శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-1

1
3

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

అవతారిక:

[dropcap]శ్రీ[/dropcap]మతి మాలతీ చందూర్ ఏ పుస్తకం వ్రాసినా అది ప్రత్యేకంగా ఉంటుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక కరుడుగట్టిన సాంప్రదాయవాదుల కుటుంబంలో పుట్టిన గోపాలరావు అనే కుర్రవాడు, తన మేనత్త, రామలక్ష్మమ్మ (రాముడత్తయ్య) దగ్గర పెరుగుతాడు. మామయ్య వాసుదేవరావు, రాముడత్తయ్య, తమ జీవితాలను స్వాతంత్ర్య పోరాటానికీ అంకితం చేశారు. వారికి కులం పట్టింపు లేదు. వారి అంటూ సొంటూ లేదు. డబ్బు మీద వ్యామోహం లేదు. వారి ధ్యాస, శ్వాస, ఘోష, అన్నీ దేశం కోసమే.

స్వాతంత్ర్య పోరాటంలో ఆరోగ్యాన్నీ ఆస్తులనూ పోగొట్టుకొని, కర్పూరంలా కరిగి పోయినవారు అగ్రకులాల్లో అదీ బ్రాహ్మణ కుటు౦బాల్లో కూడా ఉండేవారని మాలతిగారు ఈ నవల ద్వారా నిరూపించారు. అదే విధంగా నందయ్య, బుచ్చిలాంటి స్వార్థపరులు స్వాతంత్ర్య ఉద్యమానికి ఎలా తూట్లు పొడిచారో, తమ సామాజిక స్థాయిని, అంచెలంచెలుగా ఎదగడానికి ఎలా వాడుకొన్నారో వివరించడంలో ఆమె ఎలాంటి తేడాను ప్రదర్శించలేదు.

చరిత్రను ఫిక్షన్‌గా మలచడం కత్తిమీద సాము లాంటిది. దానికి విశ్వసనీయత (credibility), సత్యబద్ధత (authenticity) ఒనగూర్చడానికి రచయిత్రి ఆ కాలంలో నిజంగా, సజీవంగా ఉన్నపాత్రలను నవలలో ప్రస్తావించారు. వారి స్ఫూర్తిని వివరించారు. అటువంటి పాత్రలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, గాంధీజీ, కాళేశ్వరరావు గారు, కొండా వెంకటప్పయ్య గారు, కన్నెగంటి హనుమంతరావు గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు, సరోజినీ దేవి గారు, జితీంద్రనాథ్ దాసు గారు ఉన్నారు నవలతో. వారిని చారిత్రిక రిఫరెన్సుగా కాకుండా నవలలోని ఇతర కల్పిత పాత్రలతో మమేకమైన వారిగా చిత్రించి, నవలను మరింత సహజ శోభాయమానంగా తీర్చిదిద్దారు. అందువల్ల ‘హృదయనేత్రి’ ఒక హిస్టారికల్ పొలిటికల్ సోషల్ డాక్యుమెంట్ లాగా stale గా మారకుండా, పూర్తి human element తో, flesh and blood తో తొణికిసలాడుతుంది.

నామౌచిత్యం:

మాలతీ చందూర్ గారి నవలల పేర్లు ఏదో క్యాజుయల్‍గా పెట్టినట్లుండవు. నవల అని ultimate essence ని పిండి, దాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి . ‘హృదయనేత్రి’ అన్న టైటిల్ చూస్తూనే ఎవరికైనా స్ఫురించే అర్థం ప్రియురాలు. ఇష్టసఖి ఇలాంటివి. నేత అనే పుంలింగానికి స్త్రీలింగం నేత్రి. అంటే నాయకురాలు. క్వాలిటీ పబ్లిషర్స్ వారు (విజయవాడ) పుస్తకానికి వేయించిన, రమణగారు వేసిన ముఖచిత్రం కూడా దానికనుగుణంగానే ఉంది. ఒక అందమైన అమ్మాయి మనోహరంగా నవ్వుతూ ఉండగా, బహుశా ప్రేమికుడు కాబోలు, ఒక అందమైన గులాబీని ఆమెకిస్తూ, ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ ముఖచిత్రానికీ, నవలలోని కథకూ ఏ సంబంధమూ లేదు. నవలలో ప్రేమలూ, ప్రతిపాదనలూ లాంటి saleable elements అసలు లేవు. ఒక నిర్దిష్టమైన కమిట్‍మెంట్‌తో రాసిన నవల ఇది. ఆ కమిట్‍మెంట్‌ను ఫుల్‌ఫిల్ చేయడంలో మాలతిగారు కుశాగ్రమంతైనా రాజీ పడలేదు. నవల చివరగాని మనకు దాని నామౌచిత్యం బోధపడదు. స్వరాజ్యం, గోపాలరావు మనుమరాలు. కొడుకు కూతురు.

