ఎంత చేరువో అంత దూరము-13

17
3

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హైదరాబాదులో ఎండలు పెరగటంతో ఓ రోజు సాయంత్రానికి జాహ్నవికి ఒళ్లు వెచ్చబడుతుంది. బాగా తలనొప్పి వస్తుంది. చల్లటి నీళ్ళ కోసం కిచెన్ లోకి వెళ్తుంటే వాంతి కూడా అవుతుంది. తాను శుభ్రం చేయబోతుంటే, ఊర్మిళ వచ్చి వారించి, జానూకి మంచి నీళ్ళిచ్చి అక్కడ్నించి పంపించేసి, తానే స్వయంగా శుభ్రం చేస్తుంది. తాను బ్రెయిలీ క్లాసులకు వెళ్తూ, ఆనంద్ చెప్పటంతో జానూని కూడా తీసుకువెళ్తుంది ఊర్మిళ. అక్కడ అంధులకు ఊర్మిళ చేస్తున్న సర్వీస్ నచ్చుతుంది. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒకచోట ఆపి చెరుకురసం ఇప్పిస్తుంది ఊర్మిళ. ఇంటికి వచ్చాకా ఊర్మిళ చేస్తున్న సర్వీస్ తనకి బాగా నచ్చిందని ఆనంద్‍కి చెప్తుంది. మరి పిన్నికి థాంక్స్ చెప్పావా అని అడిగి, తను చేసే ఇతర సేవాకార్యక్రమాల గురించి చెప్తాడు. ఓ రోజు ఆఫీసు రూమ్‍లో ఆనంద్ దగ్గర కూర్చున్నప్పుడు – జానూకి ఉత్తరం ఊర్మిళే రాయించిందని చెప్తాడు. ఊర్మిళ పట్ల అభిమానం పెరుగుతుంది జానూకి. ఆమెను పిన్నిగా సంబోధిస్తుంది. జానూకి తన గదిలో ఉన్న పుస్తకాలను చూపిస్తుంది ఊర్మిళ. బోర్ కొడితే వాటిని చదువుకోమంటుంది. తమ్ముడు అనూప్ పుట్టినరోజుకు ఉండమని అందరూ బలవంతం చేస్తే, తల్లికి ఫోన్ చేసి చెప్తుంది జానూ. యాదృచ్చికంగా, పిన్ని మంచిదమ్మా అని అనేస్తుంది. మాలతి ఉలిక్కి పడుతుంది. పిల్లని నాలుగు రోజులు అక్కడే ఉంచమని తాతగారు అంటే, బాగా చిరాకు పడుతుంది మాలతి. ఇంకో రోజు ఫోన్ చేసి, నాన్న నాలుగు రోజులు తరువాత ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేశారు, ప్రయాణం కాస్త ఆలస్యమవుతుందని చెబితే, మాలతి అసహనంగా ఉండిపోతుంది. అనూప్ బర్త్  డేకి పిల్లలందరికీ బట్టలు కొనాలనుకుంటాడు ఆనంద్. ముందు వద్దంటుంది జానూ. తండ్రి బలవంతపెడితే, పిన్నికి నచ్చినవి తనకీ ఓకే అని అంటుంది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎన్నో విషయాలు చర్చకి వస్తాయి. లైఫ్‌లో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, నిన్ను నువ్వు కోల్పోకుండా అని నచ్చజెప్తాడు ఆనంద్. జానూని షాపింగ్‍కి తీసుకువెళ్ళి తనకి నచ్చిన బట్టలు కొనిపెడతాడు ఆనంద్. – ఇక చదవండి.]

అధ్యాయం 13

[dropcap]జా[/dropcap]హ్నవిని నగల షాపింగ్‌కు వచ్చేందుకు ఒప్పించలేకపోయారు. పిల్లలను జాహ్నవిని ఇంట్లో ఉంచి వెళ్ళాలనుకుంటుండగా, పిల్లలు “మేము అక్కతో ఆడుకుంటాము. షాపింగ్‌కు రాము” అన్నారు.

ఊర్మిళ ఆనంద్ బయలుదేరారు.

మఫత్లాల్ జ్యువేలర్స్ ముందు కారు ఆపి, వాళ్లని దింపి, పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు డ్రైవర్.

ఊర్మిళ, ఆనంద్ నగలు చూస్తున్నారు.

జాహ్నవి వయసుకు, ఆమె శరీర ఉనికికి నప్పేలా ఆనంద్ చూస్తూంటే, కొత్త మోడల్స్ తీసుకోవాలని ఊర్మిళ ఆలోచన. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి, రెండు సెట్స్ తీసుకున్నారు. ఐదు లక్షలు అయ్యాయి జాహ్నవి నగలకు.

