The Roundup: సంచలనం సృష్టిస్తున్న కొరియన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల సీరీస్

0
4

[సంచిక పాఠకుల కోసం ‘The Roundup: సంచలనం సృష్టిస్తున్న కొరియన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల సీరీస్’ విశ్లేషణని అందిస్తున్నారు వేదాల గీతాచార్య.]

2017లో కొరియన్ సినిమాలో ఒక చిన్న సంచలనం రేగింది. అదేమిటంటే The Outlaws అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా విడుదల అయింది. దానిలో ప్రధాన పాత్ర పోషించింది అంతర్జాతీయంగా Don Lee అనే పేరుతో పరిచయమైన యాక్షన్ హీరో Ma Dong-seok (అసలు పేరు Lee Dong-seok ఈ డాంగ్-స్యుక్). కాస్త మార్వెల్ సినిమాలు చూసే జనాలు అతను Eternals లో గిల్గమేష్ పాత్ర వేశాడు.

5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 96 కిలోల బరువుతో ఉండే ఈ భారీకాయుడు యాక్షన్ సినిమాలకు చిరునామాగా మారిపోయాడు. 2016లో Train to Busan అనే జాంబీ త్రిల్లర్‌తో విపరీతమైన పేరు తెచ్చుకున్న ఇతడు కొరియన్ Vin Diesel గా అభిమానుల్లో గుర్తింపు పొందాడు. కాకపోతే ఇతనిది గుండు కాదు. కరోనా దెబ్బకు కుదేలైన కొరియన్ సినిమాను The Medium అనే హారర్ సినిమా ఎలా లైన్ లోకి తెచ్చిందో సంచిక పాఠకులు కొరియానంలో చదివే ఉంటారు (ఆ ముగ్గురు రీడర్స్‌లో మీరు ఉండి ఉంటే). ఆ తరువాత మన పార్క్ చాన్-వుక్ తీసిన Decision to Leave బాక్సాఫీసుకు మరింత ఊపిరి పోయటమే కాకుండా దాదాపు ఆస్కార్‌కు నామినేట్ అయినంత పని చేసింది. ఫైనల్ లిస్ట్‌లో ఈ సినిమా లేకపోవటాన్ని చాలామంది విమర్శకులు, సినీ అభిమానులు తప్పుపట్టారు. కానీ సరైన Blockbuster రాలేదు చాలా కాలం.

అలాంటి సమయంలో The Outlaw కు సీక్వెల్‌గా వచ్చిన The Roundup (కొరియానంలో ఈ సినిమా గురించి కొద్దిగా ఉంది) వంద మిలియన్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. దాదాపు 13 మిలియన్ల టికెట్లు తెగగా (9 మిలియన్ల యునిక్ ఆడియన్స్ – కొరియా జనాభా 60 మిలియన్ల), సినిమాలో ఇతను పోషించిన Ma Seok-do అనే పాత్ర పాప్ కల్చరల్ phenomenon గా మారిపోయింది. మీమ్ పేజీలకెక్కింది. పేండమిక్ తరువాత అతి పెద్ద హిట్ అయిన కొరియన్ సినిమాగా గుర్తింపు పొందింది.

దీనికి కొనసాగింపుగా వచ్చిన The Roundup: No Way Out మంచి విజయాన్ని నమోదు చేసినా ముందు భాగమంత వసూళ్ళు దక్కలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇదొక్కటే గత సంవత్సరం కొరియన్ సినిమాలో సరైన హిట్.

ఇక ఈ సంవత్సరం The Roundup: Punishment నాలుగో భాగంగా విడుదల అయింది మొన్న April 24న. ఫిబ్రవరిలో వచ్చి దుమ్ము దులిపిన చోయ్ మిన్-సిక్ సినిమా Exhuma రికార్డులు సవరించకపోయినా, విమర్శకులు ప్రశంసలతో పాటూ కలెక్షన్లు కూడా గట్టిగానే రాబడుతోంది. ఒక మాదిరి బజట్‌తో టైట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ The Roundup సినిమాలు క్రైమ్ త్రిల్లర్లలో కొత్త ప్రభంజనం.

