విశ్వనాథ రచనలలో కారుణ్య రస మూలాలు

0
3

[box type=’note’ fontsize=’16’] “‘వేయి పడగలు’ నవల మొత్తం శిథిలమై పోతూవున్న జాతీయ జీవన వ్యవస్థను దర్శింపజేసే దీర్ఘ విషాద వచనకావ్యం. దీనిలో చరాచర జగత్తంతా కారుణ్యవర్షంలో తడిసిపోయింది” అంటున్నారు కోవెల సుప్రసన్నాచార్యవిశ్వనాథ రచనలలో కారుణ్య రస మూలాలు” అనే ఈ వ్యాసంలో. [/box]

[dropcap]ఒ[/dropcap]క వ్యాసుణ్ణి గూర్చి ఆలోచించినా, ఒక అభినవ గుప్తుణ్ణి గూర్చి, క్షేమేంద్రుణ్ణి గూర్చి భావన చేసినా మనకు తలపుకు వచ్చేది పరీణాహ ప్రతిభావ్యక్తి యైన సరస్వతీమూర్తి. ఈనాడు విశ్వనాథ సత్యనారాయణను గూర్చి తలచుకొన్నా మనకు స్ఫురించేది రత్నాకరమంత గంభీరమైన హిమాచలమంత ఉన్నతమైన విస్తృత సరస్వతీమూర్తి.

యోగి బాహిరమైన జగత్తు నుంచి ఆంతరమయిన లోకానికి ప్రయాణం చేస్తే కవి లోతుల్లోనుండి జగత్తులోనికి ప్రయాణం చేస్తూ వుంటాడు. తనను లోకం నిండా ఆవిష్కరింప జేసుకుంటాడు. ‘సర్వభూతేషు చాత్మానం’ అన్న గీతావాక్యం దీన్నే వెల్లడిస్తూ వున్నది. ‘బ్రహ్మ జగదతీతమను భావంబు లేక, ఈ జగతత్వమున బ్రహ్మ యోజచేసి భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడ’ అన్నాడు విశ్వనాథ. కవిత్వ సాధనారంభ వేళలో, ఈ భేదాన్నే మరొక చోట విశ్వనాథ యిట్లా విశ్లేషించినాడు. ‘ఉర్విలోన మహాకవి యోగివంటివాడు, సర్వమ్ము భావనావధిగ జూచు’. అతని ఆవధి భావన. ఈ భావనలోనే మూలముల వస్తువైన అవ్యక్తం ఆవిష్కరించడం కావ్య ప్రవృత్తి.

ఈ వ్యక్తి చైతన్యం విశ్వరూపాన్ని పొందటంతో జగత్తుకు సంబంధించిన వ్యవహారం రసజగత్తులోనికి ప్రవేశిస్తున్నది. మన దేశంలో ఎప్పుడూ అన్ని కళలూ జీవ పరమార్థాభిముఖాలుగా సాగుతున్నవి. ఇది ఒక తపస్పు. ‘కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా: మనస్సంయమాది విధానంబుల చేత కాని తన మైతిన్ మూర్త సంవిత్కలా యువతీ భోగః హరింపజేయుటకు మారోడ్తున్ జుమీ యింద్రియాది కారంబుల భావనా విమల వాక్తీర్థంబులే పారగన్’. వాక్తీర్థం వల్ల ఇంద్రియ వికారములను కడిగివేసే ఒక విచిత్ర సాధన ఈ కవిత. ఇది జాగృదావస్థ లోనే కాక స్వప్నాసుషుప్తులను కూడా ఆవరించిన ఒక సాధన. అచేతన అవచేతనల్లోనుంచి ఈ కళాంశములు పెకలించుకుని చీల్చుకుని వస్తున్నవి. ఈ జీవుని భావుకతా స్థితి వ్యక్త జగత్తులో అవ్యక్త చైతన్య మూలాలను అన్వేషించటం. ఆ వేదన జీవుని వేదన.

