[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 9వ భాగం
19. దర్బారు:
[dropcap]ఇ[/dropcap]ది 22 వ మే॥ ఖరహరప్రియలో జున్యము. షాడవ, వక్ర, సంపూర్ణ ఉపాంగ రాగము.
ఆరోహణ: స రి మ ప ద ని స
అవరోహణ: స ని స ద ప మ రి గ గా రి స
ఆరోహణలో గాంధారము లేదు. దర్బారు ముఖ్యమైన ఉపాంగరాగములలో ఒకటి. చాలా ప్రచారము పొందిన రాగము. త్రిస్థాయి రాగము. అన్ని వేళలా పాడదగినది. ఇది గంభీరమైన శక్తి రాగము. ఈ రాగములో గాంధారము. జంటగా పలుమారులు ప్రయాణింపబడుట గమనింపదగ్గ విషయము. రి, గ, ని, లు మంచి జీవ స్వరములు. స, రి, ప, లు గ్రహ స్వరములుగాను, న్యాస స్వరములుగాను బాగుండును. ఈ రాగమును విస్తరించి ఆలాపన చేయుటకు మంచి సామర్థ్యము అవసరము.
దర్బారు రాగమును గురించి 18వ శతాబ్దము నుండియే గ్రంథములలో పేర్కొన బడినది. కాపీ రాగమే – ‘కర్నాటక కాపీ’ అను రాగంగా దీక్షితుల వారి ‘మణి ప్రవాళ కృతి’ లక్షింపబడి యున్నది. ‘సంగీత సంప్రదాయ ప్రదర్శిని’లో, కర్నాటక కాపి, దర్బారు రెండు రాగములలోను గల దీక్షితుల కృతులు స్వరపరచి యివ్వబడినది. గా గా రి స – నీ నీ ద ప – రెండు ప్రయోగములు, దర్బారులో ఎక్కువగా కన్పించును. త్యాగయ్య ‘నిత్యరూప’ – అను కృతి ‘కర్నాటక కాపి’ రాగమే.
దర్బారు మద్యమకాల ప్రధాన రాగము. ‘యోచన కమలలోచన’ దీనికి సాక్షము. మరియొక కృతి ‘ఎందుండి వెడలిపో ఏ ఊరో’ కొంత వరకు చౌక కాలములో పాడవలసినట్లు ఉండును. పట్నం సుబ్రమణ్యం అయ్యర్ ‘తానవర్ణము’ మధ్యమ కాలంలో వున్నది.
రి గ రి స ద ని ద ప – ప్రయోగములు జాగ్రత్తగా పాడవలయును.
సుబ్బరాయ దీక్షితులు తన 17వ ప్రాయముననే దర్బారు రాగములో ఒక అమూల్యమైన తానవర్ణములను రచించి మెప్పు పొందినట్లు తెలియుచున్నది,
సంచారం:
పమరీ – రిగారిసరి – రిమపదనిపా దపమపదనిసా- నిసరి పమరి రిగగరిసా – మపదనిసా – సనిదప మ ప ద ని ప మరీ – రిగగారిసరీ – నిరిసనిసదప – మప దనిసా
రచనలు:
- చలమల – వర్ణము – ఆది – వీణ కుప్పయ్యర్.
- యోచన – కృతి – ఆది – త్యాగరాజు
- ముందువెనుక – కృతి – ఆది – త్యాగరాజు
- మీన నయనా – కృతి – రూపక – సుబ్బరాయ శాస్త్రి
- రామాభి రామా – కృతి – మిశ్రచాపు – త్యాగరాజు (ఉత్సవ సంప్రదాయ)
~
ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి ‘త్యాగరాజాదన్యం న జానే’:
పల్లవి:
త్యాగరాజాదన్యం న జానే
గురు గుహాది సమస్త దేవతా స్వరూపిణఃశ్రీ
అనుపల్లవి:
రాగాది వృత్తి రహిత స్వానుభోగానంద స్ఫూర్తి విశేషాత్ –
(మధ్యమ కాల సాహిత్యమ్)
భూ గంధ-వాహ వహ్ని జల గగన పుష్పవద్యజ్వ-మయ మూర్తేఃశ్రీ
చరణం:
సత్త్వ రజస్తమో గుణాతీత సత్య జ్ఞానానంద రూపిణో
ద్విత్వాది భేద కర్తన పరమాద్వైత స్వాత్మానంద రూపిణో
త్రిత్వ పరిచ్ఛేద రాహిత్య త్రై-పద పరమాద్వైత రూపిణో
