అంతా మన వాళ్ళే!

0
4

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘అంతా మన వాళ్ళే’ అనే నాటికని అందిస్తున్నాము.]

పాత్రలు:

శ్రీభారతి –  వయసు 25 సంవత్సరాలు.

విశ్వ ప్రియ – శ్రీభారతి తల్లి – వయసు 45 సంవత్సరాలు

సూర్య చంద్ర – శ్రీభారతి తండ్రి – వయసు 50 సంవత్సరాలు

ఖ్యాతి – శ్రీభారతి స్నేహితురాలు – వయసు 25 సంవత్సరాలు

సంఘమిత్ర – శ్రీభారతి స్నేహితుడు – వయసు 28 సంవత్సరాలు

నిరంజనరావు – ఖ్యాతి తండ్రి – వయసు 55 సంవత్సరాలు

***

రోడ్డు మీద ట్రాఫిక్ హడావిడి గట్టిగా వినిపించాలి. స్కూటర్ వస్తున్న శబ్దం ప్రత్యేకంగా.

***

(స్కూటర్ ఇంటి ముందుకు వచ్చిఆగిన శబ్దం)

విశ్వ ప్రియ: సూర్య చంద్ర గారు ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చారేమిటో!

సూర్య చంద్ర: ఏమి చేస్తాం భార్యామణీ, తోటివారికి సహాయపడడం బాగా అలవాటయి పోయింది.

విశ్వ ప్రియ: ఈ రోజు ఆ అదృష్టవంతులెవరో?

సూర్య చంద్ర: మా ఆఫీసులో ప్రభాకరరావు లేడూ, ఆయనకి ఒక్కగానొక్క కూతురు. ఈ రోజు అమ్మాయి నచ్చితే నిశ్చయ తాంబూలాలని, పెద్దవారు తనకెవరూ లేరు, నన్ను రమ్మని పిలిచాడు.

విశ్వ ప్రియ: ఇంకేం శుభకార్యం జరిపిం చేశారన్న మాట.

సూర్య చంద్ర: ఆఁ! అయినట్లే నెలలో పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టేసారు. ఒక మంచి పనికి మన సమయాన్ని ఎంత వెచ్చించినా తప్పులేదు. ఇంతకీ నా గారాలపట్టి ‘శ్రీభారతి’ కనిపించదేం?

విశ్వ ప్రియ: మీ అమ్మాయి కదా! అది కూడా సహయ కార్యక్రమం లోనే ఉంది.

సూర్య చంద్ర: ఎక్కడికి వెళ్ళింది?

విశ్వ ప్రియ: అంత కంగారు ఎందుకు? పక్కింటి పద్మనాభరావు గారికి ఉన్నట్టుండి గుండెనొప్పి (హార్ట్ స్ట్రోక్) వచ్చింది. మొదటిసారి అట.

సూర్య చంద్ర: అయ్యయ్యో! ఇప్పుడెలా ఉంది?

విశ్వ ప్రియ: భయపడాల్సినదేమీ లేదు. ఈరోజు ఆసుపత్రిలో ఉంచాలన్నారు. ఆవిడకు తోడుగా వెళ్ళింది మన భారతి.

సూర్య చంద్ర: అడగకుండానే ఇలాంటప్పుడు సాయం చెయ్యాలి బంధువులు, సొంతవాళ్ళు ఎందరున్నా వెంటనే రాలేరుగా. అందుకే ఇరుగు, పొరుగు అన్నారు. మంచి పని చేసిందిలే.

విశ్వ ప్రియ: మధ్యాహ్నం నేను వెళ్ళి వాళ్ళకు ‘క్యారేజీ’ ఇచ్చి వచ్చాను. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఇద్దరం వెళ్ళి రాత్రి భోజనం ఇచ్చి వద్దాం.

సూర్య చంద్ర: (నవ్వుతూ) విశ్వాన్నంతా ప్రేమించే విశ్వ ప్రియ గారు చెప్పటం మేము వినక పోవటమూనా.

విశ్వ ప్రియ: అబ్బ! మీరేమన్నా తక్కువా! ఆ సూర్య చంద్రులు ఏకమైనట్లు అనుక్షణం ఎవరికి సహాయ పడదామా అని తపించి పోరూ!

