అలనాటి అపురూపాలు – 219

0
3

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సినిమాటోగ్రాఫర్ రాధిక జిబన్ (రాధు కర్మాకర్):

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాధు కర్మాకర్ గురించి, ఆయన భార్య బానీ కర్మాకర్ గురించి వారి మనవరాలు అనూరాధ కర్మాకర్ ఒక వెబ్‍సైట్‍లో చక్కని వ్యాసం రాశారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే చదువుదాం.

~

మా అమ్మమ్మ బానీ కర్మాకర్ (బానీ రాయ్) 5 అక్టోబర్ 1926 నాడు ఒకప్పటి ఈస్ట్ బెంగాల్ (నేటి బంగ్లాదేశ్) లోని డక్కా జిల్లాలో పుట్టింది. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే పెద్దది. బాగా పెద్ద కుటుంబం కావడం, ఆదాయం పరిమితంగా ఉండడం వల్ల బాల్యంలో పేదరికం అనుభవించింది. ముప్ఫై లక్షల మందికి పైగా అశువులు బాసిన 1943 నాటి గ్రేట్ బెంగాల్ కరువు యొక్క భయానక పరిస్థితులను ఆమె చాలా దగ్గరగా చూసింది. అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. తనకి 17 ఏళ్ల వయసులో 1944లో గ్రామ్వారీ, డక్కా (ప్రస్తుతం ఢాకా)కి చెందిన 28 ఏళ్ల మృదుభాషి అయిన రాధికా జిబాన్ కర్మాకర్‌తో పెళ్ళయింది. తాతయ్య రాధికా జిబాన్ 16 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టి, కలకత్తా ఫిల్మ్ ఇండస్ట్రీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేరారు. కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా) లోని ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ జతిన్ దాస్ వద్ద ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. 1940లో తాతయ్య, దాస్‌ గారితో కలిసి బొంబాయికి వలస వెళ్ళారు. భార్యని తూర్పు బెంగాల్‌లోని తన కుటుంబానికి అప్పజెప్పారు. అక్కడ వారి మొదటి కుమార్తె సుదేవి అక్టోబర్ 1947లో జన్మించింది. 1946-1947 మధ్య కాలంలో జరిగిన మతపరమైన మారణకాండల భయానక స్థితిని అమ్మమ్మ కళ్ళారా చూసింది. అంతే కాదు, ఓ వర్షాకాలంలో, పద్మా నదికి భారీగా వరదలొచ్చి, ఆ నది తన మార్గం మార్చుకుని ఇళ్ళనీ, పొలాల్నీ ముంచెత్తింది. దాంతో వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న అనేకమంది ఉపాధిని కోల్పోయారు. ఈ రెండు దురదృష్టకర సంఘటనల కారణంగా తూర్పు బెంగాల్ నుంచి జనాలు ఆశ్రయం కోసం పరాయి ప్రాంతాలవైపు చూశారు. తూర్పు బెంగాల్‍లో అన్నీ వదులుకుని 1948లో మూకుమ్మడిగా పశ్చిమ బెంగాల్‍కి వలస వచ్చిన లక్షలాది మందిలో కర్మాకర్లు కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‍లో కొన్ని రోజులు ఉన్నాక, 1949లో అమ్మమ్మ – తాతయ్యతో కలిసి ఉండడానికి బొంబాయి చేరింది. అక్కడ వాళ్ళు అంధేరీలోనూ, సియాన్ లోనూ నివసించారు. సుదేవి తరువాత వాళ్ళకి రాధా, కృష్ణగోపాల్, మీరా, బ్రోజో గోపాల్ పుట్టారు, ఎక్కడో కుగ్రామం నుంచి బొంబాయి లాంటి మహానగరంలో జీవించడం అమ్మమ్మ తొందరగానే అలవాటు చేసుకుంది. బయట నుండి ఏ సహాయసహకారాలు లేకపోవడం, వచ్చిపోయే చుట్టాలు వంటివి ఆమెకెదురైన కఠినమైన సవాళ్ళు. అయినా అమ్మమ్మ తన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వహించింది.

మా తాతయ్య రాధికా జిబన్ (రాజ్ కపూర్ సలహా మేరకు తాతయ్య తన పేరును ‘రాధు’ అని మార్చుకున్నారు) మొదట కెమెరామాన్‍గా పనిచేశారు. తరువాత ఆర్.కె. స్టూడియోస్ (ప్రస్తుతం ఆర్.కె. ఫిల్మ్స్) సంస్థకు సినిమాటోగ్రాఫర్ అయ్యారు. తాతయ్య పనివేళలు ఓ పద్ధతి ప్రకారం ఉండేవి కావు, పైగా తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దాంతో ఐదురుగు పిల్లల బాధ్యతలన్నీ అమ్మమ్మే చూసుకునేది. తాతయ్యది చిన్నజీతం కావడం వల్ల, ఎక్కువ భాగం పిల్లలకీ, ఉమ్మడి కుటుంబానికి ఖర్చు చేయాల్సి రావడం వల్ల అమ్మమ్మవాళ్ళు చాలా పొదుపుగా ఉండేవారు. ఏ పని మీద ఎవరు బొంబాయి వచ్చినా దిగేది అమ్మమ్మ వాళ్ళింట్లోనే. ఒక్కోసారి అనుకోకుండా అతిథులు రావడంతో తినడానికి అమ్మమ్మకి ఏమీ ఉండేది కాదు. ఉన్న ఒక్క రొట్టెని పంచదారతో తినేదట. అయినా అమ్మమ్మ ఎవరికీ ఏ ఫిర్యాదు చేయలేదు.