సోల్ (Seoul) నగర సరిహద్దు ప్రాంతం అయిన Gong-dong లో విపరీతమైన క్రైమ్ జరుగుతుంటుంది. దానికి కేంద్రస్థానంలో ఉండేది చైనాకు చెందిన జాంగ్-చెన్. నేరాలు అదుపులో పెట్టేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలం కావటంతో ఇక డిటెక్టివ్ Ma Seok-do రంగంలోకి దిగుతాడు. తీగ సాగితే డొంకంతా కదులుతుంది. లోన్ షార్క్ గా జాంగ్ చెన్ తను చేసే పనులను కొరియా-చైనా గ్యాంగుల మధ్య యుద్ధంలా చిత్రిస్తుంటాడు. అతని పని మన మా గారు ఎలా పడతారు అనేది The Outlaws కథ. సరికొత్త ప్రజంటేషన్‌తో వచ్చిన ఈ సినిమా కుర్రకారుకు విపరీతంగా నచ్చేసింది. డిటెక్టివ్ మా కాస్తా ఫ్యాన్ favorite అయిపోయాడు.

దీంతో సీక్వెల్ కావాలని నిర్మాతల మీద ఒత్తిడి వచ్చింది. Perfect crime action drama కు సీక్వెల్ నేను తీయను అని దర్శకుడు Kang Yoon-sung తప్పుకోవటంతో మొదటి సినిమాకు సహాయ దర్శకుడిగా చేసిన Lee Sang-yong (ఈ శాంగ్-యాంగ్) బాధ్యతలు నెరిపాడు. అసలే పేండమిక్ వల్ల రెండేళ్ళ సరైన సినిమాలు లేక ఆకలి మీద ఉన్న కొరియన్ యువత (The Medium, Decision to Leave  ఊర మాస్ సినిమాలు కావు కదా) ఎగబడి చూడటంతో The Admiral: Roaring Currents, Extreme Job ల తరువాత కొరియన్ సినిమా చరిత్రలో మూడో అతిపెద్ద హిట్‌గా మారి సంచలనం సృష్టించింది The Roundup. నటుడు Ma Dong-seok కొరియాలో సరికొత్త superstar గా ఎదిగాడు. తనదైన పెక్యూలియర్ శైలిలో నటించే ఈ భారీకాయుడు కొత్తతరహా హీరోయిజమ్ చూపాడు. వియత్నామ్ రాజధాని Ho Chi Minh city లో కొరియన్ టూరిస్టులను చంపుతున్న సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవటం ప్రధాన కథ.

దెబ్బకు ఈ సీరీస్ ను ఒక ఫ్రాంచైజ్‌గా మార్చేశారు. డిటెక్టివ్ మా ప్రేక్షకుల మమకారం పొందాడు. దాంతో 2023లో మూడవ సినిమా The Roundup: No Way Out వచ్చింది. ఇందులో మన మా గారు Hiper అనే పేరుతో సర్క్యులేషన్ లోకి వచ్చిన కొత్తరకం డ్రగ్‌ను ఎవరు తయారు చేసి distribute చేస్తున్నారు అన్నది ఛేదిస్తాడు. దీని వెనుక యకూజా (అక్కడి మాఫియా), తమ డిపార్టుమెంటుకే చెందిన ఆఫీసర్ జూ సుంగ్-చ్యోల్ ఉన్నారని తెలుస్తుంది. ఆ సంఘర్షణ బాగా పండటంతో సినిమా బాగా ప్రశంసలు పొందింది. కాకపోతే ఎంత నచ్చిన పాత్ర అయినా వెంట వెంటనే చూడాలంటే మొహం మొత్తుతుంది కదా అందుకే ఈ భాగం కమర్షియల్గా కూడా సక్సెస్ అయినా రెండవ సినిమా అంత ఆడలేదు.
అయినా వెరవకుండా నాలుగో సినిమా The Roundup: Punishment వదిలారు. నిరుడంతా ఎక్కువ కమర్షియల్ సినిమాలు రాకపోవడంతో ఈ సంవత్సరం మొదట్లో Exhuma (Choi Min-sik in a crowd pleasing commercial role after a long time), ఇప్పుడు నాల్గవ రౌండప్ బాగా ఆడాయి.
కొరియన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ బేక్ చాంగ్-గి ఫిలిప్పీన్స్‌లో ఒక పెద్ద ఆన్లైన్ గేంబ్లింగ్ యూనిట్ పెడతాడు. అక్కడ తనకు అడ్డు తగులుతున్నాడని జో సుంగ్-జే ను చంపుతాడు. ఆ గేంబ్లింగ్ యూనిట్ వెనుక ఉన్న చాంగ్ డాంగ్-చ్యోల్ బేక్ ను తమ రైవల్ ఆర్గనైజేషన్ ను లేపేస్తే ఇచ్చే వాటా పెంచుతాను అని వాగ్దానం చేస్తాడు. దాంతో ఆ రైవల్స్ అందరికీ ఫ్రీ గా పై లోకాలకు టికెట్ కొని పంపిస్తాడు. అంత పుణ్య కార్యం చేసినా చాంగ్, బేక్ కు ఇచ్చిన మాట తప్పుతాడు. మనకు తెలిసిన విధంగానే వారిద్దరి మధ్యా గొడవ ముదురుతుంది. చాంగ్ బేక్ కు శాశ్వత విశ్రాంతి అనే వరమివ్వమని QM Holdings అనే సంస్థ ప్రెసిడెంట్ క్వాన్ (Kwon)  కు చెప్తాడు.

