మహాప్రవాహం!-26

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పట్నంలో ఎలా నెగ్గుకొస్తామో ఏమో అని అనుకున్న భర్తకి ధైర్యం చెబుతుంది మీనాక్షమ్మ. మర్నాడు రైతులు, ఊరి వాళ్ళు వచ్చి పద్మనాభయ్యకు, మీనాక్షమ్మకి బట్టలు పెడతారు. కొందరు కందులు, మినుములు, పెసలు తెచ్చిస్తారు. ఆఖరన వచ్చిన గొల్ల మద్దిలేటి సామికి ఓ చక్కని శివలింగం ఇస్తాడు. అతని భార్య శేషమ్మ మీనాక్షమ్మకి బుడ్డలిత్తనాల సంచీ ఇస్తుంది. కొండారెడ్డి దంపతులు, మరికొందరు వచ్చి సామాన్లు గోనెసంచుల్లో సర్ది మూతులు బిగిస్తారు. మధ్యాహ్నం ఓ మనిషి వచ్చి పెదరెడ్డి రమ్మంటున్నాడనీ, రామానుజ శెట్టి కూడా వచ్చి ఉన్నాడని చెప్తాడు. ముగ్గురు మాట్లాడుకుంటారు. పెద్దరెడ్డి చెప్పిన మీదట పద్మనాభయ్య ఇంటిని శెట్టి ముఫ్పై ఐదువేలకు కొనుక్కునేలా అంగీకారం కుదురుతుంది. పత్రాలపైన పెద్దరెడ్డి సాక్షి సంతకం చేస్తాడు. అడ్వాన్సుగా ఐదు వేలు సామికి ఇస్తాడు శెట్టి. రాత్రి ప్రదోష పూజ పూర్తయ్యాక, దేవతార్చన సామాగ్రిని అంతా ఒక అట్టపెట్టెలోకి చేర్చారు. మర్నాడు ఉదయం పెద్దరెడ్డి ట్రాక్టరులో సామన్లు ఎక్కించి, దంపతులిద్దరు బస్సులో అనంతపురం చేరుతారు. కేదార బస్సు స్టాండుకు వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకువస్తాడు. మర్నాడు కొత్త యింట్లో ప్రవేశించి పూజ చేసుకుంటారు. కేదార తనుండే గది ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తాడు. అతని ఫైనలియర్ పరీక్షలు నెలన్నర రోజుల్లోకి వచ్చాయి. ఓ వారం రోజులు అన్నయ స్తిమితపడే వరకు ఆగి, ఓ రోజు సాయంత్రం వచ్చి, ఓ ఎ.సి.టివో. గారింట్లో గ్రహశాంతి, నవగ్రహ జపం చేయించాలనీ, మనతో పాటు ఇంకో బ్రాహ్మడు ఉంటాడని చెప్తాడు. శాంతి ఏ నక్షత్రానికని అడిగి, మూలా నక్షత్రం అని తెలుసుకుని, ఆ నక్షత్రం శాంతి మంత్రం చదివి, పూజా విధానాన్ని వివరిస్తాడు పద్మనాభయ్య. పుండరి ఆశ్చర్యపోయి, అన్నను కౌగిలించుకు పాదాలకు నమస్కారం చేస్తాడు. కేదార అబ్బురంగా చూస్తాడు. ఎసిటివో గారింట్లో పూజ అద్భుతంగా చేయిస్తాడు పద్మనాభయ్య. ఆయన మెచ్చుకుంటే, అన్నగారి గురించి అందరికీ చెప్పమని అంటాడు పుండరి. వచ్చిన సంభావనను, ఇతర దినుసులను ముగ్గురు పంచుకుంటారు. అన్నని తన బండి మీద ఇంటి దగ్గర దింపుతాడు పుండరి. ఇక చదవండి.]

[dropcap]పో[/dropcap]యొస్తానని బయలుదేరుతుంటే మీనాక్షమ్మ వచ్చి, “భోం చేసి పోదువు గాని, ఉండు నాయనా పుండరి” అనింది.

కొంచేపు ఎనీకాముందులాడి ‘సరే’ అన్నాడు మరిది. అది గ్రయించినట్లు “నీ బార్యకు నేను చెబుతానులే, ఉండమన్నానని” అనింది నవ్వుతూ.

“అదేం లేదులే వదినే! తినకుండా చూపెట్టుకోని ఉంటుందని..” అన్నాడు.