షోకేస్‌లో కనిపిస్తున్న గోధుమ రంగు ముత్యాల సెట్ బాగా నచ్చింది ఆనంద్‌కు. ఊర్మిళ అభ్యంతరం లెక్క చేయకుండా అవి కూడా రెండు తీసుకున్నాడు. ముత్యాల సెట్ మీదకు మ్యాచింగ్ డ్రెస్ కూడా తీసుకుంటే బావుంటుందన్నది ఊర్మిళ. ఆబిడ్స్ వెళ్ళారు. డ్రెస్ సెలక్షన్ పూర్తి అయ్యింది. లేత గోధుమ రంగు లాంగ్ ఫ్రాక్‌ను చూస్తూ “నా తల్లి ఈ డ్రెస్‌లో ఏంజల్లా ఉంటుంది కదూ!” అన్నాడు.

“ఎగ్జాక్ట్లీ” అంది ఊర్మిళ.

షాప్ నుండి బయటకు వచ్చారు.

వాలెట్ పార్కింగ్ నుండీ కారు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఫోన్ రింగ్ అయ్యింది. తెలియని నెంబర్.. లిఫ్ట్ చేసే లోగా ఆగిపోయింది.

సాయంత్రం వేళ రోడ్లన్నీ రద్దీ గా ఉన్నాయి. వాహనాల రణగొణ ధ్వని.. వెయిట్ చేస్తూన్న ఫోన్ రాలేదు కానీ – ఇందాకటి నెంబర్‌తో కాల్ మళ్ళీ వచ్చింది. “హలో! హియర్ ఈజ్ ఆనంద్!” హుందాగా ఉంది ఆనంద్ కంఠం. “నేను శ్రీనివాస్‌ను.” కన్నడ యాసలో అతను ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. వెహికిల్స్ రొదలో అతను చెప్పేది వింటూ కారు ఎక్కాడు. ఆ తర్వాత ఆనంద్ గంభీరంగా మారిపోయాడు. ఊర్మిళ ఏమి జరిగిందని అతన్ని ప్రశ్నించలేదు. ఆమె కెన్నడూ ఆనంద్‌ను ప్రశ్నించే అలవాటు లేదు. కారు విండో అద్దాల్లో నుండి బయటకు చూస్తూండి పోయింది..

ఆమె చేతిలో జాహ్నవికి కొన్న నగల బాక్స్ ఉంది. జానూ వెళ్లేముందు తనతో అనుబంధం పెంచుకుంది. ‘పిన్నీ’ అంటూ అరమరికలు లేకుండా కలిసి పోతున్నది, అనుకున్నది. స్నాక్స్ హాల్లోకి తెస్తూంటే చేతుల్లో నుండి అందుకుంటుంది. చీర కట్టుకుంటుంటే కుచ్చిళ్ళు దగ్గరికి పట్టుకుంటుంది. ‘ఈ శారీ మీకు బాగుంటుంది, ఆ డ్రెస్ వేసుకోండి’ అంటూ సలహాలు చెప్తుంది. వెళ్ళే ముందు దగ్గర అయ్యింది. తనకే ఇలా ఉంటే, ఆనంద్ గారి కెలా ఉందో! జీవితం అంటే ‘చిన్న కలయిక, పెద్ద ఎడబాటు’ అన్న విద్వాన్ విశ్వం గారి మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకు.

ఊర్మిళలో ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే మైసూర్ నుండి వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆనంద్ ఆలోచిస్తున్నాడు.

జాహ్నవిని పంపాలా!

మాలతి స్ట్రెస్ పెట్టుకుందా! జాహ్నవి ఎక్కడుందని! తన దగ్గరే కదా! స్ట్రెస్ ఎందుకు? అలా ఎలా ఫోన్ చేసి చెప్పిస్తాడు పెద్దాయన అనుకున్నాడు. ఆనంద్‌కు భద్రం గారంటే ఇష్టం ఉండదు. కొన్ని సందర్భాలలో విసురుకున్న మాటలే కారణం.

ఆయన ఫోన్ ఆనంద్ ఇగోను తాకింది.

జాహ్నవి మాలతి దగ్గరే ఉండాలని రూలేమి లేదు.

తానూ పంతానికి పోవొచ్చు. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎమోషనల్ వార్‌కు దిగితే, అమాయకమైన పిల్లలు నలిగి పోతారు.

ఇంత మాత్రం ఆలోచన లేదా మాలతికి!

