సంధ్యావన్దనము

0
3

[box type=’note’ fontsize=’16’] సంధ్యావందనం ప్రాశస్థ్యాన్ని, విధానాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు డా. వి. ఎ. కుమారస్వామి. [/box]

[dropcap]ఇ[/dropcap]ది మూడు భాగాలు కలది. మొదటిది అర్ఘ్య ప్రదానము, రెండువది గాయత్రీ జపము, మూడవది ఉపస్థానము. ఉపస్థానము అనగా పెద్దలను సేవించుట, హజరు చెప్పుకొని లేచి నిలబడి నమస్కారము చేయుట.

వీనిలో అర్ఘ్య ప్రదానము ప్రథమము, ప్రముఖము. గాయత్రీ జపానికి ఆలస్యమగుట వల్ల ఎక్కువ చేయవలెను అను ప్రాయశ్చిత్త విధి లేదు. అర్ఘ్య ప్రదానమునకు ఆలస్సమయినచో ప్రాయశ్చిత్తార్ఘ్యమున్నది. మరియు జాతాశౌచ మృతాశౌచములలో అర్ఘ్యప్రదానము వరకు చేసి తీరవలయిను. ఇంకను ఆలోచింపగా అర్ఘ్య ప్రదానములో ప్రధానము ‘అసావాదిత్యో బ్రహ్మా’ అనునది. ఇది సంపదుపాసనము. అనగా అల్పము నందు మహత్తరమును ధ్యానించుట. ఉదాహరణము సాలగ్రామమందు విష్ణు భావనము. ఇచట సౌరకుటుంబానికి పెద్దయై గ్రహరాజయిన సూర్యుని యందు బ్రహ్మండ సృష్టి స్థితి లయ కారణమగు పరంబ్రహ్మను ధ్యానించుట సంపదుపాసనము. దీని పర్యవసానము తైత్తిరీయ మందున్న “సయశ్చాయం పురుషో యశ్చాసా వాదిత్యే సయేకః” అను వాక్యబోధ. దూరము నందున్న సూర్యుని యందున్న పరమాత్మ, ఈ జీవుని యందున్న పరమాత్మ ఒక్కడే అను అవగతి సాధ్యము.

దీనికి కావలసిన చిత్తశుద్ధికి ఆరంభబములో పుండరీకాక్ష స్మరణం చెప్పబడినది. ఇక్కడ పుండరీక మనగా హృత్పుండరీకము హృదయ కమలము. అదియే అక్షము ఇంద్రియము. ప్రస్తుతము నేత్రముగా చూపుగా జ్ఞానముగా గలవాడను అర్థమున పెద్దలు చెప్పియున్నారు. అతనిని స్మరింపగా బయట, లోపల కూడా పరిశుద్ధడగును. తదుపరి ఆచమనములతో “ఆపోహిష్టా” అను మంత్రాలతో “హిరణ్యవర్ణా” మున్నగు మంత్రాలతో ప్రాణాయములతో ఉక్కరి బిక్కిరియై లోపలి పాపము బయట పడుటకు సిద్ధమగును. అప్పుడు “ద్రుపదాదివముంచతు” అను మంత్రముతో ఆ పాపమును నీళ్లలోనికి వదలి విసరివేయవలెను. ఇట్టి పరిశుద్థితో అర్ఘ్యప్రదానము చేసి అదిత్యోపాసన చేయవలయును. ఉపాసన యొక్క భావార్ధము జ్ఞానమందు లయించును. ఈ జ్ఞానమేమి? సృష్టి స్థతి లయ కారకమగు పరబ్రహ్మ, ఆత్మ కంటే వేరుకాదని తెలియుట. ఇట్లు బ్రహ్మధ్యానపరుడు క్రమంగా బ్రాహ్మణ శబ్ధానికి అర్హుడగుచున్నాడు. ఇందువల్ల బ్రాహ్మణ జాతికి సంధ్యావందనము ప్రధానమయింది.

అర్ఘ్య ప్రదానము నీళ్లతోనే ఎందుకు చేయవలె అనగా పూలు పండ్లు సూర్యుని దాకా ఆకాశములో ఎగురలేవు. కాని జలములు ఒక చుక్క అయినను ఎక్కడ పడినను అవి ఆవిరి అయి సూర్యుని చేరి తీరును.

కర్మ ఉపాసన జ్ఞానము మూడే వేదములందు చెప్పబడినవి. కర్మానుష్టానమునకుగా గృహస్థాశ్రమము. ఉపాసనకుగా వానప్రస్థము, జ్ఞానమునకుగా సన్యాసమును ఏర్పడినవి. వీనికి పునాదిగా ప్రథమ సోపానముగా బ్రహ్మచర్యము, వేదశాస్త్రాధ్యాయనము కొరకు నిలబడింది.

నిత్యనైమిత్తిక కామ్యా నిషిద్ధ శాన్తి వేష్టికాభ్యుదయ కర్మలలో మొట్టమొదటి నిత్య కర్మ సంధ్యావందనము. వేదములోని ఉపాసనాకాండ తరువాత తరువాత భక్తి పేరుతో ప్రకటమయింది. ఇక్కడ సూర్యునిపై శ్రద్ధా భక్తులు ప్రబుద్ధము లయినవి గనుక సంధ్యావందనములో భక్తి కలదు.

ఇది జ్ఞానమునకు అత్మజ్ఞానానికి బ్రహ్మత్మజ్ఞానానికి దోహదమయినది గనుక నిత్య కర్మకు ఈశ్వరభక్తికి జ్ఞానమునకు మూడిటికి ఆలవాలము.

ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అర్ధరాత్రి నాలుగు సంధ్యలున్నవి. సంధ్యావన్దనము కనీసము ఉదయాస్తమయాలలో తప్పనిసరి. మూడు వేళ్ల చేస్తే మధ్యమము. నాలుగు వేళల చేస్తే ఉత్తమము.

సంధ్యలలో అనుసన్ధానము చేయబడుచున్నది గనుక సంధ్య అన్నారు. వేదమంత్రవర్ణములు దేవుని తేజస్సును అర్థముగా మోయుచున్నవి గనుక గాయత్రి వేదమాత అనబడునది. English లో దీని usage Impregnant with knowledge అని కలదు. అనగా జ్ఞానమును వహించు వాక్కు స్త్రీ రూపము.

ఉపనిషత్తులలో అగ్రగమ్యమయిన ఈశావాస్యములో కర్మకు విద్యకు సముచ్చయము చెప్పబడినది. నిత్యకర్మ సుర్యోపాసనలకు ఇచట సముచ్చయమును నిరభ్యంతరముగా మనము భావించుకొనగలము. విద్యాపదము ఉపనిషత్తులలో ఉపాసనాపరముగా ప్రయుక్తమయినది. కాబట్టి వైదిక కర్మ అనునది విద్య అనునది ప్రప్రథమము సంధ్యావందనములో కలదు. అకర్మణ్యులు అబ్రహ్మణ్యులు అవిద్యలో పడి పోవుచున్నారు. కర్మభూమియైన భారతదేశములోని ప్రజలు అట్లు కాకుందురు గాక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here