[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
చీకటి
[dropcap]ఇ[/dropcap]ప్పుడు అందరి దృష్టీ క్రికెట్ మీదనే..
వరల్డ్ కప్..
కష్టపడి వరల్డ్ కప్ సాధించాలని ఆశపడుతున్న ఆటగాళ్లు కొద్దిమంది వాళ్లు శ్రమపడుతుంటే, ఆ ఆట ఆధారంగా లాభాలు గడించాలని ఆశపడేవాళ్లు కొంతమంది. అటు ఆడటమూ చేతగాక, ఇటు లాభాలు గడించటమూ చేతగాక, జరుగుతున్న దాన్ని ఒక కలలలాగా చూస్తుండేవాళ్లు ఎంతో మంది.
జీవితం – ఒకరికి పరీక్ష.
జీవితం – ఒకరికి వ్యాపారం.
జీవితం – ఒకరికి కల.
నాకు జీవితం కల. కలలో జరిగే వాటికి పొంతన ఉండదు. ఊహించనివి ఎన్నో జరిగి పోతుంటాయి. జరగకూడనివి జరిగి భయపెడుతుంటాయి. ఉలిక్కిపడి లేస్తుంటారు.
సగం జీవితం చీకట్లో గడిచి పోతుంటుంది. చీకట్లో జరిగేవి ఎవరికీ తెలియకపోవటమే మంచిది కదా.
పేదరికంలో పుట్టి పెరిగాను. అందుచేత స్ట్రగుల్ తప్పలేదు. డబ్బు కోసం స్ట్రగుల్. చదువు ‘కొనేందుకు’ స్ట్రగుల్. నలుగురితో సమానంగా ఉండేందుకు స్ట్రగుల్.
అప్పట్లో నాకా చాలీ చాలని దుప్పటి ఉండేది. పైకి లాక్కుంటే, కాళ్ల కింది దాక వచ్చేది కాదు. కిందికి లాక్కుంటే, భుజాల వరకు అయినా వచ్చేది కాదు. అందుచేత దుప్పట్లో ముడుచుకుని పడుకునే దాన్ని, అదీ అప్పటి పరిస్థితి.
స్ట్రగుల్ తోనే చదువు పూర్తి చేశాను. డిగ్రీ తెచ్చుకున్నాను. రిసెర్చ్ చేయాలన్న కోరిక ఉండేది. అది చేస్తేగాని, తెలివిగల వాళ్ల కింద లెక్కకట్టరు. చెట్టు నుంచి కాయ కింద పడటం అందరం చూస్తూనే ఉంటాం. అది ఎందుకు అలా కింద పడిందో తెల్సుకుంటేనే మేధావి కింద లెక్క.
ఎన్నో తెల్సుకోవాలని ఉండేది. ఆ జిజ్ఞాసలో ఉండగానే మా అమ్మ సంబంధాల కోసం వెతకటం మొదలుపెట్టింది. నాకు వయసు వచ్చేసిందని, ఆమెకు వయసు అయిపోతోందనీ బాధ పడిపోతోంది.
నేనో చిన్న ఉద్యోగం సంపాదించాను. మొదటి జీతం రాగానే దుప్పటి కొనుక్కున్నాను. ఫరవాలేదు. కప్పుకోవటానికి సరిపోతోంది. ఇప్పుడు ముడుచుకుని పడుకోవటం లేదు.
ఏడాది తిరిగేటప్పటికి ఇంట్లోకి కావల్సిన వస్తువులన్నీ కొన్నాను. మా అమ్మ సంబంధాలు చూస్తూనే ఉంది. ఒకతను పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ కట్నం చాలదన్నాడు. నాకు పెళ్లి అక్కర్లేదన్నాను.
“కట్నం ఇవ్వక పోతే పెళ్లి ఎలా అవుతుంది?” అని అడిగింది అమ్మ
“కాకపోతే నష్టం ఏమిటి?” అన్నాను దుప్పటి కప్పుకుంటూ.
“నేను పోయాక నిన్న చూసే వాళ్లు ఎవరు?” అని అడిగింది.
సమాధానం చెప్పాలనిపించ లేదు. మేం ఉండే చోట నాలుగుఅయిదు వాటాల వాళ్లు ఉన్నారు. అందరూ రోజూ నన్నే చూస్తూంటారు.
“ఇంకా ఎన్నాళ్లు ఉంటావ్ ఇలాగా?” అని బామ్మగారు అడిగేవారు.
