ఫస్ట్ లవ్-13

1
4

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హసంతి తన గదిలో కూర్చుని ఫోన్‍లో యూ-ట్యూబ్‍లో వస్తున్న ఓ ప్రోగ్రామ్ చూస్తుంటూంది. వేలెంటైన్స్ డే సందర్భంగా ఆ యాంకర్ అక్కడి వచ్చిన జంటలని ప్రశ్నలు వేస్తుంటాడు. అక్కడ ఉన్న కార్తీక్, మృదులకి ముందుగా వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ చెప్పి, మీ ప్రేమ గురించి చెప్పండి అంటాడు యాంకర్. కార్తీక్‍ని చూసిన ఉత్సాహం, అతని పక్కన మృదులని చూడగానే  నీరుగారిపోతుంది హసంతిలో. తన ప్రేమ గురించి కవితాత్మకంగా చెప్తాడు కార్తీక్. బాధతో, చిరాకుతో ఆ ప్రోగ్రామ్ ఆపేసి, ఫోన్ పక్కన పడేస్తుంది హసంతి. కానీ ప్రోగ్రామ్‍లో మృదుల తన లవర్ కాదు, తాను హాసంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని కార్తీక్ చెప్పిన మాటలు హసంతి వినదు. గోడ మీద ఉన్న ఓ ఫోటోని తీసి గుండెలకి హత్తుకుంటుంది. అది గౌతమ్, హసంతిల చిన్నప్పటి ఫోటో. తమ బాల్యపు ఆటలని, అల్లరిని గుర్తు చేసుకుంటుంది. ఇక కార్తీక్‍ని మరిచిపోవాలని, వెంటనే గౌతమ్‍ని కలవాలని అనుకుని, అతన్ని సర్‍ప్రైజ్ చెయ్యాలనుకుని ఫోన్ చేయకుండా బయల్దేరుతుంది. మృదుల కార్తీక్‍ని హసంతి ఎవరని అడిగితే, జరిగినదంతా చెప్తాడు. క్యాబ్‍లో కూర్చున్న హసంతి – గౌతమ్‍ని లవర్‍గా, భర్తగా చూడగలనో లేదూ అనుకుంటుంది. హసంతి వెళ్ళేసరికి గౌతమ్ కిటికీ దగ్గర నిలబడి ఫోన్‍లో మాట్లాడుతూంటాడు. కొన్ని క్షణాల తరువాత వెనక్కి తిరిగి హసంతిని ఆశ్చర్యపోతాడు. గత అనుభవాల దృష్ట్యా ఆమెతో కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతాడు. హసంతి చెప్పేది వినడు. దాంతో హసంతి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంతలో అక్కడికి రఘురాం వస్తాడు, హసంతిని చూసి ఎప్పుడొచ్చావని అడిగితే, చాలా సేపయింది మావయ్యా, బయల్దేరుతున్నానంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన కుదిరినట్టు లేదని అనుకుంటాడాయన. ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]ర్తీక్ రూంలో నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. ఫోన్ రింగ్ అవుతోంది.

అయినా నిద్ర లేవలేదు కార్తీక్. మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగుతోంది. పది నిమిషాల తర్వాత బద్ధకంగా లేచి నిద్రమత్తులో.. “హలో!” అన్నాడు.

“ఏంటి? ఇంకా నిద్ర లేవలేదా?”

“ఊఁ.. ఏంటో చెప్పు మృదులా!”

“నీ వాట్సాప్‌కి ఒక లొకేషన్ షేర్ చేశాను. పది నిమిషాల్లో అక్కడికి రా!” అంది.

“పది నిమిషాల్లోనా?! ఫ్రెష్షప్ అవ్వాలిగా!”

“అదంతా నాకు తెలియదు. వచ్చేయ్. నువ్వు వస్తున్నావ్ అంతే!” అని పెట్టేసింది.

కార్తీక్ వాట్సప్‌లో ఆమె పెట్టిన లొకేషన్ చూసి లొకేషన్లోనే 20 నిమిషాలు చూపిస్తోంది. ‘10 నిమిషాల్లో రమ్మంటే ఎలా వెళ్లాలి?’ అనుకుంటూ వాష్ రూమ్‌కి వెళ్ళాడు నిద్రమత్తులోనే.

