మరుగునపడ్డ మాణిక్యాలు – 89: జోజో ర్యాబిట్

0
2

[సంచిక పాఠకుల కోసం ‘జోజో ర్యాబిట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]చి[/dropcap]న్నపిల్లల దృక్కోణం చూపించే చిత్రాలలో పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం కాక అమాయకంగా ఏవో ‘తప్పులు’ చేయటం జరుగుతూ ఉంటుంది. అవి తప్పులు కాదు, ఆ పరిస్థితులను సృష్టించటం పెద్దలు చేసిన అసలు తప్పు. పరిస్థితులను పూర్తిగా ఆమోదించి దుష్ట వర్గానికి పిల్లలు మద్దతుగా ఉండే చిత్రాలు చాలా అరుదు. అలాంటి చిత్రమే ‘జోజో ర్యాబిట్’ (2019) అనే వ్యంగ్య చిత్రం. ఇందులో జోజో అనే పదేళ్ళ అబ్బాయి రెండవ ప్రపంచయుద్ధం సమయంలో హిట్లర్‌ని సమర్థిస్తూ ఉంటాడు. కారణం జాతి విద్వేషానికి హిట్లర్ దేశభక్తి ముసుగు తొడగటమే. ఇక్కడ జోజో గొర్రెల మందలా ఆలోచించే జనానికి ప్రతీక. జోజో పిల్లవాడు కాబట్టి సొంతంగా ఆలోచించలేడు. ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రజలు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకూడదని, సొంతంగా ఆలోచించాలని ఈ చిత్రం సందేశం ఇస్తుంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో లభ్యం.

జోజోకి హిట్లర్ అంటే పిచ్చి అభిమానం. హిట్లర్ యువజన సంఘంలో బాలల విభాగంలో సభ్యుడు. 10-13 ఏళ్ళ వయసున్న పిల్లలందరూ అందులో చేరటం తప్పనిసరి. జోజో హిట్లర్ తనకి స్నేహితుడని, తనతో మాట్లాడతాడని ఊహించుకుంటూ ఉంటాడు. యూదులని అసహ్యించుకుంటాడు. అతని తండ్రి యుద్ధంలో పోరాడటానికి ఇటలీ వెళ్ళాడు. అతను ఏమయ్యాడో తెలియడు. చిత్రంలో ఒక సందర్భంలో నాజీల (హిట్లర్ మద్దతుదారులు) లో ఒకడు “మీ నాన్న పిరికిపంద” అంటాడు. అంటే అతను హిట్లర్ తరఫున యుద్ధం చేయటం ఇష్టం లేక పారిపోయి ఉండవచ్చు. జోజో అక్క ఏదో వ్యాధితో మరణించింది. జోజో తల్లి రోజీ అతన్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటుంది. జోజో ఒక వేసవి క్యాంపుకి వెళతాడు. అది మామూలు క్యాంపు కాదు. నాజీలు విద్వేషాన్ని నూరిపోసే క్యాంపు. క్యాంపుకి పంపించకపోతే సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది ప్రభుత్వం. క్యాంపులో పిల్లలందరికీ చాకులు ఇస్తారు. జోజో తన చాకుని అపురూపంగా చూసుకుంటాడు. అతను పైకి మొరటు ఉన్నట్టు ప్రవర్తిస్తాడు కానీ మనసు మెత్తన. క్యాంపులో “చంపటానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి” అని నేర్పిస్తారు. జోజోకి ఒక కుందేలుని ఇచ్చి దాన్ని మెడ విరిచి చంపమంటారు. జోజో ఆ కుందేలుని వదిలేసి పారిపొమ్మంటాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతారు. కుందేలులా భయపడుతున్నాడని అతనికి జోజో ర్యాబిట్’ అని పేరు పెడతారు. ఆ నవ్వే పిల్లలలో చాలా మంది ఇతరులు నవ్వుతున్నారని తాము కూడా నవ్వుతున్నారని వేరే చెప్పక్కరలేదు. ఒక్కోసారి సామాజికమైన ఒత్తిడి ఇలాగే ఉంటుంది. గుంపులో గోవిందా అన్నట్టు ఉంటారు చాలామంది.

