[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘మరపు వరం!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కేశవ్, తండ్రిని సుమారు 5 ఏళ్ళప్పుడే పోగొట్టుకున్నాడు. ఆయన ఇతనిని చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. ఆఫీస్ పని మీద వెళ్ళి ఆ క్యాంపు నుంచి నెల జీతం తీసుకుని ఇంటికి వస్తూ, ఎండదెబ్బ వల్ల పోయాడాయన అకస్మాత్తుగా! వాళ్ళమ్మే ఇతనిని కష్టపడి చదివించింది.
బుధ్ధిగా చదువుకుని చదువు అయిపోగానే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు కేశవ్.
***
కాస్త జ్వరంగా ఉండటంతో రెండు రోజులు సెలవు పెట్టి, రైల్లో ఇంటికి ప్రయాణమయ్యాడు, ఆ రోజు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక చిన్న స్టేషన్లో ఎక్కాడు ఒక 15,16 ఏళ్ళ కుర్రవాడు. కేశవ్ ఎదురుగా ఉన్న లోయర్ బెర్తు అతనిది. పెద్దగా రద్దీగా లేదు ఆ రోజు, ఆ కోచ్‌లో.
***
ఒక గంట నుంచి చూస్తున్నాడు అతను కేశవ్‌ను. జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తూనే ఉంది.
“ఏదన్నా కావాలాండీ, ఒంట్లో బాగా లేదా”, అని అడిగాడతను కేశవ్‌ని!
తన కంటే 6,7 ఏళ్ళు చిన్నవాడైన అతడు అట్లా అడగ్గానే, కేశవ్ లేచి కూచుని, నవ్వు తెచ్చి పెట్టుకుంటూ, “నో. నో. ఏం లేదు, ఐ ఆమ్ ఓకే”, అన్నాడు దగ్గుతూనే!
ఇద్దరూ కాస్సేపు మాట్లాడుకున్నారు.
కేశవ్ ఇంటర్ చదివిన కాలేజీ లోనే తను ప్రస్తుతం చదువుతున్నది అని తెలియగానే, అతనికి ఉత్సాహం రెట్టింపైంది సంభాషణలో!
ఇద్దరూ ఆ కాలేజీ విషయాలు, లెక్చరర్ల తీరులూ, లాంటివి అనేకం మాట్లాడుకున్నారు, సుమారు రెండు గంటల పాటు.
“ఓహ్, రెండై పోయింది, మాటల్లో తెలియనే లేదు పడుకుందామా, ఇక”, అన్నాడు కేశవ్, కాస్త నిద్ర వస్తున్నట్టనిపించి!
“అలాగే”, అని ఆ అబ్బాయి, “మీ ఫుల్ అడ్రస్ ఇస్తారా ఆండీ, మా కాలేజీ దగ్గరే అన్నారు కదా మీ ఇల్లు, ఎప్పుడైనా మీరు ఊళ్ళో ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను మీ కభ్యంతరం లేకపోతే”, అన్నాడు.
“తప్పకుండా”, అని కేశవ్ తన అడ్రస్ చెప్తే అతను మొబైల్లో నోట్ చేసుకున్నాడు.
పొద్దున కాచీగుడా స్టేషన్‌లో దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇద్దరికీ ఏదో తెలియని మైత్రి లాంటి భావన కలిగింది, ఒకరి పట్ల ఒకరికి, ఆ స్వల్ప పరిచయంతో!
***
రెండు రోజుల సెలవు, జ్వరం వల్ల నాలుగు రోజులు పొడిగించాల్సి వచ్చింది కేశవ్‌కి.
మర్నాడు ఆదివారం రైలుకి బెంగుళూర్ వెళ్ళిపోవాలి, ఇప్పటికే బాస్ నుంచి రెండు సార్లు ఫోనొచ్చేసింది. శనివారం సాయంకాలం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తిరిగొస్తున్న కేశవ్‌కి, ఆ అబ్బాయి-అభిషేక్ బస్ స్టాండులో కలిశాడు అనుకోకుండా!
