[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘నాన్నా, నన్ను మన్నించు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం! అందుకే ఇంటిపట్టునే వున్నాను. పరుగెత్తుతున్నట్టు నడిచే కాళ్ళకు, చకచకా పనులు చేసుకుంటూ పోయే చేతులకు – ఆఫీసు పనులతో ముందుగానే ఆక్యుపై అయ్యే మనసుకు – ఆ రోజు పూర్తి విశ్రాంతి కావడంతో ఇంట్లో తీరుబడిగా సోఫాలో కూర్చుని చూపులను అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ ఏం జరుగుతోందో చూస్తున్నాను.
మాలిని ఫోన్ మాట్లాడుతూనే వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. పదేళ్ళ ఉదయ్ నేను కొత్తగా కొనిచ్చిన సైకిల్‍ని ఇంటిముందున్న ఖాళీ జాగాలో హుషారుగా తొక్కుతూ ఆనందపడిపోతున్నాడు.
లేట్ సెవన్టీస్‍లో ఉన్న మా నాన్న కర్ర పట్టుకొని అడుగులో అడుగేస్తూ వరండాలో అటూ ఇటూ నడుస్తున్నాడు. అది చూసిన నా దృష్టి కాసేపు అలాగే అక్కడే నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన అటు వెళుతున్నప్పుడు అటూ, ఇటు వెళుతున్నప్పుడు ఇటూ, కుడి ఎడమలకు ఆయన వెంటే తిరగటం మొదలుపెట్టింది. ‘ఎలాంటి నాన్న ఎలా అయిపోయాడు’ అనుకున్నాను, వృద్ధాప్యంలో ముడుతలు పడ్డ ఆ శరీరాన్ని, బక్కచిక్కి ముందుకు వంగిన ఆ శరీరాన్నీ చూస్తూ.
ఆరడుగుల అందగాడు – షార్ప్ ఫీచర్స్ ఉన్న విశాలమైన ముఖం, చక్కటి వత్తైన క్రాపు – ఖంగుమనే కంఠం, కంచుపళ్ళెం చేయిజారి పడినప్పటి సౌండతో. నడిచినా, మాట్లాడినా, నాతో ఆడినా ఏ పని చేసినా అందులోని వేగం ఆయనలోని చురుకుదనాన్ని కళ్ళముందు నిలిపేది. ఇప్పుడు అడగుదీసి అడుగెయ్యటం కష్టంగా వుంది. మాట నూతిలో నుంచి వచ్చినట్టు పీలగా వస్తోంది కొద్దిపాటి వణుకుతో. ఆ రోజుల్లో మా ఇంట్లోని ప్రతి వస్తువులో, ప్రతి స్థలంలో, ప్రతి పనిలో నాన్న ముద్ర అంటూ ప్రత్యేకంగా ఒక ముద్ర స్పష్టంగా కనిపించేది – ఇలా నాన్నే మాట్లాడగలడు – ఇలా నాన్న చేయగలదు – అనిపించేలా! చాలా రోజుల వరకూ పిల్లలు కలగకపోతే గుళ్ళూ గోపురాలూ తిరిగి కనిపించిన దేవుడి కల్లా మొక్కి నన్ను కని ‘వంశోద్ధారకుడు పుట్టాడు’ అని మురిసిపోయారట అమ్మానాన్నా! హు – వంశోద్ధారకుడిని! భలేగా ఉద్ధరిస్తున్నాను వంశాన్ని.
