప్రతులకు:
రచయిత
(రూ. 50/- పోస్టేజీ అదనం) మొత్తం : రూ.350/-లు
మీ చిరునామాతో సహా
ఫోన్ నెంబర్ 9848885411కు
Google pay/Bhim/ Paytm (లేక ఇతర UPI ల ద్వారా)
పంపి మీ కాపీ POST/Courier ద్వారా పొందవచ్చు
dnsubramanyam717@gmail.com
ఆన్‍లైన్‍లో
https://books.acchamgatelugu.com/product/pitrutvam/?sku_id=50013873

~

శ్రీ డి. ఎన్. సుబ్రమణ్యం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-d-n-subramanyam/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here