“నన్నొక మాంఛి సంబంధం చూడమంటావా?” అనేవాడు పనీపాటా లేని పరంధామయ్య.
“కట్నం తీసుకునే వాడిని చేసుకోదట” ఎవరో వ్యాఖ్యానించేవారు.
“అలాంటి ఆదర్శపురుషుడూ దొరుకుతాడు. సంపాదిస్తోంది గదా” మరొకరి సమాధానం.
ఇంట్లో నుంచి బయలుకు వెళ్ళేటప్పుడూ, లోపలికి వచ్చేటప్పుడూ ఇదే టాపిక్. నా పెళ్ళి గురించి వాళ్లంతా అంత ఆసక్తి చూపుతున్నందుకు ఒక పక్క ఇష్టంగా ఉన్నా, మరో పక్క అస్తమానం ఇదే గొడవ అయినందుకు విసుగ్గానూ ఉంది.
చివరకు ఒక సంబంధం వచ్చింది. అతనితో నేను ఒంటరిగా మాట్లాడాలని అన్నాను. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూశారు.
నేను అతనితో చెప్పాను. “నేను కట్నం ఇవ్వను. నా సంపాదన ఆశించకూడదు” అని.
అన్నిటికీ ఒప్పుకున్నాడు రాజా.
నేనూ ఒప్పుకున్నాను.
అతి నిరాడంబరంగా వివాహం జరిగింది.
“పెళ్లి పేరుతో చేసే ఆర్భాటాలు నాకు నచ్చవు” అన్నాను.
“నాకూ నచ్చవు” అన్నాడు రాజా.
వేరే కాపురం పెట్టాం. రాజా గురించి క్రమంగా అన్ని విషయాలూ తెలియటం మొదలెట్టాయి.
తన పోర్షన్ అయిపోగానే మా అమ్మ ఈ లోకం నుంచి వెళ్లిపోయింది.
రాజా ఒక రోజు ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాడు. పార్టీ జరుగుతోంది. అక్కడి వాతావరణం నాకు నచ్చలేదు. ఎవరెవరో వచ్చారు. జంటలు జంటలుగా.. నవ్వులూ, కేరింతలూ.. చౌకబారు జోక్స్.. శ్రీమంతుల నివాసంగా కనిపిస్తున్న చోట నీతి నియమాలకు నీళ్లు వదలటం చూసి ఆశ్చర్యపోయాను.
క్రమంగా లైట్లు ఆరిపోయాయి. చీకటి అలుముకుంది. తాగిన వాళ్లు వాగుతున్నారు. తూలుతున్నారు. ఎవరిమీద ఎవరు పడుతున్నారో తెలియటం లేదు.
నేను అక్కడనుంచి వచ్చేశాను. అర్ధరాత్రి దాటాక రాజా కొంప చేరాడు.
“నీకోసం అంతా వెతికాను. చెప్పకుండా వచ్చేశావేంటి? అందరూ నీ గురించే అడిగారు” అన్నాడు.
“అలాంటి చోట్లకు నేను రాసు. మీరూ వెళ్లొద్దు” అన్నాను.
“అక్కడికి అందర్ని రానివ్వరు తెల్సా? హై క్లాస్ సొసైటీ. దే ఆర్ గ్రేట్ పీవుల్. వాళ్లతో కాంటాక్స్ పెట్టుకుంటే మనమూ గొప్పవాళ్లం కావచ్చు” అన్నాడు రాజా.
మైకంలో ఉన్నవాడితో వాదించి లాభం లేదని ఊరుకున్నాను.
తరువాత ఆదివారం మళ్లీ అక్కడికే బయల్దేరాడు. నేను రాము సొమ్మన్నాను. రావల్సిందేనని పట్టుబట్టాడు. ఇద్దరి మధ్యా చాలాసేపు వాగ్యుద్ధం జరిగింది.
రాజా ఆలోచనలూ, అభిప్రాయాలూ, స్పష్టంగా తెల్పాయి. డబ్బు కావాలి. అందుకు నన్ను అమ్మకానికి పెట్టటానికి సిద్ధపడుతున్నాడు.
“అలాంటి దౌర్భాగ్యపు పనులకు సిద్ధపడ్తే నిన్ను వదులుకోవటానికి రెడీగా ఉన్నాను” అన్నాను.
