కవి, విమర్శకుడు శ్రీ అవధానుల మణిబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ

0
4

[‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’ అనే కవితా సంపుటిని వెలువరించిన అవధానుల మణిబాబు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం అవధానుల మణిబాబు గారూ.

అవధానుల మణిబాబు: నమస్కారం.

~

ప్రశ్న 1. నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’ కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఈ సంపుటికి ఈ పేరు పెట్టడం వెనుక మీ ఆలోచనలను వివరిస్తారా?

జ: ధన్యవాదాలండీ. గతంలో నా పుస్తకాలలో ఐదింటికి, రెండు భాగాలుగా ఉండే జంట పదాల్లాంటి పేర్లు పెట్టాను. ఉదా: నాన్న..పాప; అన్నవి.. అనుకొన్నవి..; నేనిలా.. తానలా..; స్ఫురణ.. స్మరణ.. ఈ పుస్తకం టైటిల్ విషయంలో చాలానే ఆలోచించాను. ‘రెండు రాటల మధ్య’ కవితలో ఒక పాదంగా ఉన్న ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా’ అనే ఈ పంక్తిని మిత్రులు బావుంది అనడంతో టైటిల్ గా తీసుకున్నాను. ఐతే, సమీక్షలలో వ్యాసకర్తలు వారివారి దృష్టికోణంలో ఈ శీర్షికను అన్వయిస్తున్నారు. ‘నింగికి దూరంగా’ అంటే నింగికంటే ఎత్తుగా అనే అర్థంతో ఒకాయన విశ్లేషణ చేశారు. మరొకరు ‘నేల’ కవికి, ‘నింగి’ అతడి భావనా విస్తృతికి ప్రతీక అన్నారు. నిజానికి, ఇవి నేను ఊహించిన దానికంటే ఉదాత్త భావనలు. అందుకే ఈ పేరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను.

ప్రశ్న 2. డ్రింకుల బండిఅనే కవితలో పేదవాడైన ఓ చిరు వ్యాపారి గొప్పతనాన్ని కళ్ళకు కట్టారు. ఆ కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?

జ: హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎండవేళల్లో క్రికెట్ ఆడుతూన్నపుడు ఈ డ్రింకుల బండి ఒక గొప్ప సాంత్వన. ఉద్యోగం వచ్చాక ఆ దారిలో వెళుతూ ఆ తాతను చూసి, కలిసినపుడు కలిగిన ఉద్వేగమే కవితగా వ్రాసుకున్నాను. ఇందులో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఆయన నన్ను నిజంగానే పోల్చుకోలేకపోయారు. గతానుభూతిని, ఆ రోజు జరిగిన సంభాషణని కాస్త కవితాత్మకంగా చెప్పాను, అంతే.

ప్రశ్న 3. రెండు రాటల మధ్యకవిత దొమ్మరాట ఆడే పాప గురించి అని అర్థమవుతోంది. ఆ పాప కడగండ్లని మీ అనుభవంలోకి తెచ్చుకుని ఎలా వ్యక్తీకరించగలిగారు?

జ: మన పిల్లలు వాళ్ళ పుస్తకాల సంచీ మోస్తుంటేనే మనం బాధపడుతుంటాం. ఆటల్లో భాగంగా గోడనెక్కినా, ఊడకు వేళ్ళాడినా ప్రమాదమని మందలిస్తాం. అలాంటిది, ఆ గారడీ చేసే చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబాల బ్రతుకుతెరువు కోసం విన్యాసాలు చేస్తుంటే నాకు బాధ తప్ప ఎటువంటి వినోదం కనిపించదు. ఇంత చేసినా, ఆ వచ్చిన కాస్త డబ్బు తండ్రి తాగుడికి ఖర్చు పెడుతుంటే, తల్లీ పిల్లలు మరలా భిక్షాటన చెయ్యడం నేను ప్రత్యక్షంగా చూశాను. పండుగల్లో, జాతర్లలో కాస్త చిల్లర మిగిలినా ఆ పిల్లలకు సరైన తిండి, బట్ట దొరకదు. “ఎంత నడిచినా, ఆ పయనం రెండురాటల మధ్యే పరిమితమౌతుంది” అని ఈ కవిత మొదలు పెట్టిన కారణం అదే.

ప్రశ్న 4. స్వరశ్చమే వాక్చమే సారస్వతశ్చమే..అంటూ అక్షరంఅనే కవితలో మీరు చేసిన పద ప్రయోగం శ్రీ రుద్ర చమకము లోని మంత్రాన్ని స్ఫురింపజేస్తోంది. దాన్ని ఇలా అన్వయించుకోవచ్చన్న ఆలోచన ఎలా తట్టింది?