సరిగ్గా ఈ సమయంలో మన మా గారు రంగంలోకి దిగుతాడు. కారణం బేక్ మొదట్లో జో సుంగ్-జే ను చంపటమే. బేక్ కు కుడి చేయి లాంటి చో జి-హున్ ఆచూకి తెలిసి అతని గురించి చేసిన ఎంక్వయిరీలో భాగంగా సైబర్ Crime Unit తో చేతులు కలుపుతాడు మా. అందులో భాగంగా చేసిన సర్వర్ హేకింగ్‌లో దిమ్మతిరిగే నిజాలు బైటకు వస్తాయి. చో చేస్తోంది మామూలు గ్యాంబ్లింగ్ కాదని దీని వెనుక ఎన్నో పెద్ద బుర్రలు ఉండటమే కాకుండా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు కూడా ఉన్నాయని తెలుసుకుంటాడు. వీటన్నిటి వెనుక ఉన్న బలం QM Holdings అని కనుక్కుంటాడు. ఇక మిగతా కథ మనకు తెలిసిందే.
సినిమాలో ప్రధాన ఆకర్షణ డిటెక్టివ్ మా గా వేసిన Ma Dong-seok. Tough police officer గా అతని నటన కొరియన్ సినీ ప్రియులను బాగా ఆకర్షించింది. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మేనరిజాలు, అతని కళ్ళల్లో ఉన్న ఒకరకమైన magnetic power ఇవన్నీ సినిమా విజయం ఓ ప్రధాన పాత్ర పోషించాయి. వీటికి తోడు కొరియన్లకు సహజంగా కథ మీద, కథనం మీదా శ్రద్ధ ఎక్కువ. వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఈ సీరీస్ లో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ చాలా సహజంగా ఉంటాయి. దాని వల్ల ఈ సీరీస్ యువతరాన్నే కాకుండా పెద్దవాళ్ళు కూడా బాగా ఆకర్షించింది. అక్కడక్కడా ఉండే మెలోడ్రామా కూడా తోడయ్యింది. అన్ని వర్గాల వారినీ ఆకర్షించటానికి.

ఎనిమిది రోజుల్లో ఆరు మిలియన్ల టికెట్లు తెగి, 47 మిలియన్ డాలర్లు సంపాదించింది. దాదాపు $80 మిలియన్లకు తగ్గకుండా సంపాదిస్తుందని అంచనా.

ఈ సీరీస్ కు Crime City అనే పేరుతో మరో నాలుగు సీక్వెళ్ళు, మూడు స్పిన్-ఆఫ్ సినిమాలు వస్తాయని, కొరియా నుంచీ Fast and Furious తరహా franchise గా తీర్చిదిద్దుతామని మా పాత్ర పోషిస్తున్న Ma Dong-seok చెప్పాడు. కథ ఉన్న మేకర్లు ఎన్ని సినిమాలైనా తీయవచ్చన్నట్లు blockbuster సక్సెస్తో పాటూ ప్రతి సినిమా విమర్శకులు ప్రశంసలు పొందటం విశేషం కదా. మామూలుగానే అన్ని సీక్వెల్స్ original సినిమా అంత పేరు పొందవు. కానీ The Roundup సీరీస్ దీనికి మినహాయింపు. ప్రతి సినిమా దాని ముందు భాగానికన్నా బాగా పేరు తెచ్చుకుంటున్నాయి.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ లు ఇష్టపడే వారే కాకుండా ఒక ఫ్రాంచైజ్ ను బిగి సడలకుండా ఎలా నడపాలో తెలుసుకోవడానికి కూడా చూడాలి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా మనం డిజప్పాయింట్ కాము. నాలుగో భాగం The Roundup: Punishment తప్ప మిగతా మూడూ ఆన్లైన్‌లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here