సూర్య చంద్ర: మనిషిగా పుట్టాక ఆ మాత్రం చేయకపోతే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది చెప్పు?

విశ్వ ప్రియ: సరే! సరే! వేడి వేడిగా టిఫిను రడీగా ఉంది. తొందరగా రెడీ అయి వచ్చేస్తే లాగిం చెయ్యచ్చు.

సూర్య చంద్ర: మా ఆవిడ చేతి రుచిని ఒక్క పూట కూడా వదలటం నా కిష్టముండదోయ్. క్షణంలో వచ్చేయ్యనూ!

విశ్వ ప్రియ: ఇప్పుడే పెళ్ళాడిన పెళ్ళికొడుకులా మాటలకేం తక్కువ లేదు.

సూర్య చంద్ర: (దగ్గరకు వచ్చి) ఏం? నేను ముసలాడిగా అనిపిస్తున్నానా ఏంటి? చెప్పు.

విశ్వ ప్రియ: అలా అని నేనేం అని లేదు. మీరు నిత్య వసంతులే. వెళ్ళి రండి. ఆలస్యం చేస్తే వేడి మజా కోల్పోతారు.

సూర్య చంద్ర: వెనక్కి లాగేది నువ్వే! ముందుకు పంపేది నువ్వే!

విశ్వ ప్రియ: భార్యంటే అలాగే ఉండాలి సార్. మంచికి ముందుకు పంపాలి. చెడుకు వెనక్కి లాగాలి.

సూర్య చంద్ర: (దూరంగా వెళుతూనే) ఒప్పేసుకున్నాం ప్రియా!

విశ్వ ప్రియ: వయసు పెరిగినా చిలిపితనం ఏ మాత్రం తగ్గలేదు.

సూర్య చంద్ర: (చాలా దూరం నుంచే..) ఏంటో అంటున్నట్లున్నావ్.

విశ్వ ప్రియ: బాబోయ్! మళ్ళీ వెనక్కి రాకండి. నేనేం అనలేదు. ఒకవేళ అన్నా మీరు వచ్చాక మళ్ళీ చెబుతా.

సూర్య చంద్ర: అలా అయితే ఓకే నోయ్!

విశ్వ ప్రియ: (స్వగతంలో) హమ్మయ్య. ఈయన్ని స్నానానికి పంపటం బహుకష్టమైన పని.

***

రోడ్డు మీద రద్దీ ధ్వనులు. కారు హారన్స్, బస్సు హారన్‌లు etc..

~

ఖ్యాతి: హాయ్ భారతీ! ఏమిటే నువ్విక్కడ!

శ్రీభారతి: ఖ్యాతీ! నువ్వా! నా సంగతి తర్వాత. నువ్వు ఇక్కడున్నావేమిటి? అది చెప్పు ముందు?

ఖ్యాతి: ఇది మా మామయ్య వాళ్ళ షాపు. వీళ్ళబ్బాయినే నేను పెళ్ళి చేసుకునేది.

శ్రీభారతి: ఓహ్ అవునా!

ఖ్యాతి: ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవర్ని ఉద్ధరించటానికి వచ్చావో!

శ్రీభారతి: ఖ్యాతీ! అలా మాట్లాడవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాను. మనమేమన్నా దేముళ్ళమా, అందరినీ ఆదుకోవడానికి.

ఖ్యాతి: ఏమో! అదంతా నాకు తెలియదు. నీకు మాత్రం వేరే ఏ పని ఉండదు. పొద్దున నుంచి రాత్రి దాకా ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంటావు.

శ్రీభారతి: అలా ఏం లేదు లే, మా పక్కంటి మామయ్య గారికి బాగోకపోతే ఈ పక్క ఆసుపత్రిలో చేర్చాం. మందులు తెద్దామని మీ షాపుకు వచ్చాను.

ఖ్యాతి: మరింకేం? కాదంటావ్! ఇప్పుడు నువ్వు చేసేది అదే పని కదా.

శ్రీభారతి: సరే! ఇంకోసారి మాట్లాడుకుందాం. నేను వస్తానే.