తాత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, తండ్రి విప్లవపంథా లోని ఆర్తిని వారసత్వంగా పుణికి పుచ్చుకున్న, మాలతీ చందూర్, యువత ఎలా ఉండాలో కలలు గన్నదానికి ప్రతిరూపమైన స్వరాజ్యం ఈ నవల నాయకురాలు. ఆమే హృదయనేత్రి! అంటే తన హృదయాన్నే నేత్రములుగా చేసుకొని, జానకమ్మగారి లాంటి నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధుల దూరదృష్టికి, భవిష్యత్ వాణిని గుర్తించగలశక్తికి ప్రతీక! జానకమ్మ, గోపాల రావుల స్వప్నాలను తన హృదయనేత్రంతో చూస్తూన్న దార్శనికురాలు స్వరాజ్యం అనే అద్భుతమైన ఆడపిల్ల. నామౌచిత్యంలో ఇదే ప్రధానమైన అంశంగా నేను భావిస్తున్నాను. తర్వాత ‘జయ జయ జయ భారత జనయిత్రీ దివ్యధాత్రి! జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి’ అన్న, రోమాంచక దేశభక్తి గీతం లోని పల్లవిలోని చివరిపదం, హృదయనేత్రి! కోట్లాది స్త్రీపురుషులు, భారతీయుల హృదయాలకు భరతమాత నాయకురాలు అన్న యౌగికార్థం కూడా మనం తీసుకోవచ్చు. ఇది రెండవ భావన. కానీ మొదటి భావనకే నా మొగ్గు చూపు.

ఈ నవలకు కేంద్ర సాహిత్యకాడమీ వారు అవార్డునిచ్చి, తమ ప్రతిష్ఠను ఇనుమడింప చేసుకున్నారు. 1949 లోనే రచయిత్రిగా అతి చిన్నవయసులోనే, ప్రస్థానం సాగించిందామె. 26 నవలలు ఆమె కీర్తి కిరీటంలో మణులుగా పొదగబడి ఉన్నాయి. భర్త నాగేశ్వర రావు చందూర్ గారు ఆమెకు స్వయానా మేనమామే. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మద్రాసులో జరిగిన మొదటి రిజిస్టర్ మ్యారేజ్ వారిదే. అక్కడే మనకు ఆ దంపతుల అభ్యుదయ దృక్పథం తేటతెల్లం అవుతుంది. ‘హృదయనేత్రి’కి 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. భారతీయ భాషాపరిపత్ అవార్డు (1990), రాజాలక్ష్మీ అవార్డు (1996), తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అమె సిగలో వెలిగిన కొన్ని కుసుమాలు. 2005లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్, ‘కళాప్రపూర్ణ’ను ఇచ్చి తనను తాను సార్థకం చేసుకుంది. భార్యాభర్త లిద్దరికీ తొలి లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు బహుకరించబడింది. ఈ అవార్డులన్నీ కూడా నా దృష్టిలో బాహ్యలంకారాలే (outward embellishments). వీటన్నింటిని మించిన అవార్డును ఆమెకు అశేష సంఖ్యలోని ఆమె అభిమాన పాఠకులు, తమ హృదయాలలో నిలుపుకోవడం ద్వారా అందించారు. కాబట్టి సాహిత్యపరంగా ‘శతసహస్ర నరనారీ పాఠక హృదయనేత్రి’ శ్రీమతి మాలతీ చందూర్ గారు. తన మేధోధాత్రిలో నుండి అనర్ఘరత్నాలను తవ్వి తీసి మనకు తన రచనలుగా అందించిన ధన్యజీవి ఆమె.