జోజో ఊహించుకునే హిట్లర్ తమాషాగా మాట్లాడతాడు. అతన్ని ఉత్సాహపరుస్తాడు. అతనితో ఆడతాడు, పాడతాడు. జోజో “నన్ను ర్యాబిట్ అంటున్నారు” అంటే హిట్లర్ “నన్ను కూడా ఎన్నో మాటలన్నారు. పిచ్చివాడన్నారు. సైకో అన్నారు. కుందేలు నిజానికి ఎంతో కష్టపడుతుంది” అంటాడు. జోజోకి ఆవేశం వస్తుంది. పరుగున వెళ్ళి క్యాంపులో చేతి గ్రెనేడ్లు ఎలా వేయాలో చూపిస్తుంటే ఒక గ్రెనేడ్ తీసుకుని విసురుతాడు. హిట్లర్ కూడా అతనితో పాటు పరుగెత్తి వస్తాడు. గ్రెనేడ్ చెట్టుకి తగిలి వచ్చి జోజో కాళ్ళ దగ్గర పడి పేలుతుంది. జోజో గాయపడతాడు. గ్రెనేడ్ పేలే ముందు హిట్లర్ ఏం జరగబోతోందో ఊహించి అక్కడి నుంచి తప్పుకుంటాడు. ఈ హిట్లర్ జోజో ఊహించుకునే హిట్లరే కాదు, అసలు హిట్లర్‌ని వ్యంగ్యంగా మన ముందు నిలబెట్టే క్యారికేచర్. జోజోని ఆసుపత్రిలో పెడతారు. జోజోకి కారుతున్న రక్తాన్ని చూసి హిట్లర్ కళ్ళు తిరిగి పడిపోతాడు!

తండ్రి లేకపోవటంతో జోజో మీద హిట్లర్ ప్రభావం ఎక్కువ పడిందన్నది కాదనలేని విషయం. అప్పట్లో మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్లారు. యుద్ధం కుటుంబాలని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. కుటుంబం లోని పిల్లలు బయటి ప్రభావాలకు లోనయ్యారు. జోజో గాయాలపాలు కూడా అయ్యాడు. జోజోకి ముఖం మీద కుట్లు పడతాయి. కాలు గాయపడటంతో కుంటుతూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఇంటికి వస్తాడు. పూర్తిగా కోలుకోకపోవటంతో స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. తన ముఖం గాయాల మచ్చలతో అసహ్యంగా ఉందని బాధపడుతూ ఉంటాడు. రోజీ అతన్ని ఉత్సాహపరిచి అతన్ని బయటికి తీసుకెళుతుంది. అంతా నాజీల మయం. జోజో హిట్లర్‌కి మద్దతుగా గోడపత్రాలు అంటించే పని చేయటం మొదలుపెడతాడు. ఒకచోట కొంతమందిని బహిరంగంగా ఉరి తీసి ఆ శవాలని అలాగే వదిలేస్తారు నాజీలు. జోజో రోజీని “వాళ్ళేం చేశారు?” అని అడుగుతాడు. “చేయగలిగినంతా చేశారు” అంటుందామె. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడారని, అందుకు వారిని చంపేశారని ఆమె భావం. ఒకరోజు జోజో ఇంటికి తిరిగి వచ్చేసరికి రోజీ ఇంట్లో ఉండదు. అతను తన అక్క గదిలోకి వెళతాడు. అక్కడ చెక్క గోడలో పగులు కనపడటంతో అతను చాకుతో ఆ చెక్కని తొలగించి చూస్తాడు. లోపలికి వెళ్ళే చోటు ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. జోజో అక్క వయసే ఆమెది. ఆమె అక్కడ దాక్కుందంటే ఆమె యూదు అయి ఉంటుందని అతను ఊహిస్తాడు. యూదులను నాజీలు ఊచకోత కోశారు. యూదులకు పారిపోవటమో, దాక్కోవటమో తప్ప వేరే దారి లేదు. ఆ అమ్మాయి పేరు ఎల్సా. జోజో చాకు లాక్కుని “నా గురించి ఎవరికైనా చెబితే నువ్వూ, మీ అమ్మా నాకు సాయం చేశారని చెబుతాను. అందరం చస్తాం. మీ అమ్మకి నా గురించి చెబితే నీ పీక కోస్తాను” అని బెదిరిస్తుంది. జోజో భయంతో వణికిపోతాడు. భయానికి రెండు కారణాలు – ఒకటి తన మీద జరిగిన దాడి, రెండవది యూదులంటే దుష్టులనే అపోహ.