ఖ్యాతి: అలా వెళిపోతానంటానేం. కాసేపు కూర్చో భారతీ.

శ్రీభారతి: సారీనే! అక్కడ వాళ్ళకి ఏమన్నా అవసరం అవుతుందేమో. నేను లేకపోతే అత్తయ్య కంగారు పడుతుంది.

ఖ్యాతి: సరే! నేనూ రానా! కాసేపు మాట్లాడుకోవచ్చు.

శ్రీభారతి: వద్దొద్దు. నువ్వు చక్కగా మీ బావతో షికారుకి వెళ్ళు. అక్కడ ఎవరూ ఎవరితో మాట్లాడనివ్వరు.

ఖ్యాతి: (నిరాశగా) అవునా.

శ్రీభారతి: మరి నేను వెళ్ళి రానా.

ఖ్యాతి: ఊ! (అయిష్టంగా)

శ్రీభారతి: వస్తానే.

సంఘమిత్ర: హాయ్ శ్రీ! మీరిక్కడ.. అనుకోకుండా భలే కలిసామే.. (మధ్య మధ్యలో హారన్స్ వినిపిస్తూ ఉండాలి).

శ్రీభారతి: (ఆశ్చర్యంగా) ఓ.. మీరా.

సంఘమిత్ర: ఏమండీ ఈ సంఘమిత్రని అప్పుడే మరిచిపోయారా.

శ్రీభారతి: అబ్బే లేదండీ.

సంఘమిత్ర: నా పేరేనా.. మిమ్మల్ని శ్రీభారతి అని పిలవలేను. శ్రీ అనే అంటానని మీ దగ్గర అనుమతి తీసుకున్న విషయం కూడా.. (సందిగ్ధంగా)

శ్రీభారతి: ఆపుతారా! అన్నీ గుర్తున్నాయి.

సంఘమిత్ర: అమ్మయ్య! బ్రతికించారు.

శ్రీభారతి: అవునూ, మీకేమిటి ఈ ఊర్లో.. అదే మా ఊర్లో అని

సంఘమిత్ర: మాలాంటి వారికి ఈ ఊరు, ఆ ఊరు అని ఉండవండీ. అన్నీ మా ఊర్లే.

శ్రీభారతి: మీ కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయా?

సంఘమిత్ర: సమాజంలో సహాయం చెయ్యాలనుకునే వాళ్ళు తక్కువ కానీ చేయించుకొనే వారు ఎక్కువే.

శ్రీభారతి: అదీ నిజమే.

సంఘమిత్ర: ఉట్టి నిజం కాదండోయ్. గట్టి నిజం. అందుకే మా చేతుల్లో పుష్కలంగా ఎప్పుడూ పని ఉంటుంది.

శ్రీభారతి: వృద్ధులకు ఆసరాగా, పిల్లలకు అండగా, ఆడవారికి అన్నలా మీ ఖాళీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అభినందించాల్సిన విషయమే!

సంఘమిత్ర: మీకు మాత్రం అన్నను కానండోయ్.

శ్రీభారతి: మరి?

సంఘమిత్ర: స్నేహితుడ్ని.

శ్రీభారతి: అలాగా.

సంఘమిత్ర: అనుమతిస్తే ప్రేమికుడ్ని కూడా.

శ్రీభారతి: ఆ అనుమతులు, గినుమతులు అన్నీ పెద్ద వాళ్ళకే సుమండీ. నాకేం సంబంధం ఉండదు.

సంఘమిత్ర: ఇంక మారేం చెప్పద్దు. చక్కగా ఆకుపచ్చ జండా ఊపేశారు. అంత కన్నా ఇంకేం కావాలి?

శ్రీభారతి: మీలాగా ఎప్పుడూ అందరికీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది నాకు. అందరికీ అది పిచ్చిగా అనిపిస్తోంది.

సంఘమిత్ర: అవునండీ. ‘నా’ అనే స్వార్థం చూసుకోకుండా ఈ లోకంలో ఎవరు ఏ పని చేసినా వాళ్ళను పిచ్చి వాళ్ళగానే జమ కట్టేస్తారండీ.

