మహాభారత కథలు-54: ఇంద్రప్రస్థపురం చేరుకున్న అర్జునుడు

0
4

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఇంద్రప్రస్థపురం చేరుకున్న అర్జునుడు:

[dropcap]అ[/dropcap]ర్జునుడు తను కోరుకున్న సుభద్రని వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమెని తీసుకుని సురక్షితంగా ఇంద్రప్రస్థపురం వైపు వెళ్లిపోయాడు. వాయువేగంతో రథం మీద ప్రయాణం చేస్తూ అర్జునుడు ఆనర్తక దేశాలకి వెళ్లాడు. శ్రీకృష్ణుడు పంపించిన దాశార్హవంశానికి చెందిన వీరులతో కలిసి అనేక అడవులు దాటాడు. మధ్యలో పుణ్యతీర్థాల్లో స్నానం చేశాడు. అనేక గ్రామాల్లో తిరిగాడు. ఇంద్రప్రస్థ పురానికి దగ్గరలో ఆవుమందలు ఉన్నచోటు చూసుకుని ఆగాడు.

సుభద్ర వైపు చూసి “మనం ఇలా కలిసి వెడితే ద్రౌపది చూసి కఠినంగా మాట్లాడుతుందేమో. ఆమె గొప్ప పతివ్రత. ఆమె ఏది అంటే అది జరిగిపోతుంది. నువ్వు ముందు గోపబాలికలతో కలిసి వెళ్లు. తరువాత నేను వస్తాను” అని చెప్పాడు. అర్జునుడు చెప్పినట్టే సుభద్ర ఇంద్రప్రస్థపురం వెళ్లి కుంతీదేవికి, ద్రౌపదికి నమస్కారం చేసింది. ద్రౌపది సుభద్రని “నీ భర్త శత్రువీరుల్ని జయించి విజయుడవుతాడు. నువ్వు వీరమాత అవుతావు!” అని సంతోషంగా దీవించింది.

అదే సమయంలో అర్జునుడు దాశార్హసైన్యంతో బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో ఇంద్రప్రస్థ పురంలోకి ప్రవేశించాడు. తమ పురోహితుడైన ధౌమ్యుడికి, అన్నలు ధర్మరాజు భీముడికి, తల్లి కుంతిదేవికి నమస్కారం చేశాడు. తనకు మొక్కిన నకులసహదేవుల్ని ప్రేమగా కౌగలించుకున్నాడు. అందరితో కలిసి సంతోషంగా ఉన్నాడు.

పాండవులకి కానుకలు తెచ్చిన శ్రీకృష్ణ బలరాములు

చెల్లెలు సుభద్ర, మరిది అర్జునుడు ఇంద్రప్రస్థపురం చేరుకుని చాలా ఆనందంగా ఉన్నారని తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలైన యాదవకుల వీరులతో కలిసి ఇంద్రప్రస్థపురం బయలుదేరాడు. చెప్పడానికి వీలు లేనన్ని గొప్ప వస్తువుల్ని, వాహనాల్ని చెల్లెలికి అరణంగా ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నాడు.

అందరూ బయలుదేరి ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని ధర్మరాజు గౌరవంతో నకులసహదేవుల్ని ఎదురు పంపించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురం చేరగానే ధర్మరాజు భీమార్జునులతో కలిసి తను కూడా అనందంగా ఎదురు వెళ్లాడు. వసుదేవుడితో సహా యాదవకుల పెద్దలందరికీ నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు, సాత్యకి, సారణుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్లందర్నీ ప్రేమతో గౌరవించాడు.

మద్దెలలు, తప్పెటలు, నగారాలు మోగుతూ ఉండగా వసుదేవుడు మొదలైన యాదవ వంశ పెద్దలు, కురువంశంలో పెద్దలు వాళ్లవాళ్ల సంపదలతోను, పొగడ్తలతోను బంధువులందరిని గౌరవించారు. బ్రాహ్మణులకి కావలసినవి ఇచ్చి సత్కరించారు. ఏడురోజులు పండుగ జరిపించారు.

