వ్యామోహం-25

2
3

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అనుకున్న రోజున ఉదయం పదిగంటలకు జోడెడ్లపాలెంలో రైలు దిగుతారు రాము, సత్యమూర్తి. బాల్రెడ్డి పటేల్, ఓదెలు వీళ్ళకి స్వాగతం చెప్తారు. పలకరింపులయ్యాక, ఓదెలు నడుపుతుండగా జీపులో పట్వారి గారింటికి వెళ్తారు. గుమ్మంలోనే ఉన్న నర్సింగరావు కులకర్ణి వారిని ఆప్యాయంగా పలకరించి, నన్ను గుర్తుపట్టావా అని రాముని అడిగితే, గుర్తు పట్టాననీ, నర్సింగరావు మామ అని చెప్తాడు రాము. మీరు రాము మేనమామ కదా, మీ పేరు గుర్తు రావడం లేదంటాడు నర్సింగరావు. సత్యమూర్తి తన పేరు చెప్తాడు. కాసేపయ్యకా, తాను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు బాల్రెడ్డి పటేల్. సత్యమూర్తి, రామూలకు తన కుటుంబ సభ్యులందర్నీ పేరు పేరునా పరిచయం చేస్తాడు నర్సింగరావు. మధ్యాహ్న భోజనం వాళ్ళింట్లోనే తిని చిన్న కునుకు తీస్తారు. నిద్ర లేచే సరికి పకోడీలు సిద్ధంగా ఉంటాయి. పకోడీలు తిని, టీ తాగాకా కాసేపు డాక్టర్సాబ్ గురించి, డాక్టరమ్మ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో వీళ్ళు నిద్ర లేచారా అని అడుగుతూ బాల్రెడ్డి లోపలికి వస్తాడు. కాసేపయ్యకా, అందరూ బాల్రెడ్డి ఇంటికి చేరుతారు. మిద్దె మీద పెద్ద బల్ల చుట్టూరా కూర్చుంటారు. డాక్టర్సాబ్ ఇక్కడ కూర్చునే తమ వ్యాధి లక్షణాలు రాసుకున్నాడంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటాడు బాల్రెడ్డి. డాక్టర్సాబ్‍ను పొగుడుతుంటే, రామూ, సత్యమూర్తులకు గర్వంగా అనిపిస్తుంది. బాల్రెడ్డి మాట్లాడుతూ, వీరలక్ష్మి వల్ల తనకీ, డాక్టర్సాబ్‍కీ గొడవలవడం, తాను ఆయన్ని బికారిని చేయాలనుకోవడం అన్నీ చెప్తాడు. డాక్టర్సాబ్ తనకి ఎంతగా నచ్చజెప్పాలని చూశాడో కూడా చెప్తాడు. వీరలక్ష్మి విషయంలో ఏం చేయాలో డాక్టర్సాబ్ తనకి ఉత్తరం రాశాడని, ఆ ప్రకారమే తాను నడుచుకుని, ఆమెతో చివరిదాక సంతోషంగా గడిపానని చెప్తాడు. వీరలక్ష్మి చనిపోయే ముందు తనని కోరిన కోరికలు తీర్చేందుకు రామూని జోడెడ్లపాలెంకు పిలిపించానని చెప్తాడు. కరీమాబాద్‍లో ఉన్న ఇంటిని తన మేనకోడలికి రాసివ్వమందనీ, తన ఇంటిని, తన పేరు మీద ఉన్న రెండెకరాల స్థలాన్ని రామూ పేరు మీద రాయించిందని చెప్తాడు. ఆ కాయితాలు తీసి రామూకి ఇస్తాడు. డాక్టర్సాబ్ కట్టించిన ఇంటి చుట్టూ ప్రహరి తానే కట్టించానని, ఆ కాయితాలు మీ దగ్గరే ఉండాలి, లేకపోయినా పర్వాలేదు గ్రామపంచాయితీలో డాక్టర్సాబ్ పేరే ఉంది, సమస్య ఏమీ రాదని చెప్తాడు. ఆ ఇల్లు పొలం నేనేం చేసుకుంటాను, వద్దంటాడు రామూ. తొందరపడద్దు, ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోమని నచ్చజెప్తాడు బాల్రెడ్డి. అయితే తామిక బయల్దేరుతామని అంటే, మీ ప్రయాణం రేపు మధ్యాహ్నం ఇప్పుడు కాదంటాడు నర్సింగరావు. రాత్రి భోజనాలు నర్సింగరావు ఇంట్లో తిని, అక్కడే నిద్రపోతారు మామాఅల్లుళ్ళు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రునాడుదయమే అందరూ కలసి జీపులో బయల్దేరారు. ముందర పొలం దగ్గరకు వెళ్ళారు. చెరువు తూము కింద మొదటి పొలమే వీరలక్ష్మిది. పొలం విలువ రాముకి తెలిసినా తెలియకపోయినా, సత్యమూర్తికి తెలిసింది. అక్కడి నుండి డాక్టరు గారి ఇంటి దగ్గరకు వెళ్ళారు.