తత్త్వం పదార్థ శోధన శేషిత తత్పద లక్ష్యార్థ స్వరూపిణో
(మధ్యమ కాల సాహిత్యమ్)
తత్వ సమష్టి వ్యష్టి రూప లయ తారక బ్రహ్మ రూపాత్మనో
తత్వం స్వాతిరిక్తాసహన తత్సక్తమాన రూపాత్మనఃశ్రీ
వ్యాఖ్యానం:
పంచమీ విభక్తి. త్యాగరాజు కంటే వేరు వస్తువు ఎరుగును అని సర్వము త్యాగరాజు రూపముగా వర్ణించిరి. గురుగుహాది సర్వదేవతా స్వరూపుడైన, రాగద్వేషాదులు లేని, తన అనుభవమున కలిగిన ఆనందముచే, భూమి, వాయు, అగ్ని, జల, ఆకాశ, పుష్పము వలె యజ్ఞమయ మూర్తి కన్న, త్రిగుణాతీత్ర సత్యమైన జ్ఞానముచే కలిగిన ఆనందమూర్తి మూర్తి కన్న అని చరణమున ఆనంద రస-మూర్తిగ వర్ణించిరి. సత్యజ్ఞానానందము, అద్వైతాత్మానందము, పరమాద్వైతరూపము, తత్స్వరూప లక్ష్యరూపము, తారక బ్రహ్మ రూపము – మొదలైన పదముల యథార్ధ తత్త్వమును శ్రుతియంగా అంతరహితశ్చ తత్సర్వం, తత్త్వమూర్తి కన్న వేరు నాకు తెలియదని తెలిపిరి. వీనిని సంపూర్ణముగ గురుముఖమున తెలియదగినవి. చరణము ప్రథమా విభక్తి. ఈ గుణములు గల అని ప్రథమ, వానికంటే అని చతుర్థి విభక్తి కలిగి యున్నది.
20. మధ్యమావతి:
22వ మే ॥ ఖరహరప్రియలో జన్యం. ఔడవ, ఉపాంగం.
ఆరోహణ: స రి మ ప ని స
అవరోహణ: స ని ప మ రి స
మధ్యమావతి ప్రసిద్ధ ఔడవ రాగము, మంగళప్రదమైన రాగముగా ఎంచబడుచున్నది. ఇందలి స్వరము లన్నియు పూర్తి సంవాదిత్వము కల్గియుండుటు గమనింపదగ్గ విషయము. ఇందు అన్నియు జీవ స్వరములే. గ్రహ స్వరములుగా, న్యాస స్వరములుగా కూడా అన్నియు బాగుండును. త్రిస్థాయి రాగం. సర్వస్వర మూర్ఛనా కారక రాగము. ఈ రాగంలో అనేక రచనలు కలవు.
మందులలో సర్వరోగ నివారిణి యున్నట్లు, ‘సర్వ దోషినివారిణి’ మధ్యమావతి. ఏ సంగీత కార్యక్రమము నైనా ఈ రాగమును పాడి ముగించుట పరిపాటి. మధ్యమావతి పూర్వాశ్రమం పేరు ‘మధ్యమాది’. మధ్యమమును గ్రహ స్వరముగా పెట్టుకున్న రాగము. కావున యిది ‘మధ్యమాది’ అయినది.
మధ్యమ గ్రామము యొక్క మధ్యమ మూర్ఛన ‘హరికాంభోజి’. ఈ హరికాంభోజి లో గ ద, వర్జించిన మధ్యమావతి అగును. మధ్యమ + అది = మధ్యమాది. షడ్జ పంచమ, షడ్జ మధ్యమ భావములో మొదటి ఘట్టములో ఇవి కనిపించు స్వరములచే మధ్యమావతి అనే ఔడవ రాగం కన్పించుచున్నది.
స – ప – రి – స – మ – ని
ఇది రాగాంగ రాగము. పార్శ్వదేవులు – తన ‘సంగీత సమయసారము’లో పేర్కొనిన 12 రాగాంగ రాగములలో మధ్యమాదిని ఒకటిగా పేర్కొనెను. శార్జ్గదేవులు ప్రాక్ప్రసిద్ధ రాగముగా పేర్కొనెను. వేంకటమఖి ‘చతుర్దండి ప్రకాశిక’ గ్రంథములో ‘మధ్యమాది’ని రాగాంగ రాగముగా పేర్కొనిరి. తులజేంద్రులు మధ్యమాది గురించి చెబుతూ వేణువుతో దీనిని వాయించుటవలన ప్రత్యేకమైన ప్రకాశము పొందినది అని చెప్పెను. లాక్షణికులందరు, దీనిని శ్రీరాగ మేళనమని, ప్రాచీన తమిళ సంగీతములో ‘సెందురుత్తి పణ’ – మధ్యమాదియే.
