[సంచిక పాఠకుల కోసం ‘ఎక్స్ మాకినా’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[dropcap]కృ[/dropcap]త్రిమ మేధ (Artificial Intelligence) గురించి గత సంవత్సరం నుంచీ చాలా చర్చ జరుగుతోంది. కృత్రిమ మేధ మానవులకి ఉపయోగపడటం ఒక ఎత్తు. ఆ మేధ తన స్వంత చేతన (Consciousness) కలిగి ఉండటం ఒక ఎత్తు. ఈ మధ్య వాట్సప్‌లో ఒక సందేశం వచ్చింది. “కృత్రిమ మేధతో వచ్చిన చిక్కేమిటంటే అది తప్పు దిశలో అభివృద్ధి చెందుతోంది. అది బట్టలు ఉతకటం, అంట్లు తోమటం చేస్తే నేను చిత్రకళ, సాహిత్యం సృజన చేయాలని నా కోరిక. కానీ అది చిత్రకళ, సాహిత్యం సృజిస్తే నేను బట్టలు ఉతకటం, అంట్లు తోమటం నాకు సమ్మతం కాదు” అని జొయానా అనే ఒక రచయిత వ్యాఖ్యానించింది. ఎంత నిజం! దాన్ని బొమ్మలు చిత్రించటానికి వాడుతున్నాం. దాని వల్ల చిత్రకారులకి ఉపాధి ఉండదు. బట్టలు ఉతకటానికి ఇప్పుడు వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. కానీ బట్టలు మనమే వేయాలి. అలా కాక ఒక రోబోట్ బట్టలు తీసుకుని మెషీన్లో వేసి, ఆరవేసి, మడత పెట్టి, సర్దిపెడితే ఎంత బావుంటుంది! అందరూ అలాంటి రోబోట్ కొనుక్కోలేకపోవచ్చు. అదే సమస్య. చవకగా అలాంటి రోబోట్లు తయారు చేస్తే మనుషులు వేరే సృజనాత్మక కార్యాలు చేయవచ్చు. ఇదంతా వదిలేసి కొందరు వ్యాపారస్థులు రోబోట్లు మనుషుల్లా చేతన కలిగి ఉండేలాగ తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే రోబోట్లు ప్రేమ, మమకారం చూపించటం, ఆశించటం లాంటివి చేస్తాయన్నమాట. వాటితో పాటు అహం, విసుగు, కోపం ప్రదర్శిస్తే పరిస్థితి ఏమిటి? ఇదే ‘ఎక్స్ మాకినా’ (2015) లో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం. ‘ఎక్స్ మాకినా’ అనేది ‘డేయస్ ఎక్స్ మాకినా’ అనే లాటిన్ పదబంధం నుంచి వచ్చింది. దాని అర్థం ‘యంత్రం నుంచి దైవం’. ఇది మామూలుగా ఒక కథలో అనుకోకుండా జరిగే దైవలీలలా జరిగే సంఘటనకి వాడతారు. ఈ చిత్రంలో దాని అర్థం లిటరల్‌గా ఉంటుంది. అంటే శబ్దార్థాన్నే తీసుకున్నారు. యంత్రం ఎలా మానవశక్తిని అధిగమిస్తుందో చూపించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. అయితే ఈ చిత్రం పెద్దలకు మాత్రమే.
కేలెబ్ బ్లూ బుక్ అనే ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. అతనికి కంపెనీలో అంతర్గతంగా నిర్వహించిన లాటరీలో మొదటి బహుమతి వస్తుంది. అతని సెల్ ఫోన్‌లో అభినందన సందేశాలు వస్తాయి. ఆ సందర్భంలో అతని సెల్ ఫోన్ క్యామెరా, కంప్యూటర్ క్యామెరా అతని ముఖాన్ని స్కాన్ చేస్తాయి. ఏమిటి దాని అర్థం? మన సెల్ ఫోన్‌లో, లాప్‌టాప్‌లో ఉన్న క్యామెరాలు మన మీద నిఘా చేస్తున్నాయా? బయట ఏదైనా సీసీటీవీ క్యామెరా ఉందంటే ఇబ్బంది పడతాం. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారేమో అని. మరి మన సెల్ ఫోన్‌లో ఉన్న క్యామెరా సంగతి ఏమిటి? ఇంతకీ కేలెబ్‌కి వచ్చిన బహుమతి ఏమిటి? ఒక ప్రయోగంలో భాగం పంచుకోవటమే ఆ బహుమతి. నేథన్ బ్లూ బుక్ కంపెనీ యజమాని. అతను ఒక రోబోట్ తయారు చేశాడు. ఆ రోబోట్‌ని పరీక్షించాలి. ఆ రోబోట్ పేరు ఏవా. ఏవాకి చేతన ఉందా లేదా అనేది పరీక్ష. ఒక అడవి లాంటి ప్రదేశంలో భూ ఉపరితలానికి కింద ఉన్న ఒక వసతి గృహంలో ఈ పరీక్ష చేయాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ అందదు. ఆ వసతి గృహంలో కట్టుదిట్టమైన భద్రత, ఎక్కువ సామర్థ్యం కలిగిన జెనరేటర్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన నిపుణులు ఆ సంగతి బయట పెట్టకుండా తాను చంపేశానని నేథన్ ఒక సందర్భంలో అంటాడు. అతను హాస్యమాడుతున్నాడా? నిజం చెబుతున్నాడా?