***

డి.ఎల్.ఎఫ్. క్యాంపస్ ఎదురుగా ఉన్న శ్రీరామ్ రెస్టారెంట్ దగ్గర నిలబడి మృదులకి కాల్ చేసాడు కార్తీక్.

“ఏయ్ పైత్యం! లోకేషన్ అంటే ఇక్కడా! ఆ మాట చెప్పొచ్చుగా”

“లీవ్ లోనే ఉన్నావుగా! ఇక్కడంటే రావేమోనని”

“కొంపదీసి శ్రీరామ్‌ని కలుస్తావా? ఏంటి?”

“అవును.. అతనికేగా హసంతి వివరాలు తెలిసింది”

“ఏయ్! నా మాట విను, అతను చెప్పడు”

“అవన్నీ నీకు ఎందుకురా! మై హూనా!” అని మృదుల ఫోన్ ఆఫ్ చేసి కౌంటర్ వైపు వెళ్తుంటే..

‘అయ్యో! మళ్లీ ఏం పెంట చేస్తుందో! అసలే ఆ శ్రీరామ్ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం’ అనుకుని శ్రీరామ్‌కి కనిపించకుండా గోడ పక్కకెళ్లాడు.

మృదుల కౌంటర్‌లో ఉన్న శ్రీరామ్ దగ్గరికి వచ్చి

“హలో సార్! ఐ యాం మృదుల. నేను హసంతి ఫ్రెండ్‌ని. తనని కలవాలి. తన ఫోన్ నెంబరు, అడ్రస్సు మిస్ అయ్యాయి. కొంచెం చెప్తారా!”

“హసంతి ఎవరు? అయినా ఆమె వివరాలు నా దగ్గర దొరుకుతాయని ఎవరు చెప్పారు?”

“తనే లాస్ట్ ఇయర్ చెప్పింది”.

“నేనీ రెస్టారెంట్ మొదలుపెట్టే ఆరు నెలలు కూడా కాలేదు. ఛాన్సే లేదు. ఎవరో నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు” అని చుట్టూ చూసాడు.

దూరంగా కార్తీక్ కనిపించాడు.

“ఓ.. నువ్వు కార్తీక్ బినామీవా?” అన్నాడు.

సరిగ్గా ఆ సమయంలో మృదుల ఫోను వైబ్రేట్ అయింది. ఫోన్ ఎత్తకుండా శ్రీరామ్‌తో  “కార్తీక్ ఎవరు?” అంది మృదుల.

“అడుగు.. ఫోన్లో లైన్‌లో ఉన్నాడు. మాట్లాడు” అన్నాడు శ్రీరామ్.

వెంటనే ఫోన్ కట్ చేసింది

“చూడమ్మా! కార్తీక్ నాకు తెలుసు. ఇంతకు ముందే అతనికి చెప్పాను. హసంతిని మర్చిపొమ్మని. దయచేసి వెళ్ళిపోండి”

మృదుల చిరాగ్గా వెనక్కి వచ్చింది.

“అతను ఏమంటాడో నాకు తెలుసు. అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చావు. హసంతి గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి శ్రీరామ్. సో అతను చెప్పకపోతే ఆమెను కనుక్కోవడం కష్టం. ఎనీ వేస్ థాంక్స్ ఫర్ ది ఎఫెక్ట్ మృదులా” అన్నాడు కార్తీక్.

“థాంక్స్! ఎందుకురా! నా క్లాస్మేట్‌వి. ఈ మాత్రం చేయటం నా కనీస బాధ్యత.”

“సర్లే జాగ్రత్తగా వెళ్ళు” అని ఆటో ఎక్కించాడు.

***

హసంతి ఇంటికి వచ్చింది. తన గదిలో అద్దం ముందు కూర్చుని ఏడుస్తూ..

“హలో! మనస్సాక్షీ! ఎక్కడ దాక్కున్నావు? నాకు ఇప్పుడు అర్జెంటుగా నీతో మాట్లాడాలని ఉంది. బయటికి రా!” అంది.

