అంతరిక్షంలో ఆగంతకులు

1
3

[బెల్జియం రచయిత ఫ్రాంక్ రోజర్ ఆంగ్లంలో రచించిన ‘కాలనీ’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. అంతరిక్ష యాత్ర నేపథ్యంగా, సాంఘిక అసమానతలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, అభివృద్ధి డొల్లతనాన్ని వ్యంగ్యంగా చాటిన కథ ఇది.]

1

[dropcap]త[/dropcap]మ సంస్థ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన ఓ గొప్ప వార్త వెలువడిన సందర్భంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇ.ఎస్.ఎ.) హెడ్‌క్వార్ట్సర్స్‌లో సందడి మొదలైంది. షాంపేన్ పొంగి పారుతోంది.

సంస్థ ప్రతినిధి ఒకరు టివిలో లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- “యులిసెస్ చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. డేటా పంపడం మొదలైంది. చంద్రునిపైకి మొదటి మానవరహిత యూరోపియన్ మిషన్ విజయవంతమైంది. అంతరిక్ష పరిశోధనలో యూరప్ పూర్తిగా పాలుపంచుకుంటోందని ఇప్పుడు అందరికీ అర్థమైంది. అమెరికన్లు, రష్యన్లు, చైనీస్, ఇండియన్స్‌కి ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. మా ఏజెన్సీ భవిష్యత్తులో సాధించబోయే ఎన్నో గొప్ప అంతరిక్ష విజయాలకి ఇది నాంది మాత్రమే అని చెప్పనవసరం లేదు. ఇప్పుడిక కొంతమంది – మనం చేపట్టబోయే మొదటి మానవసహిత మిషన్ గురించి కలలు కనడానికి – ఉత్సాహపడతారు, అయితే మనం వర్తమానంపై దృష్టి సారించి, యులిసెస్ ప్రసారం చేస్తున్న సమాచారంతో పని ప్రారంభిద్దాం.” అన్నాడు

మిషన్ ప్రారంభంలో ఎదుర్కొన్న సాంకేతిక సమస్యల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు: దోష సందేశాలు, సాంకేతిక ప్రమాదాల గురించి వార్తలు, విఫలమయ్యే మిషన్ అంచనాలు – వీటి గురించి అసలేం మాట్లాడలేదు అతను.

మిషన్ అసలు కార్యక్రమం ఇప్పుడే మొదలైనప్పటికీ, ఓ ప్రధాన వార్తాపత్రిక ‘ప్రారంభం బావుంటే, ముగింపు బావుంటుంది’ అనే హెడింగ్‍తో ఈ వార్తని అందించింది.

2

యులిసెస్ అనుకున్న చోటనే దిగింది, దాని సాంకేతిక వ్యవస్థలన్నీ సరిగ్గా పని చేస్తున్నాయి, అది భూమికి డేటాను ప్రసారం చేస్తోంది: మామూలు శుభవార్త కోసం ఇవి చాలా ఎక్కువ.

అయితే, లాంఛ్ వెంటనే తలెత్తిన సమస్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉంది. లూనార్ మాడ్యూల్ పంపే తొలి ఫొటోల కోసం అసహనంగా ఎదురుచూస్తున్న వారికి నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఆ ఫోటోలని ప్రస్తుతం అందరికి చూపించలేమని ఏజన్సీ ప్రకటించటంతో – గుసగుసలు మొదలయ్యాయి. ఏజెన్సీ ప్రతినిధి మళ్ళీ మీడియా ముందుకొచ్చాడు; ఏవో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్న పుకార్లను ఖండించాడు. “కొన్ని సమస్యలను పరిష్కరించిన వెంటనే ఫోటోలను బహిర్గతం చేస్తాము” అని హామీ ఇచ్చాడు. సమస్యల స్వభావాన్ని అతను వివరించలేదు.

ఏం జరుగుతుందోనన్న ఊహాగానాలతో మీడియా దూసుకుపోతోంది.