శ్రీకృష్ణుడు రత్నాలతో కూర్చబడి గొప్ప కాంతితో ప్రకాశించే వెయ్యి ఆభరణాల్ని అర్జునుడికి, సుభద్రకి కానుకగ ఇచ్చాడు. మదించిన ఏనుగులు వెయ్యి; గుర్రాలు సారథి కలిగి రత్నాలు పొదగబడిన రథాలు వెయ్యి; అందమైన ఆభరణాలతో అలంకరింపబడిన స్త్రీలు వెయ్యిమంది; బంగారు పల్లకీలు వెయ్యి; అందంగా నడిచే గాడిదలు అయిదు వందలు; సింధు, బాహ్లిక, కాంభోజ, పారశీక దేశాలలో పుట్టిన గుర్రాలు నూరువేలు; ఆవులు ఒక లక్ష; గొప్ప శౌర్యం కలిగిన దాశార్హవీరులు పదిలక్షలమందిని అరణంగా ఇచ్చాడు.

కుంతీదేవిని, ధర్మరాజుని, భీముడిని, నకులసహదేవుల్ని ద్రౌపదిని విలువైన రత్నాభరణాలతో వేరు వేరుగా పూజించాడు. బలరాముడు మొదలైన యాదవ ప్రముఖులు అందరూ సుభద్రార్జునుల్ని పూజించారు. తాము కూడా పాండవులతో పూజలందుకుని ద్వారవతికి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలో వినోదాలతో కాలం గడుపుతున్నాడు.

అభిమన్యుడు జననము

పృథుచక్రవర్తితో సమానమైన కీర్తితో, పవిత్రమైన నడవడికతో, వీరులకే భయం కలిగించేంత పరాక్రమంతో, యుద్ధంలో ఇతర రాజులకి భయాన్ని కలిగించేంత గొప్ప శౌర్యంతో, పాండవ వంశాన్ని నిలపడానికి అవసరమైన అన్ని అర్హతలతో పుణ్యదంపతులైన సుభద్రార్జునులకి కుమారుడు అభిమన్యుడు జన్మించాడు.

స్వచ్ఛమైన కీర్తి కలిగిన ధర్మరాజు అభిమన్యుడు పుట్టినప్పుడు పండుగ జరిపించాడు. వేదవేత్తలు, బ్రహ్మదేవుడితో సమానమైన బ్రాహ్మణులకి బంగారు ఆవులు, పదివేల గోవులు ఇచ్చి సత్కరించాడు. తల్లితండ్రులకి, ప్రజలకి అనందాన్ని కలిగిస్తూ పుట్టిన అభిమన్యుడికి ధౌమ్యుడు జాతకర్మ, ఉపనయనం చేసాడు. మొదటి నుంచీ అభిమన్యుడికి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంది. పురోహితుడు ధౌమ్యుడు దగ్గర ఆరు అంగాలతో వేదవిద్యని అభ్యసించాడు. తండ్రి అర్జునుడి దగ్గర ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. పరాక్రమమే సంపదగా శత్రు సైన్యాల్ని భేదించే విధానాలన్నింటినీ నేర్చుకున్నాడు.

తరువాత ద్రౌపదికి కూడా పంచపాండవుల వల్ల ఉపపాండవులు కలిగారు. వాళ్ల పేర్లు వరుసగా ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు. కొడుకుల్ని పొందిన పాండవులు నిర్మలమైన నీతితోను, సద్గుణాలతోను ప్రంపంచంలో ఉన్న ప్రజలందరి మన్ననలు పొంది సుఖంగా ఉన్నారు.

వేసవికాలం పగటి పూట వడగాడ్పులు, వాటి వల్ల ఏర్పడిపోయిన జలాశయాలతో ప్రాణులన్నీ ఓర్చుకోలేని స్థితిలో ఉంది. అటువంటి ఎండలు తట్టుకోలేక అర్జునుడు శ్రీకృష్ణుడితో “శ్రీకృష్ణా! మనిద్దరం అందమైన కొండచరియల్లో తిరుగుదాము. అడవుల్లో వేటాడుదాము. వికసిస్తున్న పువ్వుల పరిమళాలు వెదజల్లుతూ యమునానది అలల మీద నుంచి వచ్చే గాలిని ఆస్వాదిద్దాము. చల్లని ప్రదేశాల మధ్య కట్టబడిన మేడల్లో ఈ వేసవి రోజుల్ని గడిపేద్దాము” అన్నాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగినదానికి అంగీకరించాడు. స్నేహితులు, మంత్రులు, సేవకులతో కలిసి కృష్ణార్జునులు చల్లటి ప్రదేశాల్లో తిరుగుతూ హాయిగా గడిపేస్తున్నారు. ఒకరోజు ఖాండవ వనానికి దగ్గర్లో మంచిగంధపు చెట్ల మధ్య ఉన్న ఇంటిలో చలువరాతి అరుగుమీద కూర్చున్నారు. మంచి సువాసనతో నెమ్మదిగా వీస్తున్న గాలిని అనుభవిస్తూ ఇష్టమైన కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