బాల్రెడ్డి పటేలు ప్రహారీ గోట కట్టించడమే కాదు. గేటు కూడా పెట్టించాడు. తన దగ్గరున్న చెవితో తాళం తీసి గేటు తెరిచాడు. పునాదుల వరకున్న ఎనిమిది గదుల ఇల్లు. ఇప్పటి కాలంలాగా పెద్ద హాలు ఏర్పాటు కూడా వుంది. ‘బావది చాలా ముందు చూపు’ అనుకున్నాడు సత్యమూర్తి. గుమ్మాలు, కిటికీలతో కూడిన లెంటిల్సు వరకు లేచిన ఇల్లు రాము కళ్ళముందు కదలాడింది. దుఃఖం వచ్చింది. కర్చీఫ్ కళ్ళు తుడుచుకొన్నాడు రాము. గమనించిన సత్యమూర్తి భుజం తట్టి అనునయించాడు.

“ఇరువై గుంటల భూమి. ఒక్క చెక్క దీర్ఘ చతురసం. తూర్పు ముఖం. ఎదురులేని వాస్తు” వివరించాడు నర్సింగరావు కులకర్ణి.

“అంత వాస్తు బలమున్నంక ఇట్లెందుకైంది మామ” అడిగాడు రాము.

“గ్రహచారం రాము. గ్రహచారం వాస్తుకన్న బలమైంది. కొన్నిసార్లు మనకు కనపడేదాని కన్న ఎక్కువ మేలు జరుగవలసివుంటే కూడ మేలు జరుగవలసిన కాడ దెబ్బతాకుతది” చెప్పాడు నర్సింగరావు.

“అంటే”

“చూడు. నువ్విప్పుడు ఎం.డి. డాక్టరువు. మీ తమ్ముళ్ళేం చదువుతున్నరు.”

“నా ఎన్క సోము. బి.ఇ. అయిపోయింది. ఎం.ఇ. కొఱకు దరఖాస్తు చేసిండు. రాజా బిఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరంల వున్నడు. బాలాజి ఇంటర్మిడియేట్ రెండో సంవత్సరంల ఉన్నడు. చెల్లె రమాలక్ష్మి పదోది చదువుతున్నది” జవాబిచ్చాడు రాము.

“చూసినవా! అందరు ఉన్నత విద్యావంతులైతున్నరు. ఇంక పది పన్నెండేండ్లల్ల మీ అందరి జీవన సరళి పూర్తిగ మారిపోతది. డాక్టర్సాబ్ ఇక్కడనె ఉంటె ఉన్నతి ఉంటుండె కావచ్చుగాని, ఈ నమూన ఉండక పోతుండే” వివరించాడు నర్సింగరావు.

“సర్ది చెప్పుకోవడంలో ఆనందముంటుందా మామయ్యా!” లోగొంతులో అడిగాడు రాము మేనమామని.