“……….”

“నీకూ చులకన అయిపోయానా!? కనిపించకుండా మొహం చాటేస్తున్నావు?”

వెంటనే అద్దంలో హసంతి ప్రతిరూపం నిలబడి..

“ఏంటో చెప్పు” అంది.

“గౌతమ్ ఇంత హార్ష్‌గా ఎప్పుడు మాట్లాడలేదు.”

“ఏం మాట్లాడాడు?”

“చాలా కోపంగా, అసహనంగా మాట్లాడాడు”

“అసలు అతన్ని ఎందుకు? చూడటానికి వెళ్లావు?”

“యూ – ట్యూబ్ ఛానల్లో కార్తీక్ మరో అమ్మాయితో ఐ లవ్ యు చెప్పేసరికి, అతని మనసులో నాకు ప్లేస్ లేదనుకుని, గౌతమ్‌ని కలవడానికి వెళ్ళాను.”

“అసలు నీ ప్రాబ్లం కార్తీకా? గౌతమా?”

“వాళ్ళిద్దరూ”

“అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు?”

“ఇంట్లో వాళ్ళు గౌతమ్‌ని చేసుకోమంటున్నారు”

“నీకు గౌతమ్‌తో పెళ్లి ఇష్టం లేదా?”

“నా బాధ నీతో పంచుకోవాలని పిలిస్తే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు”

“సరిగ్గా విను, కన్ఫ్యూషన్ క్లియర్ అవుతుంది. నీకు కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలనిపిస్తే.. గౌతమ్ గురించి ఆలోచించకు. పెద్దవాళ్ళు చెప్పినట్టు గౌతమ్ కావాలనుకుంటే, కార్తీక్‌ని మర్చిపో”

“ఆహా ఏమి ఐడియా ఇచ్చావు?”

“ఏం బాగాలేదా?”

“నువ్వు చెప్పిన రెండూ నావల్ల కాదు. అందుకే నిన్ను సలహా అడుగుతున్నాను”

“కార్తీక్‌ని మనసులో ఉంచుకుని, గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటానని అనటం కేవలం నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నట్లే. అది నీ నటన. నువ్వు సంతోషంగా ఉండలేవు. గౌతమ్‌ని సంతోషంగా ఉంచలేవు”

“ఈ రెంటిలో ఏది కరెక్టో నాకు అర్థం కావటం లేదు”

“ముందు వీళ్ళిద్దరిలో నీకు ఎవరు కావాలో నిర్ణయించుకో. ఆ తర్వాత పెద్దవాళ్ళు కుదిర్చిన గౌతమ్ తోనా! నువ్వు ప్రేమించిన కార్తీక్ తోనా! నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్” అని మనస్సాక్షి మాయమైంది.

***

కవిత హాల్లో కూర్చుని టీ.వీ సీరియల్ చూస్తోంది. ఫోన్ మోగుతుంటే చూసి

“హలో! అన్నయ్యా!” అంది.

“అమ్మా! కవితా! నేను రఘురాం.”

“బాగున్నారా! అన్నయ్యా!”

“బాగున్నాం. హసంతి ఎలా ఉంది?”

“గౌతమ్‌ని కలవడానికి వెళ్ళింది అన్నయ్యా”

“కవితా! నీతో ఓ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. గౌతమ్, హసంతిల పెళ్లి నా భార్య కల. అది నీకూ తెలుసు. కానీ ఈ పెళ్లి వలన వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకూడదు”

“ఇప్పుడు ఇంకా కొత్త సమస్యలు ఏమి వస్తాయి అన్నయ్యా? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అన్ని సక్రమంగానే జరుగుతాయి. మీరేం దిగులు పడకండి”

“గౌతమ్, హసంతీల మధ్య పెళ్లి చేసుకోబోతున్నామన్న ఉత్సాహం, ఆరాటం కనిపించడం లేదమ్మా”

“అవునన్నయ్యా! ఎంగేజ్మెంట్ అయిన దగ్గర్నుంచి హసంతి కూడా అదోలా ఉంటోంది”

“నిజమేనమ్మా! చాలా కాలం తర్వాత చూసుకున్నారు కదా! ఎంతైనా కొత్తగానే ఉంటుంది కదా! వీళ్ళిద్దరికీ ఎంత తొందరగా పెళ్లి చేస్తే.. అంత మంచిది అనిపిస్తోంది”

“అవునన్నయ్యా”

“ఆ మాటే చెబుదామని ఫోన్ చేశాను. సరే ఉంటానమ్మా”

***

కార్తీక్, మృదుల టెర్రస్ మీద కూర్చొని లాప్‌టాప్ చూస్తున్నారు.