విశ్వనాథ సారస్వతం నిండా ఈ వేదన ఏకసూత్రంగా గోచరిస్తుంది. అందుకే విశ్వనాథ రచనలన్నింటిలోనూ ఒక గాఢమైన విషాదరేఖ గోచరిస్తుంది. అందుకే కిన్నెరసాని కరిగి నీరై వాగై ప్రవహించింది, నాటకాలన్నింటా నర్తనశాల, అనార్కలి, వేనరాజు, శ్రిశూలాల్లో విషాద నాయకత్వమే ధ్వనించింది. అనార్కలి నాటకంలో విషాదాభివ్యక్తి కథా పరిధిని దాటి ఆంతర్యంలో ఉన్న కవిని పాత్రగా చేసి ఆవిష్కరించింది. ‘ఏకవీర’లో వేగై నది ప్రోషిత భర్తృక వలె హంసగీతము నాలపించినది. ‘మా బాబు’ జీవనంలో అట్టడుగున ఏదో ఒక విషాదపు నీటి ఊట మూలంలో ఉండటం స్ఫురిస్తుంది. ‘స్వర్గానికి నిచ్చెనలు’ నవల వసుంధర జీవితంలోని విషాదస్మృతితో పూర్తవుతుంది. పశుపతి శాస్త్రి వాయించిన వీణ తోడిరాగమును నాలపించింది. “వసుంధర యొక్క సర్వ విషాద చరిత్రము నా చేరుటలో కనిపించుచుండెను. ఓహో! యేమి రాగము? అసాధారణ గాంధారమునుండి షడ్జమమునకు చేరిన ధ్వనిలో శ్రీరామచంద్రుడు సీతను వనవాసమునకు పంపినట్లు, నలుడు దమయంతి చీర చించుకొని పోయినట్లు, ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినట్లు, పుత్ర వియోగార్తి యైన తల్లి దుఃఖించినట్లు పరమేశ్వరుని యనుగ్రహము లేక జీవితమంతయు శిథిలమైనట్లు హృదయములో దిగులు పుట్టుచుండెను. ఈ దుఃఖాశ్రువుల వెనుక సమాహితమైన ఒక శాంతిని పట్టుకొనడం కోసమే ఈ కృషి.

ఈ వేదన చుట్టూ విశ్వనాథ సారస్వత ప్రపంచం పరిభ్రమిస్తున్నది. ఈ యనిలాధ్వమందు నినదించెడు ముప్పల మోత దూరమైపోయిన గోతతిన్ పిలుచు పోలికయేదో వినిస్వనించెడున్’ అందుకే తన కవితలో ‘భాష లేదా కృతి లేదు’ ఊరక రసాత్మకతతో ప్రవహించడం దాని లక్షణం, ఆ భావ తీవ్రత ఎలాంటిదంటే శబ్దాన్ని ఏరడానికి వీలివ్వక పరుగెత్తిస్తుంది.

అప్పుడప్పుడూ కవి ప్రశ్నించుకుంటాడు “ఓయీ మూర్ఖ కవీ జగత్తుకు లేదో దానికున్నంత దుఃఖాయాసమ్ము, భవత్పురాకృతము దుఃఖంబేటికో పంచెద’నని ప్రశ్నిస్తున్నాడు.

‘వేయి పడగలు’ నవల మొత్తం శిథిలమై పోతూవున్న జాతీయ జీవన వ్యవస్థను దర్శింపజేసే దీర్ఘ విషాద వచనకావ్యం. దీనిలో చరాచర జగత్తంతా కారుణ్యవర్షంలో తడిసిపోయింది. ‘పృషన్నిధి’ అన్న మబ్బు, ఆది వటవృక్షమ చెట్టు, లక్ష్మణ స్వామి అన్న యేనుగు్, తీగవంటి పామువంటి మనిషి పసిడి రంగాజమ్మ, కేశవరావు, గిరిక. అరుంధతి – వీరందరి శైథిల్యమూ, మరణపు దుఃఖపు లోతులను త్రవ్విన ఘట్టాలే.

ఈ అస్పష్ట దుఃఖోద్వేగం ప్రధానాంశమైన కవి కావడంవల్ల ఆయ సాహిత్య సృష్టిలో అంతా జాగ్రత్ చైతన్యాంశకంటే, అవచేతనాంశం, సమష్టి అవచేతనాంశమూ ప్రధానంగా ప్రసరించుతవి. రచనా వ్యగ్రతతో కూర్చుకోగా ఆ చేతః పార్శ్వాలు తెరచుకొని ప్రవాహప్రాయంగా రచనా వైఖరి ప్రసరింపచేసేది. అందువల్లనే ఆయన సాహిత్యంలో ఎక్కువభాగం డిక్టేట్ చేస్తే ఇతరులు లిపి బద్ధం చేసింది. అందుకే ఆయన రచనలో శబ్దం అప్పటిదాకా వస్తూ వున్న తెలుగు కవితా సంప్రదాయం కంటే భిన్నంగా ప్రవర్తించింది. శిల్పం జ్ఞాతాజ్ఞాత చైతన్యాంశాల సంధి లోంచి ఉద్భవించింది. అన్నింటా నూతన సంప్రదాయాలను సృష్టించింది.