జోజో తన గదిలోకి వెళ్ళి ఊహా హిట్లర్‌తో మాట్లాడతాడు. “మీ ఇంట్లో అన్ని గోడల్లోనూ వీళ్ళు ఉన్నారేమో. ఎంత చురుగ్గా ఉందో చూశావా? నీ చాకు కూడా లాక్కుంది” అంటాడు హిట్లర్. యూదులంటే హిట్లర్‌కి అసహ్యం కాదని, వారి తెలివి అంటే అసూయ అనే సూచన ఉందిక్కడ. ఏం చేయాలి అని ఇద్దరూ ఆలోచిస్తారు. “ఇల్లు తగలబెట్టి చర్చిల్ మీదకి తోసేద్దాం” అంటాడు హిట్లర్. సొంత వాళ్ళని చంపేసి ప్రత్యర్థులని నిందించటమన్నమాట. జోజో “ఆమెతో సంప్రదింపులు చేద్దాం” అంటాడు. చిన్నపిల్లవాడికి ఉన్న బుద్ధి కూడా హిట్లర్‌కి లేదని వ్యంగ్యం. సరే అంటాడు హిట్లర్. మాట్లాడటానికి వెళ్ళిన జోజోని బెదిరించి పంపేస్తుంది ఎల్సా. హిట్లర్ “ఇలాంటి వ్యూహాలు వేసేవారి మీద మనం కూడా వ్యూహాలు వేయాలి. నా మీద బాంబు వేసిన వారిని నేను ఎలా బోల్తా కొట్టించానో తెలుసా? చచ్చిపోయినట్టు నటించి అందర్నీ కలుగు నుంచి బయటికి వచ్చేలా చేశాను. ఇదే వ్యతిరేక వ్యూహం. ఈమెకి భయమేమీ లేదనే భావన కలిగించి పట్టు సాధించు” అంటాడు. జోజో ఉత్సాహంగా “రివర్స్ సైకాలజీ!” అంటాడు. అతను కొత్త సూచన చేస్తున్నాడనుకుని హిట్లర్ “సమస్యని జటిలం చేయకు. నేను చెప్పినట్టు వ్యతిరేక వ్యూహం వాడు. అంతే” అంటాడు హిట్లర్. నిజానికి ఇలాంటి వ్యతిరేక వ్యూహాన్నే రివర్స్ సైకాలజీ అంటారు. అది కూడా తెలియనంత మూర్ఖుడు హిట్లర్ అని మరో వ్యంగ్యాస్త్రం.