శ్రీభారతి: అదే, ఎందుకలా. నా కర్థం కాదు. మనమంటూ రక్త సంబంధీకులం కాకపోవచ్చును. కానీ భారతీయులమేగా.

సంఘమిత్ర: అలా అందరినీ ‘మన’ అని కలుపుకొని పోయే స్వభావం ఇప్పుడు ఎవ్వరిలో లేదు మేడమ్.

శ్రీభారతి: అదే నా బాధ. నా స్నేహితురాలు ‘ఖ్యాతీ’ అంతే. నా పనిలో మంచిని గ్రహించక పోయినా ఫరవాలేదు. కానీ దెప్పుతూంది!

సంఘమిత్ర: అలాంటి వాళ్ళను పట్టించుకోకండి.

శ్రీభారతి: ఎన్నాళ్ళలా?

సంఘమిత్ర: కాలమే మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

శ్రీభారతి: మీరు చెబుతానన్నా కుదిరేది కాదు. నేను చేరాల్సిన చోటు వచ్చేసింది.

సంఘమిత్ర: సరే! తొందర్లోనే మిమ్మల్ని కలుస్తాను.

***

సూర్య చంద్ర: చిన్నీ! బీరకాయ కూర నీకిష్టమని అమ్మతో చెప్పి చేయించానురా, ఇంకొంచెం వేసుకో.

శ్రీభారతి: ‘మా బంగారు నాన్న’ అని నేనందుకే నిన్ను అంటుంటాను

విశ్వ ప్రియ: ఓహో. చేసి పెట్టిన అమ్మకి ఏం లేదన్నమాట.

శ్రీభారతి: ఎవరున్నారూ? మా అమ్మే నా లోకం,

విశ్వ ప్రియ: ప్రొద్దున నుంచి ఏం తిన్నావో ఏమో శుభ్రంగా తిను.

శ్రీభారతి: అదేంటమ్మా అలా అంటావ్. నువ్వే తెచ్చావుగా క్యారేజీ.

విశ్వ ప్రియ: అక్కడ సరిగా తిన్నావో లేదో అని.

శ్రీభారతి: పనిలో ఉన్నప్పుడు తిండి ధ్యాస ఉండదులేమ్మా. అన్నట్లు మధ్యాహ్నం ఖ్యాతీ, సంఘమిత్ర కనిపించారు.

సూర్య చంద్ర: సంఘమిత్ర అంటే అతని భావాలు బాగున్నాయన్నావు. అతనేనా?

శ్రీభారతి: అవును నాన్నా! తనలా యువత అంతా పట్టించుకుంటే చుట్టుప్రక్కల సమస్యలు అనేవే ఉండవు.

సూర్య చంద్ర: నీకు బాగా నచ్చేసినట్లున్నాడే.

శ్రీభారతి: అలా అని కాదు కానీ, ఒకే గూటి పక్షుల్లా అనిపించింది తనని చూసిన క్షణంలో.

సూర్య చంద్ర: ఇక ఆలస్యం ఎందుకు?

శ్రీభారతి: (సిగ్గుపడుతూ) పోండి నాన్నా!

సూర్య చంద్ర: మీ అమ్మాయి అల్లుడిని వెతికే పని తప్పించేసింది.

విశ్వ ప్రియ: మీకిప్పుడు తెలిసింది. నాకెప్పుడో తెలుసు.

సూర్య చంద్ర: నాకేనా ఆలస్యంగా తెలిసింది. ఏరా చిన్నీ! ఇంత అన్యాయమా!

శ్రీభారతి: లేదు నాన్నా! ఇప్పుడు చెప్పటమే. కాకపోతే గ్రహించేసినట్టుంది.

విశ్వ ప్రియ: అమ్మను కదా!

సూర్య చంద్ర: ఒకసారి రమ్మనమను ·

శ్రీభారతి: వస్తాననే చెప్పాడు.

సూర్య చంద్ర: అలాగా! ఖ్యాతీ ఏమంది?

శ్రీభారతి: దాని సంగతి తెలిసిందేగా. తనకు మాలిన ధర్మం వద్దంటుంది. అదే బాధగా ఉంటుంది.