“ఆమె పేరు హసంతి అన్నావు కదా! ఎలా ఉంటుంది? ఎర్రగా, ఎత్తుగా, లావుగా, సన్నగా, నల్లగా, అందంగా ఉంటుందా?”

“తెలియదు”

“పోనీ ఏ ఏరియాలో ఉంటుందో? తెలుసా?”

“నాకేమీ తెలియదు మృదులా. ఆమె వివరాలు శ్రీరామ్‌కే తెలుసు”

“ఏమీ తెలియకుండా ఎలా ప్రేమించావురా? మీడియా ముందు నిలబడి హసంతిని ప్రేమించానని చెప్పావు. ఏ ప్రయత్నం చేయకుండా ఎలా ఆమెను వెతికి పట్టుకుంటావు? ఇవ్వాళ మీసాలు మొలవని వాడు కూడా చదువు కంటే ముందు ఫియాన్సీ వివరాలు కంప్యూటర్ కంటే వేగంగా చెప్పేస్తున్నాడు.”

కార్తీక్ అమాయకంగా చూశాడు.

“ఏదైనా అంటే ఇలా అమాయకంగా చూస్తావు. ఎలా బాగుపడతావో! ఏంటో! ఫీల్ అవ్వకు.. రా! పేరు తెలుసు కదా! దాంతో ట్రై చేద్దాం”

“ఎలా తెలుస్తుంది మృదులా? మన దగ్గర చిన్న క్లూ కూడా లేదు. ఒకవేళ అలాగే కనుక్కున్నా.. ఆమే హసంతి అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఆమెని చూడలేదు, మాట్లాడలేదు.”

“మనకు దక్కాలని రాసిపెట్టి ఉంటే, ఎప్పటికైనా దక్కే తీరుతుందని అంటావు కదా! నువ్వు ప్రయత్నం చెయ్యకుండా ఎలా దక్కుతుంది!?”

“నాకైతే నమ్మకం లేదు”

“నిరుత్సాహపడకు రా! మన ప్రయత్నం మనం చేద్దాం.” అని బయలుదేరింది మృదుల.

***

గౌతమ్ ఫ్రెండ్ డాక్టర్ నరేష్‌కి ఫోన్ చేశాడు.

“హలో గౌతమ్! చెప్పరా! కాబోయే పెళ్లి కుమారుడా! ఎలా ఉన్నావు? కాదు.. కాదు.. ఎలా ఉన్నారు?” అన్నాడు.

“సాయంత్రం కలుద్దామా!”

“నేను రానా? నువ్వు వస్తావా?”

“మన అడ్డా ఉందిగా!” అన్నాడు గౌతమ్.

“సరే! ఓ.కే” అన్నాడు.

ఫోన్ పక్కన పెట్టబోయి హసంతికి కాల్ చేద్దామనుకున్నాడు గౌతమ్. కానీ అంతలోనే హసంతి అని వెళ్ళిన మాటలు గుర్తొచ్చాయి. కనుబొమ్మలు ముడిచి మెల్లగా జ్ఞాపకం తెచ్చుకున్నాడు.

‘నేను నీతో మాట్లాడాలి గౌతమ్! ఒక్క నిమిషం నేను చెప్పేది సహనంగా విను. ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే.. అని కూల్‌గా ఆమె అంటున్నా తనే వినిపించుకోకుండా, ఆమె మాటలు వినకుండా, ఆమెను మాట్లాడనీయకుండా అడ్డుపడ్డాడు. ఆమె చెప్పాలనుకున్నది చెప్పనీయకపోతే ఆమె ఆలోచనలు, భావాలు, తనకు ఎలా అర్థమవుతాయి? ఛా! ఫుల్‌లా బిహేవ్ చేశాను’ అనుకుంటూ బయలుదేరాడు గౌతమ్.