“ఏదీ మన చేతిలో ఉండదు. లేని దాని గురించి బాధ పడడం కన్నా ఉన్నదానితో తృప్తి పడడం వల్ల సుఖం సంతోషం వుంటాయి. ఈ సత్యాన్ని అంగీకరించడానికి నీ వయస్సొప్పుకోదు” చెప్పాడు సత్యమూర్తి.

స్థలమంతా తనివితీరా తిరిగివచ్చాక మళ్ళీ అందరూ జీపునెక్కారు. ఇప్పుడు జీపు వీరలక్ష్మి ఇంటిముందు ఆగింది. పెంకుటిల్లు నిర్వహణ అంతగా లేదు. శిథిలావస్థలో వున్నది. పశువుల శాలలో పశువులున్నాయి. ఓకాడికి గుడిసెనే గట్టిగ వున్నది. తాను వచ్చి జింకతోను, వీరలక్ష్మితోను ఆడుకున్న సందర్భాలు, వీరలక్ష్మి తనకు పలహారాలు పెట్టిన సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి రాముకి.

ఆవరణంతా తిరిగి చూశారందరూ.

ఓదేలు డ్రైవింగులో విహారయాత్ర పూర్తయింది. అందరూ బాల్రెడ్డి పటేలింటికి చేరుకున్నారు. “ఇవ్వాళ భోజనం మా ఇంట్ల” చెప్పాడు బాల్రెడ్డి.

పట్వారికేసి చూశారు రాము, సత్యమూర్తి. కానివ్వండి అంటూ మందహాసం చేశారు కులకర్ణి.

“అనుమానపడకుండ్రి. అంత శాకాహారమే. పట్వారిసాబ్ మీరు కూడ వీల్లెంబడి చెయ్యి కడిగితె సంతోషం.”

“అట్లనే కానియ్యి పటేలా!” అంగీకారం తెలిపాడు నర్సింగరావు కులకర్ణి.

కాళ్ళు చేతులు కడుక్కుని దీవానాఖానలో కూర్చున్నాందరూ.

“జాగలన్ని చూసిన్రు కద! ఇగో కాయితాలు. నిన్నటి దినం కాగితాలు ఇక్కడనె పెట్టిపొయినవు రాము. అట్ల కాదు తీస్కపో” అంటూ కాగితాలనందిచాడు పటేలు. రాము వాటిని అందుకుని జాగ్రత్తగా తన బ్యాగులో పెట్టుకొన్నాడు.

“వీరలక్ష్మికి రాము అంటే చాన ప్రేమ. అందుకే ఇల్లు, పొలం రాము పేరు మీద రాయుమన్నది. అమ్మకు కాయితాలు చూయిచ్చున్రి. విచారించున్రి. మీరెట్ల చెప్తే అట్లనే.

ఇంకొక ముఖ్యమైన విషయమున్నది. మీ నాయినకు దివ్యదృష్టి ఉంటుండె కావచ్చు. చూడకున్న గూడ అన్ని విషయాలను చూసొచ్చినట్లు చెప్తుండె. మీ ఇంట్ల దొంగలు పడ్డారు. సర్వం దోచుకపోయిన్రు. మీ నాయిన నాతోనన్నడు కదాంటె – ‘ఇరువై తులాల బంగారం, శేరున్నర వెండి దొంగలెత్తుకపోలె నీ ఇంట్లోనె వున్నయి. ఇమ్మన్న’డు. నేను నా దగ్గర లేవన్న. ‘నేన్చేసిన తప్పుకు జుర్మాన కింద ఉంచుకోపొమ్మ’న్నడు. వెండి బంగారాలు నిజంగ నా దగ్గర్నెవున్నయి. డాక్టర్సాబు మీది కోపంతోని నేను లెవ్వన్న. ఆయనకియ్యలే. వీరలక్ష్మి మల్ల నా దగ్గరి కొచ్చిందంటే కారణం డాక్టర్సాబే. నా కప్పుడనిపించింది కదాంటె నేన్తప్పుచేసిన” అంటూ లోపలికి వెళ్ళి వెండి బంగారాల మూటను తీసుకొచ్చి రాము చేతిలో పెట్టాడు బాల్రెడ్డి పటేలు.