కారు ట్యాంక్ బండ్ రోడ్డు నెక్కింది. అక్కడి నుండి లైట్లలో బిర్లా మందిర్ ఓ అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది. నింగికి, నేలకు మధ్య నిలిచిన నక్షత్ర లోకంలా ఆ పాలరాతి జాబిలి జిలుగు వెలుగులు ఊర్మిళను ఆలోచనలన్నీ మరిచి పోయేట్టు చేసాయి. పరవశంతో కనిపించే వరకూ చూస్తూండి పోయింది

కారు ఆదర్శ్ నగర్ లోని బిల్డింగ్ ముందు ఆగింది.

***

నగలను చూసిన ఆనందం కంటే జాహ్నవికి అవి నాన్న తన కోసం కొన్నారన్న ఆనందం చాలా కలిగింది.

మన కోసం ఏదైనా కొని మన కన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళంటే, ఎంత ఆత్మీయ బంధం అది. హఠత్తుగా జాహ్నవికి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. తానూ ఇప్పుడు వాళ్ళ లాగే! ప్రేమతో బహుమతులిచ్చే నాన్న తనకు కూడా ఉన్నారు.

“నాన్నా! మీరు నాకు ఇలా కొన్నారంటే తాతగారు చాలా సంతోషిస్తారు” అంది.

“తాతగారి సంగతి తర్వాత, ముందు నీకు నచ్చాయా, చెప్పు, రా!”

“ఓ, నచ్చాయి. నా ముఖంలో ఏ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ కనిపించవట, డాడ్!”

“అది ఒకప్పుడు. ఇప్పుడు నిర్భయంగా నవ్వు అందరితో మెల్ట్ అయిపో! నిన్ను ఎవరైనా వేలెత్తి చూపితే, ఆ ఈడియట్స్‌కు మా నాన్నకు చెప్తానని చెప్పు” ఆనంద్ సరదాగా అన్నాడో ఎలా అన్నాడో కానీ ఆ మాటలు బాగా నచ్చాయి. నవ్వింది.

“డ్రెస్ వేసుకొని, సెట్ పెట్టుకొని ఫోటో పంపిస్తాను, డాడ్!”

“అక్కడి నుండి కాదు, ఇక్కడే ఆ పని చేయాలి.”

జాహ్నవి నగలు పెట్టుకోవడం చూసి, “అక్కా! అక్కా! నీకు పెళ్ళా” అని అడిగాడు.

వాడి మాటలకు అంతా నవ్వారు.

“పెళ్ళంటే ఇన్నేనా! బోలెడు కొనాలి” అంది ఊర్మిళ.

“యెస్” అన్నాడు, ఆనంద్.

వాళ్ళ మాటలకు “నేనసలు పెళ్ళి చేసుకోను. అడ్వకేట్ నవుతాను,” అంది జాహ్నవి.

“అదేంటమ్మా! అడ్వకేట్స్ పెళ్ళి చేసుకోరా!”

“అది కాదు, డాడి! ఒక వేళ డైవోర్స్ అవుతే పిల్లల్ని బాధపెట్టడం ఇష్టం లేదు.”

ఇరువురూ తెల్లబోయి ముఖాలు చూసుకున్నారు.

జాహ్నవికి సమాధానం చెప్పే నైతిక స్థైర్యం ఆ సమయంలో ఇరువురికీ లేదు.

జాహ్నవికి పెళ్ళి పట్ల విముఖత ఏర్పడదు కదా! అనుకుంది, ఊర్మిళ

ఏమి చెప్పాలన్నా ఎటూ కాని వయసు.

“అలాంటి పిల్లల కోసం పెద్దయ్యాక ఏదైనా చేయాలి” అంటూన్న జాహ్నవి మాటలకు ‘ప్రతి వాళ్ళ గోల్‌కు  గతమే పునాదిగా ఉంటుందేమో!’ అనుకున్నాడు, ఆనంద్.

“సరే, రా! నీకు పెళ్ళి చేయాలన్న ఆలోచన నాకు రాకముందే, నువ్వు పెళ్ళి గురించి ఆలోచించావు, గుడ్!” అన్నాడు ఆనంద్.

“అయ్యో, అలా కాదు..” జాహ్నవికి ఏమనాలో తెలీలేదు.

ఆనంద్ జోవియల్‌గా మాట్లాడి వాతావరణం తేలిక చేసాడు.