అమ్మ కన్నా ఎక్కువ నాన్న నన్ను గారాబం చేసేవాడు. ‘అవును – నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నాన్నతో ముడిపడిపోయిన, నా బాల్యం నాకు ఇప్పటికీ గుర్తుంది.’ అనుకుంటూ నాన్న వంక చూస్తున్నాను. “అస్తమానం మంచం మీద పడుకునే వుంటే కండరాలు బిగుసుకొనిపోతాయి – కాస్త అటూ ఇటూ నడుస్తుండండి” అని డాక్టర్ చెప్పటంతో సాయంత్రాలు అలా వసారాలోకి వచ్చి నడుస్తారు నాన్న అడుగులో అడుగేస్తూ. ఆ దృశ్యాన్ని చూసే అవకాశం నాకు శలవురోజునే వస్తుంది, అదీ నా భార్య మాలిని “బోర్ కొడుతోంది. బయటకెళ్తాం కళ్యాణ్” అంటూ నన్ను బయటికి తీసుకెళ్ళకపోతే. ఆ రోజు అదృష్టం కొద్ది ఇంట్లో ఉన్నాను గనుక నాన్నకు దగ్గరగా ఆయన్ని చూస్తూ గడిపే అవకాశం వచ్చింది. అందుకే చూస్తున్నాను. మా నాన్న నా చిన్నప్పుడు నన్ను వీపు వేసుకొని నా రెండు చేతులను భుజాల మీదుగా గుంజి పట్టుకొని – నా కాళ్లు రెండూ నేను మడతేసి ఆయన నడుము చుట్టూ బిగిస్తే – ‘ఉప్పుకట్టమ్మో ఉప్పుకట్ట – ఉప్పుకట్ట’ అంటూ ఇల్లంతా తిరిగి వంటింట్లోకి తొంగిచూస్తూ “ఉప్పుకట్ట కొంటావా?” అని మా అమ్మను అడగటం – అమ్మ మావంక మురిపెంగా చూస్తూ నవ్వటం నాకు ఇప్పటికే గుర్తుంది. సాయంత్రాలు తను నాలుగు కాళ్ళ గుర్రంలా మారి నన్ను వీపున కూర్చోబెట్టుకొని ‘ఛల్ ఛల్ గుర్రం – చలాకి గుర్రం అను!’ అని నాతో అనిపించి నేను రౌతులా తను గుర్రంలా నటిస్తూ గుర్రం ఆట ఆడుకోవటం భలే సరదాగా ఉండేది. నేను గుర్రాన్ని తోలుతూ కిలకిలా నవ్వితే ఆయన కూడా నవ్వేవాడు. నేను, నాన్న అలా ఆడుకుంటున్నప్పుడు నాకు గుజ్జు అన్నం అనిపించడానికి అమ్మ భలే ఛాన్స్ దొరికేది. “ఇలా ఆటల్లో పదితే నాలుగు ముద్దలు అంటాడు వెధవ” అని అంటూ నాకు కడుపు నిండా అన్నం పెట్టి తన కడుపు నిండినట్టు మురిసిపోయేది. అలా ఒకప్పుడు నన్ను గారంగా మాసిన నాన్న వీపు ఇప్పుడు బాగా వంగిపోయింది ముందుకు.
నాకు కడుపునిండా అన్నం పెట్టిన అమ్మకు అవసానదశలో కడుపుకు ఇంత అన్నం పెట్టలేక పోయాను. కారణం ప్రత్యక్షంగా నేను కాకపోయినా పరోక్షంగానయినా అందుకు కారణం నా నిస్సహాయతే, నా చేతగానితనమే.
“కళ్యాణ్”, నాన్న పిలుస్తున్నారు నన్ను, వినిపించీ వినిపించని స్వరంతో, చటుక్కున లేచి వెళ్ళాను.
“ఈ చెక్క కుర్చీ ఇక్కడెయ్యి ‘నాన్నా’. ఇక్కడ గాలి వస్తోంది. కాసేపు కూర్చుంటానూ” అన్నాడు నాన్న నిస్సహాయంగా వసారాలో ఉన్న కుర్చీ వంక చూపుడువేలుతో చూపిస్తూ.