రాము లేచి నుంచొని మళ్ళీ ఆ మూటను బాల్రెడ్డి చేతిలో పెడ్తూ చెప్పాడు. “బాల్రెడ్డి మామా! ఏ విషయమైన అమ్మతోని మాట్లాడినంకనే.”

బాల్రెడ్డి పటేల్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మూటను తీసుకెళ్ళి లోపల పెట్టి వచ్చాడు.

కులాసా కబుర్లతో భోజనాలైనాయి. వనజమ్మ దగ్గర వీడ్కోలైనాక అందరూ మళ్ళీ నర్సింగరావు కులకర్ణి ఇంటికి వెళ్ళారు. కసేపు కబుర్లైనాక జీపులో స్టేషను దాకా వచ్చి సత్యమూర్తిని రాముని రైలెక్కించారు ఓదేలు, బాల్రెడ్డి పటేలు.

కుటుంబ సభ్యులందరూ చర్చించుకున్నాక విషయాన్ని నర్సింగరావు కులకర్ణికి, బాల్రెడ్డి పటేల్‍కి తెలియచేశాడు రాము. ఈసారి రాము వెంట తమ్ముడు సోము వెళ్ళాడు జోడెడ్లపాలానికి.

వీరలక్ష్మి ఇంటికి మరమ్మత్తులు చేయించి దానిలో కుట్టుమిషను సెంటరు నిర్వహించాలని, ఆడవాళ్ళందరకూ ఉచితంగా కుట్టుపనులు నేర్పించాలని, పొలాన్నుండి వచ్చే ఆదాయంతో సెంటరు నిర్వహణకయ్యే ఖర్చును భరించాలని చెప్పారు. ఒక కుట్టు టీచరు నేర్పాటు చేయాలని, ఆవిడకు జీతం కూడ ఇవ్వాలని చెప్పారు. కుట్టు సెంటరును వీరలక్ష్మి పేరు మీదుగా నడపాలని సూచించారు.

ఇరవై గుంటలున్న తమ ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి ప్రైమరీహెల్తు సెంటరు నిర్వహించడానికివ్వాలని, ప్రభుత్వం నిర్మించనున్న భవనానికి డాక్టరు గారి పేరు పెట్టే నిబంధన మీద ఆ స్థలాన్నిస్తామని చెప్పారు. ఈ పనులన్నిటినీ బాల్రెడ్డి పటేలు, నర్సింగరావు కులకర్ణి గార్లు తమ భుజస్కంధాలపైన వేసుకొని నిర్వర్తించాలని అభ్యర్థించారు.

“బంగారు నగలు, వెండి వస్తువులు ఎప్పుడో పోయాయనుకున్నాం. ఇప్పుడక్కరలేదు. కాని ప్రతి నగ వెనుక నాకు సంబంధించిన ఒక జ్ఞాపకం ఉంది. కాబట్టి వాటికి డబ్బులు చెల్లించి కొనగలము అనుకుంటే కొనండి. లేకుంటే వదిలేయండి” అని కొడుకులకు చెప్పింది డాక్టరమ్మ.

డబ్బులు వద్దన్నాడు పటేలు. అయితే నగలు వద్దన్నాడు రాము. “రామూ! నగలకు ఇప్పటి ధర వేసి లెక్కకట్టడం అన్యాయం. అప్పటి ధర చొప్పున పైసలు తీసుకుంట. కనీసం అందుకైన ఒప్పుకోవయ్యా!” అంటూ బ్రతిమిలాడాడు బాల్రెడ్డి. ఒప్పుకొన్నాడు రాము. మూడు నెలల తర్వాత బాల్రెడ్డి పటేలు దిల్‌సుఖ్‌నగర్ లోని డాక్టరు గారింట్లో ప్రత్యక్షమయ్యాడు.

