[21-22 మార్చ్ 2024న వెల్లూరు లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన సాహిత్య సమావేశాల నివేదికని అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు.]
[dropcap]చె[/dropcap]న్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదే విఐటి. ఒక విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద భవనాలతో వివిధ రాష్ట్రాల నుంచి చదువుకునే విద్యార్థుల కళకళలాడే ముఖాలతో చక్కని ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది.
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్‌లో మొట్టమొదటిసారి లిటరేచర్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామనీ, దాంట్లో ఒక ఉపన్యాసకుడిగా రావాలని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రుక్మిణి గారు ఒకరోజు ఫోన్ చేసి ఆహ్వానించడం సంతోషాన్ని కలిగించింది.
గత మూడు దశాబ్దాల నుంచి తెలుగు సాహిత్యంలో ఇంగ్లీషులో కూడా సైన్స్ ఫిక్షన్, స్పేస్ ఫిక్షన్, మెడికల్ నేపథ్యంలోని నవలలు, కథలు ఎన్నో రాసి ఉన్నా, ఒక లిటరేచర్ ఫెస్టివల్‌లో వక్తగా పాల్గొనమని ఆహ్వానం రావడం ఇదే మొదటిసారి. అది కూడా వేరే తమిళనాడు రాష్ట్రం నుంచి. ఇది ఒక జాతీయ స్థాయిలో జరిగిన ఫెస్టివల్. హిందీ కన్నడ తమిళ మలయాళ భాషలలో అవార్డులు పొందిన రచయితలు రచయిత్రులు పాల్గొనబోతున్నారు. ఇలాంటి జాతీయ సాహిత్య సమావేశంలో తెలుగులో నేను రాసిన సైన్స్ ఫిక్షన్ గురించి ఇతర సాహిత్యం గురించి ఒకరోజు వక్తగానూ, ఒక రోజు పానల్ చర్చలోనూ పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.
ఈ సమావేశానికి ఇతివృత్తం లేదా థీమ్ ‘ఇమేజినింగ్ లైఫ్ వితౌట్ లిటరేచర్..’ అంటే ‘సాహిత్యం లేని జీవితాన్ని ఊహించటం’. నిజానికి సాహిత్యం లేనిదే జీవితం లేదు. సాహిత్యం లేనిదే మనిషికి అర్థం పరమార్ధం లేవు. మళ్లీ సాహిత్యంలోని అనేక ఉప శాఖలలో జీవితం, సమాజంలోని వివిధ అంశాల గురించిన సాహిత్యం, ఉప శాఖలుగా రచించబడుతోంది. వాటిలో నేను ముఖ్యంగా రాసినది వైజ్ఞానిక కల్పనా సాహిత్యం. సైన్స్ ఫిక్షన్. అంతరిక్ష యానాన్ని గురించి, గ్రహాంతర యాత్రల గురించి, గ్రహాంతర కాలనీల గురించి నేను రాసిన ఇంగ్లీష్ నవలలు ఇటీవల రాసిన వెలువరించిన స్పెక్యులేటివ్ ఫిక్షన్ కథలు, జడ్ సైన్స్ ఫిక్షన్ కథా సంపుటి, అల్గోరిథం కథా సంపుటి ఇవన్నీ, తెలుగు సాహిత్యంలో వైజ్ఞానిక కల్పనా సాహిత్యాన్ని నిలబెట్టాలని, గుర్తింపజేయాలనే ప్రయత్నంతో రాసినవి. వీటి గురించి సభా సమావేశాలలో మాట్లాడే అవకాశం నాకెప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో రాలేదు. సంచిక పత్రికా సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారి ప్రోత్సాహంతో గత కొన్ని సంవత్సరాలుగా సంచికలో ‘భూమి నుంచి ఫ్లూటో దాకా’ నవల ఇంకా 20 పైన సైన్స్ ఫిక్షన్ కథలూ, ‘నగరంలో మరమానవి’ అనే 13 భాగాల వెబ్ సిరీస్ కూడా రాశాను. ఈరోజు భారతదేశం లోని సైన్స్ ఫిక్షన్‌లో ఒక తెలుగు రచయితగా గుర్తింపు రావడానికి ఇది నాకు చాలా ప్రోత్సాహం కలుగజేసింది. దీనికి సంచిక సంపాదకులు ముఖ్య కారణం అనే చెప్పాలి. జాతీయ సాహిత్య సమావేశాలలో ప్రస్తుతం తెలుగులో రాస్తున్న సైన్స్ ఫిక్షన్ గురించి వివరించే మంచి అవకాశం కూడా దొరికింది అనే వుద్దేశం తోనే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యాను.