జ: ఆకర్షణ, అభిమానము, అన్వేషణ – ఈ స్థాయిలన్నీ దాటాక ఆరాధన మొదలవుతుంది. శివుని డమరుక నాదం నుండే అక్షరాలు పుట్టాయని చెబుతారు. ‘అక్షరం’ అనే అంశం మీద కవిత వ్రాయాలన్నపుడు పై రెండు ఆలోచనలను, ఒక సైన్స్ విద్యార్థి ప్రయోగశాలలో ఒక పదార్థాన్ని విశ్లేషణ చేసే క్రమంతో సమన్వయం చేస్తూ కవిత వ్రాయడం మొదలుపెట్టాను. ముగింపుకొచ్చేసరికి మరింత గంభీరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సారస్వత సంబధమైన అన్ని విషయాలు ఆ పరమాత్మలోనివే అనే భావనతో మీరు ప్రశ్నలో ప్రస్తావించినట్లు వ్రాశాను.

ప్రశ్న 5. ఇంకా ప్రగతి కోరని ప్రాంతాలను వెతుకుతూ..వెళ్ళడం మీ వైయక్తికం. బహుశా అనేకులకి ఆ ప్రగతి (ఈ కవితలో రోడ్ల విస్తరణ) అవసరం కావచ్చు. వ్యక్తిగత ఇష్టాలకీ, సామాజికావసరాలకి మధ్య పొంతన కుదరకపోవచ్చు. ఈ కవిత విషయంలో మీకేవైనా ప్రతికూల స్పందనలు ఎదురయ్యాయా?

జ: ఇది నా స్వీయానుభవం. నేను రహదార్లు, భవనాల శాఖలో ఉద్యోగిని. ఇక్కడ కవి ప్రగతి వ్యతిరేకి కాదు. విస్తరణలో భాగంగా కొట్టేసిన చెట్లతో తన కుటుంబంలోని మూడు తరాలకు గల అనుబంధాన్ని తలచుకుంటున్నాడు, ఎవరైనా మరణించినపుడు వారితో గల అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నట్లు. అదే సమయంలో తనకే కాదు పక్షులు, ఉడుతలు వంటి ఇతర ప్రాణులతో కూడా సహానుభూతిని చెందుతూ ఏర్పడిన వెలితికి వేదన చెందుతున్నాడు. రెండు వైపులా మంచి చెడులు తెలియడం వలన, ప్రగతి కోసం ఇది తప్పదు అనే ఎరుక పూర్తిగా కలిగి ఉండడం వల్ల ఏర్పడిన సంఘర్షణే ఈ కవిత.

శ్రీ మాకినీడి సూర్యభాస్కర్‌కి పుస్తకం ప్రతిని అందజేస్తూ.

ప్రశ్న 6. ఇటురా.. ఓసారికవితలో జ్ఞానమే పలు రకాల పుస్తకాల ఏకసూత్రత అని అన్నారు. అలాగే ఈ కవితా సంపుటిలోని కవితలకేదైనా ఏకసూత్రత ఉందా?

జ: ఈ కవిత “రేకునో ఆకునో ఆసరాగా చేసుకుని తాము నడిచిన దారుల కొలతలు వ్రాసి పోయారంతా” అని మొదలవుతుంది. అలా నేను నడిచి వచ్చిన దారుల్లో దొరికిన అనుభవాలే నా కవితల్లో కనిపిస్తాయ్. ఇక ‘ఏక సూత్రత’ ఏమంటే, రేఖామాత్రమైన తాత్త్వికత నా కవితలన్నిటా కనిపిస్తుంది అని పెద్దలంటారు.

ప్రశ్న 7. ప్రభుత్వోద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూనే గత పదేళ్ళలో తొమ్మిది పుస్తకాలు ప్రచురించారు. రచనకి సమయం ఎలా కేటాయించ గలుగుతున్నారు?

జ: ఈ సందర్భంలో ప్రజాకవి డా. అద్దేపల్లిరామమోహనరావు గారి మాటలు “కవిత్వాన్ని జీవితానికి అడ్డం కానీయకండి, జీవితాన్ని కవిత్వం రాయడానికి అభ్యంతరం అనుకోకండి” నన్ను నిరంతరం నడిపిస్తున్నాయ్. కాకినాడలో మంచి సాహిత్య వాతావరణం ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ‘ఆంధ్రీకుటీరం’ వంటి గొప్ప సాహిత్య వేదికలున్నాయ్. నెలకి ఒకటి రెండు సాహిత్య సమావేశాలైనా జరగడం వలన మాట్లాడే అవకాశం ఎక్కువగానే వస్తుంది. జనని, వేద విజ్ఞాన వేదిక (చెన్నై) లాంటి ఇతర రాష్ట్రాలలో వేదికలూ అవకాశమిస్తున్నాయ్. అందుకే, ఎంతో కొంత చదివి, ఎంతో కొంత వ్రాయడం దినచర్యలో భాగం అయింది. ఇక, కవిత్వం విషయానికి వస్తే నేను ముద్రించిన కవిత్వం చాలా తక్కువ. కవితకు అవసరమైన ఉద్దీపన కలిగినపుడు అందుబాటులో ఉన్న కాగితంపై ముందు ఎలావస్తే అలా రాసిపెట్టుకుంటాను. తర్వాత తీరికగా సరిచేసి, మెరుగులు దిద్దుతాను. నాకు పూర్తిగా సంతృప్తి కలిగాకనే పుస్తకంగా వేస్తాను. ఈ సంపుటిలో కవితలు 2013-2023 మధ్య వ్రాసినవి. అంటే వీటిలో పదేళ్ళ పాటు మగ్గిన కవితలు కూడా ఉన్నాయ్. వేరే వ్యాపకాలు లేకపోవడం ఈ వ్యాపకంలో సంపూర్ణ సంతృప్తి దొరకడం నా ఈ కొద్దిపాటి కృషికి ప్రధానకారణం అనుకుంటాను. ‘సెలవు పాఠాలు’ కవితలో “సంసారం, సంపాదన, సాహిత్యం, సమాజం ఇలా ప్రతి జాడీలోనూ వేరు వేరుగా ఊరిపోవాలని మామిడి నూరి పోసింది” అని వ్రాసుకున్నాను, బహుశా ఇలాంటి ప్రశ్న ఎపుడో నాకు ఎదురైనపుడే నేమో.

ప్రశ్న 8. ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవితలు ఏవి?

జ: ‘శవదర్శనం’; ‘మొలకెత్తే గింజలు’; ‘కాలం ఒక చేపల తొట్టె’;. ఈ మూడు కవితలూ మిగిలిన వాటికంటే కాస్త ఎక్కువ ఇష్టం. వేదికలపై చదివినపుడు ‘శవదర్శనం’ కవితపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. పుస్తకంలో వేద్దామా? వద్దా? అని చాలా ఆలోచించాను. ఐతే, ‘ఆవిష్కరణ సభ’లో కొప్పర్తిగారు ప్రత్యేకించి ఈ కవితనే ప్రస్తావించి ప్రశంసించారు, హమ్మయ్య అనుకున్నాను. అలాగే ఆరు ఋతువులను ఆరు రంగుల చేపపిల్లలతో పోల్చి వ్రాసిన ‘కాలం ఒక చేపల తొట్టె’ కవితంటే నాకు చాలా ఇష్టం.

ప్రశ్న 9. ఈ సంపుటిలో ఏ కవితలని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు?

జ: ‘దోబూచులాట’; ‘కల-మెలకువ’ – ఈ రెండు కవితలు చాలా జ్యాగ్రత్తగా వ్రాశాను. అలాగే, మరోసారి మహాత్ముని జీవితాన్ని చదువుకుని శ్రద్ధగా వ్రాసిన కవిత ‘నాన్న కథ’.

ప్రశ్న 10. ఈ పుస్తకం పై పాఠకుల స్పందనలు ఎలా ఉన్నాయి?

జ: చాలా సంతృప్తికరమైన స్పందన ఉంది. ప్రసిద్ధ కవులు డా. శిఖామణిగారు, వసీరాగారు వాత్సల్యపూరితమైన ముందుమాటలతో ఉత్సాహమిచ్చారు. డా. కాళ్ళకూరి శైలజ, డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, శ్రీ కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ విభిన్నకోణాలలో ఈ పుస్తకాన్ని విశ్లేషించారు. మరికొందరి మిత్రుల వ్యాసాలు పత్రికలలో రావలసి ఉంది.

ప్రశ్న 11. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? ప్రచురించవలసిన (పునర్ముద్రించవలసిన) పుస్తకాలున్నాయా?

జ: 2018లో వచ్చిన ‘నాన్న..పాప..’కు ఇప్పటికీ మంచి స్పందన ఉంది. చాలమంది పుస్తకం కావాలంటున్నారు. అందుకే ఈ నెలలో పుస్తకం రెండవ ముద్రణ తెస్తున్నాను. ఈ ఏడాది చివర్లో మరో వ్యాససంపుటి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కవిత్వం, విమర్శ రెండు ప్రక్రియలలోనూ కృషి చెయ్యమని చెప్పిన డా. ఆవంత్స సోమసుందర్ గారి సూచన ఎన్నటికీ నాకు శిరోధార్యం. నాకు అవకాశం ఉన్నంత మేరకు ఈ రెండూ కొనసాగిస్తాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మణిబాబు గారూ.

మణిబాబు: మీ ప్రశ్నల ద్వారా ఒకసారి అంతర్వీక్షణ చేసుకోడానికి, నా సాహిత్యగురువులను స్మరించుకోడానికి, నా కవిత్వాన్ని గురించి నేనో రెండు మాటలు చెప్పుకోడానికి చక్కని అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు.

***

నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా.. (కవితాసంపుటి)
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 92
వెల: ₹ 180/-
ప్రతులకు:
అవధానుల మణిబాబు,
#3-62, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర,
సర్పవరం, కాకినాడ
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533005
ఫోన్: 9948179437

 

~

నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా.. కవితా సంపుటి సమీక్ష:
https://sanchika.com/ningki-durmga-nelaku-daggaraga-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here