బొమ్మిరెడ్డి పల్లెలో పప్పు, చారు, మజ్జిగ తప్ప, కూరలు ఏవీ దొరికేవి కాదు. ఇక్కడ నవనవలాడే ఆకుకూరలు, కూరగాయలు గంపలతో తెచ్చి వీదులలో అమ్ముతుంటారు. బెంగుళూరు నుంచి వస్తాయట.

సొరకాయ పాలు మిరియాలు వేసి చేసిన కూర, మెంతి కూరపప్పు, పెసరపచ్చడి చేసింది మీనాక్షమ్మ. కట్టు చారు సరే. చిక్కని మజ్జిగతో భోజనము ముగించినారు.

“వదినే, మళ్లీ మా అమ్మను గుర్తు చేసినావమ్మ” అన్నాడు మరిది. చెప్పి వెళ్లిపోయినాడు.

అఖిలమ్మ మొగుని కోసరము ఎదురుచూస్తా ఉంది. “ఇంత లేటయిందేమండి” అని అడిగితే, వదినె బలవంతం చేస్తే అక్కడే భోం చేసి వస్తున్నానని చెప్పినాడు పుండరి.

“మంచిపని చేసినారు. అది కూడ మన యిల్లే కదా!” అనిందా యిల్లాలు. తోడికోడలి మత్సరము ఆ యమ్మలో ఆవగింజైనా లేదు. మామూలుగ యారాండ్లకు (తోడికోడండ్లకు) పొసగదు.

రెండు రోజుల తర్వాత సోమనాధనగరులో ఒక బలిజాయన ఇంట్లో సత్యనారాయణ వ్రతము చేయించినాడు పద్మనాభయ్య. పుండరి వచ్చి వాండ్లింట్లో విడిచిపెట్టి పోయినాడు. ఆ యప్ప పేరు త్రిపురాంతకమయ్య. వాండ్లకు శ్రీకంఠం టాకీసు దగ్గర పెయింటు డబ్బాల అంగడి ఉందంట. కొడుకు పెండ్లి శింగనమలలో చేసుకొని, కోడల్ని దీసుకొచ్చి గృహప్రవేశము చేయించి, వ్రతము చేసుకుంటాన్నాడు.

శానా బాగా వ్రతము చేయించినాడు పద్మనాబయ్య. బిడ్డ అల్లునితో బాటు బలిజాయన దంపతులను, వియ్యంకులను గూడ పూజ చేయడానికి కూచోబెట్టినాడు. వ్రతములో వచ్చే ప్రతి విదానాన్ని అది ఎందుకో చెప్పబట్నాడు. అట్లా యింతవరకు ఏ అయ్యవారు చెప్పల్యా వాండ్లకు.

వ్రతమయినాక, సత్యనారాయణ స్వామి వ్రతకథలను తన మంచి గొంతుతో చదివి, కండ్లకు కట్టినట్టు వివరించినాడు. మామూలుగ అయితే తొందరగా వ్రతం అయిపోగొట్టుకోని, భోజనాలు జెయ్యాలని చూస్తాంటారు. ఎవ్వరూ తోక్కులాడలా.

కొత్త పెండ్లికూతురు పెండ్లికొడుకు తోనే దేవునికి హారతి యిప్పించి, అందర్నీ లేచి నిలబడమని మంత్రపుష్పము సుస్వరముగా చెప్పి మద్యలో బందువులు వ్రతం మింద దృష్టి పెట్టకుండా మాట్లాడుకుంటుంటే, “అమ్మా, నాయనా, దయచేసి నిశ్శబ్దముగా ఉండాల. అప్పుడే మనకు వ్రతం జేసుకున్నపలితం దక్కుతుంది” అని సలీసుగా మందలించినాడు.

ఆకరున దేవునికి “ఛత్రం సమర్పయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికా మవరోహయామి” అని చెప్పి, “ఎవరైనా స్వామి మింద మంచి పాట పాడండి” అనడిగినాడు. అందరూ ఏందబ్బా అని చూస్తాంటే “గీత మాశ్రావయామి – అంటే ఏమనుకున్నారురా నాయినా. పాటలు వినిపించమని సామికి. ఇంకా నృత్యాలు అంటే చక్కని డాన్సులు చేయమని, పల్లకీలో ఊరేగించమనీ కూడ ఉంది వ్రతకల్పములో. అవన్నీ చేయలేము గనక పాటలు పాడండి. ఇంతమంది ముత్తయిదులున్నారు. మంచిపాట ఒక్కరైనా పాడలేరా?” అని అన్నాడు పద్మనాబయ్య.