ఆహ్వానించబడిన వక్తలలో డాక్టర్ జయంత్ కాకిని బెంగళూరు నుంచి, డాక్టర్ ఇరా నటరాసన్ తమిళనాడు నుంచి డాక్టర్ కార్బి హజారికా అస్సాం నుంచి, లోపా ముఖర్జీ పుదుచ్చేరి నుంచి, డాక్టర్ మీనా కందస్వామి, డాక్టర్ ప్రియా కె నాయర్, నందిని సేన్ గుప్తా, డాక్టర్ సాధనా శంకర్ లాంటి ప్రముఖ రచయితలు రచయిత్రులు ఉన్నారు.
డాక్టర్ జయంతి కాకిని కన్నడలో కవి, కథా రచయిత, సినిమా పాటల రచయిత.
డాక్టర్ ఏరా నటరాసన్ తమిళంలో పిల్లల సాహిత్యం, సైన్స్ ఫిక్షన్‌లో ప్రఖ్యాతి చెందిన రచయిత. ఈయన రచించిన ‘ఆయేషా’ అనే సైన్స్ ఫిక్షన్ పుస్తకం రెండు లక్షల కాపీలు అమ్ముడు పోవడం చేత ఈయనని ఆయేషా నటరాసన్ అని కూడా అంటారు.
శ్రీమతి కార్బి హజారికా అస్సామీస్ భాషలో కవయిత్రి. లోపా ముఖర్జీ పుదుచ్చేరిలో నవలా రచయిత్రి. డాక్టర్ మీనా కందస్వామి తమిళం ఇంగ్లీషు భాషల్లో రచయిత్రి, దళిత, స్త్రీవాద యాక్టివిస్ట్.
డాక్టర్ ప్రియా కె నాయర్ మలయాళం లో నుంచి ఇంగ్లీష్ లోకి అనువాదకురాలు
నందిని సేన్ గుప్తా చారిత్రిక సాహిత్యం ‘బ్లూ హార్స్’ లాంటి నవలలు ఇంగ్లీషులో రాశారు.
డాక్టర్ సాధనా శంకర్ ఢిల్లీ నుంచి వచ్చిన రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆమె జర్నలిస్ట్, రచయిత్రి, సైన్స్ ఫిక్షన్ రచయిత్రి. ఇటీవల ‘ఎసెండెన్స్’ అనే నవల ప్రచురించారు. ‘కంటిన్యూవం’ అనే నవల కూడా ప్రచురించబడబోతోంది.
ఇది కాక, రెండో రోజు బెంగళూరు నుంచి ఇండియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ ఫిక్షన్ స్టడీస్ (IAFSSS) జనరల్ సెక్రెటరీ శ్రీ నరహరి గారు కూడా వచ్చి ప్యానల్ డిస్కషన్ సైన్స్ ఫిక్షన్‌లో నిర్వహించారు. ఈ ప్యానెల్‌లో నేను, ఈరా నటరాసన్, సాధనా శంకర్ పాల్గొన్నాము.
చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు దాకా కారు పంపించారు. విఐటి గెస్ట్ హౌస్‌లో వసతి, రెండు రోజులు అందరు రచయితలతో గడపటం అందరి ఉపన్యాసాలు వినటంతో చాలా బాగా గడిచింది.
