తల్లివి నీవే తండ్రివి నీవే!-30

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

సర్వం విష్ణుమయం జగత్ – 1

తతో హి దుర్మనా రామః

శ్రుత్వైవం వదతాం గిరః।

దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా

బాష్పవ్యాకులలోచనః॥

(బ్రహ్మకృత రామ స్తోత్రం – 1)

సూర్యేన్దు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి

స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః।

త్వద్దాసదాస చరమావధి దాసదాసాః

శ్రీ వేఙ్కటాచలపతే తవ సుప్రభాతమ్॥

(శ్రీవేఙ్కటేశ్వర సుప్రభాతం – 18)

సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు, భౌమ అనగా భూమిజుడు అంగారకుడు, బుధుడు, వాక్పతి అయిన బృహస్పతి, శుక్రుడు, సౌరి అనగా శని, స్వర్భాను అనగా రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాసానుదాసులకు, దాసులకు దాసులకు దాసులకు దాసులైయున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః।

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః॥

26. సర్వః

ద్వైత పరంగా..

వాచ్యతయా వేదాఖ్యరవసహితత్వాత్ సర్వః = వేదము అనే పేరుగల శబ్దముతో కూడిన వాడు. వేదవాఙ్మయ శబ్దములచే ప్రతిపాదింపబడిన వాడు.

సర్వ వ్యాపిత్వాత్ వా = సమస్త సృష్టి యందు వ్యాపించిన వాడు. సర్వం సమాప్నోషి తతోషి సర్వః అని గీతా వాక్యము.

సర్వస్రస్టృత్వాది నిమిత్తేన సర్వశబ్దవాచ్యః – జగతి యొక్క సృష్టి, స్థితి, లయ, సంహార, నియమన, ఙ్ఞాన అఙ్ఞానములకు యథాయోగ్యముగా కారణమైనవాడు కనుక సర్వ అనే నామముచే పిలువబడుతున్నాడు.

స్రస్టా పాతా చ సంహర్తా నియన్తా చ ప్రకాశితా।

యతః సర్వస్య తేనాఽహం సర్వోఽస్సీత్సృషిభిః స్తుతః॥

సృష్టి, పోషణ, నాశన, నియామకములను ప్రకటించువాడగుటచే ఋషులు నన్న సర్వ శబ్దముతో పిలుచుచున్నారు అని గీతాచార్యుడు తెలిపాడు.

అద్వైతం ఈ విధంగా తెలుపుతుంది..

సర్వమూ తానే, సకలమూ తానే అయి ఉన్నాడు కనుక సర్వః అనేది ఆ దేవాది దేవునికి ఒప్పు నామము. సకల చరాచర, గోచరాగోచరములన్నియు ఆయనయందే సృష్టింపబడి, స్థిత్వమును కలిగి, చివరకు ఆయనలోకే ఉపసంహరణకు గురి అవుతున్నాయి. కనుక ఆయన సర్వుడు.

భగవద్గీతలో అర్జున ఉవాచ!

నమః పురస్తాదథ పృష్ఠతస్తే

నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ।

అనంతవీర్యామితవిక్రమస్త్వం

సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ॥11.40॥

అనంతమైన శక్తిసామర్థ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి, వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే.

ఒకసారి ప్రహ్లాద చరిత్ర గుర్తు తెచ్చుకోండి. సర్వము తానే, సర్వత్రా తానే. అందుచేతనే ఆయన ఆ క్షణాన హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో మోదినప్పుడు ఆ క్షణాన్నే అక్కడే అలాగే ఉద్భవించాడు నృసింహ రూపుడిగా. ఆయన సర్వః కనుకనే ప్రహ్లాదుని రక్షించగలిగాడు.

సుదర్శన వ్యాఖ్య ప్రకారం..

అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవ్యాప్యయాత్।

సర్వస్య సర్వదా ఙ్ఞానాత్ సర్వమేవం ప్రచక్షసే॥

నిత్యత్వ భ్రాంతి కలిగిన పదార్థములన్నిటి ఉత్పత్తికి, నాశనానికి కారణమైన వాడు. అలాగే అనిత్యములంటే అనిత్యనిర్ధారణ కలిగినవి.