విశ్వ ప్రియ: కొందరికి తన దాకా వస్తే గానీ అర్థం కాదులే.

శ్రీభారతి: ఏమోనమ్మా. తను చెయ్యకపోయినా పరవాలేదు. చేసే నన్ను పట్టుకొని ఏదో తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతుంది.

విశ్వ ప్రియ: అజ్ఞానంలో కొట్టుకుపోయేవాళ్ళకు అలానే అనిపిస్తుంటుంది.

సూర్య చంద్ర: నువ్వు అందరినీ మార్చేస్తావు కదరా చిన్నీ! ఈ ఖ్యాతి మాత్రం లొంగటం లేదే!

శ్రీభారతి: ఆ ఒక్క విషయంలో తప్ప తను నాకు అన్నింట్లో మంచి స్నేహితురాలు.

విశ్వ ప్రియ: అందరిలో అన్నీ మనకు వచ్చినవే ఉండాలని లేదు. ఎవరిలో ఏ మంచి ఉందో చూడగలిగితేనే అందరితో స్నేహం చేయగలం.

శ్రీభారతి: అదేనమ్మా నా సిద్ధాంతం కూడా!

సూర్య చంద్ర: మన సిద్ధాంతం అనాలి చిన్నీ!

శ్రీభారతి: సరే! సరే!

( ఫోను రింగవుతున్న శబ్దం వినిపిస్తుంది.)

విశ్వ ప్రియ: నీకే అనుకుంటా.

శ్రీభారతి: ఈ వేళప్పుడు ఎవరు చేస్తుంటారమ్మా? కొంపతీసి పక్కంటి మామయ్య గారికి మళ్ళీ ఏమన్నా అవలేదు కదా!

విశ్వ ప్రియ: లేదు లేదు. ఆయనకు ప్రమాదం లేదనే కదా ఇటికి పంపించేసింది. వెళ్ళి చూడు.

శ్రీభారతి: అరె! ఖ్యాతి అమ్మా! ఖ్యాతీ, ఏమిటే సంగతులు?

ఖ్యాతి: (వెక్కి వెక్కి ఏడుస్తూ) భారతీ! ఒక్కసారి మా ఇంటికి రావా! ప్లీజ్!

శ్రీభారతి:  ఏమైందే?

ఖ్యాతి: నువ్వు రా, చెబుతాను.

శ్రీభారతి: సరే వస్తున్నానులే.

సూర్య చంద్ర: (కంగారుగా) ఏమిటమ్మా?

శ్రీభారతి: ఏమో నాన్నా! అర్థం కావటం లేదు, రమ్మంటోంది.

సూర్య చంద్ర: అవునా ఏం ఆపద వచ్చిందో ఏమో. పద నేను తీసుకు వెళతాను.

విశ్వ ప్రియ: నేను కూడా రానా?

సూర్య చంద్ర: వద్దులే ప్రియా. ప్రొద్దున నుంచీ అలిసిపోయావు. అవసరమయితే వచ్చి తీసుకువెళతాలే.

విశ్వ ప్రియ: సరే జాగ్రత్తగా వెళ్ళండి. అసలే రోజులు బాగోలేవు.

శ్రీభారతి: నీ కూతురు ‘కరాటే రాణి’ అన్నది మరిచిపోతున్నావమ్మా.

విశ్వ ప్రియ: అయినా అమ్మను కదా. నా భయం నాకుంటుంది. రాత్రి వేళ కదా!

సూర్య చంద్ర: సరే! తలుపులని జాగ్రత్తగా వేసుకోని పడుకో.

విశ్వ ప్రియ: అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వీలు చూసుకుని ఫోన్ చేసి విషయం చెప్పండి.

(తలుపులు వేసిన శబ్దం)

***

శ్రీభారతి: ఖ్యాతీ! ఏమయిందే!

ఖ్యాతి: (ఏడుస్తు) అంతా అయిపోయిందే!

శ్రీభారతి: విషయం చెప్పు ఖ్యాతీ.