‘నాన్నా!’. నాకు ఎన్నేళ్ళు వచ్చినా నాన్న అదే పిలుపు ‘నాన్నా’ అని. బాస్కెట్ బాల్ ప్లేయర్ నాన్న ఒకప్పుడు. ఎన్నో బహుమతులు, మెడల్సు కూడా గెలుచుకున్నాడు. అంతెత్తున గాల్లోలి ఎగిరినట్టు ఎగిరి బాల్‍ని బాస్కెట్‍లో పడేసి గోల్ చేసేవాడు. ఇప్పుడు ఒక చెక్క కుర్చీని ఇటు నుంచి అటు కూడా ఎత్తలేకపోతున్నాడు. ‘వృద్ధాప్యం ఎంత దయనీయమో కదా – చెట్టంత మనిషిని పిట్టలా మార్చేస్తుంది. కండలు తిరిగిన మొనగాడ్ని అయినా ఎముకల గూడులా చేసి పడేస్తుంది.’ అనుకున్నాను నేను – కండ తరిగి చర్మం వేళ్ళాడుతున్న ఆ పుల్లల్లా మారిన చేతుల వంక చూస్తూ. నిక్కర్లేసుకునే వయసులో నా చుట్టూ రక్షణ కవచంలా తన రెండు చేతులనూ ముందుకు చాపి నాకు సైకిలింగ్ నేర్పించిన నాన్న – బైక్ మీద నన్ను ముందర కూర్చో బెట్టుకొని నా భుజాల మీదుగా రెండు చేతులూ వేసి బండి నడుపుతూ నన్ను రోజు సూల్లో దింపిన నాన్న – నా పుస్తకాల సంచీ సైతం నాకు బరువవుతుందని క్లాసురూమ్ వరకూ తనే మోసుకొచ్చిన నాన్న – ఇప్పుడు నా సహాయాన్ని అర్థిస్తున్నాడు బేలగా. అది తలుచుకుంటే నాకు గుండె చెరువైనట్టు అయింది. నా కడుపు సంగతి అమ్మ చూస్తే నా మెదడు సంగతి నాన్న చూసేవాడు. నా కొత్త పుస్తకాలకు అట్టలెయ్యటం దగ్గరినుంచి నాకు రోజూ పాఠాలు చెప్పడం నాన్న పని. చదువు అయిపోయాక అందులో నా చురుకుదనం చూసి మెచ్చుకుంటూనే ‘చదువొకటి వుంటే సరిపోదు. సంస్కారం కండా ఉండాలి’ అని చెప్పివాడు. ఇంటికి మా అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, తాతయ్య, అత్తయ్యలు.. ఇలా ఎవరొచ్చినా ‘కాళ్ళకు దండం పెట్టు’ అని దండం పెట్టించేవాడు. ఇద్దరం దారిన చెయ్యి చెయ్యీ పట్టుకుని నడుస్తూ వెళుతున్నప్పుడు దారిలో రోడ్డు పక్కన బిచ్చగాళ్లు దీనస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కనిపిస్తే. జేబులోనుంచి డబ్బులు తీసి తను వెయ్యకుండా నాతో వాళ్ళ చేతుల్లోకి ఇప్పించేవాడు. ‘నువ్వే వెయ్యొచ్చుగా’ అని ఒక రోజు అడిగితే, ‘నీకు తెలియాలని’ అన్నాడు, ఏం తెలియాలో అప్పుడు తెలియలేదుగానీ ఆ తర్వాత తెలిసింది. అమ్మ పక్కలో పడుకోబెట్టుకొని రామాయణ, మహాభారతాల కథలు చెప్పేది. “నువ్వు కూడా పెద్దయ్యాక నాన్నని ఆ రాముడు తన తండ్రిని చూసుకున్నటు చూసుకోవాలి నాన్నా!” అని అనేది దగ్గరికి తీసుకుంటూ! అని నేను ఆలోచిస్తుండగా “ఏంచేస్తున్నారు కళ్యాణ్” అంటూ వచ్చింది మాలిని వరండాలోకి తొంగి చూస్తూ. అప్పుడు నేను నాన్న చెయ్యి పట్టుకొని నడిపిస్తూ కుర్చీలో కూర్చోబెడుతున్నాను. ఎందుకంటే నాన్న అప్పటికే అలిసిపోయి, నడుము మీద చెయ్యేసి నిల్చుని కూర్చోవటం కోసం ఎదురుచూస్తున్నాడు. అది చూసిన మాలిని ముఖంలో రంగులు మారాయి. వాడి చూపులతో నా వంక చూస్తూ – ‘శ్రీరామచంద్ర మూర్తి!’ అని వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. దాంతో ఎంత వద్దనుకున్నా పట్టుబడ్డ నేరస్థుడిలా మారిపోయింది నా ముఖం. గొప్ప పని చేస్తూ కూడా ఏదో చెయ్యకూడని పనిచేసినట్టు ఫీల్ అయిపోయాను. ‘అదే వద్దనుకుంటాను ఎప్పుడూ – అలా వుండకూడదు – తనను చూసి నేను ముఖం వేలాడేయకూడదు – నా మనసులో ఏ భావాలు ఉన్నాయో వాటినే ముఖాన దీటుగా నిలుపుకొని నేను ఏం చేయాలో అది చేస్తాను, ఎలా వుండాలో అలా ఉంటాను’ అన్నట్టు ఉండాలని అనుకుంటాను. కాని అదేంటో విచిత్రంగా అంతలోనే నా మనసుకి వ్యతిరేకమయిన హావభావాలు చూపిస్తాను, నాకు తెలియకుండానే. ‘నా తండ్రిని నేను ప్రేమించడం, గౌరవించడం, ఆయనకు ఆసరాగా నిలబడటం వంటివి కూడా నా ఇష్టప్రకారం, స్వేచ్ఛగా, నేను చేసుకోలేనా’ అని అప్పుడే అనుకున్నవాడ్ని మళ్లీ అంతలోనే తను కనిపించగానే జావగారిపోతాను! మా నాన్న మీద మాలినికి ఎందుకో అకారణ కోపం. మాలిని ప్రవర్తన, మా అమ్మ ఉన్నన్నినాళ్లూ తన మీద కూడా అలాగే ఉండేది. అది కనిపెట్టిన అమ్మ ‘రేపు నేను పోతే ఈయనెలా?’ అన్న దిగులు ఉండేదో ఏమో ఎప్పుడూ తనకు అత్యంత ప్రియమైన నాన్న వంక దీనంగా చూస్తుండేది. ఆఖరి దశలో నన్ను దగ్గరికి వచ్చి ‘నాన్న జాగ్రత్త నాన్నా!’ అని చెప్పింది. తల వూపాను ఆ మాటలకు గానీ చేతిలో చెయ్యేసి ‘నాన్నకు నేనున్నానమ్మా!’ అని మాట ఇవ్వలేదు. అని నేను అనుకుంటూ వుండగా – ఉన్నట్టుండి బయటి నుంచి నా కొడుకు ఉదయ్ ‘అమ్మా’ అని అరిచిన అరుపు వినిపించి గబుక్కున బయటికి వచ్చాను. అప్పటికే మా నాన్న కుర్చిలో నుంచి లేచి ‘అయ్యో – వీడు పడ్డాడురా!’ అంటున్నాడు. సైకిల్ తొక్కుతూ క్రిందపడ్డ ఉదయని లేపి నిల్చోబెట్టాను. వాడు మోచేతిని, మోకాలును చూసుకుంటూ ఏడుస్తుంటే – అక్కడే వున్న నల్లా తిప్పి వాడి గాయం కడిగాను. “ఏం కాదు – ఏం కాదు చిన్న దెబ్బే” అంటుండగా పరుగు లాంటి నడకతో వచ్చింది మాలిని “ఏమయింది” అంటూ. ఇంతలో నాన్న “దెబ్బ తగిలిందా” అన్నాడు. మాలిని వస్తూనే కోపంతో, “ఇద్దరున్నారు ఇక్కడ – వాడ్ని అలా ఎలా పడనిచ్చారు?” అంది నా వంక, మా నాన్న వంక చూస్తూ. మాలిని