ఆరోజు రాత్రి రోజీ ఇంటికొచ్చాక తనకి పైనుంచి ఏదో అలికిడి వినపడిందని, అక్క ఆత్మ ఏమో అని అంటాడు జోజో. ఎల్సా తన గురించి చెప్పొద్దని బెదిరించింది కదా. ఎలుకలేమో అని జోజోని సముదాయిస్తుంది రోజీ. నిజానికి ఎల్సాని దాచిపెట్టింది రోజీయే. జోజోని పడుకోబెట్టి రోజీ ఎల్సా దగ్గరకి వెళుతుంది. “వాడికి అలికిడి వినపడింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడికి ప్రమాదం వస్తే నేను ఇంకేమీ ఆలోచించను” అంటుంది. తన పరిస్థితికి ఎల్సాకి ఏడుపొస్తుంది. “నువ్వు బతకకూడదని వారి ప్రయత్నం. వారు ఓడిపోవాలంటే నువ్వు బతకాలి. ఎక్కడైనా ఒక్క యూదు బతికి ఉన్నా వారు ఓడిపోయినట్టే. నిన్న నువ్వు దొరకలేదు. నేడు దొరకలేదు. రేపు దొరక్కుండా ఉండాలి అంతే” అంటుంది రోజీ. జీవితాన్ని ఏరోజుకారోజు జీవించాలి. జోజోకి తెలుసని రోజీకి తెలిస్తే ఆమె ఎల్సాని ఉండనివ్వదు. ఎందుకంటే జోజో నాజీలకి చెప్పేస్తాడని ఆమె నమ్మకం. అందుకే ఎల్సా మౌనంగా ఉంటుంది. రోజీ ఎల్సాతో మాట్లాడటం జోజో వింటాడు. తల్లి ఆమెని కాపాడి తప్పు చేస్తోందని ఉక్రోషంగా ఉంటాడు. మర్నాడు కెప్టెన్ కె అనే నాజీని యూదుల గురించి అడుగుతాడు. కెప్టెన్ కె మృదుస్వభావి. అతను అయిష్టంగా పని చేస్తున్నాడని తెలిసిపోతూనే ఉంటుంది. “వాళ్ళని గుర్తు పట్టటం కష్టంగా ఉంది. వాళ్ళ గురించి ఎవరైనా ఒక పుస్తకం రాస్తే బావుంటుంది” అంటాడు కెప్టెన్ కె. జోజో ఎల్సాని అడిగి యూదుల గురించి సమాచారం సేకరించి పుస్తకం రాయాలని నిర్ణయించుకుంటాడు.