ఖ్యాతి: చెప్పటానికి ఏం మిగల్లేదే! ఇన్నాళ్ళు నువ్వు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా అర్థం కాలేదే! (మరింత గట్టిగా ఏడుస్తూ)

శ్రీభారతి: ఊరుకోవే.

ఖ్యాతి: ఇక ఊరుకోవటం తప్పితే నేను చేయగలుగిందేమీ లేదు.

శ్రీభారతి: అసలేమయింది?

ఖ్యాతి: బావ.. బావ..

శ్రీభారతి: ఊ! మీ బావకు ఏమయింది?

ఖ్యాతి: షాపు మూసి ఇంటికి వస్తుంటే యాక్సిడెంటయ్యింది.

శ్రీభారతి: అయ్యో! ఇప్పుడెలా ఉన్నారాయన?

ఖ్యాతి: (బిగ్గరగా ఏడుస్తూ) నీ లాంటి వాళ్ళు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోయారే. ఉంటే బావ ఇలా ఇబ్బందుల్లో పడేవాడు కాదు.

శ్రీభారతి: ఏం కాదులే. నువ్వు ధైర్యంగా ఉండు.

ఖ్యాతి: ఇంకెక్కడి ధైర్యమే. ఒక్క అయిదు నిముషాలు ముందు తీసుకు వచ్చినా అపాయం తప్పేదని డాక్టర్లు చెప్పేసారే.

శ్రీభారతి: అలా అని అనుకోవడానికి ఏం లేదు. డాక్టర్ల కన్నా పెద్ద డాక్టరు భగవంతుడు ఆయన కృప ఉంటే భయమక్కర్లేదు.

ఖ్యాతి: ఏమోనే! నాకే మాత్రం ఆశ కనిపించటంలేదు.

శ్రీభారతి: ఏ హాస్పిటల్లో చేర్చారు?

ఖ్యాతి: ‘ఆశ్రయ’. నేను భయపడుతున్నానని అమ్మా వాళ్ళు ఇంటికి పంపేసారు బామ్మను తోడిచ్చి.

శ్రీభారతి: ఇప్పుడు, నే వచ్చాసానుగా.

ఖ్యాతి: బావ బ్రతికాడని చెప్పేదాకా నాకు నమ్మకం లేదే.

శ్రీభారతి: అలాంటి మాటలే వద్దంటాను.

ఖ్యాతి: నాకీ శాస్తి జరగాల్సిందే.. ఎన్ని సార్లు నాకు చెప్పినా వినకపోగా నిన్ను వెక్కిరిస్తూ ఉండేదాన్ని.

శ్రీభారతి: ఛ! ఊరుకో! ఇప్పుడవన్నీ ఎందుకు?

ఖ్యాతి: విషయం తెలిసిన మరుక్షణం నుంచీ నేను నేనుగా లేనే. ప్రాణం లేని శిలనయి పోయానంటే నమ్ము.

శ్రీభారతి: బాధలో అలాగే అనిపిస్తుందిలే, కాసేపు నిద్రపో. ఇలా నా ఒళ్ళో పడుకో.

ఖ్యాతి: ఇంకెక్కడి నిద్రే, నా రెప్ప మూతబడటం శాశ్వతంగా ఆగిపోయినట్లే.

శ్రీభారతి: నేను హాస్పటల్‌కి ఫోన్ చేసి కనుక్కుంటాను ఖ్యాతీ, కంగారుపడకు. మేమంతా ఉన్నాంగా.

ఖ్యాతి: ఎందరున్నా ఏం చేయలేని ‘పరిస్థితి’. మీకింకా విషయం అర్థం కావడం లేదంతే.

శ్రీభారతి: నాన్నగారూ! మీరు వెళ్ళి ఫోను చేయండి. ఇది ఇలాగే మాట్లాడుతుంది.

సూర్య చంద్ర: అలాగేనమ్మా.

శ్రీభారతి: కాస్త ఈ జ్యూస్ త్రాగు.

ఖ్యాతి: నాకేం వద్దు. నాకు నా బావ కావాలి. బావ లేకుండా నేను బ్రతకలేను. నేను బ్రతకలేను.

శ్రీభారతి: ఏడవటానికయినా శక్తి కావాలిగా, త్రాగు. లేదంటే నేను బలవంతంగా పట్టించాల్సి వస్తుంది.