3

యులిసెస్ తీసిన చిత్రాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సిబ్బంది ఒకరు ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. లో-క్వాలిటీతో ఉన్న ఆ ఫోటోలు అంతరిక్షంలో, చంద్రునిపై కొన్ని కదలికల సంకేతాలను చూపుతున్నాయి. ఆ ఫుటేజ్ అసలైనదా, సవరించబడినదా లేదా నకిలీదా అని నిర్ధారించడం అసాధ్యం. కొన్ని గంటల తర్వాత, సోషల్ మీడియా అంతా వ్యాఖ్యలతో నిండిపోయింది. మర్నాడు ఇ.ఎస్.ఎ. అధికారిక ప్రకటన చేసింది.

యులిసెస్ ప్రసారం చేసిన వీడియో చిత్రాలు – మిషన్ లాంఛ్ తర్వాత ఎదురైన సాంకేతిక సమస్యలకు సంబంధించిన పొరపాట్లను చూపుతాయి. మేము ఇప్పుడు ఈ సమస్యల స్వభావాన్ని పరిశీలిస్తున్నాము. తగిన చర్యలు తీసుకుంటాము.”

అయితే – అజ్ఞాత వర్గాలు వ్యాపింపజేసిన – యులిసిస్‍ లోకి ఆగంతకులు జొరబడ్డారన్న పుకారు, సంబంధిత వార్తలను – ఏజన్సీ ప్రతినిధి మొండిగా త్రోసిపుచ్చాడు: “ఈ పుకార్లు సంచలనం కోసం సృష్టించారు, అర్థం లేనివి. కౌరో స్పేస్‌పోర్ట్ వద్ద భద్రతా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా, లూనార్ మాడ్యూల్ లేదా బూస్టర్‌లోకి ఆగంతకులు ప్రవేశించలేరు. మనిషి గాని జంతువు గాని రహస్యంగా దాక్కుని ఈ మాడ్యూల్‍లో అంతరిక్షం లోకి వెళ్ళే అవకాశం లేదు, ఒకవేళ ఉన్నా, అది మరణాన్ని ఆహ్వానించటమే: గమనవేగం, ఆక్సిజన్ లేకపోవడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఏ జీవికి అక్కడికి చేరే అవకాశం ఇవ్వవు”.

4

మరిన్ని చిత్రాలు లీక్ అయ్యాయి. వాటిల్లో చంద్రుడిపై కదులుతున్న మానవ ఆకారాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో, గత్యంతరం లేక ఏజన్సీ – ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ వార్త గురించి ప్రస్తావిస్తున్న ప్రతినిధి చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నాడు.

యులిసెస్‌ను లాంఛ్ చేసే ముందు, అనధికార వ్యక్తులు నిషేధిత ప్రాంతంలోకి వచ్చారని, లూనార్ మాడ్యూల్‌‌లోకి జొరబడ్డారని మేము ఇప్పుడు నిర్ధారించగలము. భూమి నుండి చంద్రుని పైకి సరైన సౌకర్యాలు లేకుండా ప్రయాణం చేసి సజీవంగా ఉండే అవకాశాన్ని- అందరు శాస్త్రవేత్తలు, అంతరిక్ష నిపుణులు స్పష్టంగా త్రోసిపుచ్చినప్పటికీ, ఈ వ్యక్తులు – అసంభవాన్ని సంభవం చేశారు. వారెవరో, వారి ఉద్దేశాలేంటో, వారి పద్ధతులేంటో ఏమీ తెలియదు. మా దర్యాప్తులో ఈ రహస్యం వెలుగులోకి వచ్చినప్పుడు, మేము మీకు మరింత సమాచారం అందిస్తాము. చివరగా – ఈ సమస్య యులిసెస్ సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం లేదని చెప్పడానికి సంతోషంగా ఉంది. లూనార్ మాడ్యూల్ డేటాను ప్రసారం చేస్తూనే ఉంటుంది, అక్కడి మట్టిని పరిశోధించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.” అంటూ ముగించాడు.

దేశం విడిచి పారిపోవటం తప్ప మరో గత్యంతరం లేని శరణార్థులు కొందరు తప్పించుకునేందుకు – విమానం ల్యాండింగ్ గేర్‌లో దాగి ఉండి ఆకాశంలో ప్రయాణించి విమానం నుండి అద్భుతంగా బయటపడిన ప్రయత్నాలు మీడియా వాళ్ళకు గుర్తుకొచ్చాయి. అయినా, విమాన ప్రయాణానికి, శూన్యంలో ప్రయాణానికి మధ్య తేడా ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించారు.