మర్నాడు ఎవరో ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడు. ఇద్దరూ తాగేసి ఉన్నారు. వచ్చిన వాడు నన్ను బలవంతం చేయబోయాడు. తన్ని తరిమికొట్టాను. పగలంతా ఎంతో ఆదర్శవంతుడిలా కనిపించే రాజా, చీకటి పడగానే పశువులా మారిపోవటం చూసి భరించలేక పోతున్నాను. తిట్టుకోవటాలూ, కొట్టుకోవటాలూ, చంపటానికీ, చావటానికీ సిద్ధపడటాలూ, ఇవన్నీ జీవితంలోని చీకటి కోణాలు. ఎవరికీ చెప్పలేని జగుప్సాకరమైన సంఘటనలు.
భార్య వంక పరాయి పురుషుడు కన్నెత్తి చూస్తే, వాడిని ముక్కలు ముక్కలుగా నరికెయ్యటానికి వెనుకాడని మగవాళ్లు ఉన్న ఈ పుణ్యభూమిలోనే అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతో వ్యాపారం చేసి లాభాలు గడించాలని అనుకునే నీచులూ ఉన్నారు.
జీవితంలో ప్రతిదీ వ్యాపారమే.
“ప్రపంచాన్ని నడిపిస్తున్నది డబ్బు, జీవితాలను శాసిస్తున్నది డబ్బు. దానితో ఏమైనా, ఎవరినైనా కొనవచ్చు..” అంటాడు రాజా .
“డబ్బు ఉంటేనే సుఖశాంతులు ఉంటాయనుకోవటం పొరపాటు, దాని కోసం తప్పుడు పనులు చేస్తే మిగిలేది పశ్చాత్తాపమే” అన్నాను నేను.
ఇద్దరి అభిప్రాయాలూ ఎక్కడా కలవటం లేదు. అభిప్రాయాలు కలవని మనుష్యులు కల్పి జీవించుటమూ కష్టమే.
నేను విడిగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. వేరే ఇల్లు చూసుకుని, అక్కడకు వెళ్లిపోయాను.
ఆఫీసుకు వెళ్తున్నాను. వస్తున్నాను. నేను ఎందుకు ఒంటరిగా ఉంటున్నానన్నది చాలామందికి అర్ధం కాలేదు. అర్థంకాని ఇలాంటి విషయాలు తెల్సుకోవటానికి చేసే ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు.
రాజా నన్ను చాటుమాటుగా బెదిరిస్తూనే ఉన్నాడు. పోలీస్ రిపోర్ట్ చేస్తాననీ, క్రిమినల్ కేసు పెడతానని అంటున్నాడు.
ఒంటరిగా ఉండటం నాకేం కష్టంగా లేదు. కానీ చూసీ వాళ్లకు చాలా కష్టంగా ఉంది. ఏదో ఒక సాయం చేస్తామంటూ మగవాళ్లు ముందుకు వస్తున్నారు. ఆడవాళ్లు నావంక అనుమానంగా చూస్తున్నారు.
ఆఫీసులో నా ముందే విమర్శలు చేస్తుంటారు. అవి ఏవీ నిజం కానందువల్ల నేను బాధ పడాల్సిన పని లేదు.
అందరి మధ్యా ఉంటూనే క్రమంగా ఒంటరిదాన్ని ఆయ్యాను.
ఒక రోజు రాజా ఫోన్ చేశాడు. తన తప్పు తెల్సుకున్నాననీ, వచ్చి తన దగ్గర ఉండమని అన్నాడు. అది సాధ్యం అయ్యేపని కాదనీ, ఇంక నా గురించి మర్చిపొమ్మనీ చెప్పాను.
ఇదంతా తెల్సుకున్న ఆఫీసర్ ప్రభాకర్ అన్నాడు “నీ పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటున్నానని అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం మామూలే కానీ సర్దుకుపోవాలి. తేగే దాకా లాగకూడదు.”
“కొన్ని సర్దుకు పోయే విషయాలు ఉంటాయి. కొన్ని క్షమించరాని అపరాధాలు ఉంటాయి” అన్నాను.
“భర్తను క్షమించలేని భార్య ఉంటుందా?”
“భర్తగా ఉండే అర్హత లేని వాణ్ణి ఏ స్త్రీ అయినా ఎలా క్షమిస్తుంది?” అని అడిగాను.
“అంత నేరం ఏం చేశాడు?”
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోతున్నాను. ఆయన మళ్లీ మళ్లీ సర్దుకుపోవాలనే చెబుతున్నాడు..
“భార్యతో వ్యాపారం చేయాలనుకునే వాడిని ఎలా క్షమించమంటారు?” అన్నాను.