లోకంలో ఎంతగా ఆయనకు సంప్రదాయవాదిగా పేరున్నా ఆయన సంప్రదాయ రూపాలనన్నింటినీ ఛిన్నాభిన్నం చేశాడు. అనార్కలీ నాటకంలో ఆలంబన ఉద్దీపన విభావాలు పాత్ర రూపాన రంగంమీద ప్రవేశించాయి. ఏకవీరలో కావ్యమై, వేయి పడగలలో ఇతిహాసమై, స్వర్గానికి నిచ్చెనలలో విచారణా శీలాన్ని సంతరించుకొని నవల ఎన్నో కొత్త స్వరూపాలను పొందింది. మ్రోయు తుమ్మెదలో రచయిత, స్వయంగా కథలోకి ప్రవేశించాడు. దమయంతీ స్వయంవరంలో సగం పైగా దాటితేనే కథాంశం ప్రారంభమవుతున్నది. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ధోరణియే వేరు. పురాణ వైర గ్రంథమాలలో కాశ్మీర నేపాల నవలల్లో పంచలక్షణోపేతమై పౌరాణిక రూపం కూడ నవల సంతరించుకుంది. ఆరునదులలో ఉపన్యాసాలు కూడా నవలలో భాగమైనాయి. నవలలో ఇన్ని ప్రయోగాలు ఎవరు చేశారు? విశ్వనాథకు నవల – రచన ప్రక్రియలో అనేక యోగాలు చేసేందుకు ఒక వేదిక అయింది.

ప్రయోగ శీలం ఆయన నాటికలలో, చిన్న కథలలోనూ స్పష్టంగా కానవస్తుంది. మానుష ప్రపంచాన్ని చిత్రించడంలో విశ్వనాథ ఎంత వైవిధ్యాన్ని చూపించుతారో అది ప్రపంచ సాహిత్యంలోనే ఒక అరుదైన అంశం. మానుష ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉన్నదో ఆయన సృష్టిలోనూ అంతే వైవిధ్యం ఉన్నది.

ఆయన మధ్యాక్కరను పునర్జీవింపజేసి దానికి పద్యానికీ, వచనానికీ నడుమ ఉండే ఒక మధ్యస్థ లక్షణాన్ని సమకూర్చారు. సాహిత్యంలోని ఈ సంవేదనా శీలానికి ‘మధ్యాక్కరలు’ అద్దం పట్టింది.

అయితే రామాయణ కల్పవృక్షం ఒక ఎత్తు, మిగిలిన సారస్వతమంతా ఒక ఎత్తు. కల్పవృక్షం జీవితంలో ‘కలవోక కొన్ని వేళలు నికామ భవత్పద వాసనానలోజ్జ్వలిత శిఖా సనాథములు’ అంటాడు. ఈ జ్వలించే ముహూర్తాలను దీర్ఘీకరించు కోవడమూ చదివేవాళ్ళకు కూడా దీర్ఘకరించడమూ దీని లక్ష్యం.

‘తనదైన అనుభూతికి రసరాజ్య పట్టాభిషేకం చేయడం కోసం రూపుకట్టింది కల్పవృక్షం. విశ్వనాథ శోకానికి శ్లోకత్వం కలిగించే దిశలో ఆ ‘శాంతి’ని పట్టుకొన్నాడు. తనలోని జడత్వమూ, ప్రాణశక్తుల బహిర్వృత్తీ , మనస్సులోని చాంచల్యమూ – ప్రభు భావాభి సంధానం చేత దివ్యాభిముఖంగా పరిణామం చెందుతూ వచ్చాయి. కన్నీటిలో దివ్యజీవన సూర్య కిరణాలు ఇంద్రధనుస్సులను మొలిపించాయి.

‘ప్రభు మేనిపై గాలిపయి వచ్చినంతనే
పాషాణ మొకటికి స్పర్శవచ్చె
ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక దానికి చెవులు కలిగె’

ఈ సాధనలో ‘నా ప్రేమ యిద్ది యెన్నాళ్ళిట్టు లేయుండు; ‘ఆ ప్రభువు సాక్షాత్కరించేదాకా – ఆ సమాహితమైన ‘శాంతి’ నెలకొనేదాకా ఇక్కడ ఇతడు ఇట్లాగే వేచియుండక తప్పదు

అందుకే ఈ దేహము ఈ విచిత్రమగు దుఃఖారామము. మానవుడు ఆర్థికంగా సమసమాజం స్థాపించవచ్చు. భౌతికమైన బాధలను తగ్గించవచ్చు. కాని వియోగం వల్లా, మృత్యువువల్లా ఇంకా తెలియని కారణాల వల్ల వచ్చే దుఃఖం ఉంటుంది. ‘పర్యుత్సుకోభవతి, యత్సుఖితోపి జంతుః’ ఈ పర్యుత్సుకత్వమును కల్పవృక్షం అడుగడుగునా సాక్షాత్కరింపజేసింది. అందువల్ల అన్ని పాత్రలూ తమకు తెలిసో తెలియకో ఈ సంవేదన అనుభవిస్తూ దూరంగా ఉన్న శాంతిని పట్టుకునే ప్రయత్నంలో ఉంటాయి.