5

ఒక సోమాలియా దేశస్థుడితో జరిపిన ఇంటర్వ్యూను బిబిసి ప్రసారం చేసింది, అజ్ఞాతంగా ఉండడానికే ఇష్టపడిన అతను – యులిసెస్‍ లో రహస్యంగా ప్రయాణించి చంద్రుని పైకి చేరిన వ్యక్తులలోని పురుషుడికి తాను అన్ననని చెప్పుకున్నాడు.

“నా తమ్ముడు, మరదలు వారి ప్రయాణానికి పూర్తిగా సన్నద్ధమయ్యారు, వారేమీ యాదృచ్ఛికంగా, సజీవంగా తమ గమ్యస్థానానికి చేరుకోలేదు. వాళ్ళు కోల్డ్ స్టోరేజీ గదులలో, నీటి అడుగున శిక్షణ పొందారు, సున్నా డిగ్రీలు, అంత కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా నిరోధకతను పెంచుకున్నారు. పారేసిన ఇన్సులేటింగ్ మెటీరియల్‌తో థర్మల్ సూట్‌లను తయారు చేసుకున్నారు; ఆక్సిజన్ అందించే మల్టీ-లేయర్డ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లను రూపొందించుకున్నారు. వారు ఆహారం, తాగునీరు, అలాగే కొన్ని ఇతర ఉపయోగకరమైన వస్తువులను కూడా అక్రమంగా రవాణా చేశారు. నా తమ్ముడు తన సంకల్పం, పట్టుదల, ఇంకా – ఇబ్బందుల నుండి త్వరగా బయటపడే సామర్థ్యంతో – మొత్తం శాస్త్రీయ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అన్నాడు.

నిపుణులు, ఇ.ఎస్.ఎ. సిబ్బంది ఈ వ్యక్తి మాటలు విశ్వసించదగ్గవి కావని కొట్టిపడేశారు. కానీ ఆగంతకుల విజయానికి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేకపోయారు. “మా పరిశోధన వేగంగా సాగుతోంది. ఈ రహస్యాన్ని తప్పక ఛేదిస్తాం” అంటూ ప్రతినిధి ముగించాడు.

6

ఇ.ఎస్.ఎ. ఎట్టకేలకు వీడియో ఫుటేజీని విడుదల చేసింది, రెండు మానవాకారాలు చంద్రుని ఉపరితలంపై వికృతంగా కదులుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది, వాళ్ళు ముతకగా కుట్టిన స్పేస్‌సూట్‌లను ధరించారు, అయితే కుట్లు చాలా గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే వాళ్ళు కెమెరా దృశ్యమాన పరిధిని దూరంగా ఉండటంతో వాళ్ళక్కడ ఏం చేస్తున్నారో స్పష్టంగా తెలియడం లేదు.

కొంతమంది వ్యాఖ్యాతలు ఆ చిత్రాలు నిజమైనవి కావని అనుమానిస్తున్నారు, అయితే ఇ.ఎస్.ఎ. ​​వాటి ప్రామాణికతను నిర్ధారించింది. “ఈ జంట చంద్రునిపైకి సజీవంగా రావడం ఒక అద్భుతం,” అని ప్రతినిధి చెప్పాడు, “అయితే అక్కడ వారి మనుగడ కొనసాగడానికి అవకాశాలు మృగ్యమని మనం గ్రహించాలి. అతి త్వరలో వాళ్ళ ఆక్సిజన్, ఆహారం, నీరు అయిపోతాయి. అక్కడ కొత్త సరఫరాలను పొందడానికి మార్గం లేదు. పైగా ఉష్ణోగ్రతలో, తక్కువ గురుత్వాకర్షణలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విజయగాథ త్వరలో ముగుస్తుందని మా భయం” అంది.

