ఎన్నికల విధుల యాత్ర

8
3

[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారి ‘ఎన్నికల విధుల యాత్ర’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నందరము ఎన్నో యాత్రలు చేస్తాము. వినోద, విజ్ఞాన విహార యాత్రలు ఇలా ఎన్నో ఎన్నెన్నో? రాజకీయ నాయకులు వివిధ రధాల మీద చేసే వివిధ యాత్రల గమ్యం ఓట్లను దండు కోవడానికే! వివిధ వృత్తి కళాకారులు, రచయితలు, సంస్కర్తలు మొదలయిన వారందరూ రకరాల యాత్రలు చేస్తారు – చేస్తున్నారు.

కానీ వారందరూ చేసే యాత్రలు మా యాత్రల ముందు బలాదూర్, మా యాత్రా గమ్యం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేటందుకు మా శాయశక్తులా ప్రయత్నం చేయడం. మా ప్రయత్నం సఫలమయితేనే రాజకీయ నాయకుల యాత్రలకు ఫలితం దక్కుతుంది. ఇంతకీ మా యీ యాత్ర ఏమంటారా? ‘విభిన్నమయిన యాత్ర – ఎన్నికల విధుల యాత్ర’. ఈ యాత్రలను ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చేస్తాం. మా యాత్రికులు సక్రమంగా పనిచేస్తేనే ఓట్లు పోలయి కౌంటింగ్ కేంద్రాలకు వెళతాయి. ఈ యాత్రలో మాకు చాలా బరువు బాధ్యతలుంటాయి. ఒక్కొక్కసారి ప్రాణాలకి తెగించవలసి వస్తుంది. ఎంతమంది ఎంత పనిచేసినా మేము ఈ యాత్రలో నిబద్ధతతో చేసిన పనే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు దోహదం చేస్తుంది.

మా అనుభవాలలో ఒకటి:

మేము పోలింగ్ ముందు రోజు ఉదయమే మాకు కేటాయించిన అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ మెటీరియల్ రిసీవింగ్ సెంటర్‍కు చేరుకున్నాము. షామియానా నీడలో కూడా ఎండవేడిమి భయంకరంగా ఉంది. ఒక ప్రక్క మైక్ హోరు. మా పోలింగ్ టీమ్‌ను కలసి పోలింగ్ కిట్‍ని తీసుకున్నాము.

పోలింగ్ కిట్:

2 బ్యాలెట్ యూనిట్ కేసులు, ప్లస్ 2 కంట్రోల్ యూనిట్ కేసులు, ప్లస్ పోలింగ్ కంపార్ట్మెంట్ అట్టలు ప్లస్ ఇతర ఫారాలు, కవర్లు, పోస్టర్లు, స్వస్తిక్ ముద్రలు, స్టాంపు ప్యాడ్స్, ప్యాడ్ ఇంక్ బాటిల్, ఇండెలిబుల్ ఇంక్ మొదలగువాటితో కూడిన సంచి వెరశి 6 శాల్తీలు మాత్రమే.

ఇ.వి.యం.లు చెక్ చేసుకోవాలి. చుట్టూ చూశాము. షామియానా కింద బల్లలు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. ఇ.వి.యం. లనేమో సమతలం మీద చెక్ చేయాలి. ఆ ఆఫీసు వరండాలో ఒక మూల చోటు (చే) చూసుకుని కూలబడి చెక్ చేసుకున్నాము. సుమారు మూడు నాలుగు వందల ఇ.వి.యంలు ఒకేసారి బీప్ శబ్దాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తి దద్దరిల్లుతోంది. హార్ట్ పేషంట్ల గుండె దడదడలాడటం ఖాయం ఈ హోరుకి.