ఉదయని దగ్గరికి తీసుకొని “నా తండ్రే, దెబ్బ తగిలిందా నాన్నా! మందు రాస్తాను పద!” అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ‘నా తండ్రి’ అట అని మనసులోనే అనుకొని నవ్వుకున్నాను. మాలిని, నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. మాలిని చాలా అందంగా ఉంటుంది. ఆ అందమే ఆమె పట్ల నన్ను ఆకర్షితుడ్ని చేసింది. నేనూ మనిషిని మా నాన్న పోలికలతో బాగుండటంతో తనూ నన్ను ప్రేమించింది. సినిమాలు, షికార్లు తిరుగుతూ పీకల్లోతు ప్రేమలో మునిగివున్నప్పుడు నాన్న నుంచి వుత్తరం వచ్చింది – ‘నీకో మంచి సంబంధం చూసాము. మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబంలో నలుగురి మధ్య పుట్టిపెరిగిన పిల్ల, గుణవంతురాలని తెలిసినవాళ్లు చెబుతున్నారు. నువ్వు ఎప్పుడు వచ్చేది చెబితే పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాం’ అంటూ. అప్పుడు నేను వెళ్లటమయితేనూ ఊరికి వెళ్ళాను గానీ పెళ్ళిచూపులకు కాదు – మా ప్రేమ సంగతి చెప్పటానికి! నా మాటలు విని అమ్మానాన్నా పల్లెత్తు మాట అనలేదు – కానీ ఒకటే మాట చెప్పారు – “నాన్నా- పెళ్ళంటే నూరేళ్ళ పంటరా – అందచందాలు, యవ్వనం ఇవి కలకాలం వుండేవి కావు. మంచి మనసులు రెండు కలిసి చేసే కాపురం మీద జీవితాల్లో శాంతిని, సుఖసంతోషాలనూ ఇస్తుందిరా.. ఇవన్నీ నీకు తెలియదని కాదు, పెద్దవాళ్లుగా చెప్పటం మా బాధ్యత అని చెబుతున్నాం. నీ సుఖం తప్ప మాకింకేమి అవసరం లేదు – నీకు ఆ అమ్మాయి ఇష్టమైంది, తగినది అనిపిస్తే అలాగే చేసుకో” అన్నారు. ‘మాకు కావాల్సింది నీ సుఖమే’ అని వాళ్ళు అన్నారు గానీ నా కాబోయే భార్య వల్ల మీరు కూడా సుఖంగా వుండాలని నేను అనలేక పోయాను. అసలు ఆ ఆలోచనే రాలేదు. వాళ్లు ఆ రోజు ఆ మాటలని అలా ఎందుకు చెప్పారో అప్పుడు అర్థం కాలేదు గాని క్రమక్రమంగా మాలినితో ఎదురైన అనుభవాలు తెలిసేలా చేసాయి.
వస్తూనే – “మీ అమ్మా, నాన్నా మనతోనే ఉంటారా? ఈ విషయం ముందు చెప్పలేదే మరి?” అంది మాలిని ముఖం చిట్లించి. అప్పటికి ఇంకా బుర్ర బాగానే పని చేస్తుండటం వల్లనేమో “లేదు – మనమో వాళ్ళతో ఉంటాం” అన్నాను.. యథాలాపంగానే అయినా అర్ధవంతంగా.
“ఈ విషయం మా అమ్మానాన్నలకు తెలిస్తే ఇంకేంలే. వాళ్ళకసలే నేనంటే ప్రాణం – మానాన్న, కయితే మరీ – నా కాలిలో ముల్లు గుచ్చుకున్నా ఆయన భరించలేరు – నాకు freedom లేకుండా నేనిక్కడ బతకాలంటే ఆయన అస్సలు ఒప్పుకోరు” అంది.