పెండ్లికొడుకు తరపు బందువొకామె గొంతు సవరిచ్చుకోని, “అయ్యవారూ, నేను పాడతా” అనింది.

“పాడమనే గద తల్లీ అప్పట్నించి అడుగుతుండేది” అన్నాడు. అందరూ నవ్వినారు. “ఆ యమ్మ పాడేటపుడు అందరూ నిశ్శబ్దముగా శ్రద్దగా ఇనల్ల. కానీ అమ్మా, మొదులుపెట్టు మరి” అన్నాడు.

ఆ యమ్మ బానుమతి పాట అందుకున్నాది.

“శరణం నీ దివ్యచరణం, నీ నామమెంతో మధురం శేషాద్రి శిఖరవాసా”

ఆ యమ్మ గొంతు అంత బాగలేదు గాని పాటంతా శృతి తప్పకుండా పాడింది. పద్మనాబయ్య “శానా బాగుందమ్మాపాట!” అని ఆ యమ్మను మెచ్చుకున్నాడు. “నీవు ఎవురి తరపు తల్లి” అని అడిగి తెలుసుకోని “అయితే ఈసారి పెండ్లికూతురు తరపోలు పాడాల” అన్నాడు.

ఒకాయన లేచి, “సామీ, మొగల్ల గుడ్క బాడోచ్చునా” అని అడిగినాడు.

“పాటలు ఆడోల్లే పాడాలని ఏ శాస్త్రమూ చెప్పలేదురా నాయినా, లచ్చినంగా పాడు” అన్నాడు పద్మనాబయ్య.

ఆ యప్ప ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు..’ అనే అన్నమయ్య కీర్తన – శానా బాగా పాడి వినిపించినాడు. గొంతు శానా బాగుంది. “సంగీతము నేర్చుకున్నావా, నాయినా! ఎంత బాగా పాడినావు!” అని ఆ యప్పను గుడ్క మెచ్చుకుంటే, ఆ యప్ప సిగ్గుపడినాడు.

త్రిపురాంతకమయ్య..”సామి, మీరు గుడ్క యాదయినా పాట పాడండి” అని అడిగితే ఆయన నవ్వి, “నాకు పాటలు రావు గాని ఒక శ్లోకం పాడతాను స్వామి మింద, వినండి” అని

‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం..’ అన్న శ్లోకాన్ని ఆయన పాడుతూంటే అందరూ మైమరచి విన్నారు.

“అందరికీ స్వామి ప్రసాదము పంచండి” అని చెప్పి, తానూ తీసుకున్నాడు.

ఏదో మొక్కుబడిగా పూజ చేయించడం గాకుండా, అందర్నీ వ్రతంలో బాగంగా చేసి, పాటలు పాడించి, “ఇట్లా సత్యనారాయణవ్రతము యాడ గుడ్క సూడల్యా” అని అందరూ అనుకునేట్టు చేయించినాడు పద్మనాబయ్య.

బలిజాయన మొదట నూట పదార్లు సంబావన ఇద్దామనుకున్నాడు. ఇట్లాంటి అయ్యవారికి అది సాలదని, ఇన్నూట పదహార్లు ఇచ్చి మొక్కినాడు. వియ్యంకుడు యాభై రూపాయలు దక్షిణ యిచ్చినాడు. ఇంకా కొంతమంది బందువులు ఐదు, పది, ఇరవై, ఇట్లా తోచినంత సామికి మొక్కి ఇచ్చినారు.

కొత్త దంపతులు మొక్కుతాంటే, “దీర్ఘసుమంగళీభవ! సకల సన్మంగళాని భవంతు, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు” అని దీవించి, పెండ్లికూతుర్నిచూసి “అమ్మణి, వచ్చే యాడాది ఈ పాటికి మీ పిల్లోనికే, పిల్లకో నామకరణం చేయించడానికి నన్నే పిలవాల మరి” అంటే కొత్త పెండ్లికూతురు ముకము సిగ్గుతో ఎర్రగయినాది.