భోజనం చేసి ఎన్నికల బస్సు ఎక్కమని మైక్‍లో పదేపదే చెప్తున్నారు. నాలుగు పోలింగ్ యంత్రాల సూట్‍కేసులు, అట్టలు, గోనెసంచులు, రెండురోజులకు సరిపడా మా స్నాక్స్, మంచినీళ్ళు, అన్నవస్త్రాలు గట్రా మా లగేజీ/అన్నింటినీ తలమీద, భుజంమీద నడుం మీద పెట్టుకుని/బ్యాగ్లు భుజాన వేలాడేసుకుని ఆపసోపాలు పడుతూ 1/2 కిలో మీటరు దూరం నడిచి బస్సుఎక్కాం.

సుమారు 60 మంది ఎక్కాలి – సీటింగ్ 36. 40 యూనిట్ కేసులు, 10 సంచులు, 10 సెట్ల అట్టలు, 60మందికి రెండు రోజుల లగేజి ఒక్కసారి ఆలోచించండి. మేము తప్పించి ఎవరు చేయగలరీ యాత్రలు?

కొంతమంది ఒంటికాలిమీద నిలబడవలసి వచ్చింది. ఎలాగో సర్దుకుని పోలింగ్ కేంద్రానికి చేరాము. అక్కడ అందుకునే వారెవరూ లేరు. అన్ని సామాన్లు మోసుకుని పోలింగ్ గది చేరాము. పాపం మాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది ప్రభుత్వము (పత్రికలలో) కానీ అక్కడ అవస్థాపనా సౌకర్యాల లేమి-తప్పదు కదా! ఏం చేస్తాం?

దగ్గరలో హోటల్ ఉంటే టీ తెచ్చిపెట్టమని అడిగాము. అక్కడ హోటల్ లేదని పక్క ఊరి నుంచి తెప్పించారు గంట తరువాత. మేము తీసుకుని వెళ్ళిన బిస్కెట్లు, బ్రెడ్, మంచినీళ్ళతో కాలక్షేపం చేశాం.

చల్లగాలిలో కొంచెం సేపు సేదతీరాము. కవర్లు, ఫారాలు సర్దుకుని లక్కతో సీళ్ళు వేసుకుని ముప్పాతిక శాతం పని పూర్తి చేసుకున్నాము.

బస్ కుదుపులకు ఇ.వి.యం.లు ఏమైనా బెదిరాయేమోనని పరిశీలించుకున్నాము. ఈ లోగా రాజకీయ పార్టీలు వారు వచ్చారు. మాక్ పోలింగ్ చేయించాము. ఫర్వాలేదు పోలింగ్ మిషన్ కరెక్ట్ గానే ఉందని సర్టిఫికెట్ యిచ్చి సంతృప్తితో మరలారు వారు.

ఆ రాత్రి మగవారు ఆరుబయట బల్లలు వేసుకుని పడుకున్నారు. మహిళలం నలుగురం వున్నాము. గదిలో మా దుప్పట్లు నేల మీద పరచుకుని నడుము వాల్చాము. జిల్లాలో నాలుగుమూలల నుంచి వచ్చిన మేమందరము కలసి ఈ రెండు రోజులు సమన్వయంతో పనిచేయవలసి ఉండటం భలే విచిత్రంగా వుందనిపించింది. కబుర్లు చెప్పుకుంటూ కళ్లు మూసుకున్నాం. ఒక పట్టాన నిద్రపట్టలేదు. నిద్రపట్టిన వెంటనే భళ్ళున తెల్లవారింది. అక్కడ బాత్‍రూమ్‍లు లేవు. బడి దగ్గరిలోని ఒకరింటికి వెళ్ళి ఫ్రెషప్ అయి ఆరోగంటకల్లా పోలింగ్ స్టేషన్‍కి వచ్చేశాము. పాపం ఆ యింటివారు ‘ఈ ఊళ్ళో హోటల్ కూడా లేదమ్మా! ఏం తిప్పలు పడతారో’ అనుకుంటూ కాఫీ, టిఫెన్ పెట్టి పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. (ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే ఆ యింటి వాళ్ళ అమ్మాయి కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిందట. మేము మిమ్మల్ని చూస్తే మా అమ్మాయిని ఆ వూరి వాళ్ళు బాగా చూస్తారు. అని వాళ్ళ ఆశ. ఈ లాజిక్కే మాకు వుపయోగపడింది.)