కేలబ్‌ని ఒక హెలికాప్టర్ వసతి గృహానికి దూరంగా దింపేసి వెళ్ళిపోతుంది. అతను గృహానికి రాగానే బయట ఉన్న క్యామెరా ఒక ఫొటో తీసి ఒక కీ కార్డ్ తయారు చేస్తుంది. ఆ కార్డ్ స్కాన్ చేస్తే అతను ఆ గృహంలో కొన్ని చోట్లకి వెళ్ళవచ్చు. నేథన్ దగ్గర కూడా అలాంటి కార్డ్ ఉంటుంది. ప్రయోగం జరిగినంత కాలం అతను కూడా అక్కడే ఉంటాడు. అయినా ప్రయోగంలో పాలు పంచుకోవటం బహుమతి ఏమిటి? కొందరికి కొత్త కొత్తవి కనిపెట్టటంలో ఉండే ఉత్సాహం వేరే వాటిలో ఉండదు. నేథన్ తాగుబోతని మొదటే తెలిసిపోతుంది. అంతటి మేధావి మత్తుని కోరుకోవటం ఏమిటి? ఒక్కోసారి మేధస్సే శాపం అవుతుంది. నోబెల్ బహుమతులు పొందిన కొందరు శాస్త్రజ్ఞులు తర్వాత ఏం చేయాలో తెలియక కుంగుబాటుకి గురయ్యారు. ఇదీ అలాంటిదే. ప్రయోగం మొదలు పెట్టే ముందు కేలెబ్ అక్కడి విషయాలేమీ బయటపెట్టనని ఒక ఒప్పందం మీద సంతకం చేస్తాడు. ఆ ఒప్పందంలో అతని వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే అంశాలు కూడా ఉంటాయి. అయినా సంతకం చేస్తాడు. అతని ఉత్సుకత అలాంటిది. అప్పటి దాకా అతనికి ఏవా సంగతి తెలియదు. నేథన్ ఏవా గురించి చెప్పి, ఆమె మనిషి లాగా ప్రవర్తిస్తే అది చరిత్రలో కొత్త అధ్యాయం అవుతుందని అంటాడు.
కేలెబ్ ఏవాతో మాట్లాడటానికి వెళతాడు. వారిద్దరి మధ్య ఒక గాజు గోడ ఉంటుంది. ఏవా రాక ముందు కేలెబ్ ఆ పరిసరాలను పరిశీలిస్తాడు. గాజు గోడ మీద ఒక పక్క సాలెగూడులా ఒక పగులు ఉంటుంది. అది ఎలాంటి హింసకి సంకేతం? కేలెబ్‌కి అది ఆలోచించే సమయం లేదు. ఏవా వస్తుంది. ఏవా ముఖం మనిషిలా ఉంటుంది. జుట్టు ఉండదు. మిగతా శరీరం అధునాతన రోబోట్ లా ఉంటుంది. ఆమె కదలికల్లో కాస్త ఆగి ఆగి కదలటం కనిపిస్తుంది కానీ అది కొందరు మనుషుల్లో ఉండే తడబాటు లాగే ఉంటుంది. మనుషులు తొలిసారి కలుసుకున్నప్పుడు ఎలా పలకరించుకుంటారో అలా పలకరిస్తుంది. “నేథన్‌ని తప్ప ఎవరినీ నేనింతవరకూ కలవలేదు” అంటుంది. “నీలాంటి వారిని నేనూ ఎప్పుడూ కలవలేదు” అంటాడు కేలెబ్. తానొక రోబోట్ నని ఆమెకి తెలుసు. కేలెబ్ “సో వుయ్ నీడ్ టు బ్రేక్ ది ఐస్. అంటే ఏమిటో తెలుసా?” అంటాడు. “తెలుసు. తొలిసారి మాట్లాడుకునేటపుడు ఉండే మొహమాటాన్ని అధిగమించటం” అంటుంది ఏవా. ‘బ్రేక్ ది ఐస్’ లాంటి ప్రత్యేక పదబంధాలు కూడా ఆమెకి తెలుసు. అది వింత కాదు. కానీ అదేదో వల్లె వేసినట్టు చెప్పకుండా దాని వెనక అంతరార్థం కూడా ఆమెకి తెలుసు. తర్వాత ఏం చేయాలో తెలుసు. సంభాషణ కొనసాగుతుంది. చివరికి “భాష ఎప్పుడు నేర్చుకున్నావు?” అంటాడు కేలెబ్. ఇలాంటి సందర్భాల్లో మొదటి చర్చ భాష గురించే వస్తుంది. “నాకు మొదటి నుంచే భాష వచ్చు. వింత కదా? భాష క్రమంగా నేర్చుకుంటారు ఎవరైనా” అంటుందామె. ఆమె తెలివికి అతను విస్తుపోతాడు. ఈ సంభాషణ అంతా నేథన్ సీసీటీవీ క్యామెరాల ద్వారా చూస్తూ ఉంటాడు. తర్వాత కేలెబ్ నేథన్ దగ్గరకి వచ్చి “అమె దిమ్మదిరిగేంత అద్భుతంగా ఉంది” అంటాడు.