అలాగే సర్వము ఎరిగిన వాడు సర్వుడు.

తన భక్తులయందు ప్రేమతో ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలో అలా దర్సనమివ్వగలిగిన వాడు, సర్వవిభూతులను చూడగలిగిన వాడు సర్వః (విశిష్టాద్వైతము).

పరాశర భట్టర్ ఇంకా ఇలా సెలవిస్తారు..

దేనినీ అపేక్షించక, అలా అని ఉపేక్షించక సకలమును స్వ గా భావించి అన్నిటియంది ఉండి ఆదరించువాడు సర్వుడు.

26. శర్వః

పరాశరభట్టర్ వ్యాఖ్యను అనుసరించి..

అశుభం శృణాతి హింసతీతి శర్వః. అంటే తనకు శరీరభూతములగు ప్రాణులకు అనిష్టమయిన వాటిని నశింపజేయువాడు శర్వుడు.

జీవులకు కష్టమును కలిగించు వాటిని సంహరించి వాటికి మేలు చేయువాడు శర్వుడు. ద్వైతాద్వైతమ్.

ఇలా సంహరించుట వలన ఆయన అపరిశుద్ధుడు అవుతాడా అని అనుమానం మనకు రాకుండా భీష్మాచార్యుడు ఇలా సెలవిస్తారు.

అన్నిటికి, అందరికి పరమోపాయంగా శ్రీవిష్ణు సహస్రనామమును అందించిన గాంగేయుడు అంతకు మునుపు రెండు విధములైన శివ సహస్రనామములు అందించాడు.

శివుడు మంగళకారుడు. ఆయనను లయకారునిగా చెప్పారు. లయకారకుడైన ఆయన అపరిశుద్ధుడు కాలేడు. అట్లే శ్రీమహావిష్ణువు కూడా అపరిశుద్ధుడు కాడు.

ఆ సామ్యమును తెలుపుతూ భీష్ముడు ఆ శ్రీమన్నారాయణుని శివః అని స్తుతించటమే కాదు, నిజానికి శివ సహస్రనామములను ఆ జనార్దనుని ఉద్దేశ్యించే చెప్పాడు.

ఏ క్షణాన అయితే సర్వః తరువాత శివః అని శాంతనవుడు అన్నాడో ఆ క్షణానే గంగ అక్కడ తనను తాను ప్రకటించుకుని, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను సేవించి (కడిగి) పునీతమైనది.

ఆ సర్వుడే శివుడు. ఈశ్వరుడు. శ్రీమన్నారాయణుడు. ఆ శివత్వము వల్లనే ఆయన శ్రీమాన్ కూడా కాగలిగాడు. అంతటి మంగళకరమైన రూపమునే నారసింహావతారమున చూపాడు.

27. శివః

శేరతే తే అస్మిన్ ఇతి శివః – సకల జీవాజీవములకు శుభమునిచ్చువాడు శివుడు.

శాశ్వతగ్0 శివమచ్యుతమ్॥ – మన్త్రపుష్పమ్

శాశ్వతమైనది, మంగళకరమైనది, తొలగనిది.

స్మృతే సకలకల్యాణభాజనమ్ = వానిని తలచినంతనే మనము సకలకల్యాణములకు పాత్రులము అవుతాము.

మఙ్గళమ్ భగవాన్ విష్ణుః॥ – సర్వత్ర వ్యాపించిన వాడు షాడ్గుణ్యపరిపూర్ణుడై ఒక రూపు సంతరించుకుంటే ఆ స్వరూపము సకల శుభలక్షణములు కలిగి ఉంటుంది. నారసింహుని వలె.

॥మఙ్గళాయ తనం హరిః॥ – శుభాలకు నెలవైన వాడు హరి.