పోలింగ్ ఏజంట్లు వచ్చేశారు. ఇ.వి.యం.లు సీలు రడీ చేశాము. మాక్ పోల్ చేసి చూపించాము. మాస్ కౌంటింగ్‍తో సహా. (C.R.C. – Close, Results, Clear) చేసి, ఇ.వి.యం.లలో ఓట్లు లేవని ధృవపరచిన తరువాత సీలు చేశాము.

పోలింగ్ మొదలయింది. క్యూ త్వరగా కదలడానికి అక్షరాస్యులతో కూడా వేలిముద్రలు వేయించే ప్రయత్నం చేశాము. ఎందుకంటే 1000 ఓట్లు అంటే అసెంబ్లీ + లోక్‌సభ కలిపి 2000 ఓట్లు పోల్ చేయించాలి. సమయాభావం గురించి చెబితే వేలిముద్రలు వేసి సహకరించారు.

బ్యాలెట్ పేపర్లు లేని తొలి ఎలక్షన్ కావడం/ఇ.వి.యం.ల గురించి సరయిన శిక్షణ ఓటర్లకు ఇవ్వకపోవడం/మాకు యిబ్బందయింది. అయినా ఆ యిబ్బందులను అధిగమించి పోలింగ్ చేయించాం.

ఒక్కో ఓటరు తీరు ఒక్కో విధంగా నవ్వు తెప్పించింది. కంపార్ట్మెంట్లోనే నిలబడి ఓటు ఎట్లా ఎయ్యాలా అన్నట్లు గెడ్డంకింద చెయ్యిపెట్టుకుని వింతగా చూసే ఒకామె /”స్విచ్ ఎక్కడుందమ్మా?” గోడపై వెతికే పెద్దాయన/ఓటింగ్ స్లిప్‍ని ఏ యంత్రంలో దాయాలో వెతికే అవ్వ/ఎక్కడ నొక్కాలమ్మా? అంటే ‘బట్టలుతికే సబ్బులాగా నీలిరంగుల వామన గుంటల్లా వుంటాయి చూడమ్మా’ అని చెప్పిన మా సహపోలింగ్ అధికారి.

అప్పుడప్పుడే టెండర్డ్ ఓట్లు, ఛాలెంజ్ ఓట్లు అంటూ గొడవ చేసిన ఎన్నికల ఏజంట్లు మేము వాటిని గురించి వివరించిన తర్వాత అర్ధం చేసుకుని సహకరించారు. ఓటర్ల గోల గందరగోళం.. వాటిని నివారించడానికి మేము పడేపాట్లు..5 గంటలకు పోలింగ్ కేంద్రం ఆవరణలో వున్నవారికి (150మందికి) స్లిప్పులు యిచ్చి సాయంకాలం గం. 6-35 ని॥ల వరకు పోలింగ్ జరిపాము.

అంతకు ముందున్న అనుభవంతో కవర్లు ముందుగా తయారు చేసి సీల్ చేశాము. ఎట్టకేలకి గం.8-00లకు బస్ రాగానే రెడీగా వున్న పోలింగ్ కిట్ కేసులన్నీ సర్దేసి రాత్రి గం.12-30ని॥లకు మా పార్లమెంటు హెడ్ క్వార్టర్స్ చేరాం. అక్కడా మోతగాళ్లం మేమే! అన్ని మోసుకుని అంతకు ముందే అక్కడకు చేరిన మా వాళ్ళతో క్యూలో నిలబడ్డాం. మా వెనుక వచ్చిన వాళ్ళ తోపులాటలో మా ప్రమేయం లేకుండానే ముందు వెనకలకు నెట్టబడి ఆ తోపులాటకు గురికాకుండా ఇ.వి.యం. కేసులను కాపాడి కౌంటర్లో అప్పజెప్పి ‘హమ్మయ్య’ అనుకున్నాము. అప్పగించిన తర్వాత మెటీరియల్ ఫారమ్‍తో పాటు అధికారులిచ్చిన భోజనం టోకెన్ తీసుకుని భోజనశాలకి వెళ్ళాము. అక్కడ సప్లయర్ పెరుగన్నం బేసిన్లో నీళ్ళు పోసి గరిటెతో కలుపుతున్నారు. “అదేమిటీ బాబూ?” అని అడిగితే పెరుగయిపోయిందని జవాబు. ఏదో ఫ్రైడ్ రైస్ అని పెట్టిన మాడు చెక్కలతో కడువు నింపుకున్నాము. మా తరువాత బస్ దిగిన సోదరీసోదరులకు అదీ మిగలలేదు.