జోజో ఎల్సా దగ్గరకి వెళ్ళి “యూదు జాతి గురించి అంతా చెబితే నిన్నిక్కడ ఉండనిస్తాను” అంటాడు. యూదులని అవమానిస్తూ మాట్లాడతాడు. తాను ఉత్తమ జాతికి చెందినవాడినని అంటాడు. ఎల్సా అతన్ని గట్టిగా పట్టుకుని నోరు మూసేసి “బలముంటే విడిపించుకో” అంటుంది. అతను విడిపించుకోలేకపోతాడు. “ఉత్తమ జాతి అట” అని ఆమె ఈసడించుకుంటుంది. అతనికి ఉక్రోషం ఇంకా పెరుగుతుంది. ఇది చాలదన్నట్టు ఆరోజు రాత్రి రోజీ “మిత్రదేశాలన్నీ కలిసి ఇటలీని స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఫ్రాన్సే తరువాయి. యుద్ధం ముగియబోతోంది” అంటుంది ఆనందంగా. జోజో తన ఉక్రోషమంతా తల్లి మీద చూపిస్తాడు. “నీకు నీ దేశమంటే ద్వేషమెందుకు?” అంటాడు. “నా దేశాన్ని ప్రేమిస్తాను. ప్రయోజనం లేని యుద్ధాన్ని ద్వేషిస్తాను” అంటుందామె. “శత్రువుల్ని మట్టి కరిపిస్తాం. చూస్తూ ఉండు” అంటాడతను. ఆమె గొడవ పెరగకుండా తెంపు చేస్తుంది. అతని ఉక్రోషం తీరదు. తన గాయాలు తలచుకుని బాధపడతాడు. “నాన్న ఉంటే నన్ను అర్థం చేసుకునేవాడు. కర్మ కొద్దీ నీ పాలబడ్డాను” అంటాడు. చిన్న పిల్లల మనస్తత్వం ఇక్కడ బయటపడుతుంది. చాలామంది పెద్దవాళ్ళలో కూడా ఈ పిల్ల చేష్టలు పోవు. రోజీ పరిపక్వత కలది. తన భర్తలా నటిస్తూ గొంతు మార్చి జోజోతో మాట్లాడుతుంది. “మీ అమ్మతో అలా మాట్లాడకు. నేను లేనప్పుడు అమ్మని నువ్వే చూసుకోవాలి” అంటుంది. సరే అంటాడు జోజో. పిల్లలను సముదాయించటం ఒక కళ. కానీ రాజకీయ పరిస్థితులు బాగా లేకపోతే తలిదండ్రులు ఎంత చేసినా లాభం ఉండదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. జోజో తండ్రి కూడా హిట్లర్‌కి వ్యతిరేకమే. కానీ తండ్రి ఉంటే తన లాగా హిట్లర్‌కి మద్దతుగా మాట్లాడేవాడని జోజో అనుకుంటాడు. జోజోకి దేశభక్తికి, యుద్ధోన్మాదానికి తేడా తెలియదు. ఇది రోజీకి బాధ కలిగించే విషయమే. ఆమె ఆ బాధని దిగమింగుతుంది. జోజో వయసు పెరిగేకొద్దీ మారతాడని ఆశ పడుతుంది. “మనిషికి చివరికి మిగిలేది ఆశే” అంటుంది ఒకసారి ఎల్సాతో.