వేంకటమఖి పేరున చెప్పుతున్న ‘రాగలక్షణ సంగ్రహములు’లో ‘బృందావని’ అను ఒక రాగం కలదు.
నిషాదమును వీలైనంత వరకూ కంపిత గమకముగానూ లేదా మృదు కంపితముగాను పాడవలెను. శుద్ధ, సష్టమైన కై॥ని॥ చాలా అరుదుగా వాడవలెను. జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములకు అనువైన రాగం.
సంచారం:
రీపమరీసా. సనిపరిసనిప. నిసరిసరీ – రిమ పనిస – నిసరి మరిసా – సనిరిసనిప. పనిపరిసి – సనిపమరి. రీ ప మ రి సా.
రచనలు:
- అలకలల్లలాడగ – కృతి – రూపక – త్యాగరాజు
- రామకథాసుధా – కృతి – ఆది – త్యాగరాజు
- పాలించు కామాక్షి – కృతి – ఆది – శ్యామశాస్త్రి
~
దీక్షితార్ కృతి – శ్రీ రాజ రాజేశ్వరీం:
పల్లవి:
శ్రీ రాజ రాజేశ్వరిం మహా త్రిపుర సుందరీం
లలితా భట్టారికాం భజేహం భజే
(మధ్యమ కాల సాహిత్యం)
విదేహ కైవల్య మాశు ఏహి దేహి మాం పాహి
చరణం:
ఆరాధయామి సతతం
గం గణ పతిం సౌః శరవణం
అం ఆం సౌః త్రైలోక్యం
ఐం క్లీం సౌః సర్వాశాం
హ్రీం క్లీం సౌః సంక్షోభణం
హ్రైం క్లోం హ సౌః సౌభాగ్యం
హ స్రౌం హ క్లీం హ సౌః సర్వార్థం
హ్రీం క్లీం బ్లేం సర్వ రక్షాం
హ్రీం శ్రీం సౌః రోగ హరం
హ హ్రైం హ స్ల్కీం హ స్త్రౌః సర్వ సిద్ధిం
క ఏ ఈ ల హ్రీం – హ స క హ ల హ్రీం –
స క ల హ్రీం శ్రీం సర్వానందం
శ్రీ నాథానంద గురుగుహ పాదుకాం పూజయే సదా
చిదానంద నాథోహం కామేశ్వరాంక నిలయాం
(మధ్యమ కాల సాహిత్యం)
వైశ్రవణ వినుత ధనినీం గణపతి గురు గుహ జననీం
నిరతిశయ శుభ మంగళాం మంగళాం జయ మంగళాం
వ్యాఖ్యానం:
ద్వితీయా విభక్తి.
పూర్ణ దీక్షాపరులైన శాక్తేయోపాసకులు, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, లలితా పరాభట్టారికల ధ్యాన, జప, పూజార్చనాదులు సల్పుదురు. ఈ కృతి శ్రీచక్ర రూపాకృతిని పొందినది. ఇందలి బీజాక్షరములు ఏ దేవత కొరకు, ఏ కోరిక కొరకు ఉపాసింతురో ఆ మంత్రవిషయములు సద్గురువులు వలన గ్రహింపదగినవే గాని స్వయంగా గ్రహించరాదు. ఉచ్చారణలో ఏ మాత్రమైన పొరపాటు జరిగినచో, శుభములు రాకపోగా, అశుభ ఫలములు కలుగును. మాతృభాషనే స్వచ్ఛముగా ఉచ్చరించలేక, జనార్ధన, మధుసూధన, భోద, భాద అని ఫలుకుట వినుచున్నాము. సంస్కృతమున ‘విదుర వంద్య’ అనవలసినదానిని, ‘విదుర వంధ్య’ అని పలికినచో అర్థము మారును. విదుర వంద్య = విదురునిచే వందనము చేయబడువాడు. వంధ్య = అనగా గొడ్డుమోతురాలు అని అర్థం. ఒక వత్తును, ఉన్న దానికి తీసి పలికనను; లేని దానికి పెట్టినను అర్థ విపర్యయము కలుగును. గాన సాహిత్యమును ముఖ్యముగా ఈ మంత్ర బీజములను, గురుముఖముగా అభ్యసించి గానము చేయాలి. ఇది మంగళ గీతము. దీక్షితుల వారు, వారి పూర్ణదీక్షలో, ఉపాసనలో కల్గిన అనుభూతిని సంప్రదాయాన్ని స్తోత్రమొనర్చిరి.
(ఇంకా ఉంది)