ఎందుకు? నిత్యానపాయని అయిన శ్రీమహాలక్ష్మి ఆయన హృదయస్థానమున కొలువైయున్నది. ఆమె ఆయనను విడిచి ఉండదు. అంశావతారములను ప్రక్కన పెడితే, శ్రీమన్నారాయణుడు సంపూర్ణావతారములు దాల్చినపుడు ఆ తల్లి మనను అనుగ్రహించేందుకు సీతగా, రుక్మిణిగా ఆయన వెంటనే వచ్చింది.

మానవుడిగా చెలామణి అయిన రామావతారములో స్వామియే అమ్మను తన శౌర్యమును ప్రదర్శించి తనదానిగా చేసుకున్నాడు. అదే స్వయం భగవానుడిగా ప్రకటితమైన కృష్ణావతారములో రుక్మిణీదేవియే స్వామికి లేఖ రాసి మరీ తన ప్రేమను తెలిపి మరీ వివాహమాడింది. వచ్చి తనను తీసుకుని వెళ్ళమని కబురంపింది. అందుకే

ఈశ్వరుడు (శ్రీమహావిష్ణువు) శ్రీకృష్ణావతారంలో సౌలభ్యానికి పరాకాష్టగా నిలిచాడు. అందుకే భాగవతులు ఎక్కువగా శ్రీకృష్ణ రూపములోనే శ్రీమన్నారాయణుని ఎక్కువగా తలుస్తారు.

ఇక తిరుమళిశై ఆళ్వార్ తెలిపిన విధంగా (సృష్టిక్రమం)

వటపత్రశాయి నుంచీ హిరణ్యగర్భుడైన బ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచీ శంకరుడు ఉద్భవించారు. ఆయన నుంచీ వారుద్భవించారు కనుక వారును ఆయన శుభ లక్షణములనే పుణికి పుచ్చుకున్నారు. ప్రత్యేకించి భూమండలము మీద హిమాలయములలో ఉన్న కైలాసమును తన నివాసముగా చేసుకుని సకల మర్త్యులకు శుభములు కలిగిస్తున్నాడు కనుక ఆ శంకరుడు కూడా శివుడైనాడు. ఆ శివుని ఉనికికి కారణమైనవాడు కనుక నారాయణుడు శివః అనే శబ్దముచే కొలువబడుతున్నాడు – వైష్ణవము

నిరంతర రామ నామ స్మరణ చేసే ఈ శివుడు పరమభాగవతోత్తముడు. భాగవతాగ్రగణ్యుడు

శ్రీహరి తనను దూషించినా సహిస్తాడు కానీ, భాగవత దూషణ చేస్తే అస్సలు సహించడు. అట్లే భాగవతాపచారం చేసిన వారిని గురువులు కూడా గర్హిస్తారు.

కనుక వైష్ణవులకు శివుడు భాగవతోత్తముడు. శివాపచారము ఏ విధముగనైనను తగదు.

లేదా శంకరుడు పరబ్రహ్మ అని తీసుకుంటే ఆయనే శివుడవుతాడు. శుభాలను ఇస్తాడు – శైవము

శివస్య హృదయం విష్ణుః – మంగళకరమైన వాని హృదయములో విష్ణవు కొలువై ఉంటాడు. కనుక శైవులకు విష్ణు దూషణ తగదు. అందుకే క్రిమికంఠ చోళునికి శిక్ష పడినా శంకరుడు ఆనందించాడు.

శివ అన్న నామము అమ్మవారికి కూడా ఒప్పుతుంది. ఎందుకంటే ఆవిడ సర్వమంగళ. అటు లక్ష్మీదేవి అయినా, ఇటు పార్వతి అయినా మంగళములు కలిగించు శక్తులే – శాక్తేయము

సూర్యుడు రాని లేదా కనపడని దినాన్ని అమంగళకరమైనవిగా భావిస్తారు. సూర్యరశ్మి వల్లే సకల జీవులు తమ ఆహార విహారాదులను కావింపగలుగుతున్నాయి. అంటే ఆయన లేని సమయము అశుభమైనది. ఆయన రాక శుభప్రదం. అందుకే సూర్యుడు కూడా శివః అనే నామమునకు తగిన వాడే – సౌరము