ఇక ఆమె నిర్వహించిన ప్రమదావనం, వంటలు పిండివంటలు, పాత కెరటాలు, అమె బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. ఆమెను గురించి ఏ పొగడ్త చేసినా అది దానికే గౌరవాన్నిస్తుంది తప్ప, ఆమె పొగడ్తలకు అతీతురాలు.

విషయం:

పరిశోధనాత్మకంగా ‘హృదయనేత్రి’ నవలను ఒక సిద్ధాంత గ్రంథంగా, నిశిత పరిశీలన చేయగా, మొత్తం గ్రంథాన్ని ఈ క్రింది విభాగాలుగా విభజించ వచ్చుననిపించింది.

  1. గోపాలం – రాముడత్తయ్యల అనుబంధం. ఆ పిల్లవాడిపై ఆమె చూపిన ప్రభావం – ఒక వ్యక్తిత్వ శిల్పిగా రాముడత్తయ్య విశ్వరూపం.
  2. గోపాలం తల్లి సుబ్బమ్మగారు – రాముడత్తయ్యకు పూర్తి కాంట్రాస్ట్. తండ్రి వెంకట్రామయ్య – ఈజీ గోయింగ్. అక్కగారంటే భయం గౌరవం
  3. రాముడత్తయ్య వాళ్ల ఊర్ల సీతానగరంలో గోపాలం జీవితం – దృక్పథంలో మార్పు
  4. మహాత్మాగాంధీ బెజవాడకు రావడం – ఆయన ప్రభావం
  5. జానకమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం.
  6. బందరులో తల్లిదండ్రులతో గోపాలరావు, విద్యాభ్యాసం
  7. నందయ్య క్యారెక్టర్.
  8. గోపాలరావు పెళ్లి: మామయ్య వాసుదేవరావు మార్గదర్శకత్వం
  9. గోపాలరావు – పార్వతిల అనుబంధం
  10. గోపాలరావు తమ్ముడు బుచ్చి క్యారెక్టర్.
  11. వాసుదేవరావు గారి అంత్యక్రియలు – రాముడత్తయ్య నిబ్బరం, ఆత్మవిశ్వాసం, ధైర్యం,
  12. కాశీవిశ్వవిద్యాలయంలో గోపాలరావు ఇంటర్ చదువు – నందయ్యతో సహవాసం – పెల్లుబుకుతున్న స్వాతంత్ర్య సమర లహరి .
  13. జైలు జీవితం – విడుదల – భార్య అసంతృప్తి – కొడుకు – అందరిలా ఉండమని పార్వతి సతాయింపు
  14. సీతానగరంలో రాముడత్తయ్యను కలుసుకోవడం
  15. చీరాల-పేరాల ఉద్యమం – ప్రజల విజయం
  16. ప్రపంచయుద్ధం తర్వాత పరిస్థితులు – గోపాలరావుపై కుటుంబ సభ్యుల ఒత్తిడి. మళ్లీ జైలు జీవితం – విడుదల
  17. కొడుకుతో పెరుగుతున్న దూరం – రాజకీయాల పట్ల విముఖత – కొడుకు అజ్ఞాతం – వాడి కూతురి పెంపకం – కొడుకు ఏమైపోయాడో అగమ్యగోచరం
  18. నందయ్య విశ్వరూపం – దళితుడి ముసుగులో స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం
  19. సుబ్బమ్మగారి కష్టాలు – బుచ్చి కోడలు చేతిలో! అయినా వాళ్ల మీదే ఆపేక్ష – గోపాలరావంటీ చిన్నచూపు –
  20. బుచ్చి ప్రపోజల్- పార్టీ టికెట్ కోసం – అన్న గోపాలరావు స్వాతంత్ర పోరాట, సత్యాగ్రహ నేపథ్యాన్ని క్యాష్ చేసుకోవాలని చూడడం – గోపాలరావు విముఖత
  21. స్వరాజ్యం ఎదుగుదల – ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ – చర్చ.
  22. స్వరాజ్యం స్నేహితురాలు శ్యామలకు గ్రేడ్‌లో జరిగిన అన్యాయం – స్వరాజ్యం తిరుగుబాటు – యూనివర్సిటీ అధికారుల కోపం
  23. స్వరాజ్యం, మరో కొంతమంది అరెస్టు – దేశవిద్రోహక చర్య అనే నేరంపై – పార్వతి సాధింపు – తమ్ముడు బుచ్చి జోక్యం కోరడం – బెట్టు – గోపాలరావు బుచ్చిని బెదిరింపు – స్వరాజ్యం విడుదల
  24. జనతాపార్టీ ప్రభంజనం – ఇందిర ఓటమి
  25. స్వరాజ్యం నిర్ణయం – ఓవ్డ్ ఏజ్ హోం నడపాలని – జానకమ్మగారి స్ఫూర్తి – హృదయ నేత్రంతో భావిదర్శనం. యువత బాధ్యత