“అమ్మా! మీరు కాదనొద్దు. కోప్పడద్దు. మీరు నగల కొఱకిచ్చిన పైసలను ప్రభుత్వ హోమియోపతి కాలేజికి కట్టిన. దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం కాలేజి ఫస్టోచ్చే విద్యార్థికి గోల్డ్ మెడలును డాక్టర్సాబ్ పేరు మీద ఇస్తరు. ఇగో రశీదు” అంటూ రశీదును డాక్టరమ్మ చేతిలో పెట్టాడు బాల్రెడ్డి.

కళ్ళు చెమర్చాయి డాక్టరమ్మకు. “ఎంత మంచి మనసన్నయ్యా నీది” అంటూ నమస్కరించింది.

~

“శుభమస్తు! కథ అయిపోయిందర్రా” ప్రకటించాడు జనార్దనమూర్తి. వింటున్న ఎనమండుగురూ పెద్దగా చప్పట్లు కొట్టారు.

***

“థాంక్సన్నయ్యా! తెల్లారి పోతుందేమో అనుకున్నాను. నాలుగున్నర మాత్రమే అయింది. ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ఫ్రెష్, హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీ” అనౌన్సుమెంటులాగ చెప్పాడు రమణ. అందరూ మళ్ళీ ఒకసారి చప్పట్లు చరిచారు.

“అన్నయ్యా! పట్టు సడలకుండా, మమ్మల్ని కూచున్నచోటు నుండి కదలనీయకుండా కథను చెప్పావు. చాలా బాగుంది. కాని కథ మరీ ఐడియలిస్టిక్‍గా వుంది తప్ప నిజంగా జరిగినట్లు లేదు. లోకంలో ఇంత మంచి మనుషులుంటారా!” అనుమానం వ్యక్తం చేశాడు హిమాంశురాయ్. అవునన్నట్టుగా చూసింది స్వాతి.

“అనుమానమున్నవాళ్ళు జోడెడ్లపాలానికి వెళ్లి డాక్టరు గారి పేరు మీదున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని చూచుకోవచ్చు. వీరలక్ష్మి కుట్టు మిషన్ సెంటరు, వీరలక్ష్మీ మహిళా పునరావాస కేంద్రంగా మార్పుచెందింది. ఇప్పుడక్కడ రెండంతస్తుల భవనముంది. అక్కడి దాకా వెళ్ళే ఓపిక లేని వాళ్ళు హైదరాబాదులోని గవర్నమెంటు హోమియో కాలేజిలో డాక్టరు గారి పేరు మీద గోల్డ్ మెడల్ వుందో లేదో కనుక్కోవచ్చు. అదీ ఇదీ కాకపోతే హిమాయత్ నగర్ డాక్టర్ రామనాథం గారిని కలుసుకొని నేను చెప్పిన కథలోని నిజానిజాలు తెలుసుకోవచ్చును” వివరంగా చెప్పాడు జనార్దనమూర్తి.

“అవునా!” అందరూ నోరెళ్ళబెట్టారు ఆశ్చర్యంగా.

“సీనియర్ మోస్ట్ అండ్ ఫేమస్ జనరల్ ఫిజీషియన్ రామనాథం గారా!” అడిగాడు రాజీవ్.

“అవును. ఆయన అపాయింట్మెంటు దొరకడం కష్టమనుకొంటే ఆయన భార్య మమత, నర్సింగరావు కులకర్ణి గారి మనుమరాలు, ఆవిడనడగవచ్చు” చెప్పాడు జనార్దనమూర్తి.

“అంటే – రామనాథంగారు?” అడిగాడు సమ్మయ్య.

“కథలో రాము ఆయనే!” చెప్పాడు జనార్దనమూర్తి.

“అన్నయ్యా! దొరికిపోయావ్. మరి నువ్వు” అడిగాడు రమణ.

“రామూ మా మేనత్త కొడుకు. నేను సత్యమూర్తి గారి పెద్దబ్బాయిని” జవాబిచ్చాడు జనార్దనమూర్తి.