***

గదిలో కూర్చుని కార్తీక్ ఫోన్లో ఫేస్‌బుక్ చూస్తున్నాడు. అందులో ఒక కవిత కనిపించింది.

“నిన్ను చూసే వరకు తెలియదు,

హృదయంలో కలిగిన స్పందన ఇంత బాగుంటుందని..

నీకు మనసు ఇచ్చేవరకు తెలియదు,

నా మనసంతా నీకోసం ఇన్నాళ్లు ఖాళీగా ఉందని..

నీ నవ్వు చూసే వరకు తెలియదు,

నీ నవ్వు వాడిపోయిన నవ్వులకైనా జీవం పోస్తుందని..

నీ మాట వినే వరకు తెలియదు,

నా రాతి గుండెలో సైతం తడి ఉందని అది ప్రేమిస్తుందని..

అందుకే నేను ఎప్పటికీ నీకే సొంతం”

వెంటనే లేచి హసంతి పంపిన కవితలున్న డైరీ చూశాడు. హసంతే కచ్చితంగా ఈ పోస్ట్ పెట్టి ఉంటుంది అనుకున్నాడు.

అంతే! అతని వేళ్లు వేగంగా “హాయ్ హసంతీ! దిస్ ఈజ్ కార్తీక్!” అని టైప్ చేసి పోస్ట్ చేశాడు.

హిమాలయ శిఖరం ఎక్కినంత సంతోషంలో హసంతి కళ్లెదుట ఉన్నట్టే ఫీల్ అయ్యాడు.

వెంటనే మృదులకి ఫోన్ చేశాడు.

***

ఆ సమయంలో మృదుల రెస్టారెంట్లో శ్రీరామ్ దగ్గరికి వచ్చింది. ఆమెను చూడటంతోనే

“కార్తీక్‌ని కూడా తీసుకొచ్చావా! ఆమె గురించి నాకేమీ తెలియదు. డోంట్ డిస్టర్బ్ మీ” అని తన పని తను చూసుకుంటుంటే..

“మీతో రెండు నిమిషాలు మాట్లాడాలంటే అర్థం చేసుకోరేంటి?” అంది కోపంగా.

ఏమనుకున్నాడో ఏమో, “త్వరగా చెప్పు. హసంతి గురించి తప్ప..”

“అసలు ఈ గొడవ అంతటికీ కారణం మీరే. కార్తీక్‌ని ఆ అమ్మాయి ప్రేమిస్తోందనీ, ఆమె ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ అతనికి ఇచ్చి, వాడిలో లేనిపోని ఆశలు కల్పించారు. ఇప్పుడు నాకు తెలియదు, నేను చెప్పను అని తప్పించుకోవటం సరైన పధ్ధతి కాదు. చేతనైతే వాళ్ళిద్దర్నీ కలపండి. లేదంటే ఆమె అడ్రస్సు, ఫోన్ నెంబర్ ఇస్తే.. మా తిప్పలు మేము పడతాం. ప్లీజ్!” అంది.

మృదుల వినయంగా అడిగేసరికి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్.

“సారీ! శ్రీరామ్ గారూ! కార్తీక్ భాధ చూడలేక మళ్లీ మళ్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. వాడికి ఫ్రెండ్స్ తప్ప అయిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఇచ్చినట్టు ఎవరికీ చెప్పను. ప్లీజ్!”

“సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పబోయే విషయం కార్తీక్‌కి చెప్పాలా? వద్దా? అన్నది నువ్వే డిసైడ్ చేసుకో. హసంతికి మేనత్త కొడుకుతో ఎంగేజ్మెంట్ అయింది.”

అంతే! షాక్ కొట్టినట్టు చూసి “ఏంటి సార్! మీరు చెప్తోంది నిజమా!” అంది.

“తనే చెప్పింది. నేను వాళ్ళిద్దర్నీ చూశాను కూడా.” అని పేపర్ మీద హసంతి అడ్రస్ ఫోన్, నెంబర్ రాసిచ్చాడు.