మొదటి రోజు సమావేశం ప్రారంభోత్సవం వీఐటీ వైస్ ఛాన్స్లర్ ద్వారా జరిగింది. రచయితలందరికీ వైస్ ఛాన్సలర్‌తో ప్రత్యేకంగా సమావేశం, ఫోటోలు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
ఫెస్టివల్స్ అంటే రచయితలూ, పాఠకులకి మధ్య అనుసంధానంగా నిర్వహించే పండగ లాంటి కార్యక్రమాలు. అంతర్జాతీయంగా 19వ శతాబ్దంలో ప్యారిస్ లిటరరీ ఫెస్టివల్, ఆ తర్వాత ఎడెంబరో లిటరరీ ఫెస్టివల్ ప్రఖ్యాతి చెందాయి. మన దేశంలో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, కలకత్తా లిటరేచర్ ఫెస్టివల్, బెంగళూరు, కోజికోడ్, తిరువనంతపురం, గోవా, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. వీటి వల్ల పాఠకులకి రచయితల్ని కలుసుకునే అవకాశం, రచయితలకి తమ పుస్తకాల గురించి తమ రచనా విధానాల గురించీ, సిద్ధాంతాల గురించీ, చెప్పుకునే అవకాశం, కొత్త పుస్తకాలు ఆవిష్కరణలు చేసుకునే అవకాశం ఇలాంటివన్నీ లభిస్తాయి. ఇది కాక నృత్య, సంగీత, సాంస్కృతిక సమావేశాలు కూడా ఫెస్టివల్స్‌లో చర్చలకి అనుబంధంగా నిర్వహిస్తూ ఉంటారు. మొదటి రోజు సాయంత్రం విఐటిలో వివిధ భాషలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నృత్యాలు పాటలతో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు.
రచయితలలో నేను అంటే డాక్టర్ మధు చిత్తర్వు, డాక్టర్ సాధన శంకర్, డాక్టర్ ఇరా నటరాసన్ సైన్స్ ఫిక్షన్ రచనలు విశేషంగా చేసిన వాళ్ళు అవడం ముఖ్యమైన విశేషం.
మొదటి రోజు నేను చేసిన ఉపన్యాసం – సైన్స్ ఫిక్షన్‌లో నా ప్రయాణం: ప్రాంతీయ భాషల్లో సైన్స్ ఫిక్షన్ రచయితలకు వచ్చే సమస్యలు – అనే విషయం మీద.
ఆ ప్రసంగం వివరాలు క్లుప్తంగా రాస్తున్నాను. చాలామంది మీరు సైన్స్ ఫిక్షన్ ఎందుకు రాశారు, ఇతర రచనలు ఎక్కువగా ఎందుకు చేయలేదు, రొమాంటిక్ రచనలు, సాంఘిక సమస్యలు ఇలాంటి వాటి మీద రాయచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టాను. అప్పుడు రాసిన పది పదిహేను కథలు అలాంటివి. ఆ తరువాత ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్నప్పుడు 70, 80 దశకాల్లో తెలుగు నవలల్లో ఒక స్వర్ణ యుగం నడుస్తోంది. అప్పట్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ లేకపోయినా తెలుగు వార పత్రికలు ఆలస్యగానైనా తెప్పించి చూస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో చేతబడి, దెయ్యాలు దయ్యాలని వదిలించడం ఇలాంటి నవలలు ప్రజాదరణ పొందటం గమనించాను. నేను భారతదేశం తిరిగి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయినాక ఒక హాస్పిటల్లో కార్డియాలజీ వార్డులో పనిచేస్తున్నప్పుడు మెడికల్ సైన్సు నేపథ్యంలో ఇలాంటివే ఉత్కంఠ భరితమైన నవలలు రాయచ్చు కదా అనే ఆలోచన కలిగింది. వీటికి సైన్సు, మెడికల్ సైన్స్ నేపథ్యం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఆ ఆలోచన తోనే మొదటిసారిగా ‘ఐసీసీయూ’ అనే మెడికల్ ఫీల్డర్ నవల రాయటం జరిగింది. ఇది పూర్తిగా కార్డియాలజీ చికిత్స నేపథ్యంలో రాయబడిన నవల. అప్పటికి ఇంకా కంప్యూటర్స్ మైక్రో చిప్స్ రాలేదు. ఈ నవలలు ఒక చెడ్డ డాక్టర్ రోగులకి హార్ట్ బ్లాక్ అనే జబ్బు వచ్చేటట్లు కొన్ని మందులు ఇచ్చి ఆ జబ్బుకి చికిత్సగా అన్నట్లు పేస్ మేకర్ అనే డివైస్‌ని వారి శరీరంలో అమరుస్తాడు. ఇంతవరకు ఇది మెడికల్ సైన్స్‌లో జరిగే విషయమే. కానీ ఈ నవలలో రాసినది ఆ పేస్ మేకర్ అనే ఎలక్ట్రానిక్ పరికరంలో మెదడుకు పోయే నరాలను కూడా అనుసంధానం చేసి ఆలోచనలని మనసుని ప్రభావితం చేసే విధంగా తయారు చేస్తాడు. ఆ విధంగా వాళ్ళ మనసులని మెదడుని ప్రభావితం చేసి వాళ్ళ చేత దోపిడీలు, ఇతర విధాలైన చెడు పనులు చేయించుకుంటూ డబ్బు సంపాదించడం అనే లక్ష్యంతో వుంటాడు. ఇది సైన్స్ ఫిక్షన్ పరిధి లోది. ఆ డాక్టర్ చివరికి తన పేషంటైన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పరికరం అమర్చి ఆయన మనసును కూడా ప్రభావితం చేయాలనే పథకంలో ఉంటాడు. ఇదంతా, కొత్తగా డ్యూటీలో చేరిన ఒక మంచి డాక్టర్ రికార్డులన్నీ పరిశీలించి పరిశోధన చేసి నిజం కనుక్కుంటాడు. ఈ రకంగా నవల ఒక థ్రిల్లర్ లాగా సాగిపోతుంది. పరికరంతో గుండెను కాకుండా మెదడును కూడా ప్రభావితం చేసే పరికరం కాబట్టి ఆ రోజుల్లో అలాంటిది ఏదీ లేదు కాబట్టి మెడికల్ సైన్స్ ఫిక్షన్ కిందనే వస్తుంది. దీని తర్వాత దీనికి కొనసాగింపుగా ‘బై బైపోలోనియా’, ‘ఎపిడెమిక్’ నవలలు రాశాను. వీటిలో గ్రహాంతర వ్యక్తులు రోబట్లు గ్రహాంతర నౌకలు కాల ప్రయాణం ఇలాంటి ఇతివృత్తాలు ఉంటాయి. ఈ మెడికల్ సైన్స్ ఫిక్షన్ నవలాత్రయంలో రాసిన ‘ఎపిడమిక్’ అనే నవలలో ఇదే విలన్ డాక్టర్ వైరస్ ఏరోసాల్స్ చేత అంటువ్యాధులు సృష్టించటం వాటిని గ్రహాంతర వ్యక్తులు వచ్చి మందులు ఇచ్చి కాపాడటం లాంటి ఇతివృత్తం ఉంటుంది. ఇది మెడికల్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాసిన నవలా త్రయంగా గుర్తించబడింది.
