[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘వనితా నీకు వందనం..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]ద్ర లేవగానే మొదలైంది అవధాన ప్రక్రియ.. ఒక ప్రక్కన ఆఫీస్‌కు త్వరగా వెళ్ళాలి.. పాపకు ఈ రోజు స్కూల్ లేదు.. తనను అమ్మ దగ్గర దింపాలి.. ఇవి అన్నీ, రోజూ ఉండే సమస్యలే.. కాని ఈ రోజు ఎందుకో మనసు పరితపిస్తోంది.. రాత్రి రవితో చెప్పింది..
పాపను అత్తయ్య గారి దగ్గర దింపమంది.. అదేంటి? ఎందుకంత కోపం.. ఎంత కరుకుగా చెప్పాడో.. “ఒక కొడుకుగా అమ్మ నాన్నలకు ఏమీ సహాయం చెయ్యడం లేదు.. ఇలాంటి బాధ్యతలు ఇవ్వలేను..”
“ఇది బాధ్యత ఎలా అవుతుంది.. మనవరాలితో ఉండటం వాళ్ళకూ ఆనందమే కదా..” అతన్ని ఒప్పిస్తున్నట్లుగా అన్నది శారద..
మనసులో ఏముంటుందో తెలియదు.. ఏదీ మనసు విప్పి మాట్లాడడు..
“లేదులే.. నేను అడగను.. నువ్వే మీ అమ్మ దగ్గర దింపి వెళ్ళు..” ఇంకో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా బాత్రూంలో దూరబోయాడు..
“ఫర్వాలేదు ఈ ఒక్కరోజు దింపు.. మా అమ్మకు ఒంట్లో బాగాలేదట.. నిన్నటి నుంచి జ్వరం అని నాన్న చెప్పారు.. నాకు ఈరోజు ఆడిటర్లు వస్తారు.. నేను వాళ్ళను అటెండ్ అవ్వాలి..” తన ప్రియారిటీ చెప్పింది..
“అవునా అత్తయ్య గారికి జ్వరమా.. ఏం చేస్తాం.. మీ నాన్నగారు చూసుకుంటారు.. నువ్వు అక్కడ దింపి వెళ్ళు.. మీ అమ్మని కూడా చూసినట్లు ఉంటుంది..” తనకేంటో మెహర్బానీ చేస్తున్నట్లుగా సలహా ఇచ్చాడు..
కోపంగా చూసింది శారద.. అంతకు మించి ఏం చేయగలదు.. ఇప్పుడు వాదన పెట్టుకుంటే మూడ్ పాడవుతుంది.. ఆఫీస్‌లో చాలా పని ఉంది..
“అమ్మ చూసుకోలేదు ఇంత కాలం పని చేసి ఈమధ్యనే రిటైరయిన అమ్మను ఇంకా ఇబ్బంది పెట్టలేను.. అర్థం చేసుకో శారదా..” బ్రతిమిలాడుతున్నట్లుగా అన్నాడు…
ఆమె కూడా ఉద్యోగస్థురాలే కదా.. మరి తన బాధ అర్థమవ్వాలి.. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తనకు చెప్పరు.. రవి అంతకన్నా.. ఏదీ చెప్పడు..
పెద్దవాళ్ళ సహాయం లేకుండా పిల్లల్ని పెంచడం కష్టమే.. అమ్మా నాన్న ఇక్కడ వచ్చి ఉంటే భరించలేడు.. వాళ్ల అమ్మగారు వచ్చి ఉండమన్నా ఉండదు.. ఉన్నా పని చేయదు.. ఈ సమస్యకు పరిష్కారం ఎలా..
రవికి చేతిలో కారు ఉంది.. ఉద్యోగంలో కొద్దిగా వెసులుబాటు కూడా ఉంది తనకు.. ఆఫీస్‌కి వెళ్తూ అమ్మ వాళ్ళింట్లో దింపవచ్చు.. కాని మాట వినడు.. ఎప్పుడూ చేతిలో ఫోన్.. చాటింగులు.. ఏమన్నా అడిగితే స్నేహితులు అంటాడు.. ఆడా? మగా? తెలుసుకునే ఓపిక కూడా లేదు..
తను ఆఫీసులో అకౌంట్స్ సెక్షన్‌కు ఆఫీసర్.. ఈ రోజు ఆడిటర్లు వస్తున్నారు.. ముందుగా రమ్మని చెప్పారు.. ఇప్పుడు వాదన పెట్టుకుంటే తను పని చేయలేదు.. వెంటనే తల్లికి ఫోన్ చేసి తనకు కూడా వంట చేసి బాక్స్‌లో పెట్టి ఇవ్వమని చెప్పింది..
తను త్వరగా తయారయి పాపను కూడా తయారు చేసింది.. వాచ్‌మన్‌కు ఫోన్ చేసి ఆటో తెమ్మని చెప్పింది.. భుజానికి బ్యాగు తగిలించుకుని అనన్య పుస్తకాలు అవీ తీసుకుని పాపతో బయటకు వచ్చింది..