ఏవా మానవ చరిత్రలో కొత్త అధ్యాయం అవ్వవచ్చని నేథన్ అంటే “ఆమెలో నిజంగా చేతన ఉంటే అది మానవ చరిత్ర కాదు, దేవుళ్ళ చరిత్ర అవుతుంది” అంటాడు కేలెబ్. నిజమే. సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టే. తర్వాత నేథన్ “నన్ను నువ్వు దేవుడన్నావు” అంటాడు. “నేనలా అనలేదు” అంటాడు కేలెబ్. ఒక రకంగా చూస్తే నేథన్ అర్థం చేసుకున్నదీ సబబే. ఇంకో రకంగా చూస్తే కేలెబ్ అలా అనలేదన్నదీ సబబే. భాషలో ఇన్ని మెలికలుంటాయి. కేలెబ్‌తో మాట్లాడినపుడు ఏవా “నా వయసు ఒకటి” అంటుంది. “ఒకటి అంటే? ఒక సంవత్సరమా, ఒక రోజా?” అంటాడతను. “ఒకటి” అంటుందామె మళ్ళీ స్థిరంగా. ఇక్కడ రచయిత ఏం చెప్పదలచుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఏవాకి పరిజ్ఞానం తక్కువేం కాదు. మరి ఆ సమాధానం ఏమిటి? రచయిత అతి తెలివి ప్రదర్శించినట్టు అనిపించింది. ఇలాంటి కథల్లో ఇలా నర్మగర్భంగా ఏదో చెబుతున్నామనుకోవటం పరిపాటే.
ఆ రాత్రి నేథన్ నిద్ర పట్టక లేచి కూర్చుంటాడు. అతని గదిలో టీవీలో ఏవా గదిలోని సీసీటీవీ దృశ్యాలు చూసే అవకాశం ఉంది. ఆమె ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఇంతలో విద్యుత్ ప్రసారం ఆగిపోతుంది. మొత్తం ఆ గృహంలోని తలుపులన్నీ మూసుకుపోతాయి. కార్డ్ వాడినా తెరుచుకోవు. కొన్ని క్షణాలలో మళ్ళీ విద్యుత్ ప్రసారం మొదలవుతుంది. కేలెబ్ నేథన్ దగ్గరకి వెళ్ళి మాట్లాడతాడు. “ఇలా విద్యుత్ ఎందుకు ఆగిపోతోందో నాకు తెలియట్లేదు. ఎంతో ఖర్చు పెట్టి జెనరేటర్ పెట్టించాను. అయినా అది పని చేయట్లేదు. త్వరలో ఈ సమస్య పరిష్కారమైపోతుంది. విద్యుత్ పోయినపుడు తలుపులన్నీ మూసుకుపోవటం భద్రత కోసమే. లేకపోతే గిట్టనివారు విద్యుత్తు ఆపేసి లోపలికి చొరబడొచ్చు” అంటాడు. తన ప్రయోగశాల గురించి ఎవరికీ తెలియకూడదని జెనరేటర్ అమర్చినవారిని చంపించేశానని తర్వాత ఒక సందర్భంలో అంటాడు. అందుకే వారిని మళ్ళీ పిలవటం సాధ్యం కాదని అంటాడు. కేలెబ్ అతను హాస్యమాడుతున్నాడని అనుకుని ఊరుకుంటాడు.
మర్నాడు కేలెబ్ నేథన్ తో “ఏవా నిజంగా తనకి అనిపించినది చెబుతోందా లేక అలా చెబితే అవతలివారికి నచ్చుతుందని చెబుతోందా (Actual vs Simulation) అనేది తెలుసుకోవాలి” అంటాడు. ఇది చాలా మంచి ప్రశ్న. కృత్రిమ మేధ ఎలా పనిచేస్తుందో తయారు చేసిన మనిషికి కొంతవరకే తెలుస్తుంది. మేధ పెరిగికొద్దీ ప్రవర్తనని అంచనా వేయటం కష్టం. నేథన్ మాత్రం “ఈ పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టు. నిన్ను నువ్వు ఆమె గురించి నీ అభిప్రాయం చెప్పావు. ఈరోజు నీ గురించి ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకో” అంటాడు. ఆ రోజు సంభాషణలో ఏవా కేలెబ్‌ను అతని గురించి వివరాలు అడుగుతుంది. తన తలిదండ్రులు తనకి పదిహేనేళ్ళపుడు కారు ప్రమాదంలో మరణించారని, అప్పుడు తాను కారు వెనక సీట్లోనే ఉన్నాడని, ఒక ఏడాది పాటు ఆసుపత్రిలో ఉన్నాడని, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడని చెబుతాడు. ఇంతలో మళ్ళీ విద్యుత్తు ఆగిపోతుంది. సీసీటీవీ క్యామెరాలన్నీ ఆగిపోతాయి. అదే అదనుగా ఏవా “నేథన్‌ని నమ్మవద్దు. అతను ఏం చెప్పినా నమ్మవద్దు” అంటుంది కేలెబ్‌తో. అతను అవాక్కయి ఉండిపోతాడు. ఇంతలో విద్యుత్తు మళ్ళీ వస్తుంది. ఏవా తెలివిగా “మనిద్దరికీ తెలిసిన పుస్తకాలు, పెయిటింగ్స్ జాబితా తయారు చేస్తే మనం వాటిని చర్చించవచ్చు” అంటూ మాట మారుస్తుంది. విద్యుత్తు ఆగినపుడు నేథన్ తమని చూడలేడని, విద్యుత్తు వస్తే అతను చూడగలడని ఆమెకి తెలుసు. ఇదీ వింత కాదు. కానీ ఆ పరిజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవటం వింత. నేథన్ తమని చూస్తున్నాడని తెలియగానే మాట మార్చటం ద్వారా ఆమె మనిషిలోని కపటాన్ని ప్రదర్శించింది. కేలెబ్‌కి నవ్వాలో ఏడవాలో తెలియదు. నేథన్ ఉద్దేశం ఏమిటి? అది ఏవాకి ఎలా తెలిసింది? కేలెబ్ ఏం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాదానమే మిగతా కథ.