ఇక్కడ సైన్స్ ఫిక్షన్ లేక వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అంటే ఏమిటి అనే నిర్వచనం గురించి మాట్లాడాలి. ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. కానీ ప్రథానంగా రాబర్ట్ హయన్లీన్ అనే ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత చెప్పిన నిర్వచనం తీసుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞాన శాస్త్రం ఆధారంగా భవిష్యత్తులో జరిగే మార్పులు ఊహించి రాసే కల్పనా సాహిత్యం. సాధారణంగా ఈ రకమైన సాహిత్యంలో ముఖ్యంగా లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. గ్రహాంతర వ్యక్తులు, గ్రహాంతర ప్రయాణాలు, కాల ప్రయాణం దానివల్ల వచ్చే సమస్యలు, రోబట్లు, జన్యుపరంగా మార్పు చెందిన మాత్రం మ్యూటెంట్లు, భవిష్యత్తులో ఉపయోగించే ఆయుధాలు లేసర్ ఆయుధాలు రేగన్స్ లాంటివి, ప్రయాణానికి భవిష్యత్తులో ఉపయోగించే టెక్నాలజీ అంటే అయానిక్ ట్రాన్స్పోర్ట్, బీమ్ ట్రావెల్, ఇలాంటివి. అయితే సైన్స్ ఫిక్షన్‌లో సోషియాలజీ ఆంథ్రపాలజీ చరిత్ర ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి ఆధారంగా కూడా రచనలు చేయవచ్చు. ఇవి సాధారణంగా భవిష్యత్తులో జరిగినట్టు ఊహించి రాసేవి. అయితే భూతకాలంలో జరిగినట్టు కూడా కథలు, సమాంతర చరిత్ర అంటే చరిత్ర మరొక విధంగా జరిగి ఉంటే ఎలా ఉంటుంది, సమాంతర విశ్వాలు ఇలాంటివన్నీ కూడా సైన్ ఫిక్షన్ క్రిందనే వర్గీకరిస్తున్నారు. ఒక రచన సైన్స్ ఫిక్షన్ అవుతుందా కాదా, అని గమనించాలంటే ఈ కొలబద్దలు ప్రమాణాలు అవసరం. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సంఘాల్లో వచ్చే మార్పులు అంటే సోషియాలజీ నేపథ్యంలో రాసేవి కూడా యుటోపియన్ లేక డిస్టోపియన్ ఫిక్షన్ అంటే సమానత్వంతో అద్భుతమైన సమాజం లేక వర్గ విభేదాలు వల్ల భయంకరంగా ఉన్న సమాజం కూడా సైన్స్ విషయంలో వర్ణిస్తున్నారు. అందుకనే సైన్స్ ఫిక్షన్ లిటరేచర్ ఆఫ్ ఐడియాస్ అంటారు. కొత్త వ్యూహాలు, కొత్త టెక్నాలజీ వూహించే సాహిత్యం. ఆర్థర్ క్లార్క్ రాసిన జియో పొజిషనల్ సాటిలైట్‌లు ఆ తర్వాత నిజంగా తయారు చేశారు కూడా. సైన్స్ ఫిక్షన్, నాసా లాంటి సంస్థలకి కూడా కొత్త ఆలోచనలు ఇస్తూ వుంటుంది. నేను ఆ తర్వాత ఇంగ్లీషులో రాసిన ‘వార్ ఫర్ మార్స్’ ట్రయాలజీ స్పేస్ ఓపెరా అనే సైన్స్ ఫిక్షన్ యొక్క ఉప శాఖ. దీనిని తెలుగులో ఆ తర్వాత ‘కుజుడి కోసం’, ‘నీలీ ఆకుపచ్చ’, ‘భూమి నుంచి ప్లూటో దాకా’ నవలలుగా అనువదించి ప్రచురించాను. అయితే ప్రస్తుతం, భూమిలోనే జరుగుతున్న కంప్యూటర్, ఇంటర్నెట్, సమాచార విప్లవం, రోబోట్‌లు, కృత్రిమ మేధస్సు, డ్రైవర్ లేని కారులు, వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, సమాజంలో అసమానతలు వర్ణించే డిస్టోపియన్ అంశాలు మీద ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా వస్తోంది. ఇవి పూర్తిగా సైన్స్ కాకపోయినా సాథ్యం కావచ్చు కాబట్టి దీనిని స్పెక్యులేటివ్ ఫిక్షన్ అని కూడా అంటున్నారు. నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ అంశాలపై రాసిన