జోజో గా రోమన్ గ్రిఫిన్ డేవిస్ నటన అత్యద్భుతంగా ఉంటుంది. చిలిపితనం, మొండితనం కలిసిన పాత్రలో ఒదిగిపోయాడు. రోజీగా స్కార్లెట్ జోహాన్సన్, ఎల్సా గా తొమాసిన్ మెకెంజీ నటించారు. ఊహా హిట్లర్ గా రచయిత, దర్శకుడు తైకా వైతీతీ తానే నటించాడు. వ్యంగ్యాన్ని అద్భుతంగా పండించాడు. గంభీరమైన విషయాన్ని హాస్యం జోడించి చెప్పటం చాలా కష్టం. అదే తైకా సాధించిన విజయం. అందుకే స్క్రీన్ ప్లే కి ఆస్కార్ అవార్డు వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

నెమ్మదిగా జోజో ఎల్సాతో పరిచయం పెంచుకుంటాడు. యూదుల గురించి చెప్పమంటాడు. పిల్లవాడే కదా అని ఆమె తమాషాగా యూదుల గురించి కట్టుకథలు కూడా చెబుతుంది. అతను తన పుస్తకంలో రాసుకుంటాడు. బొమ్మలు వేస్తాడు. ఎల్సా తాను నేథన్ అనే అబ్బాయిని పెళ్ళి చేసుకోబోతున్నానని, అతను యూదులకి మద్దతుగా పోరాడుతున్నాడని చెబుతుంది. అతనికి రిల్క అనే కవి అంటే ఇష్టమని అంటుంది. అతను తనని విడిపించి ప్యారిస్ తీసుకుపోతాడని అంటుంది. “జర్మనీ వదిలేస్తావా?” అంటాడు జోజో. “ముందు జర్మనీయే నన్ను వదిలేసింది” అంటుంది ఎల్సా. “మా దేశానికి మీ అవసరం లేదు. నువ్వూ, నీ బాయ్ ఫ్రెండూ కలిసి చీజు, నత్తలు తినే ప్యారిస్‌కి పొండి” అంటాడు జోజో. తర్వాత గ్రంథాలయానికి వెళ్ళి రిల్క రాసిన కవితలు కొన్ని చదువుతాడు. ఎల్సాని ఏడిపించాలని నేథన్ రాసినట్టు ఒక ఉత్తరం రాసి పట్టుకొస్తాడు. “నిన్ను పెళ్ళి చేసుకోవటం నాకిష్టం లేదు. నాకింకో అమ్మాయి దొరికింది. ఎంతో సరదాగా ఉంటుంది. నాకిష్టమైన కవి రిల్క చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించినవారిని స్వేచ్ఛగా వదిలేయటమే. నిన్ను వదిలేస్తున్నందుకు చింతిస్తున్నాను. గుడ్ బై” అని ఉత్తరం చదువుతాడు జోజో. ఎల్సా అది విని తాను దాక్కున్న చోటికి వెళ్ళి ఏడుస్తుంది. జోజోకి అపరాధభావం కలుగుతుంది. ఇంకో ఉత్తరం రాసుకొచ్చి “నిన్ను వదిలేయట్లేదు. నా గురించి నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. నా గురించి ఇంతకు ముందు ఒకరిద్దరు అమ్మాయిలు ప్రాణాలు తీసుకున్నారు. అప్పుడు చాలా నలిగిపోయాను. నువ్వు మాత్రం బతికే ఉండు. నిన్ను ఆ పిల్లవాడు బాగా చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. వాడు ఘటికుడు. మనిద్దరం ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి చేసుకుందాంలే. నీ నేథన్” అని చదువుతాడు. చిన్నపిల్లల మనస్తత్వం ఈ ఉత్తరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జోజో అమాయకత్వానికి, మంచితనానికి ఎల్సా కరిగిపోతుంది. పిల్లలు స్వతహాగా మంచివారు. వారి మనసులు కలుషితం చేయాలని ప్రయత్నించినా ఆ మంచితనం మబ్బుల మధ్యలో నుంచి చంద్రుడిలా వెన్నెల కురిపిస్తూనే ఉంటుంది. ఆ మంచితనాన్ని కాపాడటం పెద్దవాళ్ళ పని. ఇప్పుడు అదే కరువైంది.