“అలా ఎందుకనుకుంటావ్. మా అమ్మానాన్నలను మీ అమ్మానాన్నలుగా అనుకోలేవా? మగపిల్లలు లేని మా అత్తామామలకు కొడుకునవ్వటానికి నేను రెడీ. మనకు ఇక నుంచీ ఇద్దరు తల్లిదండ్రులు అనుకుందాం” అన్నాను నేను. “మా అమ్మానాన్నా చాలా మంచివాళ్ళు – నిన్ను కూతురిలా చూసుకుంటారు” అన్నాను నేను.
“ఇవన్నీ సినిమాల్లో డైలాగులుగా చెప్పుకోవటానికి బాగుంటాయి. కానీ జీవితం అంటే సినిమా కాదు మరి” అంది. ఆ రోజు నుంచీ మొదలైన మాలిని నిరసనల పరంపర ఒక దశాబ్దం పైగా అలా కొనసాగుతూనే వుంది. ప్రతిరోజూ ఇంట్లో ఓ నిశ్శబ్ద సమరమే!
‘మీ నాన్న, మీ అమ్మ’ తప్ప అత్తయ్య మామయ్య అన్న మాటలు మాలిని నోటి నుంచి ఎప్పుడూ రాలేదు. అమ్మకు ఓపిక ఉన్నంత కాలం అమ్మే ఇంటెడు చాకిరీ చేసింది. ఓపిక పోయాక, అన్నం పెట్టిన ఆమెకే అన్నం కరువయింది. అమ్మపోయాక నాన్న పరిస్థితి మరీ నికృష్టం. ఆకలవుతే వంటింటి వంక ‘ఎప్పుడు పిలుపు వస్తుందా?’ అని ఎదురు చూపులు సారిస్తూ చూడటం నేను గమనించకపోలేదు. ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం – మందులు తెచ్చివ్వడం ‘ఏమన్నా కావాలా నాన్నా’ అని అడగటం ఎప్పుడు మాలిని కంటపడ్డా – ‘అబ్బో శ్రీరామచంద్రుడు- ఆయనేమో దశరథ మహారాజు’ అని వెటకారంగా అనేది మాలిని.
అమ్మ ‘ఆ రాముడిలా నాన్నను నువ్వూ చూసుకో నాన్నా!’ అని చెపితే – నా భార్యకు పురాణం కథలు అలా కచ్చె తీర్చుకోవటానికి పనికిరావటం చూసి నాలో శుష్క దరహాసం ఒకటి వచ్చి పెదవుల మీద నిలిచేది. ఇంట్లో అలా ప్రవర్తించే మాలిని – నిముషానికోసారి తన తండ్రిని తలుచుకుంటూ – “నాకు మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. ఓసారి చూసొస్తాను. నాన్నకు జ్వరమట అది విన్నదగ్గరి నుంచీ నాకు చాలా టెన్షన్‍గా ఉంది. వెళ్ళొస్తాను. రాత్రి మా నాన్నకు నేను కలలోకి వచ్చానట! వెళ్ళొస్తాను” అంటూ ఇలా సాగుతుంది నాన్న జపం.. అది విని ‘ఈ మనిషి ఎంత విచిత్ర జీవినో కదా’ అని మళ్ళీ ఒక నిర్లిప్తమయిన నవ్వు నవ్వుకుంటాను. అలా నవ్వుకోవటం, మౌనమునిలా మాట్లాడకుండా వుండటం తప్ప నేను నా తల్లిదండ్రులకు ఒరిగించింది ఏమిలేదు. ఇప్పుడు తల్లి ఎలాగూ లేదు. కనీసం తండ్రికయినా! ఎంతటి మగవాళ్ళయినా పెళ్ళయి భార్య వచ్చాక ఆమె ప్రభావానికి అంతగా ఎందుకు లొంగిపోతారన్నది – పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకూ నాకు అర్థం కాలేదు! ఆ మగవాళ్ళలో నేనూ ఒకడ్ని అయినందుకు నా దగ్గర సమాధానం కూడా లేదు. తనకంటూ ఒక సంసారం ఏర్పడ్డాక కొడుక్కి తల్లిదండ్రుల ప్రాధాన్యం ద్వితీయస్థానంలోకి వస్తుంది – నా భార్యా, నా పిల్లలు ప్రథమస్థానంలో వచ్చి నిలుస్తారు – ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం – ఒప్పుకోక తప్పదు. ఏదో అద్భుతం జరిగి ఇందులో మార్పు వస్తుంది – అందరికీ.
