[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘సంస్కారాలు’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
[dropcap]“చీ[/dropcap]మ ముక్కు మట్టిలో కూడా చక్కెర పలుకు కోసం వెతుకుతుంది. మట్టి పురుగు చక్కెరలో కూడా మట్టి కోసమే వెదుకుతుంది!!!”
ప్రతీ జీవిని చివరాఖరికి మనిషిని కూడా జన్మ సంస్కారాలే నడిపిస్తాయి.. కాదు నడిచేలా శాసిస్తాయి!
స్వామీ ప్రణవానంద సేవాశ్రమం ముందు ఆగిన మెర్సిడెస్ బెంజ్ లోంచి దిగారు శ్రీమాన్ అద్దేపల్లి రామమోహనరావు, సీతా మహాలక్ష్మి దంపతులు. గేట్‌మాన్ నుండి మేనేజర్ వరకూ అందరూ వచ్చి స్వాగతం పలికారు. ఎందుకంటే ఆ ఆశ్రమానికి వెన్నూ దన్నూ ఆ దంపతులే! ఆశ్రమంలో వంద గదులున్న వసతి గృహ సముదాయం, ప్రార్థనా మందిరం, గోశాల, అధిష్టానం అని పిలువబడే స్వామీ ప్రణవానందుల సమాధి మందిరం నిర్మించింది వారే!
ఆశ్రమ జనరల్ సెక్రెటరీ బెల్లంకొండ రమణ మూర్తి, మేనేజర్ ధనరాజులు దగ్గరుండి వారిని ప్రస్తుత పీఠాధిపతి స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతీ వారి సన్నిధికి తీసుకెళ్ళారు. స్వామీజీ సన్నిధికి ఒక వైపు వేద పాఠశాలలో నుంచి వేద ఘోష వినిపిస్తుంది. మరో వైపు నున్న వేదాంత పాఠశాల లోంచి విద్యార్థులు వల్లిస్తున్న తైత్తిరీయ ఉపనిషత్ వినిపిస్తుంది. ఆ దంపతులను అక్కడకు తీసుకు వచ్చిన సెక్రెటరీ, మేనేజర్‌లు సెలవు తీసుకు వెళ్లిపోయారు. స్వామిజీ రావడానికి సమయం పడ్తుందని అక్కడ వున్న శాంతి పత్రిక తీసుకొని తిరగేస్తున్నారు రామ్మోహన రావు గారు. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చున్నారు సీతా మహాలక్ష్మి గారు.
స్వామీజీ వస్తున్నట్టు మాటలు వినిపించాయి. స్వామిజీ భగవత్ గీత బోధించే పద్ధతి చాలా బావుంటుంది సాక్షాత్తు ఆ శంకరులే బోధిస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. రామమోహనరావు గారి ఏకైక సంతానమైన గౌతమ్ కుమార్ ప్రతీ సాయంత్రం యూనివర్సిటీ నుంచి నేరుగా ఆశ్రమానికి వచ్చి స్వామీజీ చెప్పే గీత పాఠం గత మూడు సంవత్సరాలుగా చదువుకొంటున్నాడు. పెళ్లి చేసుకోనని తాను నైష్ఠిక బ్రహ్మచారిగా వుండిపోతానని అంటున్నాడు. దాని గురించి స్వామీజీతో మాట్లాడటానికి ఇక్కడకు వచ్చారు. వాడిని వివాహానికి ఒప్పించే బాధ్యత స్వామి మీద పెట్టడానికే వచ్చారిప్పుడు!
స్వామీజీ వచ్చి తమ ఆసనంలో ఆశీనులయ్యారు. స్వామీజీతో పాటు కొంతమంది విదేశీ వేదాంత విద్యార్థులు కూడా వచ్చి, వారి చుట్టూ కూర్చున్నారు. ఈ దంపతులు నమస్కరించారు. స్వామీజీ ఆశీర్వదించి కూర్చోమని సైగ చేసారు.
“కైండ్లీ డిస్క్రైబ్ ద మైండ్ ఎకార్డింగ్ టు అద్వైత?” అంటూ అడిగారు జపాన్ దేశస్థురాలు జున్ ఇషోభి.
“అద్వైత టేక్స్ ఒన్ యాజ్ మెనీ, అండ్ మెనీ యాజ్ ఒన్. ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ అర్ ది మూవ్‌మెంట్స్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ!” చెప్పారు స్వామిజీ.