మరోపక్క రోజీ జోజోని బయటకి తీసుకెళ్ళి అతన్ని ఆహ్లాదంగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. కానీ అతనికి నాజీలు చేసే ప్రచారం బాగా ఎక్కేసింది. రోజీ ప్రేమ గురించి మాటాడితే “ప్రేమకి సమయం లేదు. ఇది యుద్ధసమయం” అంటాడు. “యుద్ధంలో ఓటమి అంచున ఉన్నాం. ఓడిపోతే ఏం చేస్తావు? జీవితాన్ని ఆస్వాదించాలి. ఆనందంగా నాట్యం చెయ్యాలి. దేవుడికి కృతఙత తెలుపుకోవాలి” అంటుందామె. “నాట్యం పనిలేని వాళ్ళు చేసే పని” అంటాడు జోజో. “కాదు. స్వేచ్ఛగా ఉండేవాళ్ళు చేసే పని” అంటుందామె. ఇక్కడ జోజోని ఒక పదేళ్ళ వాడిగా కాక సామాన్య ప్రజానీకానికి ప్రతీకగా తీసుకోవాలి. యుద్ధం చేసి ఆధిపత్యం సాధించాలని చెప్పేవారిని గుడ్డిగా అనుసరించే వారికి కొదవ లేదు. అలా కాక తాము బతుకుతూ, ఇతరులను బతకనిస్తే యుద్ధం అవసరమే ఉండదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఉన్నచోట ప్రజలు తీర్పు చెబుతారు, యుద్ధం చేయాలో వద్దో. నియంతలని మాత్రం ఎవరూ ఆపలేరు. అదే దౌర్భాగ్యం.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఒకరోజు జోజో రోజీ రహస్య సందేశాలు చేరవేయటం చూస్తాడు. అంటే ఆమె హిట్లర్‌కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు, పని చేస్తోంది! జోజోకి అంతా అయోమయంగా ఉంటుంది. అతను ఎల్సాని ప్రేమించటం మొదలుపెడతాడు. పదేళ్ళ వయసులో పుట్టే అమాయకపు ప్రేమ అది. హఠాత్తుగా అతని ఇల్లు సోదా చేయటానికి కొందరు నాజీలు వస్తారు. రోజీ ఇంట్లో ఉండదు. కెప్టెన్ కె కూడా అప్పుడే వస్తాడు. దాక్కున్న ఎల్సా బయటకి వస్తుంది. “నేను జోజో అక్కని” అని చెబుతుంది. “హిట్లర్ జిందాబాద్” అని కూడా అంటుంది. జోజో బిక్కచచ్చిపోతాడు. నాజీ అధికారి అనుమానంతో ఎల్సాని పత్రాలు చూపించమని అడుగుతాడు. ఆమె జోజో అక్కకి చెందిన గుర్తింపు పత్రం తెస్తుంది. కెప్టెన్ కె తెలివిగా నాజీ అధికారి కంటే ముందే ఆ పత్రం అందుకుంటాడు. అందులో ఉన్న ఫోటోకి, ఎల్సాకి పోలిక ఉండదు. “పుట్టిన తేదీ చెప్పు” అంటాడు కెప్టెన్ కె. ఆమె “మే 1, 1929” అంటుంది. “కరెక్ట్” అంటాడు కెప్టెన్ కె. నాజీ అధికారి ఆ విషయం వదిలేసి జోజో యూదుల మీద రాసుకున్న పుస్తకం తెరిచి చూస్తాడు. ఆ పుస్తకం తానే రాశానంటుంది ఎల్సా. అందులో యూదుల మీద వ్యంగ్యమైన బొమ్మలు ఉంటాయి. అదే కాక నేథన్‌ని రకరకాల చిత్రహింసలు పెట్టే బొమ్మలు కూడా ఉంటాయి. ఎల్సా మీద ప్రేమతో పాటు జోజో నేథన్ మీద ద్వేషం పెంచుకున్నాడన్నమాట. ఆ బొమ్మలు చూసి నాజీలు నవ్వుకుంటారు. అందరూ వెళ్ళిపోయాక ఎల్సా గుర్తింపు పత్రం చూస్తే పుట్టిన తేదీ మే 7 అని ఉంటుంది. కంగారులో ఆమె మే 1 అనుకుంది. కెప్టెన్ కె ఎందుకు తనని కాపాడాడో అర్థం కాదు. తన పని అయిపోయినట్టే అనుకుంటుంది. జోజో నేథన్ గురించి వేసిన బొమ్మలు కూడా ఆమెని కలత పెడతాయి. ఎల్సాని పట్టివ్వకపోవటంతో ఊహా హిట్లర్ జోజో మీద కోపంగా ఉంటాడు. “ఆమె మంచి అమ్మాయిలాగే ఉంది” అంటాడు జోజో. యూదులంటే దుష్టులని నాజీలు చెప్పినా ఆమె అలా లేకపోవటంతో అతను మెత్తబడతాడు. కొందరు విద్వేషకారులు కొన్ని జాతుల మీద విషప్రచారం చేస్తారు. ఏ జాతిలో అయినా మంచివారూ ఉంటారు, చెడ్డవారూ ఉంటారు. కొందరు చేసిన దానికి జాతినంతా ద్వేషించటం మూర్ఖత్వం. ఎవరికి వారు సొంతంగా ఆలోచించాలి. అదే ఈ చిత్రం సందేశం.