ఖాండవ వన దహనము

కృష్ణార్జుల దగ్గరికి వచ్చిన అగ్నిదేవుడు

గొప్ప తేజస్సు కలిగిన శరీరకాంతితో, నునుపుగా గోరోజనం రంగు కలిగిన జుట్టుతో, ఎక్కువగా అలిసిపోయిన వాడిలా బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడు కృష్ణార్జునుల దగ్గరికి వచ్చాడు. కృష్ణార్జునులు ఆ బ్రాహ్మణుణ్ని భక్తితో పూజించారు. బ్రాహ్మణుడు వాళ్లతో “అయ్యా! నేను భోజనం ఎక్కువగా తింటాను. నాకు ఆకలి కూడా చాలా ఎక్కువే. మీరు పెట్టగలిగితే నాకు గౌరవంగా తృప్తి కలిగేలా భోజనం పెట్టండి!” అని అడిగాడు.

అతడి మాటలు విని “నీకు ఏ భోజనం ఇష్టమో చెప్తే దాన్నే నీకు పెడతాము అడుగు” అన్నారు కృష్ణార్జునులు. ఆ బ్రాహ్మణుడు “నేను అగ్నిదేవుణ్ని. నాకు కావలసిన ఆహారం దేవేంద్రుడి ఖాండవవనం. ఇదివరకు దీన్ని తినాలని ప్రయత్నించాను. ఇంద్రుడు భయంకరమైన వంద మేఘాల్ని పంపించడం వల్ల వీలు కాలేదు. అవి నన్ను తరిమికొట్టాయి.

తక్షకుడు అనే నాగరాజు ఇంద్రుడికి మంచి స్నేహితుడు. అతడు ఈ ఖాండవ వనంలోనే జీవిస్తున్నాడు. అందుకే ఇంద్రుడు ఈ వనాన్ని అమృతం రక్షిస్తున్నట్టు చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నాడు. అందువల్ల ఇక్కడున్న ప్రాణులన్నీ సుఖంగా జీవిస్తున్నాయి. మీరు గొప్ప బలవంతులు.. శాస్త్రాలన్నీ బాగా తెలిసినవాళ్లు. దేవేంద్రుడు నాకు కలిగిస్తున్న అడ్డంకుల్ని మీరు పోగొడితే నేను ఈ ఖాండవ వనాన్ని భక్షించి నా అకలి బాధ తీర్చుకోగలను” అని కృష్ణార్జునుల్ని ప్రార్థించాడు.

ఇంత వరకు చెప్పినదాన్ని విని జనమేజయుడు వైశంపాయనుడితో “మహర్షీ! ఇంత గొప్ప చరిత్ర మీరు చెప్తుండగా వినడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అసలు ఇంద్రుడు రక్షిస్తున్న ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించాలని ఎందుకు అనుకున్నాడో తెలుసుకోవాలని ఉంది. వివరంగా తెలియచెయ్యండి” అని వినయంగా అడిగాడు.

రాజర్షి శ్వేతకి వృత్తాంతము

జనమేజయుడు అడిగినదానికి వైశంపాయనుడు ఇలా చెప్పాడు. పూర్వం శ్వేతకి అనే రాజర్షి ఎక్కువగా నెయ్యిని ఉపయోగించి, ఎక్కువగా దక్షిణలు ఇచ్చి అనేక యజ్ఞాలు చేశాడు. నూరు సంవత్సరాలు చేసే సత్రయాగాన్ని తను కూడా చెయ్యాలని అనుకున్నాడు. యాగం చేయించడానికి తగిన బ్రాహ్మణుల్ని అడిగాడు. అతడు అడిగిన దానికి బ్రాహ్మణులు “మహర్షీ! అంత శ్రమ మేము పడలేము. ఎప్పుడూ ఆపకుండా యజ్ఞాలు చేస్తూ ఉండే స్వభావం నీది. ఈశ్వరుడే ఋత్విక్కుడిగ ఉండి నీ యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు. ఆ పని మాకు సాధ్యం కాదు” అన్నారు కొంచెం విసుగ్గా.

వాళ్ల మాటలు విని శ్వేతకి బాధపడ్డాడు. వెంటనే బయలుదేరి కైలాసం వెళ్లాడు. కైలాసవాసుడు అన్ని లోకాలకి పూజ్యుడు, చంద్రశేఖరుడు అయిన శివుణ్ని గురించి తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. శ్వేతకిమహర్షికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. “శ్వేతకీ! నీకు ఏం కావాలో దాన్ని ఇస్తాను కోరుకో!” అన్నాడు.