పెండ్లికొడుకును జూసి “ఏమిరా నాయినా, గమ్మునున్నావు. పిలుస్తారా లేదా?” అనడిగితే, “మీ దీవెనలుండాల సామా, తప్పకుండా పిలుస్తాము” అన్నాడా పిల్లోడు.

వ్రతానికి పెట్టిన బియ్యము, బ్యాడలు, పండ్లు అన్నీ ఒక అంగోస్త్రములో మూట కట్టినాడు పద్మనాబయ్య. రిక్షా పిలిపించినారు ఆయన కోసరం.

రెండు నెలల్లోనే పుండరి సామి వాండ్లన్నయ్య పద్మనాబయ్య సామి అని వచ్చినాడనీ, శానా గొప్ప పండితుడనీ, బ్రమ్మాండంగా చేయిస్తాడనీ పేరు వచ్చింది టౌనులో.

పుండరితో పని లేకుండా డైరెక్టుగా సామి దగ్గరికి వచ్చి తమ కార్యక్రమాలను చేయించమని అడగబట్నారు జనము. ఉన్నోల్లనే గాకుండా, బీదోండ్ల యిండ్లకు గుడ్క బోయి చేయిస్తాడని, సంబావన ఇంత యియ్యాల్ల అని ఎవర్నీ అడగడని అనుకోబట్నారు.

ఒకసారి రిక్షా తొక్కే రుద్రప్ప వచ్చి, “సామీ! బుక్కరాయసముద్రంలో మా గుడిసె తీసేసి శిన్న మిద్దె కట్టుకుంటిమి. మేము యానాదోల్లము. మా కొత్త యింట్లో నీవు పూజసేయల్ల” అని అడిగితే

“కులానికి పూజలకూ సంబంధము లేదురా తిక్కోడా! లచ్చన౦గా కొత్త యిల్లు కట్టుకుంటిరి. నీకెందుకు నేను చేయిస్తాను కదా” అని చెప్పి, ఆ యప్ప స్తోమతను సబట్టి పూజుకు ఏం గావాల్నో చీటి రాసిచ్చినాడు.

మంచిరోజు చూసి, అన్నీ ముందు రోజే తెచ్చిపెట్టుకోమన్నాడు. తన రిక్షాలోనే సామిని పిల్చక బోయినాడు రుద్రప్ప. బుక్కరాయసముద్రము అనంతపురానికి శానా దగ్గర.

చిన్నయిల్లు. ముందు బోదెగడ్డితో వారపాగు దింపుకున్నారు. పడసాల, వంట, పండుకోవడం అంతా ఒక దగ్గరే. ఎనక దడి కట్టుకోని దొడ్డి మాదిరి పెట్టుకోన్నారు.

ముందే చెప్పడంతో, వాండ్ల కులదైవము నరసింహస్వామి ఫోటో తెచ్చుకున్నారు. సామి పటానికి పూలదండ ఏయించి, రుద్రప్ప దంపతులను కూర్చోబెట్టి పూజ చేయించి, పాలు పొంగించి, పరవాన్నము చేసి నైవేద్యము పెట్టినారు. ‘ప్రసాదము తినడేమో’ అనుకున్నారు గాని భక్తిగా కండ్ల కద్దుకొని తిన్నాడు పద్మనాబయ్య.

“ఇల్లు తూర్పు ముకంగా ఉంది. వాస్తు దోషాలేవీ లేవు. కాబట్టి వాస్తుశాంతి అవసరం లేదు. మీ యింట్లో కుదరదు కాబట్టి ఒక సోమవారం శివాలయములో మీ గోత్రనామాలు చెప్పించుకోని అభిశేకం చేయించుకోండి. సరిపోతుంది. నరసింహస్వామి శానా మహిమ గల దేవుడు. ఆ యప్పను నమ్ముకుని ఉండండి. శుభమస్తు!” అని వాండ్లను దీవించినాడు .

రుద్రప్ప, ఆయన బందువులు పద్మనాబయ్య సామిశా సామంచాడని, ఆయన ముకం చూస్తేనే పాపాలు పోతాయని అందరూ అనుకన్నారు. లక్ష్మీనృసింహ ద్వాదశనామ స్తోత్రము, కరావలంబ స్తోత్రము చదివి ముగించినాడు స్వామి.