హిట్లర్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు రోజీని నాజీలు ఉరి తీస్తారు. జోజోకి ఒక వీధిలో ఆమె శవం వేలాడుతూ కనపడుతుంది. అతను హతాశుడవుతాడు. ఎల్సా అతన్ని సముదాయించి “మీ నాన్న కూడా హిట్లర్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. యుధ్ధం ముగియగానే వస్తాడని మీ అమ్మ చెప్పేది” అంటుంది. “నాకిప్పుడు ఎవరూ లేరు” అంటాడు జోజో. “మా అమ్మానాన్నల్ని రైల్లో ఎక్కడికో తీసుకుపోయారు. నేను తప్పించుకున్నాను. అక్కడా ఇక్కడా తలదాచుకున్నాను. చివరికి మీ అమ్మ నన్ను కాపాడింది. నేను బతికే ఉన్నానుగా. కానీ మా అమ్మా నాన్నా తిరిగి రారు” అంటుంది ఎల్సా. ఇలా ఎంత మంది సొంతవారిని పోగొట్టుకుని క్షోభపడ్డారో! “నీకు స్వేచ్ఛ వస్తే ముందు ఏం చేస్తావు?” అంటాడు జోజో. “నాట్యం చేస్తాను” అంటుంది ఎల్సా. చివరికి జర్మనీ యుద్ధంలో ఓడిపోతుంది. అమెరికా సైన్యం జర్మనీని ఆక్రమించుకుంటుంది. హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది తెలిసి జోజో ఆశ్చర్యపోతాడు. జోజో వీధిలో నాజీ దుస్తులు వేసుకుని తిరుగుతూ ఉండటంతో అమెరికా సైనికుడు అతన్ని మిగతా నాజీలతో బంధిస్తాడు. అక్కడ కెప్టెన్ కె ఉంటాడు. అతను జోజో ఒంటి మీద ఉన్న నాజీ కోటు విప్పేసి “వీడొక యూదు” అని గట్టిగా అరిచి జోజోని తోసేస్తాడు. అలాగైతేనే జోజో బయటపడతాడని అతనికి తెలుసు. మరో సైనికుడు వచ్చి కెప్టెన్ కె ని కొట్టి జోజోని వెళ్ళిపొమ్మంటాడు. జోజో ఇంటికి వస్తాడు.

ఎల్సాకి బయట ఏం జరుగుతుందో తెలియదు. “ఎవరు గెలిచారు?” అని అడుగుతుంది. జోజో ఆమెని వదులుకోవటం ఇష్టం లేక “జర్మనీ గెలిచింది” అంటాడు. అక్క లేదు, తల్లి లేదు. తండ్రి వస్తాడో లేదో తెలియదు. ఎల్సాయే అతనికి తోడు. “నేథన్, నేను నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాం” అంటాడు. “నేథన్ పోయిన ఏడాది క్షయ వ్యాధితో చనిపోయాడు” అంటుంది ఎల్సా. ఆమె ఇన్నాళ్ళూ అతని బతికి ఉన్నాడని చెప్పి ఆ ఊహలోనే సాంత్వన పొందింది. మనిషి మనస్తత్వం ఎంత విచిత్రమో చెప్పలేం. అంతులేని విషాదాన్ని మరచిపోవటానికి కట్టుకథలు అల్లుకుని అందులోనే సంతోషం వెతుక్కుంటాడు. “నిన్ను నేను రక్షిస్తాను. పారిపోదాం పద” అంటాడు జోజో. ఇద్దరూ బయటకి వస్తారు. బయట అమెరికా సైన్యం జెండాలతో విజయోత్సాహం చేసుకుంటూ జీపుల్లో తిరుగుతూ ఉంటుంది. అది చూసి ఎల్సాకి జర్మనీ ఓడిపోయిందని నిజం తెలుస్తుంది. అబద్ధం చెప్పినందుకు జోజోని చెంపదెబ్బ కొడుతుంది. జోజో “నాకు అవ్వాల్సిందే” అంటాడు. తనకి స్వేచ్ఛ లభించిందని తెలిసి ఎల్సా నాట్యం మొదలు పెడుతుంది. జోజో కూడా ఆమెతో పాటు నాట్యం చేస్తాడు.

చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఒక్కోసారి ఆలస్యం అవ్వొచ్చు. ఎంత ఆలస్యం అయినా మంచి వైపే ఉండాలి కానీ చెడు వైపు వెళ్ళకూడదు. నా వాడని, నా దేశమని చెడుని సమర్ధించకూడదు. విచక్షణ ఉపయోగించాలి. ధర్మం కోసం పోరాడుతూ ప్రాణం వదిలినా మంచిదే. రోజీ పాత్ర ద్వారా అదే చెప్పారు ఈ చిత్రంలో. ఆమె త్యాగం వల్ల జోజోకి ఎల్సా తోడు దొరికింది. లేకపోతే జోజో ఒంటరిగా మిగిలిపోయేవాడు. చేసిన పుణ్యం ఎక్కడికీ పోదు. అలాగే పాపం కూడా! హిట్లర్ అంతమే దీనికి పెద్ద ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here