స్థూలంగా ఈ ఇరవై ఐదు అంశాలుగా నవలను విభజించి పరిశీలించడం జరిగింది. మాలతీ చందూర్ గారు తన జడ్జిమెంట్సును మన మీద పాస్ చెయ్యరు. Objective గా సంఘటనలను వివరిస్తూ పోతారు. పాత్రచిత్రణ చేస్తారు. ఎవరితో సైడ్స్ తీసుకోరు. జాగ్రత్తగా చదివి, మనకుగా ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునే బాధ్యత మనదే. నవల అంతా ఒక విధమైన non-attachment, రచయిత్రి పరంగా మనకు కనిపిస్తుంది. కాని అవసరం అయినచోట ఆమె కలం కరకుగా మారుతుంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక ముందుకు సాగుదాం.

బ్రాహ్మణత్వం, బ్రాహ్మణీకం, బ్రాహ్మణవాదం:

మొదటి నుంచి ఈ సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు అవుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. ‘బ్రాహ్మణీకం’ అన్న పదబంధాన్ని మొదట గుడిపాటి వెంకట చలంగారు వాడారు. మన భారతీయ సనాతన ధర్మంలో ఎప్పుడూ, ఎక్కడా, కులాన్ని బట్టి, ఎవరికీ ప్రాధాన్యత లేదు, ఇవ్వలేదు. కొన్నిచోట్ల బ్రాహ్మణులకు ‘ప్రత్యేక స్టేటస్’ ఇచ్చినట్లు కొన్ని సూక్తుల్లో కనబడినా, అభ్యుదయవాదులు, సంఘసంస్కర్తలు, వాటిని వెంటనే ఖండించేవారు. అలా ఖండించిన వారిలో, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఉదా:

‘బాహ్మణో న హంతవ్యః’

‘గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం’ ఇలాంటివి .

‘బ్రాహ్మణో న హంతవ్యః’ అన్న సూక్తిని మా గురువుగారు బ్రహ్మశ్రీ. వైయాకరణశిరోమణి, తాటిచెర్ల కృష్ణశర్మ గారు పరిహసించేవారు. దానికర్థం ‘బ్రాహ్మణుని చంపరాదు’ అని. “అయితే బ్రాహ్మణేతరులను చంపవచ్చా?” అని ఆయన నవ్వుతూ ప్రశ్నించేవారు. “ఎవరిని చంపినా నేరమే! పాపమే! ఇలాంటి కాలం చెల్లిన సూక్తులు ‘మనకు’ చెడ్డపేరు తెచ్చాయి” అనేవారు కృష్ణశర్మగారు.