చంద్రునిపై అడుగుపెట్టిన సోమాలియా జాతీయుల కష్టాలు, కడగండ్లూ అంతర్జాతీయ మీడియాకి ముఖ్యమైనాయి, యులిసెస్ అసలైన మిషన్‍పై ఎవరూ శ్రద్ధ చూపడం లేదు.

7

వివిధ దేశాలలో ఉంటున్న సోమాలి సంఘాలు – చంద్రుడిపై స్థాపితమైన తమ ‘మొదటి గ్రహాంతర కాలనీ’కి ‘న్యూ మొగదిషు’ అని పేరు పెట్టి విరాళాలతో ఓ శ్రేయోనిధిని ఏర్పాటు చేశాయి, దీనివల్ల ప్రజలకు వారి స్వంత పరికరాలు ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.

“యుద్ధం, అరాచకత్వం, ఇంకా కరువుకాటకాలతో బాధపడుతున్న ప్రాంతాల నుండి వస్తున్న శరణార్థులని ఎక్కడా స్వాగతించడం లేదు. అన్ని ఆతిథ్య దేశాలు తమ ఇమ్మిగ్రేషన్ కోటా పూర్తయిందనో, లేదా మించిపోయిందనో పేర్కొంటున్నాయి. సరిహద్దులను దాటడం, కొత్త దిగంతాలను అన్వేషించడం – ఎవరైనా ఇప్పటికీ స్వాగతించబడే చోటుకి, తిరిగి వెనక్కి పంపలేని ప్రాంతానికి చేరడం – సిద్ధాంతపరంగా అసాధ్యమైనప్పటికీ, కలవరపడకుండా భవిష్యత్తును నిర్మించుకోవడం మాత్రమే ఇక మిగిలిన అవకాశం. కాలమే చెపుతుంది.”

8

చంద్రమండల యాత్ర గురించి మరింత సంచలనాత్మక వార్తలు ప్రపంచానికి వెల్లడయ్యాయి: అంతరిక్ష ప్రయాణం చేసిన సోమాలి మహిళ నిండు గర్భిణి అని ఇప్పుడు బహిర్గతమైంది. ఇ.ఎస్.ఎ. విడుదల చేసిన ఇటీవలి చిత్రాలలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె భర్త (పుట్టబోయే బిడ్డ యొక్క పేరుపొందిన తండ్రి) అన్నగారు కూడా ఈ వాస్తవాన్ని ధృవీకరించాడు. ఇదంతా ఒక గొప్ప ప్రణాళికలో భాగమని, ‘ఉండిపోయిన వారి’ (అంటే భూమిపై ఉన్న వ్యక్తులు) కళ్ల ముందు త్వరలో ఆవిష్కృతమవుతుందని కూడా అతను చెప్పాడు.

ఆ వ్యక్తి కెమెరాలలో ఒకదాన్ని మరొక కోణంలో మార్చిన తర్వాత, చంద్రుని ఉపరితలంపై వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూడటం ఇప్పుడు సులభమైంది. లూనార్ మాడ్యూల్ పక్కన ఒక నిరాడంబరమైన కట్టడం నిర్మాణం జరుగుతోంది, బహుశా అంతరిక్ష నౌకలో అక్రమంగా రవాణా చేయబడిన లేదా మాడ్యూల్ నుండి తీసుకోబడిన పదార్థంతో తయారవుతోందది. ఒక పారదర్శక ప్లాస్టిక్ లేదా గాజు ముక్క కింద ఆకుపచ్చ ముద్దని చూడవచ్చు.

మీడియాలో పుకార్లు విస్తృతంగా చెలరేగుతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు చిన్న లూనార్ బేస్ నిర్మిస్తున్నారా? ఆ ఆకుపచ్చ ముద్ద ఏంటి? కొందరు దానిని ఆల్గే అంటుంటే, కొందరు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే మొక్కలని అంటున్నారు, మరికొందరు తినే ఆకుకూరలు కావచ్చంటున్నారు. ‘వలసవాసుల’ ప్రాథమిక అవసరాలకు తోడ్పడే ‘హైడ్రోపోనిక్ గార్డెన్’ దిశగా ఇది తొలి అడుగా? అసలు జీవమే లేని చోటు అని భావించిన ప్రాంతంలో ఈ ఇద్దరు వ్యక్తులకు భవిష్యత్తు ఉందా?