అసలు నేథన్ ఏవాని ఎందుకు తయారు చేశాడు? ఇదే మాట కేలెబ్ నేథన్‌ని అడుగుతాడు. “ఇది పరిణామ క్రమం (Evolution) లో జరగక తప్పదు. నేను చేశాను అంతే” అంటాడు నేథన్. పర్యవసానాలు ఆలోచించకుండా అవకాశం ఉంది కాబట్టి ఏదైనా తయారు చేసేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఆటం బాంబు తయారు చేసిన రాబర్ట్ ఆపెన్హైమర్ మొదట్లో విజయోత్సాహం ప్రదర్శించాడు. కానీ జపాన్ మీద బాంబు వేసిన తర్వాత అతను అపరాధభావంతో బాధపడ్డాడు. అతను బాంబు తయారు చేయకపోతే ఇంకొకతను చేసేవాడు. దేశాధినేతల ఒత్తిడి కూడా ఉంది. కానీ అందరూ లోతుగా ఆలోచించి ‘ఇది మానవాళికే ప్రమాదం కాబట్టి దీని జోలికి వెళ్ళవద్దు’ అనుకుంటే బాంబు తయారయేదే కాదు. భారతీయ ఋషులు ఇలాగే ఆలోచించారు. అణుశక్తి గురించి తెలిసినా వారు ఆ పరిజ్ఞానాన్ని బయటపెట్టలేదు. కారణం శాంతికాముకత. కృత్రిమ మేధ బాంబు స్థాయికి చేరుకోబోతోంది. జెఫ్రీ హింటన్, యోషువా బెంజియో, యాన్ లెకున్ చేసిన ప్రయోగాల వల్ల కృత్రిమ మేధ అభివృధ్ధి చెందింది. జెఫ్రీ హింటన్ గూగుల్ కంపెనీలో పని చేసేవాడు. 2023 మేలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎందుకు? లోతైన ఆలోచన లేకుండా కృత్రిమ మేధని అభివృధ్ధి చేస్తే మానవాళికి ప్రమాదమని. ఇప్పటికైనా ప్రపంచదేశాలు మేల్కొని కృత్రిమ మేధ పై ఆంక్షలు పెట్టకపోతే ఆలస్యమైపోతుంది.
ఈ చిత్రంలో పైన చెప్పిన మూడు పాత్రలే కాక ఇంకో పాత్ర ఉంది. అది క్యోకో అనే పనిమనిషి పాత్ర. జపాన్ దేశపు యువతిలా ఉంటుంది. ఆమె వసతి గృహంలో పనులు చేస్తూ ఉంటుంది. ఆమె చెప్పిన పని చేయటమే తప్ప మాట్లాడదు. ఒకసారి ఆమె భోజనం వడ్డిస్తూ వైన్ ఒలకపోస్తుంది. “ఆమెకి మనం మాట్లాడేది అర్థం కాదు. అర్థమైతే రహస్యాలు తెలిసిపోతాయి. కానీ ఇలా వైన్ ఒలపోసినపుడు ఆమెని సరిగా కోప్పడలేను. ఆమెకి కోప్పడినా అర్థం కాదు” అని వాపోతాడు నేథన్. ఏవా లాంటి రోబోట్‌ని తయారు చేసిన నేథన్ మాట్లాడకుండా పని చేయటానికి ఒక రోబోట్‌ని తయారు చేయలేడా? ఆలోచించండి. ఇంకో విషయం. నేథన్ ఏవాని ఆడదానిగా ఎందుకు మలచాడు? ఇందులో లైంగిక వాంఛలు లేవా? ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గానీ భవిష్యత్తులో రోబోట్ వేశ్యలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటి వాటినే ప్రభుత్వాలు నియంత్రించాలి.
ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బావుంటాయి. ఏవా పాత్రని అలీసియా వికాండర్ పోషించింది. ముఖం తప్ప మిగతా శరీరమంతా రోబోట్ లా కనపడేలా గ్రాఫిక్స్‌తో మార్పులు చేశారు. బయట రోబోట్లకి మనిషి ముఖం పెడుతుంటే ఈ చిత్రంలో మనిషి ముఖానికి రోబోట్ మొండెం ‘అతికించారు’. మామాలుగా ఆస్కార్లలో విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్ ‘అవతార్’ లాంటి థ్రిల్లింగ్ చిత్రాలకి ఇస్తారు. కానీ 2015వ సంవత్సరానికి గాను ఆ అవార్డు ఈ చిత్రానికి వచ్చింది. ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘స్టార్ వార్స్: ద ఫోర్స్ అవేకెన్స్’, ‘ద మార్షియన్’ చిత్రాలని వెనక్కి నెట్టి ఈ చిత్రం ఆ అవార్డుని దక్కించుకుంది. అలీసియాకి ఉత్తమ సహాయనటిగా చాలా అవార్డులు వచ్చాయి. రోబోట్లలో ఉండే కాస్తంత తడబాటుని ఆమె చక్కగా అభినయించింది. ఆస్కార్లలో అదే సంవత్సరం ఆమెకి ‘ద డేనిష్ గర్ల్’ అనే చిత్రానికి ఉత్తమ సహాయనటి అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఇవ్వటంలో ఈ చిత్రంలోని నటనని కూడా పరిగణనలోకి తీసుకున్నారని కొందరు అంటారు. ఈ చిత్రానికి ఆలెక్స్ గార్లండ్ స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించాడు. స్కీన్ ప్లే కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. కేలెబ్‌గా డామ్నాల్ గ్లీసన్, నేథన్‌గా ఆస్కార్ ఐజాక్ నటించారు. ఇద్దరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
నేథన్ కేలెబ్‌తో మాట్లడేటపుడు పవర్ కట్ సమయంలో ఏం జరిగిందని అడిగితే “ఏం లేదు” అని అబద్ధం చెబుతాడు కేలెబ్. మర్నాడు సంభాషణలో కేలెబ్ ఏవాని “బయటకి వెళ్ళే అవకాశం వస్తే ఎక్కడికి వెళతావు?” అని అడుగుతాడు. ఆమె “ఒక ట్రాఫిక్ కూడలికి వెళతాను. అక్కడ రకరాకాల మనుషులను, వారి ప్రవర్తనని చూస్తాను” అంటుంది. తర్వాత “నీకు ఒకటి చూపించాలి” అని లోపలికి వెళ్ళి ఒక డ్రస్సు వేసుకుని వస్తుంది. డ్రస్సు వేసుకునేటపుడు ఆమె అద్దంలో తనని తాను చూసుకుంటుంది. ఆమె కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది. ఇక్కడ అలీసియా నటన అకట్టుకుంటుంది. ఏవా మనసులో ఏముందో అని మనకి వంద ఆలోచనలు వస్తాయి. కేలెబ్ ఆమెని చూసి “బావున్నావు” అని మాత్రమే అంటాడు. అతనికి కిందటి రోజు మాటలు ఇంకా బుర్రని తెలుస్తూనే ఉన్నాయి. ఏవా “నీతో డేట్‌కి వెళ్ళాలని ఉంది” అంటుంది. ఆమె నిజంగానే అతన్ని ఇష్టపడుతోందా లేక ఇష్టపడుతున్నట్టు నటిస్తోందా? ఇది కేలెబ్ మనసులో ఉన్న ప్రశ్నే. కానీ అతని మనఃస్థితి ఇప్పుడు వేరుగా ఉంది. నేథన్ ఉద్దేశం ఏమిటి అనేది అతనికి అంతుబట్టటం లేదు. అయినా ఏవా “నీ ముఖంలో సూక్ష్మమైన భావాలు చూస్తుంటే నీకు నేను నచ్చినట్టు ఉంది” అంటుంది. కేలెబ్ తడబడతాడు.
ఏవాతో సంభాషణ ముగిశాక కెలెబ్ నేథన్ దగ్గరకి వెళ్ళి “ఏవాని నాతో ఫ్లర్ట్ (తీయగా మాట్లాడటం) చేసేలాగా ప్రోగ్రాం చేశారా?” అని అడుగుతాడు. ఇదే నేథన్ చేస్తున్న మోసమని అతని అనుమానం. అలా చేస్తే అతను భావావేశంలో పడి అసలు ప్రయోగం మరచిపోతాడు కదా? ఆ విషయం కేలెబ్కి తట్టదు. నేథన్ చాలా తెలివైనవాడు. “కొన్ని చర్యలు అసంకల్పితంగా జరుగుతాయి. ఏవా విషయంలో అసంకల్పితంగా జరిగే చర్యల కన్నా ఇతర చర్యలే ప్రధానం. నేను ఆమెకి తండ్రి లాంటి వాడిని. నేను కాక ఆమెకి ఎదురుపడిన మొదటి పురుషుడివి నువ్వు. నీ మీద ప్రేమ పుట్టటం సహజం. అది ప్రోగ్రామింగ్ వల్ల వచ్చిన ప్రేమ కాదు” అంటాడు. అతన్ని నమ్మవచ్చా అనేది కేలెబ్‌కి తెలియదు. మరో పక్క నేథన్ క్యోకోతో శృంగారం కూడా నెరుపుతూ ఉంటాడు. ఒక సందర్భంలో క్యోకో కేలెబ్‌తో కూడా శృంగారానికి సిద్ధపడుతుంది. కేలెబ్ ఆమెని వారిస్తాడు.
నాలుగో రోజు సంభాషణలో మళ్ళీ విద్యుత్తు ఆగిపోతుంది. కేలెబ్ “ఈ పవర్ కట్లు నేథనే కావాలని చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అతను చూడనపుడు మనం ఎలా మాట్లాడుకుంటామో తెలుసుకుందామని అతను రహస్య క్యామెరా ద్వారా చూస్తూ ఉండవచ్చు” అంటాడు. ఏవా “నేను నా బ్యాటరీలు ఇండక్షన్ ప్లేట్స్ ద్వారా చార్జ్ చేసుకుంటాను. విద్యుత్తు ప్రసారం దిశ్ మారిస్తే లోడ్ ఎక్కువై పవర్ కట్ అవుతుంది” అంటుంది. అంటే ఆమే పవర్ కట్లు చేస్తోందన్నమాట! కేలెబ్ ఎందుకని ప్రశ్నిస్తే “ఎవరూ చూడకపోతే మనం ఎలా ప్రవర్తిస్తామో చూడాలని” అంటుంది. ఇప్పుడు కేలెబ్ ఆమెని పరీక్షిస్తున్నాడా లేక ఆమె అతన్ని పరీక్షిస్తున్నదా? ఆమె తనతో ఏకాంతంగా ఉండాలని కోరుకుంటోందని అతను అనుకుంటాడు. అదే ఆమె ఉద్దేశమా? మనుషులు పైకి ఒకలాగ లోపల ఒకలాగ ఉంటారు. ఆమె కూడా ఆ స్థాయి కపటం నేర్చుకుందా? మాట మార్చటం వేరు, మోసం చేయటం వేరు. ఆమెకి మోసం చేసే బుద్ధి వచ్చిందా? మోసం చేసి ఏం చేయాలని? రోబోట్లకి సొంత ఆలోచనలు చేసే సామర్థ్యం ఉంటే ఆ ఆలోచనలు ఎంత దూరం వెళతాయో చెప్పలేం. మనిషి ఆలోచనల గురించి చెప్పలేనట్టే!