అలాగే ‘గో బ్రాహ్మణీభ్యః శుభమస్తు నిత్యం’ – ‘ఆవులకు బ్రాహ్మణులకు ఎప్పుడూ శుభమగుగాక’ అన్న సూక్తి కూడా లోపభూయిష్టమైనదే, ఆయన అభిప్రాయంలో. “కాని దాన్ని తర్వాత శ్లోక పాదంలో సర్దుకొని ‘మనవాళ్లు’ నష్టనివారణ చేసుకున్నారు” అనేవారాయన. అది ‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’. అంటే సమస్త లోకాలు (అన్నిరకాల జంతువులు, మనుషులు) సుఖంగా ఉండాలి! అదీ విశ్వశ్రేయస్సు అంటే!

కొన్ని దేవతాస్తోత్రాల్లో, పారాయణ విధుల్లో, చివర ఫలశ్రుతి ఉంటుంది. అంటే, ఆ స్తోత్రాలు పఠించడం వల్ల వచ్చే ఫలితం. ఉదాహరణకు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చివర ఇలా వస్తుంది.

“సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః

తీ సర్వేముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః.”

“ఈ సుబ్రహ్మణ్యాష్టక స్తోత్రాన్ని ఎవరయితే ‘బ్రాహ్మణోత్తములు’ పఠిస్తారో, ఆయన అనుగృహం వల్ల వారంతా ముక్తిని పొందుతారు”. అంటే ఇతర కులాలు ఈ స్తోత్రపఠనం చేయకూడదా? చేసినా వారికి ముక్తి లభించదా? భగవంతుడు తనను ఎవరు స్తుతి చేసినా అనుగ్రహిస్తాడు గాని, వారు ‘ద్విజోత్తములేనా?’ అని చూడదు. ‘సర్వత్ర సమదర్శినః’ అని ఆయన భగవద్గీతలో సెలవిచ్చి ఉన్నాడు. మరి ఈ ‘గ్లోరిఫికేషన్’ ఎందుకు?

“జన్మనా జాయతే శూద్రః కర్మణాజాయతే ద్విజః” అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే, “పుట్టుకతో ప్రతివారూ శూద్రులే. తాము చేసిన సత్కర్మల వల్లనే వారు బ్రాహ్మణులవుతారు” అని అర్థం. ఇంత కంటే స్పష్టంగా ఎవరు చెబుతారు.

కరడుగట్టిన సంప్రదాయవాది, కులవ్యవస్థకు అనుకూలురైన విశ్వనాథ సత్యనారాయణ గారు సైతం ఏనాడూ ఇతర కులాలను కించపరచలేదు. వారి వేయిపడగలలో అన్ని కులాలవారిని వృత్తులవారిని ప్రస్తావించారు, వారికి సమాజంలో సముచిత స్థానం కలిగించారు. ‘మడి’ ఆచార వ్యవహారాలను ఆయన ‘hygienic’ పరంగానే చూపారు.

‘ఆదిశంకర – చండాల సంవాదం’లో మన ఆర్షధర్మం యొక్క గొప్పదనం కనబడుతుంది. అద్వైతమత సిద్ధాంత స్థాపకుడు పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీమాన్ ఆదిశంకరులు. ‘అద్వైతము’ అంటే ‘రెండు కానిది’. అంటే మానవుడు, దేవుడు వేరు వేరు కాదు, ఇద్దరికీ అభేదం అని. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొనే మన ధర్మంలోనే కాదు ఇతర ధర్మాలలో కూడా కొన్ని మంచి doctrines ఏర్పడ్డాయి. ఉదా: ་

‘దైవం మానుష రూపేణ’

‘మానవసేవే మాధవ సేవ’ (service to man is service to God)

‘ప్రార్థించే పెదవుల కన్న, సేవించే చేతులే మిన్న’

‘where love is, God is’ – Leo Tolstoy.

ఇవన్నీ, ఒకే సూత్రంలో ఇముడుతాయి.

“చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మవిభాగశః” అన్నాడు పరమాత్మ. ఇందులో ‘గుణ’ అన్న పదం లేకపోతే ఇంకా బాగుండేది. ‘కర్మ’ అంటే చేసే వృత్తిని, పనిని బట్టి, నాలుగు కులాలను సృష్టించాను. అంత వరకు బాగుంది. గుణాన్ని బట్టి కులనిర్మాణం ఎలా చేస్తాం? అన్ని కులాలలోనూ సద్గుణ సంపన్నులున్నారు. దుర్గుణ పూరితులున్నారు. దీనినే అభ్యుదయవాదులు వ్యతిరేకించారు.

ఆదిశంకరులవారిని పరీక్షించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ‘చండాల’ రూపంలో వస్తాడు. అతని శరీరంనుండి దుర్గంధం వెలువడుతూ ఉంటుంది. బహుశా మద్యం సేవించాడేమో? శంకరాచార్యులవారు శిష్యగణంతో ప్రయాణిస్తున్నారు. ఈ ‘చండాలరూపం’ లోని శివుడు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు శిష్యులలో ఒకరు కంగారు పడిపోయి “చండాల! అపసర్ప!” అని కేక వేశాడు. అంటే “ఒరేయ్ చండాలుడా, పక్కకు జరగరా!” అని.

ఈ చండాల శబ్దాన్ని కొందరు సనాతనులు హీనార్థంలో ప్రయోగిస్తూ ఉంటారు. “తిండి ఛండాలంగా ఉంది”, “ఏమిటి ఛండాలం?” అని, ‘చ’కు ఒత్తు పెట్టి మరీ.

అద్వైత జ్ఞాన సంపన్నుడైన శంకరాచార్యులు శిష్యుని మాటలు విన్నారు. కానీ అతన్ని వారించలేదు. అప్పుడు ఆ ‘చండాలుడు’ ఇలా ప్రశ్నించాడు.

“అయ్యా! ఆయన వస్తున్నాడని నన్ను పక్కకు తొలగమన్నారు. బాగానే ఉంది. స్వామివారిని ఒకే ఒక సందేహం తీర్చమని అడుగుతాను. తర్వాత వైదొలగుతాను. అడగమంటారా?”

శంకరులు చిరునవ్వుతో అడగమన్నారు

“మీరు ‘నన్ను’ పక్కకు జరగమన్నారు. అంటే నా ఈ భౌతిక శరీరాన్నా, లేక నాలో ఆత్మరూపంలో ప్రకాశిస్తున్న పరంజ్యోతిని కూడా జరగమన్నారా? చెబితే వెళ్లిపోతాను.”

శంకరాచార్యుల వారి వదనంలో చిరునవ్వు మాయమైంది. ‘తత్త్యం’ బోధ పడింది! ఈయన సాక్షాత్తు పరమశివుడే! తన కళ్లు తెరిపించడానికి వచ్చిన భక్తవశంకరుడు. భగవంతుడు అన్ని జీవరాశులలో నిండి ఉంటాడన్న సత్యాన్ని తాను విస్మరించాడు. పేడపురుగు లోనూ, రాజహంస లోనూ ఆయన ఒకే విధంగా కొలువుతీరి ఉన్నాడు. సర్వత్ర సమదర్శనమే యోగం అని ఆయన చెప్పనే చెప్పాడు.

ఆదిశంకరుల వారికి జ్ఞానోదయమయింది. ఒళ్లంతా గగుర్పాటు. నయనాల నిండా కన్నీళ్ళతో “పరమాత్మా! నన్ను క్షమించు!” అంటూ ఆయన ఆ చండాలుని కాళ్ల మీద పడిపోయాడు! వెక్కివెక్కి ఏడుస్తున్నాడు పశ్చాత్తాపంతో! శివుడు ఆయనను ఆశీర్వదించి అదృశ్యుడైనాడు. శంకరాచార్యులవారి కంటే గొప్పవారా ఈ ‘సోకాల్డ్’ కులవాదులు?