దొరికే కాస్త విరామ సమయాన్ని ఇంగ్లీషు నేర్చుకోవడానికీ, హస్తకళల నైపుణ్యం పెంచుకోడానికి ఉపయోగించుకునేది. తాతయ్య సినీరంగంలోని ప్రముఖులతో రాసుకుపూసుకు తిరుగుతున్నా, అమ్మమ్మ ఎన్నడూ ఏ సినిమా ప్రీమియర్లకీ హాజరవలేదు, సినిమా వాళ్ళ పార్టీలకు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని చూసుకోవడానికే అమ్మమ్మ ప్రాధాన్యతనిచ్చింది. మా అమ్మమ్మ తాతయ్యలు జీవితంలో ఎన్నో చూశారు – పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, మనవలు, మనవరాళ్లు – వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రేమలు, కెరీర్లు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు – వాళ్ళ పిల్లలు ఇలా!

ప్రపంచంలోని ఉత్తమ పదిమంది సినిమాటోగ్రఫర్‍లలో తాతయ్య ఒకరు. ఆయన విజయాలకి కారణం ఋషి లాంటి మా అమ్మమ్మ అనే చెప్పాలి. తాతయ్య సాధించిన ఎన్నో అవార్డులు మా ఇంటి కప్‍బోర్డులలో అందంగా అలకరించబడి ఉన్నాయి. మరి అమ్మమ్మ సాధించిన కన్పించని ఘనతల మాటేమిటి? అమ్మమ్మ అద్భుతంగా వంట చేయడమే కాదు.. ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, విద్యాబుద్ధులు చెప్పించింది. తన ప్రభావం లోకి వచ్చిన వారందరికీ ఆమె ఓ ఆదర్శమూర్తి. తాతయ్య తన 77వ ఏట – 5 అక్టోబర్, 1993న ‘పరమవీర చక్ర’ సినిమా షూటింగ్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. అమ్మమ్మ పుట్టినరోజున ఆమెతో ఉండటానికి పూనే నుంచి బొంబాయి వస్తుండగా ప్రమాదం జరిగింది. తన భర్త ఆకస్మిక మరణ దుఃఖాన్ని ఎదుర్కోవడానికి అమ్మమ్మ ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఇంటి పనులలో, మనవళ్లతో ఆటలతో కాలం గడిపింది.

మా అమ్మమ్మ బాని కర్మాకర్, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, 87 ఏళ్ల వయసులో, మే 14, 2015న చనిపోయింది. ఆమె స్ట్రోక్‌ వచ్చింది, డిమెన్షియా ఏర్పడింది. ఒకప్పటి తన శక్తివంతమైన స్వభావానికి అమ్మమ్మ ఇప్పుడు నీడ మాత్రమే. మా పేర్లు గుర్తురాకపోయినా కూడా మా చుట్టూ ఉండడం అమ్మమ్మకి చాలా ఇష్టం. కొన్నిసార్లు ఆమె తూర్పు బెంగాల్‌లోని తన చిన్ననాటి రోజులకు వెళ్ళిపోయేది, ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లను పిలుస్తుంది. అయితే, అమ్మమ్మని సదా గుర్తుంచుకోవడానికి నేను ఎంచుకున్న విధానం అది కాదు. ఆమె నాకు ఎల్లప్పుడూ దృఢ సంకల్పం, మొండి పట్టుదల గల, కఠినమైన, చాలా ప్రేమగల అమ్మమ్మగానే ఉంటుంది.  అంచుల చుట్టూ కొంచెం బరకగా ఉన్న రత్నం లాంటిది, వజ్రం లాంటి మనిషి. చివరి రోజుల్లో, నీ చివరి కోరికలు ఏమిటని అడిగినప్పుడు – అమ్మమ్మ – నేను పెళ్లి చేసుకుంటే ఇష్టంగా చూస్తానని, తర్వాత ప్రశాంతంగా చనిపోతానని చెప్పింది. కానీ నా వివాహ వేడుకను అమ్మమ్మ చూడలేదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, ఆమె చిరునవ్వుతూ చూస్తూ, నవ్వుతూ, నన్ను ఆశీర్వదించడానికి అక్కడకు వస్తుందని నాకు తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here