చూడగానే అతను, “కేశవ్ చాలా అనుకున్నానురా నీ గురించే,ఆ రోజు రైలు దిగిన తరువాత. నేను మీ నాన్నను, గుర్తు పట్టలేదూ”, అన్నాడు. “అయినా ఏం గుర్తుంటుంది లే, నీకు అయిదు నిండకుండానే నేను వెళ్ళిపోయానుగా!” అన్నాడు.
కేశవ్ దిగ్భ్రమతో వింటూండిపోయాడు ఆ మాటలు!
వెంటనే తేరుకుని,
“ఏవిఁటి అభిషేక్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది, అర్థం ఉందా?! నువ్వు నా చిన్నప్పుడే పోయిన మా నాన్నవా?!”, అన్నాడు అవాకులు చవాకులు మాట్లాడవాకు, అని ధ్వనింప చేస్తూ!
“కాదు కేశవ్, నిన్ను రైల్లో చూడగానే నా కెప్పటివో స్మృతులు తిరగదోడినట్లైంది, నేను ఇంక ఆగలేక రేపు సాయంత్రం మీ.. అదే, మన ఇంటికి వద్దామనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కనబడ్డావు”, అన్నాడు చొరవగా!
కేశవ్‌కి ఏమనాలో తోచలేదు. “నాకు అర్జంటుగా వేరే పని ఉంది, రేపు వెళ్ళిపోతున్నాను బెంగుళూరు. వచ్చే వారం కలుద్దాం ఇంటి దగ్గర”, అనగల్గాడు.
“అట్లా అంటావా, సరేలే, పని ఎందుకు చెడగొట్టుకోవడం వెళ్ళిరా! అమ్మకు చెప్పి ఉంచేయ్, నేనొస్తున్నాను వచ్చే ఆదివారం అని, సరేనా బాబూ” అన్నాడతను చాలా సహజంగా తండ్రి తన కొడుకుతో అన్నట్టు!
మతి తిరిగి పోయినట్లైంది, కేశవ్‌కి!
“సరే సరే, ఇక వస్తాను”, అని గబగబా అక్కడ నుంచి నిష్క్రమించాడు కేశవ్, ఏమీ అర్థం కాక!
కేశవ్ తండ్రిని అని చెప్పిన ఆ అబ్బాయి అభిషేక్ కూడా కేశవ్ వెళ్ళిన దిశగానే చూస్తూ ఒక నిమిషం ఉండిపోయాడు, ఏమీ కదలిక లేకుండా!
తరువాత ఏదో ఆలోచించుకుంటూ నెమ్మదిగా తానూ కదిలాడు వేరే దిళలో, మెట్రో పట్టుకోవడానికి!
***
తల్లికి చెప్పాలనిపించినా ఆ విషయం చెప్పి, ఎందుకులే ఆమెను కలవరబెట్టటం అని విరమించుకున్నాడు, కేశవ్!
అంతగా అయితే ఈ సారి చెపుదాంలే అనుకొని, అభిషేక్ విషయం ప్రస్తావించకుండానే బెంగుళూరు వెళ్ళిపోయాడు ఆదివారం నాడు.
***
శుక్రవారాని కల్లా బెంగుళూరులో కేశవ్ ఆఫీసు వెతుక్కుంటూ వచ్చేశాడు, అభిషేక్. లంచ్‌కి వెళ్ళి లిఫ్ట్ దగ్గరకు వెళ్తున్న కేశవ్‌కి ఎవరినో తన గురించి అడుగుతూ కనిపించాడు.
తనే అతని దగ్గరకు వెళ్ళాడు కేశవ్!
వెంటనే మొదలుపెట్టాడు అభిషేక్, “ఉండలేకపోయానురా నిన్ను చూడకుండా, వచ్చేశాను” అన్నాడు.
ఇదేమి విచిత్రమైన చిక్కు వచ్చిపడిందిరా బాబూ, అని చిరాకుపడ్డాడు కేశవ్!