‘హృదయనేత్రి’ నవలకూ ఈ చర్చకూ సంబంధం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. పైన మనం ప్రస్తావించిన అన్ని విషయాలనూ శ్రీమతి మాలతీ చందూర్ తన నవలలో ప్రతిబించించారు. ఆ భావజాలానికి ప్రతీకలే రాముడత్తయ్య, వాసుదేవరావు మామయ్య.

శుద్ధశోత్రియ కుటుంబంలో పుట్టిన అతని అక్క గారు, రామలక్ష్మమ్మ జాతీయోద్యమంలో తిరగటం, భర్తతో కలిసి ఖద్దరు కట్టి, కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ చేయడం..”

“రామలక్ష్మమ్మ భర్త వృత్తికి న్యాయవాది, ఆదర్యానికి జాతీయవాది.”

“రకరకాల మతాలవారిని – కులాలవారిని తమ ఇంటికి తీసుకొచ్చేవాడు వాసుదేవరావుగారు. వచ్చిన అతిథికి కులం, గోత్రం ఏమీ లేవు. వారి కులం కాంగ్రెస్, వారి ధ్యేయం స్వరాజ్య సాధన! ఈ రెండే తప్ప మన దేశంతో ఏ కులాలు లేవు అనేవారు.”

“వారింట్లో హరిజన బాలుడిని తోటమాలిగా పెట్టుకున్నారు. ఆ పిల్లవాడి చేత రామలక్ష్మమ్మగారు అక్షరాలు దిద్దించి వాడికి చదువు నేర్పించేది. ఇవి కొందరికి అప్రాచ్యపు పనులుగా కనిపించేవి.”

(హృదయనేత్రి, పేజీ నెంబరు 9).

“ఇక జానకమ్మగారు. ఆమె శోత్రియ కుటుంబంలో పుట్టింది. బాల్యవితంతువు. యుక్తవయసు రాగానే జుట్టు తీయించేశాడు ఆమెకు తండ్రి.”

“మహాత్ముని బోధనలకు, గోపాలకృష్ణయ్య గారి ప్రభావానికి లోనయి ఖద్దరు కట్టడం ఆరంభించింది.”

“చీరాల పేరాల గ్రామాల్లో ఆమె ఎరుగని యిల్లు లేదు. తొక్కని గడప లేదు. మంచికీ చెడుకు కూడా ఆదుకునే కరుణామూర్తి. ముఖ్యంగా ఎవరన్నా కష్టంలో ఉన్నారన్నా, గర్భిణీ స్త్రీ నెప్పులు పడుతోందన్నా మంత్రసాని కంటే ఈమె ముందు ఉంటుంది. కడజాతి, అగ్రజాతి, అన్న విభేదం లేకుండా అందరికీ పురుళ్ళు పోసే జానకమ్మ గారిని వెలివేశారు – అగ్రకులాలవాళ్లు. కాని, ఆమె లక్ష్యపెట్టలేదు!”

“మంచి మాల ఐతే – మాల నేను అవుతాను” అనేది, ఎవరైనా మడీ మైలా అన్నప్పుడు.”

(హృదయనేత్రి, పేజీ నెంబరు 17, 18.)

ఒక చోట గోపాలం రాముడతయ్యను అడుగుతాడు

“అత్తయ్యా, ‘అసింటా’ అంటే ఏమిటి?

“ఎందుకడుగుతున్నావ్?”

“మొన్న వీరయ్యని ‘అసింటా’ పొమ్మని సీతంమామ్మగారు తిడుతున్నారు”

అప్పుడు రాముడత్తయ్య మేనల్లుడితో ఇలా చెబుతుంది.

“గోపాలం, నువ్వింకా చిన్నవాడివిరా. నేను చెప్పేవి ఈనాడు అర్థం కాకపోవచ్చు. పెద్దయ్యాక జ్ఞాపకం చేసుకో. సీతంమామ్మ వంటి వాళ్లు దేశద్రోహులురా.” (హృదయనేత్రి, పేజీ 24)

గోపాలం చిన్నిబుర్రలో ఆ మాటలు నాటుకుపోతాయి. “చండాల! అపసర్ప!” అన్న సంస్కృత పదాలకు సమానమే ఈ ‘అసింటా’ ఉండమనడం. హిందూ మతంలోని ‘అస్పృశ్యత’ అన్న మచ్చ ఇది!