తయారయిన జాహ్నవిని ఊర్మిళ ఆనంద్ చాలా యాంగిల్స్‌లో క్లిక్ కొట్టారు. జాహ్నవికి కొత్తగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ తెలీదు. అసలు తనకు తాను ప్రాముఖ్యం ఇచ్చుకోవడమే  తెలియదు.

అమ్మ షాపింగ్ లకు రాదు. డబ్బులిచ్చి పంపుతుంది. తను ఫ్రెండ్స్‌తో వెళుతుంది.

ఏదైనా డ్రెస్ చూపిస్తే “అయ్యో, చాలా సింపుల్‌గా ఉంది, జానూ,” అంటుంది.

తనకేదైనా బాగా నచ్చితే, అప్పుడు అమ్మకు నచ్చింది, తనకు నచ్చింది రెండూ కొంటుంది. తను బట్టలకు ప్రాధాన్యత తక్కువ ఇస్తుంది, ఎందుకో!

ఆ రాత్రి నీలూతో ఈ ఆనందం అంతా షేర్ చేసుకుంది. సంతోషిస్తారని తాతగారికి కూడా చెప్పింది.

అమ్మకు ఏది చెప్పినా ఆలోచించి చెప్పాలి. ఆ సంగతి తాతగారు చూసుకుంటారు.

తానిక్కడెంత హ్యాపీగా ఉంటే అమ్మ అక్కడ అంత ఇన్‌సెక్యూర్ ఫీలవుతుంది. ఎందుకో ఈ విషయాలు తమిద్దరి మధ్య అసౌకర్యం  కలిగిస్తాయి. అందుకే డైరెక్ట్‌గా వీటిని మాట్లాడుకోవడానికి ఇద్దరికీ ఇష్టం ఉండదు.

***

మరు రోజే బుజ్జి గాడి బర్త్ డే! ఈసారి ఆనంద్ వాడి బర్త్ డేకు తనకు తెలిసిన మ్యూజీషియన్ ఫ్రెండ్‌తో చిన్న ప్రోగ్రామ్ ఇంట్లోనే ఇప్పిస్తానన్నాడు. పిల్లలు ఉత్సుకతతో ఉన్నారు.

అందరూ బుజ్జి గాడి బర్త్ డే మూడ్‌లో ఉండగా ఆనంద్ నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు అతను బయట ఉన్నాడు. ఇమిడియట్ ఫ్లైట్‌లో పార్ట్‌నర్‌తో తను అవుటాఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చిందని, వచ్చేందుకు మరో మూడు రోజులు అవ్వొచ్చని అతను చేసిన ఆ ఫోన్, అందరి సంతోషంపై నీళ్ళు చిలకరించింది.

రంగు పేపర్స్ తోరణం కడుతున్న జాహ్నవి మ్రాన్పడిపోయింది.

‘నాన్న ఊరికి వెళితే మరి తన ప్రయాణం.’

‘తమ్ముడి బర్త్ డే ఎలా డిసైడ్ చేయబోతున్నారు’

ఊర్మిళ అదే ఆలోచిస్తూంది.

ఈవినింగ్ ఆనంద్ ఫోన్ చేసాడు. జాహ్నవి టికెట్స్ మరో వారం రోజులకి వాయిదా అయ్యాయని చెప్పాడు.

“మీరు ఎంజాయ్ చేయండి. నేను వచ్చాక బయటకు తీసికెళ్తాను.” అన్నాడు. “నాన్న వచ్చాకే” అన్నాడు బుజ్జి గాడు.

“అక్క ఉంటుంది. అక్క ఉంటుంది” అంటూ ఎగరడం మొదలు పెట్టారు.

జాహ్నవి గుండెల్లో పెద్ద గండి పడింది.

ఆనంద్ నిర్ణయం ఓ కుటుంబ పెద్ద నిర్ణయం. ఓ తండ్రి అధికారం. అతను డిసైడ్ చేసాక ఎవరు కాదనగలరు!

అమ్మ కెలా చెప్పాలి. చెప్పి ఒప్పిండం తన వల్ల అవుతుందా! ఎలా రిసీవ్ చేసుకుంటుందో!

ఎవరికీ తన పరిస్థితి తెలియదు. తాను ఇక్కడికి వచ్చేందుకు ఎంత స్ట్రగుల్ చేసిందో, ఏమని చెప్తుంది!

తాతయ్యతో అమ్మకు చెప్పిస్తే! అమ్మ అదెలా రిసీవ్ చేసుకుంటుందో!

జాహ్నవికి భయంగా ఉంది. తానప్పుడే వెళ్ళుంటే సరిపోయేది.