“రవీ నేను వెళ్తున్నాను.. ఈ రోజు నువ్వు బయట తిను.. వంట చెయ్యలేదు..” అని చెప్పి లిఫ్ట్ లోకి వెళ్ళింది.. క్రిందకు రాగానే ఆటో రెడీగా ఉంది.. ఒక రకమైన నిర్లిప్తతతో ఆటోలో కూర్చుంది..
అమ్మ, నాన్న ఇద్దరూ పెద్దవాళ్ళు.. వాళ్ళు కూడా రిటైర్ అయి ఉన్నారు.. అన్నయ్య తను ఇద్దరే వారికి.. అన్న అమెరికాలో ఉన్నాడు.. వారిని చూసుకోవాల్సిన వయసులో ఇలా ఇంకో బాధ్యత ఇవ్వడం తనకు కూడా ఇష్టం లేదు.. అమ్మ నాన్నను చూడటానికి వెళ్దామంటే ఎప్పుడూ గొడవలే.. ఇప్పుడు మాత్రం అక్కడ దింపాలంటే తనకు మాత్రం ఎలా ఉంటుంది?
చిన్నప్పటినుండి అన్నింట్లో క్లాస్ ఫస్ట్‌గా ఉన్న తనకు దేముడు అందమైన జీవితం ఇవ్వలేదు.. పోనీ ఉద్యోగం మానేస్తే ఊరుకుంటాడా, అదీ లేదు..
ఆడపిల్లలు మంచిగా చదువుకుని కెరియర్ వైపు పోకూడదా? అసలు అమ్మ నాన్నను తన దగ్గర ఉంచుకుంటే ఎంత బాగుంటుంది.. ఇవి అన్నీ, జవాబు దొరకని ప్రశ్నలు..
పెళ్ళిచూపుల్లో రవి ఎంత బాగా మాట్లాడాడు.. తన షరతులు ఒప్పుకున్నాడు.. పెళ్ళైన తరువాత అధికారం వస్తుందా.. ఆడది తమ చెప్పు చేతల్లో ఉంటుందనే నమ్మకమా.. వాళ్ళు అడిగినంత కట్నం ఆడపడుచు లేకపోయినా లాంఛనాలన్నీ ఇచ్చారు.. ఒక్కడే కొడుకు, ఆడపడుచు పోరు ఉండదు అని అమ్మ ఎంత మురిసిపోయిందో..
చిన్నప్పటినుండి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకు ఎప్పుడూ తనదే.. కష్టపడితే ఏమైనా సాధించవచ్చు అనుకునేది.. ఎప్పుడైనా ఫస్ట్ రాలేక పోతే తాను ఏడుస్తూ ఉండేది..
“అలా అనుకుంటే ఎలా అమ్మా.. ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ రావాలని ఉంటుంది కదా.. మనతో పాటు పక్కవాళ్ళని కూడా గెలిపించాలి..” అంటూ తనని ఓదార్చేది..
కాని ఇప్పుడు అలా చెప్పదు.. “నువ్వే సర్దుకుపోవాలి..” అంటూ తనకే నీతులు చెపుతుంది.. వివాహ వ్యవస్థలో ఎప్పుడూ అధికారం మగవాళ్ళకేనా?
కాని ఇప్పుడు కష్టపడినా మార్పులేదు.. తమ జీవితాలే ఇంకా అయోమయంగా ఉన్నాయి.. ఇప్పుడు పాపను ఎలా పెంచాలి.. ఎక్కువ చదివించడం అనవసరం.. ఈ చదువూ ఉద్యోగం ఇంకొక ప్రతిబంధకం అవుతుంది.. పిల్లల్ని పెంచే విషయంలో ఎటూ నిర్ణయించుకోలేక తన స్నేహితులు ఈ మధ్య ఉద్యోగం వదిలేసారు.. తనకు అలాంటి సౌకర్యం కూడా లేదు..
భార్యాభర్తలను విడదీసే ఈ చదువులు, ఉద్యోగాలు మర్చిపోయి పాత రోజుల్లో అమ్మమ్మ లాగా ఉంటే మంచిది అనిపిస్తోంది..
అసలు రవిలాగా అలా మొహమాటం లేకుండా తానెందుకు మాట్లాడలేదు.. తను లోన్ తీసుకుని కారు కొన్నది.. అయినా వాడుకునే అధికారం తనకు లేదు..
బయటనే నిలబడి చూస్తున్న తల్లికి పాపను అందించి ఆమె చేతిలోని లంచ్ బాక్స్ తీసుకుంది.. “అనన్యా అమ్మమ్మతో మంచిగా ఉండు..” అంటూ కూతురికి చెప్పింది.. కళ్ళతోనే తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆటో అతనికి బయల్దేరమని చెప్పింది.. ఈ తల్లి ఋణం తీర్చుకునేది ఎలా.. తనకు లేట్ అవుతుందేమో అని బయటనే నిల్చుంది.. ఒక స్త్రీ మనసు ఇంకొక స్త్రీకే తెలుస్తుంది.. కానీ అత్తగారు ఎందుకిలా?
అప్పటికే మేనేజర్ రూమ్‌లో ఉన్న ఆడిటర్‌ని కలసి విష్ చేసి బయటకు వచ్చింది.. తనలోని స్త్రీ హృదయం పక్కన పెట్టి ఒక ఆఫీసర్‌గా ఇంకో అవతారం మొదలుపెట్టింది.