పరమేశ్వరుణ్ని చూసి సంతోషంతో శ్వేతకి “పరమేశ్వరా! నాకు నూరు సంవత్సరాలు చేసే సత్రయాగం చెయ్యాలని ఉంది. దానికి నువ్వే ఋత్విక్కుడుగా ఉండి దాన్ని పూర్తి చేయించు” అని ప్రార్థించాడు. శ్వేతకి కోరిక విని పరమేశ్వరుడు “శ్వేతకీ! యజ్ఞం చేయించడం అనే పని బ్రాహ్మణులకి అప్పగించబడినట్టు శాస్త్రాల్లో చెప్పబడింది. ఇతరులు ఎవ్వరూ ఆ పని చెయ్యకూడదు. అందుకని నువ్వు బ్రహ్మచర్యం వహిస్తూ పన్నెండు సంవత్సరాలు నెయ్యిని ధారలుగా కురిపిస్తూ అగ్నిదేవుడు తృప్తి పడేలా చెయ్యి” అన్నాడు.

శ్వేతకి పరమేశ్వరుడు చెప్పినట్టు అగ్నిదేవుణ్ని తృప్తిపరిచాడు. ఈశ్వరుడు శ్వేతకి కోరిక తీర్చడానికి వచ్చి దుర్వాసమహర్షిని రప్పించి “మహర్షీ ఈ శ్వేతకి ఆపకుండా ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఇతడికి యజ్ఞాలు చెయ్యడమంటే చాలా ఇష్టం కలవాడు. పాపభీతి ఉన్నవాడు. ఇతడితో యజ్ఞం చేయించు” అని చెప్పాడు. దుర్వాసమహర్షి ఋత్విజుడుగా గొప్ప తపస్సంపన్నులైన మహర్షులతో కలిసి శ్వేతకితో అతడికి ఇష్టమైన సత్త్రయాగాన్ని పూర్తి చేయించాడు. ఆ యాగంలో నెయ్యిని ధారగా ఆపకుండా ఉపయోగించడం వల్ల అగ్నిదేవుడికి జీర్ణశక్తి, కాంతి తగ్గి, దాహం పెరిగింది.

అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకున్నాడు. ఆ బాధ నేతిని ఎక్కువగా తీసుకోడం వల్ల వచ్చిందని బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు. అగ్నిదేవుడితో “అగ్నిహోత్రా! ఈ వ్యాధి తగ్గాలంటే దివ్యమైన ఔషధాలు కలిగిన దేవతా వనాన్ని భక్షించాలి. దాని వల్ల నీకు వచ్చిన వ్యాధి పోతుంది” అని చెప్పాడు.

అగ్నిహోత్రుడు ఖాండవ వనాన్ని తినడం మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద ఏనుగుల గుంపు వచ్చినట్టు మేఘాలు వచ్చి ఏనుగులు తమ తొండాలతో నీరు కుమ్మరిస్తున్నట్టు వర్షం కురిపించడం వల్ల అగ్నిదేవుడికి దేవతా వనాన్ని తినడానికి వీలు పడలేదు. అతడు మళ్లీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి “బ్రహ్మదేవా! నేను మీరు చెప్పినట్టే ఖాండవవనాన్ని దహించడానికి వెళ్లాను. కాని, దాన్ని రక్షిస్తున్నవాళ్లు నాకు ఆటంకం కలిగిస్తున్నారు. ఏడుసార్లు ప్రయత్నించినా నాకు సాధ్యపడలేదు. ఇంకేదయినా ఉపాయం చెప్పు” అని ప్రాధేయపడ్డాడు.

బ్రహ్మదేవుడు అగ్నిదేవుడి బాధని అర్థం చేసుకుని “అగ్నిహోత్రా! కొంతకాలం గడిచాక దేవతలకి మంచి చెయ్యడం కోసం నరనారాయణులు భూలోకంలో అర్జునుడు, కృష్ణుడుగా పుడతారు. ఖాండవవనం దగ్గర విహరించడానికి వస్తారు. నువ్వు వాళ్లని ప్రార్థిస్తే తమ అస్త్రబలంతో నీకు ఏ ఆటంకాలు లేకుండా చేస్తారు. నువ్వు ఖాండవ వనాన్ని భక్షించడానికి తగిన వీలు కల్పిస్తారు” అని చెప్పాడు.