జాహ్నవి చిన్నబుచ్చుకున్న విషయం ఊర్మిళ గమనించినా, అడగడం బాగోదేమోనని ఊరుకుంది.

మాలతికి చెప్పాలని ఫోన్ చేసి, భయం వల్ల వెంటనే ఆఫ్ చేసింది. తల్లికి, తండ్రికి మధ్య నిష్కారణంగా నలిగిపోయే కొందరు పిల్లల్లో జాహ్నవి కూడా చేరింది.

తాను ఇంకా వారం రోజులు ఇక్కడ ఉంటాను అన్న సంతోషం కంటే, అమ్మ గురించిన భయమే మనసు నిండింది జాహ్నవికి.

***

తాతయ్య గారికి మెల్లిగా విషయం చెప్పింది. ఆయన అర్థం చేసుకున్నారు, జాహ్నవి గొంతు లోని నిజాయితీని, ఆమె బాధనూ కూడా. ఇంక అర్థం కావాల్సిన వారికి అర్థం చేయాలి.

జాహ్నవి ఆ బాధ్యతను తాతగారి మీదే పెట్టింది. మనవరాలిపై ప్రేమతో ఆ బాధ్యత కూడా మీద వేసుకున్నారు. కానీ, తాతగారికి కూడా సంశయం గానే ఉంది. ఈసారి మాలతి అంత సులభంగా ఒప్పుకోక పోవచ్చుననుకున్నారు.

మాలతి లోని సమన్వయ లోపం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోక పోవొచ్చు. అయినా మనవరాలి కోసం ముందడుగు వేసారు. జాహ్నవిని మరి కొన్ని రోజులు అక్కడే ఉంచుకోవడంపై ఆయన కెలాంటి వ్యతిరేక భావం లేదు. రాక రాక కూతురు వస్తే అలా కాక ఇంకెలా స్పందిస్తారు. సెలవులే కదా, మరి కొన్ని రోజులు ఉండనివ్వాలని అనుకోవడంలో తప్పేమిటి? మళ్ళీ రాగలదో, లేదో కూడా తెలీనప్పుడు!

“మాలమ్మా! జానమ్మ ఏమైనా ఫోన్ చేసిందా!” అన్నారు.

“చేసింది. కానీ తీసే లోగానే పెట్టేసింది.”

“సిగ్నల్ అంది ఉండదు లే!” అన్నారు.

మళ్ళీ ఆగి అన్నారు – “నాకు చేసింది.”

“ఏమిటట” అంది. ఆ గొంతులో ఎలాంటి మృదుత్వం లేదు.

ఎవరి మీద అసహనమో ఆమెకే తెలియదు.

“ఏమీ లేదు. వచ్చేందుకు వారం అవుతుందని చెప్పింది. నీకు మళ్ళీ ఫోన్ చేస్తానంది.”

మాలతి గిర్రున ఆయన వంక తిరిగింది.

“మీరేమన్నారు?” అంది. “వచ్చేయమని చెప్పలేదా!” ఆతృత కంఠంలో.

“ఫలానా డేట్‌కు టికెట్స్ తీసుకున్నారు అని చెప్పాక, ఏమి చెప్పాలో తెలీలేదు.” అన్నారు.

మాలతి మౌనం వహించింది. తుఫాన్ ముందు ప్రశాంతత కాదు, కదా, అనుకున్నారు. అదే నని ఋజువు చేసింది మాలతి. ఆ పూట అన్నం తినలేదు. శూన్యదృక్కులు ప్రసరిస్తూ ఉంది. తాతగారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

“టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎలా అమ్మా!” అన్నారు.

ఆమె మాట్లాడలేదు.

“అతనికి కూడా బిడ్డే నమ్మా!” అన్నారు.

“కాదు. నా బిడ్డ!” అంది స్థిరంగా.

“నేను వెళ్ళి నా బిడ్డను తెచ్చుకుంటాను.” అంది.

తాత గారు ప్లేట్లో అన్నం పెట్టి తీసుకు వచ్చారు.

“తినకపోతే నా మీద..”

ఆయన ఏమి అనబోతున్నారో తెలిసి, చప్పున ప్లేట్ చేతి లోకి తీసుకుంది.

ఈ వారం రోజులు మాలతిని సముదాయించడం తన వల్ల కాదని భావించిన ఆయన రాధమ్మ గారిని వెంట బెట్టుకురమ్మని భూషణం గారికి ఫోన్ చేసారు.

ఇది ఇలా ఉండగా విధి విచిత్రం తెలియజేసేలా ఓ అనూహ్య సంఘటన జరిగింది, హైదరాబాద్‌లో!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here