కథలు Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు, ఆల్గోరిథమ్ అనే పేర్లతో కథా సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. వీటిలో బటర్ఫ్లై ఎఫెక్ట్, ట్రాలీ ప్రాబ్లెమ్, సమాంతర విశ్వాలు, మెమరీ ట్రాన్స్‌ఫర్, రోబోట్ డాక్టర్‌లు, రోబోట్‌లు జాగిలాలుగా తయారు చేసి థనవంతులు తమ ఆధిపత్యాన్ని ఆస్తులని కాపాడుకోవడం, ఇలాంటి అంశాలను కథలుగా మలిచి రాశాను. నా ప్రసంగంలో ట్రాలీ ప్రాబ్లెమ్, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటివి వివరంగా చెప్పాను. ట్రాలీ ప్రాబ్లెమ్ ముఖ్యంగా డ్రైవర్ లేని ఆటోమాటిక్ కార్లు తయారు చేయడంలో ఎదురవుతుంది. లిడార్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఈ కారు, ఏక్సిడెంట్ అయే పరిస్థితిలో ఎలాంటి ప్రాధాన్యతలు ఇవ్వాలి అనేది ట్రాలీ ప్రాబ్లెమ్. ఈ సమస్య ఆల్గోరిథమ్ అని నేను రాసిన కథలో ఎలా వివరించానో చెప్పాను. ఈ ఒక్క కథనే రెండు మూడు గంటలు చర్చించవచ్చు! వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల వచ్చే కరువు, వలసలు గురించి రెండు డిగ్రీలు కథలో రాశాను. రోబట్‌ని చనిపోయిన భార్యగా తయారుచేయడం, దానివల్ల సమస్యలు మనస్విని 002 లో రాశాను. రోబట్లు తిరుగుబాటు గురించి నగరంలో మరమానవి వెబ్ సిరీస్ రాశాను. కాలప్రయాణం గురించి ప్రయాణం అనే కథ, టైం లూప్ గురించి వలయం అనే కథ, బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి సీతాకోక చిలుక, సమాంతర విశ్వాల మీద థ్రిల్లర్ కథ సమాంతరం, ప్రళయానంతర డిస్టోపియా గురించి పునరుత్థానం, పాండెమిక్ తర్వాత కథలు ఇలా సైన్స్ ఫిక్షన్ లోని వివిథ అంశాలమీద తెలుగులో కథలు రాశాను. ఇవి చాలా వరకు సంచికలో ప్రచురితమైనవే. కథాసంకలనాలు Z, ఆల్గోరిథమ్ లలో వున్నాయి. ఈ విషయాలు సోదాహరణంగా ప్రసంగించాను.
ఇకపోతే, ప్రాంతీయ భాషల్లో సైన్స్ ఫిక్షన్ రాయడానికి ఇబ్బందులు గురించి మాట్లాడాను. ఇంగ్లీష్ వైజ్ఞానిక పదాలకి సరైన తెలుగు పదాలు లేకపోవడం అన్ని భాషలలో సైన్స్ పదాలకి ఒక సమన్వయం లేకపోవడం, చదివే పాఠకులు లేకపోవడం, ప్రచురణ చేసే పత్రికలు లేకపోవడం, ముఖ్యంగా వర్ణించాను. ఈ విషయంలో సంచిక సంపాదకులు చేసిన ప్రోత్సాహం గురించి కూడా చెప్పాను. ఇతర భాషల్లో గొప్ప రచనలు మిగిలిన భాషల్లో అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. దీనికి విరివిగా అనువాదాలు చేయడం ఒక పరిష్కారం. ఉదాహరణకి తమిళ మలయాళ హిందీ తదితర భాషల్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ నేను చదవలేదు. నేను, కస్తూరి మురళీకృష్ణ, సలీం లాంటి కొద్ది మంది రచయితల నవలలు విషయాలు మిగిలిన భాషల పాఠకులకు తెలియదు. నేను పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్ మీద రాసిన కథ రెండు డిగ్రీలు, సెల్ఫ్ డ్రైవింగ్ కారు మీద రాసిన ఆల్గోరిథమ్ కథ నా ఉపన్యాసంలో చెప్పాను. ప్రశ్నలు సమాధానాలలో మాడరేటర్ – “మీరు సైన్స్ ఫిక్షన్, కృత్రిమ మేధస్సు గురించి చెడ్డ విషయాలు మాత్రమే రాస్తే పాఠకులకు నెగెటివ్ సందేశం వెళ్తుంది కదా” అని అడిగారు.