కానీ అంతలోనే తేరుకుని, విషయం జటిలం చేసుకోకూడదని నిర్ణయించుకొని, మెల్లిగా అభిషేక్‌ని తీసుకుని బయట లాన్స్‌లో కూచుని అరగంట మాట్లాడి పంపించేశాడు.
అభిషేక్ చెప్పేవి అన్నీ తమ జీవితంలో జరిగినవే, తన తండ్రి గురించి చెప్పినవన్నీ కూడా సరిపోతున్నై!
ఇది నిజమనుకోవాలో, అబధ్ధమనుకోవాలో తెలియలేదు కేశవ్‌కి.
చివరకు వచ్చే ఆదివారం వస్తాను, ఇంటికి రా అప్పుడు మాట్లాడుకుందాం అన్ని విషయాలూ అని నచ్చచెప్పి, అతన్ని పంపించాడు.
ఆఫీసులో కేశవ్‌కి ఏ ఇబ్బందీ అవగూడదనే వెళ్ళినట్లు కనబడ్డాడు కానీ, అతను ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు అప్పుడు కూడా తన ‘కొడుకు’ను వదిలి!
***
శుక్రవారం సాయంకాలం ఫ్లైట్‌లో బయల్దేరి ఇంటికి వచ్చిన కేశవ్‌ని చూసి ఆశ్చర్య పోయింది అతని తల్లి, కమలాదేవి.
స్నానం చేసి భోజనం ముగించి, “అమ్మా ఒక విషయం మాట్లాడాలి నీతో”, అన్నాడు.
ఆమె అసలు ఈ విషయం వింటే ఎట్లా స్పందిస్తుందో అనేది ఊహకు కూడా చిక్కలేదు, అతనికి.
విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు కేశవ్ తల్లికి. ఆమె మొదట భయపడిపోయింది అది విని.
తరువాత “ఆలోచిస్తే ఇదేమైనా మోసమేమో అనిపిస్తోంది కేశవ్”, అన్నది ఏమీ పాలుపోక!
“లేదమ్మా అతని తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడుదాం తొందరపడవద్దు”, అన్నాడు కేశవ్.
ఎలాగూ అతను అన్నమాటలను బట్టి ఆదివారం వస్తాడు కదా, అప్పుడు అమ్మ కూడా చూస్తుంది అతనినీ, అతని వాలకాన్నీ! ఆ తరువాత ఏమంటుందో దాన్ని బట్టి చేద్దాం అనుకొన్నాడు.
***
ఆదివారం వచ్చింది, 9 గంటలకే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేశాడు అభిషేక్! ఊహించిందే కాబట్టి కేశవ్, ఏమీ తడబడలేదు.
కానీ, వస్తూనే “ఎలా ఉన్నావ్ కమలా, ఒంట్లో బాగుంటోందా”, అని మొదలు పెట్టిన అభిషేక్ వాలకాన్ని చూసి విస్మయం పొందింది, కమలాదేవి, ఏదో అద్భుతం చూస్తునట్టు!
ఈ అబ్బాయి, తన భర్తా?! ఆలోచించటానికే, ఏదో వింతగా, కథలో లాగా అనిపించింది ఆమెకు.
అతని మాట తీరు, హావభావాలూ నడక తీరూ, అన్నీ అచ్చం తన భర్త నారాయణరావునే పోలి ఉన్నాయి. అతనితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియలేదు ఆమెకు, ఒక పెద్ద పరీక్ష లాగా అనిపించింది.
అవీ ఇవీ అభిషేక్ ఒక్కడే పాత విషయాలన్నీ మాట్లాడాడు,.
తల్లికి ఇబ్బందిగా ఉందని గ్రహించిన కేశవ్, “సరే అభిషేక్, అలా బయటకు వెళ్దామా, అమ్మ కాస్సేపు విశ్రాంతి తీసుకుంటుంది” అన్నాడు, ఎక్కడో అక్కడ ఆ వింత ప్రహసనానికి అడ్డు తెర వేయాలని!