సంబావన ఎంత యిస్తే ఏమనుకుంటాడో అని వాండ్లు తొక్కులాడుకుటుంటే “నాయినా, నీకు చాతనయినంత పెట్టు. పెట్టకపోయినా నేనేమో అనుకోను” అన్నాడు. యాభై రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి మొక్కినారు. దాంట్లోంచి పది రూపాయలు తీసి, రుద్రప్ప బిడ్డ, మూడేండ్లది, దాన్ని పిలిచి చేతిలో పెట్టి “బిస్కత్తులు, చాకలెట్లు కొనుక్కోవే” అని చెప్పినాడు. “నీ పీరేందే భడవా?” అని అడిగితే “రామలచ్మి” అని చెప్పిందా పిల్ల ముద్దుగా. మళ్ళా తన రిక్షాలోనే సామిని ఇంటి దగ్గర దించినాడు.

కేదారనాధు ఫైనలియరు పరీక్షలు పూర్తయి రిజల్టు వచ్చింది. ఎనభైఏడు శాతం తెచ్చుకున్నాడు. అమ్మా నాయినా పిల్లాన్ని అక్కున జేర్చుకుని ఆనందపడినారు. ఎమ్మెస్సీలో చేరటానికి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ, మద్రాసు యూనివర్సిటీ; అయిదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలకు దరకాస్తు పెట్టుకొన్నాడు కేదార. ‘న్యూక్లియర్ ఫిజిక్స్’ లో మద్రాసులో సీటు వచ్చింది.

అనుకున్న మాట ప్రకారం రామానుజశెట్టి మిగతా ముపై వేలు పంపించినాడు. ఈ మూడు నెలల్లోనే సుమారు నాలుగు వేలు సంపాయించినాడు పద్మనాబయ్య. చిన్నాయన పుండరి, కేదారతోపాటు మద్రాసుతో బోయి, యూనివర్సిటీలో చేర్పించి వచ్చినాడు. అడ్మిషను, హాస్టలు ఫీజులు, పుస్తకాలు, ఇంకా కావలసిన వస్తువులకు ఐదువేలు అయింది. మిగతాది అక్కడ యూనివర్సిటీ లోనే ఉన్న బ్యాంకులో, కేదార తన పేర అకౌంటు తెరిచి, ఏసున్నాడు.

పుండరి కొడుకుతో చెప్పినాడు – “ఈ రెండేండ్ల చదువుకు ఇది సరిపోకపోయినా, అవసరమైతే పంపిస్తాము. దేనికి కొదవ ల్యాకుండా చదువుకో. మా అన్నయ్యకు వదినెకు మంచి పేరు తీసుకురా రా కేదారూ!”

చిన్నాయన వెళ్లిపోతుంటే పిల్లవానికి దుక్కం వచ్చింది. మద్రాసు నుంచి అనంతపురం రావల్లంటే డైరెక్టు రైలు లేదు. బొంబాయి రైలెక్కి గుత్తిలో దిగి రావలసిందే. అది పెద్ద లైను. అప్పుడు మదాసు – బొంబాయి రైల్లు మూడే. దాదరు ఎక్స్‌ప్రెస్, మెయిలు, జనతా! గుత్తి దిగి బస్సులో రావొచ్చు లేదా  బెంగుళూరు రైలెక్కి అనంతపురంలో దిగచ్చు. అయితే గుంతకల్లుకు రావాల.

పుండరి తిరిగొచ్చి పిల్లవానికి అన్ని సౌకర్యాలు బాగా అమరినాయని చెప్పినాడు. ఇద్దరూ సంతోషించినారు.

పద్మనాభయ్యకు రాను రాను మంచి పేరు రాబట్నాది. ఒకసారి బెంగుళూరు జయనగరులో ఇద్దరన్నదమ్ములు కలిసి పామిడి ఆయన రామలింగారెడ్డి గృహప్రవేశము జరిపించి వచ్చినారు. వాస్తు హోమము శాంతి, నవగ్రహశాంతి, శాస్త్ర సమ్మతముగా చేయించినారు. రామలింగారెడ్డి పెద్ద భూస్వామి. నీలం సంజీవరెడ్డి గారికి దూరపు బంధువు. ఆయన కొడుకు మహీధర రెడ్డి బెంగుళూరులో రియలు ఎస్టేటు యాపారం  జేస్తాడు. ఆ బిల్డింగే యాభై లక్షలయిందంట.