అగ్నిదేవుడు బ్రహ్మ చెప్పింది విని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాడు. కృష్ణార్జునులు కనిపించగానే బ్రహ్మదేవుడు చెప్పినట్టు కృష్ణార్జునుల్ని ప్రార్థించాడు.

కృష్ణార్జునులకి ఆయుధాలు సమకూర్చిన అగ్నిదేవుడు

ఖాండవవనాన్ని కాల్చడానికి సహాయపడమని అడిగిన అగ్నిహోత్రుడితో అర్జునుడు “పుణ్యాత్మా! అగ్నిహోత్రా! నువ్వు చెప్పిన ఏనుగు తొండమంత నీటి ధారలు కురిపించే మేఘాల గుంపుని చెల్లాచెదరు చెయ్యడానికి.. దేవతలతో కలిసి ఉన్న ఇంద్రుణ్ని ఓడించడానికి అనువైన దివ్యాస్త్రాలు మా దగ్గర ఉన్నాయి. అటువంటి అస్త్రాలకి, నా భుజబలానికి సరిపోయేట్టు వేగంగా వింటిలో సంధించడానికి ధనుస్సు లేదు. వీటన్నింటినీ మొయ్యగల రథం నా దగ్గర లేదు. శ్రీకృష్ణుడి దగ్గర కూడా ఇప్పుడు ఆయుధాలు లేవు. అందువల్ల నీకు ఉపకారం చెయ్యలేకపోతున్నాం” అన్నాడు.

అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుణ్ని తలుచుకుని “చంద్రుడు నీకు ఇచ్చిన బ్రహ్మతో తయారు చెయ్యబడిన ధనుస్సు, అనేక బాణాలు కలిగిన రెండు అమ్ములపొదులు, గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలతో కట్టబడిన రథము తెచ్చి అర్జునుడికి.. చక్రాన్నీ, గదనీ శ్రీకృష్ణుడికి ఇయ్యి” అని చెప్పాడు. వరుణుడు వెంటనే వెళ్లి దేవతలు, నాగులు, గంధర్వులు మొదలైన వాళ్లని కూడా జయించడానికి అనువైంది, వజ్రంలా కఠినంగా ఉండేది, ఇతర ఆయుధాల్ని నాశనం చెయ్యడానికి కూడా ఉపయోగపడేది, అన్ని లోకాలకి ఇష్టమైంది, దివ్యమైంది గొప్ప తేజస్సు గలది అయిన గాండీవము అనే ధనుస్సుని అర్జునుడికి ఇచ్చాడు.

అంతేకాదు తరగని బాణాలు కలిగిన అమ్ములపొదుల్ని, అనేక ఆయుధాలతో నిండి సింహపు తోకవంటి తోక, కోతి గుర్తు గల జెండా, మేఘ ధ్వని వంటి గొప్ప ధ్వని, చాలా వేగంతో పరుగెత్తగల తెల్లటి గుర్రాలు, రత్నాలతో కూర్చబడిన మోగే చిరుగంటలు కలిగి అన్ని దిక్కుల్ని జయించడానికి వీలుగా ఉన్న దివ్యరథాన్ని అర్జునుడికి ఇచ్చాడు.

వెయ్యిసూర్యుల ప్రకాశంతో వెలుగుతూ దేవతలు, రాక్షసులు, యక్షులు, పిశాచులు, నాగుల్ని సంహరించగల సుదర్శన చక్రాన్ని, కౌమోదకి అనే గదని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దివ్య ధనుస్సుని, రథాన్ని, ఆయుధాల్ని పొందిన అర్జునుణ్ని, శ్రీకృష్ణుణ్ని చూసి అగ్నిదేవుడు “అర్జునా! ఈ ధనుస్సు పేరు గాండీవం. మంత్రంతో కూడిన బాణాలు కూడా దీన్ని తగలగానే వజ్రాయుధంతో కొట్టబడిన రాళ్లల్లా ముక్కలవుతాయి. వాయువేగంతో పరుగెత్తగల గుర్రాలు కట్టబడిన ఈ రథానికి ఎదురే ఉండదు. పూర్వం దీన్ని ఎక్కి మహాబలుడైన చంద్రుడు అన్ని దిక్కుల్ని జయించాడు. శ్రీకృష్ణా! ఈ చక్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఆ పని పూర్తి చేసుకుని మళ్లీ వచ్చి నిన్ను చేరుతుంది” అని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here