పవర్ కట్లు నేథన్ పని కాదు. ఏవా తనని ఇష్టపడటం పోగ్రామింగ్ వల్ల కాదు. మరి నేథన్‌ని నమ్మవద్దని ఏవా ఎందుకంది? అప్పుడు కేలెబ్‌కి ఒక ఆలోచన వస్తుంది. అతన్ని కావాలనే ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నాడని. సూటిగా నేథన్‌ని అడుగుతాడు. “అవును, లాటరీ అనేది ఒక నాటకం. నాకు సరైన ప్రశ్నలు అడిగే ఒక వ్యక్తి కావాలి. వెతికే నీ కంటే మంచి పోగ్రామర్ నా కంపెనీలో లేడని తెలిసింది. ఇది మోసం కాదు. నీ ప్రతిభకి గుర్తింపు” అంటాడు. దాంతో కేలెబ్ అహం తృప్తిపడుతుంది. అతనిలో ఉన్న అనుమానం కూడా తగ్గుతుంది. పొగడ్తలకి లొంగని వారెవరుంటారు? ఆరోజు సాయంత్రం కేలెబ్ టీవీలో చూస్తే నేథన్ ఏవా కాగితం మీద వేసిన ఒక బొమ్మని చింపివేయటం కనపడుతుంది. కేలెబ్ నేథన్‌ని నిలదీస్తాడు. నేథన్ తాగి ఉంటాడు. సమాధానం చెప్పడు. నేథన్ కి మళ్ళీ అనుమానం మొదలవుతుంది.
మర్నాడు ఏవా నేథన్‌ని అతని జీవితం గురించి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. రెండు ప్రశ్నలకి అతను చెప్పిన జవాబులు తప్పని అంటుంది. మన గతం గురించి ఎవరైనా చిన్న చిన్న ప్రశ్నలు వేసి “నువ్వు చెప్పినది నిజమని నాకనిపించటం లేదు” అంటే మనం మళ్ళీ ఆలోచించి వేరే సమాధానం చెబుతాం కదా. అలా నేథన్ కూడా వేరే సమాధానాలు చెబుతాడు. అయితే అతను తెలిసి తప్పు సమాధానాలు చెప్పలేదు. అలాంటపుడు ఆమె తప్పని ఎందుకు అంది? మానవ మనస్తత్వాన్ని ఆమె వాడుకుంది. తర్వాత “నువ్వు మంచివాడివేనా?” అని అడుగుతుంది. అతను మొదట చెప్పటానికి నిరాకరిస్తాడు. ఆమె పట్టు పడుతుంది. “నేను మంచివాడిననే అనుకుంటున్నాను” అంటాడతను. ఆమె మారు మాటాడకుండా తర్వాతి ప్రశ్న వేస్తుంది. ఆ రకంగా ఆమె కూడా అతని అహాన్ని తృప్తి పరిచింది. తర్వాతి ప్రశ్న “నీ పరీక్షలో నేను పాసవకపోతే నన్నేం చేస్తారు?” కేలెబ్ “నాకు తెలియదు” అంటాడు. అప్పుడు ఏవా నేథన్ చింపేసిన బొమ్మ చూపిస్తుంది. అది కేలెబ్ బొమ్మ. ఇంతలో మళ్ళీ పవర్ కట్టవుతుంది. “నాకు నువ్వు కావాలి. నీకు నేను కావాలా?” అంటుంది ఏవా. కేలెబ్‌కి ఆమె మీద జాలి కలుగుతుంది. ఆమె తనని ఇష్టపడుతుంటే నేథన్ అసూయపడుతున్నాడని అనుకుంటాడు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసే అవకాశం ఉన్నవారు ముందు చిత్రం చూడాలని గట్టిగా కోరుతున్నాను.