“స్వామీజీ! వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ అండర్‍స్టాండింగ్?” అడిగింది స్వీడన్ స్టూడెంట్ మిస్ కత్రిన్ కుబ్బే.
“వెల్ డియర్ చైల్డ్! దే లుక్స్ సేమ్ బట్ నాట్. ద నాలెడ్జ్ రిఫర్స్ టు ది ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫాక్ట్స్, విజ్‌డం ఇన్వాల్వ్ ది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎలాంగ్ విత్ ఎక్స్‌పీరియన్స్!” వివరించారు స్వామీజీ.
సంభాషణ వింటున్నరామ్మోహన్ రావు ఆగలేక అడిగేసారు “ఆ రెండింటికీ పెద్ద తేడా ఏముంది స్వామీజీ?”
“పెద్ద తేడా అంటున్నారంటే ఎంతో కొంత వుందనేగా? నాలెడ్జ్ అంటే జ్ఞానం. అండర్‌స్టాండింగ్ అంటే విజ్ఞానం. జ్ఞానం బాహ్యము నుండి పొందేది. విజ్ఞానం అంతరంగ సిరుల నుండి గ్రహించేది.” స్వామీజీ వివరించారు.
“యీజ్ దిస్ స్టడీయింగ్ ఆఫ్ వేదాంత నాలెడ్జ్? ఆర్ అండర్‌స్టాండింగ్?” ఆస్ట్రేలియా వాసి దామియన్ క్లర్క్.
“ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ వేదాంత, దట్ ఈజ్ నాలెడ్జ్ మీన్స్ అకడమిక్, ఇఫ్ యూ స్టడీయింగ్ అబౌట్ యు, దట్ ఈస్ అండర్ స్టాండింగ్, మీన్స్ ఆత్మ!” వివరించారు స్వామీజీ.
“స్వామీజీ ఆర్ యూ ఆస్తికా ఆర్ నాస్తిక?” అడిగింది బెలూరస్ స్టూడెంట్ యూలియా సెంక్విచ్.
“ఐ యామ్ నైదర్ ఆస్తికా నార్ నాస్తికా, ఐ యాం వేదాంతీన్!” చెప్పారు స్వామీజీ.
“వేదాంతం చదివితే బ్రహ్మ జ్ఞానం కలుగుతుందా?” అడిగారు సీతా మహాలక్ష్మీ
“వేదాంత శాస్త్రం బ్రహ్మ జ్ఞానం కాదమ్మా! బ్రహ్మ జిజ్ఞాస మాత్రమే. చీకటి తెరలు తొలగిస్తేనే వెలుగు వస్తుందమ్మా! అవిద్య – అజ్ఞానాలను మించిన చీకటి ఈ జగత్తులో లేదు! జ్ఞాన దీపంతో వాటిని తొలగిస్తే నీ అంతరంగంలో బ్రహ్మ జ్ఞానం ఆవిష్కృతం అవుతుంది. అది నీవే నని తెలుస్తుంది. నేను వున్నాను అనే భావం కలుగుతుంది. ఆ భావం దేశ, కాల పరిచ్ఛేదాలు లేనిది. అదే ‘అయమాత్మా బ్రహ్మ’ అనే తెలివి. అదే విజ్ఞానం.” స్వామీజీ.
“కైండ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ రిగార్డింగ్ ది పీపుల్?” సైప్రస్ వాసి స్టవరోస్ కంబూరిస్.
“వెల్ మిస్టర్ స్టవరోస్! సైకలాజికల్లీ దేర్ ఈస్ నో పాస్ట్ అండ్ ఫ్యూచర్. బట్ క్రోనలాజికల్లీ ది పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ఫ్యూచర్.” స్వామీజీ
“ఎలా స్వామీజీ, తెలుగులో వివరించండి.” సీతా మహా లక్ష్మి.
“ఎవరికైనా గతాన్ని తల్చుకొంటే బాధే కలుగుతుంది. ఎందుకంటే గతంలో సంతోషాల కంటే బాధలే ఎక్కువ వుంటాయి. సంతోషం అనేది రెండు బాధల మద్య సన్నని రేఖ మాత్రమే! అలానే భవిష్యత్తును భావన చెయ్యగానే భయం వేస్తుంది. రేపు ఎలా గడుస్తుంది అనే ఆలోచనే కలుగుతుంది. ఈ బాధా, భయము నిజంగా లేవు. అవి మన మనసు యొక్క కల్పనల మాయ! మనస్సు ఎప్పుడూ తెలిసిన దానినుండి తెలియని దాని వైపు ప్రయాణిస్తూనే వుంటుందమ్మా!.” వివరించి ప్రసంగం ముగించారు స్వామీజీ.
