[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘మార్గదర్శకులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భూ[/dropcap]మి పై పురుడు పోసుకున్న ప్రాణం
పదిలంగా ఎదగాలి
తనకు తానుగా ఏమీ నేర్వని చిరు ప్రాయం
అన్నీ తానై కంటికిరెప్పలా కన్నతల్లి
ఆది గురువు గా అవతారం ఎత్తుతుంది
క్షణ క్షణం పరివర్తన గావిస్తుంది
ఆలనలో అనురాగాన్ని అందిస్తుంది
అత్త అనో,అమ్మా అనో ఏమేమో మాటలకు శ్రీకారం చుడుతుంది
బుడిబుడి మాటల బోసి నవ్వులకు మురిసిపోతుంది
లాలి పాటలతో నిదుర పుచ్చుతుంది
మాతృదేవో అన్నపదానికి నిలువెత్తు సాక్ష్యం గా నిలుస్తుంది
వేలు పట్టి లోకాన్ని చూపిన నాన్న మలిగురువు
నరులలో మేటిగా చేయు నాన్న పాలన
నడవడికకు తోడై నిలుచు
లక్ష్యం కోసం నడవమని ప్రభోధించు
విలక్షణమైన ప్రణాళికను ఏర్పరచు
పితృదేవోభవ అంటే అక్షరాల ఇదే
ఇంటి నుండి బయలుదేరిన ఆ బాలుడు
బడిలో అడుగు పెట్టగానే ఆచార్యుని పాఠంతో అక్షరాలు రాస్తాడు
పదాలు,వాక్యాలు వర్ణమాల చదువుతాడు
ఆ గురువు దీవెనలతో గురుతరముగా
ఎదుగుతాడు
ఆచార్య దేవోభవ అంటూ అంజలి ఘటిస్తాడు
ఎంతో చక్కని బాలుడంటూ అతిథులంతా హర్షిస్తారు
ఆత్మీయంగా పలకరిస్తారు
అతిథి దేవోభవ అని కీర్తింపబడతారు
మాతృదేవోభవ, పితృదేవోభవ
ఆచార్య దేవోభవ, అతిథి దేవో భవ
గురుఃబ్రహ్మ, గురుఃవిష్ణుః, గురుఃదేవో మహేశ్వర!
గురుఃసాక్షాత్ పరఃబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
మార్గదర్శకులుగా అంధకారాన్ని తొలగించి
విజ్ఞాన జ్యోతులను అందించే ఈ గురువులకు నిత్య నమస్సుమాంజలులు..