అతను అయిష్టంగానే “సరే” అన్నాడు.
“వస్తా కమలా జాగ్రత్త! మళ్ళీ వస్తానులే, ధైర్యంగా ఉండు”, అని చెప్పి మరీ బయటకు అడుగు వేశాడు, కేశవ్‌తో పాటు!
***
ఇట్లా తరుచు ఆదివారాలు రావటం, తల్లి కూడా అతనితో ఏదో ఒక 15,16 ఏళ్ళ కుర్రాడితో మాట్లాడినట్టు కాకుండా ఒక సాధారణానికి భిన్నమైన ఆదర భావంతో మాట్లాడటం – ఇవన్నీ కేశవ్‌కి ఇబ్బందిగానే పరిణమించాయి.
అయినా అభిషేక్ చూపించే వాత్సల్యం, మాట మెత్తదనం – ముఖ్యంగా తల్లి ఏమీ అనకపోవటం ఇవన్నీ కేశవ్‌ని కట్టిపడేసినై, స్వతహాగా అతనికి కొంత ఈ వ్యవహారం చిరాగ్గా ఉన్నా!!
***
ఒక పండగ సెలవు రోజు హైద్రాబాద్ వచ్చిన కేశవ్ తల్లితో సహా అభిషేక్ ఇంటికి వెళ్ళారు, అతను ఇచ్చిన అడ్రస్‌ని పట్టుకుని. అకస్మాత్తుగా కారు దిగి ఇంట్లోకి వస్తున్న వారిని ముందుగా చూసింది అభిషేకే ఆ సమయంలో!
ఏ మాత్రం తడబాటు లేకుండా అతనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలను హాల్లోకి తెచ్చి “అమ్మా! నే చెప్పానే మీకు – వాళ్ళే వచ్చారు చూడండి”, అంటూ, కేశవ్‌నీ కమలాదేవినీ, తన వాళ్ళుగా పరిచయం చేశాడు.
ఎవరికీ ఏమి మాట్లాడాలో తెలియక అందరూ మౌనం వహించారు కాస్సేపు. అభిషేక్ వాళ్ళ నాన్న, శేషగిరిరావు కేశవ్‌ని అతని చదువూ, ఉద్యోగం గురించిన ఏవో ప్రశ్నలు వేసి సంభాషణ మొదలు పెట్టాడు.
అంతలో అభిషేక్ తల్లి, వసుంధర ఏవైనా స్నాక్స్ తెమ్మని అభిషేక్‌ను పంపించేస్తే, అతను ఇష్టం లేకుండానే, సరేలే తొందరగా తెచ్చేద్దాం అంటూ బయలుదేరి బయటకు వెళ్ళాడు.
***
“మీకు తెలుసా అంకుల్, అభిషేక్ చెప్పాడా ఈ విషయం ముందే” అని అడిగాడు.
శేషగిరిరావు, “చెప్పాడు బాబూ, ఓ నెల రోజుల క్రితం, అదే మాకూ పాలుపోవట్లేదు ఏం చేయాలో”, అన్నాడు.
వసుంధర కూడా చాలా దిగులుగా మాట్లాడసాగింది, “ఈ వైఖరి ఏమిటో అంతు పట్టట్లేదండీ, అసలు నమ్మశక్యం కానిదిగా ఉన్నది”, అన్నది కమలాదేవితో.
ఆమె కూడా “అవునండీ మాకూ అయోమయంగానే ఉన్నది ఆ అబ్బాయి ధోరణి”, అన్నది ఇంకేం చెప్పాలో తోచక!
ఇంతలో అభిషేక్ వచ్చాడు, స్నాక్స్ తీసుకుని. కమలాదేవినీ, కేశవ్‌నీ చూసి మొహం వెలిగిపోయింది అతనికి. “అమ్మయ్య ఉన్నారు కదా, తీసుకోండి స్పెషల్ మిక్స్చర్, బాదుషా తెచ్చాను మీ కోసం” అన్నాడు.