9

మానవజాతి చరిత్రలో మొట్టమొదటి సారిగా, భూమిపై కాకుండా చంద్రునిపై మానవ శిశువు జన్మించిన వార్త – ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక ప్రతిస్పందనలను రేకెత్తిచ్చింది.

బ్రతికేందుకు వీలు లేని వాతావరణంలో బాబును కనడం బాధ్యతారాహిత్యమని ఆ తల్లిదండ్రులను కొందరు విమర్శించగా, తొలి రోజులలోనే జీవితం అంతమయ్యే ప్రమాదం ఉన్న సందర్భంలో – తనకంటూ సమ వయసు స్నేహితులు లేకుండా ఆ బాబు పెరగడం విచారకరమని కొందరు అన్నారు. ప్రపంచం నుండి పూర్తిగా వేరుపడి, మనుగడ కోసం అంతులేని పోరాటం చేయాల్సి రావడం అతని ఏకైక దృక్పథం అవుతుందని బాధపడ్డారు.

తక్కువ గురుత్వాకర్షణ శక్తి పిల్లల ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించడం ఆసక్తికరంగా ఉంటుందని అన్న శాస్త్రవేత్తలు – పలు రకాల నిందలను ఎదుర్కున్నారు – వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతోందో గ్రహించని బావిలో కప్పలన్నది ఓ నింద!

తనని తాను – భూమిపై ‘న్యూ మొగదిషు రాయబారి’గా ప్రకటించుకున్న ఆ ఆగంతకుడి అన్నయ్య (పిల్లాడి పెదనాన్న) ప్రకారం, ఈ పుట్టుక కథకు కొత్త ప్రేరణనిస్తుంది: “వర్ధిల్లుతున్న, జీవించగలిగిన కాలనీ దిశగా మొదటి అడుగు పడింది, ఇది ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశాదీపం” అన్నాడతను.

యునైటెడ్ స్టేట్స్, ఇంకా ఇతర ప్రాంతాలలోని అంతరిక్ష కేంద్రాలలో భద్రతా చర్యలను, నిఘాని మరింత పెంచారు. ఈ సోమాలి విజయగాథ ఒక ఉదాహరణగా నిలిచి, ఇతర శరణార్థులను వ్యోమనౌకలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసేలా, చొరబడేలా ప్రేరేపిస్తుందనన్న వాస్తవాధారిత భయాలు తలెత్తాయి.

శరణార్థ సంఘాలు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నాయి: అసాధ్యమైనది ఇప్పుడు సాధ్యమైంది, కలలు సాకారం కావచ్చు, కొత్త, ఊహించని దిగంతం పిలుస్తోంది.

యులిసెస్ కెమెరా ముందు ఆ తండ్రి గర్వంగా తన నవజాత శిశువును పట్టుకొని (ముందే తయారు చేసిన అందమైన స్పేస్ సూట్‍లో ఉన్న శిశువుని) ఉన్న ఫోటో అత్యంత వైరల్ అయిన ఫోటో అనడంలో సందేహం లేదు.

ఆంగ్ల మూలం: ఫ్రాంక్ రోజర్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్


ఫ్రాంక్ రోజర్ 1957లో బెల్జియంలోని ఘెంట్‌లో జన్మించారు.

ఆయన మొదటి కథ 1975లో ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన కథలు అన్ని పత్రికలు, సంకలనాలలో చోటుచేసుకున్నాయి. 2000 నుండి, వివిధ భాషలలో కూడా కథా సంకలనాలు ప్రచురించబడ్డాయి. ఫిక్షన్ కాకుండా, ఆయన సర్రియలిస్ట్, సెటైరిక్ పద్ధతులలో కొలేజ్‌లు, గ్రాఫిక్ వర్క్‌లను కూడా రూపొందిస్తారు. ఇవి వివిధ పత్రికలు, పుస్తకాలలో వచ్చాయి.

ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ కథలు వెలువరించారు, వాటిలో కొన్ని హిందీ, బెంగాలీ, కన్నడతో సహా 40 కంటే ఎక్కువ భాషలలో అనువాదమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here