(జ్యూస్ త్రాగుతున్న శబ్దం)

ఖ్యాతి: బావ లేకుండా నేను ఎలా బ్రతకాలి? ఊహించుకోలేక పోతున్నాను భారతీ.

శ్రీభారతి: ఏమీ అవ్వకుండా ఏదో అయిపోయిందని అనుకోవటం కూడా మంచిది కాదు ఖ్యాతీ.

ఖ్యాతి: ఏమో! నాకు భవిష్యత్తు అంతా శూన్యంగా కనిపిస్తోంది. ఇక మంచి మాటలెలా వస్తాయి నా నోట? నువ్వే చెప్పు.

శ్రీభారతి: నీకు తెలుసా! డాక్టర్లు మా వల్ల కాదని చేయలెత్తేసిన కేసులు కూడా మిరకిల్‍గా ఒక్కోసారి బాగవుతుంటాయి.

ఖ్యాతి: అది నీలాంటి వారి విషయంలో. ప్రతి నిముషం పక్కవారికి ఎలా సహాయం చెయ్యాలా అని చూస్తావు కాబట్టి.

శ్రీభారతి: ఖ్యాతీ, భగవంతుని దృష్టిలో మనమంతా బిడ్డలమే. మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా ఆయన సమానం గానే చూస్తాడు.

ఖ్యాతి: అసలు ఏ ముఖం పెట్టుకుని ఆయన్ని అడగాలి బావను బ్రతికించమని?

శ్రీభారతి: ఆయన సృష్టించిన నీ ముఖంతోనే,

ఖ్యాతి: నెరవేరుతుందంటావా?

శ్రీభారతి: నమ్మకంగా ప్రార్థిస్తే ఫలితం తప్పక ఉంటుంది.

ఖ్యాతి: కాసేపు నేను పూజ గదికి వెళతాను.

శ్రీభారతి: అలాగే, మనసు ప్రశాంతంగా ఉంచుకో.

(ఫోను చేస్తున్న శబ్దం)

సూర్య చంద్ర: హలో! చిన్నీ!

శ్రీభారతి: ఎలా ఉందంట తనకి నాన్నా!

సూర్య చంద్ర: పరిస్థితి క్రిటికల్ గానే ఉందట. అందుకే నేను లోపలికి రాకుండా బయటే కూర్చున్నాను.

శ్రీభారతి: అవునా?

సూర్య చంద్ర: అమ్మను రమ్మననా?

శ్రీభారతి: వద్దు నాన్నా! మనం చాలు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది.

సూర్య చంద్ర: అలాగే చిన్నీ ఉందాం! అమ్మకి పోన్ చేసి చెప్తాను.

శ్రీభారతి: థాంక్యూ! నాన్నా!

సూర్య చంద్ర: భలే దానివిరా.

శ్రీభారతి: నేను కూడా బయటకు వస్తున్నాను. ఖ్యాతి కాసేపు ధ్యానం చేసుకుంటానంది.

సూర్య చంద్ర: సరే! వచ్చెయ్.

శ్రీభారతి: ఖ్యాతిని చూస్తుంటే భయం వేస్తోంది.

సూర్య చంద్ర: ఏం భయం లేదురా. ఇలాంటి వాళ్ళు తొందరగా భయపడతారు. అంత తొందరగానూ బయటపడతారు.

శ్రీభారతి: ఏమో!

సూర్య చంద్ర: ఏది ఏమైనా ఈ సంఘటనతో తనలో నువ్వు కోరుకున్న మార్పు మాత్రం తప్పక వస్తుంది.

శ్రీభారతి: ఇలా ప్రతివారికీ అనుభవం తోనే మార్పు రావాలా నాన్నా!

సూర్య చంద్ర: ఈ ప్రపంచంలో ఎంత మంది మనుషులున్నారు? ఒకరిని పోలినవారు ఒకరున్నారా? ఇదే అంతే!

శ్రీభారతి: ఎందుకిలాంటి స్వభావాలు వ్రేళ్ళూనికి పోతున్నాయంటారు?