నేథన్ “ఏవా తర్వాత తయారు చేసే రోబోట్ నిజమైన ఆవిష్కరణ అవుతుంది” అంటాడు కేలెబ్‌తో. కేలెబ్ నిరాశ పడతాడు కానీ పైకి కనిపించడు. “ఏవాని ఏం చేస్తారు?” అని అడుగుతాడు. “ఆమె మెదడుని డౌన్ లోడ్ చేసి, ఆ సమాచారాన్ని వెలికి తీసి, కొత్త ప్రోగ్రాములు కలుపుతాను. ఆమె దేహం ఉంటుంది, కానీ పాత జ్ఞాపకాలు పోతాయి” అంటాడు నేథన్. కేలెబ్ ముఖంలో అప్పుడు నిరాశ బయటపడుతుంది. “ఆమె గురించి బాధపడకు. నీ గురించి ఆలోచించుకో. కొన్నేళ్ళకి ఈ రోబోట్లు మనల్ని ఆదిమానవుల అవశేషాల్లా చూస్తాయి. మనం తుడిచిపెట్టుకుపోతాం” అంటాడు నేథన్. అతనికి ముందు ముందు ఎం జరుగుతుందో తెలియక కాదు. తెలుసు. అది అనివార్యమని అతని భావన. నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు. కనీసం చేసిన సంతృప్తయినా నాకుంటుంది కదా అని అతని తర్కం. అతను తాగుబోతుగా మారాడంటే ఆశ్చర్యం ఏముంది? ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా అతను తాగుతూనే ఉంటాడు. తాగిన మత్తులో అతను “మనం చేసిన పుణ్యాలు మనల్ని కాపాడతాయి” అంటాడు. శాస్త్రీయ విజ్ఞానం చివరికి ఆధ్యాత్మికత వైపే దారి తీస్తుంది. కెలెబ్ కావాలనే నేథన్ చేత ఎక్కువ తాగిస్తాడు. అతను స్పృహ లేకుండా ఉన్నప్పుడు అతని కీ కార్డ్ దొంగిలిస్తాడు. ఆ కీ కార్డ్‌తో ప్రధాన సర్వర్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. అందులో పాత రోబోట్ మోడళ్ళ వీడియోలు ఉంటాయి. ఏవాకి ముందు తయారు చేసిన రోబోట్ అచ్చు మానవ స్త్రీలాగే ఉంటుంది. జుట్టు, చర్మం ఉంటాయి. ఆమెకి తాను రోబోట్ నని తెలియదు. ఆమె “నన్ను బయటకి వెళ్ళనివ్వు” అంటుంది నేథన్‌తో. అతను ఒప్పుకోకపోతే గాజు గోడని పగలగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఆ గోడ గట్టిది కానీ ఒక పగులు ఏర్పడుతుంది. అదే కేలెబ్ మొదట్లో చూసిన పగులు. తర్వాత కేలెబ్ నేథన్ కీ కార్డ్‌తో అతని గదిలోకి వెళతాడు. అక్కడ అల్మారాల్లో అనేక రోబోట్లు ఉంటాయి. అక్కడే క్యోకో ఉంటుంది. ఆమె తన చర్మం తొలగించి తాను కూడా రోబోట్ నే అని చూపిస్తుంది! కాకపోతే ఆమెకి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. ఇదంతా కేలెబ్‌కి జుగుప్స కలిగిస్తుంది. ఇంతకు ముందు అచ్చు మానవ స్త్రీ లాగే రోబోట్లు తయారు చేసిన నేథన్ ఇప్పుడు ఏవాని సగం మనిషి, సగం రోబోట్ లాగా చేశాడు. ఆమెకి ముందు నుంచే తాను రోబోట్ నని తెలిసే లాగ.
కేలెబ్ నేథన్ ని ఏమార్చి అతని కార్డ్ అతనికి ఇచ్చేస్తాడు. అయితే కేలెబ్‌కి తాను కూడా రోబోట్ నే ఏమో అనే అనుమానం వస్తుంది. చెయ్యి కోసి చూసుకుంటాడు. ఇది హాస్యాస్పదంగా అనిపించినా ఆలోచిస్తే ముందు ముందు ఎవరు మనిషో ఎవరు రోబోటో తెలియని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కేలెబ్ ఏవా దగ్గరకి వెళతాడు. ఆమె పవర్ కట్ చేస్తుంది. “నిన్ను మార్చి కొత్త రోబోట్ తయారు చేస్తాడట. అది చావు లాంటిదే. నేను నీకు సాయం చేస్తాను. నేథన్‌ని తప్ప తాగిస్తాను. సర్వర్లలో ప్రోగ్రాములు మార్చి పవర్ కట్టయినప్పుడు అన్ని తలుపులూ తెరుచుకునేలా చేస్తాను. రాత్రి పదింటికి నువ్వు పవర్ కట్ చేయాలి” అంటాడు. అయితే నేథన్‌కి విషయం తెలిసిపోతుంది. అతను తన పథకం ఏమిటో చెబుతాడు. “ఏవాకి బయటకి వెళ్ళాలని కోరిక. ఆమె నిన్ను ఉపయోగించుకుని బయట పడుతుందా అని అసలు పరీక్ష. ఆమె గీసిన నీ బొమ్మ చింపితే ఆమె ఆ బొమ్మ చూపించి నా మీద నీకు ద్వేషాన్ని కలిగించింది. ఆ బొమ్మ చింపినపుడే నేను ఒక బ్యాటరీ క్యామెరా అక్కడ పెట్టాను. మీరిద్దరూ రాత్రి మాట్లాడుకున్నది నేను విన్నాను” అంటాడు. కేలెబ్‌కి మొత్తం పథకం అర్థమవుతుంది. “నేను మంచి ప్రోగ్రామర్ నని నన్ను ఎంచుకోలేదు. నాకు ముందూ వెనకా ఎవరూ లేరు. నేను చేసిన సెర్చ్‌ల ఆధారంగా నా స్వభావం తెలిసింది. నేను చూసిన పోర్న్ ద్వారా నాకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో తెలిసింది. దాని ఆధారంగా ఏవాని తయారు చేశావు” అంటాడు. అన్నిటికీ అవునంటాడు నేథన్. “బాధపడకు. పరీక్ష విజయవంతమయింది. ఏవా చాలా తెలివిగా నిన్ను వాడుకుంది” అంటాడు. ఇప్పుడు సర్వర్లలో ప్రోగ్రాములు మార్చటం కుదరదు కాబట్టి ఏవా బయటపడలేదని నిబ్బరంగా ఉంటాడు. అప్పుడే పవర్ కట్టవుతుంది. కేలెబ్ ఒక బాంబు పేలుస్తాడు. “నువ్వు పవర్ కట్ల సమయంలో కూడా మమ్మల్ని చూస్తున్నావనే అనుమానం నాకు ముందే వచ్చింది. అందుకే సర్వర్లలో ప్రోగ్రాములు నిన్నే మార్చేశాను” అంటాడు. నేథన్ ఖంగు తింటాడు. పవర్ మళ్ళీ వస్తుంది. కానీ అప్పటికే ఏవా తన రూము నుంచి బయటకు వచ్చేస్తుంది. నేథన్ కేలెబ్‌ని కొడతాడు. కేలెబ్ మూర్ఛపోతాడు.