సమప్రాధాన్యత లభిస్తుందన్నది మానవజాతి ఈ భూమి మీద ఉన్నంత వరకూ సాధ్యమయ్యే పని కాదు. అది అలా నడుస్తుండగానే వెనకటి తరాలు గడిచిపోతాయి. ప్రస్తుత తరాలు తెర మీదికి వస్తాయి. చరిత్ర పునరావృతమవుతుంది – ఇక ఇదే జరిగేది.
నా విషయంలోనూ అలాగే జరిగింది. ఒకరోజు – నిద్రపోతున్న నాన్న నిద్రలోనే శాశ్వతనిద్రకు ఒరిగి కన్నుమూసారు.
‘పెద్దవయసు వచ్చాక ఇక తప్పదు’ అన్నారు అంతా.
నాన్న నిర్జీవమైన ముఖం వంక చూస్తుంటే నా గుండె తరుక్కొనిపోయింది. నాకు అంతచేసిన నాన్న – ఆ కట్టెల్లా మారిన చేతుల వంక చూస్తుంటే నాలో అపరాధం భావం సుళ్లు తిరిగింది..
పెళ్ళి కానంత వరకూ తల్లిదండ్రలతో పిల్లల జీవితం ఒకలా సాగుతుంది. గారాబం, వాత్సల్యం, అందమైన బాల్యం, ప్రేమ, ఒకరి కష్టాన్ని ఒకరు చూడలేని దయాగుణం ఇలా!
పెళ్ళయ్యాక స్వార్థం, పరాయితనం, నువ్వు నేను అన్న భేద భావాలు, దయలేని తనం, నిరాదరణ, నిర్లక్ష్యం, వాళ్ళకు వాళ్ళను వదిలేసే తనం, వంటివన్నీ పిల్లల్లో వచ్చి చేరతాయి! ఈ జీవితాలు ఇంతే ఇక – ఇది ఇంటింటి కథ – తల్లిదండ్రుల – పిల్లల జీవితకథ! ప్రస్తుతం నడుస్తున్న కథ మాత్రం ఈ తండ్రికొడుకుల కథ.
అందుకే నాన్నకు ఆఖరి నమస్కారం చేస్తూ కాళ్లు గట్టిగా పట్టుకొని ‘నాన్నా! నన్ను మన్నించు!’ అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నేను. నా భార్య మాలిని ఆఖరి అన్నంగా నాలుగు బియ్యం గింజలను నాన్న నోట్లో వేస్తూ బావురుమని ఏడ్చింది అందరి దృష్టి తన మీద వుందని గమనిస్తూ. అది చూసి మళ్లీ ఒక శుష్క దరహాసం నా పెదవుల మీద! మనిషిపోయాక ఉన్నవాళ్ళకి జీవితమంతా పశ్చాత్తాపం తప్ప మరేమి ఉండదు గనుక – నాతో కలిపి -ఈ లోకం పోకడకు అలా ఆఖరిసారి నవ్వుకున్నాను. ‘నాన్నా! నన్ను మన్నించు!’ అన్న ఆఖరి వేడుకోలు దానికి జత చేస్తూ.