సూర్య చంద్ర: సంపాదన అవసరం పెరగడం. కోరికల చిట్టాకి అంతులేకపోవడం. ఈ రెండూ తగ్గితే ఇది దానంతటదే సర్దుకుపోతుంది.

శ్రీభారతి: అవసరానికి మించిన సంపాదన కోరుకోవటం ఎందుకో నా కర్థం గాదు.

సూర్య చంద్ర: తృప్తి లేని వాళ్ళకే ఇంకా ఇంకా కావలనిపిస్తుంది. చిన్నీ.

శ్రీభారతి: మన మనసులు నిండా అదే ఉంది కదా నాన్నా!

సూర్య చంద్ర: పిచ్చిదానివిరా నువ్వు!

శ్రీభారతి: అంతా మన వాళ్ళే అమకోవటం పిచ్బితనమా?

సూర్య చంద్ర: కాదురా కాదు. అదే మహోన్నతం. అందరూ ఎవరెస్టు శిఖరానికి ఎక్కలేరుగా

శ్రీభారతి: అంతేనంటారా!

(ఫోను రింగు వస్తున్న శబ్దం)

సూర్య చంద్ర: హలో.

నిరంజనరావు: ఖ్యాతీ వాళ్ళ నాన్నగార్ని మాట్లాడుతున్నాను. మావాడి ప్రాణాలకు ముప్పు తప్పిందని డాక్టర్ చెప్పారు. ఖ్యాతికి చెబుతారా!

సూర్య చంద్ర: తప్పకుండా.

నిరంజనరావు: మీకు శ్రమ ఇచ్చాను.

సూర్య చంద్ర: అదేం లేదండీ. ఒకరి కొకరం మనం చేసుకోకపోతే. ఇంకెవరు చేస్తారు చెప్పండి.

నిరంజనరావు: చాలా సంతోషం. ఉంటానండీ.

సూర్య చంద్ర: ఖ్యాతీ వాళ్ళ బావ గండం నుంచి బయటపడ్డాడు చిన్నీ!

శ్రీభారతి: (సంతోషంగా) నేను చెప్పానా లేదా!

ఖ్యాతీ! ఖ్యాతీ! అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్తుంది.

ఖ్యాతి: భారతీ, బావ నన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాడా?

శ్రీభారతి: మీ బావ నిన్నిడిచి పెట్టి ఎక్కడకు వెళ్ళతాడే? నీ కోసం బ్రతికాడు.

ఖ్యాతి: ఇదంతా నీ వలనే.

శ్రీభారతి: మధ్యలో నేనేం చేసాను?

ఖ్యాతి: ఈ ఆపద సమయంలో నా ప్రక్కన నిలబడ్డావు. భగవంతుని స్మరిస్తే తప్పక లాభముంటుందని చెప్పలా.

శ్రీభారతి: ఓ! అదా!

[సూర్య చంద్ర కూడా లోపలికి వస్తాడు. శ్రీభారతి మెసేజ్ అందుకుని కొద్ది సేపటి క్రితం ఖ్యాతి వాళ్ళింటికి వచ్చి, బయట సూర్య చంద్రతో మాట్లాడి, అంతలో తనకేదో ఫోన్ వస్తే మాట్లాడడానికి రోడ్డు చివరి వరకు వెళ్ళిన సంఘమిత్ర లోపలికి వచ్చి వీళ్ళ మాటలు వింటున్నాడు.]

ఖ్యాతి: ఈ పుణ్యమే నా బావకు ప్రాణం పోసింది. ఇక నుంచీ నీ సంఘసేవలో నీ తోడు నీడలా ఉంటాను.

సంఘమిత్ర: (అయోమయంగా) మరి నా పరిస్థితి ఏమిటి?

సూర్య చంద్ర: నువ్వు అమ్మాయి మనసులోకే చేరిపోయావుగా అల్లుడూ.

శ్రీభారతి: (సందిగ్ధంగా) నాన్నా! మీ పరిచయాలు..

సూర్య చంద్ర: అన్నీ అయిపోయాయి చిన్నీ!

అందరూ కలిసి నవ్వుకుంటారు.

* సమాప్తం *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here