పెద్దపెట్టున చప్పట్లు కొట్టారందరూ. కాఫీ లొచ్చాయి. అందరూ వేడి వేడి కాఫీ రుచిని అనుభవిస్తూ చప్పరిస్తున్నారు.

“అన్నయ్యా! మా విడాకుల కేసును నా పక్షాన నేను ఉపసంహరించుకుంటున్నాను” అప్పటిదాక మౌనంగా ఉన్న సౌమ్య చెప్పింది.

నమ్మలేనట్లుగా సౌమ్య వంక చూశాడు సాకేత్. ‘నిజమే!’ కళ్ళతోనే సమాధానం చెప్పి తలదించుకొంది సౌమ్య.

“థాంక్యూ సౌమ్యా! జీవితాంతం నీకు ఋణపడి వుంటాను” గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేసి చెప్పాడు సాకేత్.

మళ్ళీ హాలు చప్పట్లతో దద్దరిల్లింది.

“అసలు అన్నయ్య చెప్పిన కథకు, మీరు విడాకులు వద్దనుకోవడానికి సంబంధమేంటి?” అడిగాడు సంజయ్.

“అరేయ్ నీకు పెళ్ళయిందా!” అడిగింది సౌమ్య.

“లేదు” జవాబిచ్చాడు సంజయ్.

“ఐతే నోర్మూస్కో” చెప్పింది సౌమ్య.

అందరూ నవ్వారు. చిన్నబుచ్చుకున్నా వెంటనే తేరుకొని నవ్వుల్లో శ్రుతి కలిపాడు సంజయ్.

“మేం బయల్దేరుతున్నాం. ఇంటికెళ్ళి తయారవ్వాలి. ఎనిమిదింటికల్లా మామా అడ్వకేట్ల ఇళ్ళల్లో మేం ఉంటేకాని, విడాకుల తీర్పుని నిలువరించలేం” హడావుడి పడుతూ బయల్దేరారు సౌమ్య సాకేత్లు.

“ఆల్ ది బెస్ట్. హార్దిక శుభాకాంక్షలు” సౌమ్య సాకేత్లకు షేక్ హ్యాండిచ్చాడు జనార్దనమూర్తి. మగవాళ్ళందరూ సాకేత్ను కౌగలించుకొని అభినందనలు చెప్పారు. స్వాతి సౌమ్యను కావలించుకొంది. ఇద్దరి కళ్ళల్లోంచి నీటిబొట్లు టపటపమని నేల రాలాయి. గమనించిన జనార్దనమూర్తి వారిద్దరినీ పొదవుకొని “పిచ్చిపిల్లల్లారా! అంతా మంచే జరుగుతుంది” అన్నాడు.

“రేపు సాయంత్రం ఇదే హోటల్, ఇదే స్థలంలో సౌమ్య సాకేత్ల రిమ్యారేజ్ పార్టి వుంటుంది. హోస్ట్ విల్ బి జనార్దనమూర్తి. ఈవెంట్ మేనేజర్ విల్ బి రమణ. అందరూ కుటుంబాలతో రావాలి. నేను కూడ మీ వదినని తీసుకొస్తున్నాను.” పెద్దగొంతుతో ప్రకటించాడు జనార్దనమూర్తి.

“ఫ్లోరు మారుతుంది. ఫోర్తు ఫ్లోర్ పేరంటం” మరింత గట్టిగా అరిచి చెప్పాడు రమణ.

“మరి నేను” బిక్కచచ్చిపోయి అడిగాడు సంజయ్.

“నువు సింగిల్ మెంబర్ ఫ్యామిలీ మై డియర్ బాయ్” చెప్పాడు జనార్దనమూర్తి గలగలా నవ్వుతూ.

ఆనందం ఉప్పతిల్లుతుంటే అందరూ తమ తమ ఇళ్ళకని పయనమయ్యారు.

శుభమస్తు

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here