అన్ని విఘ్నములు తొలగిస్తే మిగిలేది శుభాలే. ఆ విఘ్నాల్ని తొలగించే వినాయకుడు లేదా గణపతి సకల శుభాలకు అధినేత. అందుకే ఆయన కూడా శివుడే – గాణాపత్యము

తారకాసుర సంహారము ద్వారా దేవతలకు శుభమును చేకూర్చిన వాడైన కుమారస్వామి కూడా శివః అనే నామమునకు ఒప్పుతున్నాడు – స్కాందము.

ఈ విధముగా ఈ నామమును ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించి, స్థిరపరిచిన షణ్మతములకు అన్వయించుకొనవచ్చు.

అనిష్టములను నివారించి (శర్వః) అందరికీ శుభాలను కలిగించును కనుక శివః అని సత్యసంధ తీర్థులు ద్వైత వ్యాఖ్యనందించారు. ఇంకా వారు ఇలా అంటారు.

శివమ్ మంగళమ్ అస్యాస్తీతి శివః = మంగళకరమైన గుణములు కలిగిన వాడు.

శివయతీతి వా – శుభ ఫలితాలను ఇచ్చేవాడు.

శం – సుఖం ఏషమస్తీతి శివాః – ముక్తాః తానే వర్తయతీతి వా = ఎవరియందు సుఖము కలదో వారు శివులు. అనగా ముక్తులు. ఆ ముక్తులకు పరమగతి అయిన వాడు కూడా శివుడే. విష్ణువు (ముక్తానాం పరమాగతిః)

అద్వైతం ప్రకారం..

సకల దేవతల యందు వారి కల్యాణ గుణముల రూపంలో వసిస్తాడు కనుక శ్రీహరి శివుడు.

సత్వ రజస్తమో గుణములకు అతీతుడై ఉండు వాడు శివః అని కీర్తింపబడ్డాడు.

వ్యక్తి చలనమునకు త్రిగుణములే ప్రేరణగా ఉంటాయి. నిస్త్రైగుణ్యుడైన వాడు శివుడు. అలాంటి వాడైన ఆ శ్రీహరి చలించడు. దేనినైనా సమముగా స్వీకరిస్తాడు. స్థిరంగా ఉంటాడు. అందుకే శ్రీమన్నారాయణుడే పరదేవత అని భృగుమహర్షి నిరూపించాడు.

అలా స్థిరంగా ఉండే వాడే..

28. స్థాణుః

అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యోష్యశోష్య ఏవ చ।

నిత్యః సర్వగతః స్థాణురచలోథ్యం సనాతనః ॥2.24॥ – భగవద్గీత

ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది, దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును, ఎండించుటకు సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.

మరి అలాంటి ఆత్మలకు మూలస్థానం అయినవాడు, వాటి గమ్యమైన వాడు శ్రీమహావిష్ణువు. అందుకే ఆయన స్థాణుః.

సర్వః అంటే అంతటా ఆయనే ఉంటాడు. అన్నిచోట్లా ఉన్నవాడు ఎక్కడికి కదులుతాడు? స్థిరంగా ఉంటాడు. మనకు అలా గోచరమౌతాడు. అందుకే ఆయన స్థాణుః.

॥స్థిరత్వాస్థాణుః॥ – స్థిరమై, సుస్థిరమై మనగలుగుతున్నాడు కనుకనే ఆయన స్థాణుః అని కీర్తింపబడుతున్నాడు.

అయితే ఒక ప్రశ్న! భగవానుడు చలనము లేని వాడైతే ఈ సృష్టి అచరము సరే.. చరము ఎలా అవుతున్నది? అంటే ఎలా చరిస్తున్నది? ఎందుకంటే విష్ణుః అన్న నామము ద్వారా వ్యాపకత్వము తెలుస్తున్నది కదా. అంటే చరము (expansion of the universe).

దానికి సమాధానమే ముందు రాబోవు నామములు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here