కమలాదేవికి బాదుషా ఇష్టం అని కేశవ్‌కీ తెలుసు.
అభిషేక్‌కి అది కూడా సరిగ్గా గుర్తుందని కమల, కేశవ్ గ్రహించారు, ఆశ్చర్యపోయారు కూడా, ఆ ‘అలౌకిక’ జ్ఞాపకశక్తికి!
ఒక పది నిమిషాల్లో బయల్దేరారు కేశవ్, కమలాదేవి.
“మా ఇంటికి రండి మీరు కూడా” అని వాళ్ళని వీళ్ళు కానీ, “వస్తూండండి” అని వీరు కానీ అనలేని సందర్భం అది, రెండు కుటుంబాలకీ!
“ఉంటామండీ”, అని వారన్నారు. “మంచిదండీ”, అని వీరి ముక్తసరి జవాబు!
అభిషేక్ మాత్రం ఈ వీడ్కోలు ఏ మాత్రం నచ్చక ఆ పూటంతా ముభావంగా కూచున్నాడు తన రూమ్‌లో!
***
కొన్ని నెలలు గడిచి పోయినై!.
శని, ఆదివారాలు కేశవ్ హైద్రాబాదుకు రావటం, అభిషేక్ ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు వస్తూ ఉండటం యథావిధిగా సాగినై! కమలాదేవి ఎక్కువ ఏమీ మాట్లాడదు సాధారణంగా వింటూ ఉంటుంది. అభిషేకే ఎక్కువ శాతం మాట్లాడటం! రకరకాల సంగతులు పూసి గుచ్చినట్టు చెప్పటం వారిద్దరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేవి ప్రతిసారీ! వాటిలో కొన్ని కేశవ్‌కి తెలిసినవీ, కొన్ని తెలియనివీ. తల్లిని అడిగి అవీ సరిగ్గానే సరిపోతున్నాయి గతంలో జరిగిన వాటితో అని నిర్ధారించుకునేవాడు! వారిద్దరికీ ఇదొక కొరకరాని లెక్కై కూచుంది వారి జీవితాల్లో!
హానికరంగా ఏమీ లేదు కానీ, ఏదో అపూర్వమైన కథలో తాము పాత్రలైనట్టు, ఒక చెప్పనలవి కాని భావన కలిగేది వారికి.
ఎవరినైనా సంప్రదించాలా స్పెషలిస్టులను – ఏ సైకాలజిస్టునో అనేది తేల్చుకోలేక పోతున్నారు, తల్లీ కొడుకు, ఇదమిత్థంగా!
అటు అభిషేక్ తల్లీదండ్రీ కూడా ఒక అయోమయావస్థలో ఉన్నట్టే ఉన్నారు, ఈ విషయం తెలిసినప్పటి నుంచీ!
శేషగిరిరావు ఒక బాగా పరిచయమున్న సైకాలజిస్ట్‌ని కలిసి మాట్లాడాడు కూడా.
ఆ రోజు, వసుంధరను కూడా రమ్మంటే “నాకు భయం ఇవన్నీ, మీరే వెళ్ళి కనుక్కోండి” అని అన్నది ఆమె.
అతన్ని కలిసి, ఇంటికి రాగానే, “ఏం భయంలేదుట అదే పోతుందట” అని ముందుగా భార్యకు ధైర్యం చెప్పాడు శేషగిరిరావు.
“ఇట్లాంటి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు కొంత మందికి చిన్నప్పుడు కల్గుతూంటాయిట, పెరుగుతున్న కొద్దీ అవి దూరమై పోతాయట. ఇంక మళ్ళీ రాకుండా ఉండే అవకాశమే ఎక్కువట కూడా, కనుక వేచి చూద్దాం, ప్రస్తుతం అంతా మామూలుగానే కదా ఉంటోంది.” అని చెప్పాడు.”