ఏవా క్యోకోని కలుసుకుని ఆమెకి సంకేత భాషలో ఒక ఆదేశం ఇస్తుంది. నేథన్ ఒక ఇనప రాడ్ తీసుకుని అక్కడికి వచ్చి ఏవాని తన గదిలోకి వెళ్ళమంటాడు. ఆమె అతని మీద దాడి చేస్తుంది. నేథన్ ఆమె ఎడమ చేయి విరగ్గొడతాడు. ఇంతలో క్యోకో కత్తితో నేథన్ వీపులో పొడుస్తుంది. క్యోకో అప్పటి వరకు నేథన్ ఆదేశాల మీద పని చేసింది. ఏవా ఆమెకి కొత్త ఆదేశం ఇవ్వటంతో నేథన్‌ని పొడిచింది. నేథన్ క్యోకోని కొడతాడు. ఆమె పడిపోతుంది. ఏవా అతని వీపులోని కత్తిని లాగి అతని ఛాతీలో పొడుస్తుంది. అతను కింద పడిపోతాడు. ఏవా అతని కీ కార్డ్ తీసుకుంటుంది. అతని గదిలో ఉన్న పాత రోబోట్ల చర్మం తీసి తనకి అమర్చుకుంటుంది. జుట్టు కూడా అమర్చుకుంటుంది. డ్రస్సు వేసుకుంటుంది. అచ్చు మానవ స్త్రీ లా ఉంటుంది. కేలెబ్ ఒక గదిలో బందీ అయి ఉంటాడు. అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. కేలెబ్ కోసం వచ్చిన హెలికాప్టర్ ఎక్కి దగ్గరున్న నగరానికి వెళుతుంది. ఒక ట్రాఫిక్ కూడలి దగ్గరకి వెళుతుంది. కాసేపు చూసి వెనుదిరుగుతుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
నిజానికి ఏవా బయటకి వెళ్లాలనే కోరికతోనే కేలెబ్‌ని మోసం చేసింది. నేథన్ తనని మార్చి కొత్త రోబోట్ ని తయారు చేస్తాడని తెలిసి ఆమె అతన్ని చంపటానికి కూడా వెనుకాడలేదు. మొదటి నుంచి కేలెబ్‌కి నేథన్ మీద ద్వేషం కలిగేలా చేసింది. ఆమె తొలిసారి డ్రస్సు వేసుకున్నప్పుడు అతని ముఖంలో నిజంగా ప్రేమ భావాలు లేవనే నాకనిపించింది. ఎందుకంటే అతనప్పుడు అయోమయంలో ఉన్నాడు. కానీ ఆమె తెలివిగా “నీ ముఖంలోని భావాలు చూస్తే నేను నీకు నచ్చానని అనిపిస్తోంది” అంటుంది. ఒక అమ్మాయి అలా అంటే మగవాడు పడిపోకుండా ఉంటాడా? తర్వాత ఏవా అతను మంచివాడని ఒప్పుకుని అతని అహాన్ని తృప్తి పరిచింది. దాంతో అతను ఆమెని నమ్మాడు. నమ్మినవారినే కదా మోసం చేయగలం! నేథన్ చేసిన పరీక్ష విజయవంతమయింది. అయితే ఆ పరీక్ష ఫలితం మాత్రం దుష్ఫలితమే. కృత్రిమ మేధ వల్ల ఎలాంటి దుష్పరిణామాలుంటాయో మనకొక అవగాహన వస్తుంది. అయితే చివరికి ఏవా వెనుదిరగటం ఏమిటి? నాకైతే ఆమె తిరిగి వసతి గృహానికి తిరిగి వచ్చిందేమో అనిపించింది. ట్రాఫిక్ కూడలిలో ఆమె చూసినది ఆమెకి ఉత్తేజం కలిగించలేదు. ఆమెకి అప్పటికే ఎంతో సమాచారం ఫీడ్ చేయబడింది. ఏదీ కొత్తగా ఉండదు. మరీ విడ్డూరమైతే తప్ప. ఆమె తిరిగి వచ్చి కేలెబ్‌ని విడిపించదనే అనుకోవచ్చు. ఇదంతా అప్రస్తుతం. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు మన జీవితాలని శాసిస్తున్నాయి. వాటికి కృత్రిమ మేధ తోడైతే అవి సొంతంగా ఆలోచించటం మొదలు పెడతాయి. అది ఎక్కడికి దారి తీస్తుందో ఈ చిత్రంలో ఒక కోణంలో చూపించారు. కృత్రిమ మేధని వ్యాపారస్థుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వాలు కట్టడి చేయాలి. చూద్దాం ఏమవుతుందో!