[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మానవత్వం – మానవతా విలువలు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]సృ[/dropcap]ష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు . మానవత్వం అంటే కరుణ, ప్రేమ, దయ, అహింస. మానవ ప్రేమే మానవ ఆదర్శం. ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న. మానవత్వం ద్వారా వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి. చెడుమార్గాన నడిచే మనిషి చేయి పట్టి బలవంతంగానైనా మానవత్వం కలిగుండే మంచి మార్గంలో నడిపించాలి అంటాడు కబీరు దాసు. మనిషి సన్మార్గంలో నడిచినప్పుడే మానవత్వం చిగురిస్తుందని ఆయన ప్రవచించాడు. మంచితనమే మానవత్వం అని భావించే కబీరు తన శిష్యులకు.. ‘మంచితనాన్ని మించిన కులం లేదు, మానవత్వాన్ని మించిన మతం లేదు’ అని బోధించేవాడు. ఎన్ని కష్టాలెదురైనా మంచిని పంచే వారికి భగవంతుడు తప్పక ప్రతిఫలాన్నిస్తాడని ఆయన మానవాళికి తన రచనల ద్వారా తెలియజేసాడు. ఎదుటివారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారి కష్టాలను దూరం చేయడమే మానవత్వం. జీవితంలో సన్మార్గంలో నడవాలనుకునే వారందరో మొదట మంచితనం అలవరచుకోవాలి. ఆ గుణమే వ్యక్తిని మానవత్వం వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే మంచితనాన్ని మించిన ఆరాధన లేదు. మానవత్వాన్ని మించిన దైవ భక్తి లేదు అని కబీరు పదేపదే సాధకులను హెచ్చరించాడు. మతం.. మతం అని అరిచే మనిషీ.. మానవత్వాన్ని చేస్తున్నావ్ హతం.. మతం నిన్ను చేస్తుంది ఖతం. మతం ముసుగులో మారణహోమం చేసే మారీచులు ఆ మత విశ్వాసాలను మంట కలుపుతున్నారు. మానవత్వం మరిచిననాడు మనిషి మృగమౌతాడు. ఆ మృగాన్ని మనిషిగా మార్చినవాడు మానవుడవుతాడు అని ఒక కవి మానవత్వం గురించి చక్కగా తెలియజేసాడు.
మంచితనం అంటే చెడు లేదా కుళ్లు లేకపోవడం. ఒక మంచి వ్యక్తి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు పాటిస్తాడు, ఎప్పుడూ సరైనదే చేస్తాడు. మంచి వ్యక్తి ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం ఎల్లప్పుడూ చూస్తాడు, వాళ్లకు మంచి చేస్తాడు.
మానవత్వం పెంపొందించుకోవాలంటే ముందు మంచితనం అలవరచుకోవాలి. కొంతమంది తమ కుటుంబం కోసం, స్నేహితుల కోసం మంచి పనులు చేయడం మనం చూస్తుంటాము. అయితే ఎల్లప్పుడూ మంచిగా ఉండడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని బైబిలు చెప్తుంది. ‘సొంత లాభం కొంతమానుకో, పొరుగువారికి తోడుపడవోయ్’ అంటూ గురజాడ అప్పారావు లోకానికి హితవు పలికారు. ఈ లోకంలో మానవుడు ఇతరులకు చేసిన మేలే, అతనికి నిజమైన సంపదయని మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. ‘సేవించు ప్రేమించు తరించు’ అని స్వామి శివానందులవారి సందేశం. మంచి వ్యక్తిగా ఉండాలంటే, ఇతరుల్ని ఆకట్టుకునే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు, ఒక మొక్క ఎదగాలంటే దానికి ఒక్కసారే ఎక్కువ నీళ్లు పోయం గానీ కొంచెంకొంచెంగా చాలాసార్లు పోస్తాం. అదేవిధంగా, ఇతరుల కోసం మనం చిన్నచిన్న పనులు చాలాసార్లు చేసినప్పుడు, మనలో మంచితనం అనే సద్భుద్ధి మొలకెత్తుతుంది. సాధ్యమైనంతగా మంచిపనులు చేయడం అలవాటు చేసుకుంటూ ఆ లక్షణం మనలో మానవత్వం పెంపొందించుకునేలా సహాయపడుతుంది.
మన భారతీయ సంస్కృతి ఎంతో దివ్యమైంది. ఇందులోని నైతిక విలువలు, మానవీయతా ధృక్పథం నాగరికత విశిష్టతని ఎత్తిచూపిస్తాయి. మన సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి. అవి జాతి ఔన్నత్యానికి ఆసరాయై అద్దం పడతాయి. ఈ భువిపై జన్మించిన ప్రతీ ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని మన సనాతన భారతీయ సంస్కృతి పదే పదే ఉద్బోధిస్తోంది.