దయా వృష్టి..!!

0
57

[శ్రీమతి శాంతిలక్ష్మి పోలవరపు రచించిన ‘దయా వృష్టి..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఇది నిజం కదూ..!!
హృదయపు గదుల్లో ఇతరులు చేసిన మోసాల
మోహాల దాహాలు దాచుకోవటంతో
అవి గది తలుపులు తోసుకొని బయటకు తన్నుకొస్తోంటే..,
ముఖం పేలవంగా తేలిపోతూ…
ఇది నేను కాదు నీవే అని వేరొకరి దర్పణమైన నీవు..
మసక బారిపోతున్నావో.. ఏమో..!!

కన్నీళ్ళను మించిన మహా గంగ
మరింకేముంది కడిగేందుకు హృదయాన్ని..!!
అందరూ వదిలిన వ్యర్థాలను
కడిగేసే డొమెక్స్ నీ కన్నీళ్ళే..!!

అద్భుతమైన పాలరాతి చెక్కడం వంటి
నునుపైన చెక్కిళ్ళ అద్దాల్లో.. నీడలు చూపే
నీ.. కాంతి మండలాన్ని కమ్మేసిన రాహు కేతువుల..
ఛాయలను.. నీ కన్నీటి వరదలో
విశాల సంద్రాల్లోకి నెట్టెయ్..!!
నీ కళ్ళు
మిలా మిలా మెరుపులు
విరచిమ్మే తారకల్లా మరింక మెరవనీ..!!
నీ స్నేహం.. నీ దుఃఖం.. నీ సుఖం.. ఏవీ కాని
నీ.. వినీలాకాశ.. అవకాశమైపో..!!

ఆహా.. నీ కన్నుల నుండే
జారే కారుణ్య కాంతులు
ధారలు దిగంతాలకు దారులు వేస్తున్నాయి చూడూ..!!

నీలా ఈ బరువులు మోసేవారి.. ఊపిరికి..
జతకలసిన నీ స్నేహ కుసుమాల గంధాలను..
అలదే.. నీ.. అక్షర లక్షలకు.. శ్రీరామ రక్షలేలే..!!

నీ మొదటి.. రూపమై
పోవటాన్ని అడ్డుకోగల.. గోడలు కూల్చెయ్..!!
నీ గుండే నీ గుడిగా చేసి,
శబ్దాల గంటల సంగీతమాలాపించగా..
నీకు నీవు అడ్డుగా.. పోకు..!!
నీ చేతనే నీ చైతన్యం.
నీపై నీదైన దయను వర్షించు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here