రాక్షసులూ, దేవతలూ, మనుష్యులూ అందరూ ఈ దిశలోనే సంచరిస్తారు. పాత్రలలో మంచీ చెడూ అనే భేధం లేదు. అందరిలోనూ ఉన్న సమాన లక్షణం ఇదే. ‘ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖంబు’. అహల్య దుఃఖం శ్రీ రామచంద్రుని కరిగించిన వేదన ఇది. అల నామె దుఃఖ వికట జ్వలితాగ్ని మదంతరంబునం దొదిగిన కోటి జన్మల మహోన్నత దుఃఖము త్రవ్వి చూపినదనీ వశిష్ఠునితో తన దుఃఖ స్వరూపాన్ని చర్చిస్తూ లోయెడందలో తోచియు, తోచనట్టిదియు దూరము దగ్గరకాని సందడిన్ రాచిన రాపిడై మెరుగ రానిది స్ఫురిస్తున్నదని చెప్పినాడు.

సీతాపహరణ వేళలో కల్పవృక్షంలో దుఃఖసముద్రం పొంగులెత్తింది. తరులు, గిరులు, ఝరులూ చైతన్యంలో కదలాడి పోయాయి. అప్పుడు గోదావరి నది, తన బిడ్డను మింట తన్నుకొని పోవు గృధ్రము గుర్తు పెట్టుకొని నేల మీద పరువెత్తు మహా భుజంగివోలె నున్నది. ఆమెకు రామలక్ష్మణుల గుర్తును సీతాదేవి చెప్పుతూ ‘వృషోత్సర్జనవేళా కేతనీభూతస్తంభద్వయము’ వలే ఉంటారని వివరిస్తుంది. ‘అన్న కన్నులలో జలముండును. తమ్ముని కన్నులలో నగ్ని యుండును.’ ఇది గుర్తు, చరాచర జగత్తు ఈ కరుణ రస భావంలో మునిగిపోయినది.

రాక్షస సంహారం చేసినపుడల్లా శ్రీ రాముడికి గుండెలో ఒక దుఃఖ స్పర్శ కలుగుతుంది. లంకా ప్రాకారం చూస్తూ ఉంటే ‘ఏదో పూర్వ యుగాల సంసృతి భయం బీ దైత్యులో గుండెలో పాదుల్ కట్టుక కూరుచున్నయది. ఈ ప్రాకార రూపంబునన్’ అంటారు రచయిత. అక్షయకుమారుణ్ణి తన బిడ్డ యేమో అన్నంత మమకారంతో చిత్రించాడు కవి సుందర కాండంలో.

వాల్మీకి మూలమే అయినా దాన్ని చూచిన చూపు, అది రూపొందిన రీతీ, దాన్ని ఆవిష్కరించిన వైఖరి అంతా విశ్వనాథ ప్రజ్ఞా ప్రభావమే. అనితరసాధ్యమైన ఈ నిర్మాణ వైఖరివల్ల విశ్వనాథ తెలుగు సాహిత్య పరిధులను అతిక్రమించాడు. తిక్కనా, పోతనా ఆయనలో కలిసిపోయారు. ఆధునిక కాలంలోని మానవుని సంవేదనా హృదయమూలంలో నిలిచి ఉంది. ఆంతర్యంలో జీవుని దివ్య చైతన్యాంశను అందుకునే ప్రయత్నం ప్రధాన వస్తువయింది. ఎలియట్ ‘వేస్ట్‌లాండ్’లో ఆధునిక జీవనంలోని సంక్షోభానికి భారతీయాధ్యాత్మిక భావంలోని నిత్యానంద స్పృహ జోడింపబడింది. సృష్టిలో నిత్యమైన దైవాసుర సంఘర్షణలోని దైవీశక్తుల విజయం మాత్రమేకాక అసుర శక్తులలోని దైవాంశను వెలికి లాగడంతో శ్రీమద్రామాయణ కల్పవృక్షం మానవ జీవన పరిణామంలోని భవిష్యదంశాన్ని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here