“వెయిట్ చేసి చూద్దాం. ఈ లోపల అతనిని ఏమీ వారించవద్దు ఈ విషయంలో అని చెప్పాడు కూడా డాక్టర్, చివరగా. వసూ, మనం అది గుర్తు పెట్టుకోవాలి బాగా” అని ముగించాడు శేషగిరిరావు!
“సరే”, అన్నది, ఏదో తెలియరాని ఆలోచనలతో వసుంధర.
***
ఒకసారి ఫోన్ చేసి కేశవ్ మాట్లాడితే, ఇదే విషయాలు అతనికి కూడా చెప్పాడు శేషగిరిరావు, వివరంగా స్పెషలిస్టు అన్న చివరి మాటలు నొక్కి చెపుతూ!
“అట్లాగే అంకుల్, తప్పకుండా ఏ అడ్డంకీ పెట్టవద్దు మీరైనా, మేమైనా. బహుశా కొంతకాలానికి అభిషేక్‌కి ఈ ధ్యాస, జ్ఞాపకాలు పూర్తిగా పోతై అనే అనుకుంటున్నాను. నేను కూడా కొంత మందితో మాట్లాడితే, ఇదే తరహాలో సలహా ఇచ్చారు” అని అన్నాడు.
***
అయితే ఆ కొంత కాలం రెండు కుటుంబాలు అనుకున్న దానికంటే తొందరగానే వచ్చేసింది.
పరిష్కారం కేశవ్ ఆఫీసు చూపించిందనే చెప్పాలి. అతనికి బాగా జీతం పెరుగుదలతో పాటు, US లో 3 ఏళ్ళు కంపెనీ తరఫున పని చేసే అవకాశం వచ్చింది.
ఒక రోజు ఫోన్ లో చెప్పాడు శేషగిరిరావుకి ఈ వార్త!
కొంతసేపు మాట్లాడి, “ఆల్ ది బెస్ట్ బాబూ” అని ముగించాడు అతను ఆ సంభాషణ.
అభిషేక్ ని పిలిచి మరీ చెప్పాడు ఆ విషయం, వసుంధర ముందే.
అభిషేక్, “ఆహా గ్రేట్ నాన్నా, కేశవ్ చాలా ఇంటెలిజెంట్” అన్నాడు.
వెంటనే అతని మొహంలో రంగులు మారిపోయి, “అయితే వాళ్ళిద్దరూ US వెళ్ళిపోతారన్న మాట”, అన్నాడు కొంత బాధతో!
వసుంధర, “అవును నాన్నా, మరి కేశవ్ లేకపోతే వాళ్ళమ్మ ఇక్కడ ఒక్కరే ఎట్లా ఉంటారు, వెళ్తారు ఇద్దరూ కలిసే బహుశా”, అన్నది.
అభిషేక్ ఏ భావమూ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుండి పోయాడు కాస్సేపు.
ముగ్గురూ మౌనమే వహించారు, ఎవ్వరికీ ఏమి అనాలో ఏమి చెప్పాలో తెలియక!!
మరుసటి ఆదివారం అభిషేక్ వెళ్ళి మామూలు కంటే ఒక గంట ఎక్కువే కూచుని అవీ ఇవీ మాట్లాడి,”మీ ఫ్లైట్ టైమ్‌కి ఎయిర్‌పోర్టుకి తప్పక వస్తాము కమలా” అని చెప్పి మరీ వెళ్ళాడు.
***
ఒక 15 రోజుల్లో US వెళ్ళిపోయారు, కేశవ్, కమలాదేవీ.
వీడ్కోలు పలికారు, కేశవ్ ఫ్రెండ్సు కొంతమందీ, అభిషేక్, అతని తల్లీ తండ్రీ కూడా!
***
ఆరు నెలలు గడిచింది. ఒకటి రెండు సార్లు శేషగిరిరావు ఫోన్లో మాట్లాడాడు కేశవ్‌తో. కమలాదేవికి కుదరలేదు సమయానికి వేరే చోట ఉండటం వలన.