‘కార్తీక్‌కి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలడో! లేదో! ఎవరో తెలియని అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు కాబోలు. వీడి విషయంలో మంచే జరగాలని కోరుకుంటున్నాను..’ అనుకుంటూ బయటికి వచ్చింది.

***

గౌతమ్ బైక్ మీద హసంతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. కవిత హాల్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతోంది.

“రఘురాం అన్నయ్యతో మాట్లాడి, పెళ్లి పనులు వేగంగా చేద్దామని చెప్పాలి సరోజా! నువ్వు ముందుగా వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది”

“అలాగే”

కాలింగ్ బెల్ మోగింది.

“ఎవరు?” అంది కవిత.

“నేను అత్తయ్యా! గౌతమ్.”

“రా! గౌతమ్ తలుపు తీసే ఉంది”

గౌతమ్ లోపలికి వచ్చాడు.

“హసంతి పై గదిలో ఉంది. పిలవనా!”

“వద్దు నేనే వెళ్తాను.”అని పైకి వెళ్ళాడు.

 హసంతి మంచం మీద పడుకుని ఉంది.

“హసంతీ! “అన్నాడు.

ఆమె లేచి కూర్చోబోతుంటే

“ఏంటి? ఈ టైంలో పడుకున్నావు.”

“తల నొప్పిగా ఉంది. అందుకే.. పడుకున్నాను”

“టాబ్లెట్ వేసుకున్నావా?”

“వేసుకోవాలి”

హసంతి లేవబోతుంటే చెయ్యి పట్టుకుని లేపి.. “ఎక్కడ ఉందో చెప్పు. నేను ఇస్తాను”

“కబోర్డ్‌లో ఉంది” అని చూపించింది.

ట్యాబ్లెట్, టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాడు.

“థాంక్స్” అంది

“థాంక్స్ పరాయి వాళ్లకి”

టాబ్లెట్ వేసుకుని దిండుకిందున్న బామ్ తీసి తలకి రాసుకుంటుంటే..

“కెన్ ఐ?” అన్నాడు.

“నో.. పర్వాలేదు నేను రాసుకుంటాను. దానికి ఇంకా టైం ఉంది”

ఆహ్లాదంగా నవ్వాడు గౌతమ్

“నన్ను చూడగానే హర్ట్ అవుతున్నాను అన్నావుగా! మరి ఎందుకు వచ్చావు?” అంది నిష్ఠూరంగా.

“నిజమే! కానీ అదేంటో.. నువ్వు హర్ట్ చేసినా, హాయిగానే ఉంటుంది”

“అబద్ధం చెబుతున్నావు. నన్ను చూసి ఫీలవుతున్నావ్ కదా! నేనేం చెప్పొచ్చానో వినకుండా.. ఆ రోజు నువ్వే నన్ను హర్ట్ చేసావు”

“సారీ.. సారీ.. సారీ”

“అసలు ఆ రోజు ఏం చెప్పటానికి వచ్చానో! తెలుసా!” అని చెప్పబోతుంటే..

“వద్దు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను.. నిన్నుగా చూస్తున్నాను. ఆరాధిస్తున్నాను. నువ్వు నాకు ఏ విషయంలోనూ సంజయిషీ ఇవ్వాల్సిన పనిలేదు. ఆ అవసరం నీకు రాకూడదు. నీకు ఇష్టం లేకపోతే నాతో ఎంగేజ్మెంట్‌కు ఒప్పుకునే దానివా! నిన్ను నేనే సరిగా అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాను.”

“అది కాదు గౌతమ్”

ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, “ఐ నో వాట్ యు ఆర్. నువ్వు నాకు సంజాయిషి ఇచ్చుకునే స్థితి నీకు రాకూడదు.”

గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంటే చూసి మాట్లాడి..

“సారీ! హసంతీ! ఇంకో పది నిమిషాల్లో అర్జెంటు ఆఫీస్ కాల్ అటెండ్ అవ్వాలి. వెళ్తాను. హెల్త్ జాగ్రత్త. టేక్ కేర్” అని పరిగెత్తినట్టు వెళ్ళాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here