ఆయన నిర్ఘాంతపోయాడు. తేరుకున్న తరువాత ‘స్కౌండ్రల్’ అన్నాడు.
“ఇంక నువ్వేమీ చెప్పకు. నాకు అంతా అర్థమైంది. వాడిని దరిదాపులకు కూడా రానివ్వవల్సిన అవసరం లేదు. నీవు ఒంటరిదానివనీ, నిస్సహాయంగా ఉన్నాననీ బాధపడొద్దు. నీకు ఏ సహాయం కావల్సినా నేను చేస్తాను” అన్నాడు.
నన్ను అర్థం చేసుకున్న మనిషి ఒకరున్నారన్న అభిప్రాయం ఏర్పడగానే, నేను ఒంటందాన్ని కాను అన్న అభిప్రాయం ఏర్పడింది.
నాకు ప్రమోషన్ వచ్చింది. అది మామూలుగా రావల్సిందే అయినా ప్రభాకర్ కొంచెం శ్రద్ధ తీసుకున్నాడు. అందుచేత నాలుగు రోజులు ముందుగానే ఆర్డర్ అందుకున్నాను.
“మీకు చాలా థాంక్స్” అన్నాను.
“ఇందులో నేను చేసిందేమీ లేదు. చేతనయినప్పుడల్లా ఇతరులకు చేతనయిన సాయం చేయాలన్నదే నా ఆశయం. అవకాశం ఉంది కాబట్టి చేయగలిగాను. నువ్వు కష్టపడి మంచి రిజల్ట్స్ చూపిస్తే, మరో ఆరు నెలల్లో ఇంకో ప్రమోషన్ కూడా వస్తుంది” అని ఆయన ముందుగానే సూచన చేశాడు.
మంచి రిజల్ట్స్ ఎలా సాధించాలో కూడా ఆయనే దారి చూపించాడు.
ఈసారి ప్రమోషన్‍తో జీతం బాగా పెరిగింది. ఇప్పుడొక అపార్ట్‌మెంట్ తీసుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ కొంచెం కుదులు పడుతున్నానని అనుకుంటూ ఉండగానే – ప్రభాకర్‍కీ నాకూ లేనిపోని సంబంధాలు అంటగడుతూ వదంతులు పుట్టించారు.
అవి రోజు రోజుకీ శృతిమించి పోతున్నయి.
రాజా నాకు మళ్లీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు “నీ బాగోతం నాకు తెలియదనుకోకు” అంటున్నాడు. వాడి గురించి నేను పట్టించుకోలేదు. కానీ మర్నాడు ప్రభాకర్ భార్య ఫోన్ చేసి ‘నా మొగుడు తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా?’ అని అడిగితే, పదునైన బాణం సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లు అయింది.
ఆయనతో చెప్పాను- అదే విషయం.
ఆయన అన్నాడు “నా చేతుల మీదుగా కొన్ని వందల మందికి ప్రమోషన్లు ఇచ్చాను. అది నా డ్యూటీ. ఇంతకు ముందెప్పుడూ, ఈ డ్యూటీ చేసినందుకు విపరీతార్థాలు సృష్టించలేదు. నువు బాధపడకు. దీనికి కూడా పరిష్కారం లభిస్తుంది.”
నా వల్ల ఆయన సంసారంలోనే కలతలు రేగటం నా కిష్టంలేదు. అలాగని ఉద్యోగం వదులుకోలేను. ఏం చేయటానికీ తోచడం లేదు.
వారం రోజుల తరువాత ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆయనకు మరో చోటుకు బదిలీ అయింది. అది ఇంత కన్నా పెద్ద పదవి.
“మీకిప్పుడు మరింత మందికి సాయం చేసే అవకాశం లభించింది” అన్నాను.
“మా ఆవిడ చేయనిస్తే” అని నవ్వాడాయన.
“నన్ను మర్చిపోకు” అన్నాడు.
“కనిపించే దేవుడ్ని ఎలా మర్చిపోతాను?” అని అన్నాను.
ఆయన వెళ్ళిపోయాడు.
చీకటి అలుముకుంది.
చీకటికి అలవాటు పడ్డాను.
చీకట్లోనే కలలు కనటానికి అలవాటు పడ్డాను.
జీవితం – నాకు ఒక కల.
జీవితం – రాజాకు ఒక వ్యాపారం.
జీవితం – ప్రభాకర్‌కి ఒక పరీక్ష.