అనుభవం లేని కొందరు ఫారాలు కవర్లు ఎలా పూర్తి చెయ్యాలో తెలియనివారు/తెలిసినా కంగారులో చేయలేక వచ్చినవారు ఎవరిగోల వారిదిగా నేలమీద కూర్చుని వాటిని పరిచి సర్దుకుంటున్నారు. స్నేహితులు వచ్చి వారికి సాయం చేసి పని ముగించేట్టు చేశారు. ఇంటికి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు లేవు. కొంతమంది నేలమీద దుప్పట్లు పరుచుకుని నడుము వాల్చారు. తెల్లవారు ఝామున మూడుగంటలు, నాలుగు గంటలకు దూరపు పోలింగ్ స్టేషన్ నుండి పోలింగ్ సిబ్బంది బస్సులు దిగారు.

ఇంతలో ‘అమ్మా’ అని అరుపు వినిపించి అటు పరుగులు పెట్టాము. ఒక మేడమ్ ఎగుడుదిగుడుగా ఉన్న ప్రదేశంలో కాలు స్లిప్ అయి పడిపోయారు. ముగ్గురు నలుగురు ఊతమిచ్చినా నడవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ విషయం అక్కడి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా స్పందన లేదు. ఆ ఊరిలో తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి కారు తెప్పించి ఆమెను అందులో పడుకోబెట్టి వాళ్ళ ఊరు చేర్చాము. ఆమెకు కాలు ఫ్రాక్చరయి ఆరు వారాల కట్టు మిగిలింది.. ఇంకా ఎన్నో అనుభవాలు యిటువంటివి. కొసమెరుపు ఏమిటంటే ఆ రోజు ఉదయము 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‍కి కూడా వెళ్ళాము.

చూశారా! మా ఎన్నికల విధుల యాత్రలో ఎన్ని అనుభవాలు, అనుభూతులు, ప్రయాణాలు, మజిలీలు? పోలింగ్ సమయంలో ఇ.వి.యం.లు మొరాయిస్తాయేమోనని టెన్షన్. వాటి జోలికి ఎవరయినా వస్తారేమోనని భయం. పోలింగ్ ఏజంట్లు, ఓటర్లు, అభ్యర్థులు తెలిసీ తెలియక మమ్మల్ని పెట్టే టెన్షన్లు – వెరశి పోలింగ్ అనంతరం మెటీరియల్ అప్పజెప్పేవరకు టెన్షన్ – ఆ సమస్యలు తలచుకుంటే వాటిని అధిగమించామనుకుంటే థ్రిల్!

ఇప్పటికయినా ఒప్పుకుంటారా? మన దేశంలో పోలింగ్ అధికారుల రెండుమూడు రోజుల యాత్రాఫలమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుందని. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమయిన భారతదేశంలో పలు విడతలుగా మైదానాలు, కొండలు, కోనలు, దీవులలోని పోలింగ్ స్టేషన్లకి రకరకాలుగా ప్రయాణ సాధనాలతో పోలింగ్ సిబ్బందిని చేరవేసి రిటర్నింగ్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, మెటీరియల్ రిసీవింగ్ ఆఫీసర్లు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ‘పోలింగ్ అధికారుల యాత్రా! జిందాబాద్’ అనిపించడం లేదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here