అభిషేక్ విడిగా వీళ్ళకు కాల్ చేసింది లేదు, కాస్త విచిత్రంగా!
అంతలో అభిషేక్ ఫైనల్ పరీక్షలు, వెంటనే మెడికల్ ఎంట్రన్సు ప్రిపరేషన్లూ మొదలవటంతో పూర్తి గా బిజీ అయిపోయాడు అతను హైదరాబాదులో.
కేశవ్ శేషగిరిరావుకి ఫోన్ చేశాడు, అభిషేక్ 17వ పుట్టినరోజున!
అభిషేక్ చాలా మామూలుగా ఉంటున్నాడనీ, ప్రస్తుతం మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష గురించే పూర్తిగా నిమగ్నమై పోయి ఉన్నాడనీ చెప్పాడు, శేషగిరిరావు.
ఒక రిలీఫ్ ధ్వనించింది ఆయన గొంతులో.
“చాలా మంచి విషయం చెప్పారు అంకుల్. మీ స్పెషలిస్ట్ చెప్పినట్టే జరుగుతోందన్న మాట, క్రమక్రమంగా అతనికి ఈ గత జన్మ తాలూకు గుర్తులు రిసీడ్ అవుతాయి అని ఆశిద్దాం, ఆంటీని అడిగానని చెప్పండి, ఉంటాను” అని ముగించాడు.
ఈ విషయం విని కమలాదేవి కూడా ఒక రిలీఫ్ లాంటిదే పొందినట్లు కనిపించింది కేశవ్‌కి.
ఏది ఏమైనా వాళ్ళిద్దరూ ఇంక ఆ విషయం మర్చిపోవటం మంచిదని, అంతటితో ఆపేశారు.
***
దాదాపు రెండేళ్ళు అవుతోంది వాళ్ళు US వచ్చి అప్పటికి!
US లోని పెద్ద వేంకటేశ్వరాలయంలో దర్శనం చేసి కూచుని ఉన్నారు ఒక ఆదివారం, కేశవ్, అతని తల్లి కమలాదేవి.
అక్కడ జరుగుతున్న భగవద్గీతా పారాయణంలో ఆ రోజు చదువుతున్న 4వ అధ్యాయంలోని ఈ శ్లోకం చదివి, అర్థం చెప్పారు:
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప॥
(శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి, ఓ అర్జునా. నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా!)
ఇద్దరూ విన్నారు.
అభిషేక్ నరుడైన అర్జునుడే కదా ఈ పాటికి పూర్తిగా మర్చిపోయి ఉంటాడులే గత జన్మ విశేషాలు అని అనుకున్నారు, అది వినగానే.
ఏదో కొంతకాలం ఆ జ్ఞాపకాలు అతన్ని వెంటాడినట్టున్నాయి. క్రమంగా ప్రకృతి తన ‘మరపు’ ముసుగు వేసేసి ఉంటుంది, అందరికీ లాగే అనుకున్నారు.
***
కారులో ఇంటికి తిరిగి వెళుతూ, కమలాదేవి, కృష్ణ భగవానుడికి మనసులో నమస్కారం పెట్టుకుంది.
‘ఎంత దయ స్వామీ, మాకు ఏ జన్మ విషయాలు అక్కడితో మరచిపోయేట్లు చేసే నీ ఏర్పాటు. లేకపోతే అన్నీ కలగాపులగం అయిపోయి మా బతుకులు అయోమయంలో పడేవి కాదూ! నీవు చేసినది అంతా మా మంచికే స్వామీ, మేమే తెలుసుకోలేక పోతున్నాం మా చిన్న బుర్రలతో!
మానవ సంబంధాలు, ఈ జన్మ వరకే! ముందరి, వెనుక జన్మల గుర్తులు అందుకే కాదూ స్వామీ, తీసేశావు.
నువ్విచ్చిన ఈ మరపు మాకు నిశ్చయంగా వరమే తండ్రీ’, అని మనసారా అనుకుంటూ!!
***
శ్రీకృష్ణశ్శరణం మమ!