“ఓ కే! మై డియర్ స్టూడెంట్స్! నౌ ఐ యాం గివింగ్ యూ ఏ మెసేజ్! ఆల్ ఆఫ్ యూ మస్ట్ బికం ఎ లవర్ ఆఫ్ ది ట్రూత్ బట్ నాట్ టు ఎ పర్సన్!!”ప్రసాదం ఇచ్చి అందర్నీ పంపించి ప్రసన్నంగా రావు గారి వైపు చూసారు స్వామీజీ.
“స్వామీజీ! మా అబ్బాయి గౌతమ్ కుమార్‌కు కళ్యాణం జరిపించాలని నిర్ణయించాము. కానీ.. వాడు వివాహం చేసుకోనని బ్రహ్మ చర్య దీక్ష స్వీకరిస్తాను అని మొండికేస్తున్నాడు. మా వ్యాపారాలకు, సంపదలకు వాడే వారసుడు. గత మూడు సంవత్సరాలుగా మీ వద్ద భగవద్గీత చదువుతున్నాడు. అందుకే అనుకుంటాను ఏదో మాకు తెలియని నివృత్తి మార్గం అంటున్నాడు. మీ వేదాంత పాఠాల వల్లనే వాడు ఇలా తయారయ్యాడు. ఇందులో మాకు ఏమీ సందేహం లేదు. వాడిని ఎలాగైనా మా మార్గంలోకి మళ్ళించే భాధ్యత మీదే!” సూటిగా విషయం చెప్పేశారు రామమోహనరావు.
స్వామీజీ మౌనంగా ఉండిపోయారు. వారు అంతర్ముఖు లైనట్టు గ్రహించారా దంపతులు. ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. కొద్ది సేపటికి స్పృహ లోకి వచ్చిన స్వామీజీలో చిన్న కదలిక. అక్కడ సేవ చేస్తున్న సేవకుడిని పిలచి “మన గురుకులంలో వున్న నరేంద్ర కుమార్ అనే విద్యార్థిని పిలుచుకు రమ్ము” అని పురమాయించారు. పది నిముషాలలో నరేంద్ర వచ్చి గురువుకు ప్రణామం చేసి నిలుచున్నాడు.
“చూడు నరేన్! నీ వివాహం ఎప్పుడు?” స్వామీజీ
“ఫిబ్రవరి 13 న, వచ్చే మాఘ మాసంలో.” నరేన్
“నీ వివాహానికి ముహూర్తం ఎవరు పెట్టారు?” అడిగారు స్వామీజీ.
“మీరే పెట్టారు స్వామీజీ! మరచి పోయారా?” నరేన్
“అవునవును! మరచిపోయాను. ఇక నీవు వెళ్లి రా!”
అయోమయంగా చూసి వెను తిరిగాడు నరేన్ కుమార్.
“ఇతను మన ఆశ్రమ గురుకులంలో గత పండ్రెండు వత్సరాలుగా – వేదం.. దశోపనిషత్తుల శంకర భాష్యం.. బ్రహ్మ సూత్ర భాష్యం.. భగవద్గీత చదువుకుంటున్నాడు. నేను అనుకున్నాను ఇతను బ్రహ్మ చర్య దీక్ష స్వీకరించి దరిమిలా మంచి సన్యాసిగా రూపొందుతాడని. కానీ.. అతని జన్మ సంస్కారము ఇతన్నో సంసారిని చేస్తుంది! నా పరేచ్ఛా ప్రారబ్ధం ఇతని సంసార సాగర దీక్షకు ముహూర్తం పెట్టేటట్టు చేసింది! ఏం చేస్తాం? నేను తామరాకు మీద నీటి బొట్టుని. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను – ‘యదేవ భవతి తదేవ మంగళాయ!’ అని” అంటూ మళ్లీ మౌనం లోకి వెళ్ళిపోయారు స్వామీజీ.
బాగా అర్థమైంది అద్దేపల్లి రామమోహనరావు, సీతా మహాలక్ష్మి దంపతులకు. స్వామీజీని డిస్ట్రబ్ చేయకుండా లేచి నిశ్శబ్దంగా బయటకు వచ్చేశారు!
స్వస్తి