పద్మనాభయ్య విద్వత్తును గుర్తించి వాండ్లు శానా సంతోషించినారు. మూడువేల నూట పదార్లు సంబావన యిచ్చి మొక్కినారు. వాండ్ల బందువులు వస్తుంటే, కారులో అనంతపురానికి పంపినారు. పుండరి తనింట్లో, అన్నయ్య ఇంట్లో ల్యాండ్ లైను ఫోను పెట్టించినాడు. ఇంటికి స్వయముగా రాలేని వాండ్లు ఫోనులో కూడ కార్యక్రమాలను మాట్లాడుకుంటున్నారు.

ఒక రోజు పండరి అన్నయ్య దగ్గరికి వచ్చినాడు సాయంత్రము పూట. మీనాక్షమ్మ మరిదికి వాముకారాలు పెట్టి కాఫీ ఇచ్చింది. ఫోను వచ్చిన తర్వాత కేదార హాస్టలు నుంచి వారానికొకసారి మాట్లాడుతున్నాడు.

పండరి అన్నాడు – “పద్మన్నయ్యా! మనకు దగ్గరే, రాప్తాడని ఒక ఊరున్నాది. బెంగుళూరు హైవే మీద. అక్కడ భాస్కర చౌదరని ఒక మోతుబరి ఉన్నాడు. ఆయన మేనల్లుడు ఎమ్.ఎల్.ఏ. వాండ్లకు పెద్ద నూనెమిల్లున్నాది పెనుగొండకివతల. బుడ్డలు, యాపిత్తనాలు, కుసుమలు, నువ్వులు, అదని ఇదని గాదు, అన్ని రకాల నూనెలూ తయారు చేసి వేరే రాష్ట్రాలకు గూడ ఎగుమతి చేస్తారంట.

ఈ మద్యన పాక్టరీ నష్టాల్లో నడుస్తున్నాదంట. మొన్న ఒక అగ్ని ప్రమాదము గూడ జరిగి గోడవును లోని బుడ్డల సంచులు కాలిపోయినాయంట. దానికి పరిహారంగా ఏదయిన పెద్ద క్రతువు జరిపించల్ల అని ఆ యప్ప ఆలోశన జేస్తుంటే, మనం ఒక తూరి ధర్మవరములో ప్రతాపరెడ్డి గారింట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేయించినాము కదా, ఆ యప్ప మనలను గురించి భాస్కర చౌదరికి చెప్పినాడంట. ముఖ్యముగా నీ గురించి.

వాండ్లు చాలా పెద్దవాండ్లు. రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నోండ్లు. మన దగ్గరికి రారు. సామోండ్లకు వీలయితే ఒకసారి వచ్చి మాట్లాడి పొమ్మని చెప్పినారంట. ఎమ్మెల్లే గారి పి.ఎ. నిన్న రాత్రి నాకు ఫోను జేసి అడిగినాడు. నీతో మాట్లాడినంక ఏ విషయమూ చెబుతానని అన్నాను.”

పద్మనాభయ్య ఆలోచన జేసినాడు. “అగ్నిప్రమాదమా? నష్టాలా?” అని ఆగినాడు. “ఇదేదో శత్రువులు చేయించినదనిపిస్తూంది రా. నిన్న నీకు ఫోను వచ్చిన సమయము చెప్పు.”

“రాత్రి ఎనిమిదింబావు అయి ఉంటుందన్నయ్యా.”

పద్మనాభయ్య మనసులనే ఏదో గణించి, “భాస్కర చౌదరి నామనక్షత్రాన్ని బట్టి రాహుగ్రహ దోషము నడుస్తున్నది. ఈ బాధలన్నీ వాడు (రాహువు) కల్పిస్తున్నవే. దీనికి బ్రహ్మాస్త్రము ‘చండీయాగమే’!” అన్నాడు.

“అమ్మో! చండీయాగమే! నాకు దాని మీద అస్సలు అవగాహన లేదు”

“నాకూ చూచాయగా తెలుసుగాని, ఎప్పుడూ లోతుగా అధ్యయనం చేయలేదు. ఒక పని చేద్దామురా పుండరీ! వెళ్లి మాట్లాడి వద్దాము. పది పన్నెండు రోజులు సమయము తీసుకుందాము. చండీయాగము నిర్వహించడానికి కావలసిన పరిజ్ఞానము సంపాదిద్దాము.”

“సరే అన్నయ్యా! అయితే వస్తామని ఫోన్ చేస్తాను.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here