మా తాతయ్య!

0
3

[హిందీలో శ్రీమతి అనూరాధ మంగళ్ రచించిన పిల్లల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]మా[/dropcap] తాతయ్యంటే మా బాల్యం! మా ప్రియమైన తాతయ్య మాకెంతో ఇష్టం!!

ఈ ప్రపంచంలో విశిష్టమైనవాడు! ఆనందాలకి తాతయ్య నెలవు. అనుభవం, ధైర్యాలకు గని తాతయ్య. సంస్కృతి, ఆచారాలకు మూలస్తంభం. కష్టాలను, సంశయాలను దూరంచేసేవాడు. దేన్నైనా ఒప్పించడంలో వీరుడు తాతయ్య.

ప్రతి బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తాడు. కుటుంబపు బాంధవ్యాల పట్ల గర్వం తాతయ్యకి.

ఎంతైనా తాతయ్య తాతయ్యే కాబట్టి బజారులోని బొమ్మలు, గాలిపటాలు, టాఫీలు, చాక్లెట్లు అన్నీ మావే. మాతో లూడో, క్యారమ్స్, హాకీ, క్రికెట్‌ ఆడేవాడు. అమ్మా నాన్నలు మమ్మల్ని తిడితే, వెంటనే తాతయ్యకి ఫిర్యాదు చేసేవాళ్ళం! తాతయ్యకి అంత వయసొచ్చినా వాళ్ళమ్మ అంటే.. అదే మా తాతమ్మంటే భయమే! తాతమ్మకి తెలియకుండా, రహస్యంగా మిఠాయిలు తింటాడు. దాక్కుని తింటాడు, మాకూ తినిపించేవాడు. ఇలా దొంగతనంగా తినడం ఎప్పుడైనా నానమ్మ కంటబడితే, ఇంకేమైనా ఉంటుందా? ఇల్లంతా అలజడే! ఆవిడ మందలింపులను తాతయ్య మౌనంగా వింటుంటే, మేం పిల్లలమంతా ఎలుకల్లా ఇంట్లో అక్కడక్కడ దాక్కునేవాళ్ళం.

తాతయ్య ఉదయాన్నే నడకకు వెళ్ళేవాడు. రోజూ వ్యాయామం చేసేవాడు. ప్రతి ఒక్కరూ సాధారణమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సలహా ఇచ్చేవాడు. పెళ్లైనా, బర్త్ డే పార్టీ అయినా ముందుగా సిద్ధమయ్యే వాడు. తన బూట్లు తానే పాలిష్ చేసుకునేవాడు, సూట్, టై ధరించేవాడు. కళ్ళజోడు పెట్టుకునేవాడు. చేతికర్ర సాయంతో నడుస్తాడు, చాలా ప్రయాణాలు చేస్తాడు. తాతయ్య చేసే అన్ని పనుల్లో ఆయన వ్యక్తిత్వం వెంటనే కనిపిస్తుంది. స్మార్ట్‌గా కనిపిస్తాడు, ఇంటి పనులు చేస్తాడు. పండ్లు, కూరగాయలు లేదా ఇంటికి కావల్సినవి మరేవైనా తేవాలంటే చాలా ఇష్టం తాతయ్యకి.

వంటింటి సరుకులు తీసుకురావాలంటే ఇష్టపడతాడు. ప్రతిదాని ధర చూసి, ఆలోచించి మాత్రమే కొంటాడు, మాకూ అదే నేర్పించాడు. లక్ష్మీదేవిని గౌరవించాలని చెప్పేవాడు.

మా బాల్యం ఆయన భుజాలపైనే గడిచింది. ఆయన ప్రతీ క్షణం మా కోసమే అన్నట్టు ఉండేవాడు.

Art by Mrs. Anuradha Mangal

పిల్లల్లం స్కూల్ నుంచి రావడానికి కాస్త ఆలస్యమైతే కర్ర సాయంతో వచ్చేవాడు. తలుపు దగ్గర కూర్చుని, మేం వచ్చిన తర్వాత ఎన్నో వేల ప్రశ్నలతో ఇంటిని ముంచెత్తుత్తాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించీ బెంగ!

ఈ ఉదయం నాకు మెలకువ రాగానే తాతయ్య గుర్తొచ్చాడు. ఈ రోజు తాతయ్య పుట్టినరోజు.

చిన్నప్పుడు ఓ సంవత్సరం నానమ్మతో కలిసి తాతయ్య పుట్టినరోజు వేడుకలు జరిపిన సంగతి గుర్తొచ్చింది. నానమ్మ తోటలోకి వెళ్లి కొన్ని పువ్వులు కోసింది. తాతయ్య కోసం కేకులు, పిండివంటలు, కొవ్వొత్తులు, అలంకరణ వస్తువులు ముందురోజే తెచ్చాం. తాతయ్య ఉదయం నడకకు వెళ్ళగానే పిల్లలందరం కలిసి గదిని అలంకరించాం. తాతయ్య ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే బిగ్గరగా సంగీతం వినిపించాం. దీపాలు, కొవ్వొత్తులు అన్నీ వెలిగించి, తాతయ్యతో కేక్ కోయించాం. బిగ్గరగా హ్యాపీ బర్త్‌డే అని పాడాం. తాతయ్య మొహంలో ఎంత సంతోషమో!

నిజం తాతయ్యకి, పిల్లలంటే చాలా ఇష్టం. మాకోసం ఎన్నో వస్తువులను దాచి ఉంచి, మేం కలిసినప్పుడు మాకిచ్చే వాడు తాతయ్య. అవన్నీ తన ప్రేమకు ప్రతిరూపమని చెప్పాడు.

తాతయ్య ప్రేమ జీవితంలో చాలా తక్కువ కాలమే ఉంటుంది, తాతయ్యతో మనతో ఉండేది కొద్దికాలమే. ఆయన లేనప్పుడు ఆయన విలువ తెలుస్తుంది. మళ్లీ కోరుకున్నా, కలిసి గడిపిన అలనాటి క్షణాలు తిరిగి రావు. జ్ఞాపకాలు మాత్రమే వస్తాయి, అవును జ్ఞాపకాలు మాత్రమే! అందుకే తాతయ్య జీవించి ఉన్నవాళ్ళకు ఇది ఒక సువర్ణావకాశం, తాతయ్యని పలకరించండి, ఒకప్పుడు మీకు పంచిన ప్రేమకు బదులుగా మీ ఆప్యాయతని అందించండి. తాతయ్యే కాదు, పెద్దవాళ్ళందరినీ ఆదరించండి. బదులుగా మీకు అంతులేని ఆనందం లభిస్తుంది.

~

హిందీ మూలం: అనురాధ మంగళ్.

తెలుగు: కొల్లూరి సోమ శంకర్


నా పేరు అనురాధ మంగళ్. నా వయసు 80 సంవత్సరాలు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకి బొమ్మలు గీయడం నేర్పించాను. ఈమధ్య కాలంలో పిల్లల కోసం, పెద్దల కోసం కొన్ని కథలు వ్రాశాను. నా రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here