నిజమే. సైన్స్ ప్రగతి వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఎక్కువగా వున్నాయి. కల్పనలో ఎక్కువ నెగెటివ్‌గా రాసినా, కృత్రిమ మేధస్సు, ఛాట్ జిపిటీ లాంటి కొత్తగా వచ్చిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్ల చదువుకునే వారికి విద్యార్థులకు చాలా మంచి కూడా జరుగుతోంది. పూర్తిగా అవి మనల్ని తప్పు దారి పట్టిస్తాయి అని చెప్పలేము. వైద్యశాస్థ్రంలో కూడా ఇప్పుడు కృత్రిమ మేధస్సు, శరీరం మీద ధరించే పరికరాల (Wearable devices like watches) తో డయాబెటిస్, రక్తపోటు లాంటివి మెరుగైన వైద్యం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇంకా సిటీ స్కాన్, రెటీనోగ్రఫీ, కేన్సర్, చర్మవ్యాధులు లాంటివి వ్యాధి నిర్ధారణ చేయడానికీ ఏఐ యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సైన్స్ ఫిక్షన్, ఈ ప్రగతి వల్ల వచ్చే సమస్యలు, నైతికత మానవతా విలువలు, ఇవన్నీ చిత్రిస్తూ మనని మంచి మార్గంలో వెళ్ళడానికి సహాయపడుతుంది అని చెప్పాను. ఆ రకంగా ఇది సమాజానికి మేలు చేసే సాహిత్యం. ఆలోచింపజేసే సాహిత్యం. ఇంకా సైన్స్‌ని చెడు దారి పెట్టకుండా నియంత్రణ చేయగలిగే సామర్థ్యం వున్న సాహిత్యం.
సాధనా శంకర్, సైన్స్ ఫిక్షన్‌లో స్త్రీ వాదం గురించి మాట్లాడారు. నటరాసన్ తన కథలు ఆయేషా గురించి అది పదమూడు భాషల్లో అనువాదం చేయబడటం గురించి చెప్పారు.
ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రేక్షకుల్లో వున్నారు. నా నవలలు బాగానే చదివినట్లు ఉన్నారు. నన్ను ఇండియన్ రాబిన్ కుక్ కింద వర్ణించారు ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్. వారి ఆదరణ, సైన్స్ ఫిక్షన్ రచయిత అనీ చూపిన విద్యార్థుల ఆరాధనా భావం, నాకు ఎంతో సంతోషం కలిగించాయి. గ్లామర్ సంగతి అటుంచితే, గుర్తింపు కూడా తెలుగు సాహిత్యంలో దొరకడం కష్టం అనుకునే నాకు, ఈ సమావేశం గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ ఉపన్యాసాలు విని మీలో ఒకరైనా సైన్స్ ఫిక్షన్ కథలు రాయడం మొదలుపెట్టండి, కవిత్వం, నవలలు కథలు ఎలాగైనా వున్నాయి, సైన్స్ ఫిక్షన్ రాయడానికి ప్రయత్నించండి అనే సందేశంతో నా ఉపన్యాసం ముగించాను. ఓ క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత సభ కరతాళథ్వనులతో మారుమోగింది.
వెల్లూరుకి దగ్గరలో వున్న పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో శివాలయంలో అగ్నిలింగం, ఇతర ఆలయాలు, గిరి ప్రదక్షిణ చేసి, రమణాశ్రమం దర్శించుకున్న తరువాత, చెన్నై చేరుకుని హైదరాబాద్ విమానంలో, మంచి జ్ఞాపకాలతో తిరిగి చేరుకున్నాము. విపరీతమైన గ్రీష్మతాపం బాధ పెట్టినా, సాహిత్యంతో రెండు రోజుల పాటు గడపడం వల్ల మల్లెల సౌరభంలా మనసులో చల్లదనం నిండిపోయింది.