నందయ్యను నవలలో ప్రవేశపెట్టినపుడు మనకు మాలతిగారి భావజాలం లోని గొప్పదనం తెలిసివస్తుంది.

గోపాలం నందయ్యను అడుగుతాడు.

“మీదే వూరు?”

“సత్తెనపల్లి”

“మీ నాన్నకి ఏం పని?”

“చెప్పులు కుట్టేపని” అన్నాడు నందయ్య.

అక్కడ రచయిత్రి ఇలా ఇలా అంటారు “ఆ జవాబులో సిగ్గు, రోషం, సవాల్ అన్నీ మిళితమై ఉన్నాయి” – పుట 37.

సిగ్గూ రోషం సరే.. సవాల్ ఎందుకు? దటీజ్ మాలతి! తానూ చదువుకుని తానేమిటో నిరూపిస్తానన్న ‘ఛాలెంజ్’ ఆ మాటల్లో ఉందని ఆమె సూచించారు. ఇక్కడ మళ్లీ ‘గీత’ను ఆశ్రయించక తప్పదు .

‘యోగః కర్మసు కౌశలమ్’

అని పరమాత్మ చెప్పాడు. నీవు ఏ పని చేసినా, దానిలో నేర్పు, ప్రతిభ, కమిట్మెంట్ నిజాయితీ ఉంటే అది యోగం! చెప్పులు కట్టే పని, ఆ లెక్కన ఎంత మాత్రమూ ఇన్ఫీరియర్ కాదు.

ఆమె నందయ్యను గురించి ఇలా అంటారు –

“నందయ్యకు వయసుకు మించిన తెలివి, గ్రహణశక్తి, తృష్ణ ఉన్నాయి.”

అంటే ఆ సుగుణాలకూ కులానికీ సంబంధం లేదని ఆమె చెబుతున్నారు.

ఉన్నవ వారి ‘మాలపల్లి’ గురించి గోపాలం, నందయ్య మాట్లాడుకుంటారు.

“ఇది చదవకూడదటగా?” అడిగాడు గోపాలరావు.

“ఎవరు చెప్పారు?”

“సర్కారువారు నిషేధించారట. మా అత్తయ్య చెప్పింది.”

సర్కారు వారు నిషేధించారు కాబట్టి తప్పకుండా చదవాలి. నేను ఇప్పటికి ఆరుసార్లు చదివాను.”

“అంత బాగుందా?”

“చాలా బాగుంది. మా గురించి ఎంత రాశారనుకున్నావ్? రాసినాయన బ్రాహ్మణుడట కదా!”

నందయ్య వాళ్ల నాన్న గురించి గర్వంగా ఇలా చెబుతాడు –

“మా నాన్న మాల దాసరి – తత్త్వాలు భలే బాగా పాడ్తాడు. మా ఇంట్లో నీచు తినం. ‘మీ లాగే’ మడి కట్టుకు పూజ చేస్తాడు మా నాన్న!”

“చదువుకున్నాడా?”

“లేదు. అంటే స్కూలుకెళ్లి మనలా చదువుకోలేదు. పద్యాలు, రామాయణం, పాటలు.. అన్నీ చెబుతాడు.”

“ఎట్లా?”

“గురువుల దగ్గర నేర్చుకున్నాడు. మా ఇంట్లో నీళ్లు పోసుకోనిదే అన్నం తినం” అన్నాడు నందయ్య కాస్త గర్వంగా.

(హృదయనేత్రి, పుటలు 37, 38)

ఈ సంభాషణ ద్వారా, జ్ఞానానికి చదువుకూ సంబంధం లేదని తేల్చారు శ్రీమతి మాలతీ చందూర్. అట్లే శుచికి, ఆచారవ్యవహారాలకు కేవలం బ్రాహ్మలే బ్రాండ్ అంబాసిడర్లు కాదని ఆమె నిరూపించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here